కోడిపందేలపై నిషేధం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): హైకోర్టు ఆదేశాల మేరకు సంక్రాంతి సందర్భంగా జిల్లాలో కోడిపందేలను పూర్తిగా నిషేధించినట్లు ఇన్‌చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోడిపందాలు చట్టవిరుద్ధమని, దీనిని ఉల్లంఘించడం జంతు క్రూరత్వ నిరోధక చట్టం–1960, ఏపీ గేమింగ్ చట్టం–1974 వంటి వాటి ప్రకారం శిక్షార్హమని పేర్కొన్నారు. కోడిపందేలను పూర్తిగా అడ్డుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. సంప్రదాయం, ఆచారం, స్థానిక ఒత్తిడి తదితర కారణాలతో పందేల నిర్వహణకు ఎటువంటి మినహాయింపులూ ఉండవని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ, వ్యక్తిగత స్థలాలు, తోటలతో పాటు ఎక్కడా పందేలకు అనుమతి ఇవ్వబోమని తెలిపారు. కోడిపందేలు నిర్వహించే వారు, పాల్గొనే వారు, ప్రోత్సహించే వారు, భూ యజమానులు, పందెం వేసేవారు, మద్యం విక్రేతలు.. ఇలా అందరూ శిక్షార్హులవుతారని హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో అధికారుల బృందాలు తనిఖీలు చేస్తున్నాయని, కోడిపందేల నిర్వహణపై ఎటువంటి సమాచారం అందినా తక్షణ చర్యలు తీసుకుంటామని అపూర్వ భరత్ తెలిపారు.
సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ల
నియామకం
కాకినాడ లీగల్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ కోర్టుల్లో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిక్కాల ఎస్‌వీవీఎస్‌ఎన్ శేషారావు (కాకినాడ–1), ఇంటి సర్వారాయుడు (కాకినాడ–2), చింత నాగేంద్రరావు (కాకినాడ–3), బి.విజయ భారతి (పిఠాపురం), కె.శారదమణి (ప్రత్తిపాడు), సీహెచ్ కృష్ణారావు (తుని) నియమితులయ్యారు.


