
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్ విజేతగా ముంబై ఇండియన్స్ న్యూయార్క్ అవతరించింది. డల్లాస్ వేదికగా ఇవాళ (జులై 14) జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ వాషింగ్టన్ ఫ్రీడంను 5 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఎంఎల్‌సీలో ఎంఐకు ఇది రెండో టైటిల్. 2023 సీజన్‌లో ఈ జట్టు తొలిసారి టైటిల్ చేజిక్కించుకుంది. ఓవరాల్‌గా పొట్టి క్రికెట్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలకు ఇది 13వ టైటిల్.
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు సాధించిన టీ20 టైటిళ్లు..
MI CLT20 2011 విజేత
MI IPL 2013 విజేత
MI CLT20 2013ని గెలుచుకుంది
MI IPL 2015ను గెలుచుకుంది
MI IPL 2017ను గెలుచుకుంది
MI IPL 2019 గెలిచుకుంది
MI IPL 2020ని గెలుచుకుంది
MI WPL 2023ని గెలుచుకుంది
MINY 2023లో MLC గెలుచుకుంది
MIE ILT20 2024 గెలుచుకుంది
MICT SA20 2025 గెలుచుకుంది
MI WPL 2025ని గెలుచుకుంది
MINY MLC 2025 గెలుచుకుంది
ఈ సీజన్‌లో ఎంఐ న్యూయార్క్ నికోలస్ పూరన్ నేతృత్వంలో బరిలోకి దిగింది. పూరన్ ఎంఐ ఫ్రాంచైజీల తరఫున మూడో టైటిల్ సాధించాడు. ఎంఐ ఫ్రాంచైజీలకు అత్యధిక టైటిళ్లు అందించిన ఘనత రోహిత్ శర్మకు దక్కుతుంది. రోహిత్ ముంబై ఇండియన్స్‌కు 6 టైటిళ్లు అందించాడు. హర్మన్‌ప్రీత్ కౌర్ 2, రషీద్ ఖాన్, హర్భజన్ సింగ్ ఎంఐ ఫ్రాంచైజీలకు తలో టైటిల్ అందించారు.
ఈ సీజన్‌లో వెటరన్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ ఎంఐ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. పోలార్డ్‌కు ఆటగాడిగా ఇది 17వ టీ20 టైటిల్. ప్రపంచ క్రికెట్‌లో పోలార్డ్, డ్వేన్ బ్రావో మాత్రమే ఆటగాళ్లుగా 17 టైటిళ్లు సాధించారు.
కాగా, ఈ సీజన్‌లో ఎంఐ అనూహ్య రీతిలో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి, చివరికి టైటిల్‌నే సొంతం చేసుకుంది. అదృష్టం కొద్ది ప్లే ఆఫ్స్‌కు చేరిన ఎంఐ.. వరుసగా ఎలిమినేటర్, ఛాలెంజర్, ఫైనల్లో విజయాలు సాధించి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ ఏడాది ఎంఐ ఫ్రాంచైజీలకు ఇది మూడో టీ20 టైటిల్. ఈ యేడు ఎంఐ సౌతాఫ్రికా టీ20 లీగ్, మహిళల ఐపీఎల్, తాజాగా మేజర్ లీగ్ క్రికెట్ టైటిళ్లను సాధించింది.
ఫైనల్ విషయానికొస్తే.. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. డికాక్ (77) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటి ఎంఐకి గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఎంఐ ఇన్నింగ్స్‌లో మొనాంక్ పటేల్ 28, తజిందర్ డిల్లాన్ 14, పూరన్ 21, పోలార్డ్ 0, బ్రేస్‌వెల్ 4, కన్వర్‌జీత్ సింగ్ 22 (నాటౌట్), ట్రిస్టన్ లస్ 2, బౌల్ట్ 1 (నాటౌట్) పరుగులు చేశాడు. వాషింగ్టన్ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ 3, నేత్రావల్కర్, మ్యాక్స్‌వెల్, జాక్ ఎడ్వర్డ్స్, హోలాండ్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన వాషింగ్టన్ చివరి వరకు గెలుపు కోసం పోరాడింది. రచిన్ రవీంద్ర (70), గ్లెన్ ఫిలిప్స్ (48 నాటౌట్), జాక్ ఎడ్వర్డ్స్ (33) వాషింగ్టన్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. చివరి ఓవర్‌లో వాషింగ్టన్ గెలుపుకు 12 పరుగులు అవసరం కాగా.. 22 ఏళ్ల కుర్ర పేసర్ రుషి ఉగార్కర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
మ్యాక్స్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి విధ్వంసకర బ్యాటర్లను సైలెంట్ చేసి ఎంఐకి అద్భుత విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో ఉగార్కర్ మ్యాక్స్‌వెల్‌ను (15) ఔట్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫలితంగా ఎంఐ రెండోసారి ఛాంపియన్‌షిప్‌ను చేజిక్కించుకుంది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో మిచెల్ ఓవెన్, ఆండ్రియస్ గౌస్ డకౌటై నిరాశపరిచారు. ఎంఐ బౌలర్లలో బౌల్ట్, ఉగార్కర్ తలో 2 వికెట్లు తీయగా.. కెంజిగే ఓ వికెట్ దక్కించుకున్నాడు.