
రేపటి నుంచి ప్రపంచ కప్ శిక్షణా శిబిరం
వారం రోజుల పాటు ప్రాక్టీస్
సాక్షి, విశాఖపట్నం: సొంత గడ్డపై జరిగే వన్డే వరల్డ్ కప్‌లో సత్తా చాటాలని భారత మహిళల జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో టోర్నీకి నెల రోజుల ముందునుంచి జట్టు సన్నాహకాలు మొదలు కానున్నాయి. ఇందులో భాగంగా ఆగస్టు 25 నుంచి హర్మన్ ప్రీత్ కౌర్ బృందానికి ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో వారం రోజుల పాటు టీమ్ సాధన చేస్తుంది. ఫిట్‌నెస్, ట్రైనింగ్‌లాంటి అంశాల గురించి కాకుండా పూర్తిగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లపైనే దృష్టి పెడుతూ ‘స్కిల్ బేస్డ్’ కండిషనింగ్ క్యాంప్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
సాధన కోసం బోర్డు వ్యూహాత్మకంగానే వైజాగ్‌ను ఎంపిక చేసింది. జట్టులోని ముగ్గురు సభ్యులు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, స్నేహ్ రాణాలకు ఎప్పుడో 2014లో మాత్రమే ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. మిగతా ప్లేయర్లు ఎవరూ వైజాగ్‌లో గతంలో ఒక్క సారి కూడా మ్యాచ్ ఆడలేదు. ప్రాక్టీస్‌తో ఇక్కడి పిచ్, పరిస్థితులను అంచనా వేసేందుకు ఈ క్యాంప్ ఉపయోగపడనుంది.
వరల్డ్‌కప్‌లో భారత జట్టు రెండు అత్యంత కీలక మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాతో (అక్టోబర్ 9న), ఆ్రస్టేలియాతో (అక్టోబర్ 12)న విశాఖలోనే ఆడనుంది. రిజర్వ్ ప్లేయర్లు సహా భారత జట్టు సభ్యులంతా ఈ ప్రత్యేక క్యాంప్‌లో పాల్గొంటారు. భారత ‘ఎ’ జట్టు సభ్యులు కూడా దీనికి హాజరవుతారు. రెగ్యులర్ సాధనతో పాటు డే అండ్ నైట్‌లో రెండు ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా జరుగుతాయి.