
రాకపోకలకు ప్రజల అవస్థలు
పాదయాత్ర మార్గాన్ని పరదాలతో మూసేసిన వైనం
పెద్దాపురం: సీఎం చంద్రబాబు నాయుడు పెద్దాపురం పర్యటన శనివారం కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ, పరదాలమాటున సాగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా ర్యాలీకి చంద్రబాబు హాజరయ్యారు. ర్యాలీ అనంతరం అక్కడి డ్రెయిన్లను సీఎం పరిశీలించారు. వాటి నిర్మాణం, ఉపయోగం గురించి పారిశుధ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఆంజనేయ స్వామి విగ్రహం సెంటర్ సమీపంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప అధ్యక్షతన నిర్వహించిన ప్రజా వేదికలో ప్రసంగించారు.
పరదాల మాటున..
చంద్రబాబు ఆద్యంతం పరదాల మాటున పర్యటన నిర్వహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామర్లకోట, పెద్దాపురం వెళ్లే రోడ్లను మూసి వేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వేల మంది పోలీసులతో రోడ్లను దిగ్బంధించడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు గ్రామాలకూ రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కువగా మఫ్టీలో పోలీసులు పహారా కాయడం విశేషం.
చంద్రబాబు పాదయాత్ర చేసిన 100 మీటర్ల దూరం అంతా రెండు వైపులా ఫ్లెక్సీలతో మూసి వేశారు. సభ ముగిసిన తర్వాత టీడీపీ కార్యకర్తల సమావేశానికి చంద్రబాబు వెళ్లే వరకు సుమారు 45 నిమిషాల పాటు సభా ప్రాంగణం నుంచి జనాన్ని బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. దీంతో సభకు వచ్చిన జనం అక్కడే ఉండిపోయారు.