
కేవలం ఈ 14 నెలల్లోనే రూ.1,86,361 కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో ఇది ఏకంగా 56%
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు
మీ అవినీతి వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
ఆదాయాలు తగ్గి.. ఆకాశాన్ని అంటేలా అప్పులు పెరగడం ఆందోళనకరం.. 2023–24తో పోల్చితే 2024–25లో రాష్ట్ర సొంత ఆదాయ వృద్ధి కేవలం 3.08 శాతమే
అదే సమయంలో దేశ జీడీపీ 9.8 శాతం ఉంటుందని అంచనా
కేంద్ర ప్రభుత్వ సొంత ఆదాయం వృద్ధి 12.04 శాతం
రాష్ట్ర జీఎస్‌డీపీ 12.02 శాతం సాధించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం
అలాంటప్పుడు రాష్ట్ర సొంత ఆదాయం వృద్ధి 3.08 శాతమేనా?
టీడీపీ కూటమి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందనడానికి ఇదే నిదర్శనం
ఇప్పటికైనా తమ విధానాలపై రాష్ట్ర సర్కారు పునరాలోచించాలి
చంద్రబాబు సర్కార్ ఆర్థిక విధానాలను కడిగిపారేసిన మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం వైఫల్యాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ నమ్మబలికిన టీడీపీ, జనసేన కూటమి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తంగా మార్చేసిందని తూర్పారబట్టారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలను ఉటంకిస్తూ చంద్రబాబు కూటమి సర్కార్ ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే..
⇒ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య అప్పటి విపక్షాలు తెలుగుదేశం, జనసేన పార్టీ లు పదే పదే అసత్యాలు ప్రచారం చేస్తూ, ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పని చేశాయి. ప్రభుత్వ విధానాల వల్ల అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరోవైపు కీలక రంగాల్లో మూల ధన వ్యయం బాగా తగ్గడం వల్ల ప్రభుత్వ ఆదాయం దారుణంగా తగ్గుతోందని.. దీని వల్ల రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదని, అది ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తోందని నిందించాయి. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి, రాష్ట్ర ఆదాయాన్ని చాలా వేగంగా పెంచడంతో పాటు, అప్పులు పెరగకుండా చూస్తామని గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ లు హామీ ఇచ్చాయి.
⇒ కానీ.. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును ఒకసారి పరిశీలిస్తే, కఠోర వాస్తవాలు కనిపిస్తాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయంలో (పన్నులు, పన్నేతర వసూళ్లు), అంతకు ముందు ఏడాది (2023–24)తో పోల్చి చూస్తే కేవలం 3.08 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. అదే సమయంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 9.8 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తే, కేంద్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో 12.04 శాతం పెరుగుదల నమోదైంది. మరి ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నట్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) 12.02 శాతం ఉంటే, ప్రభుత్వ సొంత ఆదాయం అత్యల్పంగా 3.08 శాతం వృద్ధికే ఎందుకు పరిమితమైంది?
⇒ గత ఏడాది రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో పరిస్థితి మారుతుందని అంతా భావించారు. కానీ, ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో అదే ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితి ప్రస్ఫుటమవుతోంది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చి చూస్తే, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అమ్మకం పన్నుల ఆదాయంలో ఇప్పటికే తగ్గుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో 2023–24లో తొలి నాలుగు నెలల్లో వచ్చిన ఆదాయంతో, ఇప్పుడు 2025–26లో మొదటి నాలుగు నెలల్లో ప్రభుత్వానికి వచి్చన ఆదాయాన్ని (సీఎజీఆర్) పరిగణనలోకి తీసుకుంటే అది కేవలం 2.39 శాతం మాత్రమే పెరిగింది. వాస్తవానికి అది కనీసం 10 శాతం ఉండాల్సి ఉంది.
⇒ మరో అత్యంత ఆందోళకర అంశం రాష్ట్ర అప్పులు విపరీతంగా పెరగడం. వైఎస్సార్‌సీపీ హయాంలో 2019–24 మధ్య రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రుణాలు (పబ్లిక్ డెట్, పబ్లిక్ ఎక్కౌంట్, ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్ల అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా చేసిన కార్పొరేషన్ల అప్పులు) రూ.3,32,671 కోట్లు. కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వం కేవలం ఈ 14 నెలల్లో చేసిన మొత్తం అప్పులు ఏకంగా రూ.1,86,361 కోట్లు. అంటే గత ప్రభుత్వం మొత్తం ఐదేళ్లలో చేసిన అప్పులో 56 శాతం రుణాలను కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే చేసింది. ఒకవైపు రాష్ట్ర ఆదాయంలో వృద్ధి చాలా తక్కువగా ఉండడం, మరోవైపు అప్పులు ఆకాశాన్ని అంటే విధంగా పెరగడం అత్యంత ఆందోళనకరం. అందుకే ఇప్పటికైనా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం, తమ విధానాలను పునరాలోచించాలి. ఎందుకంటే ఇప్పటికే మీ విధానాల వల్ల తీవ్ర అవినీతితో ప్రభుత్వ ఆదాయానికి భారీగా దగండి పడింది.