
మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీ రన్నరప్ భారత్
ఫైనల్లో చైనా చేతిలో ఓటమి
హాంగ్జౌ (చైనా): వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ మహిళల హాకీ టోర్నీకి నేరుగా అర్హత సాధించాలని ఆశించిన భారత జట్టుకు నిరాశే ఎదురైంది. ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి పడింది. ఆతిథ్య చైనా జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో సలీమా టెటె నాయకత్వంలోని టీమిండియా 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ మొదలైన తొలి నిమిషంలోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను నవ్‌నీత్ కౌర్ గోల్‌గా మలచడంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత చైనా పుంజుకోవడంతో భారత్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. 21వ నిమిషంలో జిజియా ఒయు గోల్‌తో చైనా స్కోరును 1–1తో సమం చేసింది. ఆ తర్వాత హాంగ్ లీ (41వ నిమిషంలో), మెరోంగ్ జు (51వ నిమిషంలో), జియాకి జాంగ్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ చేసి చైనాకు విన్నర్స్ ట్రోఫీతోపాటు ప్రపంచ కప్ బెర్త్‌ను అందించారు.
మ్యాచ్ మొత్తంలో భారత్‌కు ఐదు పెనాల్టీ కార్నర్‌లు... చైనాకు ఆరు పెనాల్టీ కార్నర్‌లు రాగా... రెండు జట్లు ఒక్కో దానిని మాత్రమే సద్వినియోగం చేసుకున్నాయి. భారత క్రీడాకారిణి ఉదిత ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డును గెల్చుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో జపాన్ 2–1తో దక్షిణ కొరియాను ఓడించింది.