షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌.. ప్లే ఆఫ్స్‌ దిశగా? | MLC 2025: Shimron Hetmyer Shines Seattle Orcas Hat Trick Wins | Sakshi
Sakshi News home page

షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌.. ప్లే ఆఫ్స్‌ దిశగా?

Jul 2 2025 12:22 PM | Updated on Jul 2 2025 12:32 PM

MLC 2025: Shimron Hetmyer Shines Seattle Orcas Hat Trick Wins

PC: Seattle Orcas X

సీటెల్‌ ఒర్కాస్‌ స్టార్‌ క్రికెటర్‌ షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ (Shimron Hetmyer) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. శాన్‌ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత అర్ధ శతకంతో చెలరేగాడు. కేవలం 37 బంతుల్లోనే 78 పరుగులు సాధించిన ఈ విధ్వంసకర బ్యాటర్‌.. ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. సీటెల్‌కు వరుసగా ఇది మూడో విజయం కావడం మరో విశేషం.

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌-2025 (MLC)లో భాగంగా బుధవారం ఉదయం సీటెల్‌ ఒర్కాస్‌ శాన్‌ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌తో తలపడింది. ఫ్లోరిడా వేదికగా టాస్‌ గెలిచిన సీటెల్‌ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. యూనికార్న్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

శాన్‌ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌ బ్యాటర్లలో ఫిన్‌ అలెన్‌ (23), జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌ (35)లతో పాటు సంజయ్‌ కృష్ణమూర్తి (41), టిమ్‌ సీఫర్ట్‌ (31) మాత్రమే రాణించారు. ఆఖర్లో రొమారియో షెఫర్డ్‌ (3 బంతుల్లో 13 నాటౌట్‌) మెరుపులు మెరిపించాడు.

మరో మూడు బంతులు మిగిలి ఉండగానే..
ఇక సీటెల్‌ ఒర్కాస్‌ బౌలర్లలో అయాన్‌ దేశాయ్‌ రెండు, హర్మీత్‌ సింగ్‌, వకార్‌ సలామ్‌ఖీల్‌, కెప్టెన్‌ సికందర్‌ రజా ఒక్కో వికెట్‌ పడగొట్టారు. కాగా శాన్‌ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌ విధించిన లక్ష్యాన్ని సీటెల్‌ 19.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్‌ షయాన్‌ జహంగీర్‌ (36) ఫర్వాలేదనిపించగా.. షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు.

నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లు
ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ విండీస్‌ ప్లేయర్‌ 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 78 పరుగులతో అజేయంగా నిలిచాడు. షిమ్రన్‌ మెరుపు అర్ధ శతకం కారణంగా సీటెల్‌ ఒర్కాస్‌ 19.3 ఓవర్లలో కేవలం ఆరు వికెట్లు మాత్రమే నష్టపోయి 169 పరుగులు సాధించింది. శాన్‌ ఫ్రాన్సిస్కోపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి.. ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవం చేసుకుంది.

ప్లే  ఆఫ్స్‌ దిశగా 
కాగా అమెరికాలో జూన్‌ 12న మొదలైన మేజర్‌ లీగ్‌ క్రికెట్‌-2025 సీజన్‌.. జూలై 13న ఫైనల్‌తో ముగియనుంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టీ20 లీగ్‌లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారయ్యాయి. శాన్‌ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌ ఎనిమిదింట ఆరు, వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ ఏడింట ఆరు, టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ ఏడింట ఐదు గెలిచి టాప్‌-4లో అడుగుపెట్టాయి. 

ఇక నాలుగో స్థానం కోసం సీటెల్‌ ఒర్కాస్‌, ఎంఐ న్యూయార్క్‌, లాస్‌ ఏంజెల్స్‌ నైట్‌ రైడర్స్‌ బరిలో ఉన్నాయి. అయితే, వీటిలో సీటెల్‌ ఒర్కాస్‌ ఎనిమిదింట మూడు గెలిచి ప్లే ఆఫ్స్‌ రేసులో ముందుంది. న్యూయార్క్‌, లాస్‌ ఏంజెల్స్‌ జట్లు ఏడింట ఒక్కటి మాత్రమే గెలిచి పూర్తిగా వెనుకబడ్డాయి. 

చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్‌.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement