ఇటువంటి స్థితిలో అసత్యం దోషం కాదు
సమన్వయ సరస్వతి సామవేదం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘ఇంకో పూట ద్రోణుడు యుద్ధం చేస్తే, నీ సైన్యంలో ఒక్కరూ మిగలరు. ఇటువంటి పరిస్థితిలో నీవు అసత్యమాడటం దోషం కాదు.’ అని కృష్ణుడు ధర్మరాజుకు నచ్చచెప్పాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శనివారం హిందూ సమాజంలో ఆయన ద్రోణవధను వివరించారు. ద్రోణుడు విచక్షణా రహితంగా, అస్త్రజ్ఞానం లేనివారిపై సైతం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, పాండవ సైన్యాన్ని సంహరిస్తున్నాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, వశిష్ఠుడు, అత్రి మొదలైన మహర్షులు వచ్చి, ద్రోణునితో క్రూరకర్మను ఆపివేయమని చెప్పారు. భూలోకంలో నీవు జీవించే సమయం పూర్తి అవుతున్నదని హితవు చెప్పారు. ఏదయినా, అప్రియమైన మాట వింటే కాని, ద్రోణుడు యుద్ధం పట్ల విముఖుడు కాడని కృష్ణుడు ధర్మరాజుకు వివరిస్తాడు. కష్టం మీద ధర్మరాజు అంగీకరించి ‘అశ్వత్థామ హతః’ అని బిగ్గరగా, కుంజరః అని నెమ్మదిగా అన్నాడు. అయినా, ద్రోణుడు పోరు ఆపలేదు, ఆ సమయంలో భీముడు వచ్చి, పరధర్మాన్ని ఆశ్రయించి, ఈ క్రూరకర్మ ఎంతకాలం సాగిస్తావు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు నేలకూలాడని ధర్మరాజు చెప్పాడు కదా?, వేద విద్వాంసులు వేదకర్మలను వదిలి, ఇలా క్షత్రియజాతిని నాశనం చేయడం తగునా?’ అని ప్రశ్నించాడు. మరోసారి బ్రహ్మర్షులు ద్రోణునికి కర్తవ్యాన్ని ఉపదేశించారు. ద్రోణుడికి అస్త్రాలు స్ఫురణకు రాలేదు. ద్రోణుడు యోగనిష్ఠుడై, విష్ణుపద ధ్యానంలో యోగమార్గంలో బ్రహ్మలోకానికి చేరాడు. అలా చేరడాన్ని సంజయుడు, కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు, కృపాచార్యుడు మాత్రమే చూడగలిగారు. ఆ స్థితిలో ఉన్న ద్రోణుడి శిరస్సును దృష్టద్యుమ్నుడు ఖండించాడు. విగత జీవుడైన ద్రోణుని శిరస్సునే దృష్టద్యుమ్నుడు ఖండించాడని తిక్కన సోమయాజి, తిరుపతి వేంకట కవులు కూడా వర్ణించారని అన్నారు. అశ్వత్థామ పాండవుల మీద ప్రయోగించిన నారాయణాస్త్రాన్ని కృష్ణుడు విఫలం చేశాడు, అందరినీ ఆయుధాలు వదిలి, వాహనాల నుండి దిగిపొమ్మని కృష్ణుడు ఆదేశించాడు. దానితో ఆ అస్త్రం విఫలమైంది. కర్ణుడు ఎన్నో మార్లు కృష్ణార్జునులు ఎదురయినా, శక్తి ఆయుధాన్ని ఎందుకు ప్రయోగించలేదని ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించాడు. వారు ఎదుట కనపడగానే కృష్ణ పరమాత్మ ప్రభావంతో కర్ణునికి ఆ ఆయుధం స్ఫురణకు రాలేదని సంజయుడు వివరించాడు. కృష్ణుడు జగన్మోహనుడని సామవేదం పేర్కొన్నారు.


