పోస్టింగుల కోసం కొందరు పోలీసు అధికారులు అతి చేస్తున్నారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాకు నోటీసులు అంటూ లీకులు
రిటైరైనా, డిప్యూటేషన్లు, విదేశాలకు వెళ్లినా వారిని వదిలిపెట్టేది లేదు
రేవంత్ అడుగులకు మడుగులొత్తుడేనా డీజీపీ శివధర్ ఖాకీ బుక్
ఇరిగేషన్‌పై మాకు అసెంబ్లీలో పీపీపీటీకి అవకాశం ఇవ్వాలి: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడిన ప్రతీ సారి లీకులతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. నదీ జలాల్లో అన్యాయంపై కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మాపై కేసులు పెడతామంటూ లీక్‌లు ఇస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీ సులు ఇస్తారట. చట్టబద్ధ్దంగా వ్యవహరించని పోలీసు అధికారులు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది’అని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.
‘పోస్టింగుల కోసం అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతున్న పోలీసుల వివరాలు రాసి పెడుతున్నాం. బీఆర్‌ఎస్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న అధికారులను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్ అయినా, విదేశాలకు వెళ్లినా, సెంట్రల్ సర్వీసులోకి డిప్యూటేషన్‌పై వెళ్లినా వదిలిపెట్టేది లేదు. ఏ బొరియలో దాక్కున్నా లాక్కొస్తాం. రేవంత్ అడుగు లకు మడుగులొత్తుడేనా డీజీపీ శివధర్‌రెడ్డి ఖాకీ బుక్’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియాతో హరీశ్‌రావు ఇష్టాగోష్టి నిర్వహించారు.
నేతి బీరలో నెయ్యిలా డీజీపీ ఖాకీ బుక్
‘ఉద్యమ కాలం నుంచి ఇప్పటివరకు నాపై సుమారు 300 కేసులు పెట్టారు. రేవంత్ పథకాల ఎగవేతను ప్రశ్నిస్తూ ఆయన పాపాలను క్షమించమని దేవుడిని వేడుకున్నందుకు కూడా యాదగిరిగుట్టలో కేసులు పెట్టారు. సిద్దిపేటలో నా ఇంటిపై దాడి చేసినా కేసు నమోదు చేయలేదు. ఫార్ములా ఈ–రేస్ తరహాలోనే నాపై అక్రమ కేసులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓటు వేయలేదని సజ్జాపూర్‌లో దళితుల ఇల్లు కూల్చివేస్తే డీఐజీ ఖాకీబుక్ ఏం చేస్తోంది.
రేవంత్ ఫుట్‌బాల్ ఆడితే డీఐజీ మైదానంలో రెండు రోజులు కాపలా ఉన్నారు. కానిస్టేబుళ్లు, హోమ్‌గార్డులు తమకు రావాల్సిన టీఏ, డీఏ, సరెండర్ లీవులు, భద్రత పథకం, అలవెన్సుల కోసం తిరగబడే పరిస్థితిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకుని కేవలం యూసుఫ్‌గూడ బెటాలియన్‌లో పనిచేసే వారికి మాత్రమే పెండింగ్ అలవెన్సులు ఇచ్చారు. నేతి బీరకాయలో నేతి చందంగా డీజీపీ ఖాకీ బుక్ పనిచేస్తోంది’అని హరీశ్‌రావు మండిపడ్డారు.
వాస్తు భయంతో సచివాలయానికి దూరం
‘కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో ఆత్మరక్షణలో పడిన రేవంత్ రాత్రి 9.30 గంటలకు మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించాడు. వాస్తు భయంతో సచివాలయానికి వెళ్లకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కూర్చుంటున్నాడు. నాలుగు వేలకు పైగా సర్పంచ్ పదవులు మా పార్టీకి దక్కడంతో సహకార సంఘాల ఎన్నికలు పెట్టకుండా కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేయాలని చూస్తున్నాడు. కాంట్రాక్టుల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ.7వేల కోట్ల కమీషన్లు పంచుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కన్సల్టెన్సీ కంపెనీలా పనిచేస్తూ బాంబే బ్రోకర్‌కు రూ.180 కోట్లు కమీషన్ ఇచ్చి అప్పులు తెచ్చింది. ఇరిగేషన్ అంశాలపై అసెంబ్లీలో మాకూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలి. 15 రోజులు అసెంబ్లీ పెట్టి మాకు అవకాశం ఇస్తే ఇరిగేషన్‌తోపాటు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సర్కారు బట్టలు విప్పుతాం. ఉత్తమ్ తన తప్పు ఒప్పుకుని పాలమూరు ప్రాజెక్టుకు 90 టీఎంసీలు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాయాలి’అని హరీశ్‌రావు చెప్పారు.


