
భారత మహిళల జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ మరోసారి సత్తాచాటింది. మహిళల ప్రపంచకప్‌లో వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో రిచా విధ్వంసం సృష్టించింది. విశాఖ మైదానంలో బౌండరీల మోత మ్రోగించింది. ఓపెనర్లు ప్రతికా రావెల్, స్మృతి మంధాన తొలి వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఆ తర్వాత వరుస క్రమంలో భారత్ వికెట్లు కోల్పోయింది. దీంతో ఉమెన్ ఇన్ బ్లూ 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రిచా తన అద్బుత పోరాటంతో జట్టును ఆదుకుంది. తన ఫైటింగ్ నాక్‌తో 102/6 నుంచి 251 వరకూ టీమిండియాకు మెరుగైన స్కోర్ అందించింది.
లేడి ధోనిగా పేరు గాంచిన రిచా ఘోష్ కేవలం 77 బంతుల్లోనే 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 94 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌కు అంతా ఫిదా అయిపోయారు. ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రిచా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.
రిచా సాధించిన రికార్డులు ఇవే..
👉మహిళల వన్డే క్రికెట్‌లో ఎనిమిది లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి ప్లేయర్‌గా రిచా వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు సౌతాఫ్రికా ప్లేయర్ క్లోయ్ ట్రయాన్ పేరిట ఉండేది. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ట్రయాన్ ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి 74 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో ట్రయాన్ ఆల్‌టైమ్ రికార్డును రిచా బ్రేక్ చేసింది.
👉వన్డేల్లో అత్యంత వేగంగా(బంతులు పరంగా) 1000 పరుగుల మార్క్ అందుకున్న భారత మహిళ క్రికెటర్ రిచా నిలిచింది. ఘోష్ కేవలం 1010 బంతుల్లోనే ఈ ఫీట్ అందుకుంది. ఓవరాల్‌గా మహిళల క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన మూడో ప్లేయర్‌గా ఆమె నిలిచింది. తొలి స్దానంలో ఆసీస్‌కు చెందిన యాష్ గార్డనర్(917) ఉంది.
👉మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన వికెట్ కీపర్‌గా రిచా రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఫౌజీహ్ ఖలీలి పేరిట ఉండేది. 1982 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌పై ఫౌజీహ్ 88 పరుగులు సాధించారు. ఈ మ్యాచ్‌లో కీలక నాక్ ఆడిన రిచా.. 43 ఏళ్ల ఫౌజీహ్ రికార్డు బ్రేక్ చేసింది.
చదవండి: టీమిండియాతో మ్యాచ్.. సౌతాఫ్రికా కెప్టెన్ డబుల్ సెంచరీ