
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దీంతో తెలంగాణ, ఏపీ వాతావరణ కేంద్రాలు హెచ్చరికలు జారీ చేశాయి.
ఏపీలో ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు కుండపోత తప్పదని తెలిపింది. మరోవైపు.. ఆవర్తన ప్రభావంతో దక్షిణ కొస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు ఉంటాయని తెలిపింది.
ఇక.. తెలంగాణకు రెండు రోజులపాటు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ, రేపు.. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. హైదరాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు కుండపోత తప్పదని హెచ్చరించింది.
వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనంతో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు పడుతుండగా మరో మూడు రోజులు అవి కొనసాగుతాయని పేర్కొంది.
గత రాత్రి నుంచే ఉమ్మడి విశాఖను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం మదనపురంలో 3.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే మండలంలోని నందిగంలో 2.7 సెంటీమీటర్ల వర్షం పడింది. పార్వతీపురం జిల్లా గుమ్మలక్ష్మీపురం, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది.
40-50 కిమీ వేగంతో ఉండనున్న ఈదురు గాలులు వీస్తాయని విపత్తుల శాఖ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున ఈ నెల 27 వరకూ ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాలల్లో ఇప్పటిదాకా కురిసిన వానలకు, ఎగువన కురుస్తున్న వర్షాలకు పలు ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ జురాల, నంద్యాల శ్రీశైలం జలాయశంకు వరద పోటెత్తుతోంది.
