చేతివాటంపై ముగిసిన తనిఖీలు
● త్వరలో ఈఓకు నివేదిక
● పది మంది పురోహితులకు
అధికంగా రూ.15 లక్షల జమ
● వారికి నోటీసులిచ్చే అవకాశం!
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వ్రత విభాగంలో పురోహితుల పారితోషికం బిల్లు పెంచి, ఓ వ్రత పురోహితుడు చేతివాటం చూపి, అవకతవకలకు పాల్పడటంపై వారం రోజులుగా జరుగుతున్న తనిఖీలు ముగింపు దశకు చేరాయి. దీనిపై సంబంధిత అధికారులు ఒకటి రెండు రోజుల్లో అన్నవరం దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావుకు నివేదిక సమర్పించనున్నారు. అవకతవకలకు పాల్పడిన ఆ పురోహితుడు భక్తులకు వ్రతాలు చేయించే విధులు కాకుండా కార్యాలయంలో ఇతర వ్రత పురోహితుల పారితోషికం (జీతాలు) బిల్లులు తయారు చేయడం వంటి పనులు చేసేవాడు. అతడిని నమ్మిన సిబ్బంది, ఆ బిల్లులపై సంతకాలు చేసేవారు. అనంతరం, సంబంధిత చెక్కులపై ఈఓ సంతకాలు చేసేవారు. సరైన పరిశీలన లేకపోవడంతో బిల్లుల తయారీలో అతడు అవకతవకలకు పాల్పడి, రూ.28.54 లక్షల మేర స్వాహా చేసినట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఆ సొమ్మును అతడి నుంచి రికవరీ చేశారు. ఇది జరిగిన మర్నాడే ఆ పురోహితుడు గుండెపోటుతో మరణించాడు. అయితే, అతడు గత పదిహేనేళ్లుగా వ్రత విభాగంలో ఇదే పని చేస్తున్న నేపథ్యంలో గడచిన పదేళ్లుగా ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డాడా అనే అంశంపై తనిఖీలు చేయాలని ఈఓ త్రినాథరావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా సంబంధిత బిల్లులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. అయితే, 2023 నుంచే ఆ పురోహితుడు అవకతవకలకు పాల్పడినట్లు తనిఖీలో వెల్లడైందని సమాచారం. సుమారు రూ.9 లక్షల విలువైన పురోహితుల ఈపీఎఫ్ చెక్కులను కూడా తన అకౌంట్‌లో జమ చేసుకుని వాడుకున్నట్లు ఇప్పటికే తనిఖీలో గుర్తించారు.
అలా మళ్లించారు..
తనకు నమ్మకస్తులైన కొంతమంది పురోహితులకు చెల్లించాల్సిన పారితోషికం కన్నా వారి ఖాతాలకు రూ.15 లక్షలు అధికంగా ఆ వ్రత పురోహితుడు జమ చేయించినట్లు విచారణలో తేలింది. అలా అధికంగా వచ్చిన మొత్తాలను వారు తిరిగి ఆ పురోహితుడికి చెల్లించారని, నిధుల మళ్లింపు ఆవిధంగా జరిగిందని అంటున్నారు. ఈవిధంగా తమకు అధిక మొత్తంలో పారితోషికం జమ అయిన విషయాన్ని ఆ పురోహితులు తమ దృష్టికి తీసుకురాకపోవడం కూడా నేరమేనని అధికారులు భావిస్తున్నారు. ఎక్కువగా వచ్చిన మొత్తాన్ని తిరిగి దేవస్థానానికి జమ చేయాలి తప్ప మరో పురోహితునికి పంపించడమేమిటనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ విషయమై ఆ పురోహితులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
బ్యాంకు రికార్డులతో సరిచూసి..
‘పురోహితుని చేతివాటం’పై తనిఖీలు దాదాపు పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. శని, ఆదివారాల్లో సెలవు కావడంతో బ్యాంక్ రికార్డులతో సరిచూసే వీలు లేకపోయిందని అంటున్నారు. అన్ని వివరాలను సోమ, మంగళవారాల్లో బ్యాంకు రికార్డులతో సరిచూసి, దీనిపై ఈఓకు నివేదిక సమర్పిస్తామని చెప్పారు. ఈ వ్యవహారం ఎంత త్వరగా ముగిసిపోతే అంత మంచిదని దేవస్థానం అధికారులు, వ్రత పురోహితులు భావిస్తున్నారు. ఈ అవకతవకలతో దేవస్థానం ప్రతిష్ట మసకబారిందని, డ్యామేజీ ఇంకా పెరగకుండా త్వరగా ముగించాలని కోరుకుంటున్నారు.


