
ప్రపంచంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం ట్రాఫిక్ నియమాలను కఠినతరం చేసింది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినవారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. 2024లో మాత్రమే అధికారులు దేశం మొత్తం మీద 8 కోట్ల కంటే ఎక్కువ ట్రాఫిక్ చలాన్లు జారీ చేశారు. ఈ చలాన్ల మొత్తం విలువ సుమారు రూ. 12,000 కోట్లు.
దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కువ ట్రాఫిక్ రూల్స్ తప్పుతున్నట్లు, జరిమానాలు కూడా ఇక్కడ నుంచే ఎక్కువ వసూలవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఓవర్ స్పీడ్, రెడ్-లైట్ జంపింగ్, రాంగ్ పార్కింగ్, హెల్మెట్ లేకుండా రైడింగ్ వంటి ఉల్లంఘనలకు ప్రతోరోజూ 5000 కంటే ఎక్కువ ఈ-చలాన్లు జారీ చేస్తున్నారు. ఈ సంఖ్య గురుగ్రామ్‌లో కూడా ఎక్కువగానే ఉంది.
సాధారణ ఉల్లంఘనలు - జరిమానాలు
మోటారు వాహనాల చట్టం.. ట్రాఫిక్ విభాగాల డేటా ప్రకారం, జరిమానాలు విధించే సాధారణ ఉల్లంఘనలలో హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించడం, ఓవర్ స్పీడ్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం, రెడ్ లైట్లు జంప్ చేయడం, స్టాప్-లైన్ ఉల్లంఘనలు, రాంగ్ లేన్‌లో డ్రైవింగ్ చేయడం వంటివి ఉన్నాయి.
ఇదీ చదవండి: భవిష్యత్ ఇంధనం గురించి చెప్పిన గడ్కరీ
హెల్మెట్ ధరించకపోతే.. రూ. 1,000, నిర్దిష్ట వేగం కంటే వేగంగా డ్రైవింగ్ చేస్తే రూ. 2,000 లేదా అంతకంటే ఎక్కువ జరిమానాలు (కొన్ని నగరాల్లో మొదటిసారి ట్రాఫిక్ రూల్ అతిక్రమించినవారికి జరిమానా కొంత తక్కువగా ఉంటుంది) ఉంటాయి. ఒకసారి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినవారు.. మళ్లీ మళ్లీ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తున్నట్లు తెలిస్తే.. వారికి మరింత ఎక్కువ జరిమానా విధించే అవకాశం ఉంది.
రోడ్డు భద్రతలో టెక్నాలజీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను కనిపెట్టడం చాలా సులభమైపోయింది. ఏఐ కెమెరాలు హై రిజల్యూషన్ ఫోటోలను క్లిక్ చేయడం మాత్రమే కాకుండా.. వీడియో కూడా రికార్డ్ చేస్తాయి. వీటి ఆధారంగానే వాహనదారులకు చలాన్ జారీ చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి తప్పించుకోవడం అసాధ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన వినియోగదారులు మసలుకోవాలి. దీనివల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది.