కలితీ.. ఆరోగ్యానికి వెలితి
ఈ ప్రపంచంలో కల్తీ కానివి తల్లిపాలు, కంటి నీళ్లు అంటాడో సినీ కవి! ఇది అక్షర సత్యమనిపించేలా ప్రస్తుత పరిస్థితులు దాపురించాయి. తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి అన్నీ కల్తీ అయిపోయాయ్. మరీ ముఖ్యంగా ఆహార పదార్థాల కల్తీ ఒక సహజమైన ప్రక్రియగా స్థిరపడిపోయింది. అంతా కలికాలం అని సరిపెట్టుకునే ఉదాసీనత అలవాటుగా మారింది. పర్యవసానంగా జనం అనారోగ్యాన్ని ‘కొని’ తెచ్చుకుంటున్నారు. ఈ కల్తీని అరికట్టాల్సిన అధికారులు ‘లెక్క’ ప్రకారం తనిఖీలు చేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు.
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గతంలో ప్రజలు బయట ఆహారాన్ని అసలు కొనుగోలు చేసుకొని తినేవారు కాదు. సంపాదనలో తక్కువ ఖర్చు చేసి ఎక్కువ మొత్తాన్ని దాచుకొనేవారు. ఇది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మంచి లక్షణంగా ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూరిగా మారిపోయాయి. నగరాలు, పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ పార్టీ కల్చర్ వచ్చింది. పుట్టినరోజు, వివాహ మహోత్సవం ఇలా సందర్భం ఏదైనా పార్టీ ఇవ్వడం పరిపాటిగా మారింది. ఇంటి భోజనం కంటే రెస్టారెంట్లకు వెళ్లేందుకు ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తున్నారు. ఖరీదైన ఆహారాన్ని తింటున్నామని భ్రమలో ఉంటున్నారు తప్ప అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నామనే అంశాన్ని తెలుసుకోలేకపోతున్నారు. నిల్వ ఉంచిన , ప్రమాదకర రసాయనాలు కలిపిన ఫుడ్‌ను తింటున్నారు. వీటితో అప్పటికప్పుడు ఎలాంటి నష్టం లేకపోయినా దీర్ఘకాలంలో ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. క్యాన్సర్ రోగుల్లో 50 శాతం మంది కల్తీ ఆహారంతోనే సమస్య కొని తెచ్చుకుంటున్నారని పలు సర్వేలు వెల్లడించడం ప్రమాద తీవ్రత తెలియజేస్తుంది.
అధికారులపై టీడీపీ నాయకుల ఒత్తిడులు
కాకినాడ నగరంలో గత నవంబర్ నెలలో పుడ్ ఇన్‌స్పెక్టర్లు రెండు హోటల్స్‌ను తనిఖీ చేశారు. ఒక హోటల్‌లో గడువు ముగిసిన ఆహార దినుసులను వినియోగించడం గమనించారు. వేరొక హోటల్‌లో జీడిపప్పుకు పురుగు పట్టి ఉన్నా దానిని వినియోగించడం గుర్తించారు. గత ఏడాది మే నెలలో భానుగుడి సెంటర్‌లో ఒక నాన్‌వెజ్ రెస్టారెంట్‌లో తనిఖీలు చేయగా అమ్మగా మిగిలిన చికెన్‌ను ప్రిజ్‌లో దాచి ఉంచడాన్ని గమనించారు. నిబంధనలు మేరకు ఒకసారి వండిన ఆహార పదార్థాలు ప్రిజ్‌లో పెట్టి మళ్లీ వినియోగదారులకు విక్రయించకూడదు. దీంతో అధికారులు విస్తుపోయి వెంటనే ఆయా ఆహార పదార్థాలను మట్టిలో కప్పిపెట్టారు. సంబంధిత హోటల్ యజమానిపై కేసులు నమోదు చేశారు. పిఠాపురంలో జంతువుల కళే బరాలతో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న విషయం మూడు నెలలు క్రితం బయట పడింది. కాకినాడలోని అచ్చుతాపురం రైల్వేగేటు సమీపంలో రసాయనాలు వినియోగించి నకిలీ పాలు తయారు చేస్తున్న విషయం నాలుగు నెలలు క్రితం అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఇలా జిల్లాలో పలు ప్రాంతాల్లో కల్లీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నా అధికారులు మాత్రం నామమాత్రంగానే వారిపై చర్యలు తీసుకొంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు ఎక్కడికై నా తనిఖీకి వెళితే టీడీపీ నాయకులు వారిపై ఒత్తిడి తీసుకొచ్చి కేసులు నయోదు చేయకుండా అడ్డుకొంటున్నారు. తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకొనకుండా టీడీపీ నాయకుల కొమ్ము కాస్తున్న అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు.
అనుమతులు లేకుండానే..
జిల్లాలో అనుమతి తీసుకుని వ్యాపారం చేసే సంస్థలు 25 శాతం కూడా ఉండడం లేదు. కాకినాడ నగరంలో వెయ్యికి పైగా రెస్టారెంట్లు ఉన్నా కేవలం 200లోపు యజమానులు మాత్రమే అనుమతులు పొందారు. పెద్ద రెస్టారెంట్లు, హోటల్స్ మినహా మిగిలిన చోట్ల పరిశుభ్రతను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నాసిరకం ఆహార దినుసులు వినియోగిన్నారు. వండిన పదార్థాలను రోజుల తరబడి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి, ఆపై వేడి చేసి అంటగడుతున్నారు. పట్టణాల్లో మురుగు కాలువలు, చెత్తకుప్పల పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు దర్శనమిస్తున్నా ప్రశ్నించేవారే కరవయ్యారు.
గత ఏడాది కాకినాడలోని ఒక హోటల్‌లో అధికారులు గుర్తించిన తినడానికి పనిచేయని ఆహారం
తనిఖీలు చేస్తున్నాం
జిల్లాలోని హోటల్స్‌లో తనిఖీ చేస్తున్నాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే అక్కడకు వెళ్లి ఆహార పదార్థాలు సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నాం. గత ఏడాది 240 శాంపిల్స్ సేకరించాం. భద్రతా ప్రమాణాలు పాటించని 38 హోటల్స్ యజమానులపై కేసులు నమోదు చేశాం. రూ.2.14 లక్షల అపరాధ రుసుం వసూలు చేశాం. ఎక్కడైనా ఆహార పదార్థాల కల్తీ జరిగితే 77029 99946 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
– జీఏబీ. నందాజీ,
అసిస్టెంట్ పుడ్ కంట్రోలర్, కాకినాడ
సర్వం కల్తీ మయం అయినా
ప్రశ్నించే నాథుడు కరవు
అపరిశుభ్ర వాతావరణంలో
ఆహార పదార్థాల తయారీ
రంగు, రుచికోసం ప్రమాదకర
రసాయనాల వినియోగం
పొంచి ఉన్న రోగాలు
హోటళ్లలో అధికారుల
నామమాత్ర తనిఖీలు
ఫిర్యాదు చేస్తేనే దాడులు
జిల్లాలో గత ఏడాది సేకరించిన
శాంపిల్స్ 240
38 కేసుల నమోదు
నిబంధనలు బేఖాతర్
జిల్లాలో చిన్న, పెద్ద రెస్టారెంట్లు, దాబాలు, చాట్, న్యూడిల్స్ షాపులు దాదాపు ఏడువేలకు పైగానే ఉన్నాయి. కాకినాడ నగరంలోనే సుమారు 1,000కి పైగా చిన్న, పెద్ద హోటల్స్ ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.కోట్లలో వ్యాపారం జరుగుతుంది. వ్యాపారులు జిల్లా ఆహార నియంత్రణశాఖ నుంచి లైసెన్సులు తీసుకొని నిబంధనల మేరకు ఆహారాన్ని తయారు చేయాల్సి ఉంది. ఈ నిబంధన 2006 నుంచి అమల్లో ఉంది. ఆ శాఖ పరిధిలో జిల్లా స్థాయిలో అధికారులతో పాటు ఇద్దరు పుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. వీరు నెలకు 12 శాంపిల్స్ సేకరించాల్సి ఉంది. వాటిని ప్రయోగశాలకు పంపి తేడా ఉంటే కేసులు నమోదు చేయాలి. కల్తీని బట్టి క్రిమినల్ లేదా సివిల్ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలి. అయితే ఇంత పెద్ద జిల్లాలో కేవలం 12 శాంపిల్స్ సేకరిసే్‌త్ మిగిలిన వాటి పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నగా మిగిలింది. అధికారులు కొన్ని హోటల్స్‌లో మాత్రమే శాంపిల్స్ తీసుకోవడాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ఫలితంగా విచ్చలవిడిగా కల్తీ చేస్తున్నారు.
కలితీ.. ఆరోగ్యానికి వెలితి
కలితీ.. ఆరోగ్యానికి వెలితి
కలితీ.. ఆరోగ్యానికి వెలితి


