
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) పథకం సేవలకు ఆధార్.. ఇక తప్పనిసరి కాదు. బీమా చేసిన వ్యక్తులు, వారి కుటుంబాలకు ఆధార్ ఆధారిత ధృవీకరణ ఐచ్ఛికంగానే ఉంటుందని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) స్పష్టం చేసింది. ఈఎస్ఐ పథకం లబ్ధిదారులు ఆధార్ ద్వారా ధృవీకరించుకోకపోయినా తమ వైద్య, నగదు ప్రయోజనాలను పొందగలరు.
కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కింద చట్టబద్ధమైన సంస్థగా, ఈఎస్ఐసీ సంఘటిత రంగంలోని కార్మికులకు సమగ్ర ఆరోగ్య బీమా, సామాజిక భద్రతను అందిస్తుంది. ఇందులో వైద్య సంరక్షణ, అనారోగ్యం, ప్రసూతి ప్రయోజనాలు, వికలాంగుల పరిహారంతోపాటు సభ్యులపై ఆధారపడినవారికి పెన్షన్లు ఉన్నాయి.
బెనిఫిట్ డెలివరీని సులభతరం చేయడానికి, కాగిత ప్రక్రియను తగ్గించడం కోసం గతంలో ఆధార్ ధృవీకరణను ప్రవేశపెట్టినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వివరించింది. అయితే ఆధార్ వెరిఫికేషన్ లేని కారణంతో లబ్ధిదారులకు సేవలను నిరాకరించబోమని ఈఎస్ఐసీ స్పష్టం చేసింది. ఆధార్ స్థానంలో పాస్ పోర్టులు, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది.
మరిన్ని సేవలు.. కొత్త పోర్టల్
ఈఎస్‌ఐసీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు పలు కీలక కార్యక్రమాలను లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కార్మిక మంత్రిత్వ శాఖ వివరించింది. ద్వితీయ, తృతీయ ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పిఎంజెఎవై) ఆసుపత్రులతో సహకారం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. శాశ్వత అంగవైకల్యం పొందిన సభ్యులు, వారి మీద ఆధారపడిన కుటుంబ సభ్యులకు పరిహారాన్ని మరింత పెంచినట్లు వివరించింది.
బీమా లబ్ధిదారులు, ముఖ్యంగా మహిళలు నగదు ప్రయోజన క్లెయిమ్లను డిజిటల్‌గా సమర్పించడానికి వీలు కల్పించే కొత్త ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించినట్లు పేర్కొంది.
ఈఎస్‌ఐ పథకానికి ఎవరు అర్హులు?
ఈఎస్‌ఐ పథకం ఉద్యోగులందరికీ వర్తించదు. ఎవరైతే నెలకు రూ.21 వేలు లేదా అంత కంటే తక్కువ జీతం పొందుతున్నారో వారికే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తిస్తుంది. అదే దివ్యాంగ ఉద్యోగులు అయితే రూ.25 వేల వరకూ జీతం పొందుతున్నవారు కూడా ఈ పథకానికి అర్హులు.