
మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ అద్భుతం జరిగింది. తొలిసారి ఓ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఎనిమిదో నంబర్ ప్లేయర్లు అర్ద సెంచరీలు చేశారు. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదు.
వన్డే ప్రపంచకప్ 2025లో (CWC 2025) భాగంగా భారత్, సౌతాఫ్రికా (India vs South Africa) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన ఎనిమిదో నంబర్ ప్లేయర్ రిచా ఘెష్ (Richa Ghosh), సౌతాఫ్రికా తరఫున ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన నదినే డి క్లెర్క్ (Nadine de Klerk) అర్ద సెంచరీలు చేశారు.
ఘోష్, క్లెర్క్ ఈ అర్ద సెంచరీలను వారివారి జట్లు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండగా, ఘోష్ (77 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచితంగా పోరాడింది. స్వల్ప తేడాతో సెంచరీ సైతం మిస్ అయ్యింది. స్నేహ్ రాణాతో కలిసి (33) అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌కు ఫైటింగ్ స్కోర్‌ను అందించింది.
క్లెర్క్ విషయానికొస్తే.. భారత్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 142 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి, మ్యాచ్‌పై ఆశలు దాదాపుగా వదులుకుంది. ఈ దశలో ఎనిమిదో నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన క్లెర్క్ (54 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు).. సంచలన ఇన్నింగ్స్ ఆడి భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుని, తన జట్టుకు అపుకూప విజయాన్నందించింది.
ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌పై సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. క్లెర్క్ కారణంగా తప్పక గెలుస్తుందనుకున్న ఈ మ్యాచ్‌లో భారత్ అనూహ్యంగా ఓటమిపాలైంది.
చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. 28 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు