
విజయ్ హజారే వన్డే టోర్నీలో బరిలోకి దిగే చాన్స్!
న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ... దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో భారత జట్టు సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడనుండగా... దానికి ముందు ఈ ఇద్దరు స్టార్‌లు విజయ్ హజారే ట్రోఫీలో కనీసం మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశాలున్నాయి. టెస్టు, టి20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు... కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.
చాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం భారత జట్టు వన్డేలు ఆడకపోగా... ఆస్ట్రేలియాతో పర్యటన కోసం రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీని యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు అప్పగించి... కోహ్లి, రోహిత్‌ను ప్లేయర్లుగా ఈ పర్యటనకు ఎంపిక చేశారు. ఈ ఇద్దరు 2027 వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగాలని భావిస్తుండగా... ఆలోపు టీమిండియా ఎక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడేది లేకపోవడంతో... ఫామ్, ఫిట్‌నెస్ కాపాడుకు నేందుకు దేశవాళీల్లో ఆడాలని భావిస్తున్నట్లు సమాచారం.
‘జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్న ప్రతీ ఆటగాడు అందుబాటులో ఉన్న సమయంలో దేశవాళీల్లో ఆడాల్సిందే’అని ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించిన నేపథ్యంలో ఈ ఇద్దరు బరిలోకి దిగడంపై ఆసక్తి నెలకొంది. ‘డిసెంబర్ 6న విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికా తో టీమిండియా చివరి వన్డే మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మధ్య దాదాపు ఐదు వారాల సమయం ఉంది.
విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24 నుంచి ప్రారంభమవుతుంది. కివీస్‌తో సిరీస్‌కు ముందు ముంబై, ఢిల్లీ జట్లు విజయ్ హజారేలో ఆరేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. వాటిలో కనీసం మూడిట్లో రోహిత్, కోహ్లి ఆడొచ్చు’ అని బోర్డు అధికారి వెల్లడించాడు. మరోవైపు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తపరిచాడు. ఆ ఇద్దరు ఆటగాళ్లు భారత్ ‘ఎ’ మ్యాచ్‌లు, విజయ్ హజారే వంటి టోర్నీల్లో ఆడుతూ ఫామ్ కొనసాగించుకోవచ్చని పేర్కొన్నాడు.