
సాక్షి, హైదరాబాద్: మద్యం అక్రమ కేసులో కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసుతో సంబంధం లేని నర్రెడ్డి సునీల్ నివాసం, ఆఫీసుల్లొ సిట్ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, విశాఖపట్నంలో సిట్ సోదాలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి హోదాలోనూ కూడా సునీల్ పని చేయలేదు. మరో భేతాళ కథ సృష్టిస్తూ తప్పుడు మార్గంలో సిట్ సోదాలు నిర్వహిస్తోంది.
కుట్రలు.. పన్నాగాలు.. బెదిరింపులు.. వేధింపుల మధ్య.. అబద్ధపు వాంగ్మూలాలు.. తప్పుడు సాక్ష్యాలతో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) మద్యం అక్రమ కేసును నడిపిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కక్ష సాధింపే లక్ష్యంగా.. దెబ్బతీయడమే ఉద్దేశంగా.. అబద్ధాల పునాదులపై అడ్డగోలుగా భేతాళ కథలు అల్లుతోంది.
కాగా, మద్యం అక్రమ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు.. చంద్రబాబు సర్కార్‌కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాగించిన ప్రయత్నాలను పటాపంచాలు చేసింది. ఈ ముగ్గురికీ బెయిల్ ఇచ్చింది.
గత ప్రభుత్వ మద్యం విధానంలో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ నిరుడు సెప్టెంబరు 23న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అనంతరం ఈ అక్రమ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు నిమిత్తం సిట్‌ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు జరిపిన సిట్... రాజ్ కేసిరెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, దొడ్డా సత్యప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కాల్వ ధనుంజయరెడ్డి, పెళ్లకూరు కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు మొత్తం 48 మందిని నిందితులుగా చేర్చింది.