
కలిదిండి, సానారుద్రవరం గ్రామాల్లో విగ్రహాలకు పేడపూసిన దుండగులు
క్షీరాభిషేకం చేసి శుద్ధి చేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు
కవ్వింపు చర్యలకు దిగిన కూటమి కార్యకర్తలు
నిందితుల్ని తక్షణం అరెస్టు చేయకపోతే ఆమరణ దీక్ష చేస్తానన్న డీఎన్నార్
కైకలూరు/కలిదిండి: ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి, సానారుద్రవరం గ్రామాల్లో దివంగత ఎమ్మెల్యే, కాపు నేత వంగవీటి మోహనరంగా విగ్రహాలకు అవమానం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి మాస్‌్కలు ధరించిన ఇద్దరు దుండగులు కలిదిండి, సానారుద్రవరం గ్రామాల్లో రంగా విగ్రహాలకు పేడపూసి అవమానించారు. పోలీసులు సేకరించిన సీసీ టీవీ ఫుటేజీలలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. కలిదిండి మూడు కూడళ్ల సెంటర్‌లో రంగా విగ్రహం వద్ద శుక్రవారం సినీ నటుడు చిరంజీవి పుట్టిన రోజు వేడుక నిర్వహించారు.
శనివారం ఉదయం రెండు ప్రాంతాల్లో విగ్రహాలకు పేడ ఉండటాన్ని గమనించిన రంగా అభిమానులు కోపంతో రగిలిపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. నిందితుల్ని గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజీలను సేకరించి.. నిందితుల్ని గుర్తించేందుకు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో దర్యాప్తు చేపట్టారు.
పథకం ప్రకారమే..
ముదినేపల్లి మండలం ఈడేపల్లిలో రెండు, కైకలూరు మండలం ఆలపాడులో ఒకచోట స్థాపించిన రంగా విగ్రహాలను ఆయన తనయుడు వంగవీటి రాధా ఆదివారం ఆవిష్కరించనున్నారు. కలిదిండి, సానారుద్రవరం గ్రామాల మీదుగానే ఆయన వెళ్లాల్సి ఉంది. అందుకే దుండగులు ఈ మార్గాన్ని ఎన్నుకున్నట్టు తెలుస్తోంది.
సీసీ టీవీ ఫుటేజీల్లో ఈ దుశ్చర్యకు పాల్పడిన ఇద్దరూ 18 ఏళ్లలోపు వారిగా కనిపిస్తున్నారు. మాస్క్ పెట్టుకుని ఒక యువకుడు విగ్రహానికి పేడ పూయగా, తర్వాత మరో యువకుడు బైక్‌పై రావడంతో అతనితో కలిసి పరారయ్యాడు. రాధా రానుండటంతో పక్కా పథకం ప్రకారమే విగ్రహాలకు పేడ పూసినట్టు స్థానికులు భావిస్తున్నారు.
విగ్రహాలను శుద్ధి చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
దుండగుల దుశ్చర్యను తెలుసుకుని శనివారం రంగా విగ్రహాలను శుద్ధి చేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) శనివారం కలిదిండిలోని రంగా విగ్రహం వద్దకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో వచ్చారు. రంగా విగ్రహానికి క్షీరాభిషేకం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో కూటమి పార్టీకి చెందిన వ్యక్తులు డీజే వ్యాన్‌ను పెద్ద శబ్దంతో విగ్రహం వైపు తిప్పారు.
అక్కడితో ఆగకుండా కూటమి కార్యకర్తలు బైక్‌లపై నినాదాలు చేస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో డీఎన్నార్ సీఐ రవికుమార్‌కు ఫిర్యాదుచేశారు. కూటమి కార్యకర్తల కవ్వింపు చర్యలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ.. నాలుగు రోజుల్లోగా దోషులను గుర్తించాలని, లేదంటే 3వేల మంది కార్యకర్తలతో కలిదిండిలో నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.
ఎమ్మెల్యేను చుట్టుముట్టిన జనం
విగ్రహాలను అవమానించిన విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఘటనా స్థలాలను శనివారం పరిశీలించారు. దీంతో.. స్థానికులు ఆయనను చుట్టుముట్టారు. నిందితులను తక్షణమే పట్టుకోవాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే కామినేని ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
ఆంధ్రా–తెలంగాణ రాధా, రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సీఎం చంద్రబాబు కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. ఈ ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారని, దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసు కోవాలని అధికారులను ఆదేశించారని పేర్కొంది.
దుండగుల సమాచారమిస్తే బహుమతి
రంగా విగ్రహాలకు పేడ పూసిన దుండగుల సమాచారం చెబితే బహుమతి అందిస్తామని ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ శనివారం ప్రకటించారు. కలిదిండి పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికే దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని చెప్పారు.