
నేటి నుంచి మహిళల వన్డే వరల్డ్‌కప్
తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ ‘ఢీ’
బరిలో 8 జట్లు
ఫైనల్ నవంబర్ 2న
మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
సొంతగడ్డపై భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ వేటకు సిద్ధమైంది. ఇంటా బయటా ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిన మహిళల జట్టుకు ఐసీసీ ప్రపంచకప్ వెలతిగానే ఉంది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు సొంతగడ్డపై జరిగే మెగా ఈవెంట్‌లో తెరదించాలని క్రికెట్ అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. గతంలో రెండుసార్లు ఫైనల్ చేరినా టీమిండియాకు నిరాశ తప్పలేదు. కానీ అప్పటికీ ఇప్పటికీ భారత మహిళల జట్టు ఎంతో మారింది. ప్రపంచకప్‌ను గెలిచే సత్తా కలిగి ఉంది.
గువాహటి: దశాబ్దాలుగా అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ ప్రపంచకప్‌ను ఎలాగైనా ఈసారి అందుకోవడమే లక్ష్యంగా భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది. వన్డే ప్రపంచకప్‌లో నేడు తొలి మ్యాచ్ ఆతిథ్య దేశాలు భారత్, శ్రీలంకల మధ్య ఇక్కడ జరుగనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం సొంతగడ్డ అనుకూలతల్ని వినియోగించుకొని మెగా ఈవెంట్ లో రాణించాలనే పట్టుదలతో ఉంది. ఇటీవల పరిమిత ఓవర్ల ఫార్మాట్ ఫామ్ కూడా భారత జట్టులో కొండంత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. భారత్ పటిష్టమైన ప్రత్యర్థే కాదు... టైటిల్ ఫేవరెట్లలో ఒకటని కచ్చితంగా చెప్పొచ్చు.
ఫామ్‌లో స్మృతి మంధాన
భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన జోరు మీదుంది. ఇది జట్టుకు బాగా కలిసొచ్చే అంశం. టాపార్డర్‌లో ప్రతీక, హర్లీన్ నిలకడగా రాణిస్తున్నారు. జెమీమా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మలతో మిడిలార్డర్ కూడా పటిష్టంగా ఉంది. బౌలింగ్ బలగంలో రేణుక, క్రాంతి, అరుంధతిలతో కూడిన పేస్ దళానికి కొత్త స్పిన్ కెరటం శ్రీచరణి జతయ్యింది. మరోవైపు శ్రీలంక కూడా ప్రపంచకప్‌కు దీటుగా సిద్ధమై వచ్చింది. భారత్ లాగే ఆతిథ్య అనుకూలతల్ని సొమ్ము చేసుకోవాలని భావిస్తోంది.
5న పాక్‌తో భారత్ పోరు
శ్రీలంకతో మంగళవారం తొలి మ్యాచ్ ఆడాక భారత జట్టు కొలంబోకు వెళుతుంది. అక్టోబర్ 5న కొలంబో వేదికగా పాకిస్తాన్‌తో టీమిండియా ఆడుతుంది. పాక్‌తో మ్యాచ్ ఆడాక భారత బృందం తిరిగి స్వదేశానికి చేరుకుంటుంది. విశాఖపట్నంలో అక్టోబర్ 9న దక్షిణాఫ్రికాతో, అక్టోబర్ 12న విశాఖపట్నంలోనే ఆ్రస్టేలియాతో భారత్ తలపడుతుంది.
ఈ రెండు మ్యాచ్‌ల తర్వాత అక్టోబర్ 19న ఇండోర్‌లో ఇంగ్లండ్‌తో ఆడనున్న భారత్... అక్టోబర్ 23న నవీ ముంబైలో న్యూజిలాండ్ జట్టుతో, అక్టోబర్ 26న నవీ ముంబైలోనే బంగ్లాదేశ్‌తో ఆడి లీగ్ దశను ముగిస్తుంది. లీగ్ దశ ముగిశాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి.
ఆ్రస్టేలియా ఏడు సార్లు...
ఇప్పటి వరకు 12 సార్లు మహిళల వన్డే వరల్డ్ కప్ జరిగింది. ఆ్రస్టేలియా అత్యధికంగా ఏడు సార్లు (1978, 1982, 1988, 1997, 2005, 2013, 2022) చాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లండ్ నాలుగు సార్లు (1973, 1993, 2009, 2017), న్యూజిలాండ్ ఒకసారి (2000) విజేతగా నిలిచాయి.
ఇదీ మన చరిత్ర
మహిళల క్రికెట్‌లో మన జట్టు 1976లో అరంగేట్రం చేసింది. 1978లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో భారత్ తొలి సారి పాల్గొంది. కానీ పురుషుల జట్టులా మేటిగా ఎదిగేందుకు దశాబ్దాల సమయం పట్టింది. 21 ఏళ్ల తర్వాత 1997లో జరిగిన ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు సెమీఫైనల్ చేరింది. అలా ఎట్టకేలకు వెలుగులోకి వచ్చిన భారత్‌కు 2005 ప్రపంచకప్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఆ మెగా ఈవెంట్‌లో ఫైనల్ చేరిన భారత్ చివరకు రన్నరప్‌గా తృప్తిపడింది. మళ్లీ 12 ఏళ్ల తర్వాత కూడా 2017లో టైటిల్ బరిలోఉన్నప్పటికీ ‘కప్’ ముచ్చట అయితే తీరలేదు. మళ్లీ రన్నరప్‌గానే నిలిచింది.
ఇదీ ప్రస్తుత కప్ కథ
భారత్, శ్రీలంక జట్లు సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్నాయి. మొత్తం 5 వేదికలు కాగా... విశాఖపట్నం, నవీ ముంబై, గువాహటి, ఇండోర్ ఈ నాలుగు భారత నగరాలు. శ్రీలంకలోని కొలంబో ఐదో వేదిక. ఆతిథ్య జట్లు సహా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లాంటి గట్టి ప్రత్యర్థులే బరిలో ఉండటం వల్ల బోర్ కొట్టించే మ్యాచ్‌లకు చోటు లేదు.
ప్రతీ జట్టు మిగతా ఏడు ప్రత్యర్థులతో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడుతుంది. అంటే ఒక్కో జట్టుకు లీగ్ దశలో ఏడు మ్యాచ్‌లుంటాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ చేరతాయి. అక్టోబర్ 29, 30 తేదీల్లో రెండు సెమీఫైనల్స్ గువాహటి, ముంబై, నవంబర్ 2న ఫైనల్ ముంబైలో జరుగుతాయి. అయితే పాక్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడుతుంది. నాకౌట్‌కు చేరితే ఫైనలైనా... సెమీఫైనలైనా... కొలంబోలోనే పాకిస్తాన్ ఆడుతుంది.