స్వీట్‌ కార్న్‌: వెరైటీ వంటకాలు ఒక్కసారి ట్రై చేసారంటే..! | Sweet Corn Recipes: Halwa, Cake, and Idiyappam You Must Try | Sakshi
Sakshi News home page

Sweet Corn: వెరైటీ వంటకాలు ఒక్కసారి ట్రై చేసారంటే..!

Aug 23 2025 10:48 AM | Updated on Aug 23 2025 11:21 AM

tip of the day amazing recipes with sweetcorn

మార్కెట్లో ఎక్కడ చూసినా స్వీట్‌ కార్న్‌ విరివిగా కనిపిస్తోంది. కాస్త చవగ్గా మనకు లభించినపుడు వీటిల్లోని రుచిని ఆస్వాదించాలి. అందుకే ఇవాల్టి టిప్‌ ఆఫ్‌ ది డేలో  స్వీట్‌ కార్న్‌ వెరైటీ వంటకాలను చేసేద్దేమా!

ఉడికించిన స్వీట్‌కార్న్‌ రుచే  వేరే లెవల్‌! ఉప్పూ కారం జోడించి, కాసింత నిమ్మరసం తగిలిస్తే అహో అద్భుతం అనాల్సిందే. అలాంటి స్వీట్‌కార్న్‌తో వెరైటీ వంటకాలంటే నోరూరుతుంది కదూ! మరింకెందుకు ఆలస్యం ఇలా ట్రై చేసి చూడండి!

స్వీట్‌ కార్న్‌ హల్వా
కావలసినవి: స్వీట్‌ కార్న్‌ – 2 కప్పులు (నీళ్లు పోసి మెత్తగా గుజ్జులా చేసుకోవాలి); బాదం పాలు – ఒక కప్పు; కస్టర్డ్‌ మిల్క్‌ -పావు కప్పు; పంచదార – 4 లేదా 6 టేబుల్‌ స్పూన్లు (పెంచుకోవచ్చు); ఏలకుల ΄పొడి – ఒక టీ స్పూన్‌; నెయ్యి – 4 టేబుల్‌ స్పూన్లపైనే; కుంకుమ పువ్వు – చిటికెడు(అభిరుచిని బట్టి); వెనీలా ఎసెన్స్‌ – ఒక టీ స్పూన్‌; బాదపప్పు – 2 టేబుల్‌ స్పూన్లు (దోరగా నేతిలో వేయించాలి, అభిరుచిని బట్టి జీడిపప్పు, కిస్మిస్‌ వంటివి జోడించుకోవచ్చు)

తయారీ: ముందుగా ఒక పెద్ద బౌల్‌ తీసుకుని అందులో కస్టర్డ్‌ మిల్క్, బాదంపాలు, పంచదార, ఏలకుల  పొడి, స్వీట్‌కార్న్‌ గుజ్జు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మరోసారి కలుపుకోవాలి. అనంతరం స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. పాన్‌ బౌల్‌లో సగం నెయ్యి వేసుకుని, వేడి చేసుకుని.. అందులో ఈ మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఆ సమయంలో గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మధ్యలో మిగిలిన నెయ్యి వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. కాస్త దగ్గర పడుతున్నప్పుడు వెనీలా ఎసెన్స్‌ వేసుకుని మరోసారి కలపాలి. ఆ మిశ్రమం మరింత దగ్గర పడుతున్న సమయంలో నేతిలో వేయించిన బాదం పప్పు వంటి వేసుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవచ్చు.

స్వీట్‌కార్న్‌  కేక్‌

కావలసినవి: స్వీట్‌ కార్న్‌- 5 కప్పులు (ఉడికించి, గుజ్జులా చేసుకోవాలి), పిస్తా, వాల్‌నట్స్, బాదం -అర కప్పు చొప్పున, వెన్న -పావు కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - టీ స్పూన్, పంచదార పొడి - సరిపడా, మైదాపిండి - పావు కప్పు, ఉప్పు- అర టీ స్పూన్, నెయ్యి -కొద్దిగా.

తయారీ: ముందుగా చిన్నబౌల్‌ తీసుకుని.. అందులో మైదా పిండి, బేకింగ్‌ పౌడర్, ఉప్పు వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాల్‌నట్స్, బాదం, పిస్తాలను నేతిలో వేయించుకుని, చల్లారిన తర్వాత, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్‌ తీసుకుని.. అందులో వెన్న, స్వీట్‌కార్న్‌ గుజ్జు వేసుకుని బాగా కలుపుకోవాలి. అవసరం అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో, పంచదార పొడి, మైదాపిండి మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా వాల్‌నట్, బాదం, పిస్తా ముక్కలు వేసుకుని, ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుండ్రటి బేకింగ్‌ టిన్‌కి నెయ్యి రాసి.. అందులో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకుని సమాంతరంగా చేసుకోవాలి. తర్వాత ఓవెన్‌లో బేక్‌ చేసుకుంటే సరిపోతుంది. కేక్‌ బేక్‌ అయిన తర్వాత క్రీమ్‌తో డెకరేట్‌ చేసి.. నచ్చిన విధంగా అలంకరించుకుని నచ్చిన విధంగా కట్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు

స్వీట్‌కార్న్‌ ఇడియాప్పం 
కావలసినవి: స్వీట్‌ కార్న్‌ గుజ్జు – 3 కప్పులు; బియ్యప్పిండి – 2 కప్పులు; ఓట్స్‌ పౌడర్, మైదా లేదా గోధుమ పిండి  –పావు కప్పు చొప్పున; జీలకర్ర పొడి – పావు టీ స్పూన్‌; చిక్కటి పాలు – పావు కప్పు (కాచి చల్లార్చినవి); నీళ్లు – కొద్దిగా, నెయ్యి – టీ స్పూన్‌; ఎల్లో ఫుడ్‌ కలర్‌ – (అభిరుచి బట్టి).

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో బియ్యప్పిండి, ఓట్స్‌ పౌడర్, మైదా లేదా గోధుమ పిండి, జీలకర్ర పొడి, స్వీట్‌కార్న్‌ గుజ్జు,పాలు వేసుకుని కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్‌ కలర్‌ వేసుకుని.. మరోసారి  బాగా కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ   పాన్‌కి బ్రష్‌తో నెయ్యి పూసుకుని, మురుకుల మేకర్‌కి సన్నని హోల్స్‌ ఉండే ప్లేట్‌ని అమర్చి, అందులో ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా నింపుకుని, ఇడ్లీ పాన్‌లో నూడుల్స్‌లా ఒత్తుకోవాలి. అనంతరం ఆవిరిపై ఉడికించాలి. అభిరుచిని బట్టి ఆవాలు, కరివేపాకు, కొత్తిమీరలతో తాలింపు వేసి, కలుపుకుని.. సర్వ్‌ చేసుకుంటే అదిరిపోతుంది.

చదవండి: అందమైన హారాన్ని షేర్‌ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement