
ఈ20 ఫ్యూయెల్ చుట్టూ ఉన్న గందరగోళాల మధ్య.. 'హైడ్రోజన్' భవిష్యత్ ఇంధనం అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. హైడ్రోజన్, బయో ఇంధనాలు & ఎలక్ట్రిక్ వాహనాలు రవాణా.. పరిశ్రమల భవిష్యత్తు అని ఆయన స్పష్టం చేశారు.
శిలాజ ఇంధనాలను హైడ్రోజన్ భర్తీ చేస్తుంది. ఇది కేవలం రవాణాకు మాత్రమే కాకుండా.. పరిశ్రమలకు కూడా కీలకంగా మారుతుందని గడ్కరీ అన్నారు. రైళ్లు హైడ్రోజన్ ద్వారానే నడుస్తాయి, విమానాలు హైడ్రోజన్‌తో ఎగురుతాయని అన్నారు. భవిష్యత్తులో శిలాజ ఇంధనాలపై ఆధారపడటం ఉండదని పేర్కొన్నారు.
ఆటోమొబైల్ మార్కెట్లో భారత్
ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లో భారతదేశం ఎదుగుదలను నితిన్ గడ్కరీ ప్రస్తావించారు. ఇండియా ఇటీవల జపాన్‌ను అధిగమించి దేశం ఏడవ స్థానం నుంచి మూడవ స్థానానికి చేరుకుందని అన్నారు. అమెరికన్ ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ. 78 లక్షల కోట్లు, చైనా విలువ రూ. 49 లక్షల కోట్లు, కాగా భారతదేశం విలువ రూ. 22 లక్షల కోట్లు. రాబోయి రోజుల్లో ఆటోమొబైల్ రంగంలో భారత్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
కొన్ని రోజుల క్రితం, మెర్సిడెస్ గ్లోబల్ చైర్మన్.. భారతదేశంలో ఎలక్ట్రిక్ మెర్సిడెస్ కార్లను తయారు చేస్తామని నాకు చెప్పారని నితిన్ గడ్కరీ చెప్పారు. రవాణా & పరిశ్రమ భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలు, బయో ఇంధనాలు, హైడ్రోజన్‌పై ఆధారపడి ఉంది. వీటి వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. పర్యావరణంలో కాలుష్యం కూడా తగ్గుతుందని ఆయన అన్నారు. ఈ రంగంలో ఉద్యోగాలు కూడా పెరుగుతాయని చెప్పారు.
ఇదీ చదవండి: కొత్త కారు కొనే ప్లాన్ ఉందా?: భవిష్యత్తుకు ఎలాంటి మోడల్ బెస్ట్
హైడ్రోజన్ ఇంధనం గురించి మాట్లాడుతూ.. చమురు ఉత్పత్తి చేసే దేశాలను చౌకైన హైడ్రోజన్‌తో భారతదేశం సమం చేయగలదని గడ్కరీ అన్నారు. హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చును తగ్గించగలిగితే.. భారతదేశం ఇంధన దిగుమతిదారు నుంచి ప్రపంచ ఎగుమతిదారుగా మారగలదని అన్నారు. అయితే హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.