
దక్షిణాఫ్రికా లెజెండరీ స్పిన్నర్ ఇమ్రాన్ తహిర్ వయస్సు పెరుగుతున్న కొద్ది పాత వైన్‌లా తాయారు అవుతున్నాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్-2025లో గయానా అమెజాన్ వారియర్స్‌కు సారథ్యం వహిస్తున్న 46 ఏళ్ల తహిర్.. శుక్రవారం ఆంటిగ్వాతో జరిగిన మ్యాచ్‌లో బంతితో అద్బుతం చేశాడు. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి జట్టును తహిర్ దెబ్బతీశాడు.
ఈ సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక మెయిడిన్ ఓవర్ కూడా ఉంది. అతడి బౌలింగ్ ధాటికి 212 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఆంటిగ్వా మరియు బార్బుడా ఫాల్కన్స్ కేవలం 128 రన్స్‌కే కుప్పకూలింది.
గయానా బౌలర్లలో అతడితో పాటు డ్వేన్ ప్రిటోరియస్, షెఫెర్డ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఆంటిగ్వా బ్యాటర్లలో కరీమా గోర్ 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
హెట్‌మైర్, హోప్ విధ్వంసం..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గయానా వికెట్ కీపర్ బ్యాటర్ షాయ్ హోప్(54 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 82),హెట్‌మైర్(26 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 65), షెఫెర్డ్(8 బంతుల్లో 25) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు.
ఆంటిగ్వా బౌలర్లలో వసీం, జైడన్ సీల్స్, మెకాయ్ తలా వికెట్ సాధించారు. మిగితా బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఐదు వికెట్లతో సత్తాచాటిన తహిర్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.