
మిక్స్‌డ్‌లో భారత జోడీకి స్వర్ణం
ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్
షిమ్‌కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా షూటర్ ఇలవేనిల్ వలారివన్ డబుల్ ధమాకా సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో శుక్రవారం బంగారు పతకం చేజిక్కించుకున్న ఆమె మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ మరో పసిడి నెగ్గింది. తమిళనాడుకు చెందిన ఈ యువ షూటర్... శనివారం జరిగిన పోటీల్లో అర్జున్ బబుతాతో కలిసి స్వర్ణంపై గురిపెట్టింది. చైనీస్ జంట డింగ్‌కె లూ–జిన్ లూ పెంగ్‌తో పోటీ ఎదురైనప్పటికీ చివరకు భారత జోడీ 17–11తో విజేతగా నిలిచింది.
మొదట్లో చైనా జోడీ ఆధిక్యంలో నిలిచినప్పటికీ ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా ఇలవేనిల్–అర్జున్ ద్వయం లక్ష్యంపై గురి పెట్టడంలో సఫలమైంది. ఇటు తమిళ షూటర్ ఇలవేనిల్‌కు, అటు పంజాబ్ షూటర్ బబుతాకు ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో అర్జున్ బబుతా తొలి పసిడి పతకం నెగ్గాడు. రుద్రాం„Š పాటిల్, కిరణ్ జాదవ్, అర్జున్‌లతో కూడిన భారత బృందం విజేతగా నిలిచింది.
జూనియర్ ఈవెంట్‌లోనూ శాంభవి శ్రవణ్–నరేన్ ప్రణవ్ జంట బంగారం గెలుచుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత జంట 16–12తో చైనా జోడీపై విజయం సాధించింది. క్వాలిఫికేషన్‌లో చైనాకే చెందిన రెండు జట్లు 632.3 స్కోరు, 630 స్కోర్లతో శాంభవి– నరేన్ ప్రణవ్ (629.5) జోడీ కంటే ముందు వరుసలో నిలిచాయి. కానీ అసలైన పతకం రేసులో భారత ద్వయం పుంజుకుంది.
గురి తప్పని షాట్లతో స్వర్ణం చేజిక్కించుకుంది. భారత్‌కే చెందిన ఇషా తక్షలే–హిమాన్షు జోడీ (628.6 స్కోరు) క్వాలిఫికేషన్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. జూనియర్ పోటీల్లో శాంభవికిది రెండో స్వర్ణం. మహిళల టీమ్ ఈవెంట్‌లో ఆమె హృదయశ్రీ, ఇషా అనిల్‌లతో కలిసి తొలిరోజే బంగారు పతకం గెలిచింది.