
మెట్రో విస్తరణతో మెరుగైన కనెక్టివిటీ
గ్రీన్‌ఫీల్డ్ రోడ్లతో కొత్త ప్రాంతాల అభివృద్ధి
త్వరలోనే ఫ్యూచర్ సిటీ క్రెడాయ్ చాప్టర్
ఏటా లక్ష మంది కార్మికులకు నైపుణ్య శిక్షణ
‘సాక్షి’తో క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ ఇంద్రసేనారెడ్డి
రాష్ట్రాభివృద్ధి కసం ప్రభుత్వం చేసే పనులు, అవలంభించే విధానాలు ప్రజలకు తెలిస్తేనే మరింత సక్సెస్ అవుతాయి. రాబోయే తరాల భవిష్యత్తును మార్చేసే అలాంటి కీలక ప్రాజెక్ట్‌లకే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైటెక్ సిటీ, ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్‌లతో సుమారు మూడు దశాబ్దాలుగా రాష్ట్ర ముఖచిత్రం ఎలా మారిపోయిందో అంతకు రెట్టింపు స్థాయిలో మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్‌లతో తెలంగాణ దశదిశలు మారిపోతాయి. ఎయిర్‌పోర్ట్‌తో హైదరాబాద్ నుంచి ప్రపంచం మొత్తానికి తలుపు తెరిచినట్టే.. ఔటర్‌తో తెలంగాణ మొత్తానికి కనెక్టివిటీ పెరిగింది. ఇప్పుడిదే స్థాయిలో ప్రపంచ దేశాలను ఆకర్షించే ఈ మూడు గేమ్ చేంజర్ ప్రాజెక్ట్‌లు రాష్ట్రాభివృద్ధిని మార్చనున్నాయని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య(క్రెడాయ్) తెలంగాణ ప్రెసిడెంట్ కే.ఇంద్రసేనారెడ్డి అన్నారు. – సాక్షి, సిటీబ్యూరో
వరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాలు వంటి హనీమూన్ పీరియడ్ ముగిసింది. దీంతో స్థిరాస్తి రంగం మళ్లీ పుంజుకుంటోంది. 18 నెలల్లో నగరంలో 2 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడమే ఇందుకు ఉదాహరణ. వంద చ.అ.కు ఒక జాబ్ చొప్పున 2 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. దీంతో గృహాలకు డిమాండ్ ఏర్పడింది. పాత ప్రభుత్వాలు కేవలం పశ్చిమ హైదరాబాద్ మీదనే దృష్టి పెట్టాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పాతబస్తీలో మెట్రో విస్తరణ, దక్షిణ హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్.. ఇలా ఎక్కడికక్కడ అభివృద్ధి ప్రణాళికలు చేస్తోంది. గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు, ఓఆర్‌ఆర్– ట్రిపుల్ ఆర్ మధ్య కొత్త ప్రాంతాలలో భూములు అందుబాటులోకి వస్తాయి. వ్యాపార అవకాశాలూ పెరుగుతాయి. రోడ్లను వెడల్పు చేస్తే కార్ల సంఖ్య పెరగడమే తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. మెట్రో విస్తరణ దూరాలు దగ్గరవుతాయి. ప్రజా రవాణా పెంచితేనే సిటీ అభివృద్ధి, దూరం పెరుగుతుంది. దీంతో కస్టమర్లు ఎక్కడికక్కడ ఇళ్లు కొనుగోలు చేయవచ్చు.
హైడ్రా లాగే రెరా..
ప్రస్తుతం దేశంలో సుమారు 1.10 లక్షల మంది బిల్డర్లు ఉన్నారు. నిర్మాణ రంగంలో అసంఘటిత బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. నకిలీ బిల్డర్లు, మధ్యవర్తుల మాయమాటలు నమ్మి, తక్కువ ధరకు వస్తుందనే ఆశతో వారి చేతిలో కస్టమర్లు మోసపోతున్నారు. గృహ కొనుగోలుదారులకు భరోసా, వారి పెట్టుబడులకు భద్రత కల్పించే పదునైనా అస్త్రం రెరా. దీన్ని గత ప్రభుత్వం విస్మరించింది. దీంతో ప్రీలాంచ్, సాఫ్ట్‌లాంచ్‌ల పేరుతో అమాయక కస్టమర్ల కష్టార్జితాన్ని కాజేశారు. కస్టమర్లు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అనుమతులు లేకుండా, రూపాయి పన్ను చెల్లించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే నకిలీ బిల్డర్లను హైడ్రా తరహాలో కఠినంగా వ్యవహరించాలి. ఈమేరకు రెరాను మరింత బలోపేతం చేయాలి.
ఏటా లక్ష కార్మికులకు నైపుణ్య శిక్షణ..
దేశీయ నిర్మాణ రంగంలో వచ్చే పదేళ్లలో 4.5 కోట్ల మంది నైపుణ్య కార్మికులు అవసరం. ఒడిశా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి సుమారు 18 లక్షల మంది కార్మికులు తెలంగాణ నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది నైపుణ్య కార్మికులు నెలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకూ సంపాదిస్తున్నారు. కొడంగల్, నిజామాబాద్, పరిగి, కరీంనగర్, వరంగల్ వంటి మన తెలంగాణ నుంచి యువత ముంబై, ఎన్‌సీఆర్–ఢిల్లీ, దుబాయ్, గల్ఫ్ వంటి దేశాలకు వలస వెళ్తున్నారు. నెలకు రూ.25–రూ.30 వేలకు పనిచేస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో సుమారు వెయ్యి ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. ఆయా విద్యా సంస్థలు అకడమిక్ స్థాయిలో బాగానే ఉన్నా ఆన్‌సైట్ ప్రాక్టికల్ శిక్షణలో వెనుకబడి ఉన్నాయి. 12 తరగతిలోపు, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు 180 రోజుల పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. 90 రోజుల పాటు క్లాస్‌రూమ్ శిక్షణ, 90 రోజులు ఆన్‌సైట్ ట్రెయినింగ్ ఉంటుంది. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే జరగనున్న క్రెడాయ్ స్టేట్‌కాన్ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించనున్నాం.
త్వరలోనే ఫ్యూచర్ సిటీ చాప్టర్..
ప్రస్తుతం క్రెడాయ్ తెలంగాణలో 15 చాప్టర్లు, వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. వీటిని 25 చాప్టర్లకు విస్తరించాలన్నది లక్ష్యం. త్వరలోనే ఫ్యూచర్ సిటీ క్రెడాయ్ చాప్టర్‌ను ప్రారంభించనున్నాం. కనీసం ఒక్క ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) పొందిన, నాణ్యమైన 30 మంది సభ్యులతో ఈ చాప్టర్‌ను తెరవనున్నాం. కోడ్ ఆఫ్ కండక్ట్ విధిగా పాటించే సభ్యులతో ఆ తర్వాత సంగారెడ్డి, జహీరాబాబాద్ చాప్టర్లు కూడా రానున్నాయి. ప్రభుత్వం, బిల్డర్లకు మధ్య క్రెడాయ్ వారధిలా పనిచేస్తుంది. ప్రభుత్వ పాలసీలు, పన్నులు తదితరాలపై బిల్డర్లకు అవగాహన కల్పిస్తుంది.