
ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన అసెంబ్లీ స్పీకర్
4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని గడువు
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రారంభించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు శాసనసభ స్పీకర్‌కు సూచించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసుల జారీ ప్రక్రియను స్పీకర్ ప్రారంభించారు. నోటీసులు అందుకున్న వారు నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొన్నట్లు తెలిసింది.
ఇప్పటివరకు ఐదుగురు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల), ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు), తెల్లం వెంకటరావు (భద్రాచలం)కు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయినట్లు తెలిసింది. తనకు నోటీసులు వచి్చన విషయం వాస్తవమేనని కృష్ణమోహన్‌రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. అయితే హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తన చిరునామాకు నోటీసులు వచ్చాయని, తాను గద్వాలలో ఉన్నందున వ్యక్తిగతంగా స్వీకరించలేదని వెల్లడించారు.
సోమవారం హైదరాబాద్‌కు వెళ్లి నోటీసులు స్వయంగా తీసుకున్న తర్వాత తన ప్రతిస్పందన ఉంటుందన్నారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ)కి నోటీసులు సిద్ధమైనట్లు తెలిసింది. స్పీకర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో తిరిగి వచ్చిన తర్వాత నెలాఖరులోగా మిగతా ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ (జగిత్యాల), కాలె యాదయ్య (చేవెళ్ల)కు కూడా నోటీసుల జారీ ప్రక్రియ కొనసాగుతుందని సమాచారం. ఫిర్యాదులు, ఆధారాలు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ స్పీకర్ నోటీసులు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
ఢిల్లీకి స్పీకర్ ప్రసాద్‌కుమార్
ఢిల్లీలో జరిగే ఆలిండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ నేతృత్వంలోని బృందం శనివారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరింది. స్పీకర్‌తోపాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులుతోపాటు పలువురు అసెంబ్లీ అధికారులు ఈ బృందంలో ఉన్నారు.
1925లో భారతదేశ సెంట్రల్ లేజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికైన మొదటి భారతీయుడు విఠల్ బాయి పటేల్ బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 24, 25 తేదీల్లో ఢిల్లీలో స్పీకర్ల సదస్సును నిర్వహిస్తున్నారు. ఇటీవలే కంటి శస్త్ర చికిత్స చేయించుకున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ భేటీకి హాజరుకావడం లేదని మండలి వర్గాలు చెప్పాయి.