
భార్యల బాడీ షేమింగ్ ఎన్నాళ్లు?
భార్యను బాడీ షేమింగ్ చేయడంఎప్పటి నుంచో ఉంది. శరీర ఆకృతిని బట్టి పేర్లు పెట్టి పిలుస్తూ వేధిస్తారు భర్తలు. తాజాగా ఒక భర్త మరీ శృతి మించాడు. భార్యను నోరా ఫతేహీలా మారమని రోజుకు మూడు గంటలు జిమ్ చేయిస్తున్నాడు. జిమ్ చేయలేని రోజు పస్తు పెడుతున్నాడు. గర్భం వస్తే అబార్షన్‌కూ వెనుకాడటం లేదు. ఘజియాబాద్‌లో ఆ భార్య పోలీస్ స్టేషన్‌కు వచ్చి ‘ఈ భర్త నాకు వద్దు’ అని ఫిర్యాదు చేసింది.అంతా నచ్చి, అన్నీ చూసి వివాహం చేసుకున్నాక భర్తలకు వస్తున్న ఈ పాడు జబ్బుకు మందు వెతకాలి. భార్య పొట్టిగా ఉంటే ఒక నిక్‌నేమ్, సన్నగా ఉంటే మరొకటి, నల్లగా ఉంటే... లావుగా ఉంటే... పొడవుగా ఉంటే... పలు వరుస సరిగా లేకపోతే... జుట్టు పలుచగా ఉంటే... శరీర అంగాలు పెద్దవో చిన్నవో ఉంటే... భర్తలు వాటిని కేంద్రంగా చేసుకుని నిక్‌నేమ్స్‌తో పిలుస్తూ ఇంట్లో, పిల్లల ఎదుట, బంధువుల సమక్షంలో ఆట పట్టించడం ఆనవాయితీ. దీనికి అంగీకారం ఉండటం మన సంప్రదాయం. ఆ నిక్‌నేమ్స్ ఏదో సరదాగా పెట్టినట్టు అనిపించినా, భర్త అలా పిలవడంలో ఏదో గారాబం కనిపించినా, ఆ పేర్లన్నీ భార్యను బాడీ షేమింగ్ చేసేవే. భార్య తన భర్తకు నిక్‌నేమ్ పెట్టదు. పెట్టలేదు. పెట్టి నలుగురిలో పిలిస్తే పర్యవసానాలు మనకు తెలుసు. కాని భర్తలు మాత్రం భార్యలను బాడీ షేమింగ్ చేయడం తమ హక్కుగా భావిస్తూ ఉంటారు.
ఫిట్‌నెస్ వేరు... అందం వేరు
భార్యాభర్తలు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాల్సిందే. పిల్లలు పెరిగి ఒక వయసు వచ్చాక శారీరక మార్పులు స్త్రీ, పురుషుల్లో వస్తాయి. ఫిట్‌నెస్ కోసం కనీస వ్యాయామం, వాకింగ్, ఆహార జాగ్రత్తలు తీసుకోవడం ఇరువురూ పాటించాల్సిందే. భార్య ఫిట్‌నెస్ కోసం భర్తలు సూచనలు చేయడం, వ్యాయామం కోసం ప్రోత్సహించడం మంచి విషయం. కాని సౌందర్యాభిలాషతో, ఇతర స్త్రీలతో పోలుస్తూ... ఈ విధంగా ఉంటే నువ్వు బాగుంటావు... లేకుంటే నచ్చవు అనే సందేశం ఇస్తున్నట్టుగా మాట్లాడటం ఆమెను హింసించడమే. జన్యువుల వల్ల, శరీర తత్వం వల్ల కొందరు స్త్రీల శరీరంలో వ్యాయామంతో తగ్గని బరువు ఉండొచ్చు. లేదా కాన్పుల వల్ల, మెనోపాజ్ వల్ల కూడా తీవ్రమైన మార్పులు రావచ్చు. వాటిని అర్థం చేసుకుని, భార్య ఆరోగ్యం కోసం ప్రయత్నించాలి తప్ప అనునిత్యం కించ పరుస్తూ ఉంటే తప్పు,.. నేరం కూడా. కాని భర్తలు ఈ విషయంలో మారడం లేదు. సొంత పిల్లల ఎదుట కూడా భార్యను గేలి చేస్తూ పిల్లలు ఆమెను తేలిగ్గా తీసుకునేలా చూస్తున్నారు.
నోరా ఫతేహీలా ఉండు
కాని ఆగస్టు 20వ తేదీన ఒక భార్య ఆవేదన ఇలాంటి భర్తల స్వభావాన్ని మరోసారి బట్టబయలు చేసింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఒక వివాహిత అక్కడి మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చి భర్త మీద కేసు పెట్టింది. ఆమె తన ఫిర్యాదులో– ‘నేను ఈ సంవత్సరం మార్చి నెలలో వివాహం చేసుకున్నాను. నా భర్త ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. పెళ్లిలో మా వాళ్లు 6 లక్షల బంగారం, 24 లక్షల స్కార్పియో, 10 లక్షల రొక్కం ఇచ్చారు. కాని పెళ్లయి వచ్చినప్పటి నుంచి నన్ను నా భర్త నోరా ఫతేహీ ఫిగర్‌లాంటిది సాధించాలని వేధిస్తున్నాడు. ఇందుకోసం నాకు రోజుకు 3 గంటల వర్కవుట్ చెప్పి చేయిస్తున్నాడు. ఆ వర్కవుట్లు చేసి అలసి ఏ రోజైనా చేయకపోతే ఆ రోజు నాకు అన్నం పెట్టడం లేదు. అత్తామామలు కూడా అతనికి వంత పాడుతున్నారు. నేను చూడటానికి బాగానే ఉంటాను. కాని అతను అది చాలదని, పిల్లలు కూడా ఇప్పుడే వద్దని, గర్భం వస్తే అబార్షన్ చేయించుకోవాలని చెబుతూ నన్ను భయభ్రాంతం చేస్తున్నాడు. ఈ భర్త వద్దు’ అని ఫిర్యాదు చేసింది.
చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు
ఆరోగ్యం, అనురాగం
భార్యాభర్తల మధ్య ఉండాల్సింది అనుబంధం, అనురాగం, గౌరవం. వారిరువురూ తమ బంధాన్ని బలపరుచుకుంటూ పరస్పరం ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ సంతోషంగా జీవిస్తే రూపం సమస్య కాబోదు. రూపదోషాల నిర్వచనం ఒకరి సొత్తు కాదు. కొలతలతో ఉండేదే ఆకృతి కాదు. సంతోషకర దాంపత్యమే అందం, ఆనందం.
ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!