కోల్‌కతాలో ఏమి దాచావు?
సాక్షి ప్రతినిధి కాకినాడ: మీరు కూడబెట్టిన అక్రమ సంపాదనను దాచిపెట్టేందుకే ఇటీవల కోల్‌కతా వెళ్లి వచ్చారా? అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడును ప్రశ్నించారు. చంద్రబాబు, తనయుడు లోకేష్ సహా నాయకులు తరచూ వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల్లో పర్యటనలు సాగిస్తున్నారంటే అదంతా దోచుకున్న సొమ్మును అక్కడ దాచుకోవడానికి, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి వెళ్తున్నారా? అని నిలదీశారు. కాకినాడలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఏడాదిన్నర చంద్రబాబు పాలనలో మంత్రులు, ఆ పార్టీ నేతలు మట్టి, ఇసుక, గ్రావెల్ దోపిడితోపాటు పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కూడా అడ్డంగా అమ్ముకుని రూ.కోట్లు వెనకేసుకుంటున్నారని అన్నారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా నిలిచే పార్టీ తెలుగుదేశం అన్నారు. సీనియర్ నాయకుడైన యనమల ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేయడం తగునా అన్నారు.
చంద్రబాబు రుణ సృష్టికర్త
18 నెలల్లో రూ.2.66 లక్షల కోట్ల అప్పు చేసి సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని రాజా విమర్శించారు. ఇది వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో 80 శాతమని, సంపద సృష్టి అంటే ఇదేనా? అని నిలదీశారు. చంద్రబాబు సంపద సృష్టికర్త కాదని రుణ సృష్టికర్త అన్నారు. నాడు వైఎస్ జగన్ పాలనలో అప్పులపై అడ్డగోలు ఆరోపణలు చేస్తూ.. రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ గోబెల్స్ ప్రచారం చేశారని.. ఇప్పుడు చంద్రబాబు పాలనలో సగటున రోజుకు రూ.500 కోట్లు అప్పు చేస్తుంటే.. రాష్ట్రం దివాళా తీస్తున్న విషయం ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమలకు కనిపించడం లేదా అని రాజా ప్రశ్నించారు. ఎకై ్సజ్ బాండ్లతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.5,490 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం... భవిష్యత్తు ఎకై ్సజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏపీబీసీఎల్ ద్వారా అప్పు చేస్తే... గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు, కోర్టులో కేసులు వేశారని, కేంద్రానికి ఫిర్యాదులు చేశారని.. నాడు తప్పైంది మీ హయాంలో ఒప్పు అయ్యిందా అని ప్రశ్నించారు. రోడ్ల మీద గోతులు పూడ్చలేని అసమర్థ ప్రభుత్వం.. గ్రోత్ ఇంజిన్లు, కారిడార్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వ ప్రచార కథలను ప్రజలు విశ్వసించే రోజులు పోయాయని చెప్పారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం అప్పులు చేస్తే.. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలోకి కూరుకుపోతుంది, భవిష్యత్తు నాశనం అయిపోతుందని గగ్గోలు పెడుతూ, గోబెల్స్ తరహాలో ప్రచారం చేశారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ... ఎకనమిస్టుల పేరుతో ఎవరెవరినో తీసుకొచ్చి తన అనుకూల మీడియా ద్వారా విపరీతమైన దుష్ప్రచారం చేయించారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.లక్షలాది కోట్లు అప్పు చేసినట్లు, రాష్ట్రాన్ని ముంచేసినట్లు ప్రచారం చేశారన్నారు. ఇవాళ చంద్రబాబు అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయ్యేసరికి రూ.2,66,175 కోట్లు అప్పు చేశారు. సగటున రోజూ రూ.500 కోట్లు అప్పు చేశారు. ఇది ఆయన సీనియారిటీ, పరిపాలన దక్షత, గొప్పదనమని దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు.
జగన్ బెంగళూరు వెళ్లేది డబ్బు
దాచుకోవడానికి అంటున్నావ్..
నువ్వు ఇతర రాష్ట్రాలకు
వెళుతున్నది అందుకేనా?
యనమల రామకృష్ణుడుపై మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఫైర్


