
హీరోయిన్లు అంటే తెరపై అందంగా కనిపించడం... హీరోలతో పాటల్లో ఆడిపాడటం... అనే ధోరణి ప్రేక్షకుల్లో ఉంది. అయితే ఇటీవల ట్రెండ్ మారింది. తామేమీ తక్కువ కాదంటూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు పచ్చజెండా ఊపుతున్నారు కథానాయికలు. యాక్షన్ సినిమాల్లోనే కాదు... ప్రేక్షకులను భయపెట్టే హారర్ చిత్రాల్లో నటించేందుకు కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం రష్మికా మందన్నా, తమన్నా, పూజా హెగ్డే, నిధీ అగర్వాల్, అనూ ఇమ్మాన్యుయేల్, ఆండ్రియా, సమీరా రెడ్డి... వంటి పలువురు అందమైన భామలు థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆ విశేషాలు...
డబుల్ ధమాకా
‘ఛలో’ (2018) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు హీరోయిన్ రష్మికా మందన్నా. తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న ఈ కన్నడ బ్యూటీ టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అంతేకాదు... తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటున్న రష్మిక నేషనల్ క్రష్‌గా మారారు. ఇప్పటివరకూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన రష్మిక ఒకేసారి రెండు చిత్రాల ద్వారా ప్రేక్షకులను భయపెట్టనున్నారు. ‘థామా, మైసా’ వంటి హారర్ సినిమాల ద్వారా ఆడియన్స్‌కి డబుల్ ధమాకా ఇవ్వనున్నారామె.
రష్మికా మందన్న లీడ్ రోల్‌లో ‘మైసా’ అనే సినిమా రూపొందుతోంది. డైరెక్టర్ హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లె ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి ఈ సినిమానిపాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఇటీవల తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని ఎమోషనల్, హారర్, యాక్షన్ థ్రిల్లర్‌గా ‘మైసా’ రూపొందుతోంది. ఈ చిత్రంలో రష్మిక గోండు మహిళగా కనిపించనున్నారు.
అదే విధంగా రష్మికా మందన్నా లీడ్ రోల్‌లో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘థామా’. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా ప్రధానపాత్ర పోషిస్తున్నారు. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ‘స్త్రీ’ యూనివర్స్‌లో నాలుగో చిత్రంగా ‘థామా’ని నిర్మిస్తున్నారు దినేష్ విజయన్. గతంలో వచ్చిన ‘భేడియా, స్త్రీ, ముంజ్య’ చిత్రాలు ప్రేక్షకులను బాగా అలరించడంతో ‘థామా’పై భారీ అంచనాలున్నాయి. అతీంద్రియ శక్తులతో కూడిన ఈ హారర్ రొమాంటిక్ చిత్రంలో తడ్‌కాపాత్రలో రష్మిక నటిస్తున్నారు. హారర్, మిస్టరీ అండ్ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న ‘థామా’ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
సిద్ధంగా ఉండండి
ఓ వైపు హీరోయిన్‌గా, మరోవైపు లీడ్ రోల్స్ చేస్తూనే ప్రత్యేకపాటల్లోనూ సందడి చేస్తుంటారు తమన్నా. తెలుగులో ఆమె లీడ్ రోల్‌లో నటించిన ‘ఓదెల 2’ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 17న విడుదలైంది. ఆ తర్వాత ఆమె మరో తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపకపోయినా బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో తమన్నా నటిస్తుండగా అందులో ‘వి వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనే చిత్రంలో ప్రధానపాత్రలో నటిస్తున్నారామె.
అరుణాభ్ కుమార్, దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా కీలకపాత్ర పోషిస్తున్నారు. మైథలాజికల్ హారర్, జానపద థ్రిల్లర్ జానర్‌లో అడవి నేపథ్యంలో ఈ చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.
ఆ మధ్య ఈ సినిమా టీజర్ విడుదలైంది. రాత్రి వేళ ఎర్రటి చీర ధరించిన తమన్నా కారు దిగి అడవిలోకి వెళ్లి, అక్కడ ఓ దీపం వెలిగించడం, అక్కడ ఏదో దృశ్యాన్ని చూసి కళ్లు పెద్దవి చేయడం వంటి విజువల్స్ ఈ వీడియోలో కనిపించాయి. ‘అడవి పిలిచింది. నేను సమాధానం చెప్పాను. ‘వి వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’లో భాగం కావడం థ్రిల్లింగ్‌గా ఉంది. ఆ అడ్వంచర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ తమన్నా పేర్కొన్న విషయం విదితమే. ఈ సినిమా 2026 మే 15న విడుదల కానుంది.
తొలిసారి హారర్ చిత్రంలో...
‘మజ్ను, అజ్ఞాతవాసి, శైలజారెడ్డి అల్లుడు, ఊర్వశివో రాక్షసివో, రావణాసుర’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు అనూ ఇమ్మాన్యుయేల్. ఇప్పటివరకూ కమర్షియల్ సినిమాల్లో సందడి చేసిన ఈ బ్యూటీ తొలిసారి ‘బూమరాంగ్’ అనే హారర్ చిత్రంలో నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
లండన్ గణేశ్, డా. ప్రవీణ్ రెడ్డి ఊట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హారర్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్‌ని లండన్‌లోని పలు ప్రదేశాల్లో జరిపారు. ‘‘సైకలాజికల్ థ్రిల్లర్, హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘బూమరాంగ్’. కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ చిత్రకథ సాగుతుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని మేకర్స్ తెలిపారు. ఇప్పటివరకు కమర్షియల్ హీరోయిన్‌గా సందడి చేసిన అనూ ఇమ్మాన్యుయేల్ ‘బూమరాంగ్’ ద్వారా ప్రేక్షకులను ఏ మేర భయపెడతారో వేచి చూడాలి.
మొదటిసారి...
‘సవ్యసాచి’ (2018) సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు నిధీ అగర్వాల్. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో, హరి హర వీరమల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారామె. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిధీ అగర్వాల్ మొదటిసారి ఓ గ్రిప్పింగ్ హారర్ సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఊపారు. ఈ సినిమా ద్వారా ఎన్. నిఖిల్ కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
పుప్పాల అప్పలరాజు నిర్మిస్తున్న తొలి చిత్రమిది. ఈ నెల 17న నిధీ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటించి, ఓ స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘నిధీ అగర్వాల్ నటిస్తున్న తొలి గ్రిప్పింగ్ హారర్ థ్రిల్లర్ సినిమా ఇది. ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. టాప్ టెక్నికల్ స్టాండర్డ్స్, హై ప్రోడక్షన్ వాల్యూస్‌తో ఈ మూవీ ఆడియన్స్‌కి విజువల్లీ స్ట్రాంగ్, ఎమోషనల్‌గా ఇంటెన్స్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది. ఈ సినిమా నిధీ కెరీర్‌లో ఓ మైలురాయి అవుతుంది. మా ప్రోడక్షన్ హౌస్‌లో ఆమె జాయిన్ అవ్వడం మాకు ఆనందం కలిగిస్తోంది. బిగ్ స్క్రీన్‌పై ఆమె చూపించబోయే మేజిక్ కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. ఈ సినిమా టైటిల్ దసరాకి రివీల్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ తెలిపింది.
రెండో పిశాచి ...
ఓ సినిమా హిట్ అయిందంటే చాలు... ఆ చిత్రానికి సీక్వెల్ ΄్లాన్ చేస్తున్నారు మేకర్స్. మిస్కిన్ దర్శకత్వం వహించిన హారర్ చిత్రం ‘పిశాచి’ 2014లో విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా తాజాగా ‘పిశాచి 2’ రూపొందించారు మిస్కిన్. ఈ మూవీలో ఆండ్రియా లీడ్ రోల్‌లో నటించారు. విజయ్ సేతుపతి, పూర్ణ, అజ్మల్ అమీర్ ఇతరపాత్రలు పోషించారు. మురుగానందం నిర్మించారు. ఇప్పుటికే పలు హారర్ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌లో నటించిన ఆండ్రియా ‘పిశాచి–2’లోనూ తనదైన నటనతో ప్రేక్షకులను భయపెట్టనున్నారు.
ఈ చిత్రంలో ఆమెపాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని సమాచారం. అంతేకాదు... కథకు అవసరం రీత్యా ఈ సినిమాలో ఆండ్రియా బోల్డ్‌గా నటించారని, ఓ సన్నివేశంలో నగ్నంగా నటించారనే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని డైరెక్టర్ మిస్కిన్ ధ్రువీకరించారు. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే రిలీజ్ విషయంలో పలు అడ్డంకులు రావడంతో ‘పిశాచి 2’ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయంపై స్పష్టత లేదు.
హారర్ చిత్రంతో రీ ఎంట్రీ
‘నరసింహుడు, జై చిరంజీవ, అశోక్’ వంటి తెలుగు చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు సమీరా రెడ్డి. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అశోక్’ (2006) చిత్రం తర్వాత ఆమె తెలుగులో నటించలేదు. అయితే క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ (2012) సినిమాలో మాత్రం ప్రత్యేకపాటలో చిందేశారామె. ఆ తర్వాత నటించలేదు. 2014లో అక్షయ్ వర్దేతో ఏడడుగులు వేసిన ఈ బ్యూటీ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. పెళ్లి, పిల్లలు కారణంగా నటనకు దూరమైన సమీర 13 సంవత్సరాల తర్వాత హిందీ చిత్రం ‘చిమ్నీ’తో రీ ఎంట్రీ ఇస్తున్నారు.
అది కూడా ఓ హారర్ మూవీతో కావడం విశేషం. ఔట్ అండ్ ఔట్ హారర్ మూవీగా రూపొందుతోన్న ‘చిమ్నీ’కి గగన్ పూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘చిమ్నీ’ టీజర్ సినిమాపై ఉత్కంఠత పెంపొందించింది. ఈ సినిమా గురించి సమీరా రెడ్డి మాట్లాడుతూ– ‘‘చిమ్నీ’లాంటి హారర్ సినిమాని నేనెప్పుడూ చేయలేదు. గతంలో ‘డర్నా మనా హై’మూవీలో చేశాను.
అయితే కేవలం అందులో నాది నెరేటర్‌పాత్ర మాత్రమే. ఆ రకంగా నేను నటిస్తున్న తొలి హారర్ మూవీ ‘చిమ్నీ’ అనుకోవచ్చు. 13 సంవత్సరాల తర్వాత తిరిగి షూటింగ్‌లోపాల్గొనడం కాస్తంత నెర్వస్‌గా ఫీల్ అయ్యాను. కానీ కెమెరా ఆన్ కాగానే నాలోనిపాత నటి తిరిగి బయటకు వచ్చేసింది’’ అని తెలిపారు. ఇదిలా ఉంటే.. సమీరా రెడ్డి ఇరవై యేళ్ల క్రితం నటించిన ‘నామ్’ అనే హిందీ సినిమా గత యేడాది నవంబరు 22న విడుదల కావడం విశేషం.
కాంచన 4లో...
అందం, అభినయంతో ఇప్పటివరకూ కమర్షియల్ సినిమాల్లో హీరోల సరసన సందడి చేస్తూ ప్రేక్షకులను అలరించిన పూజా హెగ్డే తొలిసారి హారర్ నేపథ్యంలో రూపొందుతున్న ‘కాంచన 4’ సినిమాలో నటించనున్నారు. నాగచైతన్య హీరోగా ‘ఒక లైలా కోసం’ (2014) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రభాస్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలందరితో నటించారు. ‘ఎఫ్ 3’ (2022) సినిమాలో ప్రత్యేకపాటలో నటించిన ఆమె ఆ తర్వాత ఏ తెలుగు చిత్రంలోనూ నటించలేదు.
అయితే హిందీ, తమిళ సినిమాల్లో మాత్రం నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే... ‘ముని, కాంచన’ హారర్ సిరీస్‌లో రానున్న ‘కాంచన 4’ చిత్రంలో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇప్పటివరకూ పోషించనటువంటి సరికొత్తపాత్రలో పూజ నటిస్తున్నారని కోలీవుడ్ టాక్. ఈ చిత్రంలో ఆమెది ఓ సవాల్‌తో కూడుకున్నపాత్ర అనే వార్తలు వినిపిస్తున్నాయి.
మూగ, చెవిటి అమ్మాయిపాత్రలో కనిపించనున్నారట పూజా హెగ్డే. ఇంతకీ ఈ చిత్రంలో ఆమెపాత్ర ఏంటి? అన్నది తెలియాలంటే చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫుల్ హారర్ నేపథ్యంలో వచ్చిన ‘ముని, కాంచన, కాంచన 2, కాంచన 3’ సినిమాలు మంచి విజయం సాధించడంతో ‘కాంచన 4’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హారర్ మూవీతో తమిళ్‌లో ఎంట్రీ...
నోరా ఫతేహి... పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, హిందీ, మలయాళ చిత్రాల్లో ప్రత్యేకపాటలతో తనదైన డ్యాన్సులతో కుర్రకారుని ఉర్రూతలూగించారామె. తెలుగులో ‘టెంపర్, బాహుబలి: ది బిగినింగ్, కిక్, షేర్, లోఫర్, ఊపిరి’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారామె. కాగా ‘కాంచన 4’ వంటి హారర్ సినిమాతో నోరా ఫతేహి తమిళ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘‘కాంచన 4’కి అవకాశం వచ్చినప్పుడు తమిళ ఇండస్ట్రీకి పరిచయం కావడానికి ఇదే సరైనcజెక్టు అనుకున్నా.
స్క్రిప్టు బాగా నచ్చింది. పైగా ‘కాంచన’ ఫ్రాంచైజీకి ప్రేక్షకుల్లో గొప్ప ఆదరణ ఉంది. ‘మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్’ తర్వాత అలాంటి జానర్ మూవీ చేయాలనుకున్నప్పుడు ‘కాంచన 4’ అవకాశం దక్కింది. కొత్త భాషలో నటించడం సవాలే. కానీ, నేను సవాళ్లను ఇష్టపడతాను. హారర్ అండ్ కామెడీ సీన్స్‌లో నా నటనను, డాన్స్ స్కిల్స్‌ను ప్రదర్శించడానికి ఇది నాకు సరైనcజెక్ట్ అని నా అభి్రపాయం. ‘కాంచన 4’లో లారెన్స్, పూజా హెగ్డేలతో నటించడం చాలా సంతోషంగా ఉంది’’ అని నోరా ఫతేహి చెప్పారు.
పై తారలే కాదు... మరికొందరు హీరోయిన్లు కూడా హారర్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను భయపెట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు.
బాలీవుడ్‌లో లేడీ ఫైర్ బ్రాండ్ అనగానే హీరోయిన్ కంగనా రనౌత్ గుర్తొస్తారు. నటిగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం బీజేపీ పార్టీ నుంచి లోక్‌సభ సభ్యురాలిగా గెలుపొంది తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. కాగా కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ మూవీ ఈ ఏడాది జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక΄ోతే.. తాజాగా ఆమె ‘బ్లెస్డ్ బై ది ఈవిల్’ అనే ఓ హాలీవుడ్ సినిమాలో నటించనున్నారు.
అనురాగ్ రుద్ర దర్శకత్వం వహించనున్న ఈ హారర్ డ్రామా సినిమాలో ఆమె కీలక పాత్రపోషించనున్నారు. ఓ జంటని దుష్ట శక్తి ఎలాంటి తిప్పలు పెట్టిందనే కథాంశం చుట్టూ ఈ సినిమా ఉంటుందట. అతీంద్రియ శక్తులు, జానపద కథల నేపథ్యంలో అనురాగ్ రుద్ర తీర్చిదిద్దనున్నారని టాక్. టైలర్‌పోసీ, స్కార్లెట్ రోజ్ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలుపోషించనున్నారు. లయన్ మూవీస్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ న్యూయార్క్‌లో మొదలు కానుందని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ దాదాపు అమెరికాలోనే జరగనుంది. కంగనా రనౌత్ ఎంపీగా గెలుపొందిన తర్వాత ఒప్పుకున్న చిత్రం ‘బ్లెస్డ్ బై ది ఈవిల్’ కావడం విశేషం.