
సాక్షి, తాడేపల్లి: ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు, శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నానిపై టీడీపీ గూండాల దాడి ఘటనను వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నానితో ఆయన ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. నాని ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.
తనపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు, టీడీపీ గూండాలు ఎలా దాడిచేశారనేది కామిరెడ్డి నాని.. వైఎస్ జగన్‌కు వివరించారు. తనపై దాడి తర్వాత చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళితే అక్కడకు కూడా వచ్చి దాడి చేశారని నాని చెప్పారు. ప్రశాంతమైన దెందులూరు నియోజకవర్గంలో ఈ తరహా దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో వైఎస్సార్‌సీపీ నేతలను దారుణంగా ఇబ్బందులు పెట్టడంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను బలంగా తిప్పికొడదామని వైఎస్ జగన్ సూచించారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత అర్థమై ఇలా కూటమి నేతలు భయోత్సాతం సృష్టిస్తున్నారని వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు.
ఈ అనైతిక కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీకి తగిన బుద్ది చెబుతారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. నానికి అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందని భరోసానిచ్చారు.