40 బంతుల్లోనే శ‌త‌కం.. విండీస్ హిట్ట‌ర్ ప్ర‌పంచ రికార్డు | Hetmyer-40-Balls-100-Runs-World Record-Joint-Fastest-Ton-CPL-History | Sakshi
Sakshi News home page

40 బంతుల్లోనే శ‌త‌కం.. విండీస్ హిట్ట‌ర్ ప్ర‌పంచ రికార్డు

Sep 1 2026 7:51 PM | Updated on Sep 1 2026 8:11 PM

Hetmyer-40-Balls-100-Runs-World Record-Joint-Fastest-Ton-CPL-History

Photo Credit: CPL Twitter

వెస్టిండీస్ హార్డ్ హిట్ట‌ర్ షిమ్రోన్ హెట్‌మైర్ క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (సీపీఎల్ 2026)లో ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాడు. సీపీఎల్‌లో గ‌యానా అమెజాన్ వారియ‌ర్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హెట్‌మైర్ ట్రిన్‌బాగో నైట్‌రైడ‌ర్స్‌పై 40 బంతుల్లోనే విధ్వంస‌కర సెంచ‌రీ బాదాడు. 43 బంతుల్లో 111 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచిన హెట్‌మైర్ ఖాతాలో 8 ఫోర్లు, 9 సిక్స‌ర్లు ఉన్నాయి. 

40 బంతుల్లోనే శ‌త‌కం మార్క్ అందుకున్న హెట్‌మైర్ సీపీఎల్ చ‌రిత్ర‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ సాధించిన మూడో ఆట‌గాడిగా రికార్డులకెక్కాడు. గ‌తంలో ఆండ్రీ ర‌సెల్ (40 బంతుల్లో), టిమ్ సీఫెర్ట్ (40 బంతుల్లో) ఈ ఫీట్ సాధించ‌గా.. తాజాగా హెట్‌మైర్ కూడా 40 బంతుల్లోనే సెంచ‌రీ సాధించి వారితో క‌లిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు.


Photo Credit: CPL Twitter

షెయ్ హోప్ 41 బంతుల్లో సెంచ‌రీ మార్క్ అందుకొని రెండో స్థానంలో ఉండ‌గా, 42 బంతుల్లో శ‌త‌కం సాధించిన ర‌సెల్ మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇక హెట్‌మైర్ సాధించిన 111 ప‌రుగుల్లో 86 ర‌న్స్ బౌండ‌రీలు, సిక్స‌ర్ల రూపంలోనే రావ‌డం విశేషం. మ్యాచ్ విష‌యానికొస్తే వ‌ర్షం అంత‌రాయంతో 16 ఓవ‌ర్ల‌కు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ‌యానా వారియ‌ర్స్ 5 వికెట్ల న‌ష్టానికి 185 ప‌రుగులు చేసింది. 

హెట్‌మైర్ (111 నాటౌట్‌)తో పాటు షెప‌ర్డ్ (7 బంతుల్లో 22 నాటౌట్‌) విధ్వంసం సృష్టించాడు. నైట్‌రైడ‌ర్స్ బౌల‌ర్ల‌లో ఉస్మాన్ తారిఖ్‌, అకిల్ హొసెన్‌, సునీల్ న‌రైన్‌, లాహిరు కుమారాలు త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. అనంత‌రం ట్రిన్‌బాగో నైట్‌రైడ‌ర్స్ చివ‌రి దాకా పోరాడిన‌ప్ప‌టికీ 16 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 172 ప‌రుగులకు ప‌రిమిత‌మై 9 ర‌న్స్‌తో ఓట‌మి చ‌వి చూసింది. అలెక్స్ హేల్స్ (55), కెప్టెన్ నికోల‌స్ పూర‌న్ (43) రాణించారు. గ‌యానా బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ న‌బీ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో విఫలం
ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన హెట్‌మైర్ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాడు. ఏడు ఇన్నింగ్స్‌లు క‌లిపి కేవ‌లం 78 ప‌రుగులే సాధించిన హెట్‌మైర్ అత్య‌ధిక స్కోరు 22గా ఉంది. ఆ త‌ర్వాత మేజ‌ర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) టోర్నీలోనూ హెట్‌మైర్ వైఫ‌ల్యం కొన‌సాగింది. 

10 ఇన్నింగ్స్‌ల్లో 164 ప‌రుగులు చేసిన హెట్‌మైర్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే (33 బంతుల్లో 79 ప‌రుగులు) ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత శ్రీలంక‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో పర్వాలేద‌నిపించాడు. మూడు మ్యాచ్‌లు కలిపి 85 ప‌రుగులు సాధించాడు. అయితే సీపీఎల్‌లో మాత్రం హెట్‌మైర్ త‌న పూర్వ ఫామ్‌ను అందుకున్నాడు. ప్ర‌స్తుతం నాలుగు మ్యాచ్‌ల్లోనే 248 స్ట్రైక్‌రేట్‌తో 186 ప‌రుగులు సాధించాడు. 

చదవండి: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా తిలక్‌ వర్మ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement