ఉత్కంఠ పోరు.. ఆఖ‌రి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన హెట్‌మైర్‌ | Shimron Hetmyer Hits Last-Ball Six to Secure Thrilling Win for Seattle Orcas | Sakshi
Sakshi News home page

MLC 2025: ఉత్కంఠ పోరు.. ఆఖ‌రి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన హెట్‌మైర్‌

Jun 28 2025 10:51 AM | Updated on Jun 28 2025 1:21 PM

Shimron Hetmyer Hits Last-Ball Six to Secure Thrilling Win for Seattle Orcas

మేజ‌ర్ లీగ్ క్రికెట్ టోర్నీ-2025లో వ‌రుస‌గా రెండో మ్యాచ్ అభిమానుల‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్టింది. ఈ టోర్నీలో భాగంగా శ‌నివారం సియాటిల్ ఓర్కాస్, ఎంఐ న్యూయ‌ర్క్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ సస్పెన్ష్ థ్రిల్ల‌ర్‌ను త‌ల‌పించింది. ఆఖ‌రి ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన పోరులో 3 వికెట్ల తేడాతో సియాటిల్ ఓర్కాస్ విజ‌యం సాధించింది.

క‌రేబియ‌న్ ఆట‌గాడు షిమ్రాన్ హెట్‌మైర్ ఆఖ‌రి బంతికి సిక్స్ కొట్టి సియాటిల్‌ను గెలిపించాడు. చివ‌రి ఓవ‌ర్‌లో ఓర్కాస్ విజ‌యానికి 9 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. ఈ స‌మ‌యంలో క్రీజులో హెట్‌మైర్‌తో పాటు జస్దీప్ సింగ్ ఉన్నాడు. ఆఖ‌రి ఓవ‌ర్ వేసే బాధ్య‌త‌ను కిరాన్ పొలార్డ్‌కు న్యూయ‌ర్క్ కెప్టెన్ పూర‌న్ అప్ప‌గించాడు.

తొలి రెండు బంతుల్లో స్ట్రైక్‌లో ఉన్న జస్దీప్ సింగ్ ఒక్క ప‌రుగు కూడా తీయ‌లేక‌పోయాడు. జస్దీప్ మూడో బంతికి సింగిల్ తీసి హెట్‌మైర్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. నాలుగో బంతి డాట్  కాగా.. ఐదో బంతికి రెండు ప‌రుగులు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో చివ‌రి బంతికి 6 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి.

స్ట్రైక్‌లో ఉన్న హెట్‌మైర్ ఫైన్ లెగ్ దిశ‌గా భారీ సిక్స‌ర్ బాది త‌న జ‌ట్టుకు అద్బుత‌మైన విజ‌యాన్ని అందించాడు. హెట్‌మైర్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌ల‌తో 97 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఫ‌లితంగా 238 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సియాటిల్ ఓర్కాస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి చేధించింది.

త‌ద్వారా మేజ‌ర్ లీగ్ క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ల‌క్ష్యాన్ని చేధించిన జ‌ట్టుగా సియాటిల్ ఓర్కాస్ రికార్డులెక్కింది. ఇంత‌కుముందు ఈ రికార్డు ఎంఐ న్యూయ‌ర్క్ పేరిట ఉండేది. ఈ ఏడాది సీజ‌న్‌లోనే వాషింగ్ట‌న్ ఫ్రీడ‌మ్‌పై న్యూయ‌ర్క్ 223 ప‌రుగుల టార్గెట్‌ను చేజ్ చేసింది. తాజా మ్యాచ్‌తో ఎంఐ రికార్డును సియోట‌ల్ బ్రేక్ చేసింది. ఈ ఏడాది సీజ‌న్‌లో ఓర్కాస్‌కు ఇదే తొలి విజ‌యం కావ‌డం గ‌మ‌నార్హం.

పూర‌న్ సెంచ‌రీ వృథా..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయర్క్‌ నిర్ణీత 4 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఎంఐ కెప్టెన్ నికోల‌స్ పూర‌న్ అద్బుత సెంచరీతో చెలరేగాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు తాజిందర్ ధిల్లాన్ 35 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 పరుగులు చేసి ఔటయ్యాడు. సియోటల్‌ బౌలర్లలో కైల్‌ మైర్స్‌, గెరాల్డ్‌ కోయిట్జీ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: MLC 2025: వ‌రుసగా ఐదు ఓట‌ములు.. కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న స‌న్‌రైజ‌ర్స్ స్టార్‌



 

 

Advertisement
 
Advertisement
Advertisement