బెంగళూరు: తమ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య ఉదంతం బెంగళూరు ఉత్తర తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యాదగిరికి చెందిన బసవరాజు(28), శరణమ్మలకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఉపాధి కోసం బెంగళూరు వచ్చి తిగళరపాళ్యలో నివసిస్తున్నారు. ఈక్రమంలో శరణమ్మకు వీరభద్ర అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది.
తమ ఆనందానికి బసవరాజు ఎప్పటికైనా అడ్డు వస్తాడని భావించిన శరణమ్మ వీరభద్రతో కలిసి భర్తను కడతేర్చేందుకు ప్రణాళిక రచించింది. ఇంట్లో పడుకున్న బసవరాజు తలపై పెద్ద బండరాయి వేసి హత్య చేశారు. తరువాత మృతదేహాన్ని తీసికెళ్లి గంగొండనహళ్లి వద్ద పెట్రోల్ పోసి నిప్పంటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. శరణమ్మతోపాటు ఆమె ప్రియుడు వీరభద్ర, అనిల్ అనే నిందితులను అరెస్టు చేశారు.


