
గోపాలపట్నం: విశాఖలో ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి వెనక్కి వచ్చి అత్యవసర ల్యాండింగ్ అయింది. గురువారం మధ్యాహ్నం 2.38 గంటలకు విశాఖ నుంచి బయలుదేరిన విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో రెండో ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది.
దీంతో పైలెట్లు ఎయిర్ ట్రాఫిక్ అధికారులకు సమస్యను 2.47 గంటలకు తెలిపారు. స్పందించిన ఎయిర్‌పోర్టు అధికారులు విమానం సురక్షిత ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, విమానంలో 103 మంది ప్రయాణీకులు ఉన్నారని, కొందరు ప్రత్యామ్నాయ విమానాల్లో వెళ్లగా, మరికొందరు ప్రయాణం రద్దు చేసుకున్నారని విమానాశ్రయ ఇన్‌చార్జ్ డైరెక్టర్ ఎన్.పురుషోత్తం తెలిపారు.