ఈ తెరం.. బానిసై..
కాకినాడ క్రైం: అప్పుడే రెక్కలు విచ్చుకున్న సీతాకోక చిలుకల్లా.. ఆటపాటల్లో ఆనందంగా గడవాల్సిన బాల్యం ‘తెర’ చాటున మగ్గిపోతోంది. పుట్టినప్పుడు.. పెరుగుతున్నప్పుడు.. చదువుకోవడానికి, పరీక్షలకు సిద్ధమవడానికి.. ఆనందానికి, ఆటవిడుపునకు.. వ్యాయామానికి.. ఏం తినాలి, ఏది తినకూడదు.. ఎలా బతకాలి.. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చెప్పేందుకు.. ఆరోగ్య చిట్కాలకు, అనారోగ్యం వస్తే చికిత్సకు.. చివరకు ప్రాణం పోయినప్పుడు.. ఇలా అన్నింటికీ ‘తెర’ చూపులే గతి అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. మొబైల్ ఫోన్ వంటి గ్యాడ్జెట్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో నేటి తరం ‘స్క్రీన్ టైమ్’ కాటుకు బలైపోతోంది. ఈ ‘తెర’చాటు జీవనానికి బాల్యం నుంచే బీజం పడుతోంది. డిజిటలైజేషన్ పేరుతో మారుతున్న లోకం పోకడ దీనికి ప్రధాన కారణమైతే, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం కూడా బాల్యానికి శాపంగా పరిణమిస్తోంది. ఫలితంగా స్క్రీన్ టైమ్‌పై నియంత్రణ లేక పిల్లల్లో ఎన్నో మానసిక, శారీరక అనర్థాలు వేళ్లూనుకుంటున్నాయి.
ఎన్నో అనర్థాలు
● స్క్రీన్ టైమ్ పెరగడంతో పిల్లల్లో మానసికంగా తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఎదురవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
● ముఖ్యంగా ఏకాగ్రత లోపించి, జ్ఞాపకశక్తి తగ్గుతోంది. కోపం, చిరాకు, ఆత్రుత పెరుగుతున్నాయి.
● ఆందోళన, డిప్రెషన్, స్క్రీన్ అడిక్షన్ డిజార్డర్, అసహనం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
● స్క్రీన్‌కు బానిసలవుతూండటంతో జీవన శైలిలో మార్పులు సంభవించి, చిన్న వయసులోనే స్థూలకాయం, మధుమేహం, రక్తపోటు వంటి వాటి బారిన పడుతున్నారు.
● విపరీతంగా మాట్లాడే సమస్య ఎక్కువవుతోందని చంటిపిల్లల వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
● త్వరగా మాటలు రాకపోవడం (స్పీచ్ డిలే), సామాజిక నైపుణ్యాలు, భావ వ్యక్తీకరణ లోపాల వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
● తప్పుడు శరీర భంగిమల వల్ల మెడ, వెన్ను, భుజాల నొప్పులు తలెత్తుతున్నాయని జీజీహెచ్ ఆర్థోపెడిక్ నిపుణులు చెబుతున్నారు.
● చిన్న వయసులో నిద్ర లేమి సమస్యలు, డిజిటల్ ఐ స్ట్రెయిన్, డ్రై ఐ సిండ్రోమ్, కళ్ల ఎర్రదనం, నీరు కారడం, మయోపియా (దూర వస్తువులు స్పష్టంగా కనిపించకపోవడం) వంటి ఆరోగ్య సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.
129 మంది బాధిత బాలలు
గ్యాడ్జెట్లకు బానిసలు కావడం వల్ల స్క్రీన్ టైమ్ పెరిగి, గడచిన మూడు నెలల్లో జిల్లావ్యాప్తంగా 129 మంది 18 ఏళ్లలోపు బాలలు ‘డిజిటల్ ఐ స్ట్రెయిన్’ బారిన పడ్డారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అలాగే, స్క్రీన్ టైమ్ పెరగడం వలన వచ్చిన కంటి సమస్యలతో అక్టోబర్‌లో 81 మంది, నవంబర్‌లో 67 మంది, గత నెలలో 90 మంది కలిపి మొత్తం 248 మంది చిన్నారులు కాకినాడ జీజీహెచ్ సహా పలు ప్రైవేటు కంటి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మంది సంపన్నుల పిల్లలు కావడం గమనార్హం. ఇలా చేరుతున్న వారి సంఖ్య నానాటికీ అధికమవుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలివీ..
మితిమీరిన స్క్రీన్ టైం ఎంతటి ప్రమాదకరమో గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆ వినియోగాన్ని పూర్తిగా తగ్గించలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో స్క్రీన్ వినియోగంపై పరిమితులు విధిస్తూ మార్గదర్శకాలు నిర్దేశించింది.
● రెండేళ్ల లోపు వయసు బాలలకు స్క్రీన్ టైమ్ పూర్తిగా నిషేధం. ఈ వయసు పిల్లలకు వీడియో కాల్స్ అలవాటు చేయడం వల్ల భవిష్యత్తులో గాడ్జెట్లకు బానిసయ్యేందుకు బీజం పడుతుంది.
● రెండు నుంచి ఐదేళ్ల మధ్య రోజుకు గరిష్టంగా గంట మాత్రమే స్క్రీన్ టైమ్‌కు అనుమతి. విద్యాపరమైన అంశాలు, వీడియో కాల్స్, కార్టూన్ల వంటి వాటిని మాత్రమే అనుమతించాలి.
● ఆరు నుంచి పదేళ్ల మధ్య వయసు బాలలకు ప్రతి రోజూ ఒకటి రెండు గంటలు మాత్రమే గాడ్జెట్ల వినియోగానికి అనుమతించవచ్చు. ఇందులో చదువు, విజ్ఞాన అంశాలు మాత్రమే ఉండాలి. హింసాత్మక గేమ్స్, రీల్స్ నిషేధించాలి.
● 11 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు బాలలను గరిష్టంగా రెండు గంటల పాటు మాత్రమే స్క్రీన్ టైమ్‌కు అనుమతించాలి. సామాజిక మాధ్యమాలు, అశ్లీల కంటెంట్‌పై మొగ్గు చూపే వయసు, కాబట్టి సోషల్ మీడియా వినియోగంపై తల్లిదండ్రుల నిఘా అవసరం.
● సోషల్ మీడియాలో కొత్త పరిచయాలు, లైంగిక చర్యలపై మొగ్గు మొదలయ్యేది 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు. వీరిని గరిష్టంగా రెండు మూడు గంటలు మాత్రమే స్క్రీన్ టైమ్‌కు అనుమతించాలి. చదువుకు సంబంధించిన అంశాలకు ఇందులో మినహాయింపు. చదువు, వినోదం మధ్య సమతుల్యత అవసరం.
తింటూ టీవీ చూడనివ్వొద్దు
స్క్రీన్ టైమ్ ఎక్కువయితే పిల్లల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మొబైల్ ఇవ్వకపోతే క్రూరంగా ప్రవర్తించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తింటూ టీవీ సహా ఎటువంటి గాడ్జెట్లూ చూడనివ్వొద్దు. ఈ విధానం స్థూలకాయం సహా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. తీవ్ర కోపం, కళ్ల నొప్పి, ఏకాగ్రత లోపం, రాత్రి వేళల్లో నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలు గమనిస్తే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. నిద్ర పోవడానికి గంట ముందు గ్యాడ్జెట్లను తల్లిదండ్రులు అనుమతించవద్దు. స్క్రీన్ టైమ్‌పై డబ్ల్యూహెచ్‌ఓ మార్గనిర్దేశాలను అనుసరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
– మాచవరం వెంకటేశ్వర్లు,
చంటి పిల్లల వైద్య నిపుణుడు, జీజీహెచ్, కాకినాడ
బుజ్జగించే సహనం లేక
పిల్లల్ని బుజ్జగించే సహనం లేక, ఆటలు ఆడించేందుకు సమయం కేటాయించక చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల చేతికి మొబైల్ ఇచ్చి, గాడ్జెట్లకు బానిసలుగా మారుస్తూండటం ఆందోళన కలిగిస్తోంది. భవితను నిర్మించే ఆశాసౌధాలు పిల్లలు. కుటుంబానికే కాదు, సమాజాన్ని కూడా ముందుండి నడిపించే భవిష్యత్ తరాలు. వారిని అన్ని అంశాల్లోనూ దృఢంగా తీర్చిదిద్దాలి. అల్లరి వారి సహజ గుణం. ఆ మాత్రానికే మొబైల్ ఇచ్చి, చేతులు దులుపుకొంటే వారి ఆరోగ్యం, భవితపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. స్కూల్‌కు వచ్చి నిద్ర పోతున్న ఎందరో పిల్లల్ని చూస్తూంటాం. ఎందుకని ప్రశ్నిస్తే రాత్రి టీవీనో, ఫోనో చూస్తూండటంతో నిద్రపోవడం ఆలస్యమైందని చెబుతూంటారు. అటువంటి పిల్లల్లో చదువుతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడంపై నిరాసక్తత ఏర్పడుతుంది.
– జయంతి శిరీష, ఉపాధ్యాయిని, రాయుడుపాలెం, కాకినాడ
స్క్రీన్‌కు బానిసై, కంటి
సమస్యలతో బాధ
పడుతున్న బాలుడి
కళ్లను పరీక్షిస్తున్న
జీజీహెచ్ వైద్యుడు
భారీగా గ్యాడ్జెట్ల వినియోగం
నానాటికీ రెట్టింపవుతున్న స్క్రీన్ టైమ్
పిల్లల్లో అధికమవుతున్న మానసిక, ఆరోగ్య సమస్యలు
కొరవడుతున్న తల్లిదండ్రుల పర్యవేక్షణ
ఈ తెరం.. బానిసై..
ఈ తెరం.. బానిసై..
ఈ తెరం.. బానిసై..


