
సాక్షి, పశ్చిమ గోదావరి: ఏపీలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ గూండాల దాడులు తారాస్థాయికి చేరాయన్నారు. అబ్బయ్య చౌదరిని చంపాలని చూస్తున్నారు. ఇప్పటికే అబ్బయ్య చౌదరి ఆస్తులను ధ్వంసం చేశారు. దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. చింతమనేని ఉడత ఊపులకు భయపడేది లేదు. అబ్బయ్యచౌదరివ వెంట జగన్, పార్టీ మొత్తం ఉంది’’ అని పేర్ని నాని అన్నారు.

దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొండలరావుపాలెంలో అబ్బయ్య చౌదరి పొలంలో చింతమనేని ప్రభాకర్ అనుచరుల దౌర్జన్యకాండను వైఎస్సార్‌సీపీ నేతలు ఖండించారు. కొఠారు అబ్బయ్య చౌదరిని ఆయన నివాసంలో వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల బృందం పరామర్శించింది. మాజీ మంత్రులు పేర్ని నాని, సాకే శైలజానాథ్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కవురు శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, బొమ్మి ఇజ్రాయిల్, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి తదితరులు.. పచ్చ మూకలు ధ్వంసం చేసిన పొలాలను పరిశీలించారు.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే.. అన్నీ లెక్కలు సరిచేస్తాం: సాకే శైలజానాథ్
సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేస్తూ.. భయాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నారంటూ టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త మీ దౌర్జన్యాన్ని ఎదుర్కొంటారు. రాయలసీమ వాసులుగా దెందులూరులో జరిగిన ఘటనలు చూస్తుంటే భయమేస్తుంది. ఆర్థిక మూలాలు దెబ్బతీసి.. బలహీనపరచాలని చూస్తున్నారు. వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ను భయపెట్టి రేపు అడ్డం లేకుండా చూసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే చింతమనేనికి అది భ్రమ మాత్రమే.. పచ్చని చెట్లను నరికి వేయడం దారుణం. పోలీసులు స్వామి భక్తితో పని చేస్తున్నారు. రక్తం వచ్చేలాగా టీడీపీ వాళ్ళు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. డీఎస్పీనే టీడీపీ మూకలు తోసేస్తుంటే ఏం చేస్తున్నారు?. ప్రతి వాటిని గుర్తు పెట్టుకుంటాం?. టీడీపీ నేతలు.. వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లకు వచ్చి వీరంగం సృష్టించడం దారుణం. ఇప్పటికైనా పోలీసులకు సోయి ఉండాలి. ఎమ్మెల్యే మీకు జీతాలు ఇవ్వడు. రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే.. అన్ని లెక్కలు సరిచేస్తాం..

దెందులూరులో పోలీసుల సాయం ధృతరాష్ట్ర కౌగిలి. నిలబడి సమాధానం చెప్పే రోజు వస్తుంది.. డేట్ నోట్ చేసుకోండి. అరాచకాలు చేసే వాళ్లని కేసులు పెట్టి లోపల వేయాల్సింది పోయి మా వాళ్లపై కేసులు పెడుతున్నారు. పోలీసుల ప్రభుత్వ అధికారులను గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏ వైఎస్సార్‌సీపీ నాయకుడు ఒంటరి కాదు. బాడుగకు తెచ్చిన వారితో కార్యక్రమాలు చేస్తే మంచి పద్ధతి కాదు. జాగ్రత్తగా ఉండండి. మంచికి మంచి.. చెడుకు చెడు లెక్కలు సరిచేసే కాలం ఉంటుంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక లెక్కలు సరిచేస్తాం’’ అని సాకే శైలజానాథ్‌రెడ్డి హెచ్చరించారు.