
సాక్షి,అమరావతి: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ వైఖరి శాసన మండలి సాక్షిగా బయటపడింది. రెండు ఐటీ కంపెనీలకు ఎకరా స్థలాన్ని రూపాయికే ఇచ్చామంటూ మంత్రి నారా లోకేష్ అంగీకరించారు.
మంగళవారం శాసన మండలిలో రాష్ట్రంలో పరిశ్రమలు, వాటి పెట్టుబడులు అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో కూటమి ప్రభుత్వంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ‘గత ఐదేళ్లలో విశాఖలో ఐటీ కంపెనీలు సహా అనేక కంపెనీలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవే. మేం ఆనాడు శంకుస్థాపనలు చేసిన కంపెనీలు ఇవాళ కూటమి ప్రభుత్వంలోని మంత్రులు శంకుస్థాపనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంతేకాదు రాష్ట్రంలోని ఐటీ నిబంధనలకు అనుగుణంగా వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రానికి వచ్చిన సంస్థలు, వాటి వివరాల్ని సభలో వెల్లడించారు.
కానీ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో వేలకోట్ల విలువైన భూముల్ని కేవలం ఊరుపేరు లేని కంపెనీలకు ఎకరం భూమిని రూపాయికే కట్టబెట్టిందని మండిపడ్డారు. ఆక్షన్‌లో పెట్టకుండా వేల కోట్ల విలువైన భూముల్ని లులు, ‘ఉర్సా’ అనే ఊరూపేరూ లేని, రెండు మాసాల వయసున్న ఓ కంపెనీకి విశాఖలోనే ఖరీదైన 60 ఎకరాల స్థలాన్ని ఎకరా 99 పైసలకే కట్టబెట్టడాన్ని నిలదీశారు.
అందుకు సభలో ఉన్న నారా లోకేష్ స్పందించారు. తాము రాష్ట్రంలో రెండు ఐటీ కంపెనీలకు రూపాయికే ఎకరా స్థలాన్ని కట్టబెట్టినట్లు ఒప్పుకునున్నారు. మేం ఎకరా స్థలం ఒక్క రూపాయికి ఇచ్చింది కేవలం రెండు కంపెనీలకు మాత్రమే. టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీలకు ఇచ్చాం’ అని వ్యాఖ్యానించారు. దీంతో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ భూములను నిబంధనలు పాటించకుండా, పారదర్శకత లేకుండా కేటాయించిన విషయం సభ సాక్షిగా బట్టబయలైంది.