అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన సుమారు రూ.1,400 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. తాత్కాలికంగా ఈ ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలిపింది. దాంతో ఇప్పటివరకు గ్రూప్‌నకు చెందిన మొత్తం రూ.9,000 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లయింది.
విచారణకు గైర్హాజరు
ఈడీ తాజా చర్యలకు కొద్దిరోజుల ముందు రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ విచారణకు హాజరుకాకుండా సమన్లను దాటవేశారు. విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) కింద జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఆయనను ఈడీ పిలిపించింది. కానీ విచారణకు ఆయన గైర్హాజరు కావడం ఇది రెండోసారి. ఏజెన్సీ చివరిసారిగా ఆగస్టులో అనిల్ అంబానీని ప్రశ్నించింది.
హవాలా, నిధుల మళ్లింపు ఆరోపణలు
ఈడీ ఆరోపణల ప్రకారం, అనిల్ అంబానీ గ్రూప్ జైపూర్-రీంగస్ హైవే ప్రాజెక్ట్ నుంచి సూరత్‌లోని షెల్ కంపెనీల ద్వారా సుమారు రూ.40 కోట్లను విదేశాలకు తరలించి దుబాయ్‌కు పంపినట్లు అనుమానిస్తున్నారు. ఇది రూ.600 కోట్లకు పైగా విస్తృత అంతర్జాతీయ హవాలా నెట్‌వర్క్‌లో భాగమై ఉండవచ్చని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలిపింది.
ఇతర ప్రధాన ఆస్తుల జప్తు
అంబానీ గ్రూప్ కంపెనీలపై దర్యాప్తులో భాగంగా ఈడీ ఇటీవల రూ.4,462 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. దీనికి ముందు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్) బ్యాంక్ రుణ కేసుకు సంబంధించి నవీ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీ (డీఏసీ) ప్రాంగణంలో సుమారు రూ.7,545 కోట్ల విలువైన 132 ఎకరాల భూమిని కూడా ఈడీ జప్తు చేసింది.
కేసు నేపథ్యం
మోసం, కుట్ర, అవినీతి ఆరోపణలపై అనిల్ అంబానీతోపాటు ఆర్‌కామ్, ఇతరులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. 2010, 2012 మధ్య భారతీయ, విదేశీ బ్యాంకుల నుంచి మొత్తం రూ.40,000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న ఆర్‌కామ్, దాని అనుబంధ సంస్థలపై దర్యాప్తు జరుగుతోంది.
ఇదీ చదవండి: డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!


