
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు రూ. 2,000 కోట్లకు పైగా నష్టం కలిగించిన.. బ్యాంకు మోసం కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM), దాని ప్రమోటర్ డైరెక్టర్ 'అనిల్ అంబానీ'కి సంబంధించిన స్థలాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) శనివారం దాడులు నిర్వహించింది. ముంబైలోని ఆర్‌కామ్‌తో సహా ఆయనకు సంబంధం ఉన్న ఆరు ప్రదేశాలలో ఈ సోదాలు జరిగాయి.
బ్యాంకు నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయి?.. రుణాలు మళ్లించబడ్డాయో, లేదో నిర్ధారించడానికి కీలకమైన పత్రాలు, డిజిటల్ ఆధారాలను సేకరించడం కోసం సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఎస్‌బీఐకి రూ. 2,000 కోట్లకు పైగా నష్టం కలిగించినందుకు ఆర్‌కామ్‌పై కూడా ఏజెన్సీ కేసు నమోదు చేసింది.
అనీల్ అంబానీ, ఆర్‌కామ్ మోసానికి పాల్పడినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 13న ప్రకటించింది. జూన్ 24న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కు ఒక నివేదికను పంపింది. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఒక బ్యాంకు ఒక ఖాతాను మోసపూరితంగా వర్గీకరించిన తరువాత.. ఆ విషయాన్ని రుణదాత 21 రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలియజేయాలి.
ఆర్‌కామ్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ ఎక్స్‌పోజర్‌లో ఆగస్టు 26, 2016 నుంచి అమలులోకి వచ్చే వడ్డీ, ఖర్చులతో పాటు రూ. 786.52 కోట్ల నాన్-ఫండ్ బేస్డ్ బ్యాంక్ గ్యారెంటీతో పాటు.. రూ. 2,227.64 కోట్ల ఫండ్ బేస్డ్ ప్రిన్సిపల్ బకాయిలు ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గత నెలలో లోక్‌సభకు తెలిపారు. కాగా ఇప్పటికే అనిల్ అంబానీ కంపెనీలపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సోదాలు నిర్వహించింది.
ఇదీ చదవండి: ఎవరూ తప్పించుకోలేరు.. ఏకంగా 8 కోట్ల ట్రాఫిక్ చలాన్లు!