గుండెపోటుతో కలెక్టరేట్ ఉద్యోగి మృతి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టర్ కార్యాలయంలో సబార్డినేట్‌గా పనిచేస్తున్న బొక్కా పద్మావతి (51) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన ఆమెకు అర్ధరాత్రి గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. స్థానిక ఏపీఎస్పీ సమీపంలో నివసిస్తున్న పద్మావతికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె మృతి పట్ల కలెక్టరేట్ సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
‘ఆ లేఖతో నాకు
సంబంధం లేదు’
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వ్రత పురోహితుల పారితోషికం బిల్లు రూపొందించే వ్రత పురోహితుడు అనేక అవకతవకలకు పాల్పడిన విషయమై విచారణ జరపాలని తాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ) కు ఫిర్యాదు చేసినట్టు వచ్చిన లేఖ తాను రాసింది కాదని వ్రత పురోహితుడు అల్లంరాజు సత్యశ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం వ్రత పురోహిత సంఘం అధ్యక్షుడు ఛామర్తి కన్నబాబు, మాజీ అధ్యక్షుడు నాగాభట్ల రవిశర్మతో కలిసి ఈఓ వీ త్రినాథరావును కలిసి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. అల్లంరాజు శ్రీనివాసశర్మ పేరు మీద ఎవరో ఈ లేఖ సృష్టించి దానిని పత్రికలకు, సీజేఐ, ఇతర ప్రభుత్వ పెద్దలకు పంపించారని తెలిపారు. దానిపై పేరు, సంతకం ఫోన్ నంబర్ కూడా తనది కాదని తెలిపారు.
రత్నగిరిపై భక్తుల రద్దీ
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది
● స్వామివారి వ్రతాలు 2,100 నిర్వహణ
● దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రారంభమవడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో స్వామివారి ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంత మండపాలు అన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారి వ్రతాలాచరించి దర్శనం చేసుకున్నారు. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించినట్టు అధికారులు అంచనా వేశారు. స్వామివారి వ్రతాలు 2,100 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదువేల మంది భక్తులకు సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భోజన సౌకర్యం కలుగచేశారు. కాగా, ఆదివారం ఉదయం పది గంటలకు ఆలయ ప్రాకారంలో టేకు రథంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఊరేగిస్తారు.
దృక్ సిద్ధాంతం మేరకే
పండగల నిర్ణయం
అమలాపురం రూరల్: పండగల తేదీల్లో తేడాలు రాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని బండారులంకకు చెందిన పంచాంగకర్త కాలెపు భీమేశ్వరరావు కోరారు. వివిధ పంచాంగాలలో వేర్వేరు తేదీలలో పండగలను సూచించడమే ఇందుకు కారణమన్నారు. శనివారం ఆయన దీనిపై వివరణ ఇస్తూ ఈ విధమైన నిర్ణయాల్లో తేడా రాకుండా 1956లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ధృక్ పద్ధతి సరైనదని తీర్మానించారని, ఆ తీర్మానాన్ని అనుసరించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
‘జిల్లాను కులమతాల జాఢ్యం
కుదిపేస్తోంది’
కాకినాడ క్రైం: జిల్లాను కులమతాల జాఢ్యం కుదిపేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. డయల్ 100, కంట్రోల్ రూం సహా వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. కులాలు, మతాల పేరుతో నేరస్తులకు అండగా ఉంటూ చట్టపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకునే వారిని ఉపేక్షించవద్దని అన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం విషయంలో కులమతాల పంచాయితీలొద్దని ఎస్పీ బిందుమాధవ్‌కు సూచించారు. ఏఎస్‌పీ దేవరాజ్ మనీష్ పాటిల్, ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాస్, ఎస్‌బి, ఏఆర్ డీఎస్‌పీలు కెవివి.సత్యనారాయణ, బి.శ్రీహరిరావు పాల్గొన్నారు.


