
కొచ్చి: ప్రపంచ ఫుట్‌బాల్ చాంపియన్ అర్జెంటీనా జట్టు భారత్‌లో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో భాగంగా లయోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు ఈ ఏడాది మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. ప్రత్యర్థి జట్లు, నగరాలు ఖరారు కానప్పటికీ ఏ ఏ దేశాల్లో జరిగేవి వెల్లడించారు. ముందుగా మెస్సీ సేన అమెరికాలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది.
అక్టోబర్ 6 నుంచి 14వ తేదీల మధ్యలో అర్జెంటీనా... అమెరికాలో ఈ మ్యాచ్ ఆడుతుంది. తర్వాత నవంబర్ 10 నుంచి 18వ తేదీల మధ్యలో లువాండా (అంగోలా), కేరళ (భారత్) రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో మెస్సీ జట్టు తలపడుతుంది. ఈ మేరకు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏఎఫ్‌ఏ) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అర్జెంటీనా ఎదుర్కోబోయే జట్ల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని అందులో పేర్కొంది.
అయితే మొరాకో, కోస్టా రికో, ఆస్ట్రేలియాలతో పాటు ఆసియా మేటి జట్టు జపాన్‌లతో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఘనమైన ఆతిథ్యానికి ఏర్పాట్లు చేస్తోంది. కొన్నాళ్లుగా సాకర్ స్టార్ మెస్సీని కేరళకు తీసుకొచ్చేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో సిద్ధమైంది. మొత్తానికి అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏఎఫ్‌ఏ) షెడ్యూల్‌లో కేరళను చేర్చడంలో సఫలమైంది.
మెస్సీ నవంబర్‌లో గనక జట్టుతో పాటు వస్తే నెల వ్యవధిలో ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మళ్లీ డిసెంబర్లో భారత్‌కు రానున్నాడు. దీనికి సంబంధించి షెడ్యూల్‌ను ఆర్గనైజర్లు ఇటీవలే ప్రకటించారు. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్‌లోని సాకర్ ప్రియులకు, మెస్సీని ఆరాధించే అభిమానులకు ఇది పెద్ద పండగే.