చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్‌.. 28 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు | Smriti Mandhana Breaks 28-Year-Old Record To Set New Milestone In Women's ODI Cricket, More Details Inside | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్‌.. 28 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు

Oct 10 2025 7:13 AM | Updated on Oct 10 2025 1:10 PM

Smriti Mandhana charts most ODI runs in a single calendar year

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధన (Smriti Mandhana) 28 ఏళ్ల కిందటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి, చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్‌లో ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది.

ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లో 23 పరుగులు చేసిన మంధన ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో (2025) పరుగుల సంఖ్యను 982కు (17 ఇన్నింగ్స్‌ల్లో) పెంచుకుంది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్‌ (Belinda Clark) పేరిట ఉండేది. క్లార్క్‌ 1997 క్యాలెండర్‌ ఇయర్‌లో 970 పరుగులు చేసింది. ఈ విభాగంలో మంధన, క్లార్క్‌ తర్వాత సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్‌ (2022లో 882 పరుగులు), న్యూజిలాండ్‌కు చెందిన డెబ్బీ హాక్లీ (1997లో 880), న్యూజిలాండ్‌కు చెందిన యామీ సాటర్థ్‌వైట్‌ (2016లో 853) ఉన్నారు.  

మంధన వన్డేల్లో ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌లో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా, అంతకుముందు అద్భుత ప్రతిభ కనబర్చింది. ఈ ఏడాది మంధన ఖాతాలో నాలుగు వన్డే శతకాలు కూడా ఉన్నాయి.

మ్యాచ్‌ విషయానికొస్తే.. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నిన్న (అక్టోబర్‌ 9) వైజాగ్‌ వేదికగా భారత్‌, సౌతాఫ్రికా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌ 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తప్పక గెలుస్తుందనుకున్న ఈ మ్యాచ్‌లో భారత్‌ అనూహ్యంగా ఓటమిపాలైంది. ఎనిమిదో నంబర్‌ ప్లేయర్‌ నదినే డి క్లెర్క్‌ (54 బంతుల్లో 84 నాటౌట్‌; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో భారత్‌ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది.

భారత్‌ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 81 పరుగులకే 5 కోల్పోయింది. ఈ దశలో క్లెర్క్‌, క్లో ట్రయాన్‌ (49) సహ​కారంతో మ్యాచ్‌ను గెలిపించింది. చివరి 5 ఓవర్లలో 52 పరుగులు చేయాల్సిన దశలో క్లెర్క్‌ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది మరో 7 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించింది. అంతకుముందు కెప్టెన్‌ లారా వోల్వార్డ్ట్‌ (70) రాణించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. రిచా ఘోష్‌ (77 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చారిత్రక ఇన్నింగ్స్‌ కారణంగా 251 పరుగులు చేసింది. 153 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో రిచా.. స్నేహ్‌ రాణా (33) సహకారంతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించింది. క్లెర్క్‌ సంచలన ఇన్నింగ్స్‌ కారణంగా భారత్‌ ఈ మ్యాచ్‌ను చేజార్చుకుంది. 

చదవండి: చరిత్ర సృష్టించిన రిచా ఘోష్‌.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement