breaking news
Sakshi Editorial
-
పొంచివున్న పెనుముప్పు
గుక్కెడు మంచినీళ్ల కోసం మున్ముందు ప్రపంచ ప్రజానీకం ఇక్కట్లు పడాల్సి ఉంటుందని నిపుణులు ఎప్పటినుంచో చేస్తున్న హెచ్చరికలు రేపో మాపో నిజం కాబోతున్నాయని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక హెచ్చరిస్తున్నది. మనిషికే కాదు... సమస్త జీవకోటికీ గాలి తర్వాత నీరే ప్రాణాధారం. కానీ మారుతున్న పర్యావరణం, పెరిగిపోతున్న కాలుష్యంతో పాటు మితిమీరిన వినియోగం కారణంగా నీరు శరవేగంతో అడుగంటి పోతున్నదని ఆ నివేదిక చెబుతోంది. ముంచుకురానున్న ఈ ప్రమాద తీవ్రతను తెలియ జెప్పేందుకు నివేదిక కొత్త పదాన్ని ఎంచుకుంది. జల సంక్షోభం, జలగండం వంటివి అలవాటైన పదాలు. సంక్షోభం అనడంలో దాన్ని అధిగమించగలమన్న భరోసా కూడా ఏదో ఒక మూల ఉంటుంది. గండం అని చెప్పడంలో గట్టెక్కగలమన్న విశ్వాసం ఎంతో కొంత ధ్వనిస్తుంది. కానీ ముంచుకురాబోయే ముప్పు ఇంకెంత మాత్రమూ సాధారణ మైనది కాదు. అందుకే ఆ ముప్పును ‘జల దివాళా’ అంటోంది నివేదిక.ప్రకృతి మనకు వాన రూపంలో, మంచురూపంలో ప్రసాదించే జలరాశి ఆదాయంతో సమానమని, కానీ పొందుతున్న జలరాశిని మించి... చెప్పాలంటే అవసరాలను మించి నదులు, సరస్సులు, చిత్తడి నేలలు, భూగర్భ జలాశయాలు వగైరాల నుంచి మానవాళి పీల్చేస్తున్నదని నివేదిక రూపొందించిన ఐక్యరాజ్యసమితి యూనివర్సిటీకి చెందిన జల, పర్యావరణ, ఆరోగ్యసంస్థ డైరెక్టర్ కావే మదానీ అంటున్నారు. ఆదాయాన్ని మించి వ్యయం చేస్తే సర్వస్వం కోల్పోయిన విధంగానే కుంచించుకుపోతున్న నదీనదాలూ, సరస్సులు, అడుగంటుతున్న భూగర్భ జలాలు జీవకోటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తాయని ఆయన భావన. కనీసం ఈ దశలోనైనా మేల్కొంటే ఆ దివాళాను నివారించటం సాధ్యమేనని ఆయన చెబుతున్నారు.నివేదికను గమనిస్తే ప్రపంచీకరణకూ, ఆవిరైపోతున్న నీటి వనరులకూ ఉన్న అవినాభావ సంబంధం తెలుస్తుంది. ప్రపంచంలోని అతి పెద్ద సరస్సుల్లో 1990 తర్వాతే నీరు అడుగంటుతున్నదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధాన భూగర్భ జలాశయాల్లో 70 శాతం క్షీణత కనబడుతోంది. యూరోపియన్ యూనియన్(ఈయూ) భూభాగంతో సరిసమానమైన చిత్తడి నేలలు గత 50 ఏళ్లలో అంతరించగా, 1970 దశకం నుంచి చూస్తే హిమానీనదాలు 30 శాతం మేర కొడిగట్టాయి. నీటి వ్యవస్థపై అంతగా ఒత్తిడి లేని ప్రాంతాల్లో సైతం కాలుష్యం వల్ల మంచినీటి కొరత ఏర్పడటాన్ని ఈ నివేదిక ఎత్తిచూపు తోంది. నీటి కోసం భవిష్యత్తులో దేశాల మధ్యా, దేశాల్లో ప్రాంతాల మధ్యా వైషమ్యాలు పెచ్చరిల్లే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తోంది. నీటి వనరుల క్షీణత దాదాపు అన్ని ప్రాంతాలకూ వ్యాపించింది. ప్రతియేటా కనీసం ఒక నెలరోజులపాటు 400 కోట్లమంది ప్రజానీకం దాహార్తితో ఉంటున్నారు. అఫ్గాన్ రాజధాని కాబూల్ నగరం నీటి లభ్యతను పూర్తిగా కోల్పోనున్న తొలి ప్రపంచ నగరం కాబోతున్నదని నిపుణులంటున్నారు. మెక్సికో నగరమైతే ఏడాదికి 20 అంగుళాల చొప్పున నీరు కోల్పోతోందని చెబుతున్నారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్, లాస్ వేగాస్ నగరాలు, ఇరాన్ రాజధాని తెహ్రాన్లలో నీటి పంపిణీకి పరిమితులు విధించక తప్పని స్థితి ఏర్పడినా పాలకులు మాత్రం వాటి విస్తరణను ఆపడం లేదు. 2003–2019 మధ్య ఇరాన్ 200 ఘున కిలోమీటర్ల (7,062 శతకోటి ఘనపుటడుగుల) నీటి నిల్వను కోల్పోయిందని అంచనా. పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. దక్షిణాసియాలో పెరుగుతున్న పట్టణీకరణ నీటి వనరుల్ని దెబ్బతీస్తోంది. మన దేశం సంగతికొస్తే ప్రపంచ జనాభాలో మనం 18 శాతం. కానీ ప్రపంచ స్వచ్ఛనీటిలో మన వాటా 4 శాతం. అమెరికా, చైనాల తర్వాత అత్యంత భారీగా భూగర్భ జలాలను వాడుతున్న దేశం మనది. గంగ, యమున, సబర్మతి నదుల్లో పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు వచ్చి కలుస్తున్నాయి. 56 శాతం జిల్లాల భూగర్భ జలాల్లో నైట్రేట్లు కలగలిసివుంటున్నాయని తేలింది. విచ్చలవిడి నీటి వినియోగం, జలకాలుష్యం నివారించటంతోపాటు భూగర్భజలాల పెంపునకు చర్యలు తీసుకుంటేనే సమితి నివేదిక చెప్పిన ‘జల దివాళా’ నుంచి మనల్ని మనం రక్షించుకోగలం. ముప్పు ముంచుకొచ్చే వరకూ పట్టనట్టు ఉండటం క్షేమం కాదు. -
మళ్లీ గవర్నర్ల పంచాయతీ!
జవాబుదారీతనం కొరవడినచోట ఇష్టారాజ్యం నెలకొంటుంది. సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే చెప్పినా సమస్య ఎప్పటిలానే మిగులుతుంది. వార్తల్లో వ్యక్తులుగా ఉండా లనుకుంటారో, ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను తిప్పలు పెట్టాలనుకుంటారో... కొందరు గవర్నర్ల తీరు మాత్రం మారడం లేదు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మంగళవారం కొత్త తగువులు తీసుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో చేయాల్సిన ప్రసంగాన్ని కాదని రవి వాకౌట్ చేస్తే, కేంద్రాన్ని విమర్శించే ప్రస్తావనలున్న భాగాలను అర్లేకర్ చదవకుండా వదిలిపెట్టారు. రవి వివాదాలకు కొత్తగాదు. ప్రభుత్వం పంపిన పది బిల్లుల్ని దీర్ఘకాలం సమ్మతి తెలపకుండా, అలాగని అభ్యంతరాలేమిటో చెప్పకుండా తన దగ్గరే ఉంచుకున్న ఘనుడాయన. అందులో 2020 నాటి బిల్లు కూడా ఉంది! అందుకే రవి తీరును నిరుడు సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు బట్టింది. బిల్లుపై నిర్ణీత వ్యవధిలో గవర్నర్ ఏ మాటా చెప్పని పక్షంలో దాన్ని ఆమోదించి నట్టుగా భావించాలని కూడా తీర్పునిచ్చింది. రాష్ట్రపతి పరిశీలనకు పంపదల్చుకున్న బిల్లుల్ని గరిష్ఠంగా మూడు నెలలు మించి తమవద్ద ఉంచుకోరాదని, పునఃపరిశీలన కొచ్చిన బిల్లునైతే వెంటనే లేదా గరిష్ఠంగా నెలరోజుల్లోపల సమ్మతి తెలపాలని ధర్మాసనం తెలిపింది. అటు తర్వాత రాష్ట్రపతికిచ్చిన సలహాపూర్వక అభిప్రాయంలో బిల్లును ‘ఆమోదించినట్టుగానే పరిగణించాల’న్న భావన సరికాదని మరో ధర్మాసనం తెలిపింది. కానీ అందులో సైతం ‘దీర్ఘకాలం బిల్లును పెండింగ్‌లో ఉంచటం’ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయటమేనని స్పష్టం చేసింది. గవర్నర్ల వ్యవస్థ ఆది నుంచీ వివాదాస్పదమే. స్వర్గీయ ఎన్టీ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయంలో విపక్షాలను కూడగట్టి కేంద్రంపై రణభేరి మోగించారు. రాజకీయాలకు అతీతంగా ఆ వ్యవస్థ మనుగడ సాగించ లేకపోవటం ప్రజాస్వామ్య వ్యవస్థకు శాపంగా పరిణమించింది. రాజ్యాంగ నిర్ణాయక సభలో గవర్నర్ వ్యవస్థకు సంబంధించిన అధికరణాలపై జరిగిన చర్చ సందర్భంగా పలువురు సభ్యులు కేంద్రం నామినేట్ చేస్తే వచ్చే గవర్నర్‌కూ, రాష్ట్ర ప్రభుత్వానికీ అనవసర ఘర్షణలు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు. అయితే గవర్నర్‌గా వచ్చేవారు రాజ్యాంగపరిధిలో తమంత తాము నిర్వర్తించే కర్తవ్యాలు ఏమీ ఉండబోవనీ, రాష్ట్ర కేబినెట్ సలహా మేరకే వారు పనిచేస్తారనీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వారికి నచ్చజెప్పారు. ఇన్ని దశాబ్దాలు గడిచాక ఇప్పుడు జరుగు తున్నదేమిటి?వాకౌట్ చేయటానికి రవి చెబుతున్న కారణాలు సహేతుకమైనవి కాదు. సమా వేశాలను తమిళ రాష్ట్రగీతంతో మొదలుపెట్టి గవర్నర్ ప్రసంగం పూర్తయ్యాక చివరగా జాతీయగీతాలాపన ఉంటుందని ప్రభుత్వం చెప్పినా ఆయనకు రుచించలేదు. ఇతరేతర ఆరోపణలు రాజకీయ స్వభావం ఉన్నవి. వాటిని ఎటూ ప్రజాక్షేత్రంలో విపక్షాలు లేవనెత్తుతాయి. ఎన్నికల సమయంలో జనం తీర్పునిస్తారు. ఆ విషయంలో గవర్నర్‌గా రవి ఆత్రపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిందని ఆరోపించే ముందు గవర్నర్‌గా తన నిర్వాకమేమిటో ఆయన సమీక్షించుకోవద్దా? బిల్లుల్ని దీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచటం రాజ్యాంగ ఉల్లంఘనేనని గతంలో సుప్రీంకోర్టు చెప్ప లేదా? కేరళ గవర్నర్ రాజేంద్ర తీరు సైతం అలాగే ఉంది. రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన ప్రసంగపాఠంలో తనకు నచ్చని భాగాలు వదిలేయటం ఆశ్చర్యకరం. ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వానిదే పైచేయి కావాలి. అది రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడి, ప్రజల భద్రతకు ముప్పుగా మారితే వేరే విషయం. అలాంటపుడు కేంద్రానికి నివేదిక పంపి చర్య తీసుకోవాలని కోరవచ్చు. కానీ తమకు నచ్చని పార్టీ ఏలుబడి ఉన్నచోట చీటికీ మాటికీ రచ్చ ఏం సబబు? ఇటువంటి కీచులాటల్లో గవర్నర్‌దా... రాష్ట్ర ప్రభుత్వానిదా, ఎవరిది పైచేయి అని జనం చూడరు. మొత్తంగా వ్యవస్థ పట్లే అపనమ్మకం పెంచుకుంటారు. అందుకే హద్దులు గుర్తెరిగి ప్రవర్తించాలనీ, జవాబుదారీతనంతో వ్యవహరించాలనీ గవర్నర్లు తెలుసుకోవాలి. -
ట్రంప్ ప్రమాదకర పోకడ
వారానికో, పదిరోజులకో తన విధ్వంసక ప్రకటనలతో ప్రపంచాన్ని హడలెత్తించటం అలవాటు చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ఇప్పుడు దాన్ని నిత్యకృత్యంగా మార్చుకున్నట్టు కనబడుతోంది. డెన్మార్క్‌లో భాగమైన కీలకదీవి గ్రీన్‌ల్యాండ్ దురాక్రమణకు సమాయత్తమవుతూ, అందుకు అభ్యంతరం చెప్పిన యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలపై వచ్చే నెల 1 నుంచి పదిశాతం సుంకాలు విధిస్తానని బెదిరించి కయ్యానికి కాలుదువ్వారు. మరోపక్క గాజా పునర్నిర్మాణం కోసమంటూ తన ఆధ్వర్యంలో ‘శాంతిమండలి’ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ఆ మండలిలో ‘ఖరీదైన’ సభ్యత్వాన్ని ఇస్తానని భారత్‌తో సహా 60 ప్రపంచ దేశాలకు వర్తమానం పంపారు. ఎనిమిది దశాబ్దాల క్రితం హిట్లర్ రూపంలో తలెత్తి ప్రపంచాన్ని చాప చుట్టేయాలని చూసిన నియంతను వదుల్చుకోవటానికి ఎంత మారణహోమం చవి చూడాల్సి వచ్చిందో, ఎన్ని కోట్లమంది బలిదానాలు చేయాల్సి వచ్చిందో తెలిసి కూడా ఏడాదిగా బుజ్జగింపు ధోరణితో పొద్దుపుచ్చిన దేశాలకూ, ఐక్యరాజ్యసమితికీ తాజా పరిణామాలు ఒక పెద్ద షాక్. తాను ఆశించినట్టు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు గనుక ఇక శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం ట్రంప్‌కు లేదట. అమెరికాకు ఏది ప్రయోజనకరమో అదే చేస్తారట!గాజాపై ఏర్పాటు చేయదల్చుకున్న శాంతి బోర్డుకు తలాతోకా లేదు. అది గాజాకే పరిమితమై ఉండదట. భవిష్యత్తులో వేరే దేశాల వివాదాల్లో తలదూరుస్తుందట! బోర్డుకు ట్రంప్ జీవితకాల అధ్యక్షుడు. అందులో ‘రా రమ్మ’ని పిలిచిన దేశానికి మూడేళ్లపాటు సభ్యత్వం ఇస్తారు. శాశ్వత సభ్యత్వానికైతే వందకోట్ల డాలర్లు చెల్లించాలి. గాజాలో అంతంతమాత్రంగా అందుతున్న సాయాన్ని కూడా ఆపటానికీ, అక్కడ ఉంటున్నవారి కడుపుమాడ్చి వెళ్లగొట్టడానికీ, నరమేధం ఆనవాళ్లు చెరిపేయటానికీ తోడ్పడటమే ఈ బోర్డు ఏర్పాటు ఆంతర్యం. నిజానికి ఈ బోర్డు ఆలోచన భద్రతామండలిది. 2027 చివరి వరకూ ఈ బోర్డు గాజా ఘర్షణలపై దృష్టి సారిస్తుందని ద్రతామండలి మొన్న నవంబర్‌లో ప్రకటించింది. గాజాలో రెండేళ్లపాటు మారణహోమం సాగించిన ఇజ్రాయెల్‌నూ, దానికి ప్రత్యక్షంగా సహకరించిన అమెరికానూ పల్లెత్తు మాట అనని మండలి... దొంగ చేతికి తాళం చెవులు అప్పగించినట్టు గాజాను ఉద్ధరించటానికి పూనుకోవాలని అగ్ర రాజ్యాలను కోరుతూ తీర్మానించింది. ఇంతకూ ట్రంప్ బోర్డూ, ఐక్యరాజ్యసమితి బోర్డూ వేర్వేరా... ఒకటేనా అనేది ఎవరికీ తెలియదు. దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేకపోవటం వల్ల కావొచ్చు... సమితి కూడా అస్పష్టంగా మాట్లాడుతోంది. ‘సభ్యదేశాలు ఎవరికి నచ్చిన గ్రూప్‌లో వారు చేరొచ్చ’ని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ చేతులు దులుపుకొన్నారు. అమెరికా అధ్యక్ష పదవే ఇంకో మూడేళ్ల ముచ్చట కాగా,శాంతి బోర్డుకు యావజ్జీవ అధ్యక్షుడెలా కాగలరో అనూహ్యం. ఒక దేశంగా ఇందులో అమెరికా ప్రమేయం కూడా ఉండదా? ఇది ట్రంప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? ఏమైనా కావొచ్చు. అమెరికా సుంకాలతో బెదిరించినా... ఏ సార్వభౌమాధికార దేశమైనా ఇందులో భాగస్వామ్యానికి అంగీకరించగలదా? బలహీనంగా కనబడే దేశాలను కించపరచటం, పాదాక్రాంతం చేసుకునేందుకు ప్రయత్నించడం ట్రంప్ నైజం. అమెరికా స్వప్రయోజనాల కోసం నాటో తీసుకొస్తే, భద్రతకు పూచీపడుతుందని నమ్మి అందులో చేరిన ఈ దేశాలు ఇప్పుడు అమెరికాయే దండ యాత్రకు పూనుకోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. డెన్మార్క్‌లో స్వయంప్రతిపత్తి గల గ్రీన్‌ల్యాండ్ పేరుకు ప్రపంచంలోనే పెద్ద దీవి. జనాభా 60,000 మించదు. వివాదం ఎందుకని అప్పగిస్తే అమెరికా హిరణ్యాక్షుడు శాంతిస్తాడన్న నమ్మకం లేదు. అలాంటి హిరణ్యాక్షులు ఇంకా ఇద్దరున్నారు. చైనా తైవాన్‌నూ, రష్యా ఉక్రెయిన్‌నూ కబళించే యత్నం చేస్తాయి. ఇలా కండబలంతో ఎవరికి వారు చెలరేగితే ఈ ప్రపంచం మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. కనుక ఇన్నాళ్ల బుజ్జగింపులకూ స్వస్తిచెప్పి యూరప్ దేశాలు ఇకనైనా దృఢంగా నిలబడాలి. 75 ఏళ్ల చరిత్రలో ఎందుకూ కొరగాని ‘నాటో’ ఉన్నా ఊడినా ఒకటేనన్న తెలివి తెచ్చుకుని, ప్రతీకార సుంకాలతో జవాబీయాలి. గాజా శాంతిబోర్డు పైనా ఛీత్కారాలు వెల్లువెత్తాలి. అప్పుడు మాత్రమే ట్రంప్ దారికొస్తారు. -
కరుణ ముఖ్యం
ఒక రైతు పెంచుకుంటున్న కుక్క ఆ రోజు కనపడలేదు. ఇంటికి రాలేదు. రైతు వెతకబోయే వేళకు చీకటి పడిపోయింది. రైతు విలవిలలాడిపోయాడు. రైతుకూ కుక్కకూ ఉన్న అనుబంధం గ్రామస్థులకు తెలుసు. రాత్రంతా జాగారం చేస్తున్న రైతు బాధ గమనించి తెల్లవారుతూనే రైతుకు సాయంగా కుక్కను వెతక బయలుదేరారు. వెళ్లగా వెళ్లగా వంతెన కింద మట్టిలో కుక్క పడుకుని కనిపించింది. వంతెన మీద నుంచి గ్రామస్థులు ఎంత పిలిచినా అది లేచి రాలేదు. ఏమై ఉంటుందా అని గ్రామస్థులు వంతెన దిగి కుక్క దగ్గరకు వెళితే అక్కడ కుక్క కుక్కలా లేదు. వెచ్చటి రగ్గులా ఉంది. ఎవరిదో తెలియని కుక్కపిల్ల చలికి వణుకుతూంటే దాని ఒళ్లు వెచ్చబెట్టేందుకు రాత్రంతా ఇంటికి రాకుండా కరుణతో కాపాడుతూ ఉంది. గ్రామస్థులు ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడ్డారు. దీనికి ఉన్న కరుణ మనిషికి ఎందుకు లేదు?దేశంలో ఈ గడ్డకట్టే చలిగాలుల్లో, నెత్తి మీద కాసింత నీడ లేక, ఉత్తబిత్తల ఆకాశం కింద, తోచిన గుడ్డ కప్పుకుని వేలాదిమంది అభాగ్యులు రాత్రుళ్లు దయనీయంగా పడు కుని ఉన్న దృశ్యాలు మీడియాలో వస్తున్న వేళ – ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో నోబెల్ శాంతి విజేత ‘లైమా గ్బవీ’ తమ ఆఫ్రికా దేశపు కథను చెప్పడం కేవలం యాదృచ్ఛికం. ఆమె చెప్పిన కథకు కొనసాగింపుగా మరో నోబెల్ శాంతి విజేత కైలాశ్ సత్యార్థి తన జీవితంలో ఎదురైన ఘటనను చెప్పుకొచ్చారు – చాలా ఏళ్ల కిందటి మాట. ఒక తండ్రి నా తలుపు తట్టాడు. అయ్యా... నా కూతురిని రక్షించు అన్నాడు. అప్పుడు చిన్న పత్రికను నడుపుతున్నాను. ఉత్తరప్రదేశ్ నుంచి పంజాబ్‌కు 30 కుటుంబాలు పనికి వెళితే వారిని కట్టు బానిసలుగా చేశారనీ, మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారనీ, తన కూతురు వయసుకు రావడం చూసి అమ్మేయబోతున్నారనీ, పోలీసులు సాయానికి రాకపోవడం వల్ల పత్రికలో రాస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందని వచ్చాననీ ఆ తండ్రి నాతో ఏడుస్తూ చెప్పాడు. పత్రికలో ఆ విషయం రాయడానికి కూచుని వెంటనే పెన్సిల్ పక్కన పడేశాను. అక్కడ ఉన్నది నా కూతురో, చెల్లెలో అయితే ఇలా వ్యాసం రాస్తూ కూచుంటానా? అనుకున్నాను. ఆ తర్వాత నా తల పగిలి ఉండొచ్చు. వెన్నుపూసను విరిచినంత పని చేసి ఉండొచ్చు. నా కాలిని విరగ్గొట్టి ఉండొచ్చు. కాని ఇప్పటికి లక్షా ముప్పై వేల మంది అలాంటి పిల్లలను కాపాడాను. వారి ఆనంద బాష్పాలలో నేను దేవుణ్ణి చూశాను. కరుణే నాకు ఇంత శక్తి ఇచ్చిందని అనుకుంటున్నాను.‘మనిషి మంచివాడే. నాగరికత వల్ల చెడిపోయాడు’ అన్నాడు రూసో. నాగరికత అంటే గాలి కూడా పీల్చడానికి వీల్లేనంతగా అభివృద్ధి చెందడం కాబోలు! మరి చెడి పోవడం అంటే? కరుణ అడుగంటిన వాడు అవడమే! కరుణ లేకపోతే ఏమవుతుంది? పీడన, పెత్తనం, చెడు, దుర్మార్గం, నిస్సహాయత, హింస, దౌర్జన్యం... కళ్ల ముందు కని పిస్తున్నా చలించని జడత్వం వస్తుంది. జడత్వం రాయి. కరుణ జల. తల్లిదండ్రులకు తమ పిల్లల ఐ.క్యూ (ఇంటెలిజెన్స్ కోషియెంట్) బాగుండాలని ఉంటుంది. కాని పిల్లల్లో చూడాల్సింది, పాదుకొనేలా చేయాల్సింది సి.క్యూ. అంటే ‘కంప్యాషన్ కోషియెంట్’. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత సంతోషపడాలి. చీకట్లో నల్లపూస దొరకగలదేమోగానీ నేటి మనిషిలో కరుణ దొరకడం దుర్లభం అవుతోంది.అందుకే మనిషికి ఇంకో మనిషి, వర్గం, ప్రాంతం, కులం, మతం... అన్నింటి పట్లా విరోధభావం, శత్రుత్వం. తుదకు పశుజాలం పట్ల కూడా మనిషి కరుణ చూపడం లేదు. మనిషికి కరుణ ఉంటే నదులు, పర్వతాలు, అడవులు ఇలా ఉండేవా? అన్నారు కైలాశ్ సత్యార్థి. అందుకే మనిషిలో ‘సి.క్యూ’ కొలవగలిగే యాప్‌ను కనిపెట్టాలి. అది ఎక్కువ కలిగిన వారినే వివాహానికి, ఉద్యోగానికి, రాజకీయ పదవులకి ఎన్నుకోవాలి. స్కిల్స్ పెంచుకోవడానికి శిక్షణ ఇచ్చినట్టే కరుణ పెంచుకోవడానికి శిక్షణ ఇవ్వాలి అన్నారు సత్యార్థి.జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో ఆయన తాజా పుస్తకం ‘కరుణ: ది పవర్ ఆఫ్ కంప్యాషన్’ ఆవిష్కరణ వేడుకలో ఇంటిని, కుటుంబాన్ని, సరిహద్దులను దాటి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ చేరగల కరుణ అవసరం గురించి ఇలాంటి మాటలెన్నో సాగాయి. ‘త్రుంచ బోకుము... తల్లికి బిడ్డకు వేరు చేతువే’ అని విలపించిన కరుణశ్రీ నడిచిన తెలుగు నేలకు కరుణ తెలియదా ఏమి? కాకుంటే కాస్త మరుగున పడి ఉంటుంది, మరుపున అణిగి ఉంటుంది అంతే! -
విద్యాహక్కుకు చికిత్స!
జన సంక్షేమ చట్టాల్ని నీరుగార్చటంలో మనకెవరూ సాటిరారని పదహారేళ్ల నాడు సాకార మైన విద్యాహక్కు చట్టం నిరూపించింది. 6–14 మధ్యవయసు పిల్లలకు ప్రాథమిక విద్య తప్పనిసరి చేసే ఆ చట్టాన్ని అమలుచేసే రాజ్యాంగ బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదని మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేయాల్సి వచ్చింది. ఇతర ప్రాథ మిక హక్కులకూ, 21ఏ అధికరణం కింద వచ్చి చేరిన విద్యాహక్కుకూ మౌలికంగా వ్యత్యాసం ఉంది. ఇతర హక్కులన్నీ పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకూ, జీవించే హక్కుకూ ముడిపడినవైతే, ఇదొక్కటీ ప్రాథమిక విద్యను పిల్లల హక్కుగా పేర్కొంటు న్నది.విద్యాహక్కు చట్టం, 2009 ప్రకారం అణగారిన వర్గాల కుటుంబాల పిల్లలు తమ పొరుగునున్న గుర్తింపు పొందిన ఏ పాఠశాలలోనైనా ఉచితంగా విద్య పొందవచ్చు. అలాంటి వారి కోసం ప్రతి విద్యాసంస్థా 25 శాతం సీట్లు అందుబాటులో ఉంచాలి. ఆ వర్గాల పిల్లలు దరఖాస్తు చేస్తే, ఫీజులు చెల్లించరన్న సాకుతో ప్రవేశం నిరాకరించకూడదు. వారి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలి. చూడటానికీ, వినటానికీ ఎంత బాగుంది! కానీ సంకల్పమే కొరవడింది.దీని అమలు 2010 ఏప్రిల్ 1న మొదలైనప్పుడు కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని అందరూ వేనోళ్ల కొనియాడారు. అప్పటికే ప్రాథమిక విద్యను హక్కుగా చేసిన 137 దేశాల సరసన మనం కూడా చేరామని సంబరపడ్డారు. ఏడాది తిరిగేసరికే దాని వాలకం తెలిసి పోయింది. విద్యారంగ నిపుణులు ఎప్పటికప్పుడు ఈ విషయంలో హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలకు పట్టలేదు. ‘ఎవరికి పుట్టిన బిడ్డో...’ అన్నట్టు అనాథగా మారిన ఆ చట్టంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సమాజ పురోగతిలో విద్యాసంస్థలు బలమైన ఉపకరణాలు.అందుకే అణగారిన వర్గాలకు మాత్రమే కాదు... కుల,మత, ఆర్థిక స్థోమతలతో సంబంధం లేకుండా పీజీ వరకైనా అందరూ ఉచితంగా చదువుకునే అవకాశం ఉండాలి. పాశ్చాత్య దేశాల్లో పీహెచ్డీ స్థాయిలో సైతం అందరికీ ఉచితంగా ప్రవేశాలిస్తున్నారు. అందువల్లే అక్కడ ప్రపంచాన్ని శాసించే సంస్థలు ఆవిర్భ విస్తున్నాయి. సృజనాత్మకతలు వెల్లివిరుస్తున్నాయి. విద్యపై చేసే వ్యయాన్ని ఖర్చుగా కాక, అది భవిష్యత్ సమాజ నిర్మాణానికి పెట్టే పెట్టుబడిగా పరిగణించాలి. అదంతా దురాశ అవుతుందేమోగానీ... కనీసం ఒకటి నుంచి ఎనిమిదో తరగతిలోపు అట్టడుగు వర్గాల పిల్లలకు కూడా ఉచిత విద్య అందించలేక పోవటం తలదించుకోవా ల్సిన విషయం కాదా? అమలు చేతగానప్పుడు ఘనంగా కనబడేలా చట్టం చేయటం ఎందుకు? దాన్ని ప్రాథమిక హక్కు చేశామన్న చాటింపు దేనికి? మహారాష్ట్రకు చెందిన ఒక పౌరుడు తన పిల్లలకు దగ్గర్లోని ప్రైవేటు విద్యాసంస్థ ప్రవేశం కల్పించటం లేదని, ప్రభుత్వ యంత్రాంగం కళ్లు మూసుకుందని సుప్రీంకోర్టు తలుపుతట్టడంతో ఈ సమస్య చర్చకొచ్చింది.ఇది ఆయనొక్కరి సమస్య మాత్రమే కాదు... దేశంలోని పలువురు తల్లిదండ్రులది కూడా! గత్యంతరంలేని స్థితిలో చేర్చుకున్నా అలాంటి పిల్లల్ని ‘వెలి’ వేసి, విడిగా చదువు చెబుతున్న ఘనులు కూడా ఉన్నారు. ఇందుకు కారణం కార్పొరేట్ విద్యా మాఫియాల పలుకుబడి ప్రభుత్వాల్లో పెరగటమా లేక పిల్లల తరఫున ప్రభుత్వాలు చెల్లించాల్సిన ఫీజులు ఎగ్గొట్టడమా? ఈ రెండూ కారణాలైనా ఆశ్చర్యం లేదు. లాభార్జనపై పెద్దగా దృష్టిపెట్టకుండా తక్కువ ఫీజులతో విద్యాసంస్థలు నడిపే వారే ప్రభుత్వాలకు జడిసి అంతో ఇంతో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. లేకుంటే తమ సంస్థ గుర్తింపు ఏదో సాకుతో రద్దుచేస్తారన్న భయం వారిని నిరంతరం వెంటాడు తుంటుంది.ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ చట్టం అమలుకు రూపొందించిన మార్గదర్శకాలు ప్రశంసించదగ్గవి. అన్ని స్థాయుల అధికారుల ప్రమేయాన్ని పెంచి, లోటుపాట్లు కనబడిన మరుక్షణం వాటిని నివారించగలిగే వ్యవస్థను ధర్మాసనం సూచించింది. అందుకు అనుగుణంగా నియమ నిబంధనలు రూపొందించి సక్రమంగా అమలు చేయటం ప్రభు త్వాల బాధ్యత. పైచదువుల్లో ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలు ఆచరణలో అటకెక్కిస్తున్న ప్రభుత్వాలు... చిన్నపిల్లలైనా సక్రమంగా చదివేలా చూడలేకపోతున్నాయంటే క్షమార్హం కాదు. -
ముంబైని గెలిచేదెవరు?
దాదాపు దశాబ్ద కాలం తర్వాత బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి గురువారం ఎన్నికలు జరగబోతున్నాయి. రెండు కోట్లమంది జనాభాతో, కోటి మూడు లక్షలమంది ఓటర్లతో ఉండే ఆ మహానగరం మొగ్గు ఎటువైపుందోనన్న ఉత్కంఠ సామాన్యుల్లో మాత్రమే కాదు... రాజకీయపక్షాల్లో సైతం నెలకొనివుంది. ఇన్నాళ్లూ కరోనా మహమ్మారి, ఓబీసీ కోటాపై నడిచిన కోర్టు కేసులు ఎన్నికలకు ఆటంకంగా నిలిచాయి. దేశంలోనే అత్యంత సంపన్నవంతమైన కార్పొరేషన్‌గా, దాదాపు రూ. 60,000 కోట్ల బడ్జెట్‌తో ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాలను ముంబై మించిపోయింది. అధికార మహాయుతి కూటమిలో ఉంటూ కీచులాడుకుంటున్న పార్టీలను ఏకం చేయటంతోపాటు, రెండు దశాబ్దాల నుంచి దూరదూరంగా ఉంటున్న దాయాదులు ఠాక్రే సోదరుల్ని సైతం కలిపిన ఘనత ఈ ఎన్నికలదే. ఇంతవరకూ తనతో కలిసి నడిచిన ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లు దూరం జరగటంతో గత్యంతరం లేని కాంగ్రెస్ ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ)తో పొత్తు పెట్టుకుంది. 1998 నాటి లోక్‌సభ ఎన్నికల్లో తమ రెండు పార్టీలూ మహారాష్ట్రలో మెజారిటీ స్థానాలు గెల్చుకున్నాయని గుర్తుచేస్తోంది. బీఎంసీ అనగానే కాంట్రాక్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మహానగర పాలనాధికారం వగైరాలుంటాయి గనుక ఈ ఎన్నికల్లో విజేతగా ఆవిర్భవించే పార్టీ అదుపులో పుష్కలంగా నిధులు, దండిగా రాజకీయ పలుకుబడి, అస్మదీయులకు పంచి పెట్టేందుకు రకరకాల ప్రాజెక్టులు సిద్ధంగా ఉంటాయి. రాష్ట్రాన్నేలుతున్న బీజేపీ–షిండే శివసేన–అజిత్ పవార్ ఎన్సీపీలతో కూడిన మహాయుతి ఇప్పటికే బీఎంసీ తమ చేతి కొచ్చినంత ఆత్మవిశ్వాసంతో ఉంది. తమ రాజ్యాధికార శక్తి, సంస్థాగత నిర్మాణం అందుకు తోడ్పడగలవని భావిస్తున్నాయి. శివసేన పేరునూ, గుర్తునూ ఏక్నాథ్ షిండే కైంకర్యం చేయగా బలహీనపడిన ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన(యూబీటీ) గత్యంతరం లేక ఇరవయ్యేళ్ల క్రితం వేరుపడిన దాయాది రాజ్ ఠాక్రేకు సన్నిహితమై ఆయన పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్)తో పొత్తు పెట్టుకుంది. ఎప్పటిలా ముంబైలో యూపీ, గుజరాత్, బిహార్‌ల నుంచి వలసొచ్చేవారితో మరాఠీలకు అన్యాయం జరుగుతున్నదంటూ ఆ సోదర ద్వయం నిప్పులు చెరుగుతోంది. త్రిభాషా సూత్రాన్ని మహాయుతి సర్కార్ ఆ మధ్య అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం మరాఠీ ప్రజల్ని దెబ్బతీయటానికేనన్నది వారి అభియోగం. అయితే బీఎంసీ పరిధిలో మరాఠీ మాట్లాడే వారు 30 శాతం మించరు. 1960ల్లో శివసేన ఎదుగుదలకు తోడ్పడిన ప్రాంతీయత, అస్తిత్వవాదం ఇప్పుడేమాత్రం పనికొస్తాయన్నది పెద్ద ప్రశ్న. అందుకే కావొచ్చు... ఇళ్లల్లో పనిచేసే మహిళలకు నెలకు రూ. 1,500; 700 చదరపు అడుగుల వరకూ ఉండే ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు వగైరా హామీలిస్తున్నారు.ముంబైకి పెట్టుబడుల వరద పారించామంటూ ఎన్నికల ప్రచారం మొదలెట్టిన బీజేపీ ప్రత్యర్థుల దూకుడు చూసి పంథా మార్చుకుంది. నగరంలో ‘బెస్ట్’ బస్సుల్లో మహిళలకు 50 శాతం రాయితీ, వచ్చే అయిదేళ్లూ మున్సిపల్ చార్జీల పెంపుపై మారటోరియం, నిరుపేదలకు ఇళ్లు వగైరాలు మాట్లాడుతోంది. ఆ పార్టీ వలసొచ్చినవారి ప్రయోజనాలకే పాటుబడుతున్నదన్న అనుమానాలున్నా, మరాఠీ మధ్యతరగతి వర్గానికి దగ్గరయ్యామని బీజేపీ భావిస్తోంది. ఆ సంగతలా ఉంచి ఈ ఎన్నికల్లో కూడా ఉచితాలు వినబడటం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రభుత్వాలతో పోలిస్తే రుణ సేకరణకు పరిమితులుండే కార్పొరేషన్లలో ఇలాంటి రాయితీలు, వాగ్దానాలు ఆచరణ సాధ్యమేనా అని చూడటం లేదు. దేశంలో అన్ని కార్పొరేషన్ల మాదిరే బీఎంసీకి... ఆమాటకొస్తే దాంతోపాటే ఎన్నికలు జరగబోతున్న మహారాష్ట్రలోని మరో 28 కార్పొరేషన్లకూ ఎన్నో సమస్యలున్నాయి. ఉపాధి లేమి, ప్రాథమిక సదుపాయాల లేమి, అస్తవ్యస్త రహదారులు వగైరాలు అందులో కొన్ని. అయితే భావోద్వేగాలూ... లేకుంటే తాయిలాలూ తప్ప ఏ పార్టీ దగ్గరా భవిష్యత్తుకు పనికొచ్చే పథకాలున్నట్టు కనబడదు. దేశ ఆర్థిక రాజధానిగా ఉంటున్న ముంబై ఎటు మొగ్గినా దానికి పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదని ఎన్నికల ప్రచారం తంతు చూస్తే అనిపిస్తుంది. -
వీధికుక్కల బెడద తీరేదెలా?
మనిషికి ఎప్పుడు మచ్చికైనాయో, ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పలేం గానీ మహాభారత కాలం నుంచి శునకాల ప్రస్తావన ఉంది. ఆ కథాప్రారంభంలోనూ, ముగింపులోనూ అవి తారసపడతాయి. వీధి కుక్కల్ని అక్కున చేర్చుకుని, వాటికి ఆహారపానీయాలు అందించే వారూ, కుక్కల జోలికి ఎవరైనా పోతే ఆగ్రహించి కేసు పెట్టే జంతుప్రేమికులూ ఎప్పుడూ ఉన్నారు. కానీ ఈమధ్య అలాంటివారు ఏటికి ఎదురీదాల్సి వస్తోంది. గతంలో మాదిరి సానుభూతితో అర్థం చేసుకునేవారూ, ఆ సమస్యపై మౌనంగా ఉండిపోయేవారూ తగ్గారు. జంతు ప్రేమికుల్ని ఇరకాటంలో పెట్టేలా, వారిని సవాలు చేసేలా నిలదీస్తున్న వారి స్వరాలు కూడా వినిపిస్తున్నాయి. మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో వీధికుక్కల బెడదపై సాగుతున్న విచారణలో త్రిసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు సంధించిన ప్రశ్నలు ఆలోచించదగినవి. వీధికుక్కలపై ప్రేమతో వాటికి ఆహారం పెట్టే వారు తమ ఇళ్లకు తీసుకుపోయి ఆ పని ఎందుకు చేయరని ధర్మాసనం ప్రశ్నించింది. కేవలం కుక్కలపైనే అంతగా భావోద్వేగాలు ఎందుకుంటాయని అడిగింది. వీధికుక్కలు హఠాత్తుగా దాడి చేస్తే ఆ బాధ్యత ఎవరిదని నిలదీసింది.మనిషి పోయినచోటికల్లా, వారి ఆవాసాలున్న చోటల్లా సహజంగానే కుక్కలు వచ్చి చేరుతాయి. పాశ్చాత్య దేశాల్లో ఎక్కడా వీధి కుక్కల బెడద ఉండదు. వెనకబడిన దేశాల్లో మాత్రమే అవి మనుషులతో సహజీవనం సాగిస్తుంటాయి. కుక్కల జనాభా ఎంతో, అవి తామరతంపరగా పెరిగితే తలెత్తే సమస్యలేమిటో ప్రభుత్వాలు ఎప్పుడూ దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. 2023లో తొలిసారి యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) నిబంధనలు రూపొందాయి. వాటి అమలు బాధ్యత పురపాలక సంస్థలూ, పంచాయతీలదే! కానీ ఎక్కడా పట్టించుకోరు. అదేమని అడిగేవారూ లేరు. ఒక పసికందునో, రోడ్డున పోయే మరొకరినో దాడి చేసి కరిచినప్పుడూ... ప్రాణాలు కోల్పోయే స్థితి ఏర్పడినప్పుడూ మాత్రమే మీడియాలో ప్రముఖంగా వస్తుంది. ఆ వెంటనే ఒకటి రెండు రోజులు కుక్కల్ని బంధించే స్థానిక సంస్థల సిబ్బంది కనబడతారు. మళ్లీ మరొకటి జరిగేవరకూ అది మరుగునపడుతుంది.మనుషుల పట్ల కుక్కల ప్రవర్తనే వాటి విషయంలో ఏమేం చర్యలు తీసుకోవాలో చర్చించే సందర్భం కావటమే అసలు సమస్య. మహానగరాలు మొదలుకొని మారుమూల పల్లెటూళ్ల వరకూ అన్నిచోట్లా కుక్కలున్నప్పుడు వాటిపై ఒక విధానం అవసరమని, నియంత్రణలో పెట్టడం మంచిదని పాలకులకు తోచదు. మీడియాలో అతి ప్రచారం వల్లే ఈ సమస్య జటిలంగా కనిపిస్తున్నదని ఒక న్యాయవాది చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు...’అని జర్నలిజంలో నానుడి ఉంది. అందుకైనా కాకపోయినా రేబిస్ మరణాల వల్లనో, కుక్కల కారణంగా ద్విచక్రవాహనదారుడు మరణించినప్పుడో, ఒక పసికందును నోట కరుచుకు పోయినప్పుడో మీడియాకు వార్తలవుతాయి. మామూలు కుక్కకాట్లు వార్తలకెక్కవు. దాదాపు పదిహేనేళ్ల క్రితం ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక మన వీధికుక్కల ప్రతాపంపై పెద్ద కథనం ప్రచురించింది. ఏటా లక్షలాదిమందిని అవి కరుస్తుంటాయని, వాటివల్ల ప్రతియేటా 20,000 మరణాలు సంభవిస్తాయని దాని సారాంశం. ‘పశ్చాత్తాపం ఏ కోశానా లేని ఈ శునకరూప హంతకులతో సహజీవనం ఎలా?’ అని వాపోయింది. రేబిస్ వ్యాధిగ్రస్థుల సంఖ్య ఆధారంగా వీధి కుక్కల గణాంకాలు కష్టమే. ఎందుకంటే ఇందులో పెంపుడు కుక్కల వల్ల వ్యాధిబారిన పడినవారూ ఉంటారు. ఏదేమైనా వీధి కుక్కల బెడద విషయంలో సుప్రీంకోర్టు ఉదాసీనంగా ఉండదల్చు కోలేదని ధర్మాసనం చేసిన వ్యాఖ్యల్నిబట్టి గ్రహించవచ్చు. వీధికుక్క కాటుకూ, అందువల్ల సంభవించే మరణానికీ మూల్యం చెల్లించక తప్పదని కేంద్రాన్నీ, రాష్ట్ర ప్రభుత్వాల్నీ ధర్మాసనం హెచ్చరించింది. వీధికుక్కలకు ఆహారం అందించేవారు సైతం వాటి దాడులకు బాధ్యులవుతారని తెలిపింది. సమస్య ఉన్న సంగతిని అందరూ అంగీకరిస్తున్నారు. కానీ పరిష్కారమే సాధ్యపడటం లేదు. ఏబీసీ నిబంధనలు అమలైతే ఇబ్బందే ఉండదని జంతు ప్రేమికుల వాదన. కానీ వాటిని అమలు చేయాల్సిందెవరు? అందుకు మూల్యం చెల్లిస్తున్నదెవరు? ఆలోచించాలి. -
అష్టదిగ్బంధంలో ఇరాన్!
సమస్యలున్నచోట నిప్పురాజేయటం సులభం. నిన్న మొన్నటివరకూ అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులతో ఊపిరాడని ఇరాన్ ఇప్పుడు నిరసనలతో అట్టుడుకుతోంది. భవనాలు, బస్సులు, దుకాణాలు తగలబడుతున్నాయి. రాజధాని తెహ్రాన్ నగరం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. అదొక్కటే కాదు...దేశంలోని 31 ప్రావిన్సుల్లో ఉన్న 180 నగరాలు, పట్టణాలు ఇప్పుడు ఆగ్రహావేశాలతో రగులుతున్నాయి. ద్రవ్యోల్బణం చుక్కలనంటుతూ, కరెన్సీ విలువ పడిపోతూ దుర్భర దారిద్య్రాన్ని ఎదుర్కొంటున్న జనం గత రెండువారాలుగా రోడ్లపై వెల్లువెత్తుతుండగా, ఇంతవరకూ సైన్యం, పోలీసులు జరిపిన కాల్పుల్లో 538 మంది మరణించారు. పదివేలమందిని జైళ్లలోపెట్టారు. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనిజులాలో సాధించలేనిది ఇరాన్లో సునాయాసంగా చేయగలిగారు. వెనిజులాలో ఇదే మాదిరి ప్రేరేపించి, ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందన్న సాకుతో అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించాలని ట్రంప్ ఏడాదిగా ప్రయత్నించారు. అది అసాధ్యం కావటంతో నేరుగా సైన్యాన్ని పంపి మదురో దంపతుల్ని అపహరించారు. ప్రస్తుతం ఇరాన్‌పై దాడులు చేయటానికి అమెరికా సంసిద్ధమవుతోంది.దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా అమెరికా, పాశ్చాత్యదేశాలు పగబట్టి అమలు చేస్తున్న ఆర్థిక ఆంక్షలతో ఇరాన్ తీవ్రంగా దెబ్బతింది. నిత్యావసరాలు దొరక్క ప్రజలు సతమతమవుతున్నారు. ప్రాణావసర ఔషధాల కొరత వేధిస్తోంది. తగిన వైద్య సదుపా యాలు కరవై రోగాల బారిన పడిన చిన్నపిల్లలు కన్నుమూస్తున్నారు. ఇలాంటి పరిస్థి తుల్లో ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు పెల్లుబకటం, నిరసనలు వెల్లువెత్తడంలో ఆశ్చర్య మేమీ లేదు. ఇటీవల ఆందోళనకారుల నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్లో విదేశీ మహిళగా భావిస్తున్న ఒకామె అరెస్టయినప్పుడు ఏం చేయాలో, ఎలాంటి ప్రకటన లివ్వాలో చెప్పే వీడియో బయటికొచ్చింది. తమ వెనుక ఎవరూ లేరని... దుర్భర పరిస్థి తుల్ని తట్టుకోలేక నిరసనల్లో పాలుపంచుకుంటున్నట్టు చెప్పాలన్న హితబోధ ఉంది. ఇరాన్‌కు ఇలాంటి నిరసనలు కొత్తగాదు. 1979లో ఇరాన్ షా మహమ్మద్ రెజా పెహ్లవీని గద్దెదించిన ఇస్లామిక్ విప్లవం అనంతరం పాశ్చాత్య దేశాలు సమయం కోసం కాచుక్కూర్చున్నాయి. 2022లో మహిళల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం, ఉనికి కోసం అంటూ సాగిన ఉద్యమాన్ని ప్రభుత్వం అణిచేయగలిగింది. ఇక అడపా దడపా ఏదో ఒక వంకతో ఇరాన్‌పై క్షిపణుల్ని ప్రయోగించటం, దేశ సైన్యంలో కీలకపాత్ర పోషిస్తున్న వారిని, అణు శాస్త్రవేత్తలనూ హత్యలు చేయించటం ఇజ్రాయెల్‌కు రివాజు. ఇలా జరిగిన ప్రతిసారీ ద్రోహుల్ని పట్టుకున్నామని ప్రభుత్వం ప్రకటించి, బహిరంగంగా ఉరిశిక్షలు అమలు చేస్తోంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఆందోళనల తీవ్రత ఎక్కువుంది. దిగువ తరగతి ప్రజలతో పాటు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు కూడా ఈ నిరసనల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. నిరసనలు చల్లార్చటానికి ప్రభుత్వం ప్రయత్నించకపోలేదు. దుకాణదారుల డిమాండ్లకు స్పందనగా సెంట్రల్ బ్యాంకు గవర్నర్‌ను మార్చారు. ప్రతి ఇంటికీ నెలకు ఏడు డాలర్ల మొత్తం ఇచ్చేందుకు అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అంగీకరించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఉద్యమకారులు వెనక్కి తగ్గేది లేదన్నారు. సాధారణ ప్రజానీకం సమస్యల్ని పరిష్కరిస్తానని, ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తానని అధికారంలోకొచ్చిన మసూద్ పూర్తిగా విఫలమయ్యారు. ప్రభుత్వంలో పెచ్చరిల్లిన అవినీతిని అరికట్టలేక పోయారు. ప్రజల్లో అసంతృప్తి కనబడుతున్నా నాయకత్వం నిస్తేజంగా ఉండిపోయింది. పైపెచ్చు నిరసనల్లో పాల్గొంటున్న వారిని ‘దేవుడికి వ్యతిరేకంగా యుద్ధం సాగిస్తున్నార’ంటూ కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం ప్రజల్ని మరింత రెచ్చగొట్టింది. ఈ నేరారోపణ కింద ఉరిశిక్షతో సహా కఠినమైన శిక్షలు విధించటానికి ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది. అమెరికాలో స్థిరపడిన ఒకప్పటి నియంత ఇరాన్ షా కుమారుడు రెజా పెహ్లావి తానొచ్చి దేశాన్ని ఉద్ధరిస్తానంటున్నారు. ఛాందసవాద ధోర ణుల్ని తగ్గించుకుని ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పితే తప్ప బలప్రయోగంతో నిరసనలు అణిచేయటం అసాధ్యమని ఇరాన్ పాలకులు గుర్తించాలి. -
శీతకాలం కోత పెట్టగ...
చల్లదనం గురించీ, వేడి గురించీ ఒక్కోసారి మన ఊహల్ని తలకిందులు చేస్తూ, మాటలకు మనమిచ్చే అర్థాలను సవరించుకోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. ఈ శీత ఋతువులో అదే జరుగుతోంది. శీతవాయువు కోతకత్తిగా మారి శరీరాన్ని నిలువునా కోసి చలికారం అద్దుతోంది. మండువేసవిని మించి, రోజంతా చలి దహిస్తోంది. బతుకైనా, బాగైనా మితిలోనే ఉందనీ, అతి అన్నిటా అనర్థానికే దారి తీస్తుందనీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తోంది. ఈ ఏడాది దేశంలో అనేకచోట్ల సాధారణ ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోయి చలిగాలుల ఊపేస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. భూమి చరిత్రలోనే కానీ, మానవ చరిత్రలోనే కానీ ఋతుగమనం హఠాత్తుగా తూకం తప్పి బతుకులను తలకిందులు చేసిన ఘట్టాలు అసంఖ్యాకం. చరిత్రకెక్కినవి కొన్నే. సాధారణ శకం 536లో అగ్నిపర్వతాలు బద్దలై యూరప్, మధ్యప్రాచ్యం, ఆసియా లలో ఆకాశాన్ని అంధకారంతో కప్పేసి అతి శీతల వత్సరాలను సృష్టించాయి. అది అసాధారణ స్థాయిలో హిమపాతానికీ, కరవు కాటకాలకూ, మానవ, జంతు మరణాలకూ దారితీసింది. యూరప్‌తో సహా పలుచోట్ల 1300–1850 మధ్యకాలాన్ని చిన్నపాటి మంచుయుగంగా లెక్కించారు. 1709లో యూరప్‌లో విస్తారమైన ప్రాంతాలు మంచు భూములుగా మారిపోయి, అనేక ప్రాణాలకు సమాధులయ్యాయి. 1783–84లో ఉత్తర అమెరికాలో విపరీత శైత్యం తీవ్ర దుర్భిక్షానికీ, చివరికి ఫ్రెంచి విప్లవానికీ దారితీసింది. 1816లో వేసవే లేకుండా పోయింది. 1963లో బ్రిటన్‌లో, 1972లో ఇరాన్లో, 2008లో అఫ్గానిస్తాన్‌లో హిమపాతాలూ, చలిగాలులూ పెద్ద సంఖ్యలో ప్రాణాలు హరించాయి. శిశిరం శివతాండవం చేస్తూ కరవు కాటకాలతో జీవజాలాన్ని ఆకుల్లా రాల్చి వేయడం గమనిస్తే శ్రీశ్రీ ‘దేశచరిత్రలు’ కవిత గుర్తొస్తుంది. అంతా తన ప్రయోజకత్వమే అనుకుంటూ మనిషి స్థాపించిన సామ్రాజ్యాలు... ‘ఇతరేతర శక్తులు’ లేస్తే పేకమేడల్లా పడిపోయా యంటాడాయన. అలాగే, మౌర్య సామ్రాజ్యంలో తలెత్తినట్టు చెబుతున్న పన్నెండేళ్ళ దుర్భిక్షానికి అతిశీతల వాతావరణమో, లేదా అలాంటి మరేదైనా ‘ఇతరేతర’ శక్తో కారణం కావచ్చు. అప్పుడు భద్రబాహుడనే జైనముని జైన సంఘాన్ని వెంట బెట్టుకుని దక్షిణ భారతానికి తరలివచ్చాడనీ, చక్రవర్తి చంద్రగుప్తుడు కూడా సింహా సనాన్ని త్యజించి దక్షిణాపథానికి వచ్చాడనీ చరిత్ర చెబుతోంది. సమతూకపు ఋతుగమనానికీ, భూమ్మీద జీవజాలం మనుగడకూ ఉన్న పీటముడి ఎలాంటిదో – ఆ తూకం హఠాత్తుగా తారుమారైనప్పుడే తెలిసి వస్తుంది. శీతర్తువు కరుణించి తగినంత వెచ్చదనాన్ని జోడించినప్పుడు, పోతన భాగవతంలో వర్ణించినట్టు మన్మథుడు విరహులకు హేమంతం అడుగుపెట్టినట్టు గబ్బున తోపించి అదేపనిగా వేధిస్తూ అర్ధాంగి నులివెచ్చని ఆలింగన సౌఖ్యం వైపు నడిపిస్తాడు. హాలుడు ‘గాథాసప్తశతి’లో అభివర్ణించినట్టు, ఆ భరోసాతోనే భర్త పశువులను కొనుక్కోడానికి పైబట్టను అమ్ముకుంటాడు. ‘చలి వడి కించే శైశిర కాలం వస్తూపోతూ దాగుడుమూతల క్రీడలాడుతవి మీ నిమిత్తమే’నంటూ మహాకవి శ్రీశ్రీ శైశవగీతిని ఆలపిస్తాడు. అదే శీతర్తువు ఒకింత గతి తప్పిందా... అస్తిత్వమే అల్లకల్లోలమైపోతుంది. చలిగాలుల విజృంభణకు శాస్త్రవేత్తలిప్పుడు వివిధ కారణాలు ఎత్తి చూపుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే వాతావరణ పరిస్థితులూ, మధ్యధరా సముద్ర ప్రాంతంలో సంభవించే అలజడులూ చల్లని ఉత్తరపు గాలుల్ని సృష్టించి హిమాలయాల మీదుగా వ్యాపింపజేస్తాయంటున్నారు. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం కూడా ఉష్ణోగ్రతను కట్టడి చేసి శీతల వాయువులను సృష్టిస్తోందట. శాస్త్రజ్ఞులు చెప్పిన కారణాలు కొన్ని భాగవత కవికి అనుభవపూర్వకంగా తెలుసు. ఉత్తరపు గాలి విసురుతోందనీ, తామరలు తరిగి అంతటా మంచు నెలకొందనీ అంటాడు. సూర్యుడు శక్తిహీనుడు కావడం వల్ల హిమాలయాల నిండా మంచు పేరుకుని ఆ పేరును సార్థకం చేస్తోందని రామాయణ కవి అంటాడు. వందల కోట్ల సంవత్సరాల అస్తిత్వంలో పుడమితల్లి ఇలాంటి పురిటినొప్పులు ఎన్ని పడిందో! ఎన్ని మంచు యుగాలను చూసిందో! మన మేరకు మనం చేజేతులా వాతావరణ విధ్వంసానికి పాల్పడకుండా జాగ్రత్త పడటమే చేయవలసినదీ, చేయగలిగినదీ! -
శాపనార్థాలే సమాధానాలా?
‘వినదగు నెవ్వరు చెప్పిన...’ అన్నాడు సుమతీ శతకకారుడు. విన్న తర్వాత అందులోని నిజానిజాలేమిటో నిర్ధారించుకొని ఒక నిర్ణయం తీసుకోవాలంటాడు. సంఘ జీవనంలో మనుషుల మధ్య సంబంధాల గురించి చెప్పిన హితోక్తి ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏర్పడిన ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించవలసిన నీతిపాఠం. ప్రభుత్వ చర్యలను, నిర్ణయాలను ప్రజల తరఫున ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. అది వాటి బాధ్యత. ఆ ప్రశ్నలకు ప్రభుత్వాలు సూటిగా సమాధానాలు చెప్పి తీరాలి. అలా చెప్పకుండా దాటవేయడం మొదలుపెడితే ఆ ప్రభుత్వాలు ఏదో దాచిపెడుతున్నట్టు లెక్క. ప్రస్తుత ఏపీ సర్కార్ దాటవేసే దశను కూడా దాటిపోయింది. ఎదురు దాడినే ఆయుధంగా ప్రయోగిస్తున్నది. అందులోనూ పూనకాల దశకు చేరుకున్నది. జరగరానిదేదో జరుగుతున్నదని దీని అర్థం. చేయగూడని తప్పులేవో ప్రభుత్వం చేస్తున్నదని అర్థం. ప్రజలకు బాధ్యత వహించ వలసిన పవిత్ర కర్తవ్యాన్ని ఏపీ సర్కార్ ఈ రకంగా ఎగతాళి చేస్తున్నది. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి గురువారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. వివిధ అంశాల మీద ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. అంతే, మిడతల దండు దాడి చేసినట్టు, తోడేళ్ల మంద దండెత్తి వచ్చినట్టుగా ఉన్నది కూటమి రియాక్షన్. కనీసం పదిమంది మంత్రులు జగన్‌పై ఎదురుదాడికి దిగారు. అందులో ఒక వయసు మళ్లిన మంత్రి స్థిమితం కోల్పోయి మాట్లాడారు. యెల్లో మీడియా ఛానల్స్ అన్ని రకాల మర్యాదల్నీ అతిక్రమించాయి. యెల్లో పత్రికలు యథావిధిగా వక్రీకరణకు పూనుకున్నాయి. కానీ, ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పే సాహసాన్ని ప్రభుత్వం కానీ, దాని తాబేదార్లు కానీ చేయలేదు. అసలు విషయాన్ని దాచేసి కొసరు సంగతులపై షాడో బాక్సింగ్ చేసే సంస్కృతిని యెల్లో కూటమి బాగా వంటపట్టించుకున్నది. విషయ పరిజ్ఞానం లేని పదిమంది తుత్తురుగాళ్లతో మాట్లాడించి, గత్తరలేపే వ్యూహాన్ని ప్రణాళికా బద్ధంగా అమలు చేస్తున్నది.ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. తాను ఏపీ ముఖ్యమంత్రితో ఒక క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో మాట్లాడి ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ పను లను ఆపేయించాననీ, కావాలంటే ఎవరైనా సరే చెక్ చేసుకో వచ్చనీ ఆయన అన్నారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య సున్నిత మైన అంశం. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఎత్తిపోతలపై తెలంగాణకు అభ్యంతరాలున్నాయి. కానీ రాయలసీమ అవసరాల రీత్యా ఏపీకిది వరదాయిని. ఇటువంటి అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో వైసీపీ సహా మరికొన్ని రాజకీయ పక్షాల ఏపీ ప్రభుత్వ స్పందనను డిమాండ్ చేశాయి. జగన్మోహన్రెడ్డి కూడా తన మీడియా సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎవరూ అడక్కుండానే ప్రభుత్వం ఈ అంశంపై ఒక ప్రకటన చేసి ఉండవలసింది. కానీ, ఇప్పటివరకూ ఈ వ్యవహారం మీద ఏపీ ప్రభుత్వం సూటిగా స్పందించలేదు. రేవంత్‌రెడ్డి, తాను క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో ఈ విషయం మాట్లాడుకున్నారా లేదా అనే సంగతి తప్ప అనేక ఇతర విషయాలు చంద్రబాబు మాట్లాడారు. ఒకవేళ రేవంత్ రెడ్డి చెప్పింది తప్పయితే దాన్ని ఖండించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అర్థం కాని విషయం. రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అయితే, అటువంటి రహస్య నిర్ణయం తీసుకోవలసి రావడం వెనుక కీలకమైన జాతీయ భద్రతా అంశాలు దాగి ఉన్నాయని చెప్పవచ్చు. కానీ అసలు విషయాన్ని వదిలేసి ఉపవాచకాలను పఠించడం, ఉక్రోషాన్ని ప్రదర్శించడం యెల్లో కూటమి బలహీనతల్ని ఎత్తి చూపింది.అదే మీడియా సమావేశంలో అమరావతి వ్యవహారంలో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను కూడా జగన్ ఎత్తిచూపారు. బాధ్యత కలిగిన ప్రభుత్వమైతే వాటికి సమాధానం చెప్పాలి. కానీ, ఆయన మాట్లాడిన మిగిలిన అన్ని విషయాలను వదిలేసి, ఈ ఒక్క అంశాన్నే పట్టుకుని అమరావతి మీద జగన్మోహన్రెడ్డి విషం కక్కుతున్నారంటూ ఒక చౌకబారు ప్రచారాన్ని దిగజారుడు భాషలో వండి వార్చి వడ్డించడం మొదలుపెట్టారు. ఒక్క జగన్మోహన్రెడ్డికే కాదు, అమరావతి విషయంలో ప్రభుత్వం వేస్తున్న కుప్పిగంతులపై చాలామంది మేధావులకూ, స్థానిక ప్రజలకూ పలురకాల అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేయకుండా నిందారోపణలు చేయడం వల్ల పవిత్రులమై పోతామనుకుంటే పప్పులో కాలేసినట్టే!వరద ముంపునకు అవకాశముండే ప్రాంతంలో నగర నిర్మాణం పట్ల నిపుణులందరికీ అభ్యంతరాలున్నాయి. వెయ్యి కోట్ల ఖర్చుతో రెండు ఎత్తిపోతల పథకాలను పెట్టి, రెండు రిజర్వాయర్లు నిర్మించి అమరావతిని వరద ముప్పు నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సంగతి నిజమే కదా! ఇంత ఆయాసం దేనికి, వరదముప్పు లేని ప్రాంతంలో నిర్మించు కోవచ్చు కదా! అక్కడ ముందుగానే పాలక పెద్దల అనుయా యులు భూములు కొనుగోలు చేసినందువల్లనే ఎంత ప్రయా సైనా సరే అక్కడనే రాజధాని ఉండాలని ఆరాటపడుతున్నారని అనుమానం రావడంలో తప్పేముంది! వరదముప్పు పొంచి ఉన్నచోటనే నగర నిర్మాణం ఎందుకన్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం ఉన్నదా?మొదట సేకరించిన 54 వేల ఎకరాల్లోనే అభివృద్ధి పనులు ప్రారంభం కాకుండా ఇంకో 50 వేల ఎకరాలు కావాలని అడగడం దేనికి? అందులో తక్షణమే 20 వేల ఎకరాల సమీ కరణకు రంగం సిద్ధం చేయడంలో పారదర్శకత ఏమైనా వున్నదా? ఎవరూ అడగకుండానే ప్రభుత్వం దీని మీద వివరణ ఇవ్వవలసింది. కానీ, అడిగినవారి మీద ఎదురుదాడికి దిగడం వెనుక ఏదో గూడుపుఠాణీ ఉన్నదనే కదా అర్థం? సీఆర్డీఏ వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం తొలి దశ 54 వేల ఎకరాల్లో పార్కులు, రోడ్లు, చెరువులు వగైరాలు తీసేసిన అనంతరం 29 వేల పైచిలుకు భూములు అందుబాటులో ఉంటాయి. రైతులకు అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన ప్లాట్లు, ఇప్పటి వరకు జరిపిన కేటాయింపులు, ప్రభుత్వ భవనాల అవసరాలు తీసివేసినా ఇంకా 18 వేల ఎకరాలకు పైగా సీఆర్డీఏ చేతిలో ఉన్నాయి. మరి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను చెరువుల్లో, శ్మశానాల్లో ఎందుకు వేస్తున్నారు? ఈ కారణం వల్లనే రామారావు అనే రైతు గుండె పగిలి చనిపోయిన ఉదంతాన్ని విస్మరించగలమా? అమ్ముకోవడానికి ప్రభుత్వం చేతిలో 18 వేల ఎకరాలు స్థిరంగా ఉండగా ఇంత ఆదరా బాదరాగా ఇంకో 20 వేల ఎకరాల సేకరణలోని ఔచిత్యాన్ని ఎవరైనా అడిగితే వాళ్ల మీద ‘అమరా వతి ద్రోహులు’, ‘అభివృద్ధి నిరోధకులు’ అనే ముద్రలు వేయ డానికి యెల్లో కూటమి సర్వసన్నద్ధంగా ఉన్నది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అవుతుందనీ, ప్రభుత్వం పైసా ఖర్చు చేయనవసరం లేదనీ చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఏడాది న్నరలోనే అమరావతి ఖాతాలో 50 వేల కోట్ల అప్పును ఎందుకు చేయవలసి వచ్చిందో వివరించాలని అడిగితే కూడా అమరావతి ద్రోహులవుతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి సర్కార్ సూటిగా సమాధానం చెప్పవలసిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. కానీ వాటిని అడిగిన వారి మీద శాపనార్థాలు ప్రయోగిస్తూ బండి లాగిస్తున్నారు. పద్దెనిమిది నుంచి అరవయ్యేళ్లలోపు వయసున్న మహిళలందరికీ నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించరాదు. నిరుద్యోగులకు నెలకు మూడువేల రూపాయల భృతి సంగతి ఏమిటని అడగరాదు. అడిగితే అభివృద్ధికి అడ్డుపడినట్టు. ఏపీ అంటే... ‘ఏ ఫర్ అమరావతి’, ‘పీ ఫర్ పోలవరం’ అని ప్రచారం చేసుకున్న బాబు సర్కార్ పోలవరం ప్రాజెక్టుకు చేసిన ద్రోహాన్ని కూడా ఎవ్వరూ ప్రశ్నించకూడదు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించే విధంగా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయకుండా, ఏవో ప్రయోజనాల కోసం పునాది డయా ఫ్రమ్ వాల్ వేసి, వరద కారణంగా అది దెబ్బతినడానికి కారణమయ్యారని వారిని అధిక్షేపించరాదు. ఈ చారిత్రక తప్పిదం వల్ల ఆ ప్రాజెక్టు ఇంకెంతకాలం కుంటుతుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. పైగా కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతలతో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును కేవలం తమ వారికి కాంట్రాక్టు పనిని అప్పగించడం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ నెత్తినెత్తుకున్నారన్న అభియోగం నిజం కాదని నిరూపించగలరా? చివరికి కేంద్రం ఒత్తిడికి లొంగిపోయి, దాని ఎత్తు తగ్గించి బరాజ్ స్థాయికి కుదించలేదా? ఈ విషయం నిజమా... కాదా?ఏ ఫర్ అమరావతి. పీ ఫర్ పోలవరం... ఈ రెండింటిలోనూ పారదర్శకత కనిపించడం లేదు. ఈ రెండింటిలోనూ గోల్మాల్ జరుగుతున్నదనే ఆరోపణలు నిజమైతే విభజిత రాష్ట్రానికి అంతకంటే పెద్ద ద్రోహం ఇంకేమన్నా ఉంటుందా? ఇవే కాదు, రాష్ట్రంలో కూటమి సర్కార్ అమలు చేస్తున్న విధా నాలు పేదలు, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఇవాళ రాష్ట్రంలో ఎవరిని కదిలించినా చెబుతున్నారు. ఏ ప్రయోజనాల్ని ఆశించి ప్రైవేట్ పెట్టుబడికి ఊడిగం చేసే పాత్రను పోషిస్తున్నారు? విశాఖ నగరానికి ఇంతకాలం ఆయువుపట్లుగా నిలిచిన విశాఖ ఉక్కు, విశాఖ పోర్టులను దెబ్బతీయడం కోసమే మిట్టల్ స్టీల్స్‌కు సముద్రతీరం వెంబడి మూడు కిలోమీటర్ల పొడవునా ప్రైవేట్ పోర్టును కేటాయించారనీ, క్యాప్టివ్ మైన్స్ ఇప్పించడం కోసం కేంద్రం దగ్గరికి ఎంపీలను పంపించారనీ వచ్చిన ఆరోపణలు నిజమా, కాదా? సూటిగా సమాధానం చెప్పగలరా? ప్రపంచంలోని నాగరిక దేశాలన్నీ విద్య, ఆరోగ్య రంగాలను ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తుంటే కూటమి ప్రభుత్వం మాత్రం అంగడి సరుకుగా మార్చిందనడానికి ఈ పందొమ్మిది నెలల పాలన రుజువు కాదా? ప్రజల మనసుల్లో ఇటువంటి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇందులో దేనికీ కూటమి సర్కార్ సూటిగా సమాధానం చెప్పే అవకాశం లేదు. కనుక ఈ శేష కాలాన్ని శాపనార్థాలతోనే వారు గడిపేస్తారని భావించవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
నిష్పూచీ నిష్క్రమణలు
‘అంతర్జాతీయ న్యాయం నాకు అవసరం లేదు. అధ్యక్షుడిగా నా అధికారానికి పరిమితులు విధించేదీ, దాన్ని నిరోధించేదీ నా నైతికత మాత్రమే’ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అపహరించాక ప్రకటించారు. ఇప్పటికే ఆయన నైతికత ఎలాంటిదో రుజువైంది గనుక భిన్నరంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలగుతున్నామని తాజాగా ఆయన చెప్పటం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఈ నిర్ణయం కారణంగా మొత్తం 66 సంస్థల నుంచి అమెరికా తప్పుకుంటుంది. ఇందులో ఐక్యరాజ్యసమితికి చెందినవి 31 కాగా, ఇతర సంస్థలు 35. భావోద్వేగాలకు లోనుకావటం వల్లనో, ప్రలోభాలకు ఆశపడటంవల్లనో అనర్హుల్ని అందలం ఎక్కించిన దేశం కష్టాల్లో పడుతుంది.కానీ అమెరికా ప్రజలు చేసే తప్పు ప్రపంచాన్ని కకావికలు చేస్తుందని ఏడాది కాలంగా అందరికీ అర్థమవుతోంది. తనకు తోచిందే న్యాయం, తాను చెప్పిందే ధర్మంగా ఇంటా బయటా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని సరే... అమెరికాను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థల నుంచి బయటకు రావటానికి ఆయన చెబుతున్న కారణాలు చిత్రమైనవి. ఆ సంస్థలు అమెరికా ప్రయోజనాలను నెరవేర్చటం లేదట! నిరుడు అధికారంలోకొచ్చిన వెంటనే 2015 నాటి పారిస్ ఒప్పందం నుంచి వైదొలగారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ నుంచి బయటికొచ్చారు. నిబంధనల ప్రకారం ఈనెల 20 నుంచి అది అమలవుతుంది. తాజా నిర్ణయం వల్ల అధికంగా సమస్యలెదుర్కొనే సంస్థలు వాతావరణ పరిశోధనలకు సంబంధించినవి. వాతావరణం గురించి, అది క్షీణిస్తున్న తీరు గురించి ఎవరైనా మాట్లాడినప్పుడల్లా అమెరికాకు చిర్రెత్తుకొస్తుంటుంది. ఇది ట్రంప్‌తోనే మొదలు కాలేదు. వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1997లో కుదిరిన క్యోటో ప్రోటోకాల్‌కు అమెరికా దూరంగా ఉండిపోయింది. ఎందుకంటే ఆ ప్రోటోకాల్ ప్రకారం ప్రతి దేశమూ ఉద్గారాల తగ్గింపునకు లక్ష్య నిర్దేశం చేసుకోవాలి. దాన్ని సాధించటానికి ప్రయత్నించినట్టు చూపాలి. ప్రపంచాన్ని కాలుష్యభరితం చేయటంలో ముందువరసలో ఉండే అమెరికాకు ఇలాంటి ఆంక్షలు నచ్చుతాయా? కనుకనే దాన్ని పూర్తిగా బేఖాతరు చేస్తూ ఆ ప్రోటోకాల్ వెలుపలే ఉండిపోయింది.నిజానికి క్యోటో ప్రోటోకాల్‌ను నీరుగార్చటానికీ, తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు చెప్పుకోవటానికీ 2015లో అందరినీ మభ్యపెట్టి ప్యారిస్ ఒడంబడికకు దోహదపడింది. కానీ ఆ మరుక్షణం నుంచీ అటకెక్కించింది. ఎంతో వెనకబడిన దేశాలనుకున్నవి సైతం తమ శక్తి మేరకు ఆ ఒప్పందం అమలుకు చర్యలు తీసుకోగా, అమెరికా చేసింది దాదాపు శూన్యం. ఉద్గారాలను పరిమితం చేయగల హరిత సాంకేతిక తపై విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నా, వాటి పర్యవసానంగా ప్రభావ వంతమైన ఆవిష్కరణలు సాధ్యమైనా సక్రమంగా ఆచరణలో పెట్టింది లేదు. పోనీ దాన్ని బడుగు దేశాలకు చవగ్గా అందించాలని కోరినా ఉలుకూ పలుకూ లేదు. పాలకుడెవరైనాఅమెరికా తీరు ఇంతే! కాకపోతే ట్రంప్ వారిని మించిన ఘనుడు. అసలు వాతావరణ మార్పు అనేదే బూటకమని ఆయన వాదన. భూగోళం మరింత వేడెక్కకుండా ఉండాలంటే 2030 నాటికి అన్ని దేశాలూ 2005 నాటి కర్బన ఉద్గారాల పరిమాణంలో 33 నుంచి 35 శాతం మేర తగ్గించాలని ప్యారిస్ శిఖరాగ్ర సదస్సు నిర్ణయించింది. కానీ ట్రంప్ మూర్ఖత్వం కారణంగా ఆ లక్ష్యసాధన ఇక అసాధ్యం. ఆయన హరిత ఇంధన సాంకేతికతల్ని పూర్తిగా పక్కకు పెట్టడమే కాదు... చమురు వాడకాన్ని మరింత పెంచే చర్యలు తీసుకుంటున్నారు.ట్రంప్ తాజా నిర్ణయం వల్ల ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఇతర ముఖ్య సంస్థలు సైతం నిధుల కొరతతో నీరసిస్తాయి. ఘర్షణాత్మక ప్రాంతాల్లో పిల్లల బాగోగుల కోసం పని చేయటం, అటువంటి ప్రాంతాల్లో చోటుచేసుకునే లైంగిక నేరాల్ని అరికట్టడం వంటి అంశాల్లో పనిచేసే ప్రతినిధుల్ని అమెరికా ఉపసంహరించుకుంటుంది. భారత్, ఫ్రాన్స్‌ల చొరవతో ఏర్పాటైన అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ) కూడా ఈ జాబితాలో ఉంది. ప్రపంచానికి తన వంతుగా లేశమాత్రమైనా మంచిచేసేది లేదని ట్రంప్ చాటుతున్నారు. కనుక ఇకపై ఈ ధూర్తదేశంతో ఎలా వ్యవహరించాలో ప్రపంచ దేశాలు నేర్చు కోక తప్పదు. -
కాలుష్యం కోరలు తీసేదెలా?
సంకల్పం ఉంటే దేన్నయినా సాధించవచ్చంటారు. అది కొరవడటం దేశ రాజధాని నగరానికి శాపంగా మారింది. కనుకనే కాలుష్యం అక్కడి నుంచి కదలనంటున్నది. ఈ సంగతి తెలిసే సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం)ను తీవ్రంగా తప్పుబట్టింది. ప్రధాన కాలుష్య కారకాలను గుర్తించి, ఏయే పరమాణువులు ఏ మేరకు కారణమవుతున్నాయో, వాటిని అరికట్టడానికి ఏం చేయాలో చెప్పాలని కోరింది. మనం పీల్చే గాలితోపాటే నైట్రేట్లూ, సల్ఫేట్లూ, కర్బనాలు, కాడ్మియం, పాదరసం వంటి అత్యంత ప్రమాదకర పరమాణువులు ఊపిరితిత్తుల్లో ప్రవేశిస్తున్నాయి. నెత్తురుతోపాటే శరీరమంతటా ప్రవహిస్తున్నాయి. ఇవన్నీ గుండెపోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్, నవజాత శిశు మరణాలూ తదితర దారుణాలకు కారణమవు తున్నాయి. అయినా అన్ని వ్యవస్థలూ కాలుష్యాన్ని ఆషామాషీగా తీసుకుంటున్నాయి. వివిధ అధ్యయనాలు చెబుతున్న దాన్నిబట్టి ఢిల్లీ వరకూ చూస్తే వాహనాల కాలుష్యమే అధికం. ఆ తర్వాత వరసగా పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణరంగం వల్ల వెలువడే ధూళి, పంట వ్యర్థాలు తగలబెట్టినందువల్ల వచ్చే పొగ ఉంటాయి. కానీ నిర్దిష్టమైన డేటా లేనందువల్ల అరికట్టడం విషయంలో వెనకబడిపోతున్నాం.రెండు దశాబ్దాల క్రితం చైనా రాజధాని నగరం బీజింగ్ పరిస్థితి ఇదే. 2008లో బీజింగ్ ఒలింపిక్స్ జరుగుతున్న సందర్భంగా ఆ దేశం తొలిసారిగా కాలుష్యంపై రణభేరి మోగించింది. పలు తాత్కాలిక చర్యలు ప్రారంభించారు. అటుతర్వాత అయిదేళ్లపాటు అధ్యయనాలు నిర్వహించారు. వాటితోపాటే ప్రయోగాత్మకంగా వివిధ రకాల విధానాలు అమల్లోకి తెచ్చారు. ప్రధాన కాలుష్య కారకాలను గుర్తించారు. వాటి తీవ్రత ఆధారంగా వర్గీకరించారు. వాతావరణంలో అతి సూక్ష్మ ధూళి కణాల(పీఎం 2.5)ను సాధ్యమైనంత మేర తగ్గించాలని సంకల్పించారు. అటు తర్వాత 2013లో అయిదేళ్ల జాతీయ కార్యాచరణ పథకం రంగప్రవేశం చేసింది. బొగ్గు ఆధారిత బాయిలర్లను మూసివేయాలని నిర్ణయించటంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థను అంచెలంచెలుగా మెరుగుపరిచారు. వివిధ పరిశోధనల ద్వారా కొత్త సాంకేతికతల్ని ఆవిష్కరించారు. హరిత ఇంధన వాడకమే వీటన్నిటి ధ్యేయం. కనుకనే అత్యంత కాలుష్య ప్రాంతాలుగా గుర్తించినవి కాస్తా నాలు గేళ్లలో గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ మెరుగుదల 35 శాతంపైగా ఉంది. మధ్యలో కరోనా మహమ్మారి విరుచుకుపడినా కాలుష్యంపై పోరు ఎక్కడా తగ్గలేదు. చైనా మాత్రమే కాదు... మనకన్నా బాగా వెనకబడిన ఫిలిప్పీన్స్, పెరూ, ఉరుగ్వే వంటి దేశాలు సైతం కాలుష్యాన్ని అరికట్టడంలో మెరుగైన విజయాలు సాధించాయి. ఒక్క ఢిల్లీ అనేమిటి... హైదరాబాద్ మొదలుకొని పది నగరాల వరకూ దాదాపు ప్రతిచోటా ఏడాది పొడవునా కాలుష్యం బుసలు కొడుతోంది. ఢిల్లీలో గురువారం సాయంత్రానికి వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) 328 (విపత్కరం)గా ఉన్నదని వెల్లడైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో ఊహించుకోవచ్చు. 2022 జూలైలో సీఏక్యూఎం వెలువరించిన నివేదిక రవాణారంగం, పారిశ్రామిక ఉద్గారాలు, విద్యుత్ ప్లాంట్లు, వ్యర్థాల్ని తగలబెట్టడం, నిర్మాణరంగ పనుల వల్ల వెలువడే ధూళి వగైరాలు ప్రధానంగా కాలుష్యానికి కారణమవుతున్నాయని గుర్తించింది. కానీ వాటిని అరికట్టడానికి లేదా వాటి తీవ్రత తగ్గించటానికి జరిగిన కృషేమీ లేదు. ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలేమిటో సూచించాలంటూ గత నెల 17న సీఏక్యూఎంను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు మళ్లీ మరోసారి చెప్పాల్సివచ్చింది. సీఏక్యూఎం ఒక్కటే దీన్ని సాధించటం సాధ్యంకాదు. అన్ని విభాగాలూ కలిస్తేనే సమస్యపై పోరాడటానికి వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సీఏక్యూఎం పర్యవేక్షణలో ట్రాఫిక్ పోలీస్, రవాణా విభాగం, మున్సిపాలిటీలు, కాలుష్య నియంత్రణ సంస్థలు సమన్వయంతో పనిచేసేలా నిర్దిష్టమైన విధానం రూపొందించాలి. పకడ్బందీ కార్యాచరణ ఉండాలి. పొరుగునున్న చైనా నిర్దిష్టమైన కాలపరిమితి పెట్టుకుని లక్ష్యాన్ని సాధించగలిగినప్పుడు... మనకన్నా వెనకబడిన దేశాలు సైతం చేసి చూపిస్తున్నప్పుడు మనం ఎందుకు విఫలమవుతున్నామని ప్రశ్నించుకోవాలి. ఎక్కడ లోటుపాట్లున్నాయో సమీక్షించుకుని సరిచేసుకోవాలి. -
ట్రంప్ అసంతృప్తి లోగుట్టు!
పరాయి దేశాల్లో సైనిక కుట్రలు, కుయుక్తుల మాటెలావున్నా అగ్రరాజ్యం హోదాలో అమెరికా నాగరికంగా, గంభీరంగా ఉన్నట్టు కనబడేది. తాను ఏం చేసినా ప్రపంచశాంతి కోసమే, అది సురక్షితంగా ఉండటానికేనని ప్రవచించేది. నిరుడు ఆ దేశాధ్యక్షపీఠాన్ని అధిరోహించిన డోనాల్డ్ ట్రంప్‌కు ఇలాంటి డొంకతిరుగుడు నచ్చదు. బాహాటంగా బెదిరింపులకు దిగటం ఆయన నైజం. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తనను ఆనందడోలికల్లో ముంచెత్తడానికి భారత్ ప్రయత్నిస్తోందట. అయితే తాను సంతోషంగా లేని విషయం మోదీకి తెలుసట. మరో రెండు రోజులకు దాన్ని కాస్త మార్చి, తనతో మోదీ సంతోషంగా లేరంటూ మరో ప్రకటన చేశారు. ఇలా మాట్లాడుతూనే రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు నిలిపేయకపోతే సుంకాలు మరింత పెంచుతామని హెచ్చరించారు. రెండు దేశాల దౌత్యసంబంధాలు లేదా వాణిజ్యసంబంధాల్లో ఏకాభిప్రాయం కుదరనప్పుడు పరస్పరం చర్చించుకోవటం ఆనవాయితీ. ఇచ్చిపుచ్చుకునే ధోరణి చూపితే ఎక్కడో ఒకచోట సదవగాహన సాధ్యమవుతుంది. కానీ ఫలానాది మాత్రమే కావాలని పట్టు బట్టడం, మొండికేయటం వల్ల సమస్య ఎప్పటికీ అపరిష్కృతంగా ఉండి పోతుంది. మన దేశానికి మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, ఒమన్‌లతో ఒప్పందాలు కుదిరాయి. అటు అమెరికాకు ఈయూ, జపాన్, థాయ్‌లాండ్, వియత్నాం, మలేసియాలతో ఇదే విధంగా ఒప్పందాలు ఏర్పడ్డాయి. ఇలా వేరే దేశాలతో ఈ రెండు దేశాలూ ఒప్పందాలు కుదుర్చుకోగలిగినప్పడు వాటి మధ్య మాత్రం ఒప్పందాలు ఎందుకు అసాధ్యమవుతున్నాయి? తమ భద్రత అమెరికా చేతుల్లో ఉండటంతో వేరే దేశాలు అమెరికా షరతులను శిరసావహించక తప్పదు. వ్యూహాత్మక అంశాల్లో స్వతంత్రత పాటించే వారిని ఒత్తిళ్లు ప్రభావితం చేయలేవు. అందువల్లనే భారత్ వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలు అంత తేలిగ్గా సాధ్యపడవు. ట్రంప్‌ను సంతోషపెట్టడం వేరే దేశాల బాధ్యత ఎందుకవుతుంది? అసలు ఆ బాధ్యత అమెరికా ప్రజలకే ఉండదు. అన్ని దేశాల పాలకుల మాదిరే తన దేశ ప్రజలు ఆనందంగా ఉండేలా చూసుకునే బాధ్యత ట్రంప్‌ది. ఆయన్ను అందుకు ఒప్పించటం రిపబ్లికన్ల బాధ్యత. లేనట్టయితే నష్టపోయేది ఆ పార్టీయే. భారత్–పాక్ యుద్ధాన్ని ఆపానని గప్పాలు కొట్టుకున్నట్టే భారత్ తనను సంతోషపరచటానికి ప్రయత్నిస్తోందని ట్రంప్ చెప్పారా? ఈ విషయంలో మన దేశంవైపు నుంచి ఖండనేమీ లేదు. వాణిజ్య ఒప్పందం అనేది చాలా సీరియస్ అంశం. బహిరంగ వేదికలపై దాన్ని చర్చించటం సాధ్యపడదు. తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారానో, ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలోనో కూర్చునో తోచింది చెప్పటం, అందుకు అనుగుణంగా అవతలి దేశం మారాలని, కాళ్లబేరానికి రావాలని భావించటం... అది సాధ్యపడనప్పుడు హెచ్–1బి వీసా ఫీజు పెంచటం, బహిరంగ విమర్శలకు దిగటం ట్రంప్ ఎన్నుకున్న తప్పుడు మార్గం.నిజానికి మన దేశం చాలావరకూ తగ్గిందనే చెప్పాలి. నిరుటితో పోలిస్తే అమెరికా నుంచి చమురు కొనుగోళ్లు 80 శాతం పెరిగాయి. 1962లో వచ్చిన అణుశక్తి చట్టాన్ని ఇటీవల రద్దుచేసి ఆ రంగంలో ప్రైవేటు సంస్థల ప్రమేయానికి అనుమతిస్తూ మన దేశం ‘శాంతి’ పేరిట కొత్త చట్టం తెచ్చింది. అణువిద్యుత్ కర్మాగారాల్లో ప్రమాదం జరిగితే పరిహారం చెల్లింపు బాధ్యత ఆ పరికరాల సరఫరాదారుకు ఉండబోదన్న విషయంలోనూ అంగీకరించింది. ఇవి తనను సంతోషపరచటానికేనని ట్రంప్ భావిస్తున్నట్టు కనబడుతోంది. అవి ఎంతమాత్రమూ సరిపోవని చెప్పడం కూడా ఆయన ఉద్దేశం కావొచ్చు. ఇక 95 శాతం అమెరికా ఎగుమతులపై సుంకాలు ఎత్తేయటానికి మన దేశం సిద్ధపడింది. బాదం, యాపిల్, అవకాడో వంటివాటిపై సుంకాలు తగ్గించటానికి ఒప్పు కున్నదంటున్నారు. కానీ డెయిరీ ఉత్పత్తులు, జన్యుమార్పిడి మొక్కజొన్న,సోయా బీన్స్ వగైరాలపై ఆంక్షలొద్దన్న ట్రంప్ షరతుకు అంగీకరించటం లేదు. మన రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేవి మాత్రమే ఆయనను సంతోష పరుస్తాయనుకుంటే ఆ విషయంలో చేయగలిగిందేమీ లేదని మన దేశం చెప్పటమేసరైంది. -
అగ్నిజ్వాల... శబ్దఘోష!
కోనసీమ గడ్డపై మళ్లీ మంటలు ఎగసిపడుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో సోమవారం ఉదయం మోరి–5వ నంబర్ బావి వద్ద బీభత్సమైన శబ్దంతో బ్లోఅవుట్ ఉబికి, గ్యాస్ ఎగదన్నుతూ భారీ ఎత్తున మంటలు వ్యాపించటంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనల్లో పడ్డారు. మంగళవారం మధ్యాహ్నానికి బ్లోఅవుట్ తీవ్రత తగ్గినా మరికొన్ని రోజులు ఇది కొనసాగుతుందని ఓఎన్జీసీ అధికారులు చెబుతున్న మాట. సహజ వాయువు వెలికితీత కోసం ఇనుప గొట్టాలతో డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు రాతిపొర తగిలితే ఆ గొట్టం ద్వారా బాంబింగ్ జరపడం అలవాటు. ఆ క్రమంలోనే ఒక్కసారిగా సహజ వాయువు పెల్లుబికి ప్రమాదానికి దారితీస్తుంది. ఇది మొదటిసారేమీ కాదు. చిన్నవో, పెద్దవో ఇలాంటి ఉదంతాలు అడపా దడపా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. 1993లో కొమరాడలో తొలిసారి ప్రమాదం జరగ్గా 1995 జనవరిలో పాశర్లపూడి 19ఏ బావిలో డ్రిల్లింగ్ సమయంలో బ్లోఅవుట్ సంభవించి 65 రోజులపాటు కోనసీమను హడలెత్తించింది. 2014లో మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని గెయిల్ కంపెనీ పైపులైన్ పగిలి గ్యాస్ విడుదలై 22 మంది ప్రాణాలు కోల్పోగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. చిన్నవే కావొచ్చుగానీ... అటుతర్వాత కూడా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తూ ప్రస్తుత ఉదంతంతో సహా దాదాపు అన్నీ జనం అప్రమత్తంగా ఉన్న వేళ సంభవించినవే. కానీ ఆదమరిచి నిద్రిస్తున్నవేళ జరిగితే జనం ప్రాణాలు ఏం కావాలి? మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రిల్లింగ్ చేస్తుండగా ఒక్క సారిగా సహజ వాయువు ఎగదన్నిందనీ, ఆకాశాన్నంటేలా మంటలు వ్యాపించాయనీ మీడియా కథనం. క్షణాల్లో ఆ ప్రాంతంలో గ్యాస్ అలుముకోవటంతో చుట్టూ ఉన్న గ్రామాల్లోనివారు ఇళ్లకు తాళాలేసి ప్రాణభయంతో పిల్లాపాపల్ని తీసుకుని పరుగులు పెట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే పోలీసులొచ్చినా ఓఎన్జీసీ సిబ్బంది మాత్రం గంటన్నర తర్వాతగానీ రాలేదని జనం చెబుతున్నారు. తరచు సమస్యలెదురవుతున్నా, ప్రమాదం జరిగే ప్రాంతాలు జనావాసాలకు దగ్గరగా ఉంటున్నా ఏటా వేలకోట్ల రూపాయల విలువైన చమురు, సహజ వాయువులను తోడేస్తున్న సంస్థలు భద్రత విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. సమస్య ఉత్పన్నమైనప్పుడు తక్షణం తీసుకోవాల్సిన వరస చర్యలేమిటో సిబ్బందికి కనీస అవగాహన ఉందా? అక్కడి నుంచి మాయంకావటం తప్ప ఇంకేమీ తెలియదా? వెంటనే ఎవరెవరికి సమాచారం అందించాలో, నిపుణులైనవారు అనుసరించాల్సిన విధివిధానా లేమిటో రూపొందాయా? అవసరమైన ఉపకరణాలేమైనా అక్కడ అందుబాటులో ఉన్నాయా? జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్)ను ఈ కార్యకలాపాలు జరిగే ప్రాంతాలకు సమీపంగా ఉంచారా? స్థానికులకు ఎప్పటికప్పుడు తగిన సమాచారం ఇచ్చే వ్యవస్థలుండాలి. గోప్యత పాటిస్తే అనవసర వదంతులు వ్యాపిస్తాయి. ఒకప్పుడు ఓఎన్జీసీ ఆధ్వర్యంలోనే కార్యకలాపాలన్నీ సాగేవి. ఇప్పుడు ప్రైవేటు సంస్థల ప్రమేయం పెరిగింది. చేసేది ఎవరైనా నిర్లక్ష్యం సహించరానిది. కోనసీమ గర్భంలో అపురూపమైన సహజ వనరులు నిక్షిప్తమై ఉన్నాయని తెలిశాక స్థానికులు సంతోషించారు. ఉద్యోగావకాశాలతోపాటు, అభివృద్ధి పనులు కూడా చకచకా మొదలవుతాయని ఆశించారు. కానీ జరిగిందంతా వేరు. అంతంతమాత్రంగా ఉన్న రహదారులు భారీ వాహనాల రాకతో దెబ్బతిన్నాయి. సున్నితమైన పర్యావరణం కొంచెం కొంచెంగా దెబ్బతింటూ కొబ్బరి, వరి దిగుబడి తగ్గిపోయిందని రైతులు చెబుతున్న మాట. చమురు, గ్యాస్ వెలికితీశాక ఆ ఖాళీలోకి సముద్ర జలాల ఊట చేరి బావుల్లో నీరు ఉప్పగా మారిందంటున్నారు. జల, వాయు కాలుష్యాలు ప్రజారోగ్యంపై కలగజేస్తున్న ప్రభావం ఏమిటో ప్రభుత్వాలు ఆరా తీసినట్టు లేదు. తెలంగాణలోని సింగరేణిలో తవ్వే బొగ్గుపై వచ్చే ఆదాయంలో 50 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికిస్తుండగా చమురు, సహజవాయువుల నుంచి లభించే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తున్నదెంత? కోనసీమకు దక్కుతున్నదేమిటి? ఈ బ్లోఅవుట్ చల్లారిన తర్వాతైనా ప్రభుత్వమూ, ప్రజాప్రతినిధులూ దీనిపై దృష్టి పెట్టాలి. భవిష్యత్తులో ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకోకుండా చూడాలి. -
భారత ప్రజలమైన మేము...
1946 డిసెంబర్ 9న సరిగ్గా 11 గంటలకు న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ హాల్లో రాజ్యాంగ సభ మొదటి సారిగా సమావేశమైంది. ఈ సభలోని సుమారు 300 మంది సభ్యులు నేరుగా ప్రజల ద్వారా ఎన్నికైనవారు కాదు. బ్రిటిష్ ఇండియా ప్రావిన్సుల్లోని శాసనసభలు ఎంపిక చేసినవారు. మూడేళ్లలో 5,546 పేజీల చర్చలు జరిపి, ఈ రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పుడు ఈ మొత్తానికైన ఖర్చు రూ.47 లక్షలు. అయితే ఈ రాజ్యాంగ సభకు వెలుపల రాజ్యాంగం కోసం పడిన భిన్న ఆరాటాలను వివరించే పుస్తకం: ‘అసెంబ్లింగ్ ఇండియాస్ కాన్స్టి ట్యూషన్’. ఈ 400 పేజీల పుస్తకం ఒకప్పుడు దేశాన్ని పట్టిన రాజ్యాంగ జ్వరాన్ని కళ్లకు కడుతుంది.రాజ్యాంగ ప్రక్రియలో కేవలం మేధావులు మాత్రమే పాల్గొనలేదనీ, ఇంకా ‘ఇండియా’గా రూపు దిద్దుకోని భారత నేల నలుమూలలలో ఉన్న సకల జనాలు చురుగ్గా పాలుపంచుకున్నారనీ చెబుతారు రచయితలు. స్వతంత్ర భారతంలో తామెలాంటి పాలన కోరుకుంటున్నారో బలూచిస్తాన్ నుంచి బెజ వాడ వరకు వేలాది మంది పౌరులుగా, సంఘాలుగా, పార్టీలుగా, అధికార ప్రతినిధులుగా, ట్రేడ్ యూనియ న్లుగా తమ సంతకాలతో, వేలిముద్రలతో పంపిన అభ్యర్థనలను, అభిప్రాయాలను తవ్వితీసి, ఈ ఉత్సాహపూరిత ప్రజా కోణాన్ని అంతే ఆసక్తికరంగా వెల్లడించారు రచయితలు. ఉదాహరణకు గౌహతి నుంచి నలిన్‌కాంత బర్కాకటి పంపిన చిన్న కాగితం రాజ్యాంగ సభ సచివాలయానికి 1947 జనవరి 8న అందింది. ‘రాజ్యాంగ విషయాల్లో తన అజ్ఞానాన్ని మన్నించమంటూనే’, ఏ శాసనసభ్యుడినైనా ఎప్పు డైనా ‘రీకాల్’ చేసే హక్కు ఓటర్లకు ఉండాలని అతడు రాశాడు. అంటరానితనాన్ని నిర్మూలించకుండా సమైక్య భారతదేశం సాధ్యం కాదని వజీరిస్తాన్లోని బన్నూ నుంచి ప్రజా ప్రతినిధి కోటూ రామ్ కోరాడు. మహిళలకు సమాన హక్కులు; మరణశిక్ష రద్దు; జైనులు, బేనె ఇజ్రాయెలీ యూదులతో సహా మైనా రిటీల హక్కులు; నగర బాలురతో సమానంగా గ్రామీణ పిల్లల హక్కుల లాంటివే కాదు, ‘చెవిటి మూగ’ వారికి ప్రత్యేక గ్యారంటీలు, విశ్వకర్మలకు ఫీజుల్లో రాయితీలు కోరుతూ కూడా లేఖలు అందాయి. విచిత్రంగా తమ లేఖల ద్వారా రాజ్యాంగ సభకు జనమే చట్టబద్ధత కల్పించారంటారు రచయితలు.‘ఆచరణాత్మక’ కారణాల వల్ల, తొలుతరాజ్యాంగ చర్చలను రహస్యంగానే ఉంచదలిచిన పెద్దలు ఈ ప్రజాబాహుళ్యపు ఒత్తిడితో రాజ్యాంగం ఏ రూపం తీసుకుంటుందో బహిరంగపరచదలిచారు. 1948 ఫిబ్రవరి 26న ప్రచురించిన డ్రాఫ్ట్ కాన్స్టిట్యూ షన్(ఆంగ్లం) బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. వెల: ఒక్క రూపాయి. ఇది చెల్లించలేనివాళ్లు అణాతో 24 పేజీల సారాంశం చదువుకోవచ్చు. వారంలోనే దీన్ని దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువదించడానికి అనుమ తులు కోరుతూ లేఖలు రాసాగాయి. కె.జి.చౌబాల్ అనే మరాఠీ జర్నలిస్టు ‘మాతృదేశ సేవ’ కోసం తన సేవలను వాడుకోవాలని రాశాడు. ఈ పుస్తకం వెల్లడించే మరో కోణం, ‘ఇండియన్ యూనియన్’కు సమాంతరంగా, అప్పటికి స్వతంత్రంగానే ఉండదలిచిన సంస్థానాల్లో కూడా రాజ్యాంగ రచన ఎలా జరిగిందో వివరించడం. సంస్థానాలకు రాజ్యాంగ సభ 93 ప్రాతినిధ్య స్థానాలను ఇచ్చిన ప్పటికీ, తమను తాము ప్రజాస్వామీకరించుకోవడంలో భాగంగా అవి ఈ ప్రక్రియ చేపట్టాయి. రాంపూర్ పాలకుడు తన ప్రజలకు భావస్వేచ్ఛతో సహా తొమ్మిది ప్రాథమిక హక్కులను ప్రసాదించాడు. రత్లామ్ రాజ్యాంగం ఉచిత ప్రాథమిక విద్యను రాజ్య బాధ్యతగా పేర్కొంది. ‘మేము ఇప్పటివరకు తమ సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకున్న 75 సంస్థా నాలను గుర్తించాం’ అంటారు రచయితలు.ఇంకా న్యాయమూర్తులు ఎలా భాగమయ్యారు; ట్రూమన్‌తో సహా అమెరికా, యూకే, ఐర్లాండ్, కెనడా నాయకులు, న్యాయనిపుణుల ఫీడ్‌బ్యాక్ తీసు కోవడం ద్వారా రాజ్యాంగపు ఫస్ట్ డ్రాఫ్ట్ రూపొందించిన సర్ బి.ఎన్.రావు ఇండియా రాజ్యాంగాన్ని ‘ప్రపంచ వేదిక’కు ఎలా పరిచయం చేశారు; ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనులు తమ హక్కుల కోసం ఎలా నిల బడ్డారు లాంటి అంశాలను విపులంగా చర్చించిన ఈ పుస్తకం రాజ్యాంగపు బహుముఖ పార్శా్వలను తెలుసు కోగోరేవారికి ఆసక్తి కలిగిస్తుంది. కోట్ల మంది ఆశలను ఒక దగ్గర గుదిగుచ్చడం ఎంత దుర్భరమో, అబ్బు రమో కూడా అర్థమవుతుంది. తర్వాతి రాజ్యాంగ సవరణలు ఈ ప్రజా చైతన్యపు కొనసాగింపే!ఎడిటోరియల్ టీమ్అసెంబ్లింగ్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్: ఎ న్యూ డెమాక్రటిక్ హిస్టరీరచయితలు -
సామ్రాజ్యవాద దురహంకారం
తన దుందుడుకు చర్యతో, దుష్ట పోకడతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని సంక్షోభం ఊబిలోకి నెట్టేశారు. వెనిజులా రాజధాని కారకాస్‌తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి అమెరికా సైన్యం భీకర దాడులకు దిగి అధ్యక్షుడు నికోలస్ మదురోనూ, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌నూ కళ్లకు గంతలు కట్టి, బేడీలు వేసి అపహరించుకుపోయింది. ఆయన ‘మాదకద్రవ్య ఉగ్రవాదానికి’ పాల్పడినట్టు తప్పుడు ఆరోపణలు చేసి న్యూయార్క్‌లో బంధించింది. అమెరికా సామ్రాజ్యవాద దురహంకారం ప్రపంచానికి కొత్తగాదు. ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఖండ దేశాలు అనేకం దాని వాతబడ్డాయి. కుట్రలు చేసి దేశాధినేతల్ని హతమార్చటం, ప్రజాస్వామ్యం డ్రామాలు నడిపి వ్యవస్థల్ని కూల్చేయటం దానికి మంచినీళ్ల ప్రాయం. నాలుగు దశాబ్దాల నాడు తానే అధికారంలో ప్రతిష్ఠించిన పనామా అధ్యక్షుడు ఆంటోనియో నొరీగాను ఇదేవిధంగా దాడిచేసి అరెస్టు చేసింది. కానీ నొరీగా దాని కీలుబొమ్మ. అమెరికా చర్యల పర్యవసానంగా ఇటీవలి దశాబ్దాల్లో ఇరాక్, లిబియా, అఫ్గానిస్తాన్ నెత్తుటి ముద్దలయ్యాయి. ట్రంప్ తాజా చర్య వాటన్నిటినీ తలదన్నింది.వందలాది మంది సీఐఏ ఏజెంట్ల ద్వారా అధ్యక్షుడి భద్రతను చూస్తున్న దళాలను లోబరు చుకుని, అధ్యక్షుణ్ణి భార్యాసమేతంగా అపహరించటం నికృష్టం. ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన డెల్సీ రోడ్రెజ్‌ను ‘మదురోను మించిన ప్రారబ్ధం చవిచూడాల్సి వస్తుంద’ని హెచ్చరించటం, ఆమె ఈ అవమానాన్ని దిగమింగు కుని ‘కలిసి పనిచేద్దామ’ని స్నేహహస్తం చాచడం ఈ విషాదానికి కొనసాగింపు.దేశాల మధ్య సమస్యలొస్తే శాంతియుతంగా పరిష్కరించుకోవటానికి సిద్ధపడకుండా ఏకపక్షంగా దాడులకు పాల్పడటం, దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి అధినేతను అపహరించటం ఉగ్రవాదం. అలాంటి చర్యలు ప్రపంచ శాంతిని భగ్నం చేస్తాయి. కానీ పాశ్చాత్య దేశాలూ, అమెరికా ప్రధాన స్రవంతి మీడియా ఈ పరిణామాలను సాధారణ విషయంగా చూపే ప్రయత్నం చేస్తున్నాయి. మదురో పెద్ద నియంతంటూ ప్రచారం లంకించుకున్నాయి. ట్రంప్ దరిదాపుల్లోకి రాగల నియంత ప్రపంచంలో ఉంటాడా? చావెజ్ వారసుడిగా 2013లో అధికారంలోకొచ్చిన మదురో నియంత అనటం పచ్చి బూటకం. 2019 ఏప్రిల్‌లో ‘తిరుగుబాటు’ చేసి అధికారంలోకొచ్చానని ప్రకటించుకున్న గెయిడో సాయుధ బృందం రక్షణలో రాజధాని కారకాస్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నా జనం నవ్వుకున్నారు. పోలీసులూ, సైనికులూ అతగాణ్ణి ఏమీ అనలేదు. చివరకు మదురో స్వయంగా పిలిచి నవ్వుతూ తలమీద ఒక్కటిచ్చి పొమ్మన్నారు. వేరే దేశంలో ఎక్కడైనా అది ఉరికంబం ఎక్కేంత తీవ్ర నేరం. కనీసం యావజ్జీవం జైల్లో మగ్గేంత అపరాధం.వెనిజులా ప్రజలు 1999లో హ్యూగో చావెజ్ అధికారంలోకొచ్చాక దశాబ్దాల దారిద్య్రం నుంచి విముక్తులయ్యారు. ఆయన హయాంలో దారిద్య్రం ఒక్కసారిగా 70 శాతానికిపైగా తగ్గింది. నిరుద్యోగం సగానికి సగం పడిపోయింది. పెన్షన్లు నాలుగు రెట్లు పెరిగాయి. అక్షరాస్యత వంద శాతానికి చేరుకుంది. విద్య, వైద్యం, ఉపాధి కల్పన, ఆహారభద్రత అక్కడ ప్రాథమిక హక్కులు. దాదాపు వందేళ్లపాటు దేశ సంపదనంతా తరలించుకుపోయిన అమెరికా చమురు కంపెనీలను చావెజ్ స్వాధీనం చేసుకోవటంవల్లే ఇదంతా సాధ్యమైంది. అప్పటినుంచి అమెరికా కడుపుమంట మొదలైంది. అమెరికా ఆంక్షల వల్ల వెనిజులా దీర్ఘకాలంగా సమస్యలకు ఎదురీదుతోంది. ప్రాణావసర మందులు కరువై లక్షమంది ప్రజలు మరణించారు. దారిద్య్రాన్ని తట్టుకోలేక 80 లక్షల మంది దేశం వదిలిపోయారు. ఇటీవల మదురో చర్యలు వ్యాపార వర్గాల ప్రయోజనాలకు తోడ్పడుతున్నాయన్న విమర్శలున్నాయి. అయితే మదురో చైనా కరెన్సీ యువాన్లలో వాణిజ్యం నెరపడం, చైనా, రష్యా, ఇరాన్‌లతో జతకట్టడం, బ్రిక్స్‌లో చేరేందుకు సంసిద్ధం కావటం అమెరికాను కలవరపరిచాయి. అత్యధిక చమురున్న దేశం ఎదిగేలా కనబడటంతో డాలర్‌ను కాపాడుకోవటానికి అమెరికా ఈ తప్పుడు చర్యకు దిగింది. ఇవాళ వెనిజులా వంతు. రేపు మెక్సికో, క్యూబా, గ్రీన్‌ల్యాండ్... ఏదైనా కావొచ్చు. అందుకే అమెరికా చర్యను ప్రపంచం ముక్తకంఠంతో ఖండించాలి. ఆధునిక కాలంలో అనాగరిక పోకడలు చెల్లబోవని చాటాలి. -
నూటా నలభై
‘నేను బూడిదగానైనా మిగులుతానుగానీ మట్టిగొట్టుకుపోను’ అన్నాడు జాక్ లండన్. బతికినన్నాళ్లూ అగ్నిజ్వాలలా బతికాడు. లోకాన్ని మెరుపులా చుట్టాడు. చేయగలిగిన పనులన్నీ చేశాడు. యాక్టివిస్టు, సాహస యాత్రికుడు, యుద్ధక్షేత్రంలో విలేఖరి; నావికుడు, పేపర్ బాయ్, బొగ్గు గని కార్మికుడు, ఐసు బండి డ్రైవరు, వలస కూలీ, ఫొటోగ్రాఫర్, గోల్డ్ డిగ్గర్ లాంటి రెండు డజన్ల పనులు చేశాడు. నియమంగా రోజుకు వెయ్యి పదాలైనా రాసేవాడు. నవలలు, జ్ఞాపకాలు, కథలు, నాటకాలు, కవిత్వం, వ్యాసాలతో సుమారు 50 పుస్తకాలు వెలువరించాడు. తన కాలంలో అత్యంత ప్రభావశీల అమెరికా రచయితగా వెలిగాడు. కానీ నలభై ఏళ్లకే మరణించాడు. నిండు నూరేళ్లు జీవించాల్సిన మనిషి నలభై ఏళ్లకే కాలగర్భంలో కలిసిపోవడమేమిటి? కాలానికి ఏ కనికరమూ ఉండదేమో! లేదా, దాని లెక్కలు మనకు అర్థం కావేమో! ఏ లెక్కలూ పాటించని కాలాన్ని మన లెక్కల్లోకి తీసుకునే ప్రయత్నంలో దానికి లేని లక్షణాలను ఆపాదిస్తామేమో! ఫ్రాంజ్ కాఫ్కా, ఎడ్గార్ అలెన్ పో, కాథరీన్ మాన్స్ఫీల్డ్; జాన్ కీట్స్, ఎమిలీ బ్రాంటే, పి.బి.షెల్లీ, లార్డ్ బైరన్; స్వామి వివేకానంద; అలెగ్జాండర్; మొజార్ట్; బ్రూస్ లీ, మార్లిన్ మన్రో; మాల్కమ్ ఎక్స్, మార్టిన్ లూథర్ కింగ్; త్రిపురనేని శ్రీనివాస్, నాగప్ప గారి సుందర్రాజు, చిత్రకొండ గంగాధర్– వీళ్లంతా కూడా నలభై ఏళ్లు దాటకుండానే ఈ అవనీ తీరం దాటేసినవారు!నలభై ఏళ్లంటే మనిషి సరిగ్గా పక్వానికి వచ్చే వయసు. అన్ని బాల్య, యవ్వన చాపల్యాలను అధిగమించి నింపాదితనాన్ని సంతరించుకునే వయసు. జీవితాన్ని అత్యంత సమీపంగా దర్శించే వయసు. స్వీయ అనుభవాల వెలుతురులో గత చీకట్లను తరచి చూసుకునే వయసు. తాను నేర్చుకున్నదానికీ, తన జీవిత పాఠాలకూ మధ్యగల తేడాను నిశితంగా పట్టుకుని, తనదైన చింతనకు రూపు కట్టుకునే వయసు. ఉరుకులాటలు, వెంపర్లాటలు తగ్గి తనదైన స్థిమితాన్ని నెలకొల్పుకునే వయసు. అవసరం రీత్యా వేసుకున్న అన్ని మేకప్పులనూ కరిగించుకునే వయసు. స్పష్టమైన, స్థిరమైన గొంతును ఏర్పరుచుకునే వయసు. లోకానికి ఏదైనా కచ్చితంగా చెప్పగలిగే వయసు. కానీ వీళ్లెవరూ ఈ వయసుకు చేరకుండానే అంతకుమించిన పరిణతిని చూపారు, మహాద్భుతాలు చేశారు. కాలం కఠినాత్మురాలే కాదు, కరుణామయి కూడానేమో. వాళ్లకు పుట్టుకతోనే నూరేళ్ల వివేకాన్ని ఆశీర్వదించింది. అట్లా వాళ్లు నూటా నలభై ఏళ్లు బతికేసి వెళ్లారు.‘ద కాల్ ఆఫ్ ద వైల్డ్’, ‘ద సీ–వూల్ఫ్’, ‘వైట్ ఫాంగ్’, ‘ది ఐరన్ హీల్’ లాంటి నవలలు రాసిన జాక్ లండన్ 1876లో జన్మించాడు. ఈ జనవరి 12తో 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. కిడ్నీ ఫెయిలై, స్కర్వీతో ముందటి నాలుగు పళ్లు కోల్పోయి, ఇష్టపడి కట్టుకున్న ఇల్లు తుదిదశలో అగ్ని ప్రమాదంలో కాలిపోయి, డిసెంట్రీ, యురేమియా లాంటి అనారోగ్యాలతో బాధపడుతున్నప్పటికీ తాను చేయగలిగింది చేసిపోయాడు లండన్. గొగోల్, చెకోవ్, డి.హెచ్.లారెన్స్, ఎఫ్. స్కాట్ ఫిట్జ్‌గెరాల్డ్, సాదత్ హసన్ మంటో లాంటివాళ్లంతా కూడా నలభైల్లోనే వెళ్లిపోయారు. ఇంకా యుద్ధ క్షేత్రాల్లో, విప్లవ రణరంగంలో, సామాజిక కార్యాచరణలో తమ నిండు యవ్వనాల్ని బలిచ్చిన జ్ఞాత, అజ్ఞాత తేజోదివ్వెలు ఎన్నో! వీళ్లు ఇంకా కొన్నేళ్లు బతికివుంటే మరింత వెలుగు కురిసేదా? అసలు, కురిసినదే చాలినంతా? ఏ కారణాల వల్లయినా వీళ్లు లోకం వీడొచ్చుగాక! ఈ వెళ్లిపోవడంలో బాధతో పాటు, అబ్బురం కలగలిసి ఉండటం ఒక వైచిత్రి. పాతుకుపోతున్నకొద్దీ అంటే ఈ లోకపు మకిలిని పులుముకోకుండానే, ఇంకా లోకం వారిపట్ల సంభ్రమంగా కళ్లు విప్పార్చుతున్నప్పుడే వెళ్లిపోవడం ఇందులోని మరో పార్శ్వం. డాట్ బాల్స్ ఆడుతూ విసుగెత్తించకుండా, సిక్సులతో మైదానాన్ని హోరెత్తిస్తూ రిటైర్ కావడం లాంటిదది. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడిమిది నాటకము అని అన్నమయ్య ఏ అర్థంలో పాడినా, నాటకం లాంటి ఈ జీవిత రంగస్థలం మీద ఉజ్జ్వలంగా, ధగద్ధగాయమానంగా తమ పాత్రను వెలిగించి నిష్క్రమించారు. సెల్యూట్! -
ఇది పురోగమనమా... తిరోగమనమా?
ఇరవయ్యొకటో శతాబ్దంలో పాతికేళ్ల కాలం కరిగిపోయింది. ఇంకో ఇరవయ్యొక్క సంవత్సరాలు ఓపిక పట్టండి, భారత దేశాన్ని సూపర్ పవర్ చేసి చూపిస్తామని మన అధినేతలు అర చేతుల్లోనే వైకుంఠ దర్శనాలు చేయిస్తున్నారు. వైవిధ్య భారత దేశం వలస పాలన సంకెళ్లు తెంచుకొని అప్పటికి (2047) వందేళ్లు పూర్తవుతాయి. మనదేశం శతమాన స్వతంత్ర భారత మవుతుంది. అధినేతలు ‘అదివో అల్లదివో’ అంటూ ఆకాశం వైపు చూపెడుతున్నట్టు సూపర్ పవర్‌గా భారత్ ఆవిష్కృతమైతే ఆనందపడని పౌరుడెవరుంటారు? కానీ, ఆ గమ్యం చేరేందుకు ముందుగా స్వాతంత్య్రోద్యమం నాటి ఆకాంక్షలు నెరవేరవలసి ఉంటుంది. దేశ బహుళత్వ స్వభావంలోంచి ఒక ఏకత్వ భావనను పెంపొందింపజేయడం స్వతంత్ర భారతానికి తొలి సవాల్‌గా ఎదురైంది. అభివృద్ధి క్రమంలో హస్తిమశకాంతరాలున్న ప్రజలు, ప్రాంతాల మధ్య సమన్వయం కూర్చడం ఒక పెద్ద బాధ్యత. బ్రిటిష్ వాళ్ల ప్రత్యక్ష పరిపాలనలో కునారిల్లిన ప్రాంతాలు ఒక పక్కన, ఫ్యూడల్ దోపిడీకి నెలవైన వందలాది స్వదేశీ సంస్థానాలు మరో పక్కన! ఈ రెండింటినీ ఒకే చట్టంతో ముడివేసి ఒక దేశంగా ముందుకు నడవ్వలసిన సందర్భం అది. విభిన్న మతవిశ్వాసాలూ, భాషా సంస్కృతులూ చేతులు కలిపి గంగాయమునా సంగమ శ్రుతిలో ప్రవాహ గీతం పాడుకోవా లని బాస చేసుకున్న సన్నివేశమది. అమానవీయమైన స్థాయిలో ఏర్పడిన ఆర్థిక అంతరాలను తొలగించడానికి అందరికీ సమానా వకాశాలు లభించే విధంగా ఒడంబడిక చేసుకున్న ఓ అరుదైన ఘట్టం. కదిలే కాలంతో నాటి స్వరాజ్య భానూదయం ఒక చరిత్రాత్మకమైన ఒప్పందాన్ని చేసుకున్నది.మహాదార్శనికుడైన పండిత జవహర్లాల్ నెహ్రూ మాటల్లో అదొక ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’. ప్రపంచమే ప్రణమిల్లిన గాంధీ మహాత్ముని ఆశయాలకు అధికారిక హోదా కల్పించాలని నిర్ణయం తీసుకున్న ముహూర్తం. ఈ నేపథ్యంలో రూపుదిద్దు కున్నదే భారత రాజ్యాంగం. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 389 మంది రాజ్యాంగ సభ సభ్యుల మేధోశ్రమను మథించి, ప్రపంచంలోని ప్రజాస్వామ్య రాజ్యాంగాలను పరిశో ధించి, దేశ అభివృద్ధి క్రమానికి అవసరమైన రీతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రియుల మాగ్నాకార్టాగా పరిగణన పొందిన పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం. ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని చేకూర్చాలనీ, భావ ప్రకటనతోపాటు విశ్వాస ఆరాధనా స్వేచ్ఛ అందరికీ ఉండాలనీ, అవకాశాల్లో, హోదాల్లో అందరి మధ్యన సమానత్వం పరిఢ విల్లాలనీ, వ్యక్తిగత గౌరవ మర్యాదలతో అందరి మధ్యన సౌభ్రా తృత్వం వెల్లివిరియాలనీ రాజ్యాంగం ఆకాంక్షించింది.ఈ రాజ్యాంగ లక్ష్యాలు పూర్తిగా సఫలమైన రోజున సుశిక్షితులూ, నిపుణులైన ప్రజలు దేశ జనాభాకు తగినట్టుగా అభివృద్ధి పథంలో కూడా దేశాన్ని నంబర్‌వన్ స్థాయిలో నిలబెట్ట గలుగుతారు. నూటా నలభై కోట్ల జనాభా ఉన్న దేశానికి సూపర్ పవర్ హోదా అసాధ్యమైనదేమీ కాదు. కావలసినదల్లా ప్రజల్లో సౌభ్రాతృత్వం, విశ్వాస – ఆరాధనా స్వేచ్ఛ, సమాన స్థాయిలో లభించే అవకాశాలు. ఈ రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చే క్రమంలో మనం ఎక్కడున్నామనే విషయం తెలిస్తే సూపర్ పవర్ హోదా ఇంకెంత దూరంలో ఉన్నదో అర్థమవుతుంది. ప్రజల్లో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేని నిరుపేదరికం తగ్గి వుండవచ్చు నేమో. కానీ, ఆర్థిక అసమానతలు నాటికంటే నేడు మరింత పెరిగాయి. అసమానతల పెరుగుదలలో ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలో ఉన్నదని నాలుగు రోజుల క్రితం విడుదలైన ప్రపంచ అసమానతల నివేదిక స్పష్టం చేసింది. రాజ్యాంగం అభిలషించిన సౌభ్రాతృత్వ భావన అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. ‘హిందూ రాష్ట్ర’ సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన ఆరెస్సెస్ ప్రభుత్వ అండదండలతో దేశ ఆయువుపట్టు వంటి పార్శ్వాల్లోకి ఎలా పాకిందో వెల్లడిస్తూ వారం రోజుల క్రితం ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ ఒక పరిశోధనా కథనాన్ని బ్యానర్ స్టోరీగా ప్రచురించింది.‘బ్రిటిష్ రాజ్’ నాటి ఆర్థిక అసమానతల కంటే నేటి ‘బిలియనీర్ రాజ్’లో భారతదేశ ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్నాయని అసమానతలపై ప్రపంచ నివేదిక – 2026 వ్యాఖ్యా నించింది. భారతదేశంపై నివేదికలను రూపొందించడంలో థామస్ పికెట్టీ వంటి ప్రసిద్ధ ఆర్థికవేత్తలు భాగం పంచు కున్నారు. వార్షిక ఆదాయాన్ని మాత్రమే లెక్కగట్టి రూపొందించే ప్రపంచ బ్యాంకు నివేదికలకు భిన్నంగా ఆదాయం, సంపదలతో పాటు అనేక ఆర్థిక కార్యకలాపాలపై విస్తృత అధ్యయనం చేసి రూపొందించిన నివేదిక ఇది. ‘బ్రిటిష్ రాజ్’తో పోల్చితే 1980వ దశకం నాటికి దేశంలో ఆర్థిక అసమానతలు బాగా తగ్గాయని ఈ నివేదిక వెల్లడించింది. సంఘ్ పరివార్ నిత్యం ఆడిపోసుకునే నెహ్రూ విధానాలు అమలైన కాలం కూడా ఇదే కావడం గమనించతగ్గది. దేశంలో ఆర్థిక అసమానతలు బాగా పెరగడం 2000 సంవత్సరం తర్వాత మొదలైంది. 2014–15 నుంచి 2022–23 మధ్యకాలంలో ఈ పెరుగుదల రాకెట్ వేగాన్ని అందుకున్నది. ప్రస్తుతం దేశ వార్షికాదాయాల్లో 22.6 శాతం ఒక్క శాతం జనాభా ఉన్న అగ్రశ్రేణి సంపన్నులే దక్కించుకున్నారు. అయితే జాతి సంపదలో వీరి దగ్గర పోగుపడిన సంపద 40.1 శాతం. ఒక్క శాతం కుబేరుల చేతిలో 40.1 శాతం సంపద కేంద్రీకృత మైంది. ప్రపంచంలో మరే దేశంలోనూ టాప్ ఒక శాతం కుబే రులు ఈ స్థాయిలో దండుకోలేకపోయారు. ఇందులో గోల్డ్ మెడల్ భారత్‌దే! దేశంలోని ఈ కుబేరుల మీద సంపద పన్ను వేసి ప్రభుత్వం ఆ సొమ్మును ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి రంగాల్లో పెట్టుబడిగా పెట్టాలని ఈ నివేదిక సూచించింది. దేశంలో కేవలం 167 మంది అగ్రశ్రేణి కుబేరుల మీద రెండు శాతం పన్ను వేసినా వచ్చే మొత్తం దేశ వార్షికాదాయంలో 0.5 శాతానికి సమానమట! దీన్ని విద్యా వైద్య రంగాల్లో ప్రభుత్వం ఖర్చు చేయాలని ఈ ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఖర్చుపెట్టి అభివృద్ధి చేసిన మెడికల్ కాలేజీలను ప్రోత్సాహకాలిచ్చి మరీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలంటున్న చంద్రబాబు ఆర్థిక విధానాలకూ, ఈ ఆర్థికవేత్తల సూచన పూర్తి విరుద్ధంగా ఉండడం మరో గమనించదగిన అంశం.ఈ నివేదిక ప్రకారం దేశంలోని టాప్ 10 శాతం సంపన్నుల చేతిలో 65 శాతం సంపద పోగైంది. కిందిస్థాయిలో ఉండే 50 శాతం మంది పేదల మొత్తం సంపద దేశ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే. మధ్యశ్రేణిలో ఉండే 40 శాతం మంది స్థితిమంతుల వాటా 32 శాతం. భారతదేశంలో ఆర్థిక వ్యవహారా లకు సంబంధించిన గణాంకాలు సమగ్రంగా అందుబాటులో ఉండవనీ, వాస్తవానికి అసమానతలు తాము చెబుతున్నదానికంటే మరింత ఎక్కువ ఉండే అవకాశముందనీ ఈ నివేదిక అభిప్రాయపడింది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ జమానాకు ‘బిలియనీర్ల రాజ్’గా అసమానతల నివేదిక నామకరణం చేసింది. ‘బ్రిటిష్ రాజ్’ జమానాలో ఏర్పడిన ఆర్థిక అసమానతల రికార్డును మన ‘బిలియనీర్ల రాజ్’ బద్దలు కొట్టింది.‘బిజినెస్’ చేయడం ప్రభుత్వాల బిజినెస్ కాదనే ఆకర్ష ణీయమైన కొటేషన్ల మాటున కీలకమైన ప్రభుత్వరంగ సంస్థ లను సైతం ప్రైవేట్ వ్యాపారులకు కట్టబెట్టడానికి ఎన్డీఏ సర్కార్ ఓ పాలసీని కూడా తీసుకొచ్చింది. ఆటమిక్ ఎనర్జీ, అంతరిక్షం, రక్షణ రంగాల పరిశ్రమలు కూడా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమం నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. చివరకు గత రెండు దశా బ్దాలుగా గ్రామీణ పేదలకు ఆసరాగా నిలిచి, వలసలకు కొంత మేర అడ్డుకట్ట వేసిన ‘నరేగా’ను సైతం సర్కార్ నిర్వీర్యం చేసింది. డిమాండ్‌ను బట్టి ఉపాధి కల్పించే కూలీల హక్కును ఈ పథకం నుంచి తొలగించింది. పథకం అమలుకయ్యే వ్యయంలో 40 శాతం రాష్ట్రాలే భరించాలనడంతో నిజస్వరూపం వెల్లడైంది. పథకాన్ని నామమాత్రం చేయడం ఎన్డీఏ ఆర్థిక ప్రాధాన్యతలకు అద్దం పడితే, పథకం పేరులోంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం దాని సైద్ధాంతిక విధానంగా పరిగణించవచ్చు. ఆరెస్సెస్ భావజాలం ప్రభావం వల్లనే మహాత్ముడిని గాడ్సే హత్య చేశాడన్న ఆరోపణను నాడు ఆరెస్సెస్ ఖండించింది. ఇప్పుడో కీలకమైన పథకం నుంచి ఆయన పేరును తొలగించడం వెనుక ఆ భావజాలం ప్రమేయం లేదని మాత్రం ఆరెస్సెస్ ఇప్పటి దాకా ఖండించలేదు. డిసెంబర్ 29వ తేదీనాడు ‘న్యూయార్క్ టైమ్స్’ బ్యానర్ స్టోరీగా ప్రచురించిన కథనం ప్రధానమంత్రి పంద్రాగస్టు అధికా రిక ప్రసంగాన్ని ఉటంకించడంతో మొదలైంది. ఆ ప్రసంగంలో ప్రధానమంత్రి ఆరెస్సెస్‌ను ఒక గొప్ప సేవా సంస్థగా ఆకాశాని కెత్తారు. మోదీ వంటి శక్తిమంతుడైన ప్రధానమంత్రి సుస్థిర పాలనను ఆసరా చేసుకొని ఆరెస్సెస్ బాగా బలపడిందని ఈ కథనం వ్యాఖ్యానించింది. పోలీసులు, రక్షణ శాఖ, ఉన్నతోద్యో గులు, వ్యాపారులు... ఇలా అన్ని రంగాల్లో చిన్న చిన్న ఉప సంఘాల పేరుతో ఆరెస్సెస్ చొచ్చుకొనిపోయిందనీ, దాదాపు రెండు వేల వరకు దాని ఉపసంఘాలు చురుగ్గా పని చేస్తున్నాయనీ, వీటి ప్రభావం వల్ల దేశంలో విద్వేష పూరిత వాతావరణం నెలకొన్నదనీ, దాడులు ముస్లిమ్‌ల వరకే పరి మితం కాలేదు... మతమార్పిడి బూచీని చూపెట్టి చర్చిల మీద, క్రైస్తువుల మీద, క్రిస్మస్ ఉత్సవాల మీద యథేచ్ఛగా దాడులు జరిగాయనీ పత్రికా కథనం ఆరోపించింది. పత్రిక ఆరోపణే కాదు, ఇవన్నీ మన అనుభవంలోకి వచ్చిన తాజా సంఘటనలే!ప్రజలందరికీ ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం అనే ఆశయం ఆచరణలో అభాసుపాలైంది. సమాజంలో సౌభ్రాతృత్వం స్థానాన్ని విద్వేషం ఆక్రమిస్తున్నది. అయినా మనం రాజ్యాంగబద్ధ పాలనలోనే ఉన్నామా అనే అనుమానం తొలుస్తు న్నది. అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నా, ఉపాధి – ఉద్యో గాలు కొరవడుతున్నా, జాతి సంపదలు ప్రైవేట్ కార్పొరేట్ శక్తు లకు కైంకర్యం అవుతున్నా, పేద, మధ్యతరగతి ప్రజలు నాణ్య మైన విద్యా, వైద్య సౌకర్యాలకు దూరమవుతున్నా, వ్యవసాయ రంగం కుదేలై రైతాంగం వధ్యశిలలపై నిలబడి ఉన్నా పాలక పక్షాలకు జనం సమ్మతి ఎలా లభిస్తున్నది? తమ పాలనపై నోరెత్తే వారిని దండించడానికి అధికార పక్షాలకు ఒక చేతిలో రెడ్ బుక్ ఉన్నట్టే, తటస్థులను సంతృప్తిపరచడానికి మరో చేతిలో ప్రవచనాల పుస్తకం కూడా ఉంటుంది. మతం పేరుతో,సంస్కృతి పేరుతో, ఆచారాల పేరుతో పౌర సమాజాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఇది అక్కరకొస్తుంది. దీన్నే ఆధిపత్య భావజాలం అంటారు. పౌర సమాజాన్ని ఆధిపత్య భావజాలం నియంత్రిస్తున్నంత కాలం పరిపాలన పురోగమనంలో ఉన్నదా తిరోగమనంలో ఉన్నదా అనే సంగతి జనానికి పట్టకపోవచ్చు. పౌర సమాజంలోని అన్ని పార్శ్వాలను దానికి అర్థమయ్యే భాషలో చైతన్యపరచకుండా మన జాతీయ ప్రతిపక్ష నాయకుడి మాదిరిగా అడపాదడపా స్వయం ప్రకటిత బాంబుల్ని ప్రయోగి స్తానంటే ప్రయోజనం ఉండదు. ఇప్పటికే ఆయన పేలని బాంబుల పేరయ్యగా మిగిలిపోయారు. ప్రగతిశీలమైన భారత రాజ్యాంగాన్ని రక్షించుకొని అమలుచేసే శక్తులు సమీప భవిష్యత్తులో ముందుకు వస్తాయా? లేక ఆ రాజ్యాంగమే కొంత కాలానికి అదృశ్యమయ్యే రోజును చూస్తామా అనేదే నేడు మనముందున్న కీలకమైన మీమాంస!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఎవరు ప్రజాసేవకుడు?
కాలం మారుతుందనీ, రేగిన గాయాన్ని మాన్పుతుందనీ అనుకుంటాం. కానీ, అన్ని సార్లూ అది నిజం కాదు. 2017లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ ప్రాంత అత్యాచార కేసులో తాజా పరిణామాలు పాత గాయాన్ని మళ్ళీ రేపి, బాధితుల గుండెల్లో బడబాగ్నిని రగిలించాయి. సదరు కేసులో దోషి అని తేల్చి, మాజీ ఎమ్మెల్యే – బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్సింగ్ సెంగార్‌కు ఆరేళ్ళ క్రితం 2019లో ఢిల్లీలోని ఓ కోర్టు జీవిత ఖైదు విధిస్తే, వారం రోజుల క్రితం ఢిల్లీ హైకోర్ట్ ఆ శిక్షను సస్పెండ్ చేయడం గగ్గోలు రేపింది. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం కుల్దీప్ ‘ప్రజా సేవకుడు’ కిందకు రారనీ, కాబట్టి చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడినవారిపై ప్రయోగించే ‘పోక్సో’ చట్టంలోని కఠిన అంశాల కింద గతంలో ఆయనకు శిక్ష వేయడం సరికాదనీ హైకోర్ట్ మాట. ఇది అన్యాయ మంటూ నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో, సీబీఐ అప్పీలు చేయడం, హైకోర్ట్ ఉత్తర్వును డిసెంబర్ 29న సుప్రీంకోర్ట్ పక్కనపెట్టడం ఇప్పుడు ఒకింత ఊరట. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన 17 ఏళ్ళ మైనర్, దళిత బాలిక అత్యాచారం, ఆ తదుపరి సంఘటనలు తలుచుకుంటే ఇవాళ్టికీ గుండె బద్దలవుతుంది. ఉద్యోగం మిషతో రప్పించిన మైనర్ బాలికపై కుల్దీప్ తన నివాసంలో 2017 జూన్‌లో అత్యాచారం జరి పారు. బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించినా, కొన్ని నెలల పాటు అతీగతీ లేదు. పోరాటం చేసిన బాలిక తండ్రిని సైతం తప్పుడు కేసులో ఇరికించి, చావచితక కొట్టారు. ఆఖరికి 2018 ఏప్రిల్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం ఎదుట బాలిక ఆత్మాహుతి యత్నానికి దిగేసరికి, ఉన్నావ్ కేసు జాతీయస్థాయి సంచలనమైంది. కనపడని పోలీసు దెబ్బలతో కన్నతండ్రి కస్టడీలోనే మరణించడం రచ్చ రేపేసరికి, కేసు సీబీఐకి చేరింది. అయినా తిప్పలు తప్పలేదు. కేసులో పోరాడుతున్న బాధిత కుటుంబం, లాయరుతో సహా వెళుతున్న కారును గుర్తు తెలియని వాహనం గుద్ది, బాధితురాలి కుటుంబసభ్యులిద్దరిని 2019 జూలైలో పొట్టనబెట్టుకుంది. బెదిరింపులకు తాళలేక ఆఖరికి భారత ప్రధాన న్యాయమూర్తిని రక్షణ కోరేసరికి, విషయం సుప్రీం దృష్టికి వెళ్ళింది. 2019 డిసెంబర్లో కుల్దీప్ను దోషిగా తేల్చి, శిక్ష వేసినా, చట్టంలోని లోటుపాట్లు ఆసరాగా బయటకు వచ్చే ప్రయత్నం హైకోర్ట్‌లో సాగింది. భారత ప్రధాన న్యాయమూర్తి సహా ముగ్గురు సభ్యుల తాజా మధ్యంతర ఉత్తర్వుల ఫలితంగా... ఇప్పటికైతే కుల్దీప్ను కస్టడీ నుంచి విడుదల చేయరు. కానీ ఆయన అప్పీలు పెండింగ్‌లో ఉంటుంది. బాధితులను కాపాడేందుకు ఉద్దేశించిన చట్టంలోని అసలు స్ఫూర్తిని అర్థం చేసు కోకుండా, కేవలం అందులోని మాటలను అడ్డం పెట్టుకొని నిర్ణయం తీసుకుంటే కష్టమే నని తాజా ఘటనలో హైకోర్ట్ వ్యవహారశైలి రుజువు చేసింది. అదే సందర్భంలో రకరకాల ఆరోపణలతో న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ మసకబారుతున్న వేళ హైకోర్ట్ జడ్జీల నిబద్ధతను సమర్థిస్తూనే, సుప్రీం ఇచ్చిన తీర్పు కొత్త ఆశలు రేపుతోంది. బాలికపై అత్యాచారం, ఆ పైన ఆమె తండ్రి మరణంలో దోషి అయిన మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి బయటకొస్తే, ప్రాణాపాయం తప్పదని బాధిత కుటుంబం బెంబేలెత్తుతున్న సమయంలో సుప్రీం తీర్పు మళ్ళీ ధైర్యం ఇచ్చింది. పైపెచ్చు, ఈ వ్యవహారంలో చట్టంతో ముడిపడిన అనేక కీలక ప్రశ్నలు ముందుకు వచ్చాయనీ, వాటిపై పూర్తిస్థాయిలో ఆలోచన జరపడం అవసరమనీ సుప్రీంకోర్ట్ పేర్కొనడం గమనార్హం. అంటే, రాబోయే రోజుల్లో పలు అంశాల్లో ఈ కేసులో కోర్ట్ ఇచ్చే స్పష్టత, దాని పర్యవసానాల ప్రభావం దీర్ఘకాలం ఉండనుంది. ‘ప్రజా సేవకుడు’ ఎవరనే అంశంలో హైకోర్ట్ చెప్పిన భాష్యం లోపభూయిష్ఠం. ఒక వేళ ఆ భాష్యాన్నే అనుసరిస్తే, తీవ్రమైన లైంగిక నేరాల పరిధి నుంచి చట్టసభల సభ్యులు ఇట్టే తప్పించుకొనే ప్రమాదం ఉంది. ‘ఈ లెక్కన పోక్సో చట్టం కింద కానిస్టేబులేమో పబ్లిక్ సర్వెంట్ కానీ, ఎమ్మెల్యే మాత్రం కాదన్నమాట’ అని సుప్రీం చేసిన వ్యాఖ్య చిన్నది గానే కనిపించినా, లోతుగా ఆలోచన రేపే చురకత్తి. దోషిగా తేలిన వ్యక్తిని సైతం సాంకేతిక కారణాలతో రక్షించాలనుకోవడం వకీళ్ళకు చెల్లుతుందేమో కానీ, చేసిన నేరాన్నీ, దాని తీవ్రతనూ వదిలేసి వ్యవహరించడం న్యాయమూర్తులకు పాడి కాదు. ఒకవేళ చేసిన చట్టంలోనూ, దానిలో ప్రొవిజన్లలోనూ స్పష్టత లోపిస్తే, వాటిని సరిదిద్దేలా కోర్టులు వివరణ ఇస్తేనే ధర్మం నిలబడుతుంది. దోషులకు శిక్ష పడి, బాధితులకు న్యాయం జరుగుతుంది. ఉన్నావ్ కేసులో తాజా సుప్రీం జోక్యం ఆ దిశగా అడుగులేయడమే ఇప్పుడు అవసరం. -
ఆరావళికి ఊపిరి
చరిత్రకు పూర్వమే కొన్ని నదులకు చిరునామాగా, వైవిధ్యభరిత ప్రకృతికి ఆలవాలంగా, రకరకాల జీవరాశులకు ఆలంబనగా నిలిచిన ఆరావళి ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నట్టే. ఆ పర్వత శ్రేణిపై గత నెల 20న తామిచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సుప్రీకోర్టు సోమవారం తీసుకున్న నిర్ణయం పర్యావరణ ఉద్యమకారులకూ, ఆ ప్రాంత ప్రజానీకానికీ ఉపశమనం కలిగించింది. 250 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించి వాయవ్య భారత్‌ను 670 కిలోమీటర్ల పొడవునా కంటికి రెప్పలా చూసుకుంటున్న ఆరావళికి కష్టం వచ్చిందంటే జనం తల్లడిల్లారు. టేపు తీసుకుని కొలతలు కొలిచి, ఎన్ని డిగ్రీల కోణంలో వాలాయో గమనించి ఆ కొండల్ని కత్తిరించాలని చూసినవారి ఎత్తు గడలకు విస్తుపోయారు. అందుకే పర్యావరణ ఉద్యమకారుల నాయకత్వంలో పార్టీల కతీతంగా గొంతెత్తారు. చివరకు జనానిదే పైచేయి అయింది. ఈ అంశంలో మరిన్ని వివరణలు, భిన్న కోణాల్లో పరిశీలనలూ అవసరమవుతాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడి ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ మరింత సమగ్రంగా,మరింత సంపూర్ణంగా దీన్ని పరిశీలించాల్సి ఉంటుందని భావించింది. ఎన్నో పురుటినొప్పులు పడి, ఎన్నెన్నో ఉత్పాతాలు చవిచూసి, ఎన్నో విధాల భౌగోళిక మార్పులు జరిగి ప్రకృతి సంపద ఈ రూపంలో మన కళ్లముందుంది. అధికారం ఉండొచ్చు, కుబేరుణ్ణి తలదన్నేంత ఐశ్వర్యం ఉండొచ్చు – కానీ ఈ సంపదను అవసరా లకు పొదుపుగా వినియోగించుకుంటూ సురక్షితంగా భవిష్యత్తరాలకు అప్పగించటం మనిషి జన్మెత్తినవారి బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా పాలకులుగా ఉన్నవారూ, పారిశ్రామిక వేత్తలూ దీన్నెక్కడా గమనించుకుంటున్నట్టు లేరు. అందుకే అడవులు మటుమాయమవు తున్నాయి. కొండలు కరిగిపోతున్నాయి. నదులు ఇంకిపోతున్నాయి. జీవ వైవిధ్యం గతి తప్పుతోంది. కొన్ని రకాల జంతువులు, పక్షులు ఇప్పటికే అంతరించిపోయాయి. నదుల గమనాలు మారాయి. రుతువులు తీరు మార్చుకుంటున్నాయి. రకరకాల కాలుష్యం కాటేస్తోంది.ఆరావళి మాత్రమే కాదు... దేశంలో చిన్నా పెద్దా కొండలు, గుట్టలు దీనంగా వేడుకుంటున్నాయి. మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న తమ ఉసురు తీయ డానికి సిద్ధపడుతున్న వైనం చూసి దుఃఖిస్తున్నాయి. అయినా ఆగిందేమీ లేదు. బంగారం మొదలుకొని డోలమైట్, గ్రాఫైట్, మాంగనీస్, బొగ్గు, రాగి, బాక్సైట్ వంటి రకరకాల ఖనిజాలు వాటిల్లో నిక్షిప్తమై ఉండటమే అందుకు కారణం. అభివృద్ధికి అవసరమనుకుంటే పరిమిత స్థాయిలో వాటిని వినియోగించటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ప్రకృతి విపత్తులకు దారితీసే స్థాయికి అది చేరుకోవటం వల్ల అసలు అభివృద్ధి పరమార్థమే దెబ్బతింటోంది. ఆ ప్రాంతాల్లో నివసించే ఆదివాసుల జీవిక ధ్వంసమవుతోంది.ఇన్ని దశాబ్దాలుగా మౌనంగా వీక్షించిన వాయవ్య భారతం ఇప్పుడైనా గొంతెత్తగలిగింది గనుకే ప్రస్తుతానికిది ఆగింది. ఆరావళి పర్వత పంక్తులు చంబల్, సబర్మతి, లూని వంటి నదులకు జీవం పోస్తున్నాయి. అక్కడ అడవులున్నాయి, గడ్డిభూములు న్నాయి. సారవంతమైన నేలలు సరేసరి. అపురూపమైన జంతు, వృక్షజాలాలున్నాయి. దేశ రాజధాని నగరం ఈ మాత్రమైనా ఊపిరి పీల్చుకోగలుగుతున్నదంటే అది ఆరావళి చలవే. అంతేకాదు... భూగర్భ జలాలు సమృద్ధిగా లభించేలా చేస్తున్నాయి. ఇప్పటికే కొన సాగుతున్న మైనింగ్‌ను నిలిపేయటంతోపాటు కొత్తగా మైనింగ్ లైసెన్సులు జారీ చేయకుండా చర్యలు తీసుకుంటేనే ఈ మాత్రమైనా మిగులుతాయి. ఆ దిశగా తీసుకోవా ల్సిన చర్యల్లో సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు తొలి అడుగు కావాలి. ఆరావళిలో కోల్పో యింది కోల్పోగా ప్రస్తుతం మిగిలినదాన్నయినా ఎలా రక్షించుకోవాలన్న ఆర్తి ఉంటే తప్ప ఇదంతా సాధ్యపడదు. వాయవ్య భారతమే కాదు... దేశంలోని అన్ని ప్రాంతాలూ తమ గొంతు బలంగా వినిపించినప్పుడే కొనసాగుతున్న విధ్వంసానికి తెరపడుతుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. భూ ఆకృతి సంబంధిత అంశంగా చూసి కొలతలతో, కోణాలతో యాంత్రికంగా చూడక, మనిషి ఇరుసుగా ప్రకృతిని వీక్షించగలిగితే తరతరాల పాటు ఈ అపురూప సంపద మానవాళికి ఆసరా అందిస్తుంది. -
ఆరావళి ఆరాటం
ఆరావళి పర్వతశ్రేణి పరిరక్షణ కోసం అసాధారణ రీతిలో పలు రాష్ట్రాల ప్రజానీకం రోడ్డెక్కడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలెట్టింది. ఢిల్లీ, గుజరాత్, హరియాణా, రాజస్థాన్‌లలో ఆరావళి పర్వతాలకు సంబంధించి కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వొద్దని బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఇది పర్యావరణ పరిరక్షణ కోసమేనంటున్నది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ. మంచిదే! కానీ ఈ విజ్ఞత ముందేవుంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. గత ఆదివారం ఆరావళి గురించి కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పిన కొత్త నిర్వచనమైనా, చుట్టుపక్కల భూమి కన్నా కనీసం వంద మీటర్లు, అంతకన్నా ఎక్కువ ఎత్తులో ఉంటేనే, మూడు డిగ్రీల ఏటవాలు కనబడితేనే ఆరావళిలో భాగంగా పరిగణించాలన్న ఆ మంత్రిత్వశాఖ సిఫార్సును ఆమోదిస్తూ గత నెల 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలైనా పర్యావరణ కార్యకర్తలను విస్మయానికి గురిచేశాయి. ఇప్పుడైనా కొత్త మైనింగ్ లీజులు ఇవ్వొద్దన్న ఆదేశాలు తప్ప, ఈ పర్వతాలను అమాంతం కబళించే ప్రమాదమున్న కొత్త నిర్వచనానికి స్వస్తి పలుకు తున్నామన్న భరోసా లేదు. ఈ నేలపై సమస్త జీవరాశి కన్నా కోట్లాది సంవత్సరాల ముందే ఆవిర్భవించిన పర్వతశ్రేణి ఆరావళి. వాటి వయసు 250 కోట్ల సంవత్సరాలంటారు. వాయవ్య భారత్‌లో 670 కిలోమీటర్ల పొడవునా, లక్షా 44వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి, నాలుగు రాష్ట్రాల్లోని 34 జిల్లాలను తాకుతూపోయే ఈ ఆరావళిని దశాబ్దాలుగా అధికార, అనధికార మైనింగ్ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఆ పర్వతశ్రేణి పర్యావరణపరమైన ప్రయోజనాలను విస్మరించి, అవి మాయమైతే వచ్చే ఉత్పాతాలను బేఖాతరు చేసి కాసుల కక్కుర్తితో కొంచెం కొంచెంగా చిదిమేస్తున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నిర్వచనం చెప్పుకుంటూ ఇప్పటికే చాలా భాగాన్ని స్వాహా చేసిన వైనం కనబడుతూనే ఉంది. ఆ పర్వతశ్రేణిలో కేవలం 0.19 శాతంలో మాత్రమే మైనింగ్ లీజులు నడుస్తున్నాయని కేంద్రమంత్రి అంటున్నారు. అంటే 99 శాతానికిపైగా విస్తీర్ణం సురక్షితంగా ఉన్నట్టు లెక్క. కనుక మైనింగ్ ప్రాంతం తక్కువనిపిస్తుంది. కానీ అంకెల్లో చూస్తే అసలు సంగతి బోధపడుతుంది. అది ఏకంగా 68,000 ఎకరాలు! మైనింగ్ సంస్థలు గోరంత లీజుకు కొండంత తవ్వుకుపోవటం మన దేశంలో వింతేమీ కాదు. కనుక వాస్తవంలో ఇది మరింత ఉండొచ్చు. అసలు పర్యావరణ శాఖ కమిటీ సుప్రీంకోర్టుకు అందించిన నివేదిక గమనిస్తే అది ఆరావళిని రక్షించదల్చుకున్నదా... భక్షించే వారికి వంత పాడదల్చుకున్నదా అనే సందేహం తలెత్తుతుంది. ‘ఆరావళిలో ప్రతి భాగమూ పర్వతం కాదు, అలాగే ప్రతి పర్వతమూ ఆరావళిలో భాగం కాదు’ అని అనడంతోపాటు ‘కేవలం ఏటవాలే హద్దుల నిర్ణయానికి గీటురాౖయెతే చేర్పులకు సంబంధించి తప్పులు దొర్లే ప్రమాదం ఉంటుంద’ని చెప్పడంలో పర్యావరణహితం ఆవగింజంతైనా కనబడుతోందా? దశాబ్దాల తరబడి అక్కడి అక్రమ, ‘సక్రమ’ మైనింగ్ కార్యకలాపాల వల్ల పర్వతరహిత ప్రాంతాలుంటే ఉండొచ్చు. కానీ పర్యావరణ శాఖ కమిటీగా ‘చేర్చాలన్న’ ఆత్రుత కన్నా మినహాయింపుల వైపే మొగ్గటం సరైందేనా?మనిషి తాను ప్రకృతిలో భాగమన్న సంగతి మరిచి చాన్నాళ్లయింది. దాన్నుంచి వేరు చేసుకుంటే ఏం జరుగుతుందో ఆరావళి ఆవలున్న థార్ ఎడారి చూపుతోంది. అక్కడి ఇసుక తుపాన్లు మన వైపు రాకుండా అడ్డుపడుతున్నవీ, స్థానికంగా భూగర్భజలాలను పెంచుతున్నవీ, జనం జీవనోపాధికి అండగా నిలుస్తున్నవీ ఈ పర్వతాలే! ఇంతకూ ఆరా వళి ప్రాంతాన్ని మైనింగ్‌కు ఇవ్వబోమన్న హామీ వినబడుతోంది గానీ... జాతీయ రాజ ధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో రియల్ ఎస్టేట్ దందాను సాగనివ్వబోమన్న వాగ్దాన మైతే ఇంతవరకూ లేదు. నిజానికి వందమీటర్ల గీటురాయి ఆ ప్రాంతాన్ని ఉద్దేశించి రూపొందించినట్టే కనబడుతోంది. ఎందుకంటే ఆరావళికి ఇటువైపున్న చిట్టచివరి ప్రాంతం ఎన్సీఆర్. అక్కడ కొండలు దాదాపు కనుమరుగయ్యాయి. కానీ ఇంకా చిన్న గుట్టలు, పొదలూ విస్తారంగా ఉన్నాయి. వీటిని సైతం కాపాడుకోవాల్సిందే! యునెస్కో అరుదైన ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఆరావళిలో అంగుళం కూడా నష్టపోకూడదు. -
శభాష్... ఇస్రో!
గగన వీధుల్లో మన అంతరిక్ష శాస్త్రవేత్తలు మరో అపురూపమైన రికార్డు నమోదు చేసుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ఇంతవరకూ ప్రయోగిస్తూ వస్తున్న రాకెట్లలో అరుదైనదిగా, ‘బాహుబలి’గా చెబుతున్న ఎల్వీఎం3–ఎం6 బుధవారం ఉదయం నిప్పులు చిమ్ముకుంటూ ఏకంగా 6,100 కిలోల బరువుండే బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకుపోయి నిర్దిష్ట కక్ష్యలో ఉంచింది. ఎల్వీఎం3–ఎం6 సాదాసీదా రాకెట్ కాదు. దాని బరువు 6,40,000 కిలోలు. ఎత్తు 43.5 మీటర్లు. మన గడ్డపైనుంచి ఇంతవరకూ ప్రయోగించిన ఉపగ్రహాల్లో బ్లూబర్డ్ బ్లాక్–2 అత్యంత భారీ ఉపగ్రహం. ఈ ప్రయోగంలో మరో రికార్డు కూడా ఉంది. కేవలం 52 రోజుల వ్యవధిలో రెండు ఉపగ్రహాలను పంపటం ఇదే ప్రథమం. గత నెల 2న 4,400 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని ఎల్వీఎం3–ఎం5 భూ అనువర్తిత బదిలీ కక్ష్య(జీటీఓ)లో ప్రవేశపెట్టింది. తాజాగా ఎల్వీఎం3–ఎం6 కేవలం 15 నిమిషాల్లో నిమ్న భూకక్ష్య (లియో)లో ... అంటే 518 కిలోమీటర్ల ఎత్తులో బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహాన్ని ఉంచింది. ఎల్వీఎం3 రాకెట్ మన శాస్త్రవేత్తలకు విశ్వసనీయమైనది. ప్రయోగాత్మకంగా పంపిన తొలి రాకెట్‌తో మొదలుపెట్టి ఇంతవరకూ ఈ రకం రాకెట్ ద్వారా ఎనిమిది ప్రయోగాలు విజయవంతం కాగా, ఇప్పుడు తొమ్మిదో ప్రయోగం సైతం భేషుగ్గా ఉండటం మన శాస్త్రవేత్తల ఘనతకు తార్కాణం. అంతరిక్షంలో సమర్థవంతమైన వాణిజ్య సేవలందించి దేశానికి కీర్తిప్రతిష్ఠలతోపాటు దండిగా ఆదాయాన్ని తెచ్చేవిధంగా ఇస్రో తనను తాను తీర్చిదిద్దుకుంది. ఈ రంగంలో ఎదురవుతున్న పోటీని అవలీలగా అధిగమించేలా మన శాస్త్రవేత్తలు తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటున్నారు. వ్యయం అదుపు, లక్ష్యాన్ని సాధించగల నేర్పు ఇస్రో సొంతం. అందుకే 34 దేశాలు 434 ఉపగ్రహాలను ఇస్రో ద్వారా ప్రయోగించాయి. ప్రభుత్వాలతోపాటు ప్రైవేటు సంస్థలు సైతం ఉపగ్రహ ప్రయోగాల కోసం దాన్ని ఆశ్రయిస్తున్నాయి. విదేశీ సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని ఉపగ్రహాలను ప్రయోగించటం కోసం ఇస్రో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) సంస్థను ఏర్పర్చింది. దానికింద ఇంతవరకూ రెండు ఉపగ్రహాలను పంపింది. ఆ వరసలో బ్లూబర్డ్ బ్లాక్–2 మరో కలికితురాయి. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్‌తో కుదిరిన ఒప్పందం పర్యవసానమే తాజా ప్రయోగం.ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలకు దీటుగా సాంకేతికత కూడా అభివృద్ధి చెందుతోంది. ఈ 5జీ యుగంలో పాత ఉపగ్రహాలు పెద్దగా ఉపయోగపడవు. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లకు నేరుగా హైస్పీడ్ సెల్యులర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించటం వర్తమాన అవసరం. అందుకు బ్లూబర్డ్ బ్లాక్–2 సరిగ్గా తోడ్పడుతుంది. ఇప్పుడు ప్రయోగించిన ఉపగ్రహం ఇంతవరకూ అంతరిక్షం చేరుకున్న ఈ రకం ఉపగ్రహాల్లో మూడున్నర రెట్లు పెద్దది. స్టార్‌లింక్, వన్‌వెబ్ వంటి ఉపగ్రహాలు సైతం మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నా వాటితో పోలిస్తే బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహం సాంకేతికంగా ఉన్నతమైనది. దీనికున్న ప్రత్యేక యాంటెన్నాలు టవర్లు లేని మారుమూల ప్రాంతాల్లో సైతం స్మార్ట్ ఫోన్లకు నేరుగా హైస్పీడ్ డేటాను అందించగలవు. అలాగే ఎదురుగా కూర్చున్న మరో వ్యక్తితో మాట్లాడుతున్నామనిపించే విధంగా అవతలి గొంతును స్పష్టంగా వినిపించగలవు. నాణ్యమైన వీడియో కాల్స్‌కు తోడ్పడగలవు. అయితే మన దేశం నుంచి దీన్ని ప్రయోగించారన్న మాటేగానీ... ఇది అందించే సేవలు మాత్రం ఇక్కడ అందుబాటులో ఉండవు. కారణం మన నిబంధనలు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అనుమతించవు. అంతరిక్షంపై ఆధిపత్యం కోసం అగ్ర రాజ్యాలు పోటీపడుతున్నాయి. ఏ ప్రయోగా లైనా ఐక్యరాజ్యసమితి చెప్పినట్టు శాంతియుత ప్రయోజనాలకు, మానవాళి మేలుకు తోడ్పడాలి. ఆ దిశగా మన ఇస్రో ఎన్నదగిన కృషి చేస్తోంది. ప్రయోగాల్లో వంద శాతం సక్సెస్ రేటు సాధించటం, సంక్లిష్ట ప్రయోగాలను సైతం సునాయాసంగా చేయగల నేర్పును సొంతం చేసుకోవటం ఇస్రో ప్రత్యేకత. ఇప్పుడు సాధించిన విజయం భవిష్యత్తులో మరిన్ని ఘన విజయాలకు బాటలు పరుస్తుందనటంలో సందేహం లేదు. -
యూనస్ కళ్లు తెరుస్తారా!
మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న బంగ్లాదేశ్‌లో హింస ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనబడటం లేదు. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో గతవారం దేశమంతా నిరసన ప్రదర్శనలు జరిగాయి. హింస చెలరేగింది. దుస్తుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మైనారిటీ హిందూ యువకుణ్ణి మతాన్ని కించపరిచాడన్న ఆరోపణతో కొట్టి చంపారు. ‘ప్రథమ్ ఆలో’, ‘ద డైలీ స్టార్’ అనే రెండు ప్రధాన మీడియా సంస్థల కార్యాలయాలకు నిప్పంటించారు. ఈలోగా సోమవారం మరో విద్యార్థి నాయకుడు, నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) స్థానిక నేత మొతలబ్ షిక్దర్ను దుండగులు కాల్చి చంపారు. బంగ్లాదేశ్ అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోవటం, ఎన్నికలను ప్రహసన ప్రాయంగా మార్చటం వగైరాలతో జనం ఆగ్రహించి నిరుడు జూలైలో ఉద్యమించారు. దాన్ని తమకు అనుకూలంగా మలచుకోవటంలో, హింసను రెచ్చగొట్టి మైనారిటీ హిందూ మతస్తులపై, మహిళలపై దాడులు చేయటంలో మతతత్వవాదులు విజయం సాధించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ వీటన్నిటినీ గుడ్లప్పగించి చూస్తున్నారు. ఉద్యమకారులు రోడ్లపైకొచ్చి విధ్వంసం సృష్టిస్తుంటే వాటిని అడ్డుకోవటానికి ప్రభుత్వపరంగా ఆయన చేసిందేమీ లేదు. అది చేతగానితనమా, వ్యూహాత్మకమా అన్నది తేలాల్సి ఉంది. హసీనా నిష్క్రమించాక చోటుచేసుకుంటున్న వరస పరిణామాలు అరాచకానికి బీజాలు వేశాయి. నేరగాళ్లను జైళ్లనుంచి విడిచిపెట్టడం, జమాత్–ఎ–ఇస్లామీ(జేఐ) వంటి పాక్ అనుకూల మతతత్వ సంస్థలకు స్వేచ్ఛనీయటం వగైరాలు ఎడతెగని హింసకు దారితీశాయి. హసీనా సొంత పార్టీ అవామీ లీగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పోటీచేసే అవకాశం లేకపోవటం, మరో ప్రధాన పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ) అధినేత ఖలీదా జియా తీవ్ర అస్వస్థత వల్ల ఆ పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారటం వగైరా పరిణామాలతో జేఐ వంటి మతతత్వ సంస్థలు తామే విజేతలమన్న భ్రమలో బతుకుతున్నాయి. భారత్ వ్యతిరేకతను ఇదే స్థాయిలో రెచ్చగొడుతూపోతే తమకే అధికారం దక్కుతుందని తలపోస్తున్నాయి. హదీ చురుకైన విద్యార్థి నాయకుడే. కానీ జేఐకి బద్ధ వ్యతిరేకి. ‘ఇంక్విలాబ్ మంచా’(ఐఎం) అనే మరో మతతత్వ సంస్థకు అధికార ప్రతినిధి. ఇటీవలే ‘ప్రథమ్ ఆలో’ పత్రిక సర్వే నిర్వహించి ఐఎం కన్నా జేఐకే ప్రజాదరణ ఎక్కువుందని తెలిపింది. బంగ్లాలో వరసబెట్టి ఆలయాలపై, దర్గాలపై సాగుతున్న దాడులపై అమెరికాలో పరిశోధక విద్యార్థిగా ఉన్న అసిఫ్ బిన్ అలీ రాసిన సవివరమైన వ్యాసాన్ని ప్రచురించింది. ఇదంతా కంటగింపుగా మారి ఐఎం మూకలు ఆ పత్రిక కార్యాలయానికి నిప్పెట్టాయి. పాక్ పాలకులు తమ సంస్కృతినీ, భాషనూ అణగ దొక్కాలని చూసిన పర్యవసానంగానే బంగ్లా ఆవిర్భవించిందన్న కనీస అవగాహన కూడా లేని ఈ మూకలు దేశాన్ని ఎటు తీసుకెళ్తాయో అనూహ్యం.భారత్ వ్యతిరేకత ఎంతగా ప్రదర్శిస్తే అంతగా తమకు జనాదరణ పెరుగుతుందని మతతత్వ సంస్థలు భావిస్తున్నాయి. దేశం ఎదుర్కొంటున్న అధిక ధరల సమస్య లేదా నిరుద్యోగాన్ని రూపుమాపటం, కనీసం అవినీతి అంతానికి ఏం చేస్తారో చెప్పటం వగైరాలు మరిచిన ఈ సంస్థలు భారత్ వ్యతిరేకత పైనే ఆశ పెట్టుకున్నట్టు కనబడుతోంది. హదీ భారత వ్యతిరేకి కావొచ్చుగానీ... అంతమాత్రాన ఆ హత్య వెనక భారత్ హస్తం ఉన్నదనీ, హదీ హంతకులకు అది ఆశ్రయమిచ్చిందనీ వదంతులు వ్యాపింపజేయటం, ప్రభుత్వం మౌనంగా ఉండిపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి వైఖరే అరాచకానికి దారితీస్తోంది. ప్రజాస్వామ్యం ఒక్కరోజులో కుప్పకూలదు. దీర్ఘకాలం కొనసాగే అరాచకం, హింస అందుకు తోడ్పడతాయి. హదీ సంస్మరణ సభలో మాట్లాడిన వారు భారత్‌కు హెచ్చరికలు జారీచేయటం, హసీనానూ, హదీ హంతకులనూ అప్పగించాలంటూ తేదీ ఖరారు చేయటం... ఎన్నికలు ముంచుకొస్తుండగా ప్రభుత్వం దీన్ని మౌనంగా వీక్షించటం బాధ్యతా రాహిత్యం. సకాలంలో ఈ అరాచకాన్ని నివారించకపోతే మున్ముందు తనను కూడా ఈ శక్తులు లక్ష్యంగా మార్చుకుంటాయని యూనస్ తెలుసు కోవటం మంచిది. -
అసత్యాలు... అర్ధ సత్యాలు
సొంత శిబిరంలో విభేదాలూ, అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థ, కానరాని ఉపాధి కల్పన, మధ్యంతర ఎన్నికల్లో ఓటర్ల తిరస్కరణ వగైరాలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఊపిరాడనీయటం లేదని వైట్‌హౌస్ వేదికగా ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగం తేటతెల్లం చేసింది. పాత సంవత్సరానికి వీడ్కోలుగా, అధికారంలోకొచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా ఆయన చేసిన ఈ ప్రసంగం ఒకపక్క స్వోత్కర్షలతో, మరోపక్క సంజాయిషీలతో నిండిపోయింది. అసత్యాలు, అర్ధ సత్యాలు సరేసరి. తరచు వైట్‌హౌస్ వేదికగా జరిగే మీడియా సమావేశాల్లో ఆయన చేసే వ్యాఖ్యలకూ, ఈ ప్రసంగానికీ కాస్తయినా తేడా లేదు. స్వీయ వైఫల్యాలను నిష్క్రమించిన అధ్యక్షుడు జో బైడెన్ ఖాతాకు మళ్లించి... జరగని యుద్ధాలనూ, జరిగినా తన ప్రమేయం లేకుండా ముగిసిన యుద్ధాలనూ, ఆపినా మళ్లీ మొదలైన యుద్ధాలనూ సైతం తన విజయంగా ప్రకటించుకున్నారు. అందులో భారత్–పాక్ సంఘర్షణ ఒకటి. వలసదారులను దేశం విడిచి వెళ్లేలా చేసి అలా ఆదా చేసిన సొమ్మంతా అమెరికన్ పన్ను చెల్లింపుదారులకు ఉచితంగా వైద్యం, విద్య రూపంలో అందిస్తున్నామని ట్రంప్ చెప్పుకొన్నారు. ఇళ్ల అద్దెలు తగ్గాయనీ, ఉద్యోగాలు వచ్చిపడ్డాయనీ, పెట్టుబడులు రప్పించాననీ ప్రకటించుకున్నారు.నిజానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడానికి వలసదారుల తోడ్పాటు ఎంతో ఉంది. దేశంలో అగ్ర సంస్థలుగా పేరొందిన వాటిలో 46 శాతం... అంటే 230 కంపెనీలు వలసదారులూ, వారి పిల్లలూ స్థాపించినవే. ఈ ఏడాది న్యూ అమెరికన్ ఫార్చ్యూన్–500లో చేరిన పది కంపెనీల్లో సగం వలసదారులవే. 2023 గణాంకాల ప్రకారమైతే ఆ ఏడాది వలసదారులు సృష్టించిన సంపద లక్షా 70 వేల కోట్ల డాలర్లు. వారు పన్ను రూపంలో చెల్లించిన మొత్తం 65,200 కోట్ల డాలర్లు. వాస్తవాలు ఇవి కాగా, చట్టవిరుద్ధంగా వచ్చినవారితోపాటు అమెరికా పౌరసత్వం పొందినవారిని సైతం ట్రంప్ ప్రభుత్వం రాచి రంపాన పెడుతోంది. వారిలో అనవసర భయాందోళనలను సృష్టిస్తూ, ప్రజల్లో అనైక్యత తీసుకురావటానికి అబద్ధాలను ప్రచారంలో పెడుతోంది. ఆయన వచ్చాక వలస వ్యవహారాల న్యాయమూర్తులుగా వున్న 100 మందిని తొలగించారు. టానియా నెమెర్ అనే మహిళా న్యాయమూర్తిని ఒక కేసు విచారిస్తుండగానే కారణం చెప్పకుండా బెంచ్ నుంచి, ఆ తర్వాత సర్వీసు నుంచి తొలగించారు. ప్రస్తుత వైఫల్యాలకు కారణం గతంలోని అస్తవ్యస్తతే కారణమని చెప్పడం ఇటీవల అన్ని దేశాల్లోనూ పాలకులకు అలవాటైన విద్య. ట్రంప్ సైతం ఆ పాటే పాడారు. నిజానికి జో బైడెన్ హయాంలో ఆర్థిక వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది. వలసదారులను తరిమేయటం ద్వారా దాన్ని మరింత గొప్పగా మారుస్తానని అధ్యక్ష ఎన్నికల ప్రచార సభల్లో ట్రంప్ పదే పదే చెప్పారు. కానీ జరిగిందంతా వేరు. ఇష్టానుసారం ప్రపంచ దేశాలపై సుంకాలు పెంచటం వల్ల దేశీయ వినియోగదారులు సగటున 16.8 శాతం అదనంగా పన్నులు చెల్లించాల్సి వస్తున్నదనీ, 1935 నుంచి చూస్తే ఇదే అత్యధికమనీ యేల్ బడ్జెట్ ల్యాబ్ అంచనా వేసింది. దిగుమతైన సరుకులపై ప్రభుత్వం విధించే అదనపు సుంకాలను అంతిమంగా భరించేది అమెరికా వినియోగదారులే. ట్రంప్ అనుకూల ఫాక్స్ న్యూస్ సర్వేలో 72 శాతం మంది గడ్డు ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటు న్నామని చెప్పగా, 58 శాతం మంది ఆయన అనుచిత విషయాలపై శ్రద్ధ పెడుతున్నారని అన్నారు. ఇక అక్టోబర్, నవంబర్ నెలల్లో 41,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగిత 4.6 శాతానికి ఎగబాకింది. 2021 తర్వాత ఈ స్థాయికి పోవటం ఇదే ప్రథమం. గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయటానికి ప్రయత్నిస్తూ మాదక ద్రవ్యాలపై పోరాడుతున్నానని చెప్పుకోవటం ట్రంప్‌కే చెల్లింది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను చిత్తశుద్ధితో చర్చించి, వాటి పరిష్కారానికి తాను అనుసరిస్తున్న విధానాలేమిటో చెప్పి భవిష్యత్తు బాగుంటుందని చెప్పివుంటే కనీసం కొందరైనా నమ్మేవారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ఒప్పుకొంటే, దానికి జవసత్వా లిచ్చేందుకు ఆయన ఏదో ఒకటి చేస్తారన్న ఆశయినా మిగిలేది. దానికి బదులు అంతా సవ్యంగా ఉందని చెప్పడం వల్ల ట్రంప్‌పై కొద్దో గొప్పో ఉన్న విశ్వాసం కూడా దెబ్బతింది. ఆయన రేటింగ్ పడిపోవటంలో ఆశ్చర్యమేముంది? -
వాయు కాలుష్యం ఎన్నాళ్లు?
మనం పీల్చే ప్రాణవాయువు కొంచెం కొంచెంగా మన ప్రాణాన్ని తోడేస్తున్నదంటే నమ్మబుద్ధి కాదు. ఈ సంగతి కొన్ని దశాబ్దాలుగా తెలుస్తూనే ఉన్నా ప్రతి ఏటా దేశ రాజధాని పౌరులు చలికాలం ఉన్నన్నాళ్లూ శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల ఏటికేడాదీ అది తప్పడం లేదు. కాకపోతే శీతకాలంలో మాత్రమే మన వ్యవస్థలన్నీ మేల్కొంటాయి.సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలూ, ప్రభుత్వాల నియమ నిబంధనలూ, విపక్షాల విమర్శలూ, సామాన్యుల అరణ్య రోదనలూ... అన్నీ అప్పుడే! బీసీసీఐ సైతం దేశంలో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయన్న సంగతే మరిచి ఇదే సీజన్లో ఢిల్లీలో, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో క్రికెట్ సంబరాల నిర్వహణకు సన్నాహాలు చేస్తుంది.ఈసారి కూడా రివాజు తప్పకుండా ఇవన్నీ ఒకదాని వెంబడి మరోటి సాగుతున్నాయి. పొగమంచు కమ్మేస్తున్న పర్యవసానంగా ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. గురువారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 50 శాతం మంది ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ మొదలైంది. ఉద్యోగులు సొంత వాహనాల్లో కాక, ‘కార్ పూలింగ్’ ద్వారా వచ్చేలా ప్రోత్సహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.రాజధాని వెలుపల రిజిస్టరై, బీఎస్–4 ప్రమాణాలు లేని వాహనాల రాకపోకల్ని నిషేధించారు. కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ లేని వాహనాలకు ఇంధనం విక్రయించరాదంటూ పెట్రోల్ బంకులకు ఆదేశాలు పోయాయి. 16 రోజుల పాటు అమల్లో ఉండేలా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్)–3 విధించారు.ఈ సమయమంతా నిర్మాణ పనులు నిలిచిపోవాలి. బీఎస్–3 పెట్రోల్, బీఎస్–4 డీజిల్ వాహనాలను అనుమతించబోరు. ఇవి 12 లక్షల వరకూ ఉంటాయని లెక్కేస్తున్నారు. మొత్తంగా ఉండే కోటిన్నర వాహనాల్లో ఇవి ఏపాటి? నమోదు చేసుకున్న నిర్మాణ కార్మికులు ఆంక్షల కారణంగా పనులు కోల్పోతే రూ. 10,000 చొప్పున అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ అలా నమోదైన వారు కేవలం 2.57 లక్షలమంది మాత్రమే.ఇంతకు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారని అంచనా. ఇవన్నీ మెచ్చదగ్గ చర్యలే. కానీ అసలు ఢిల్లీ సవ్యంగా ఉన్నదెప్పుడు? ఇటీవలికాలంలో అది నిరంతరం కాలుష్యంలోనే మునిగి తేలుతోంది. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ పరస్పర విరుద్ధాంశాలన్నట్టు ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి. కేంద్రీకృత నగర వ్యవస్థల వల్లనే ఈ అవస్థలన్నీ దాపురిస్తున్నాయని తెలిసినా వాటిని మానుకోవడం లేదు.ఢిల్లీలో వాయునాణ్యత అతి తీవ్ర స్థాయిలో... అంటే సగటు వాయునాణ్యతా సూచిక (ఏక్యూఐ) 400కు మించి ఉన్నదని తేలింది. ఇది వరుసగా మూడు రోజులుండగా, ఆ తర్వాత అది ‘దయనీయ స్థితి’(వెరీ పూర్)కి... అంటే ఏక్యూఐ 300–400 పరిధిలో కొచ్చింది. కాలుష్యం గురించి దీపావళి పండుగకు ముందో, పంజాబ్‌లో పంట కోతల సమయంలోనో గుర్తుకురావటం వల్లే ఈ సమస్యంతా!కొన్నాళ్లపాటు మొత్తంగా టపాసులు కాల్చటానికి వీల్లేదని నిషేధం విధిస్తే ‘మా పండుగకే ఇలాంటివి గుర్తొస్తాయా?’ అనే తర్కం తలెత్తదు. బ్యాంకుల ద్వారా వాయిదాల్లో వాహనాల కొనుగోలును కొన్నాళ్లు ఆపేస్తే ఇంత చేటు కాలుష్యం ఉండదు. అసలు ప్రజా రవాణా వ్యవస్థను పటిష్ఠం చేస్తే అత్యధికులు వాహనాల జోలికిపోరు. పరిశ్రమలు వెదజల్లుతున్న ఉద్గారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటే కాలుష్య భూతం అదుపులో ఉంటుంది.ఇవన్నీ పట్టన ట్టు నవంబర్– జనవరి మధ్య క్రికెట్ మ్యాచ్‌లకు బీసీసీఐ ఉత్తరాదిని ఎంచుకుని నగుబాటు పాలవుతోంది. లక్నోలో వాయునాణ్యత 400 మించటంతో శుక్ర వారం జరగాల్సిన మ్యాచ్‌ను రద్దుచేశారు. ఇప్పుడే కాదు... 2017లో ఢిల్లీలో భారత– శ్రీలంక మ్యాచ్ సమయంలో పలుమార్లు అంతరాయం ఏర్పడింది. ఆటగాళ్లకు శ్వాసకోశ సమస్య లొచ్చాయి. కొందరైతే ఆడుతూ వాంతులు చేసుకున్నారు.2019లో భారత–బంగ్లా మ్యాచ్ సమయంలోనూ ఇంతే! రెండేళ్ల క్రితం బంగ్లా–శ్రీలంక వరల్డ్ కప్ మ్యాచ్ చివరి నిమిషంలో రద్దయింది. కనీసం ఈ సమయంలోనైనా దక్షిణాదిని ఎంచుకుందా మని బీసీసీఐకి తోచదు. ఇలా ఎవరికి తోచినట్టు వారు ప్రవర్తించకుండా ప్రభుత్వ విభాగా లన్నీ సమన్వయంతో పనిచేస్తే, ఏడాది పొడవునా అమలయ్యే చర్యలుంటే ఢిల్లీ కాస్త యినా మెరుగుపడుతుంది. కాలుష్య భూతాన్ని నియంత్రణలో ఉంచడం సాధ్యమవుతుంది. -
మళ్లీ కాటేసిన ఉగ్రవాదం
ప్రశాంతంగా ఉన్నంతకాలమూ అంతా సవ్యంగా ఉందనుకోవటమే తప్ప ఉగ్రవాదం తీవ్రత ఎక్కడా తగ్గలేదని గత ఆదివారం ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్‌లో చోటు చేసుకున్న ఉదంతం తెలియజేస్తోంది. హన్నూక సంబరాల్లో మునిగిన యూదు సమూహంపై తండ్రీకొడుకులిద్దరు తుపాకులతో దాడి చేసి 15 మందిని కాల్చిచంపటం, 40 మందిని గాయపర్చటం గమనిస్తే నిరంతర అప్రమత్తత ఎంత అవసరమో అర్థమవుతుంది. ప్రతిచోటా భద్రత కల్పించటం ప్రభుత్వాలకు సాధ్యం కాకపోవచ్చు. అందుకే వర్తమాన పరిస్థితుల్లో ఎవరికి వారు తమ చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో అనునిత్యం గమనించుకోవడం తప్పనిసరి. తుపాకీ చట్టాలు ఎంతో కఠినంగా ఉండే ఆస్ట్రేలియాలో ఈ మాదిరి ఘటన జరిగి మూడు దశాబ్దాలవుతోంది. 1996లో పోర్ట్ ఆర్తర్‌లో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో 35 మంది మరణించారు. గత రెండేళ్లలో యూదులకు వ్యతిరేకంగా దాదాపు 2,000 ఘటనలు జరిగినట్టు పోలీసు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుత ఉదంతం కూడా దానికి కొనసాగింపే! ఇలాంటి నేపథ్యంలో నిఘా మరింత పక డ్బందీగా ఉంటే బాగుండేది. ఉన్మాదులు హఠాత్తుగా ఎక్కడైనా దాడులకు తెగబడొచ్చని ఇది రుజువుచేస్తోంది. ఆస్ట్రేలియా భిన్న జాతుల నిలయం. చాలా దేశాలతో పోలిస్తే అది స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు పెట్టింది పేరు. దేశ జనాభాలో యూదుల శాతం 0.4 శాతం. అంకెల్లో చెప్పు కోవాలంటే అది 1,17,000. అందులో చాలా కుటుంబాలు నాజీ జర్మనీలో హిట్లర్ ఉన్మాదాన్ని అధిగమించి అదృష్టవశాత్తూ బతికి బయటపడినవారివే. ఇజ్రాయెల్ పాల కులు గాజాపై రెండేళ్లపాటు ఎడతెగకుండా సాగించిన హంతకదాడుల్లో వేలాదిమంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ ఆ దాడులు ఆగింది లేదు. దాన్ని ప్రపంచ దేశాల ప్రజలంతా నిరసించారు. అందులో యూదులు కూడా ఉన్నారు. ఆస్ట్రేలియా సైతం తీవ్రంగా ఖండించింది. అంతేకాదు, మొన్న ఆగస్టులో పాలస్తీనాను గుర్తించింది. ఆస్ట్రేలియాలో ఉంటున్న యూదులంతా ఇజ్రాయెల్ దుండగాన్ని సమర్థించారని కూడా చెప్పలేం. ఉగ్రవాద సంస్థ హమాస్ సాగించిన హత్యాకాండకు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవటం సబబేనని భావించేవారు ఉంటే ఉండొచ్చు. అలాంటి వారిని సైతం ఒప్పించేలా, మార్చ గలిగేలా ఉద్యమాలు నిర్మించాలి తప్ప సంబంధం లేని అమాయక పౌరుల్ని చంపి ఇలాంటి ఉన్మాదులు ఏం సాధిస్తారు? ఇప్పుడు దాడికి పాల్పడిన తండ్రీకొడుకులకు గాజా ఉదంతం సాకు మాత్రమే. హైదరాబాద్ పాతబస్తీ నుంచి 27 ఏళ్ల క్రితం సాజిద్ అక్రం వలసపోగా, ఆరేళ్లక్రితమే అతని కుమారుడు నవీద్ ఫిలిప్పీన్స్‌లోని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)తో సంబంధాలు పెట్టుకున్నాడని, అప్పటినుంచి వారిద్దరికీ ఉన్మాదం తలకెక్కిందని అంటు న్నారు. గత నెలలో వారిద్దరూ ఫిలిప్పీన్స్ వెళ్లి సైనిక శిక్షణ తీసుకున్నారని పోలీసుల కథనం. ఆర్నెల్లక్రితం కొడుకుపై అనుమానం వచ్చి నిఘా సంస్థ అధికారులు ప్రశ్నించా రట కూడా! కొడుకు పేరుతో రిజిస్టరైన వాహనంలో పేలుడు పదార్థాలు, ఐఎస్ పతా కాలు ఉన్నట్టు పోలీసు సోదాలో బయటపడింది. ఉదంతం జరిగిన రోజే తండ్రిని పోలీసు బలగం కాల్చిచంపగా, కొడుకు సాజిద్‌ను సమీపంలోనే ఉన్న చిరువ్యాపారి అహ్మద్ అల్ –అహ్మద్ చాకచక్యంగా పట్టుకోగలిగాడు. మృత్యువుకు ఎదురొడ్డి అతను చేసిన సాహస కార్యం వల్ల అనేకమంది ప్రాణాలు నిలబడ్డాయి. కానీ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ఉదంతంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ విచిత్రంగా స్పందించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ విధానాలు యూదు వ్యతిరేకతను ప్రోత్సహించే విగా ఉన్నందువల్లే ఈ ఉదంతం జరిగిందని వ్యాఖ్యానించారు. పాలస్తీనా రాజ్యం ఏర్ప డాలని కాంక్షించటం యూదు వ్యతిరేక చర్య ఎలా అవుతుందో నెతన్యాహూకే తెలియాలి. హమాస్ ఉగ్రవాదులు 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడి 1,195 మంది ఆ దేశ పౌరుల్ని, విదేశీయులు కొందరిని చంపేశారు. 251మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఆ విషయంలో ప్రభుత్వ భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చటానికి నెతన్యాహూ గాజాపై విరుచుకుపడ్డారు. ఇప్పుడాయన ఆల్బనీస్ను తప్పుపట్టేందుకు సిద్ధపడ్డారు! ఏదేమైనా ఆస్ట్రేలియా ఉదంతం ప్రపంచ దేశాల కళ్లు తెరిపించాలి. అత్యంత అప్రమత్తంగా ఉండకపోతే ఉగ్రవాద భూతం ఎక్కడైనా విరుచుకుపడొచ్చని తెలుసుకోవాలి. -
‘ఉపాధి’కి కొత్త రూపు!
గ్రామీణ ప్రాంతాల్లో కాయకష్టం చేయగలిగేవారికి ఏడాదికి కనీసం వంద రోజుల పని దినాలు కల్పించేందుకు ఇరవయ్యేళ్ల క్రితం తీసుకొచ్చిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కనుమరుగు కావటానికి రంగం సిద్ధమైంది. దాని స్థానంలో తీసుకురాదల్చిన ‘వికసిత భారత్ రోజ్‌గార్ అజీవికా మిషన్ గ్రామీణ్’ (వీబీ–జీ రాం జీ) బిల్లు పార్లమెంటులో రంగప్రవేశం చేసింది. అమలులో ఉన్న పథకం కన్నా ఇది అనేక రెట్లు మేలైనదని కేంద్రం చెబుతోంది. ఆ మాటెలా ఉన్నా ప్రతి పథకమూ హిందీ భాషా పదాల మేళవింపుతో ఉండటం, పదాది అక్షరాలతో గుర్తుండిపోయే పదం వచ్చేలా రూపొందించటం ఎన్డీయే ప్రభుత్వ ప్రత్యేకత. ఈసారైతే గ్రామాల్లో ప్రతి పేద కుటుంబమూ ‘జీ రాం జీ’ అని స్మరించుకునేలా వాటంగా రూపుదిద్దారు. మహాత్మా గాంధీ పేరు తొలగించారు. పార్టీల మధ్య వాదప్రతివాదాల సంగతెలా ఉన్నా సాధారణ జనం పథకం పేరు కన్నా ప్రయోజనం ఏమేరకన్నదే ప్రధానంగా చూస్తారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చిన నేపథ్యం ఒకింత విషాదకరమైనది. ‘పల్లె కన్నీరు బెడుతుందో...’ అంటూ ప్రజాకవి గోరటి వెంకన్న రాసిన పాట అప్పటి పరిస్థితుల్ని ప్రభావవంతంగా చూపింది. వరస కరువులతో, ఆర్థిక సంస్కరణలతో కుదేలై గ్రామీణ భారతం తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న రోజులవి. రైతుల ఆత్మహత్యలు, ఉపాధి కరువై వలసపోవటాలు, చేతివృత్తులు దెబ్బతినటం రివాజయ్యాయి. దేశంలో అనేక జిల్లాలు ఆకలితో అలమటించాయి. అప్పుడు కేంద్రంలో అధికారంలోకొచ్చిన యూపీఏ ప్రభుత్వం ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ తీసుకొచ్చింది. 2006 నుంచి దశలవారీగా అమలు ప్రారంభించింది. పని చూపాలని కోరితే పక్షం రోజుల్లో పని కల్పించటం లేదా నిరుద్యోగ భృతి కల్పించటం, ఉపాధిని దయాధర్మ భిక్షంగా కాక, హక్కుగా గుర్తించటం, కూలీల్లో మూడోవంతు మంది తప్పనిసరిగా మహిళలుండాలనే షరతు, నివాస స్థలానికి అయిదు కిలోమీటర్ల లోపునే పనిచూపటం, అంతకు మించితే అదనపు వేతనం చెల్లించటం దాని ప్రత్యేకతలు. ప్రపంచంలోనే అతి పెద్ద ఉపాధి కల్పనా పథకమది. పల్లెసీమల్లో ఈ పథకం కింద రహదారులు, చెరువుల్లో పూడిక తీయటం, భూసార పరిరక్షణ, నీటిపారుదల సదుపాయాల మెరుగు వగైరా పనులు చేయించటానికి వినియోగించారు.అయితే లోపాలు లేవని కాదు. ఈ పథకం వల్ల తమకు కూలీల లభ్యత తగ్గిందని రైతుల ఫిర్యాదు. అలాగే వేతనాల చెల్లింపులో ఆలస్యం, నిధుల అరకొర కేటాయింపు, అన్నిచోట్లా ఒకేలా అమలు చేయకపోవటం, బయటి రేట్లతో పోలిస్తే వేతనాలు తక్కువ ఉండటం వగైరాలు సమస్యలు. వీటిని ‘జీ రాం జీ’ పరిష్కరిస్తుందా? వంద రోజులు కాదు... 125 రోజులు ఉపాధి గ్యారెంటీ అంటున్నది కొత్త పథకం. సాగు పనులు జోరుగా ఉండే రెండు నెలలూ దీన్ని తాత్కాలికంగా నిలిపేస్తారు. ఈశాన్య రాష్ట్రాలూ, కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ వగైరాలు మినహా మెజారిటీ రాష్ట్రాలు ఈ పథకంలో 40 శాతాన్ని భరించాల్సి రావటం ఇందులోని ప్రధాన సమస్య. ఇంతవరకూ ఇది 10 శాతం మాత్రమే. ఇకపై రాష్ట్రాలు ఏటా కనీసం రూ. 50,000 కోట్లు వెచ్చించాలి. పైగా ప్రతి ఏటా నిర్దిష్ట మొత్తంలో నిధులు కేటాయించటం, అంతకుమించి పెరిగితే రాష్ట్రాలే భరించాల్సి రావటం అదనపు సమస్య. రాష్ట్రాల ఆదాయ వనరులకు గండికొడుతూ అదనంగా ఇంత పెద్ద భారాన్ని మోపటం సరైందేనా? ఎన్డీయేను భుజాలకెత్తుకున్న జేడీ(యూ), టీడీపీ ఏమంటాయి? ఈ పథకం కూడా గతంలో మాదిరే హక్కు ప్రాతిపదికగా ఉంటుందంటున్నా నిధుల లేమితో ఆచరణలో ఆవిరి కాదా? గత అయిదేళ్లలో ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు తగ్గుతున్నది. ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ గణాంకాలు ఆ సంగతి చెబుతున్నాయి. రాష్ట్రాలపై అదనపు భారం మోపితే పథకం నీరసిస్తుంది. రాష్ట్రాలకు కేటాయింపుల్లో కేంద్రం అనుసరించబోయే గీటురాళ్లేమిటో ఇంకా తెలియాల్సి ఉంది. తమకేం అవసరమో రాష్ట్రాలు నిర్ణయించు కోవటానికి బదులు ఎక్కడెక్కడ ఖర్చు చేయాలో కేంద్రం నిర్దేశిస్తుంది. వికేంద్రీకరణ అవసరం నానాటికీ పెరుగుతుండగా అందుకు భిన్నమైన మార్గం సమర్థనీయం కాదు. మొత్తానికి దీనివల్ల ఒరిగేదేమిటో, కష్టనష్టాలేమిటో మున్ముందు తెలుస్తాయి. -
బీమాలో సంపూర్ణ ఎఫ్‌డీఐ
భారత బీమా రంగంలో విదేశీ సంస్థలు పూర్తి స్థాయిలో ప్రవేశించటానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఈ విషయంలో రెండు దశాబ్దాలుగా ఎడతెగకుండా సాగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కివచ్చాయి. ‘సబ్కా బీమా సబ్కీ రక్షా’ పేరిట పార్లమెంటులో రంగప్రవేశం చేయబోతున్న బీమా చట్టాల సవరణ బిల్లు... 1938నాటి బీమా చట్టానికీ, 1956నాటి జీవితబీమా కార్పొరేషన్ చట్టానికీ, 1999 నాటి బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) చట్టానికీ సమూలమైన మార్పుల్ని ప్రతిపాదిస్తోంది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను ప్రస్తుతం వున్న 74 శాతం నుంచి 100 శాతానికి పెంచటానికి ఈ బిల్లు అనుమతిస్తోంది. కేంద్రంలో పాలకులెవరైనా, వారి రాజకీయ విశ్వాసాలూ, నాయకత్వం వహిస్తున్న కూటములూ ఏవైనా ఎఫ్‌డీఐను పూర్తి స్థాయిలో అనుమతించాలన్న విషయంలో అందరిదీ ఒకటే స్వరం. బీమా రంగంలో విదేశీ సంస్థలకు తలుపులు బార్లా తెరవాలని సంపన్న దేశాల నుంచి ఎప్పటినుంచో ఒత్తిళ్లు ఉన్నాయి. మన బీమా రంగంలో ప్రైవేటు సంస్థలున్నా సామాన్య పౌరులు పబ్లిక్ రంగ సంస్థ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)ను విశ్వసించిన స్థాయిలో వాటిని నమ్మరు. అందుకే మార్కెట్లో ఇప్పటికీ దాని భాగస్వామ్యం దాదాపు 65 శాతం. అలాగని చొరవగా దూసుకెళ్లటంలో అదింకా వెనకబడి వున్నదనీ ఆర్థిక రంగ నిపుణులంటారు. పోటీ పెరిగితే ఇది మారుతుందనీ, వినియోగదారులు లాభపడతారనీ వారి వాదన. మన జీవిత బీమా రంగం వాటా జీడీపీలో 3.2 శాతం. వాస్తవానికి ఇది 2023–24 ఆర్థిక సంవత్సరంలో మరింత కిందకు పోయి 2.8 శాతం దగ్గర ఆగింది. విదేశాల్లో ఈ రంగం వాటా 6.5 శాతం.విదేశీ సంస్థలను అనుమతించటాన్ని వ్యతిరేకించేవారు అవి లాభార్జన దృష్టితో ఉంటాయని విమర్శిస్తారు. దేశీయ పొదుపు దేశాభివృద్ధికి కాక విదేశీ సంస్థలకు పోతుందని... పేదరికం ప్రబలంగా ఉన్న మనలాంటి దేశంలో సంక్షోభ కాలంలో ఆసరాగా నిలబడకపోతే ఎలా అన్నది వారి ప్రశ్న. అనుకున్నట్టు లాభాలు రాకపోతే సంస్థలు దివాలా తీసే, నిష్క్రమించే అవకాశం ఉండదా అనే సందేహాలున్నాయి. ఐఆర్డీఏఐ వంటి నియంత్రణ సంస్థ ఉండగా ఆ భయాలు అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం డేటా చౌర్యం కూడా సమస్యే! ప్రైవేటు సంస్థల్లో తగిన నియంత్రణ లేని కారణంగా ఖాతాదారుల డేటా బయటకు పోతోందని, అందువల్ల మోసగాళ్ల బెడద ఎక్కువైందని బీమా రంగాన్ని ప్రైవేటీకరించటాన్ని వ్యతిరేకించే సంస్థలు ఆరోపిస్తున్నాయి. 2047కల్లా పౌరుల్లో ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం చేరాలన్నది ఐఆర్డీఏఐ లక్ష్యం. అలాగే ఆరోగ్యం, ఆస్తి తదితరాలకు సైతం బీమా చేయించుకునేలా ప్రచారం చేయాలని ఆ సంస్థ కంకణం కట్టుకుంది. విదేశీ సంస్థల్ని అనుమతించటానికి చాన్నాళ్లుగా మన ప్రభుత్వాలు హైరానా పడుతున్నాయి. తొలిసారి వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 1999లో ఐఆర్డీఏఐ చట్టాన్ని తీసుకొచ్చి ఆ రంగంలో 26 శాతం ఎఫ్‌డీఐలకు తొలిసారి అనుమతించింది. ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్, 2004లో తన నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి రాగానే దాన్ని 49 శాతానికి పెంచే ప్రయత్నం చేసింది. అప్పట్లో యూపీఏకు బాసటగా ఉన్న వామపక్షాలు ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. కారణం ఏమైతేనేం ఈ ప్రతిపాదన ముందుకు కదల్లేదు. వారితోపాటు విపక్షంలోఉన్న బీజేపీ సైతం గట్టిగా వ్యతిరేకించింది. కేంద్రంలో 2014లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే అధికారంలోకొచ్చిన వెంటనే పాత ప్రతిపాదన దుమ్ము దులిపింది. ఏడాదికల్లా దాన్ని 49 శాతానికి, మరో ఏడేళ్లకు 74 శాతానికి విస్తరించింది. బీమా సంస్థల్లో విదేశీ భాగస్వాముల వాటా పరిమితమే గనుక భయాందోళనలు అనవసరమని ఇన్నాళ్లూ ప్రభుత్వాలు చెబుతూవచ్చాయి. ఇప్పుడది 100 శాతానికి చేరింది గనుక తగిన జాగ్రత్తలూ, నియంత్రణలూ అవసరం. బిల్లు పార్లమెంటు పరిశీలనకొచ్చినప్పుడు, అందులోని లోటుపాట్లేమిటో, ఇంకా చేయాల్సిందేమిటో చెప్పగలిగే దిశగా ఆరోగ్యవంతమైన చర్చ జరగాలి. దేశీయ పొదుపు కాస్తా అన్యుల చేతుల్లోపడితే, వారు సక్రమంగా నిర్వహించటంలో విఫలమైతే సామాన్యులకు తీరని నష్టం కలుగుతుంది. -
పది నీతులు, పది బూతులు
కుందవరపు చౌడప్ప పేరు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమే. ‘నీతులకేం కానీ, బూతాడక పోతే దొరకు నవ్వు పుట్టదు ధరలో’ అంటాడాయన. ‘సభలో పది నీతులూ, పది బూతులూ ఉన్న పద్యాలు చెప్పినవాడే అధికు’డంటూ నీతినీ, బూతునూ ఒకే గాటన కట్టిన తెంపరి ఆయన. అక్షరాన్ని సాక్షాత్తు ‘సరస్వతి’గా ఉపాసించారు కనుకనే పూర్వులు రచనను ‘సారస్వత’ మన్నారు. అలా అక్షరాన్ని పవిత్రంగా భావించేవారెవరైనా బూతు రాతలో రోతనే తప్ప నీతినీ, నవ్వునూ చూడలేరు. ఒకానొక విశ్వవిద్యాలయంలో తోటి ఆచార్యుని చర్మరోగాన్ని ఆక్షేపిస్తూ ఏకంగా పద్యాలే రాసి తనకు అబ్బిన పద్యవిద్యను బురదగుంటలో పొర్లించిన ఇటీవలి ఆచార్య పుంగవులూ లేకపోలేదు కానీ, తెలుగు సాహిత్యం అదృష్టం కొద్దీ బూతుకవిగా చౌడప్ప ఒక్కడే చరిత్ర కెక్కాడు. ఇప్పుడు లెక్కకు మిక్కిలిగా బూతుల బుంగల్ని సృష్టించి సామాజిక మాధ్యమాలు ఆ హేయచరిత్రకు వేల సంఖ్యలో కొత్తపుటలు జోడిస్తున్నాయి. నిజానికి మాధ్యమాలు సామాజికీకరణ చెందడం ఎంతైనా స్వాగతించదగినదే; అందువల్ల తమ భావాలను ఇతరులతో పంచుకునే అవకాశం కొత్తకొత్త వర్గాలకు అందు బాటులోకి వచ్చింది. దాంతోపాటే అవి అసభ్యతా, అశ్లీలం, బూతు, వ్యక్తిగతమైన వేధింపు వగైరాల రూపంలో చెప్పలేనంత మురికినీ తెప్పలుగా పారిస్తున్నాయి. డ్రైనేజీ స్కీములేక అది డేంజర్‌గా మారుతోంది. కాకపోతే, మనందరికీ తెలిసిన ‘బూతు’లాంటి మోటు మాటలతో కాకుండా ఎక్కువమందికి తెలియని ‘ట్రోలింగ్’ అనే నాజూకు పేరుతో ఇది చలామణీ అవుతోంది. స్కాండెనేవియా జానపద కథల్లోని రాక్షసులు, మరుగుజ్జు ల్లాంటి జగడాలమారి, అసాంఘిక శక్తులను సంకేతించడంతో ప్రారంభించి, చేపలకు వేసే ఎర వరకూ పదిహేనో శతాబ్ది నుంచి రకరకాల అర్థాల్లో వాడుతూ వచ్చిన ఈ ‘ట్రోల్’ అనే మాట ఇప్పుడు రకరకాల అసహ్యార్థాలలో అంతర్జాల సంస్కృతిలో స్థిరపడింది. భారతీయ సమాజంలో తిట్టుకూ, బూతుకూ స్త్రీలనే లక్ష్యం చేసుకోవడం మొదటి నుంచీ ఉన్నదే. సామాజిక మాధ్యమాలు ఇందుకు కొత్తగా అందివచ్చిన రొచ్చుబండ లయ్యాయి. అక్కడక్కడ స్వయంగా మహిళలూ ఇందులో భాగస్వాములవడం ఈ అధః పతనంలో కొత్త లోతు. సహజంగా స్త్రీల నుంచే దీనిపట్ల తీవ్ర నిరసన వెల్లువెత్తుతోంది. బూతులకు, వేధింపులకు గురవుతున్న కొంతమంది మహిళా యూట్యూబర్లు ఈ మధ్య ఒక పోలీస్ ఉన్నతాధికారిని కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. అయినా దీనికి అడ్డుకట్టపడే సూచన కానీ, పడుతుందన్న ఆశకు ఆస్కారం కానీ కనిపించడం లేదు. ఫేస్బుక్ మాధ్యమంలో చురుగ్గా పనిచేస్తున్న ఒక గ్రూపు తన వంతుగా రంగంలోకి దిగి దీనిపై ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించి, కొన్ని సందేశాత్మక వీడియోలను ప్రచారంలోకి తెచ్చింది. అయితే, సమస్య ఎన్నో శక్తుల భాగస్వామ్యంతో లోతుగా వేళ్లూనుకున్న స్థితిలో పై మెరుగుల చర్యల వల్ల ఫలితముంటుందా అన్న ప్రశ్నా ఎదురవుతుంది. ఉదాహరణకు, మహిళలు విద్యా, ఉద్యోగాల్లోనే కాక, ఆ యా సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలమవ డాన్ని కంటగించుకునే సాంప్రదాయిక శక్తులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటూ తమ అసహనాన్నీ, అక్కసునూ వెళ్ళగక్కుతున్నాయి. ఇంకోవైపు, వివిధ భావ జాలాల మధ్య ఘర్షణ పతాకస్థాయికి చేరుకున్న నేటి దేశీయ వాతావరణంలో వాటికి నాయకత్వం వహించే రాజకీయ పక్షాలు సాంప్రదాయిక మాధ్యమాలకు అదనంగా సామాజిక మాధ్యమాలనూ యథేచ్ఛగా వాడుకుంటున్నాయి. అధికార బలంతోపాటు అర్థబలం, అంగబలం దండిగా ఉన్న శక్తులు ఈ బూతులూ, తిట్ల పంచాంగాన్ని వ్యవస్థీకృతం చేసి తెర వెనుక నుంచి నడిపిస్తున్న సూచనలూ పొడగడుతున్నాయి. దేవుళ్ళూ, మతమూ, సంస్కృతీ, సభ్యతా, సంస్కారాలతో సహా మనవనుకునే అన్ని టినీ ఆకాశానికెత్తే నోళ్లే బూతులూ, అశ్లీలాల మురికిని పుక్కిలించడం ఈ మొత్తంలో ఒక అపహాస్యభరితమైన అతిపెద్ద వైరుద్ధ్యం. తమవైన వ్యవస్థలకూ, విలువలకూ తమ చేతులతోనే చెరుపుకోలేనంత మసీ, మకిలీ అంటించి చెరుపు చేస్తున్నామన్న స్పృహ కూడా లోపించిన పరిస్థితి. అన్ని తేడాలకూ అతీతంగా అందరూ ఒక్కటై కడతేర్చవలసిన సామాజిక రుగ్మతగా గుర్తించడమే దీనికి ఏకైక పరిష్కారం. -
అమరావతి చిక్కుముళ్ళకు బాధ్యులెవరు?
అమరావతిపై ఏపీ సర్కార్‌లో ఏదో గందరగోళం కనిపిస్తు న్నది. చేస్తున్న పనుల్లో ఇసుమంతైనా పారదర్శకత లేదు. న్యాయమైన సందేహాలను కూడా కూటమి సహించలేక పోతున్నది. ప్రతిపక్షాలూ, మీడియా వేసే ప్రశ్నలే కాదు... తటస్థులూ, సానుభూతిపరుల సందేహాల పైన కూడా అసహనం వ్యక్తమవుతున్నది. ఈ ధోరణి కేవలం ప్రభుత్వ పెద్దల్లోనే కాదు, అనుబంధ మీడియాలో కూడా కనిపిస్తున్నది. తమకు నచ్చకపోతే నిఖార్సయిన వార్తలపై కూడా ఎల్లో మీడియా వీరంగం వేస్తున్నది. ఇక సర్కారు వారి సోషల్ మీడియాలోని ఎల్లో మెర్సినరీలను పట్ట వశం కావడం లేదు. అమరావతిపై ఎవరైనా సందేహాలు వ్యక్తం చేస్తే బూతుబాంబులతో చెలరేగిపోతున్నారు.‘అమరావతి బిల్లు వెనక్కి’ అనే వార్త ఇటీవల ‘సాక్షి’లో వచ్చింది. ఇది నూటికి నూరుపాళ్ళు నిజమైన వార్త. అమ రావతికి సంబంధించిన పరిణామాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమైన వార్తలే! ఆ వార్తలను అందించడం మీడియా బాధ్యత. ఎల్లో మీడియా కూడా ఆ వార్తను అందించి ఉండాల్సింది. కేంద్రం ఆమోదానికి రాష్ట్రం పంపించిన బిల్లులో సాంకే తిక లోపాలను గుర్తించినందువల్ల వాటిని సరిచేసి పంపాలని వెనక్కి పంపారు. ‘సాక్షి’ మీడియా అదే సమాచారాన్ని ప్రజలకు చేరవేసింది. అంతే తప్ప అమరావతి బిల్లుకు ఇక మోక్షమే ఉండ బోదనీ, అమరావతి రాజధాని ప్రతిపాదనకు కేంద్రం తిరస్కరించిందనీ ఎక్కడా రాయలేదు. ఈమాత్రం దానికే ఎల్లో మీడియాకు, తెలుగుదేశం నేతలకు పూనకాలు వచ్చాయి. అమరావతి ఏర్పాటును సహించలేకపోతున్నారంటూ శాప నార్థాలు పెట్టారు. అసలు అమరావతిని ఒక నిష్ఫల ప్రయోగంగా మార్చుతున్నది ఎవరో పరిశీలించవలసిన అవసరం ఏర్పడింది. నిజంగానే ఈ బిల్లును ఆమోదించడంలో కేంద్రానికి కొన్ని చిక్కులున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం– 2014లో రాష్ట్ర విభజన అమల్లోకి వచ్చిన రోజు (జూన్ 2, 2014) నుంచి 10 ఏళ్ల వరకు హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు.అందువల్ల 2014 నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తే, న్యాయపరమైన చిక్కులొచ్చే అవకాశం ఉంటుందనికేంద్రం భావించింది. 2024 జూన్ 2 నుంచి రాజధానిగా గుర్తించడమనేది ఒక ప్రత్యామ్నాయ మార్గం. అయితే 2014 నుంచి 2024 మధ్యకాలంలో రాజధాని కోసం కేంద్రం చేసిన సహాయం మాటేమిటి? ఈ చిక్కుముడులు తొలగించి, బిల్లును మళ్లీపంపాలని కేంద్రం సూచించింది. ఆ పని చేస్తే సరిపోతుంది. ఇటువంటి చిక్కుముళ్ళన్నీ చంద్రబాబు సర్కార్ స్వయంకృతం. 2024 నుంచే అమరావతిని రాజధానిగా గుర్తిస్తే 34 వేల ఎకరాల భూ సమీకరణ ఏ పేరుతో చేసినట్టు? పైగా ఈ పదేళ్లపాటు రాజధాని లేని రాష్ట్రంగానే ఆంధ్రప్రదేశ్ కొనసాగిందా? రాష్ట్రం రాజధాని లేని అనాథగా మారిందని జగన్ హయాంలో దుష్ప చ్రారం చేసిందెవరు? 2024 నుంచే అమరావతిని రాజధానిగా గుర్తిస్తే చంద్రబాబు తొలి ఐదేళ్ల పాలన కూడా రాజధాని లేని రాష్ట్రంగా భావించవలసిందేనా?అమరావతి చుట్టూ వరుసగా చిక్కుముళ్ళు వేసుకుంటూ వెళ్ళిందే చంద్రబాబు సర్కార్. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుందని పునర్విభజన చట్టం స్పష్టం చేసింది. కేవలం అసెంబ్లీ, సెక్రటేరియట్, శాఖాధిపతుల కార్యా లయాలకు మాత్రమే ఈ ఉమ్మడి రాజధాని పరిమితం కాదు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి మొత్తం ఉమ్మడి రాజధాని ప్రాంతంగానే ఉంటుందని చట్టంలో పేర్కొ న్నారు. పదేళ్ల ఉమ్మడి రాజధాని అంశాన్ని ఉపయోగించుకోకుండా, ఏదో చేయకూడని పనిచేస్తూ దొరికిపోయినందువల్ల బాబు సర్కార్ హైదరాబాదుపై హక్కుల్ని వదిలేసుకుని వెళ్లి పోయిందని విమర్శలు వచ్చాయి.పదేళ్ల తర్వాత ఏపీకి రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని సూచించడం కోసం ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలనీ, ఆ కమిటీ ఆరు మాసాల్లోగా నివేదిక ఇవ్వాలనీ కేంద్రాన్ని చట్టం ఆదేశించింది. చట్ట ప్రకారం కేంద్రం ‘శివరామకృష్ణన్ కమిటీ’ని నియమించింది. ఆ కమిటీ పలు ప్రాంతాల్లో పర్యటించి, వివిధ రంగాల ప్రజలతో సంభాషించి, ఒక నివేదికను అందజేసింది. నిపుణుల కమిటీ చేసిన సూచన లకు నూటికి నూరుపాళ్ళు వ్యతిరేకంగా చంద్రబాబు అమరా వతిని ఎంపిక చేశారు. రాజధాని ఏర్పాటు కారణంగా అక్కడ పర్యావరణ సమతౌల్యం దెబ్బతినకుండా చూడాలనీ, వాగులు, వంకలు, చెరువుల వంటి జల వనరులను కాపాడాలనీ, వరదలు – భూకంపాలు – తుఫాన్లు వచ్చే అవకాశం లేని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలనీ, పెద్ద సంఖ్యలో ప్రజలు నిర్వాసితులు కాకుండా చూడాలనీ కమిటీ ప్రతిపాదించింది. రాజధాని నిర్మాణ వ్యయం – భూ సేకరణ వగైరాలు వీలైనంత తక్కువ ఖర్చుతో పూర్తయ్యేలా ఉండాలని కూడా కమిటీచెప్పింది. కొత్త రాజధాని హైదరాబాద్ వంటి ‘సూపర్ సిటీ’గా కాకుండా ప్రభుత్వ శాఖల్ని వేర్వేరు ప్రాంతాలకు తరలించివికేంద్రీకరణ సూత్రాన్ని పాటించాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది.నిపుణుల కమిటీ నివేదికను చంద్రబాబు పక్కన పడేశారు. కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా, పాలసీ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయనతో పాటు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డీన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ డైరెక్టర్లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సభ్యుల కంటే పిల్లల చదువుతో వ్యాపారం చేసే నారాయణ మెరుగైన నిపుణుడని మనసారా చంద్రబాబు నమ్మారు. అందుకే ఆ కమిటీ నివేదికను గిరాటేసి, ‘నారాయణ కమిటీ’ వేసుకున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియా’ చట్టం పేరుతో ఓ చట్టాన్ని ఆమోదించారు. విచిత్రం ఏమిటంటే ఈ చట్టంలో ఎక్కడా కూడా ‘క్యాపిటల్ రీజియన్’గా అమరావతి ప్రాంతం ఉంటుందనే ప్రస్తావన లేదు. ఈ దాపరికం వెనుక ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ అనే ఆర్థిక కుతంత్రం దాగి ఉందని అప్పట్లోనే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అటువంటిదేమీ లేదని నిరూపించుకునే ప్రయత్నం ఈ పదేళ్ళలో చంద్రబాబు ఎప్పుడూ చేయలేదు.నిపుణుల కమిటీ నివేదికను పక్కన పడేయటం, ప్రపంచంలో ఏ నిపుణుడూ అంగీకరించని ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసుకోవడం, దాన్ని గోప్యంగా ఉంచి చట్టం చేసు కోవటం, చట్టపరంగా పదేళ్లపాటు హైదరాబాదుపై ఉన్న హక్కుల్ని వదిలేసుకోవడం, 34 వేల ఎకరాల సారవంతమైన భూముల్ని రైతుల నుంచి నయానో భయానో సమీకరించడం, వారికి చేసిన వాగ్దానాలను నెరవేర్చలేకపోవడంతో పాటు సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు వరుసగా ఇప్పుడు చిక్కుముళ్ళుగా మారాయి. సింగపూర్ తరఫున అమ రావతిలో ఉత్సాహం ప్రదర్శించిన మంత్రి ఈశ్వరన్ అవినీతి కథలు బయటపడటంతో సింగపూర్ కంపెనీలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. చిక్కుముళ్ళ పరంపర ఇంతటితో ఆగి పోలేదు. రైతుల దగ్గర సమీకరించిన భూమితో పాటు, ప్రభుత్వ భూమి కూడా కలిపితే 53 వేల ఎకరాలు అమరావతి కోసం సిద్ధంగా ఉన్నది.ఇప్పుడు ఈ భూమి చిన్న మునిసిపాలిటీకి మాత్రమే సరిపోతుందని బాబు చెబుతున్నారు. ఇంకో రెండు దశల్లో మరో 40 వేల పైచిలుకు ఎకరాలను సేకరిస్తే తప్ప కలల రాజధాని సాకారం కాదట. రెండు కోట్లకు పైగా జనాభా ఉన్న ముంబై మహానగరమే (కార్పొరేషన్ ఏరియా) లక్షా పదివేల ఎకరాల్లో ఉందట! ఇంచుమించు అంత స్థలం ఉంటే తప్ప అమరావతి వెంచర్ ప్రారంభం కాదని ఇప్పుడు చెబుతున్నారు. ఇప్పుడున్న 53 వేల ఎకరాల్లోనే ‘నవ నగరాల’ పేరుతో మాస్టర్ ప్లాన్ గతంలోనే రూపొందించారు. అందులో 4 వేల ఎకరాలతో కూడిన స్పోర్ట్స్ సిటీ కూడా ఉన్నది. ఇప్పుడు అదనంగా స్టేడియాల కోసం, అంతర్జాతీయ విమానాశ్రయం కోసం, రెండో విడత భూసేకరణ కావాలని అడగటానికి కారణం ఏమిటో తెలియదు.సీఆర్డీఏ వెబ్సైట్లో పొందుపరిచిన అమరావతి భూముల లెక్కలు పరిశీలిస్తే అదనపు భూములు అవసరం ఏమిటన్న సందేహం మరింత పెరుగుతుంది. రైతులిచ్చిన భూములు ప్లస్ ప్రభుత్వ భూములు కలిసి సీఆర్డీఏ దగ్గర 53,747 ఎకరాల భూమి ఉన్నది. రోడ్లు, పార్కులు, చెరువులు వగైరాలు తీసేస్తే 29,220 ఎకరాలు మిగులుతాయి. ఇందులో 9,500 ఎకరాలు రైతులకు ఇవ్వాలి. 1,100 ఎకరాలు ఇప్పటికే వివిధ సంస్థలకు ఇచ్చారు. 300 ఎకరాల పైచిలుకు ప్రభుత్వసంస్థలకు కావాలి. ఇంకా 18 వేల పైచిలుకు ఎకరాల భూమి సీఆర్డీఏ దగ్గర ఉంటుంది. ఇవన్నీ దాని లెక్కలే! ఇంకా అదనపు భూమి దేనికోసం? అభిజ్ఞ వర్గాల నుంచి అందుతున్న సమా చారం ప్రకారం ఈ మొత్తం లేఅవుట్లో 15 వేల ఎకరాల ప్రభుత్వ భూమికి చెందిన సరిహద్దులు చెదిరిపోయాయి, రికార్డులు చిరిగిపోయాయి. కేటాయింపులకు గాని, అమ్మకాలకు గాని ఆ భూమి సీఆర్డీఏకి అందుబాటులో ఉంటుందో ఉండ దోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను చెరువుల్ని పూడ్చేసి, చదును చేసి ఇస్తున్నారట! న్యాయ వివాదాలు తలెత్తితే ఇవి చెల్లుబాటు అవుతాయా? అసలు చెరువులను పూడ్చి, ప్లాట్లు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది?రెండో దశ, మూడో దశ భూ సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కొందరు భారీగా భూములు కొను గోలు చేశారట! ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టు పేరుతో వారు భూములు అమ్ముకోవాలి. అందుకోసం కాగితాలు మీదనే నగర విస్తరణ అక్కడిదాకా పాకాలి. ఈ లోగుట్టు అర్థమైనందు వల్లనే ఎంతోమంది తటస్థులతో పాటు, తెలుగుదేశం మద్దతుదారులు సైతం అమరావతి వ్యవహారాలను ప్రశ్నిస్తున్నారు. ఆలూ లేదు చూలూ లేదు... ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన ఇప్పుడుఎందుకని ప్రశ్నిస్తున్నారు. పక్కనే గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా, మరో అంతర్జాతీయ విమానాశ్రయం దేనికని నిలదీస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి దేనికీ సమా ధానం లేదు. సరిగ్గా గమనిస్తే ఇంకో కోణం కనిపిస్తున్నది. మొదటి దశ సమీకరణలో చురుగ్గా కనిపించిన దేవినేని, ప్రత్తిపాటి, యరపతినేని, ధూళిపాళ్ల, శ్రీధర్ వగైరాలు ఇప్పుడు ఛూమంతర్ అన్నట్టుగా మాయమయ్యారు. రెండో దశ కోసం యవనిక ముందుకు పెమ్మసాని, భాష్యం, చిన్న కేశినేని వంటి వారు రంగప్రవేశం చేశారు. మొదటి టీమ్‌కు సారాంశం బోధపడినందువల్లనే పక్కన పెట్టి ఉంటారా?పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రంలో మంత్రి. పని చేస్తున్నది మాత్రం రాష్ట్రంలో అమరావతి శాఖ కోసం! త్రీ మెన్ కమిటీ ముసుగులో ఆయన పూర్తి సమయం అమరావతి వ్యవహారాలనే చూస్తున్నారని తెలుగుదేశం వారే చెబుతున్నారు. అందుకు ప్రధానమంత్రి కూడా అంగీకరించారేమో తెలియదు. అంతకు ముందు పూర్తి బాధ్యతగా అమరావతి సంగతులు సర్దుబాటు చేసిన నారాయణ ఇప్పుడూ ఉన్నారు. కాకపోతే ఆయన పెమ్మసాని పక్కన జూనియర్ ఆర్టిస్టుగానే కనిపిస్తున్నారు. అమరావతి చుట్టూ చిక్కుముళ్ళు చాలా పడ్డాయి. ప్రజల మదిలో చాలా సందేహాలు ఉన్నాయి. అవి లేవనెత్తిన వారిపై బీపీ పెంచుకొని విరుచుకుపడటం పరిష్కారం కాదు. భూముల సమీకరణతో సహా మొత్తం అమరావతి వివరాలను పబ్లిక్ఆడిట్ కోసం విడుదల చేయాలని డిమాండ్ చేయాలి. శ్వేత పత్రం కావాలని అడగాలి. ఇది బాధ్యతాయుతమైన మీడియా స్థానాల్లో, రాజకీయ పదవుల్లో ఉన్నవారు చేయవలసిన పని. ఎన్నికలకు ముందు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని చెప్పిన బాబు, దానికోసం ఇప్పటికే 47 వేల కోట్లు అప్పుఎందుకు చేయవలసి వచ్చిందో ప్రజలకు తెలియజెప్పడం ప్రభుత్వ కనీస బాధ్యత. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ట్రంప్ ‘శాంతి’కి గ్రహణం
ఎనిమిది యుద్ధాలను ఆపానని స్వోత్కర్షకు పోతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరువు తీసేలా ప్రపంచంలో రెండుచోట్ల మళ్లీ కుంపట్లు రాజుకున్నాయి. సుంకాలు విధిస్తానంటూ బెదిరించి రెండునెలల క్రితం ఆయన ఆగ్నేయాసియా దేశాలైన థాయ్‌లాండ్ – కంబోడియాల మధ్య సాగుతున్న యుద్ధాన్ని ఆపి సఖ్యత కుదిర్చారు. ఆ రెండింటి మధ్యా సరిహద్దు సమస్యకు శాంతియుత పరిష్కారం కుదిరిందని ఆర్భాటంగా ప్రకటించారు. తీరా అయిదురోజుల నాడు కంబోడియా మందుపాతరకు తమ సైనికుడు తీవ్రంగా గాయపడటంతో థాయ్ వైమానిక దళం దాడులు ప్రారంభించింది. ఈసారి దాదాపు పదిమంది మరణించగా వేలాదిమంది జనం ప్రాణభయంతో గ్రామాలు విడిచి పెట్టి వెళ్లిపోవాల్సి వచ్చింది. కంబోడియా సైన్యం ప్రతీకార దాడులతో థాయ్ గ్రామాల ప్రజలు కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. మొత్తానికి అటూ, ఇటూ 5 లక్షలమంది నిరాశ్ర యులయ్యారు. ఆఫ్రికాలో పరస్పరం తలపడుతున్న కాంగో–రువాండాల మధ్య కేవలం వారం క్రితం ట్రంప్ శాంతి ఒప్పందం కుదిర్చారు. కానీ అది కూడా విఫలమైంది. పర్యవ సానంగా కాంగోలోని సరిహద్దు గ్రామాలను 2 లక్షల మంది ఖాళీ చేయాల్సి వచ్చింది. రువాండా తిరుగుబాటు సంస్థ ఆ గ్రామాల్లోకి ప్రవేశించిందంటున్నారు.సమస్య మూలమేమిటో తెలుసుకోకుండా, ఇరుపక్షాలూ ఎలాంటి పరిష్కారాన్ని కోరుకుంటున్నాయో గ్రహించకుండా, అందుకు ఏర్పడుతున్న అడ్డంకులేమిటో అర్థం చేసుకోకుండా... ఒక ఫోన్ కాల్‌తో, ఒకటి రెండు బెదిరింపులతో అంతా సమసిపోతుంద నుకుంటే అవి మళ్లీ మళ్లీ తలెత్తుతూనే ఉంటాయి. ట్రంప్ దౌత్యం విఫలం కావటానికి కారణం ఇదే. ఇరుగు పొరుగు దేశాల మధ్య భూభాగం గురించే ప్రధానంగా ఘర్షణలుంటాయి. థాయ్‌లాండ్–కంబోడియాల సమస్య కూడా అదే! రెండు దేశాలకూ 817 కిలోమీటర్ల పొడవునా సరిహద్దు ఉంది. ఫ్రాన్స్ దురాక్రమణలో కంబోడియా ఉండగానే వందేళ్ల క్రితం థాయ్‌లాండ్‌తో పేచీ ఏర్పడింది. 1953లో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దాన్ని పరిష్కరించుకుందామని కంబోడియా ప్రయత్నిస్తోంది. కానీ రెండువైపులా పుట్టు కొచ్చే జాతీయవాద ధోరణులు అందుకు అడ్డంకిగా మారాయి. 2008లో వివాదాస్పద భూభాగంలోని 11వ శతాబ్దం నాటి హిందూ దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వార సత్వ సంపదల జాబితాలో చేర్చినప్పుడు అది తమదేనని కంబోడియా ప్రకటించు కోవటంతో ఘర్షణలు తలెత్తాయి. వాస్తవానికి 1962లోనే ఆ భూభాగం కంబోడియా దేనని అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకటించింది. కానీ అందుకు థాయ్ లాండ్ ససేమిరా అంటున్నది.మొన్న జూలైలో ఇరువైపులా 50 మంది మరణానికి దారితీసిన ఘర్షణలు రాజు కున్నప్పుడు అప్పటి థాయ్ ప్రధాని పెటోంగ్టార్న్ షినవత్రా, కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్‌తో జరిపిన ఫోన్ సంభాషణలు లీక్ అయ్యి ఆమె పదవి పోగొట్టు కున్నారు. తమ సైన్యం కూడా సరిగా వ్యవహరించటం లేదని ఆమె అంగీకరించటం దేశంలో పెద్ద దుమారం లేపింది. నాలుగు దశాబ్దాలు దేశాన్నేలిన హున్ సేన్ ఇప్పటికీ ప్రస్తుత ప్రధాని, తన కుమారుడు హున్ మానెట్‌ను తెర వెనక ఉండి నడిపిస్తుంటారు. ఆయనతో మాట్లా డితే తప్ప సమస్య పరిష్కారం కాదని షినవత్రా అనుకోవటం కొంప ముంచింది. తాజా వివాదం పర్యవసానంగా కంబోడియా పౌరులను దేశంలోకి రానీయ కుండా థాయ్‌లాండ్ సరిహద్దుల వద్ద అడ్డుకుంటుండగా, థాయ్ సినిమాల ప్రసారం, అక్కడి పండ్లు, కూరగాయలు, గ్యాస్, ఇంధనం రాకుండా కంబోడియా నిలిపేసింది.థాయ్–కంబోడియా ఘర్షణలైనా, కాంగో–రువాండాల కొట్లాట అయినా ప్రత్యర్థి దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించినప్పుడే పరిష్కారమవుతాయి. దాదాపు అన్ని దేశాల్లోనూ అధికారం కోసం జాతీయవాద ధోరణులు రెచ్చగొట్టడం వల్ల సమస్య లొచ్చిపడుతున్నాయి. థాయ్‌లాండ్‌లో వచ్చే ఫిబ్రవరి 6న ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, దేశాన్ని రక్షించేది తామేనని చెప్పటానికి కంబో డియాపై యుద్ధభేరి మోగించటంతో పాటు పాలకపక్షం శుక్రవారం పార్లమెంటును రద్దు చేసింది. మళ్లీ ఇరుపక్షాల మధ్యా రాజీ కుదురుస్తానని ట్రంప్ చెబుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
విద్వేష భాషపై పంజా!
దేశంలోనే తొలిసారి విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. కోస్తా కర్ణాటకలో మొన్న ఏప్రిల్‌లో మతపరమైన హత్య చోటు చేసుకున్నాక జరిగిన పరిణామాల పరంపర తర్వాత ఇలాంటి చట్టం తెస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. మన రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూనే దానికి సహేతుకమైన పరిమితులు విధించింది. సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, ఇతర రకాల చర్యల్ని అరికట్టడానికి గతంలో ఐపీసీలో, ఇప్పుడు బీఎన్ఎస్లో నిబంధనలున్నాయి. కానీ దురదృష్టమేమంటే అవి అసమ్మతిని అణచడానికి పనికొచ్చినట్టు విద్వేష ప్రసంగాలను అదుపు చేయటానికి తోడ్పడటం లేదు. కనుక ప్రత్యేక చట్టం తీసుకు రావటం హర్షించదగ్గదే. ‘విద్వేషం ప్రతి ఒక్కరినీ ప్రమాదంలోకి నెడుతుంది. అందుకే దానిపై పోరాడటం అందరి బాధ్యతా కావాలి’ అన్నారు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్. నిజానికి విద్వేషపూరిత ప్రసంగాలు మనుషుల ఉసురు తీస్తాయని, మత, కుల ఘర్షణలకు కారణ మవుతాయని పదిపదిహేనేళ్ల క్రితం ఎవరూ ఊహించి ఉండరు. సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగాక ఇలాంటి ప్రసంగాలూ, సందేశాలూ సమాజ మనుగడకు పెను సవాలుగా మారాయి. ఎక్కడో కాదు... కర్ణాటకలోనే విద్వేషపూరిత ప్రసంగాలు, సందే శాల ప్రభావంతో దుండగులు 2015లో ప్రముఖ రచయిత, హేతువాది, కన్నడ యూని వర్సిటీ మాజీ వైస్‌చాన్సలర్ ఎంఎం కల్బుర్గిని, 2017లో ప్రముఖ సంపాదకురాలు, రచయిత్రి గౌరీ లంకేష్‌ను పొట్టనబెట్టుకున్నారు. భావప్రకటనాస్వేచ్ఛ ముసుగులో ఇష్టానుసారం మాట్లాడటం, తమకు నచ్చని అభిప్రాయాలున్న వారిపై ఉసిగొల్పేలా ప్రసంగాలు చేయటం ఉన్మాదం. కర్ణాటక విద్వేష ప్రసంగాలూ, విద్వేష నేరాలు (నివారణ, నియంత్రణ) బిల్లు ఈ మాదిరి చర్యల్ని సరిగానే గుర్తించింది. కేవలం ప్రసంగాలే కాదు...సమాజ గమనానికి ముప్పు కలిగించే రాతలు, చిత్రాలు, దృశ్యాలు వగైరాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయటం కూడా ఈ బిల్లు శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తోంది. మతం, కులం, భాష, జెండర్, జాతి, ప్రాంతం, అంగవైకల్యం తదితరాల పేరిట వ్యక్తులపై లేదా బృందాలపై విద్వేషాన్ని ప్రేరేపిస్తే వివిధ రకాల శిక్షలు నిర్దేశించింది. మొదటి నేరానికి ఏడాది నుంచి ఏడేళ్ల వరకూ, అనంతర నేరాలకు రెండునుంచి పదేళ్ల వరకూ శిక్ష, జరిమానా వేయొచ్చు. ఈ నేరాలను శిక్షార్హమైన, బెయిల్‌కు వీలుకాని నేరాలుగా పరిగణించటం దీని తీవ్రతను తెలియ జేస్తోంది. సంస్థల పేరిట నేరాలకు పాల్పడిన పక్షంలో వాటి నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తారు. ఆన్లైన్లో ప్రచారంలో ఉండే విద్వేషపూరిత అంశాలను తొలగించమని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ప్రజా ప్రయోజనార్థం విద్యాసంబంధ, కళాత్మక, సాహిత్య, శాస్త్రీయ దృష్టితో చేసే ప్రసంగా లకూ, ఇతరేతర సందేశాలకూ ఇది మినహాయింపును ఇచ్చింది. బాధితులకు నష్టపరి హారం ఇచ్చేందుకు కూడా ఇందులో ఏర్పాటుంది.అయితే ఇలాంటి బిల్లుల రూపకల్పనలో అస్పష్టతకు తావుండటం వల్ల పోలీసులకు అపరిమిత అధికారాలు దక్కుతాయి. అవి దుర్వినియోగమయ్యే ప్రమాదం కూడా ఎక్కువే. గతంలో టాడా చట్టం, ఇప్పుడు యూఏపీఏ విషయంలో ఈ ఆరోపణ లున్నాయి. హిందూ మతసంస్థల అణచివేతకే ఈ చట్టం తీసుకు రాబోతున్నారని బీజేపీ విమర్శిస్తుండగా, పౌర సమాజ కార్యకర్తలు సైతం బిల్లులోని అంశాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా మానసికంగా గాయ పరచటం అనే భావనకు చోటున్నందు వల్ల దుర్వినియోగానికి అవకాశాలెక్కువ. వాస్తవంగా ఫలానా ప్రసంVýæం సమాజంలో ఘర్షణలకు కారణమని ధ్రువపడటం, దాని కారణంగా హత్య జరిగిందని నిర్ధారణ కావటం వంటి సందర్భాల్లో చట్టం తోడ్పడాలి. కానీ విస్తృత భాష్యం చెప్పగలిగే వాటిని చేర్చటంవల్ల చట్టం ఉద్దేశమే దెబ్బతింటుంది. విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో ఇప్పటికే సుప్రీం కోర్టు మార్గదర్శకాలున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్నట్టు కనబడదు. దుర్వినియోగానికి తావు లేని రీతిలో చట్టం ఉన్నప్పుడే నిజమైన నేరగాళ్లకు శిక్షపడుతుంది. ఆ దిశగా ఆలోచించటం అవసరం. -
తెగిపడుతున్న జీవితాలు
జన జీవితాల పెనుహననం యథేచ్ఛగా సాగిపోతున్నది. భద్రం అనుకున్న బతుకులకు సైతం భరోసా లేని పీడకాలం క్రీడిస్తున్నది. కంచే చేను మేస్తున్నది. కాపాడవలసిన వ్యవస్థలే కబళిస్తున్నాయి. విజయవాడలోని భవానీపురం బాధితుల ఆక్రోశం టీవీలో ప్రసారమైంది కనుక లోకం దృష్టికి వచ్చింది. అయినా న్యాయం జరగలేదు. జనారణ్యంలో ఇంకా వారు రోదిస్తూనే ఉన్నారు. అసలు లోకం దృష్టికే రాని సైలెంట్ కిల్లింగ్ ఫీల్డ్స్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో... ఎన్నెన్నో! భవానీ పురంలో 42 మధ్యతరగతి కుటుంబాలు వారి కష్టార్జితంతో స్థలాలు కొనుక్కొని చాలా కాలంగా నివసిస్తున్నారు. కొందరైతే పాతికేళ్లుగా అక్కడే ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మధ్యతర గతి ప్రజలు ఇల్లు కట్టుకోవడం అంటే తమ జీవిత కాలాన్ని ధార పోయడమే! కోరికలకు పగ్గాలు వేసి, కడుపు కట్టుకొని పైసా పైసా కూడబెడితే దశాబ్దాల తర్వాత ఆ ఇల్లు సొంతమవుతుంది.అటువంటి 42 కుటుంబాల లైఫ్ టైం అఛీవ్‌మెంట్‌ను తెల్లారే సరికల్లా కూల్చి పడేశారు. ఈ రాక్షసకాండకు రక్షకభటులే రక్షణగా నిలబడ్డారు. ప్రభుత్వ పెద్దల కనుసైగలతోనే పిశాచ గణాలు నర్తించాయనడానికి ఇదే నిదర్శనం. ఇదేమీ రహస్యం కాదు, ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఆ ‘పై వాడి’కెవడికో ఈ భూమిపై మనసైందట! ఘోరంగా మరులు గొన్నాడట! ద్రౌపదిని ఈడ్చుకు రమ్మని దుర్యోధనుడి ఆజ్ఞాపన మరి! సైరంధ్రి తన సరసకు రావాలని కీచకుడు వేసిన శాసనం. తప్పదు కదా! ఆ పైవాడి ఆదేశాన్ని భృత్యులు శిరసావహించారు. వారి ‘కర్తవ్య పరాయణత’ ఎంతటిదంటే, సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఉన్నదని బాధితులు నెత్తీ నోరూ బాదుకున్నా అక్కడికి వచ్చిన అధికార ఖాకీ గులాములు ఖాతరు చేయలేదు.భవానీపురం బాధితులు ఇళ్ళు కట్టుకున్న స్థలం గత మూడు, నాలుగు దశాబ్దాలుగా వివాదంలో ఉన్నదట! కోర్టులో కేసు నడుస్తున్నది. ఈ వివాదం సంగతి బాధితులకు తెలియదు. భూ యజమానికి డబ్బులు చెల్లించి, ఈ 42 మంది ఇంటి స్థలాలు కొనుక్కున్నారు. కార్పొరేషన్‌కు డబ్బులు కట్టారు. అనుమతులు వచ్చాయి. బ్యాంకులు రుణాలిచ్చాయి. కరెంటు, నీటి కనెక్షన్లు వచ్చాయి. బాధితులకు స్థలాలను అమ్మడానికి పూర్వం సుమారు 40 ఏళ్ల కింద భూ యజమాని ఒక హౌసింగ్ సొసైటీకి ఒప్పందం చేశారట! కొంత డబ్బు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. కానీ, సొసైటీకి రిజిస్ట్రేషన్ చేయకుండా కోర్టులో వివాదం నడిపిస్తూ, ప్రస్తుత బాధితులకు ప్లాట్లుగా విభజించి అమ్ముకున్నాడు. ఈ మధ్యనే కోర్టు తీర్పు సొసైటీకి అను కూలంగా వచ్చింది. ఈ సొసైటీ వారు భూ యజమానికి చెల్లించిన మొత్తం ఒక లక్ష 70 వేల రూపాయలు. ప్రస్తుతం ఆ భూమి విలువ 100 కోట్లని చెబుతున్నారు.కోర్టు తీర్పును అమలు చేయకుండా నిలుపుదల చేయాలని కోరుతూ బాధితులు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆర్డర్ కాపీ అందలేదన్న మిషతో 200 మంది పోలీసుల సమక్షంలో గంటల వ్యవధిలోనే 42 గృహాలను నేలమట్టం చేశారు. ఆ బాధితులు ఎవరూ అక్రమంగా ఇళ్లను నిర్మించుకోలేదు. కష్టార్జితంతో స్థలాలు కొనుక్కొని, ఫీజులు చెల్లించి, అన్ని అనుమతులతో బ్యాంకులు ఇచ్చిన రుణాలతో ఇళ్లు నిర్మించుకున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో బాధితులు వీధిన పడకుండా సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. కానీ, పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరింపచేసి కూల్చివేతకు దన్నుగా నిలబడిందంటేనే ఈ కథలో ఇంకో మతలబు ఏదో ఉన్నదని అర్థం. స్వయంగా ఒక అక్రమ నిర్మాణంలో నివసిస్తున్న ముఖ్యమంత్రి పాలనలో 42 సక్రమ నివాసాలను కూల్చివేయడాన్ని ఏమనుకోవాలి? విజయవాడ నగరంలో ఎన్నో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కూడా అక్రమ నిర్మాణాల్లో కొనసాగుతున్నాయి. వాటి జోలికి ఈ ప్రభుత్వం వెళ్లగలదా? వెళ్లలేదు! ఎందుకంటే, సంపన్నులు, వ్యాపారవేత్తల రక్షణ, పేదలూ–మధ్యతరగతి ప్రజల భక్షణ ఈ ప్రభుత్వ పాలసీ కనుక!విశాఖలో రోడ్ల పక్కన చిరు వ్యాపారం చేసుకొనే పదివేల బడ్డీ దుకాణాలను తొలగించారు. వీరిలో చాలామంది మునిసిపల్ కార్పొరేషన్‌కు ఫీజు చెల్లించి, అనుమతి పత్రాలు తీసుకున్నవారే! ఎటువంటి హెచ్చరికలూ, నోటీసులూ లేకుండా ఎకాయెకిన పిడుగుపడ్డట్టుగా పదివేల బడ్డీలను తొలగించారు. పదివేల కుటుంబాల జీవనోపాధిని తెగనరికారు. అంటే 30 నుంచి 40 వేల మంది ప్రజలకు విశాఖ వీధుల్లో శిరచ్ఛేదన చేశారనుకోవాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 20 వేల మంది కార్మికుల జీవితాలపై ఇప్పటికే కత్తి వేలాడుతున్నది. విశాఖ ఉక్కును ఉద్దేశించి ఇటీవల మాట్లాడిన ఎకసెక్కపు మాటలు గమనిస్తే – దాన్నేం చేయబోతున్నారో అర్థం చేసుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్‌కు వెన్నెముక వంటి వ్యవసాయ రంగంలో కోటి మందికి పైగా ఉన్న రైతులు, కూలీల బాధామయ గాథలు వర్ణనాతీతం. రైతుకు ప్రభుత్వం చేసే పెట్టుబడి, బీమా సాయాల సంగతి దేవుడెరుగు. పండించిన పంటను అమ్మబోతే రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాని దైన్య పరిస్థితులు వెక్కిరించాయి. ఉల్లి రైతులు రోడ్డున పడ్డారు, క్వింటాల్‌కు కనీసం రెండున్నర వేలన్నా వస్తేనే పెట్టిన ఖర్చులు వస్తాయంటున్నారు. ప్రతిపక్ష వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 1,200 చొప్పున ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకున్నది. అరటి రైతుల అవస్థలు, ఆక్వా రంగం ఆవేదన, మామిడి రైతు వెతలు, ధాన్యం రైతు కళ్ళల్లోదైన్యం.. వంటి కథనాలు ఇప్పటికే రాష్ట్రంలో కల్లోలం సృష్టిస్తున్నాయి.జగన్ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం వల్ల, ఎప్పటికప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకొని, ఈ స్థాయిలో ధరలు పతనం కాకుండా కాపాడగలిగింది. ఏడాదిన్నర కాలంలో రెండున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చిన సర్కార్, ఐదారు వేల కోట్లను ధరల కంట్రోల్ కోసం వెచ్చించలేదా? వెచ్చించ లేకపోవడం అనేది సమస్య కాదు... వ్యవసాయ రంగం, రైతు క్షేమం బాబు సర్కార్ ప్రాధాన్యతా క్రమంలో లేవు. అందువల్లనే ఈ సంక్షోభం! కోటి కుటుంబాల్లో ఆందోళన. జీవచ్ఛవాలుగా మారుతున్న పేద రైతు కూలీలు!! పేద సమూహాల జీవన విధ్వంసకాండ ఏ ఒక్క రంగానికో, రెండు రంగాలకో పరిమితం కాలేదు. ఇది సర్వవ్యాపితం. ఉపాధి హామీ పథకంలో ఊరట పొందుతున్న వారిలో 18 లక్షల మంది జాబ్ కార్డులను రాష్ట్ర సర్కారు తొలగించింది.అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 1,500 చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు మూతపడి 20 వేల మంది ఉపాధి కోల్పోయారని కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పేదల సంక్షేమం, ఆ సమూహాల అభివృద్ధి అనే రాజ్యాంగ బాధ్యతలను గాలికొది లేసి, సంపన్న వర్గాలకు వనరులన్నీ ధారపోసే ప్రైవేటీకరణ క్రతువు నిరాటంకంగా సాగిపోతున్నది. పేదలు, మధ్యతరగతి సమూహాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి పిల్లల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన విద్యా విప్లవాన్ని కూటమి సర్కార్ నీరుగార్చింది. పట్టణ ధనిక సమూహాల పిల్లలు కొనుగోలు చేయగలిగే నాణ్యమైన విద్య పేద, మధ్యతరగతి పిల్లలకు ఉచితంగా అందజేసే ప్రయత్నాన్ని జగన్ ప్రభుత్వం ఉద్యమంగా ప్రారంభించింది.కూటమి సర్కార్ ఆ ఉద్యమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరు గార్చింది. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ ఎడ్యుకేషన్‌ను ఎత్తివేసింది. ఇంగ్లీష్ మీడియం బోధన తొలగించింది. సబ్జెక్టు టీచర్ల విధానాన్ని తొలగించింది. స్కూళ్లను కుదించింది. మధ్యాహ్న భోజనాన్ని నాసిరకంగా మార్చింది. కళాశాలల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో అటు కాలేజీలు, ఇటు విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ‘వసతి దీవెన’ బకాయిలు పేరుకుపోతున్నాయి. ‘నాడు–నేడు’ కార్యక్రమం ఆగిపోయింది. ప్రభుత్వ ఉద్దేశపూర్వక చర్యల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య మూడున్నర లక్షలు తగ్గింది. వారిలో కొందరిని ప్రైవేట్ స్కూళ్లకు పంపించి ఉండవచ్చు. అత్యధికులు డ్రాప్ అవుట్లుగా మిగిలి ఉంటారు.వాస్తవాలు ఇట్లా ఉంటే, జగన్ పాలనలో విద్యారంగంలో విధ్వంసం జరిగిందనీ, తాము ఇప్పుడు చక్కదిద్దుతున్నామనీ కూటమి పెద్దలు చెప్పుకుంటున్నారు. జగన్ చేసిన విధ్వంసం ఏమిటో, తాము చేస్తున్న ఉద్ధరణ ఏమిటో మాత్రం ససేమిరా చెప్పరు. వ్యాఖ్యానాలు చేయడమే తప్ప వివరాలు, లెక్కలు చెప్పడం వారి నిఘంటువులోనే లేదు. ‘పేరెంట్–టీచర్’ మీటింగ్లనేవి జగన్ హయాంలో సలక్షణంగా జరిగాయి. ఇంత హడావిడి లేదు. తల్లితండ్రులకు బదులు వైసీపీ కార్యకర్తలు వచ్చి కుర్చీల్లో కూర్చోలేదు. ఇప్పుడు ఈ తరహా మీటింగ్‌ను తామే కనిపెట్టినట్లు కూటమి చేసుకుంటున్న ప్రచారం వెగటు పుట్టించే విధంగా ఉన్నది. కాకపోతే ‘పేరెంట్–టీచర్ మీటింగ్’లను రాజకీయ వేదికలుగా మార్చుకోవడం మాత్రం ఇప్పుడే జరుగుతున్నది. ‘మోడల్ అసెంబ్లీ’లను ప్రతి ఏటా అన్ని పెద్ద స్కూళ్లలో కళాశాలలో నిర్వహించే అలవాటు అనాదిగా ఉన్నది. బహుశా చంద్రబాబు పాఠశాల విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి ఉన్నది.వైద్యరంగం గురించి మాట్లాడకపోవడమే మేలు. జగన్ ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ‘పీపీపీ’ ముసుగులో ప్రైవేటీకరించడంతోపాటు, ప్రాంతీయ వైద్య సేవలను కూడా ప్రైవేట్ మార్గం పట్టించే ప్రయత్నాలు సాగుతున్నాయి. చంద్రబాబు సర్కార్ మొత్తం కార్యక్రమాల్లో ఒక క్రమం తప్పని విధానం మాత్రం కనిపిస్తున్నది. అదే... కాకుల్ని కొట్టి గద్దల్ని మేపే విధానం! పెత్తందారీ అనుకూల పాలన. పేదల కోసం ఆయన చేసిన మహత్తర ఆలోచన ‘పీ–4’. ఒక్కో ధనవంతుడి దగ్గర పదిమంది పేదలని తాకట్టు పెట్టడం, అందుకోసం వనరులన్నీ ధనవంతులకు కట్టబెట్టడం. ఈ దుర్మార్గ విధానాన్ని కప్పిపుచ్చడానికి కోటలు దాటే మాటలతో అభివృద్ధి కబుర్లను అర్థం కాని భాషలో చెప్పడం. పరిగెత్తు కొస్తున్న లక్షల కోట్ల పెట్టుబడుల గురించి చంద్రబాబు పోచికోలు ఉపన్యాసాలు చెప్పడం!చంద్రబాబును ఓ సూపర్ మ్యాన్‌గా, లోకేశ్ బాబును చిన్న సూపర్ మ్యాన్‌గా ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా ఉండనే ఉన్నది. ఇప్పుడు ఈ బాధ్యతలను కూటమి అధికారిక ప్రతినిధులకు కూడా పంచినట్టున్నారు. ఓ జాతీయ మీడియాలో అధికార ప్రతినిధి ఒకరు చిన్న సూపర్ మ్యాన్‌ను ఆకాశానికి ఎత్తబోయి, బొక్క బోర్లా పడ్డారు. ఇండిగో విమానాల నిలిపివేత అంశంపై రిపబ్లిక్ టీవీలో జరిగిన చర్చలో – విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు ఏం చేస్తున్నారని ఆర్ణబ్ గోస్వామి ప్రశ్నించారు.అందుకు టీడీపీ ప్రతినిధి బదులిస్తూ లోకేశ్ కూడా ఈ సమస్యను సమీక్షిస్తున్నారని చెప్పాడు. అసలు లోకేశ్ ఎవరు? ఆయనకేం పని?? అంటూ ఆర్ణబ్ గోస్వామి నిలదీయడంతో టీడీపీ ప్రతినిధి నీళ్లు నమలాల్సి వచ్చింది. పాపం ఆ ప్రతినిధి ఏం చేస్తాడు? చిన్నబాబు–పెద్దబాబుల భజన బాధ్యత ఆయనపై కూడా పార్టీ మోపినట్టుంది. మీడియా సామ్రాజ్యంలో అత్యధిక భాగాన్ని టీడీపీ కూటమి ఆక్రమించు కుంటున్న నేపథ్యంలో, అవి బాబుల భజనలకే ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ‘క్రెడిట్ చోరీ’ కితాబులకు దొంగ సాక్ష్యాలు చెప్పవచ్చు. కానీ, కూలిపోతున్న కోట్లాది జీవితాలను, దిగజారుతున్న జీవన ప్రమాణాలను దాచడం సాధ్యం కాదు. పేదలు, మధ్యతరగతి ప్రజలు నాణ్యమైన జీవితాన్ని నానాటికీ కోల్పోతున్నారు. జీవచ్ఛవాల సంఖ్య రోజురోజుకూ పెరుగు తున్నది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
'మేధే' మనిషి భవిష్యత్తు!
ఏఐ, రోబోటిక్స్ కారణంగా ఎవరికీ పని చేసే అవసరం ఉండని సౌలభ్యం 20 ఏళ్లలో మానవాళికి కలగవచ్చని అంటున్నారు ఎలాన్ మస్క్. ఆయన నిఖిల్ కామత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిష్యత్ పరిణామాలను అంచనా వేశారు. మస్క్ మాటల్లోని ముఖ్యాంశాలు:భారతీయులు ‘ద బెస్ట్’‘‘ప్రతిభావంతులైన భారతీయుల నుండి అమెరికా అపారమైన ప్రయోజనం పొందిందని నేను భావిస్తు న్నాను. నా సొంత టెస్లా, ఎక్స్, ఎక్స్–ఏఐ, స్పేస్ ఎక్స్‌లో ఉన్న అత్యంత తెలివైన నిపుణులంతా భారతీయులే. వలసదారులు అమెరికన్ల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారన్నది ఎంతవరకు వాస్తవమో నాకు తెలి యదు. నా ప్రత్యక్ష పరిశీలన ఏమిటంటే, మెరికల కొరత ఎల్లప్పుడూ ఉంటుంది. కొన్ని అవుట్సోర్సింగ్ కంపెనీలు హెచ్–1బి వీసాలతో అమెరికన్ వ్యవస్థతో ఆడుకుంటున్నాయన్నది నిజం. అలాగని, హెచ్–1బి వీసాలను నిలిపివేయాలనే ఆలోచనతో ఏకీభవించను.పని అభిరుచి అవుతుంది!‘‘నా అంచనా ప్రకారం వచ్చే 20 ఏళ్లలో మనుషులకు పని చేసే అవసరమే ఉండదు. అంటే సంపాదన అవ సరం తగ్గుతుంది. ఎందుకు, ఏ పని చేయాలన్నది కూడా వారి ఇష్టాన్ని బట్టే ఉంటుంది. పని చేయటం అన్నది దాదాపు ఒక అభిరుచిలా మారిపోతుంది. ఈ మాట మీకు నవ్వు తెప్పించవచ్చు. కానీ అది నిజమవుతుందని నేను నమ్ముతున్నాను. ఏఐ, రోబోటిక్స్‌లోని నిరంతర పురోగతి మనకు విధిగా పని చేయవలసిన అవసరం లేకుండా చేస్తుంది. ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు పేదరికాన్ని తొలగిస్తాయి. ప్రజలు కోరుకునే ఏ వస్తువులు, సేవలనైనా పరమ చౌకగా లభించేలా చేస్తాయి. బహుశా 10 లేదా 15 ఏళ్ల లోపే ఏఐ, రోబో టిక్స్ రంగాల అభివృద్ధి... మనిషికి పని చే సి తీరవలసిన అవసరాన్ని తగ్గిస్తాయి. లేదా తప్పిస్తాయి.డిజిటల్ ఫ్రీ... ‘లైవ్’ కాస్ట్లీ‘‘ఏఐ మనం అనుకున్న దాని కంటే చాలా వేగంగా పరు గులు పెడుతోంది. ఈ ప్రభావం ఏఐ జనరేటెడ్ రియల్ –టైమ్ సినిమాలు, పాడ్‌కాస్ట్‌లు, వీడియో గేమ్‌లపై విపరీతంగా ఉండబోతోంది. తత్ఫలితంగా సంప్రదాయ మీడియా భూస్థాపితం కాబోతోంది. కృత్రిమ మేధ... మానవ అనుభవాలను, ఉద్వేగాలను సైతం దాదాపు దీటుగా అనుకరించగలదు. డిజిటల్ మీడియా సర్వ వ్యాప్తమై, విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఉచితం అవుతాయి. వాటి కోసం మనం పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా ‘లైవ్ – ఈవెంట్’లకు విలువ పెరిగి, అవి ఖర్చుతో కూడుకున్న వినోదాలు అవుతాయి. మానవ అనుభూతులకు ఏఐ అన్నది పూర్తిస్థాయి ప్రత్నామ్నాయం కాలేదు కాబట్టి!వితరణలకు పెను సవాళ్లు‘‘దాతృత్వం తేలికైనదేమీ కాదు. ఉదారంగా కనిపించటం కంటే ఉదారంగా ఇవ్వటానికి తగిన కారణాలను నిర్ధారించుకోవటం కష్టమైన పని. మీ విరాళం నిజంగా ఒక సమస్యను పరిష్కరిస్తుందని మీరు గుర్తించగల గాలి. ఆ ప్రయత్నంలోనే మీరు అనేకమైన సవాళ్లను అవాస్తవాల (అపాత్ర దానాల) రూపంలో ఎదుర్కొన వలసి వస్తుంది. ‘మస్క్ ఫౌండేషన్’ నిధుల పరంగా బలిష్ఠమైనది. కానీ ఏదీ నా పేరు మీద ఉండదు. ఏ ఫౌండేషన్‌కైనా అతిపెద్ద సవాలు–డబ్బును ఇచ్చేందుకు యోగ్య మైన అవసరాలను కనిపెట్టడం!అంతిమ కరెన్సీగా ‘ఎనర్జీ’‘‘ఇది కొంత వింతగా అని పిస్తుంది. కానీ భవిష్యత్తులో అందరికీ అన్నీ ఉన్నప్పుడు విలువల కొలమానాలకు భౌతికమైన డబ్బు అవసరం ఉండదు. అదొక భావనగా అదృశ్యమైపోయి, ‘ఎనర్జీ’ అనేది నిజమైన కరెన్సీగా స్థిరపడుతుంది. మీరు కావాలనుకుంటే కొన్ని ప్రాథమిక కరెన్సీలు (డాలర్లు, యూరోలు, పౌండ్లు) ఉంటాయి కానీ, ఎనర్జీ అనేది దేశాల స్థాయిలో కరెన్సీగా చలా మణీలోకి వస్తుంది. బిట్ కాయిన్ నిర్వహణ ఎనర్జీపైనే కదా ఆధారపడి ఉన్నది! భవిష్యత్తులో ఏదో ఒక సమ యంలో డబ్బు ఒక ప్రమాణంగా ప్రాధాన్యాన్ని కోల్పో తుంది. ఇంధన శక్తి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. - ఎడిటోరియల్ టీమ్ -
వెనక్కి తగ్గిన ‘సాథీ’!
ఉద్దేశాలు మంచివైనప్పుడు దాపరికాలు అవసరం లేదు. జనానికి మేలు చేయటమే ధ్యేయమైనప్పుడు చాటుమాటు చర్యలు సరికాదు. రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన ‘సంచార్ సాథీ’ యాప్ మూణ్ణెల్లలో ఫోన్లలో ఉండితీరాలంటూ కేంద్రం మొబైల్ ఉత్పత్తిదారులకు మొన్న శుక్రవారం చడీచప్పుడూ లేకుండా ఇచ్చిన ఆదేశాలు తీవ్ర వివాదాస్పదం కావటం ఇందువల్లే. మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తిన విమర్శలకు జడిసి ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఉత్పత్తవుతున్న, దిగుమతవుతున్న ఫోన్లకు వర్తించటంతోపాటు ఇప్పటికే వినియోగదారుల దగ్గరున్న ఫోన్లకు సాఫ్ట్వేర్ ద్వారా ఈ యాప్‌ను చేరేయాలని టెలికమ్యూనికేషన్ల విభాగం మూడు రోజుల క్రితం మొబైల్ ఉత్పత్తిదారుల్ని ఆదేశించింది. తాజాగా అది తప్పనిసరి కాదంటూ ప్రకటించింది. పౌరుల శ్రేయస్సును ఆశించి, వారు మోసగాళ్ల బారిన పడకుండా చూసేందుకు ఇది రూపొందించామనీ, ఇందులో గూఢచర్యం లేదా ఫోన్ సంభాషణల పర్యవేక్షణ ఉద్దేశం లేనేలేవనీ కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంజాయిషీ ఇచ్చారు. దాదాపు కోటిన్నరమంది దీన్ని డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందుతున్నారనీ, 41 లక్షల మోసపూరిత మొబైల్ నంబర్లను గుర్తించి నిరోధించామనీ, అపహరించిన దాదాపు 26 లక్షల మొబైల్ సెట్ల జాడ కనిపెట్టి 7 లక్షల సెట్లను వాటి యజమానులకు అందించా మనీ సింధియా చెబుతున్నారు. ఈ గణాంకాలతో విభేదించాల్సిన అవసరం లేదు. కానీ యాప్ ద్వారా ప్రయోజనాలు వెల్లువెత్తుతుంటే ఆ మాటే చెప్పి, మరింతమందిని ప్రోత్స హించవచ్చు. తదుపరి చర్యలు అవసరమనుకుంటే వెల్లడించవచ్చు. ఇదేం లేకుండా రహస్య చర్య ఆంతర్యమేమిటి? దాదాపు నలభయ్యేళ్ల క్రితం అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ‘పోస్టల్ బిల్లు’ తీసుకొచ్చి నప్పుడు జరిగిందేమిటో పాలకులు గ్రహించివుంటే వ్యక్తిగత గోప్యతను పౌరులు ఎంత ప్రాణప్రదంగా పరిగణిస్తారో అర్థమై ఉండేది. కనీవినీ ఎరుగని స్థాయిలో 400 స్థానాలకు పైగా కైవసం చేసుకుని, తిరుగులేదనుకున్నవేళ పౌరులకు తెలియకుండా వారి ఉత్తరా లను చదివేందుకుద్దేశించిన బిల్లు తీసుకొచ్చి ఆయన అభాసుపాలయ్యారు. జస్టిస్ పుట్టస్వామి కేసులో 2017లో సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుల్లో చేర్చింది. జాతీయ భద్రత లేదా సముచిత ప్రజాప్రయోజనం ఉన్నదని ప్రభుత్వం భావిస్తే గోప్యత నియంత్రణకు తగిన చట్టం తీసుకురావొచ్చని స్పష్టం చేసింది. అప్పుడు ప్రజల్లో, పార్లమెంటులో విస్తృత చర్చ జరుగుతుంది. ఇవేమీ లేకుండా ఒక నోటీసు ద్వారా పనికానిచ్చేద్దామనుకోవటం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటవుతుందా?అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినా మన దగ్గర డిజిటల్ వినియోగం బాగా పెరిగింది. క్రయవిక్రయాలు, చెల్లింపులు, వసూళ్లు, ఆన్లైన్ నమోదులు ముమ్మర మయ్యాయి. వాటితోపాటే సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. డిజిటల్ అరెస్టు పేరుతో మోసగాళ్లు కోట్లు కాజేస్తున్నారు. ఆ నేరగాళ్లను పట్టుకోవటానికీ, పోగొట్టుకున్న ఫోన్లు పొందేందుకూ ‘సంచార్ సాథీ’ తోడ్పడటం నిజమే కావొచ్చు. కానీ గుప్పెడుమంది నేరగాళ్లను పట్టుకోవడానికి కోట్లాదిమందిని నిఘా నీడలోకి తెస్తామనటం ఏం తర్కం? ఉత్పత్తిదారులకు తప్పనిసరంటూ ఆదేశాలిచ్చి, ఇష్టపడకపోతే వినియోగదారులు తొలగించుకోవచ్చని చెప్పడంలో మర్మమేమిటి?వ్యక్తిగత గోప్యత విషయంలో పౌరులకు ఎంత పట్టింపు ఉంటుందో నిత్యజీవితంలో చూస్తుంటాం. తల్లిదండ్రులు తమ ఫోన్లు గమనిస్తున్నారంటే పిల్లలకు కోపం. ప్రాణ స్నేహితుడైనా చాటుగా ఫోన్ చూస్తే సహించరు. భార్యాభర్తలే ఒకరి ఫోన్లు మరొకరు చూశారని తెలిస్తే దుమ్మెత్తిపోసుకుంటారు. అలాంటిది ప్రభుత్వ నిఘాకు అవకాశమిచ్చే యాప్‌ను జనం అంగీకరించగలరా? కాల్స్ వినేందుకూ, ఎస్సెమ్మెస్‌లు, ఫోన్ నంబర్లు, ఫొటోలు వగైరాలన్నిటినీ చూసేందుకూ... ఆఖరికి మనకు తెలియకుండా కెమెరా వినియోగానికి కూడా ఈ యాప్ అవకాశమిస్తుందన్నది నిపుణుల మాట. బహుశా ‘1984’ రచయిత జార్జి ఆర్వెల్ కూడా ఇంత చేటు నిఘా ఊహించలేదు. ఏదేమైనా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అది వివేకవంతమైన చర్య. -
ఒడిశా మేల్కొనాలి!
వలస జీవులపై విషం కక్కే సంస్కృతి ఒడిశాలో ఇంకా పోలేదని అక్కడ జరుగుతున్న దాడులు తెలియజేస్తున్నాయి. ఒకప్పుడు పిల్లల్ని అపహరించడానికొచ్చారనో, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడబోయారనో బెంగాల్ నుంచి వలసవచ్చి చిన్నా చితకా పనులు చేసుకుంటున్నవారిపై దాడులు జరిగాయి. ఇప్పుడు ‘విదేశీయుల’ పేరిట ఆ వేలంవెర్రి కొనసాగుతోంది. ఒడిశాలోని గంజాం జిల్లాలో బెంగాల్ నుంచి ఉన్ని దుస్తులు అమ్ముకోవటానికి వచ్చిన యువకులపై అయిదారు నెలలుగా మూకలు దాష్టీకం చేస్తున్నాయి. ఎవరూ అకారణంగా ఉన్న ఊరునూ, అయినవారినీ వదిలి వలసలకు సిద్ధపడరు. సరైన జీవిక దొరక్క తప్పనిసరై వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధపడతారు. కొన్ని వలసలు సీజనల్‌గా ఉంటాయి. తొలకరి సమయంలో పంట పొలాల్లో పనులు దొరుకుతాయని వచ్చేవారుంటారు. శీతకాలం సమీపించే సమయానికి ఉన్ని దుస్తులు, దోమతెరలు వగైరాలు అమ్ముకోవడానికి పోతారు. అదేమీ భద్రమైన జీవితం కాదు.సంపాదనపై అనిశ్చితి. వచ్చిన తృణమో, పణమో రక్షించుకోవటం కూడా సమస్య. స్థానికుడు కాదని తెలిశాక రౌడీ మూకల ఆగడాలుంటాయి. పోలీసులు సరేసరి. వలస పోయేవారికి శాశ్వత చిరునామా ఉండదు గనుక స్వరాష్ట్రంలోనూ, వలసపోయే రాష్ట్రంలోనూ కూడా తిప్పలే. వారు ఎక్కడా ఓటు బ్యాంకు కాదు. కనుక సంక్షేమం ఎప్పుడూ ఆమడ దూరంలో ఉంటుంది. ఇప్పుడు వలస జీవులను అకారణంగా వేధించటానికి ‘విదేశీయులు’ అనే ఆయుధం అక్కరకొస్తోంది. పార్టీలు తమకు రాలిపడతాయనుకున్న ఓట్ల కోసం ఈ ఆయుధాన్ని నిర్విచక్షణగా ఉపయోగిస్తుంటే రౌడీ మూకలకూ అదే ఆదర్శం! నాలుగు రోజుల క్రితం రాహుల్ ఇస్లాం అనే యువకుడిపై గంజాం జిల్లాలోని గ్రామంలో మూక విరుచుకుపడి తీవ్రంగా దాడిచేసి, అతని దగ్గరున్న రూ. 6,000 అపహరించింది. ఆధార్ కార్డు అడగటం, అది నకిలీదని ఆరోపిస్తూ కొట్టడం సరే.... అతని పేరునుబట్టి వేరే మతం వాడని తెలిశాక ‘జై శ్రీరాం’ అని బలవంతంగా అనిపించి సమస్తం ఊడ్చి పంపారు. అంతకు నాలుగు రోజుల ముందు బెంగాల్ నుంచి వెళ్లిన మరో ఇద్దరు యువకులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ ఉదంతాలపై పశ్చిమ బెంగాల్ వలస కార్మికుల సంక్షేమ సంఘం ఒడిశా డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఫలితం ఉంటుందా? ఫిర్యాదు చేయడానికి పోతే ‘బతకాలని ఉంటే ఇటువైపు వచ్చే ప్రయత్నం చేయొద్ద’ని పోలీసులు ఉచిత సలహా ఇచ్చారట. కొన్ని వారాల క్రితం బెంగాల్ నుంచి పోయిన ముగ్గురు కూలీలు పోలీసుల నుంచి ఇలాంటి సమస్యే ఎదుర్కొన్నారు. వారిపై బంగ్లాదేశీయులన్న ముద్రవేసి మూడు రోజులపాటు పోలీసు స్టేషన్లో నిర్బంధించగా, చివరకు పశ్చిమబెంగాల్ పోలీసుల జోక్యంతో బయటపడ్డారు. కేంద్రపారా, ఝార్సుగూడ, జగత్సింగ్ పూర్ జిల్లాల్లో బెంగాల్ నుంచి వచ్చిన 500 మందికి పైగా వలస కార్మికులను పోలీసులు నిర్బంధించి పలు విధాలుగా వేధించారు.ఏడేళ్ల క్రితం గుజరాత్లో ఒక పసిపాపపై బిహార్‌కు చెందిన యువకుడు లైంగిక నేరానికి పాల్పడ్డాడని ఆరోపణ వచ్చినప్పుడు మూకలు చెలరేగి ‘బయటి వ్యక్తుల’ని అనుమానం వచ్చినవారిని తీవ్రంగా కొట్టి, వారి గుడిసెలకు నిప్పంటించారు. దాంతో బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది ప్రాణభయంతో స్వస్థలాలకు తరలిపోయారు. ఆలస్యంగానైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని భరోసా ఇచ్చాకే పరిస్థితి చక్కబడింది. ఒడిశాలో రౌడీ మూకల ఆగడాలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటమే కాదు... తనవంతుగా వేధింపులకు దిగుతోంది. ఇది సరికాదు. వలసలు నిజానికి జనాగ్రహం నుంచి పాలకుల్ని కాపాడే రక్షాకవచాలు. కడుపు మండిన వారు ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా, తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ వేరేచోటకు వలసపోవడంలో అభ్యంతరం ఎందుకుండాలి? దేశభక్తి గురించి లెక్చెర్లిస్తూ పక్క రాష్ట్రం నుంచి వచ్చినవారిని విదేశీయులుగా ముద్రేయటం సిగ్గనిపించటం లేదా? ఒడిశా నుంచి కూడా లక్షల మంది వలసపోతుంటారు. ఈ చీడ విస్తరిస్తే అన్ని రాష్ట్రాల వారికీ పరాయి రాష్ట్రాల్లో ఇదే దుఃస్థితి తలెత్తదా? ఈ పోకడలు సమైక్య భారత్ భావనకు ముప్పు కలిగించవా? ఒడిశా పాలకులు ఆలోచించాలి. -
చిత్తశుద్ధి లేని అరకొర ప్రయత్నాలు
తెలంగాణలోని వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వే షన్లు ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండేళ్లపాటు నమ్మబలికి ఇప్పుడు నట్టేట ముంచింది. స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్య, ఉద్యోగాల్లో కూడా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ ఎంతో ఆర్భాటం చేసింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఇదివరకు అమలు చేసిన రిజర్వేషన్ల శాతం కంటే మరింత తగ్గించి బీసీలను నిలువునా ముంచేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన ఉన్నప్పుడు... వ్యూహాత్మక కార్యాచరణ ఏమైంది? కేవలం ఆర్భాటం చేస్తూ బిల్లులు రూపొందించి అసెంబ్లీలో ఆమో దింపజేయడం, ఆ తర్వాత హడావిడిగా ఆర్డినెన్స్ ఇవ్వడం, వాటికి దిక్కులేకపోవడంతో జీఓ జారీ చేయడం అంతా ఒక కల్పనగానే ఉంది. ఇప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వకుండా... పార్టీ పరంగా ఇస్తామంటూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం చూస్తుంటే నాటకీయంగా తప్పించుకున్నట్లు స్పష్టమైంది. పంచాయతీ ఎన్ని కలు పార్టీ గుర్తుతో జరగనప్పుడు, పార్టీ అభ్యర్థులుగా ఎలా ఎంపిక చేస్తారు?ఉత్తుత్తి ప్రయత్నం...రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రచార అస్త్రంగా వాడుకున్నారు. తొలి వంద రోజుల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, మూడు నెలల తర్వాత కుల సర్వేపై నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్‌లో ప్రణాళికా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత రాష్ట్ర బీసీ కమిషన్ ఆధ్వర్యంలో కుల సర్వే అని, ఆ తర్వాత డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని, చివరకు వన్ మ్యాన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సమగ్ర సర్వే చేసి వాటి వివరాలను లోతుగా అధ్యయనం చేసేందుకు ముందుగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ పూర్తిగా అధ్యయనం చేయడం, లోతుగా సర్వే చేపట్టిన నివే దికల ఆధారంగా చర్యలు తీసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ ప్రమాణాలు పాటించలేదు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతికి పంపాలి. అక్కడ ఆమోదం పొందితేనే అవి చెల్లుబాటు అవుతాయి. తమిళనాడు నమూనా ప్రకారం 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుంది. ఇందుకు కేంద్రంపైన ఒత్తిడి తీవ్రతరం చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపైన ఒత్తిడి చేయకుండా ‘జంతర్‌మంతర్’లో ధర్నా చేసి చేతులు దులుపుకొంది.కేంద్రంలో 243 మంది ఎంపీలున్న ఇండియా కూటమి పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టి చర్చకు ప్రయత్నం చేయలేదు. కనీసం తెలంగాణ ఎంపీలు సైతం పార్లమెంటులో ఈ ఊసే ఎత్తలేదు. ముఖ్యమంత్రి ఎన్నోసార్లు ప్రధానమంత్రి మోదీని కలిశారు. మరి బీసీ రిజర్వేషన్ల గురించి ప్రధానితో సంప్రదింపులు ఎందుకు చేయలేదు? తమిళనాడు తరహా అఖిలపక్ష పార్టీలతో సమావేశాలు నిర్వహించలేదు. ఢిల్లీకి అఖిలపక్ష పార్టీలను తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేదు. కేంద్ర స్థాయిలో పరపతి లేని అనామకులు మాత్రమే ‘జంతర్‌మంతర్’ వద్ద ధర్నాలు, నిరసనలు చేస్తారు. అన్ని రకాల అధికారాలున్న కాంగ్రెస్... బీసీ రిజర్వేషన్ల పట్ల కపటప్రేమను ప్రదర్శించింది. ఆర్డినె¯Œ ్స జారీ చేసి గవర్నర్ ఆమోదించలేదంటూ... చివరకు ఎలాంటి ఆధారాలూ లేకుండా జీఓలు జారీ చేసి బీసీ రిజర్వే షన్లు పెంచుతున్నామని చెప్పుకొంది. కానీ ఆ ఉత్తర్వులు న్యాయవ్యవస్థ ముందు నిలవలేదు.ఐక్యతే అసలు మంత్రం...కామారెడ్డిలో నిర్వహించిన బీసీ ఆక్రోశ సభలో మూడు తీర్మానాలు చేయించాను. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని రానున్న పార్లమెంట్ సమావేశాల్లో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలనీ; కేంద్ర ప్రభుత్వం శీతాకాల సమా వేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను పార్లమెంట్లో పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదంతో తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించాలనీ; స్థానిక రిజర్వేషన్ బిల్లును తొమ్మిదో షెడ్యూ ల్లో చేర్చి, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలనీ తీర్మానాలు చేయించాను.ఇప్పుడు గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ రిజర్వేషన్లు ఏ ప్రాతి పదికన ఖరారు చేశారో ప్రజలకు ప్రభుత్వం స్పష్టం చేయాలి. గతంలో 20 శాతానికి పైగా రిజర్వేషన్లు దక్కితే ఇప్పుడు అందులోనూ కోత పెట్టారు. శాస్త్రీయత లేకుండా, ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా ఉత్తర్వులు ఇస్తే అవి చెల్లుబాటు కావు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను హర్షిస్తూ బీసీ సంఘాలు పాలాభిషేకాలు, పూలాభిషే కాలు చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యలపై కనీసం ఆలోచన చేయలేని స్థితిలో సంఘాలున్నాయి. బీసీ రిజర్వేషన్లకు కోతపెట్టి మరీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ అంశంపై ఉద్యమాలు, ఆందోళనలు చేయాల్సిందే! రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాలు అన్నీ ఒక్కతాటిపైకి వచ్చి వ్యూహా త్మకంగా పంచాయతీలను విభజించుకుని దళిత, గిరిజన, బీసీలను సర్పంచులుగా గెలిపించుకోవాలి.జస్టిస్ వి. ఈశ్వరయ్యఉమ్మడి ఏపీ హైకోర్టు యాక్టింగ్ సీజే, ఎన్సీబీసీ మాజీ చైర్మన్ -
అవినీతి పునాదులపై అమరావతి
‘‘అమరావతిలో 25 బ్యాంకులను ప్రారంభిస్తున్నారు. బాగానే ఉన్నది కానీ... వాటిని ఉపయోగించుకోవడానికి అంతమంది అక్కడున్నారా?’’ ఈ అపశకునం పలికిన వ్యక్తి ప్రతిపక్షి కాదు. అధికార పక్షానికి పరమభక్తుడు. చంద్రబాబుకు నిత్యం స్తోత్ర పారాయణం చేసే ఎల్లో మీడియా వంశీకుడు. నిజమే కదా, ఎవరున్నారక్కడ? 29 గ్రామాల్లో 33 వేల ఎకరాల భూములిచ్చి జీవనాధారం కోల్పోయి, ప్రభుత్వం ఇస్తానన్న ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్న త్యాగరాజుల కుటుంబాలు తప్ప! సర్కారిచ్చే ప్లాట్లు అమ్ముకుంటే గదా వారికి బ్యాంకులతో పని. ఆ భూము లపై ఆధారపడి పొట్టబోసుకున్న వ్యవసాయ కూలీ కుటుంబాలు ఇప్పుడు ఎక్కడున్నాయో? భూసేకరణ ఫలితంగా సుమారు లక్ష కుటుంబాలు భుక్తిని కోల్పోయిన ఇచ్చోటనే నిన్న (శుక్రవారం) అమరావతి ఆర్థిక నగరానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు.ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ముఖ్య భాగస్వామి కావటం మూలాన ఆయనకు ఆనందం కలిగించే విధంగానే కేంద్ర మంత్రి మాట్లాడారు. హైదరాబాదులో ఆయన స్థాపించిన ఆర్థిక నగరం ఎంతో అభివృద్ధి చెందిందనీ, ఇది కూడా అలాగే అభివృద్ధి సాధించాలనీ ఆమె ఆకాంక్షించారు. హైదరా బాదులో ‘ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్’కి 2004 నవంబర్‌లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దాని ఉజ్జ్వల ప్రస్థానం ప్రారంభమైంది. ‘క్రెడిట్ చౌర్యం’ అనేది బాబు బలహీనత. ఆ బలహీనతలో భాగంగా ఐటీ విప్లవం దగ్గర నుంచి హైదరాబాద్ నిర్మాణం దాకా అనేక చరిత్రాత్మక ఘట్టాలు ఆయన ఖాతాలో చేరిపోతుంటాయి. అసలైన సమాచారం కంటే నకిలీ సమాచారమే ఎక్కువగా అందుబాటులో ఉన్నందువల్ల కేంద్ర మంత్రి కూడా పొరపాటు పడి ఉండవచ్చు. బౌద్ధ తాత్వికుడు, రసాయన శాస్త్ర పితామహుడైన ఆచార్య నాగార్జునుని పేరును కూడా నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ ప్రాంతం వాడైన నాగార్జునుని గురించి టిబెట్ విద్యార్థులకు కూడా తెలుసన్న సంగతిని తాను అక్కడికి వెళ్లినప్పుడు గమనించానని ఆమె చెప్పారు. దేవతల రాజధానయిన అమరావతిని అల నుంచి ఇలకు దించిన అపర భగీరథుడి గురించి కూడా ప్రపంచ ప్రజలకు తెలుసని ఆమె చెప్పకపోవడం గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. ఎందుకంటే గతంలో ‘స్కిల్ కుంభకోణం’ కేసులో చంద్రబాబు అరెస్టయి నప్పుడు 55 దేశాల్లోని ప్రజలు వీధుల్లోకి వచ్చి హాహాకారాలు చేశారని ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టిన సంగతి తెలిసిందే. ఆ ప్రచారం ప్రభావం అంతో ఇంతో ఉంటుందేమోననే అను మానం సహజం.అట్టి దేవతల రాజధాని అమరావతికి ఇప్పుడున్న 54 వేల ఎకరాలు సరిపోవని, అర్జెంటుగా ఇంకో 20 వేల పైచిలుకు ఎకరాల భూముల సమీకరణకు సర్కార్ సైరన్ మోగించింది. ఇంతటితో ఆగదట! ఇంకో పాతిక వేల ఎకరాల కోసం మూడో రౌండ్ సమీకరణ కూడా సిద్ధంగా ఉన్నదని విశ్వసనీయ సమా చారం. ఏతావతా రాజధాని పేరుతో లక్ష ఎకరాల సారవంత మైన పంట భూమికి సర్కార్ టెండర్ పెట్టింది. ఇప్పుడీ లక్ష ఎకరాల్లో నివసించడానికి లక్షల సంఖ్యలో నర నారీ జనసందోహం ఎక్కడ నుంచి వెల్లువెత్తి రావాలి? ప్రభుత్వ కార్యాల యాల్లో పనిచేసే వారు లేదా ప్రైవేటు కంపెనీలు వస్తే వాటిలో పని చేసేవారు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకునే పరిస్థితులు ఉంటాయా? రియల్ ఎస్టేట్ మోడల్లో కార్పొరేట్ రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించిన తర్వాత అద్దెలు గాని, అమ్మకాలు గాని మధ్యతరగతి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాయా? పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల పిల్లలు చదువు కోవడానికి ఎన్ని పాఠశాలలు, ఎన్ని కళాశాలలు పెట్టబో తున్నారు? ప్రైవేట్ విద్యాసంస్థలకు భూ పందేరాలు చేయడం తప్ప, ప్రభుత్వ విద్యాసంస్థలను ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదు? వగైరా ప్రశ్నలు సహజంగానే పుట్టుకొస్తాయి. విజయ వాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి అన్ని వసతు లున్న పట్టణ ప్రాంతాలు చేరువలో ఉండగా అమరావతిలోనే ప్రజలు నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఎంతకాలం పడు తుందో చెప్పడం కష్టం. నాలుగొందల ముప్పయ్యేళ్ల్ల కిందట గోల్కొండ రాజైన ఖులీ కుతుబ్‌షా హైదరాబాద్ నగర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా దైవాన్ని ప్రార్థిస్తూ ‘‘సముద్రాన్ని చేప లతో నింపినట్టు ఈ నగరం కూడా ప్రజలతో నిండి ఉండేట్టు ఆశీర్వదించమ’’ని అర్థించాడు. తాను మహారాజు గనుక ఆదే శాలు జారీ చేసినంత మాత్రాన ప్రజలు నివసించబోరనీ, సరైన ఉపాధి, నివాసయోగ్య పరిస్థితులు ఏర్పడితేనే నగరం అభివృద్ధి చెందుతుందనీ గ్రహింపు ఉన్నవాడు కనుకే అటువంటి పరిస్థితు లను కల్పించాలని అల్లాను అభ్యర్థించాడు. అప్పటికే గోల్కొండ అంతర్జాతీయ వజ్రాల వ్యాపారానికి కేంద్రమైనప్పటికీ దైవంపైనే ఖులీ భారం వేశాడు. ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా అటువంటి నివాసయోగ్య పరిస్థితులు, ఉపాధి అవకాశాలు ముఖ్యం.గాంధీనగర్‌ను గుజరాత్ రాజధానిగా నిర్మించి 50 ఏళ్లు దాటినా అది ఇప్పటికీ అహ్మదాబాద్ నీడలోంచి బయటకు రాలేదు. మహానగరంగా మారలేదు. భువనేశ్వర్ ఇప్పటికీ కటక్ కొంగు పట్టుకునే నడుస్తున్నది. నయా రాయ్‌పూర్ కథ కూడా అంతే! మలేసియా రాజధానిగా ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ‘పుత్రజయ’ ఇప్పటికీ కౌలాలంపూర్‌కు అనుబంధ నగరమే. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ‘గ్రోత్ ఇంజన్’ వంటి నగరాన్ని అభివృద్ధి చేయాలనుకోవడం వేరు, అది రాజధాని నగరమే కావాలను కోవడం వేరని నిపుణులు చెబుతున్నారు. ‘గ్రోత్ ఇంజన్’గా అభి వృద్ధి చెందడానికి మానవ సంకల్పంతో పాటు కొన్ని సహజమైన అనుకూలతలు కూడా ఆ నగరానికి ఒనగూడి ఉండాలి. అటువంటి అనుకూలతలు అమరావతితో పోల్చితే విశాఖపట్నానికి దండిగా ఉన్నాయనే అభిప్రాయం ఉన్నది. విశాఖను ‘గ్రోత్ఇంజన్’గా మార్చుకొని, అమరావతిని పాలనా రాజధానిగా కొనసాగించాలంటే లక్ష ఎకరాల భూమి, లక్షల కోట్ల రూపా యల అప్పు అవసరం లేదు.ఒక రాష్ట్రానికి గాని, దేశానికి గాని అభివృద్ధి ప్రణాళికలను రచించే ముందు ఆ ప్రాంత బలాబలాలను గమనంలోకి తీసు కుంటారు. ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్‌కున్న సహజ బలాల్లో మూడు ముఖ్యమైనవి – ఒకటి సముద్రతీరం, రెండు వ్యవసాయ రంగ మయితే, మూడోది బహుళ పట్టణ వ్యవస్థ. దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా 15 ప్రగతిశీలమైన పట్టణాలు ఏపీలో ఉన్నాయి. అభివృద్ధిని వికేంద్రీకరించి, దృష్టి పెడితే విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాలకుతోడు మరో 10 పట్టణాలు ఒక్కోటి పది లక్షల జనాభాకు ఉపాధినీ, ఆశ్రయాన్నీ ఇవ్వ గలవు. అమరావతి కోసం ఇప్పుడు సేకరించిన భూమే రాజ ధాని అవసరాలకు సమృద్ధిగా సరిపోతుంది. మరింత భూసేక రణ, మరింత రుణ సేకరణ వంటి వృథా ప్రయాసలు తప్పు తాయి. పట్టణీకరణ నిపుణులు చెబుతున్న మాటలివి. ప్రతి పక్షాల విమర్శలు కావు.రాజధాని అప్పులు కాకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల పైచిలుకు అప్పులు చేసింది. రాజధాని కోసం 40 వేల కోట్లు చేశారు. మొదటి దశలోని 53 వేల ఎకరాలను దృష్టిలో పెట్టుకొని రాజధానికి 77 వేల కోట్లు కావాలని చంద్ర బాబు స్వయంగా అన్నారు. ఇప్పుడిది లక్ష ఎకరాలకు మారింది. ఇంకెంత కావాలి? కేవలం రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనకే ఎకరాకు రెండు కోట్ల చొప్పున లక్ష ఎకరాలకు రెండు లక్షల కోట్లు అవసరమవుతాయని నిర్మాణ రంగం నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, ఇతర అవస రాల కోసం ఇంకో లక్ష కోట్లు. మొత్తం మూడు లక్షల కోట్ల అప్పును ఎక్కడ తెస్తారు? దానిని ఎవరి నెత్తిన రుద్దుతారు? రాజధానితో సంబంధం లేకుండా ఏడాదిన్నరలోనే రెండు లక్షల కోట్లు దాటిన మిగతా అప్పు ఐదేళ్లలో ఎంత కావాలి? ఈ భార మంతా ఎవరు మోయాలి? ప్రజలే కదా! అమరావతిని రాజ ధానిగా కొనసాగిస్తూనే, సింగిల్ గ్రోత్ ఇంజన్ మోడల్ (విశాఖ), మల్టిపుల్ గ్రోత్ ఇంజన్ల మోడల్ (డజన్ నగరాలు) వంటి ప్రత్యామ్నాయాలు ఉండగా, లక్ష ఎకరాలు, మూడు లక్షల కోట్లు, పర్యావరణ సమస్యలు వంటి ఎన్నో రిస్కులతో కూడిన బాటలోనే పయనించాలని ఎందుకు ఉబలాటపడుతున్నారో కనిపెట్టడం కష్టసాధ్యం కాదు.నదులు ఉప్పొంగి నగరాలను ముంచెత్తిన వార్తలు విన్నాము. కానీ నగరంలోంచి నీళ్లను నదిలోకి ఎత్తిపోసే విడ్డూ రాన్ని మనం కేవలం అమరావతిలోనే చూస్తున్నామని ఒక నిపు ణుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నదులకైనా, వాగులువంకలకైనా వాటి సహజ ప్రవాహ గతి వాటికి ఉంటుంది. కృత్రి మంగా దారి మళ్లింపు ప్రయత్నాలు ఎన్ని చేసినా ప్రకృతి ఉగ్రరూపం దాల్చినప్పుడు వాటి సహజ మార్గాలను వెతుక్కుంటూ, బీభత్సాన్ని సృష్టిస్తాయి. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో చూస్తున్నాము. కొండవీటి వాగు కృష్ణలో కలిసే సహజ మార్గంలో మహానగర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. దాని వరద నీటి ఎత్తిపోత అనే రిస్కును తలకెత్తుకోవడానికి కారణం నిధుల ఎత్తిపోత అనే మహద్భాగ్య అవకాశమేనని వస్తున్న విమర్శలను కాదనగలరా? రాజధాని నగరంలో నిర్మాణాలకు చదరపు అడుగుకు తొమ్మిది వేల నుంచి పదివేల దాకా ఖర్చు చేస్తున్నారు. ఎంత వైభవోపేతంగా కట్టినా నాలుగున్నర వేలు దాటదని నిర్మాణరంగంవాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఆరు వరుసల జాతీయ రహదారులను నిర్మించడానికి ‘నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా’ కిలోమీటర్‌కు 25 కోట్లు ఖర్చు పెడుతున్నదట! మన అమరావతిలో దాన్ని 53 కోట్లుగా డిసైడ్ చేశారు. ఇటువంటి అవినీతి వ్యవహారాల మీద ‘సాక్షి’ మీడియాలో సవివరంగా కథ నాలు వచ్చినా, నిపుణులు ఎందరో సోషల్ మీడియా వేదికపై గొంతు విప్పినా ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేదు. అంటే, అందులో ఖండించడానికి ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. ఈ లెక్కన ప్రభుత్వం అప్పులు తెచ్చి రాజధాని కోసం మూడు లక్షల కోట్లు ఖర్చుపెడితే అందులో సగభాగం కైంకర్యాలకే సరిపోతుందన్నమాట! బలమైన ఆధా రాలు, అనుమానాలతో వస్తున్న ఈ విమర్శకు ప్రభుత్వం ముఖం చాటేస్తున్నది కనుకనే పెద్ద ఎత్తున అవినీతి జరుగు తున్నదని జనం నమ్ముతున్నారు.పాలక కూటమి కార్యకర్తలు, ఛోటానేతలు కూడా రాజధాని అవినీతిని నమ్ముతున్నారు. అందువల్లనే క్షేత్రస్థాయిలో వారు చెలరేగిపోతున్నారు. ‘‘మంత్రిగారి కొడుక్కి నీ మీద మనసైంది. రా వచ్చెయ్’’మంటూ ఒంటరి మహిళలకు మంత్రిగార్ల పీఏలు బరితెగించి బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఛోటామోటా నాయ కులు నిరుపేద హాస్టల్ బాలికలను నిర్జన ప్రదేశాలకు లాక్కెళ్తు న్నారు. ‘‘నీ ఉద్యోగం మాకు కావాలి, నువ్వు రాజీనామా చేసెయ్’’ అంటూ బలహీనవర్గాల చిరు మహిళా ఉద్యోగులను జుట్టు పట్టి ఈడ్చుకుంటూ కీచక పర్వాలను సృష్టిస్తున్నారు. ఇసుక మాఫియా, రేషన్ బియ్యం మాఫియా, పేకాట మాఫియా చెలరేగిపోతున్నాయంటూ ఒక పోలీస్ హోమ్ గార్డ్ నిస్సహాయ ఆవేదనతో ఎస్పీకి పంపిన సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. విధి నిర్వహణ కోసం అక్రమార్కుల ఆచూకీ తీస్తే లాఠీలతో తొక్కి చంపుతామన్నారట! తన పై అధికారులు కూడా ఈ మాఫియా ముఠాలకు భయపడుతున్నారని ఆ హోంగార్డు ఆవేదన వెలిబుచ్చారు. ఇది రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి.ఇక సాధారణ పరిపాలనను చాప చుట్టేశారు. ‘ఓన్లీ అమరా వతి’! ఇదే సర్కారు వారి తిరుమంత్రం! గిట్టుబాటు ధరల్లేక, రవాణా ఖర్చులు కూడా రాని దుఃస్థితిలో పంట పొలాలను దున్నేస్తున్న రైతుల కన్నీటి గాథలు అన్ని ప్రాంతాల్లోనూ వినిపి స్తున్నాయి. ధాన్యం సేకరణ మాట అటుంచి దాచుకునేందుకు గోనె సంచుల్ని కూడా అందివ్వలేని జుగుప్సాకరమైన పరిస్థి తుల్లో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది. మార్కెట్లో ఏ పంటకూ మద్దతు ధర దక్కని దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఒక్కవ్యవసాయ రంగమే కాదు, అన్ని రంగాల్లోనూ ప్రభుత్వయంత్రాంగం నిస్తేజంగా మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జన జీవితం గాలిలో దీపం. కోనసీమ కొబ్బరికి తెలంగాణ వాళ్లు దిష్టి పెట్టారని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారట! ఇక ఆ రైతాంగం ఆయనకు సమస్యల గురించి ఏం చెప్పుకుంటారు? ఇప్పుడు తమ పాలనా వైఫల్యాలపై ముఖ్యమంత్రి ఏం చెబు తారో? న్యూయార్క్, లండన్ నగరాలు మన అమరావతికి దిష్టి పెట్టాయని ఆయన అనకుండా ఉండుగాక!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
దడ పుట్టిస్తున్న ‘సర్’
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట బిహార్‌లో ప్రకంపనలు సృష్టించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ డజను రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నెల 4న మొదలైంది. వచ్చే నెల 4తో ముగిసే ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారి(బీఎల్ఓ) పాత్ర కీలకమైనది. ఓటర్ల ఇళ్లకు పోయి ఓటర్ నమోదు పత్రాలు అందించటం, వెనక్కి తీసుకోవటం, అవసరమైన పత్రాలు జతచేశారో లేదో చూడటం వారి బాధ్యత. ఫలానా వ్యక్తి అర్హుడైన ఓటరో కాదో ప్రాథమికంగా తేల్చేది వీరే. అదే వారి చావుకొస్తోంది.బిహార్‌కు భిన్నంగా ఈ ప్రక్రియ చాలా రాష్ట్రాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. మరణాలు, బలవన్మరణాలు, అస్వస్థులు కావటం, భయాందోళనలతో అప్పగించిన పని వదిలి అదృశ్యం కావటం వంటి ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. బిహార్‌లో బీఎల్ఓలకు ఈ స్థాయిలో సమస్యలున్న దాఖలా లేదు. నిజానికి అక్కడ బీఎల్ఓలతోనే ఓటర్లకు సమస్యలెదురైన ఉదంతాలున్నాయి. బీఎల్ఓలకు వెరిఫికేషన్‌లో సహకరించేందుకు పార్టీలు తమ కార్యకర్తలను బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్ఏ)గా నియమించుకునేందుకు ఎన్నికల కమిషన్(ఈసీ) అవకాశమిచ్చింది. సహజంగానే వారు పరిష్కారంలో కాక సమస్యలో భాగమవుతున్నారు. ఓటర్ల ఎదుటే బీఎల్ఓలతో వాదులాటలకు దిగటం, బెదిరించటం చాలాచోట్ల కనబడే దృశ్యాలు.పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్ తదితర చోట్ల బీఎల్ఓలు ‘సర్’ ప్రక్రియలో తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో చేతికి ఎముక లేకుండా భారీ వాగ్దానాలు చేయటం, అధికారం వచ్చాక ఎగనామం పెట్టడం మన దేశంలో దశాబ్దాలుగా సాగిపోతున్న ఒక దుస్సంప్రదాయం. ఈ విషయంలో న్యాయ స్థానాలకెళ్లినా ఫలితం ఉండదు. కడుపు మండి నిలదీస్తే జైలుపాలు చేయటం, కార్య కర్తలను పంపించి దౌర్జన్యం చేయించటం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు చాలాచోట్ల కనబడుతోంది.ఇంత జరుగుతున్నా, ఈవీఎంలు ఏమార్చి ఓట్లు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు మిన్నంటుతున్నా, ఎన్నికల సంఘం పట్టనట్టు వ్యవహరిస్తోంది. అయినా ఎన్నికల వ్యవస్థపై ఉండే అచంచల విశ్వాసమే ప్రజాస్వామ్యాన్ని ఈమాత్రంగానైనా బతికిస్తోంది. ఓటు పోతే జీవచ్ఛవంతో సమానమన్న అభిప్రాయం జనంలో ప్రబలంగా ఉంది. ప్రజాస్వామ్యంలో అసమ్మతి తెలపాలన్నా, ఆగ్రహావేశాలు వ్యక్తంచేయాలన్నా సామాన్యు లకు ఓటును మించిన ఆయుధం మరేదీ లేకపోవటం ఇందుకు కారణం కావచ్చు.బీఎల్ఓలు ఒత్తిడికి లోనవటం వెనక ఇతరేతర సమస్యలు కూడా ఉన్నాయి. గతంలో ఓటేసే రోజునే తమ ఓటు గల్లంతైందని తెలిసేది. కానీ ఇప్పుడలా కాదు. ఓటరు తన వివరాలతోపాటు అవసరమైన పత్రాలన్నీ అందజేసిన క్షణానే అది చూచాయగా తెలిసి పోతుంది. నెల రోజుల తర్వాత పేరుందో లేదో రూఢి అవుతుంది. లేకపోవటానికి గల కారణమేమిటో అందులో ప్రస్తావిస్తారు. ఆ చిరునామాలో ఓటరు లేడనో, మరణించా డనో, తగిన పత్రాలు అందించలేదనో వెల్లడిస్తారు.దానిపై మళ్లీ పంచాయతీ. నమోదు సమయంలో బీఎల్ఏల నుంచి వచ్చే ఒత్తిళ్లు ఒకపక్క, వాటిని తట్టుకోలేక ఏదైనా చేస్తే ప్రభుత్వం నుంచి చర్యలు మరోపక్క వారిని బాధిస్తున్నాయి. బీఎల్ఓల్లో 90 శాతం టీచర్లే. గుజరాత్ వంటిచోట్ల సాయంత్రం వరకూ విద్యాబోధనలోనూ, అటుతర్వాత రాత్రి 9వరకూ ఫీల్డ్‌లోనూ తలమునకలు కావాలి. మళ్లీ ఇంటికొచ్చి సేకరించిన పత్రాలన్నీ డిజిటల్ ఫామ్‌లోకి మార్చి పంపాలి. ఇవన్నీ ఎప్పటికప్పుడు కాకపోతే పై అధికారుల హెచ్చరికలు. సారాంశంలో ఓటర్ మొదలుకొని అందరికందరూ పెత్తనం చలాయించే వారే. ఈసీకి ఇవి పట్టవు. ‘సబ్ ఠీక్ హై’ అంటోంది.గౌరవ ప్రదమైన జీవితం వెళ్లదీయదల్చుకున్నవారు ఉద్యోగాలు చేస్తారు. అందుకు జీతంతోపాటు గౌరవ మర్యాదలూ ఆశిస్తారు. కానీ అదనపు భారాలు మోపి, వెట్టి కార్మికుల కన్నా హీనంగా చూస్తూ, బెదిరింపులకు దిగటం వల్ల వారు సమాజంలో ఆత్మ గౌరవంతో బతకగలుగుతారా? పిల్లలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారా? గర్భిణులనూ, 45 ఏళ్లు దాటినవారినీ, అంగవైకల్యం ఉన్నవారినీ ఈ బాధ్యతల నుంచి తప్పించాలని గుజరాత్లో ఒక ఉపాధ్యాయ సంఘం కోరినా ఫలితం లేకపోయిందట! ఈ ధోరణి సరికాదు. దీన్ని వెంటనే చక్కదిద్దటం ఈసీ, కేంద్రం బాధ్యత. -
బేలగా మిగిలిన బెలేమ్!
నిర్ణయాత్మకంగా వ్యవహరించలేని సదస్సులు చివరాఖరికి నిరర్థకంగా మిగులుతాయి. బ్రెజిల్‌లోని బెలేమ్‌లో శనివారం ముగిసిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్)–30 ముచ్చటదే. ఐక్యరాజ్యసమితి ఛత్రఛాయలో ఏటా జరిగే కాప్ సదస్సులు ఎప్పుడూ పెద్దగా ఒరగబెట్టింది లేదు. 2015 నాటి ప్యారిస్ ఒడంబడికలో అంగీకరించిన లక్ష్యాలను ఏ దేశం ఏ మేరకు నెరవేర్చిందో చూసి, ఆ విషయంలో చేయాల్సిందేమిటో నిర్దేశించటం దీని ఉద్దేశం. బెలేమ్‌లో ఈసారి అన్ని దేశాల నుంచీ ఆ లక్ష్యాల సాధనకు అవలంబించ బోయే కార్యాచరణేమిటో తెలుసుకోవటమే ధ్యేయమన్నట్టు చెప్పారు. తీరా సాధించింది స్వల్పమే.వాతావరణ మార్పులు, పర్యావరణం అంటేనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కంపరం. ప్యారిస్ ఒడంబడిక నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ముందే ప్రకటించారు గనుక ఆ దేశం నుంచి ఆశించటానికేం లేదు. ప్రపంచ కాలుష్య కారక దేశాల్లో అగ్రభాగాన ఉన్న అమెరికా ఎగవేత ధోరణి సౌదీ అరేబియా వంటి చమురు ఉత్పత్తి దేశాలకు ధైర్యాన్నిచ్చింది. ఇదే అదనని చైనా మందకొడిగా మిగిలిపోయింది. పాశ్చాత్య దేశాల పాత్ర అంతంత మాత్రం. శిలాజ ఇంధనాల వినియోగాన్ని అంచెలంచెలుగా తగ్గించటానికుద్దేశించిన మార్గనిర్దేశనాన్ని కాప్ ప్రకటించాల్సి ఉండగా చమురు దేశాలు, రష్యా, భారత్ తదితర దేశాలు ఒత్తిళ్లు తెచ్చి దాన్ని వమ్ముచేశాయి.భూగోళం వేడెక్కడానికి దారితీసే కారణాల్లో ప్రధానమైన శిలాజ ఇంధన వాడకంపైనే ఏమీ సాధించలేని స్థితిలో ఐక్యరాజ్యసమితి పరిధి వెలుపల వాటి తగ్గింపు కృషి కొనసాగుతుందనీ, ఇందుకు కొలంబియా, మరో 90 దేశాలూ సమష్టిగా ప్రణాళిక రచనకు పూనుకుంటా యనీ బ్రెజిల్ ప్రతినిధి ప్రకటించారు. వచ్చే ఏప్రిల్‌లో జరిగే ‘సమ్మతి కూటమి’ దేశాల శిఖరాగ్ర సదస్సు ఈ విషయంలో ప్రగతి సాధిస్తుందంటున్నారు. బెలేమ్ సదస్సు గురించి చెప్పుకోదగ్గదల్లా వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనే దేశాలకు చేసే ఆర్థిక సాయాన్ని మూడు రెట్లు పెంచుతామని సంపన్న దేశాలిచ్చిన హామీ మాత్రమే!అందువల్ల ఏటా 12,000 కోట్ల డాలర్లు సమకూరుతాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది 30,000 కోట్ల డాలర్లకు పెంచితే తప్ప ఏ మూలకూ చాలదని పర్యావరణ సంస్థలంటున్నాయి. అభివృద్ధి పేరుతో, ప్రగతి పేరుతో సంపన్న దేశాలు అనుసరించే విచ్చలవిడి పోకడల వల్ల కర్బన ఉద్గారాలు వ్యాపించి, వాతావరణ సమతౌల్యం దెబ్బతింటోంది. సముద్ర మట్టాలు పెరిగి, లేదా కార్చిచ్చులు వ్యాపించి జనావాసాలు నాశనమవుతున్నాయి.పునరావాసం కల్పించటానికి అవసరమైన నిధులు ఆ పేద దేశాల వద్ద లేవు. శిలాజ ఇంధనాల వాడకాన్ని ఆపడం మాట అటుంచి, తగ్గించటానికి కూడా సంపన్న దేశాలు ముందుకు రావటం లేదు. కాప్–30 సదస్సును బ్రెజిల్ అమెజాన్ అటవీప్రాంతం ముంగిట్లో నిర్వహించటంలో ఉద్దేశం అడవుల నిర్మూలన వల్ల కలిగే అనర్థాలను తెలియజెప్పటం కోసమే! 92 దేశాలు దీన్ని సమర్థించాయి. కానీ ఒక్క దేశం కూడా అడవుల నిర్మూలన నివారణకు తమ వంతు ఏం చేస్తామన్నది చెప్పింది లేదు.వాతావరణ క్షీణత వల్ల మన దేశం సైతం ప్రమాదకర స్థితిలో ఉంది. సదస్సులో రెండు సంస్థలు సమర్పించిన నివేదికలే ఈ సంగతి చెబుతున్నాయి. గత దశాబ్ద కాలంలో వివిధ రాష్ట్రాల్లో ఏటా 0.1 డిగ్రీ సెల్సియస్ నుంచి 0.5 డిగ్రీ సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆ నివేదికలు వివరించాయి. నిరుడు ఈ పెరుగుదల 0.65 డిగ్రీల సెల్సియస్‌కు చేరిందని తేలింది. మన దేశంలో ఉత్తరాదిన ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో దేశం తీవ్ర వాతావరణ పరిస్థితులు చవిచూసిందని మరో సంస్థ గణాంక సహితంగా తెల్పింది.వడగాడ్పులు, చలిగాలులు, పిడుగుపాట్లు, పెనుగాలులు, భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడటాలు వగైరాల వల్ల 4,064 మంది మరణించగా, దాదాపు 95 లక్షల హెక్టార్ల పంట దెబ్బతింది. 99,533 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంతటి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా కాప్–30 సదస్సు మెరుగైన ఫలితాలు రాబట్టలేకపోయిందంటే అది మానవాళి దురదృష్టమనుకోవాలి. కాప్–30 విఫలం కానీయరాదన్న సంకల్పంతో ప్రకటించిన అరకొర చర్యలు తప్ప బెలేమ్ సాధించిందేమీ లేదు. -
జీ20 సరికొత్త మార్గం
దేశాల మధ్య సహకారం పెంపొందించటం ద్వారా అంతర్జాతీయ ఆర్థిక సుస్థిరత సాధించాలన్న సంకల్పంతో పదిహేడేళ్ల క్రితం ఏర్పడిన జీ20 తొలిసారి అమెరికాను ధిక్కరించింది. దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌లో వరసగా రెండు రోజులు కొనసాగి ఆదివారం ముగిసిన సంస్థ శిఖరాగ్ర సదస్సుకు అమెరికా ముఖం చాటేయగా, దాన్ని బతిమాలటా నికీ, నచ్చజెప్పి ఒప్పించటానికీ ఒక్కరంటే ఒక్కరు ప్రయత్నించిన దాఖలా లేదు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక తన విపరీత పోకడలతో ఇంటా బయటా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు.శ్వేతజాతి అమెరికన్లకు ఏదో ఒరగబెడుతున్నట్టు కనబడటం కోసం ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటున్నారు. పర్యావరణ క్షీణత పెద్ద బోగస్ అని వాదించటమేగాక, బొగ్గు, ఇతర శిలాజ ఇంధనాలను వినియోగించే పరిశ్రమలకు రాయితీలిస్తున్నారు. వేరే దేశాలు కూడా తన బాటలోనే నడవాలంటూ ప్రోత్సహి స్తున్నారు. మానవ కార్యకలాపాల పర్యవసానంగా భూగోళం వేడెక్కుతున్నదని, ఇది ధరిత్రి మనుగడకే పెను ముప్పని శాస్త్రవేత్తలంతా ముక్తకంఠంతో చెబుతున్నా మొండిగా వ్యవహరిస్తున్నారు.అంతర్జాతీయంగానూ అదే బాణీ అందుకున్నారు. జొహాన్నెస్‌బర్గ్ సదస్సు ప్రధాన ధ్యేయమే వాతావరణ మార్పులపై చర్చించి తగు చర్యల కోసం ప్రపంచ దేశాలకు పిలుపునివ్వటం గనుక ట్రంప్ గుర్రుగా ఉన్నారు. సదస్సు ఎజెండాను మార్చమంటూ గత కొన్ని వారాలుగా ఒత్తిడి తెచ్చారు. అది సాధ్యపడక పోవడంతో శ్వేత జాతి మైనారిటీల పట్ల దక్షిణాఫ్రికా ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నదని, అందుకు నిరసనగానే సదస్సుకు గైర్హాజరు కాదల్చుకున్నట్టు ప్రచారం లంకించు కున్నారు. ట్రంప్‌కు వంతపాడే అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలీ కూడా సదస్సుకు రాలేదు.కావడానికి జీ20 సంపన్న రాజ్యాల సంస్థే అయినా దక్షిణాఫ్రికా వంటి వెనకబడిన దేశంలో సదస్సు జరిగింది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలపై ఉమ్మడి అవగాహ నకు రావాలన్న ధ్యేయంతో ఈ సంస్థ ఏర్పాటైంది. ఇందులో వర్ధమాన దేశాలకు సైతం భాగస్వామ్యం కల్పించారు. ప్రపంచంలో మూడింట రెండొంతుల జనాభా గల దేశా లకూ, ప్రపంచ స్థూల ఉత్పత్తిలో దాదాపు 85 శాతం వాటా ఉన్న ఆర్థిక వ్యవస్థలకూ ఇది ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సదస్సు నుంచి దూరం జరిగితే ప్రపంచంలో ఏకాకిగా మిగులుతామన్న స్పృహ ట్రంప్‌కు లేకపోయింది.‘నేను లేకుండా శిఖరాగ్ర సదస్సు డిక్లరేషన్‌ను విడుదల చేయొద్దని ట్రంప్ తీవ్రంగా ఒత్తిడి తెచ్చినా సదస్సు బేఖాతరు చేసింది. అంతేగాక సంప్రదాయానికి భిన్నంగా తొలి రోజునే డిక్లరేషన్‌ను ఆమోదించింది. తన గైర్హాజర్ అయోమయాన్ని సృష్టించి, డిక్లరేషన్ ఆమోదానికి అధినేతలు తటపటా యిస్తారని ట్రంప్ అనుకున్నారు. కానీ ‘అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగద’ని జీ20 తేల్చిచెప్పింది. వాస్తవానికి సంస్థ అధ్యక్ష పదవి అమెరికాకు రావాలి. కానీ సదస్సుకుట్రంప్ గైర్హాజరు కావటం, కనీసం ఉన్నతాధికారులనైనా పంపక, జూనియర్ అధికారితో సరిపుచ్చటానికి నిరసనగా అధ్యక్ష పదవి బదిలీకి దక్షిణాఫ్రికా నిరాకరించింది.అది ఎప్పుడుంటుందో, అసలు జీ20లో అమెరికా కొనసాగుతుందో లేదో చెప్పలేని స్థితి ఏర్పడింది. అమెరికాలోని మియామిలో వచ్చే ఏడాది జరగాల్సిన తదుపరి సదస్సుపైనా అనిశ్చితి అలుముకుంది. భారత, చైనా, రష్యాలేకాక అమెరికా శిబిరంలో ఉండాల్సిన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, కెనడాలు సైతం ఈ సదస్సులో పాల్గొని వాతావరణ సమస్యలపైనా, ప్రపంచ అసమానతలపైనా దృష్టిపెట్టిన డిక్లరేషన్‌ను ముక్తకంఠంతో ఆమోదించాయి.పునరుత్పాదక ఇంధన వనరులపై, నిరుపేద దేశాల రుణవిమోచనపై కూడా అవగాహన కుదిరింది. భారత్ సూచించిన విధంగా ఉగ్రవాదంపైనా, మాదకద్రవ్యాలపైనా సమష్టిగా తలపడటానికి ఆమోదం తెలిపాయి. వాతావరణ సమస్యలపై శిఖరాగ్ర సదస్సు అంగీ కారానికి రావటం ట్రంప్ జీర్ణించుకోలేనిది. సదస్సు ఆమోదించిన అంశాల్లో మెజా రిటీ పేద దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించినవే. తనది ఇక గత వైభవమేనని, ఇటువంటి సదస్సులకు దూరంగా ఉంటే అంతిమంగా తన ప్రతిష్ఠ మరింత మసకబారుతుందని అమెరికా గ్రహించాలి. -
పసిడి రేఖలు విసిరి....
బాఫూ గారికి భయభక్తులతో ఉత్తరం రాసి మనవి చేస్తే భక్త సులభుడైన దేవునికి మల్లే టకాలున బొమ్మ గీసి పంపించేవారు. ‘చంద్ర గారూ... బొమ్మ కావాలండీ’ అనంటే తన సిగ్నేచర్ మందహాసంతో ‘అలాగే’ అని, మనకు కావాల్సిన టైము లోపల కన్నా తాను ఇవ్వాల్సిన టైము లోపు ఇచ్చేసేవారు. హైదరాబాద్ పంజగుట్టలో ఆఫీసు పెట్టుకుని ఉండే కరుణాకర్ ధోరణి పూర్తిగా వేరే. కథో, నవలో, సీరియల్ భాగమో ఇప్పుడు ఇస్తే మధ్యాహ్నానికి బొమ్మ రెడీ. వెళ్లి తీసుకోవడమే.బాలీ గారు, గోపీ గారు, శీలా వీర్రాజు గారు పాత కాపులుగా ఉండి తమ రెగ్యులర్ పద్దుల్లో కొత్త బొమ్మలను జమ చేసుకుంటూ వెళ్లేవారు. ఇక ఆర్టిస్ట్ మోహన్ స్కూలు వేరే. ఈ క్షణమే కుంభవృష్టి కురవనూ వచ్చు... లేదా ఎప్పుడు కురుస్తుందా అని ఎదురు చూసేలా చేయనూ వచ్చు. మోహన్ బొమ్మలు అనూహ్య కటాక్షానికి తార్కాణాలు. ఇడ్లీ కంటే చట్నీ బాగున్నట్టు ఈలోపు మోహన్‌తో కంపెనీయే ఎక్కువ మందికి ఇష్టంగా ఉండేది. కవులకు, రచయితలకు తెలుగునాట రెమ్యూనరేషన్ మీద ఏ కోశానా ఆశ లేదు.ఎందుకంటే అది ఇవ్వరు. ఇచ్చినా అల్లరి చేసే పిల్లాడికి బెల్లమ్ముక్క పెట్టినట్టే. కాని వారు ఆశించే, ఆనందించే సంగతొకటి ఉంది. తాము రాసిన కవితకో, కథకో మెరుగైన దృశ్యరూపం ఇచ్చే చిత్రాన్ని చూడగలగడం. ఒక ఉత్తమమైన కవి, రచయిత తాను రాసింది పాఠకులకు అర్థమై స్పందన పొందేలోపు తమ రచనలోని అంతరార్థాన్ని ఎక్సె›్టండ్ చేస్తూ చిత్రకారుడు బొమ్మ గీస్తే, ఆ బొమ్మతో రచన అచ్చయితే ఇక ఆ పూటకు భోజనం చేయరు.అదే వారి సంబరపు విందు. అద్దో అలాంటి చిత్రకారులు గత కాలంలో ఎక్కువ శాతం ఉండేవారు. సాహిత్యం తెలిసి, రేఖలు తెలిసి, సాహితీ రేఖలు గీయగలిగిన వారు. పత్రికలు తెరిచినా, పుస్తకాల ముఖచిత్రాలు చూసినా ఆయా రచనల వైపు పాఠకులను ఆకర్షించేలా ఎంతో మేలిమి చిత్రాలను తీర్చిదిద్దేవారు. సినిమాలకు పోస్టర్ మల్లే రచనలకు వీరి బొమ్మ.ఆర్థిక ఇబ్బందులుండి, ప్రచురణకు సాంకేతిక సహాయం అంతగా లేని రోజుల్లో కవులూ, రచయితలకు చిత్రకారుల బొమ్మలే పెద్ద ఊరట. ఫలానా చిత్రకారుడు నా కథకు బొమ్మ వేశాడు తెలుసా అని రచయిత గర్వంగా చెప్పుకుంటే, ఫలానా రచయిత కథకు నేను బొమ్మ వేశాను తెలుసా అని చిత్రకారుడు గొప్పగా చెప్పుకునే సందర్భాలు ఉండేవి. పరస్పర ప్రోత్సాహకరంగా తెలుగు సాహిత్యం వర్ధిల్లిన కాలం అది. ఇప్పుడు కవులకు, రచయితలకు పుస్తకాలు ప్రచురించడం అతి సులువు.పిండి కొద్ది రొట్టె అన్నట్టు డబ్బు కొద్ది కాపీలు ఇచ్చే ‘ప్రింట్ ఆన్ డిమాండ్’ వచ్చాక పూర్తి ఆటే మారిపోయింది. వారానికి పది పుస్తకాలు అచ్చేయ్యే చోట వంద పుస్తకాలు అచ్చవుతున్నాయి. ఒకటీ అరా పబ్లిషర్ల సంఖ్య నుంచి ప్రతి నవ కవీ, యువ రచయితా పబ్లిషర్‌గా మారే సన్నివేశం అరుదెంచింది. తెలుగు పబ్లికేషన్ రంగం ఇంత కళగా ఎప్పుడూ లేదు. కాకుంటే ఒకటే వెలితి. పసిడి రేఖలు విసిరి కనుమరుగైపోయిన ఆ చిత్రకారులు ఎక్కడా? ఉన్న కొద్దిమంది చాలా బిజీ.డిసెంబర్ నుంచి బుక్ ఫెయిర్ల సీజన్. ఎందరో సాహితీకారులు, పబ్లిషర్లు వందల కొలది పుస్తకాలను అచ్చెత్తించే పనిలో ఉన్నారు. అయితే తమ పుస్తకాల్లోని సారాన్ని అర్థం చేసుకుని అర్థవంతమైన బొమ్మ ఇచ్చే చిత్రకారుల కొరతతో బాధ పడుతున్నారు. తోట తరణి అంటారు– సెట్‌ను గీసి చూపే ఆర్ట్ డైరెక్టర్ వేరు, చేసి చూపే ఆర్ట్ డైరెక్టర్ వేరు అని. కేవలం బొమ్మ వేసే వారికి డిజైన్ పరిమితి... డిజైన్ చేయగలిగే వారికి బొమ్మ పరిమితి... ఈ రెండూ వచ్చిన వారికి సమయ పరిమితి విపరీతంగా ఉంది. దాంతో ఈ సీజన్ అంతా కృత్రిమమైన ఏఐ బొమ్మలతో తెలుగు పుస్తకాలు కిటకిటలాడబోతున్నాయి. మల్లెలూ, కాగడాపూలూ ఒకలాగే ఉన్నా రెండూ ఒకటి కాబోవు.మంచి రచనకు మేలిమి చిత్రకారుడి కుంచెపోటు తెచ్చే బలం కావాలి. సముద్రం ఉన్న చోట లైట్‌హౌస్ వెలగాలి. నేడు మన వద్ద లిటరేచర్ ఫెస్టివల్స్, యూత్ ఫెస్టివల్స్ బాగా జరుగుతున్నాయి. కాని జరగాల్సింది ‘ఇలస్ట్రేటర్స్ ఫెస్టివల్’. కొత్తతరం రేఖాచిత్రకారుల కోసం ఏం చేయవచ్చో ఆలోచించాలి. బాపూ రమణీయం వలే తెలుగు రాత, తెలుగు రేఖ జమిలిగా వర్ధిల్లాలి. -
అటు విధ్వంసం... ఇటు విషప్రచారం!
చంద్రబాబు పెంపుడు మీడియా అవాకుల గురించీ, ఆయన ఆస్థానంలోని పెయిడ్ చిలుకల చెవాకుల గురించీ తెలుగు నాట తెలియనివారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాల పుట్ట పగులుతున్నకొద్దీ... యెల్లో మీడియా దురద రోగం మరింత ముదిరి వికృతరూపం దాలుస్తున్నది. రాజకీయ రంగుటద్దాలను తొలగించి నిష్పాక్షిక దృష్టితో ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులను గమనించండి. ఎటు చూస్తే అటు చీకటి. వికసిత జీవితాల విధ్వంసం. రాష్ట్రానికి జీవనాడి వంటి వ్యవసాయ రంగం కకావికలైన దృశ్యం కనిపిస్తుంది.అపురూపంగా పెంచుకున్న అరటి తోటల్ని దున్నేస్తున్నారు రైతులు. ఏం చేస్తారు మరి? టన్నుకు పది పన్నెండు వేలన్నా వస్తేనే... పెట్టిన ఖర్చు గిట్టుబాటవుతుంది. వెయ్యి రూపాయల కంటే ధర పలకని దుర్మార్గ పరిస్థితి నేడు దాపురించింది. జగన్ హయాంలో ఇరవై నుంచి ముప్ఫై వేలు పలికిన స్వర్ణయుగాన్ని గుర్తుచేసుకుంటూ రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఆ రోజుల్లో రాయలసీమ నుంచి ఢిల్లీ నగరం దాకా పరుగెత్తిన ప్రత్యేక అరటి రైళ్ల దృశ్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. విదేశాలకు కూడా ఎగుమతి చేసి లాభాలార్జించిన నాటి వైభవం ఇంకా వారి మనోఫలకాల్లో మెరుస్తూనే ఉన్నది. ఇప్పుడెందుకీ దుర్గతి?పత్తి పంటనూ దున్నేస్తున్నారు. పలనాటి రైతు విలవిల్లాడు తున్నాడు. సర్కారు నిర్లక్ష్యం, ప్రకృతి వైపరీత్యాల జమిలి దాడితో పత్తి రైతులు చిత్తయిపోయారు. అధిక వర్షాలు, తుపాను దెబ్బకు తేమ శాతం పెరిగింది. కొనుగోలుదారులెవరూ ముందుకు రావడం లేదు. కాటన్ కార్పొరేషన్ కళ్లప్పగించి చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి దూది పువ్వుల దుఃఖం చెవి కెక్కడం లేదు. ఈ సీజన్లో అన్ని పంటల పరిస్థితీ అంతే. గిట్టుబాటు ధరల్లేక ఉల్లి పంటను దున్నేసిన వార్తలను చదవాల్సి వచ్చింది. గుండెజారిన ఉల్లి రైతుల ఆత్మహత్యలు కూడా రిపోర్టయ్యాయి.టమాటా రైతుల కన్నీటి పాట ఈ యేడు కూడా కర్నూలు జిల్లా నుంచి వినపడుతూనే ఉన్నది. ధరలు పతనమై మామిడి, చీనీ రైతులు కష్టాల పాలయ్యారు. జగన్ హయాంలో అమలు చేసిన పంటల బీమా పథకాన్ని కూటమి సర్కార్ ఎగరగొట్టింది. ప్రకృతి దయాదాక్షిణ్యాలకు వ్యవసాయరంగాన్ని వదిలేసింది. ధరల స్థిరీకరణ నిధి, మార్కెట్లో సర్కార్ జోక్యం వంటి మాటలే ఇప్పుడు వినిపించడం లేదు. తుపానుతో దెబ్బతిన్న వరి రైతుల బాధ అరణ్య రోదన. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది లేదు. రంగుమారిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చి కొన్నదీ లేదు. పెట్టుబడి సాయాన్ని ఒక సంవత్సరం ఎగవేసి రెండో సంవత్సరానికి అత్తెసరుతో సరిపెట్టారు.వ్యవసాయ రంగం పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారయ్యా అనే అనుమానం రాకుండా ఉండదు. ఆయనేం ఖాళీగా లేరు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ తాను వ్యవసాయరంగం గురించి ఆలోచనలు చేస్తూనే ఉన్నానని కడప జిల్లాలో రైతులతో జరిపిన ముఖా ముఖిలో ఆయన చెప్పుకున్నారు. రాష్ట్రంలో వీస్తున్న గాలులు ఏ దిశలో ప్రయాణిస్తున్నాయో, ఆ గాలుల క్వాలిటీ ఏమిటో, అందులో ఏమేమి తెగుళ్లున్నాయో, అవి ఎంత దూరం ప్రయాణిస్తాయో, ఏ పంటల మీద దాడి చేస్తాయో అనే విషయాన్ని తాను ఎనలైజ్ చేస్తున్నట్టు రైతులకు అభయమిచ్చారు.ఆ తెగుళ్ల సంగతి, పురుగుల సంగతి తెలిస్తే రైతుకు ఏ భయం ఉండదని చెప్పారు. అంతేగాక భూమిలో తేమ ఎంత ఉంది, ఎండ ఎంత తగులుతుంది అనే విషయాలను కూడా ఆయన అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. ఈ రకమైన టెక్నాలజీ డెవలప్మెంట్పై తాను దృష్టి పెట్టినందువల్ల పంటల బీమా గురించి, మార్కెట్ జోక్యం గురించి, పెట్టుబడి సాయం గురించి, ఇన్పుట్ సబ్సిడీ వంటి చర్యల గురించి అడగొద్దనేది ఆయన ఉద్దేశం కాబోలు! రాష్ట్ర రైతాంగంతోపాటు భూవసతి లేని వ్యవసాయ కూలీలను కూడా ప్రభుత్వం కష్టాల కొలిమిలోకి నెట్టింది.ఈ–కేవైసీలు లేవన్న నెపంతో దాదాపు 16 లక్షల మంది ఉపాధి కూలీల జాబ్ కార్డులను రద్దు చేసింది. ఇది ఆ పథకం నిబంధనలకు విరుద్ధం. గ్రామసభలో నిర్ధారణ చేసుకోకుండా జాబ్ కార్డులను రద్దు చేయడానికి వీల్లేదు. అయినా ఎడాపెడా రద్దు చేస్తున్నారు. అటు వ్యవసాయం గిట్టుబాటు కాకుండా, ఇటు ఉపాధి హామీ ఆసరా లభించకుండా ఉద్దేశపూర్వకంగా చేసి ఒక విస్తారమైన చీప్ లేబర్ మార్కెట్‌ను రైతు–కూలీల్లో సృష్టించే కుతంత్రంతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తున్నది.ప్రైవేటీకరణ ఖడ్గాన్ని యథేచ్ఛగా ప్రయోగిస్తున్న బాబు సర్కార్ ఇప్పుడు పేదలకు అసైన్ చేసిన 34 లక్షల ఎకరాల భూములపై కూడా కన్నేసింది. పేదల దగ్గర నుంచి ఆ భూముల్ని లాక్కొని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం కోసం ఆదరాబాదరా ఆర్డినెన్స్‌ను జారీచేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. నిరుపేదలైన అసైనీలకు ఉపయోగపడే విధంగా ఇరవయ్యేళ్ల తర్వాత వారు ఆ భూముల్ని అవసరార్థం అమ్ము కునే విధంగా జగన్ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ ఇచ్చింది. దీనివల్ల తొమ్మిదిన్నర లక్షలమంది అసైనీలకు లబ్ధి జరిగింది. పేద రైతులకు లబ్ధి జరిగితే పెత్తందారీ సర్కార్‌కు నిద్రపట్టదు కదా! కాకుల్ని కొట్టి గద్దల్ని మేపడం దాని పాలసీ. అందుకే అధికారంలోకి వచ్చీరావడంతోనే యెల్లో మీడియా బాకా ద్వారా ఫ్రీహోల్డ్ స్కీమ్‌పై దుష్ప్రచారాన్ని ఊదరగొట్టి, ఆ భూముల్ని నిషేధిత జాబితాలో పెట్టారు.ప్రభుత్వ రంగంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ‘పీపీపీ’ ముసుగేసి ప్రైవేటీకరించ డానికి ఇప్పటికే బాబు సర్కార్ తెగబడింది. దీనిపై జనంలో తీవ్ర వ్యతిరేకత మొదలయ్యాక మాట మార్చి ప్రైవేట్ వాళ్లకు అప్పగించినా నియంత్రణ మాత్రం సర్కారుకే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, అదెలా సాధ్యమో తెలియదు. ఇక ప్రభుత్వం ఉచితంగా అందించాల్సిన సేవలను కూడా ప్రైవేటీ కరించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ సేవలు ఏవీ ఉచితం కాదని గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పేవారు.ఇప్పుడు దాన్ని అమల్లోకి తెచ్చే సన్నాహాల్లో ఉన్నారు. ఇక విద్యా, వైద్య రంగాల్లో జగన్ సర్కార్ తెచ్చిన సంస్కరణలు, వెచ్చించిన నిధులు పేద, మధ్యతరగతి వర్గాల్లో ఎన్నో ఆశలు నింపాయి. వారి ఆశల్ని కూటమి సర్కార్ అడియాసలు చేసింది. అక్కడా ప్రైవేటీకరణ మంత్రాన్నే జపిస్తున్నది. నాణ్యమైన విద్యను ఎంత ఖరీదైనా సరే కొనుక్కోవాల్సిందే. అవసరమైన వైద్యం అంగడి సరుకు మాత్రమే! ఇదీ బాబు విధానం.విశాఖ ఉక్కుపై ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేమిటి? ఇప్పుడు బాబు మాట్లాడుతున్నదేమిటి? విశాఖ ఉక్కు తెల్ల ఏనుగుగా మారిందని ఆయనీ మధ్యనే ఈసడించుకున్నారు. కార్మికులు పనిచేయట్లేదని అభాండాలు వేశారు. ఉక్కు ఫ్యాక్టరీ లాభాల్లోకి రావడానికి అవసరమైన సొంత గనుల కేటాయింపు విషయాన్ని దాటవేశారు. ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలు మాత్రం మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించేందుకు రాయ బారాలు నడుపుతున్నారు. అంతేకాదు విశాఖ పోర్టును దెబ్బ తీసే విధంగా ఆ స్టీల్ ఫ్యాక్టరీ సొంత రేవును కూడా నిర్మించుకుంటోంది. మిట్టల్ స్టీల్ కోసమే ఉద్దేశపూర్వకంగా ఆంధ్రుల సెంటి మెంట్‌తో ముడిపడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దెబ్బ తీస్తున్నారని వస్తున్న ఆరోపణలు నిజమేనని నమ్మవలసి వస్తున్నది.ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా ‘పీ–4’ అనే పేరుతో ప్రైవేటీకరించే విపరీత చర్యకు కూటమి సర్కార్ తెగబడింది. ఈ దేశ సంపదలో పేద ప్రజలు హక్కుదారులు కాదు, కేవలం యాచకులు మాత్రమేననేది ఈ ‘పీ–4’ పథకంలో అంతర్లీనంగా ప్రవహించే ఫిలాసఫీ. ఇది కచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేక ఆలోచన. బలహీన వర్గాల మహిళల ఆత్మ గౌరవాన్ని నిల బెట్టడం కోసం వారి పేర్లతో 30 లక్షల ఇళ్ల పట్టాలు కేటాయిం చింది జగన్ ప్రభుత్వం. అందులో తొమ్మిది లక్షల పైచిలుకు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించింది.చివరి దశ నిర్మాణంలో ఉన్న 3 లక్షల ఇళ్లను పూర్తిచేసి చంద్రబాబు సర్కార్ తామే వాటిని నిర్మించినట్టు ప్రచారం చేసుకొని మొన్ననే లబ్ధిదారులకు అప్పగించింది. ఈ పదిహేడు మాసాల పాలనలో ఒక్క సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వకుండా మూడు లక్షల ఇళ్లను పూర్తిచేయడం నిజంగా ప్రపంచ వింతే! అంతటితో ఆగ లేదు. ఇరవై లక్షల ఇళ్లను ఇవ్వాలనుకుంటున్నామని, అందులో మూడు లక్షలు ఇప్పటికే అప్పగించామని కూడా చంద్రబాబు చెప్పారు. ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి? జగన్ సర్కార్ భూమిని సేకరించి ప్లాట్లు వేసి, పట్టాలిచ్చి నిర్మాణాలను ప్రారంభించినవి కావా?రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. పదిహేడు మాసాల్లో రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇది జాతీయ రికార్డు. ఒకపక్క విద్యా, వైద్య రంగాలతో సహా సమస్తాన్ని ప్రైవేటీకరిస్తూ ప్రజల కిచ్చిన హామీలను ఎగవేస్తున్న సర్కార్ ఈ సొమ్మునంతా ఏం చేస్తున్నట్టు? రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు దిగజారాయి. అమ్మకం పన్ను వసూళ్లు తగ్గడమంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గు తున్నట్టు! ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నట్టు! పోలీసింగ్‌పై కేంద్రం విడుదల చేసిన జాబితాలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అట్టడుగున 36వ స్థానం ఏపీకి దక్కింది. కారణం తెలిసిందే. పొలిటికల్ గవర్నెన్స్ మన పోలీసింగ్‌ను పక్కదారి పట్టించింది. ఉద్యోగాల కల్పనలో కూడా ఏపీ అధమ స్థానంలోనే ఉన్నట్టు నివేదికలు వచ్చాయి. ఇవేమీ యెల్లో మీడియాకు కనిపించవు. ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నదని వారికి తెలుసు. దాని నుంచి చంద్రబాబును రక్షించడానికి ప్రతిపక్ష నేతపై దిగజారుడు విమర్శలకు ఈ మీడియా తెగబడుతున్నది. 2014–19 మధ్య కాలంలో అధికారంలో ఉండి చేసిన అవినీతిపై విచారణ జరిపి పలు ఛార్జిషీట్లు వేశారు. స్కిల్ కుంభకోణంలో జైలుకు కూడా ఆయన వెళ్లి వచ్చారు.ఇప్పుడా కేసుల నుంచి బయటపడేందుకు బాబు సర్కార్ ఏర్పాట్లు చేసుకుంటున్నది. ఈ వ్యవహారం నుంచి కూడా దృష్టి మళ్లించాలి. కనుక జగన్ ప్రభుత్వ హయాంలో అవినీతి పేరుతో, ‘సిట్’ చెప్పిందన్న సాకుతో యెల్లో మీడియా నిండా అవే వార్తలు. పెట్టుబడులు తరలివస్తున్నాయంటూ పోచికోలు ప్రచారం. అమరావతిలో అంతస్థులు లేస్తున్నాయనే ప్రచారం. ఈ ప్రచార ఆర్భాటాలతో ఎంతకాలం రాష్ట్ర దైన్యస్థితిని దాచి పెట్టగలరు! విశాఖ సదస్సు ద్వారా పది లక్షల కోట్లు వస్తున్నా యని క్రితంసారి ప్రకటించుకున్నారు.కానీ పది శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదన్న నిజాన్ని దాచగలిగారా? ఇంకెంత కాలం జగన్ వ్యక్తిత్వ హననంతో సమాచార భ్రష్టత్వానికి పాల్పడగలరు! జగన్ హైదరాబాదు కోర్టుకు హాజరైనా తప్పేనా? చాలాకాలం తర్వాత హైదరాబాదుకు వచ్చారు కనుక పెద్దసంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. యెల్లో మీడియాకు, కూటమి సర్కార్‌కు మింగుడుపడినా, పడక పోయినా జాతీయ స్థాయిలోనే జగన్ అతిపెద్ద పొలిటికల్ క్రౌడ్ పుల్లర్. కోర్టు హాజరుపై సైతం యెల్లో టీవీలు మరో వార్త లేకుండా రోజంతా విషాన్ని ఎగజిమ్మాయి.ఒక ఎల్లో విశ్లేషకు డైతే ఏకంగా హిడ్మా మాదిరిగా జగన్‌ను కూడా ఎన్కౌంటర్ చేయాలని ఊగిపోయాడు. కొత్తగా చేయడమేమిటి? పదహా రేళ్లుగా ఆయన వ్యక్తిత్వంపై ఎన్కౌంటర్లు చేస్తూనే ఉన్నారు కదా! హిడ్మా ప్రజాస్వామ్యాన్ని పరిహసించాడట! రాజ్యాంగాన్ని వ్యతి రేకించాడట! జగన్ కూడా అదే పని చేశాడట. అదీ ఆ విశ్లేషకుని రీజనింగ్. సరే, హిడ్మా చనిపోతే వందలాది గిరిజన గూడేలు గుండె పగిలేలా ఎందుకు రోదించాయో, దండకారణ్యం కడుపు కోతతో ఎందుకు కుదేలైందో కాలమే సమాధానం చెబుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున నిలబెట్టి, ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని అణువణువునా నింపుకొని అడు గడుగునా అమలుచేసిన జగన్ రాజ్యాంగ వ్యతిరేకా? ఆ రాజ్యాంగ స్ఫూర్తికి నిలువెల్లా తూట్లు పొడుస్తున్న కూటమి సర్కార్ రాజ్యాంగ వ్యతిరేక శక్తా? తేల్చడానికి ఇదేమంత క్లిష్టమైన సమస్య కాదు.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
మారిన విలువలు
కాస్త ఆలస్యం కావొచ్చు గానీ... పుష్కలంగా డబ్బూ, కండబలం ఉన్నవాడు ఎన్ని నేరాలు చేసినా మర్యాదస్తుడిగా మారడం కష్టమేం కాదని సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు బుధవారం అమెరికాలో లభించిన స్వాగత సత్కారాలు చూస్తే తెలుస్తుంది. ఏడేళ్ల క్రితం ఆయన అంతర్జాతీయంగా అంటరానివాడు. సల్మాన్‌ను ఆహ్వానించటానికి అమెరికా జంకింది. సౌదీలో జరిగే పెట్టుబడుల సదస్సును పాశ్చాత్య దేశాలన్నీ బహిష్కరించాయి. కానీ ఇప్పుడంతా మారింది.సల్మాన్‌కు 21 శతఘ్నుల వందనం, అశ్వారూఢులైన నావికాదళ పటాలం మేళతాళాలు, యుద్ధ విమానాల పరేడ్... ఒకటేమిటి ఆయన రాకే పెద్ద వేడుకన్నట్టు అధికార వ్యవస్థ సమస్తం పులకించిపోయింది. అమెరికాలో సల్మాన్ షాపింగ్ తక్కువేం లేదు మరి. దొంగచాటుగా వెళ్లి శత్రు స్థావరంపై దాడిచేయగలిగిన ఎఫ్–35 యుద్ధ విమానాలు, అణుశక్తి సాంకేతికత, చిప్‌లు, అరుదైన ఖనిజాల వేటలో సహకారం వగైరాలన్నీ అందులో ఉన్నాయి. వీటి విలువ అక్షరాలా లక్ష కోట్ల డాలర్లు. అదిగాక ట్రంప్ కుటుంబానికి గల్ఫ్ దేశాల్లో వందల కోట్ల డాలర్ల విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో అండదండలందించేందుకు సౌదీ ఇప్పటికే అంగీకరించింది.వీటన్నిటి పర్యవసానంగానే ఈ మర్యాదలు! నిజానికి ఆయనతో మళ్లీ సాన్నిహిత్యం కావాలని మాజీ అధ్యక్షుడు జో బైడెన్ సైతం ప్రయత్నించకపోలేదు. జెడ్డాలో 2022లో పర్యటించినప్పుడు ఆయన్ను ‘భవిష్యత్తు రాజు’గా కీర్తించారు. కానీ ప్రజాభిప్రాయానికి జడిసి అమెరికా ఆహ్వానించటానికి సందేహించారు. బిన్ సల్మాన్ దుష్కృత్యం సాధారణమైనది కాదు. రాజ కుటుంబానికి సన్నిహితు డిగా, ‘వాషింగ్టన్ పోస్ట్’ కాలమిస్టుగా ఉన్న జమాల్ ఖషోగ్గీ తనపై తరచు చేసే విమర్శలు ఆయన తట్టుకోలేకపోయాడు. సల్మాన్ బతకనీయడని తెలిసి ఖషోగ్గీ అమెరికా వెళ్లి పోయారు. తన ప్రియురాల్ని పెళ్లాడటానికి అమెరికాలో దాఖలు చేయాల్సిన పత్రాల కోసం సౌదీ వెళ్లాల్సివున్నా, ముప్పు తప్పదన్న ఉద్దేశంతో టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌కు వెళ్లారు. తీరా సౌదీ నుంచి వచ్చిన 15 మంది హంతక ముఠా అంతకుముందే అక్కడ మాటువేసి ఆయన్ను మట్టుబెట్టింది.మామూలుగా కాదు... మనిషిని హతమార్చి, ముక్కలుగా కోసి ఎముకలన్నీ యాసిడ్‌లో కరిగిపోయేలా చేశారు. సల్మాన్ ఆదేశాలతోనే ఆ దారుణానికి ఒడిగట్టారని అప్పట్లోనే అమెరికా గూఢచార సంస్థ సీఐఏ తేల్చింది. కాన్సులేట్ వద్దగల సీసీ కెమెరాల్లో ఖషోగ్గీకి ముందే 15 మంది సభ్యులు లోపలికెళ్లటం, కొన్ని గంటల తర్వాత వారంతా నిష్క్రమించటం రికార్డయింది. అంత ర్జాతీయ పాత్రికేయుల్లో ప్రతిష్ఠగల ఖషోగ్గీ హత్య అమెరికా, పాశ్చాత్య దేశాల ప్రజల్లో ఆగ్రహావేశాలు రగిల్చింది. అందుకే తన తొలి ఏలుబడిలో సల్మాన్‌ను ట్రంప్ దూరం పెట్టారు. హత్యలో ఆయన ప్రమేయం రుజువైందని వ్యాఖ్యానించారు.కానీ ఇన్నేళ్లు గడిచాక ట్రంప్ తీరు మారింది. ‘మీపై సీఐఏ నివేదిక గురించి ఏమంటార’ని ఏబీసీ చానెల్ మహిళా ప్రతినిధి ఒకరు సల్మాన్‌ను అడిగేసరికి ట్రంప్ మండి పడ్డారు. ‘అదంతా ఏం లేదు... ఖషోగ్గీ వివాదాస్పదుడు. ఈ ప్రశ్న వేసి అతిథిని అవమానిస్తావా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏబీసీ ‘ఫేక్ న్యూస్’ అంటూ దూషించారు. ఆయనతో పోలిస్తే సల్మాన్ నాగరికంగా మాట్లాడారు. తన ప్రమేయం లేదని వివరించారు. నిజానికి సౌదీ పెట్టుబడుల రాక అంత సులభం కాదు. ఇప్పటికే ఎఫ్–35లను వినియోగిస్తున్న ఇజ్రాయెల్ అభ్యంతరాలను కాదని సౌదీకి ఇవ్వటం అసాధ్యం. పైగా ఆ విమానాల కోసం 20 దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నా అమెరికన్ కాంగ్రెస్ వాటిని ఖరారు చేయలేదు. అణుశక్తి సాంకేతికత కూడా అంతే. సౌదీకి ఎఫ్–35లిస్తే వాటి సాంకేతికత చైనాకు చేరే ప్రమాదం ఉన్నదని ఇటీవలే అమెరికా రక్షణ గూఢచార సంస్థ హెచ్చరించింది.ఇన్ని అవరోధాలున్న ఒప్పందాల ద్వారా వేలాది ఉద్యోగాలు వచ్చిపడతాయని ట్రంప్ జనాన్ని మభ్యపెడుతున్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదవుతున్నా ట్రంప్ తాను ఇంకా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నాననుకుంటున్నారు. దేశాల మధ్య సంబంధాలకు లాభాలు, లోపాయికారీ ప్రయోజనాలే తప్ప విలువలు ఎవరికీ అక్కర్లేదని వర్తమాన ప్రపంచంలో కనబడుతూనే ఉంది. సల్మాన్ అమెరికా పర్యటన దాన్నే మరోసారి రుజువు చేసింది. -
మళ్లీ మొదటికి!
రాష్ట్ర ప్రభుత్వాలకూ, గవర్నర్లకూ తలెత్తే వివాదాల విషయంలో చివరకు కేంద్ర ప్రభుత్వానిదే పైచేయి అయింది. శాసనసభలు ఆమోదించాక రాష్ట్ర ప్రభుత్వాలు పంపే బిల్లుల్ని నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుకోవటాన్ని తప్పుబడుతూ మొన్న ఏప్రిల్‌లో తమ ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పును గురువారం సర్వోన్నత న్యాయస్థానపు రాజ్యాంగ ధర్మాసనం తప్పుబట్టింది. రాష్ట్రపతికీ, గవర్నర్లకూ గడువు విధించటం చెల్లదని అభిప్రాయపడింది.ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును నేరుగా ప్రస్తావించకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 ప్రశ్నల రూపంలో సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని కోరిన మీదట రాజ్యాంగ ధర్మాసనం తన ఉద్దేశాన్ని తెలియజేసింది. రాజ్యాంగ విధులు నిర్వర్తించే సందర్భంగా ఆచరణలో తలెత్తే సమస్యల విషయంలో ఏ పక్షానికీ గెలుపోట ములుండవు. మూడు వ్యవస్థల్లో ఏ ఒక్కటి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన ఆచరణ కనబరచకపోయినా అంతిమంగా నష్టపోయేది ప్రజలే. అలా చూస్తే రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయం కొంత నిరాశ కలిగిస్తుంది.గవర్నర్లకూ, ప్రభుత్వాలకూ తలెత్తే వివాదాలు జటిలమైనవి. ఎన్నికల సమయంలో పలు వాగ్దానాలు చేసి అధికారంలోకొచ్చిన పక్షం తన వాగ్దానాలు నెరవేర్చటం కోసం లేదా ప్రజల ప్రయోజనాల కోసం బిల్లులు తెస్తాయి. చట్టసభల్లో అవి ఆమోదం పొందు తాయి. తీరా గవర్నర్ల దగ్గర నెలల తరబడి పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. మరి ప్రజలిచ్చిన రాజకీయాధికారం ఏమై పోవాలి? కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ లేదా కూటమి పాలిస్తుంటే ఇలాంటి సమస్య తలెత్తదు. భిన్నమైన పరిస్థితులున్నప్పుడే ఇబ్బందులేర్పడుతున్నాయి.కేంద్రంలో యూపీఏ ఉన్నా, ఎన్డీయే ఉన్నా ఇదే ధోరణి. రాజ్యాంగ ధర్మాసనం కూడా ఈ సంగతిని గమనించింది. బిల్లుల్ని పరిశీలించటంలో రాష్ట్రపతి, గవర్నర్లు తీసుకునే వ్యవధికి ఒక స్థాయి ‘స్థితిస్థాపకత’ ఉంటుందని అంగీకరి స్తూనే దీర్ఘకాలం బిల్లును పెండింగ్‌లో పెట్టడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పడం కొంతవరకూ రాష్ట్రాలకు ఊరట.రాష్ట్రపతి సంధించిన ప్రశ్నలపై అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాం తప్ప ద్విసభ్య ధర్మాసనం లోగడ వెలువరించిన తీర్పుతో దీనికి సంబంధం లేదని రాజ్యాంగ ధర్మాసనం చెప్పడం గమనార్హం. గవర్నర్లు ఏళ్ల తరబడి బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టి ప్రజల ద్వారా ఎన్నికైన చట్టసభల్ని నిరర్థకంగా మార్చడం సరికాదని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో గవర్నర్లకు హితవు చెప్పింది. కానీ మారిందేమీ లేదు.అందుకే కావొచ్చు... ద్విసభ్య ధర్మాసనం రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద తనకు దఖలు పడిన అధికారాలను వినియోగించుకుంటూ బిల్లు ఆమోదానికి గవర్నర్లకూ, రాష్ట్రపతికీ మూడు నెలల గడువు విధించి, ఆ తర్వాత ఆమోదం పొందినట్టే భావించాలన్నది. ఇది సరి కాదని, ఇలా చేయటమంటే ఒక రాజ్యాంగ వ్యవస్థ మరో రాజ్యాంగ వ్యవస్థ అధికారాలను చేతుల్లోకి తీసుకోవటమే అవుతుందని ధర్మాసనం తెలిపింది.అదే సమయంలో గవర్నర్లు బిల్లులపై ఏదో ఒకటి చెప్పటానికి ‘హేతుబద్ధమైన వ్యవధి’కి మించి తీసుకుంటే మాత్రం సమీక్షించే అధికారం ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం చెప్పటం రాష్ట్రాలకు కొంత వరకూ ఉపశమనం. రాష్ట్రపతికిచ్చిన ప్రత్యుత్తరంలో ‘హేతుబద్ధమైన వ్యవధి’ అనడం తప్ప, దాన్ని ఎలా నిర్ధారించాలన్నది చెప్పలేదు. అదే జరిగుంటే గవర్నర్ల పెత్తనానికి కాస్తయినా అడ్డుకట్ట పడేది. రాజ్యాంగ ధర్మాసనం ఈ విషయంలో మౌనంగా ఉండి పోవటం వల్ల ఎప్పటిలాగే బిల్లు ఆగిపోయినప్పుడల్లా న్యాయస్థానాలను ఆశ్రయించక తప్పదు.రాజ్యాంగ అధికరణం 200 ప్రకారం తన ఆమోదం కోసం వచ్చిన బిల్లుపై గవర్నర్ ముందు మూడు ప్రత్యామ్నాయాలుంటాయి. ఆమోదించటం, రాష్ట్రపతి పరిశీలనకు పంపటం, వెనక్కి తిప్పిపంపటం. ఏ ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోవాలన్నది గవర్నర్‌కుండే విచక్షణాధికారం. కానీ ఇదంతా సవ్యంగా సాగకపోవటమే సమస్య. గవర్నర్ల నియామకాలు రాజకీయపరమైనవి అయినప్పుడు వారి నిర్ణయాలపైనా ఆ ప్రభావం పడుతుంది. చట్టం చేయటమే ఇందుకు పరిష్కారమని రాజ్యాంగ ధర్మాసనం అన్నది. కానీ అది జరిగే పనేనా?! -
నియామకాల వైకుంఠపాళీ!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీపీఎస్సీ) గ్రూప్–2 పోస్టులకు 2015–16లో చేసిన ఎంపికలు రద్దయ్యాయి. తప్పుడు మూల్యాంకనంతో చేసిన ఎంపికలు చెల్లవని మంగళవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు కొందరికి మోదం, మరికొందరికి ఖేదం మిగిల్చింది. జీవితంలో నిరుద్యోగ పర్వం సంక్లిష్టమైనది. ఎవరో కొందరు అదృష్టవంతులకు తప్ప దాన్నుంచి తప్పించుకోవటం సులభమేం కాదు. ఎలాగోలా దాటామనుకున్నంతలోనే, ఉద్యోగం వచ్చిందని సంబరపడేలోగానే అవకతవకలో, అవినీతో బయటపడి నియామకాలు రద్దుకావటం ఇటీవలి ధోరణి.పశ్చిమ బెంగాల్లో 2016లో పాఠశాల సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో కుంభకోణం చోటుచేసుకోవటంతో దాదాపు 26,000 మంది టీచర్ల నియామకాలు రద్దయ్యాయి. తొమ్మిదేళ్లపాటు ఉపాధ్యాయులుగా పనిచేసినవారు తిరిగి నిరుద్యోగులు కావటం ఎంత వైపరీత్యం! తప్పు చేసిన వారిని శిక్షించాలి తప్ప తమనెలా ఇళ్లకు పంపుతారని కొందరు చేసిన వినతిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే సక్రమంగా ఎంపికైనవారు కొత్త ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకూ కొనసాగవచ్చని వెసులుబాటిచ్చింది.అంటే అందరికందరూ నిరుద్యో గులై మళ్లీ తమ సత్తా చాటుకోవాలి. తెలంగాణ హైకోర్టు తీర్పు కొంతమేర నయం. గ్రూప్–2 పరీక్ష రద్దు కాలేదు. పునర్మూల్యాంకనం మాత్రమే జరుపుతారు. అయితే ఇన్నాళ్లూ ఉద్యోగస్తులుగా ఉన్నవారికి మళ్లీ ఫలితాలు వెలువడేవరకూ ఏం జరుగు తుందోనన్న గుబులు వెన్నాడుతుంది. అటు అప్పట్లో అవకాశాలు చేజారిన వారిలో ఆశలు చిగురిస్తాయి. నియామక బాధ్యతలు చూసే సంస్థలు అత్యంత జాగరూకతతో మెలగకపోతే, నిబంధనలను పాటించకపోతే యువతకు ఇలాంటి కష్టాలు తప్పవు.1,032 పోస్టులకు 2016 నవంబర్‌లో జరిగిన పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం నియమించిన సాంకేతిక కమిటీ 2017లో సిఫార్సులు చేసింది. వాటిని శ్రద్ధగా అమలు చేస్తే వివాదమే తలెత్తేది కాదు. ఆ విషయంలో మొదట సింగిల్ జడ్జి బెంచ్, అటుతర్వాత ద్విసభ్య ధర్మాసనం తీర్పులిచ్చినా అందుకు విరుద్ధంగా జరగటం వల్లే పునర్మూల్యాంకనం చేయాలని జస్టిస్ భీమపాక నగేశ్ ధర్మాసనం ఆదేశించాల్సి వచ్చింది.శ్రద్ధగా చదువుకుని పట్టభద్రులైనా ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పరీక్షల్లో సైతం కృతార్థులైతే తప్ప నిరుద్యోగ పర్వాన్ని దాటడం అసాధ్యం. ఇందుకోసం అమ్మానాన్నల్ని వదిలి, నగరాల్లో ఉండే కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తారు. స్థోమతకు మించి వేలాది రూపాయలు వెచ్చించి, తినీ తినకా రాత్రింబగళ్లు కష్టపడతారు. తీరా ఆ పరీక్షలు లాటరీ లాంటివి. శ్రద్ధపెట్టి చదివిన అంశాలు రాకపోవచ్చు. అంత ముఖ్యం కాదనుకున్నవి పరీక్ష పత్రంలో ప్రత్యక్షమై సవాలు చేస్తాయి. వీటికి నియామక సంస్థల నిర్లక్ష్యం తోడైతే చెప్పేదేముంది? ఇస్తున్న ప్రశ్నపత్రం, దానికి జోడించాల్సిన ఓఎంఆర్ షీట్లపై నిర్వాహకులకే అవగాహన కొరవడితే అభ్యర్థులకూ, ఇన్విజిలేటర్లకూ ఏం చెబుతారు?అప్పటికప్పుడు పరీక్ష హాల్లో ఏదో ఒకటి నిర్ణయించి అమలు చేయించటం వల్ల అంతిమంగా నష్టపోయేదెవరు? అభ్యర్థి వ్యక్తిగత వివరాల విషయంలో చిన్న చిన్న పొరపాట్లుంటే మన్నించవచ్చని, పార్ట్ట్–బిలోని ప్రశ్నలకు సంబంధించి జవాబులకు వైట్నర్ వాడినా, తుడిచే ప్రయత్నంచేసినా మూల్యాంకనం చేయొద్దని కమిటీ చేసిన సిఫార్సునే పాటించాలని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం చెప్పినా బేఖాతరు చేయటం సరైందేనా? తమ ఇష్టానుసారం మూల్యాంకనం కానిచ్చి, నియామకాలు పూర్తి చేయటం సమస్యాత్మకమవుతుందని, అర్హులైనవారికి అన్యాయం జరుగుతుందని కమిషన్‌కు తెలియదా? నాలుగైదేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నవారు కమిషన్ నిర్వాకం వల్ల నియా మకాలు రద్దయి, అయోమయంలో పడ్డారు. దిద్దుబాట్లకూ, వైట్నర్ వినియోగానికీ, డబుల్ బబ్లింగ్కూ పాల్పడినవారూ మళ్లీ పరీక్షల సాగరంలో ఈదక తప్పదు. మొదటే అన్నీ సక్రమంగా పాటించి మూల్యాంకనం పూర్తిచేసి ఫలితాలు ప్రకటించివుంటే ఇంతమంది నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయేవారు కాదు. కమిషన్‌లో జవాబుదారీ తనం కొరవడటం వేలాది మందికి శాపం. -
విశ్వసనీయత లేని విచారణ!
అందరూ అనుకున్నట్టే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశంలోని ‘అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్’ సోమవారం మరణశిక్ష విధించింది. ఆమెతోపాటు అప్పటి హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు సైతం ఇదే శిక్ష పడింది. నిరుడు ఆగస్టులో విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడ్డాక ఆమె బంగ్లా వదిలి మన దేశంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పుడామెను తమకు అప్పగించాలంటూ తాత్కాలిక ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని కోరింది. అధికారంలో కొనసాగాలన్న లక్ష్యంతో హసీనా అనేక అవకతవకలకు పాల్పడటం, వ్యతిరేకుల్ని జైలుపాలు చేయటం, న్యాయమైన ఉద్యమాలను సైతం ఉక్కుపాదంతో అణిచేయటం వాస్తవం. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్నవారి తీరుతెన్నులు కూడా ఏమంత మెరుగ్గా లేవు. ‘పేదవాళ్ల బ్యాంకర్’గా పేరు తెచ్చుకుని 2006లో నోబెల్ బహుమతి సాధించిన ఆర్థికవేత్త మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉంటున్నారు. కానీ ప్రభుత్వ పగ్గాలు ఆయన చేతుల్లో ఉన్న దాఖలా కనబడదు. తాత్కాలిక ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వంలో మతతత్వ వాదుల ప్రాబల్యం పెరిగింది. మైనారిటీ హిందువులకూ, మహిళలకూ, హసీనా హయాంలో బాధ్యతలు నిర్వర్తించిన నేతలకూ, ఉన్నతాధికారులకూ గడ్డు పరిస్థితులేర్ప డ్డాయి. ఆఖరికి న్యాయమూర్తులుగా పనిచేసినవారిని సైతం వేధించి, రాజీనామాలు చేయించారు. ఆరోపణలొచ్చినప్పుడల్లా అవి అవాస్తమని ప్రకటించటం తప్ప యూనస్ చేసిందేమీ లేదు. బహుశా ఇలాంటి పరిణామాల వల్ల కావొచ్చు... యూనస్‌కు హోంశాఖ ప్రత్యేక సహాయకుడిగా ఉన్న ఖుదాబక్ష్ చౌధురి సెలవు పేరిట ఇటీవల దేశం వదిలిపోయారు. హసీనాకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంపై జరిగిన కాల్పుల్లో ఐక్యరాజ్యసమితి లెక్క ప్రకారమే 1,400 మంది మరణించారు. వేలాదిమంది గాయపడ్డారు. కానీ వాటిపై విచా రణ జరిపి శిక్షించటానికి తాత్కాలిక ప్రభుత్వానికి హక్కూ, అధికారం ఉన్నాయా? బంగ్లా రాజ్యాంగంలో తాత్కాలిక ప్రభుత్వం అనే ఏర్పాటే లేదు. పోనీ హఠాత్తుగా ప్రధాని దేశం విడిచిపోయారు గనుక ఆపద్ధర్మంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనుకున్నా, ఏడాదిలోగా ఎన్నికలు ఎందుకు జరపలేకపోయారు? అసలు హసీనాపై తీర్పు సందర్భమే కక్షపూరిత మైనది. ఈ నెల 14న తీర్పు ఇవ్వబోతున్నట్టు పక్షం రోజుల క్రితం ‘ట్రైబ్యునల్’ ప్రకటించింది. తర్వాత దాన్ని 17కు మార్చారు. ఆ తేదీ ఆమె పెళ్లి రోజు కావటం తప్ప మరేమీ కారణం లేదు. ఇలాంటి చౌకబారు ఎత్తుగడలతో సాధించదల్చుకున్నదేమిటో?!తూర్పు పాకిస్తాన్... బంగ్లాదేశ్‌గా ఏర్పడి 54 ఏళ్లవుతోంది. ఆ సందర్భంగా పాక్ పాలకులపై సాగిన పోరాటంలో పాలుపంచుకుని, బంగ్లాదేశ్ ఆవిర్భావ అనంతరం తొలి ప్రధాని ముజిబుర్ రెహ్మాన్‌తో సన్నిహితంగా పనిచేసిన యూనస్ ఇప్పుడు పాక్ అను కూల శక్తులతో చేతులు కలిపారు. పాక్ నేతలకూ, సైనికాధికారులకూ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అచ్చం వారిలానే మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. నిజానికి హసీనా, యూనస్ 2007 వరకూ కలిసి పనిచేశారు. ఆ సంవత్సరం అప్పటి అధ్యక్షుడు లాజుద్దీన్ అహ్మద్ ఆత్యయిక స్థితి ప్రకటించినప్పుడు సైన్యం తిరగబడి ఆయన్ను తొలగించింది. ఆ తర్వాత అవినీతిపై పోరాటం చేస్తామన్న సైనిక పాలకులకు యూనస్ మద్దతు పలకటంతో ఇద్దరి మధ్యా చెడింది. అటు తర్వాత ఏర్పడిన హసీనా ప్రభుత్వం యూనస్‌ను ఇబ్బందుల పాలు చేసింది. 172 కేసుల్లో విచారణను ఎదుర్కొనటం, ఒక కేసులో శిక్ష కూడా పడి బెయిల్‌పై ఉండటం వగైరాలు సాగాయి. పదవీ భ్రష్టత్వం ప్రాప్తించింది గనుక హసీనా ప్రభుత్వ అణచివేత చర్యలన్నీ ఆమెకు చుట్టుకున్నాయి. ఆ ఉద్యమం విఫలమైతే ఇవాళ విద్యార్థి నాయకులు, కొందరు రాజకీయ నాయకులు దోషులుగా నిలబడవలసి వచ్చేది. బంగ్లాలో అవామీ లీగ్ ప్రాబల్యం తగ్గి నట్టు లేదు. తీర్పు వెలువడటానికి ముందే అక్కడక్కడ హింస చోటుచేసుకుంది. సోమవారం ఢాకా పూర్తిగా స్తంభించింది. హసీనాపై వచ్చిన ఆరోపణల విషయంలో విచారణ జరగాల్సిందే. కానీ ఆ పని ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ద్వారా జరగాలి. దేశంలో ప్రజా స్వామిక వాతావరణం ఏర్పడాలి. ఇవేమీ లేని విచారణలు, శిక్షలు ప్రజల్లో విశ్వసనీయత కలిగించలేవు. -
మాయమైపోతున్న మనిషి
మనిషి నడక చిత్రంగా ఉంటుంది. అతను ముందుకు వెడుతున్నాననుకుంటాడు, కానీ అతనికి తెలియకుండానే అడుగులు వెనక్కి పడుతూ ఉంటాయి. అది తెలుసుకునే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. ఉదాహరణకే చూడండి: మనిషి పుడుతూనే మనిషి కాలేదు. ఇతర జంతుజాలంలానే తనూ పుట్టాడు; తనలాంటివాళ్ళతో గుంపు కట్టాకే మనిషయ్యాడు, పదిమందిలో ఒకడిగా ఉంటేనే తనకూ, పదిమందికీ కూడా భద్రత అని తెలుసుకున్నాడు. గణంగా మారాడు, సమాజంగా ఎదిగాడు, రాజ్యంగా అవతరించాడు, సామ్రాజ్యంగా విస్తరించాడు. మళ్ళీ తనే దేశంగా మారే క్రమంలో సరిహద్దులు గీసుకుని సాటి మనుషుల్ని దూరం పెట్టే తిరోగమనమూ చిత్తగించాడు. మనిషి హోమోసేపియన్స్ పేరిట ఆధునిక మానవుడిగా అవతరించే నాటికే ఈ భూగోళం సువిశాలం. భూమ్మీద మానవ జనాభా లక్షల సంఖ్యకు చేరడానికి కూడా చాలా కాలం పట్టిందని శాస్త్రవేత్తలు అంటారు. మనుషుల గుంపుల మధ్య అనంతమైన దూరం ఉండేది. ఆ దూరాన్ని తరించడానికి కాలాన్ని జయించవలసివచ్చేది. ఆయుర్దాయం ముప్పై, నలభయ్యేళ్ళను మించేది కాదు కనుక, అందుకొక జీవితకాలం కూడా చాలేది కాదు. గణాల మధ్య అల్లుకున్న బంధుత్వాలు, ప్రేమలు, స్నేహాలు దూరాల్ని చెరిపి మనుషులను మానసికంగా దగ్గర చేసేవి. పసిఫిక్ మహాసముద్రంలోని టోబ్రియాండ్ దీవిజనం నౌకల మీద వెళ్ళి వెయ్యి మైళ్ళదూరంలో ఉన్న గణబంధువుల్ని కలిసి వాళ్ళకు కానుకలు ఇచ్చి రావడాన్ని ఒక పవిత్రమైన యజ్ఞంలా ఎలా జరిపేవారో ప్రముఖ మానవ శాస్త్రవేత్త బోనిస్లా మలినోవ్స్కీ రాస్తాడు. విచిత్రంగా, వాటికి ‘కులయాత్ర’లని పేరు. తరగని దూరాలు ఉన్నప్పుడు మానసికంగా మమతలు పెంచుకుంటూ దగ్గరగా ఉన్న మనుషులు, దూరాలు మాయమై భౌతికంగా దగ్గరగా ఉన్నా కూడా దూరమయ్యే స్థితికి చేరుకున్నారు. మహానగరాలు, పట్టణాలలో బహుళ అంతస్తుల గృహ సము దాయాల్లో ఏళ్ల తరబడిగా కలసి ఉంటున్నా ఒకరికొకరు తెలియని పరిస్థితికి వచ్చారు. తమ ఉమ్మడి భద్రత కోసం, తమను కలిపి ఉంచడం కోసం తమే సృష్టించుకున్న వ్యవస్థలే తమను విడదీసేవయ్యాయి. బ్రిటిష్ ఏలుబడిలో న్యాయస్థానాల ఏర్పాటు జరిగిన తర్వాత చిన్నాచితకా వివాదాలపై కూడా కోర్టుకు వెళ్ళడం ఎలా వేలంవెర్రిగా మారిందో, చివరికది కుటుంబ సభ్యుల్లోకి కూడా పాకి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ఎలా ఛిద్రం చేసిందో ఆ కాలపు ఉదంతాలు కళ్ళకు కట్టిస్తాయి. ఓ కుటుంబంలో ఆస్తి తగాదా పుట్టి ఏకంగా తల్లీ, కొడుకులే కోర్టు కెక్కారట. వాయిదాకు పొరుగూరు వెళ్లవలసి వచ్చి నప్పుడు ఇద్దరూ కలిసే వెళ్ళేవారట. ఒకే సత్రంలో దిగేవారట. కొడుకు బయట ఎక్కడా భోజనం చేయడు కనుక తల్లే వండిపెట్టేదట! రాను రాను, శాస్త్రసాంకేతిక విజ్ఞానాల చేతిలో మనుషులు మరబొమ్మలయ్యారు. బంధుత్వాలూ, స్నేహాలూ ముఖాముఖీ అభివ్యక్తికి దూరమై మొబైల్ తెరకు పరిమితయ్యే పలకరింపులవుతున్నాయి. సాహిత్య రంగానికే వస్తే, ‘పాట’ దశను దాటి ‘రాత’ దశకు చేరడాన్ని పురోగమనంగా చెప్పుకోవడం పరిపాటి అయింది. కానీ నిజానికి పాటే కాదు, ఆట కూడా సమూహ చింతన నుంచి, సమష్టి చైతన్యం నుంచి పుడితే; రాత వైయక్తిక స్పందన నుంచి పుట్టింది. సమూహం నుంచి విడివడి మనిషి ఒంటరి అయ్యే ఆ పరిణామాన్ని పురోగమనమనాలో, తిరోగమనమనాలో తేల్చుకోలేక పోవడమే మానవ జీవనంలోని మహా వైచిత్రులలో ఒకానొకటి. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ/మచ్చుకైనా లేడు చూడూ’ అనే పాట కొద్ది రోజులుగా తెలుగునాట వాడవాడలా వినిపిస్తూ, గుండె గుండెనూ తట్టిలేపడం చూశాం. తనే నిలువెత్తు పాటగా మారి, జనంలోకి వెళ్ళి, మనిషి మనిషిలో మోగి హఠాత్తుగా మన మధ్య నుంచి మాయమైన మనకాలపు పాటల గంధర్వుడు అందెశ్రీ కట్టిన పాట అది. ‘ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా... అవసరాలకు మనిషి సృష్టించిన రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా... కదిలె విశ్వం తనా కనుసన్నలో నడువా, కనుబొమ్మ లెగరేసి కాలగమనం లోన’ మనిషి మాయమై పోతున్నడమ్మా అని హెచ్చరిస్తున్న ఆ పాట నిజానికి సందేశ పరంగా మానవ జాతీయ గీతాలలో ఒకటి కాదగినదీ, విశ్వవేదిక మీద వినిపించవలసినదీ. -
మరి హంతకులెవరు?
తమ కంటి దీపాలు హఠాత్తుగా కనుమరుగైనప్పుడు తల్లితండ్రులకు ఒక్కసారిగా చుట్టూ ఉన్న ప్రపంచం కుప్పకూలినట్టవుతుంది. తమ పంచప్రాణాలనూ ఎవరో పిండేసినట్టు విలవిల్లాడిపోతారు. ఢిల్లీ శివారులో ఉన్న నోయిడా సమీపంలోని నిఠారి గ్రామంలో 19 ఏళ్ల క్రితం జరిగింది ఇదే. తప్పిపోయిన పిల్లలు ఇద్దరు దుర్మార్గుల చేతుల్లో కడతేరి పోయారని దర్యాప్తు అనంతరం సీబీఐ తేల్చి, న్యాయస్థానం ఉరిశిక్షలు కూడా విధించాక... దాదాపు రెండు దశాబ్దాలు గడిచాక కేసు వీగిపోతే? ఈ కేసులో ఒక దోషి వ్యాపారవేత్త మణిందర్ సింగ్ పంథేర్ లోగడే నిర్దోషిగా బయటపడగా... పదమూడు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని 12 కేసుల్లో నిర్దోషిగా తేలి, ఒక కేసులో మాత్రం యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న మరో దోషి సురేందర్ కోలీ సైతం నిరపరాధేనని తాజాగా సర్వోన్నత న్యాయస్థానం తేల్చింది. శిక్షలు పడినప్పుడు, మరీ ముఖ్యంగా ఉరిశిక్ష పడిన తీవ్రమైన కేసుల్లో కేవలం ఊహల ఆధారంగా దోషాన్ని నిర్ధారించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో కేవలం కోలీ ఒప్పుకోలు ప్రకటన, కూరగాయలకు ఉపయోగించే చాకు తప్ప సాక్ష్యాధారాలెక్కడని ప్రశ్నించింది. జాతీయ స్థాయిలో పతాకశీర్షికలకెక్కిన ఈ కీలక కేసు విషయంలో పేలవమైన దర్యాప్తు సాగిందంటే ఎవరిని నిందించాలి? 2006 చివరిలో వెల్లడైన ఈ ఉదంతం దేశం మొత్తాన్ని కుదిపేసింది. మొదట 8 మంది ఆడపిల్లలకు సంబంధించినవిగా భావించిన మానవ కంకాళాలు మురికి కాల్వలో లభ్యమైనప్పుడు అంతకు రెండు మూడేళ్ల ముందు మాయమైన తమ పిల్లలకు సంబంధించినవే కావొచ్చని పేద కుటుంబాలు తల్లడిల్లాయి. ఛానెళ్లు అంతంత మాత్రంగానే ఉన్న ఆ కాలంలో కూడా మీడియాలో వెలువడే కథనాలు చదివి, విని దేశం దిగ్భ్రాంతి చెందింది. పిల్లల్ని ప్రలోభపెట్టి తీసుకెళ్లి అత్యాచారాలు చేసి హతమార్చారని, అందులో ఒక టీనేజ్ యువతి కూడా ఉందని దర్యాప్తులో వెల్లడైంది. మొత్తంగా 22 మంది కంకాళాలు దొరికాయని అప్పట్లో చెప్పారు. తాను ఆరుగురు పిల్లలపై, ఒక యువతిపై అత్యాచారాలు జరిపి హతమార్చానని కోలీ తెలిపాడు. అతను ఇచ్చిన సమాచారంతో ఇంటి సమీపంలో తవ్వినప్పుడు మృతదేహాలు లభ్యమయ్యాయన్నారు. ఈ వ్యవహారంలో అపహరణ, అత్యాచారం, హత్య, సాక్ష్యాధారాల ధ్వంసం మాత్రమే కాక నరమాంస భక్షణ, శరీరాంగాల కోత, శవసంభోగం వగైరాలున్నాయి.ఇందుకు ఒక డాక్టర్ సహకరించాడని అరెస్టు చేయగా, అతనిపై మొదట్లోనే కేసు వీగి పోయింది. హతమార్చటానికి ముందు ఈ పసిపిల్లలతో నీలిచిత్రాలు తీశారన్న కథనా లొచ్చాయి. పంథేర్ ఇల్లు ‘భయంకరమైన కొంప’గా ముద్రపడింది. 12 కేసుల్లో కోలీని దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధించారు. వాటన్నిటినీ అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న మరో కేసులో సైతం ఇప్పుడు నిర్దోషిగా బయటపడ్డాడు. పదిహేనేళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో పంథేర్ 2009లో విడుదలయ్యాడు.న్యాయస్థానాలు ఒక రకంగా నిస్సహాయమైనవి. దర్యాప్తు తీరును కూలంకషంగా పరిశీలించి, నిందితులపై ఉన్న సాక్ష్యాధారాలేమిటో చూసి తీర్పునిస్తాయి తప్ప మీడియా కథనాలనుబట్టో, దర్యాప్తు సంస్థల లీకుల ఆధారంగానో వ్యవహరించవు. ఈ కేసులో ప్రశ్నార్థక ఒప్పుకోళ్లు, వాటి ఆధారంగా మీడియా సంచలన కథనాలే తప్ప దర్యాప్తు సక్రమంగా జరగలేదని ధర్మాసనం వెలువరించిన తీర్పే చెబుతోంది. ఏమాత్రం పసలేని ఆరోపణల ఆధారంగా కోలీకి శిక్ష విధిస్తే న్యాయవిఘాతం చేసినవారమవుతామనీ, న్యాయప్రమాణాలకు ఈ ఆధారాలు ఏమాత్రం నిలబడలేవనీ న్యాయమూర్తులు అనటం గమనార్హం. నేర నిర్ధారణలో ఎంతో అభివృద్ధి సాధించిన ఈ దశలో కూడా దేశం మొత్తాన్ని కుదిపేసిన కేసులో వైఫల్యం చెందటం దురదృష్టకరం. పంథేర్, కోలీలిద్దరూ నిర్దోషులు సరే... మరి అసలు హంతకులెవరు? వారు ఇప్పటికీ చట్టానికి దొరక్కుండా తప్పించుకుంటున్నారనుకోవాలా? కనీసం దేశవ్యాప్తంగా దర్యాప్తు విభాగాలన్నీ ఈ ఉదంతాన్ని ఒక గుణపాఠంగా స్వీకరించి మున్ముందు మరింత జాగరూకతతో మెలగటం అవసరమని గుర్తిస్తే మంచిది. -
మళ్లీ ఉగ్రవాద పంజా!
సరిగ్గా పదమూడేళ్ల తర్వాత దేశ రాజధాని నగరంపై ఉగ్రవాదం పంజా విసిరిన ఆనవాళ్లు కనబడుతున్నాయి. చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన సోమవారం నాటి ఘటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సే ఉన్నా, దాని తీరుతెన్నులు గమనిస్తే అది ఆత్మాహుతి దాడే కావొచ్చనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం దీని వెనక కుట్రఉండొచ్చని చెప్పడం గమనించదగ్గది. గత పక్షం రోజులుగా జమ్మూకశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో పోలీసులు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని అరెస్టు చేసి, 2,913 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవటం... ఆ సంగతిని ప్రకటించిన కొన్ని గంటలకే ఢిల్లీ పేలుడు ఘటన సంభవించటం గమనిస్తే వీటిమధ్య పరస్పర సంబంధం ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. అరెస్టయిన ఉగ్రవాదుల్లో తమ సహచర వైద్యులు ముగ్గురున్న సంగతి తెలిశాక పోలీసుల చక్రబంధం నుంచి తప్పించుకుని పరారవుతూ కావాలని ఆత్మాహుతి దాడికి దిగారా, లేక మరో లక్ష్యాన్ని చేరుకోవటం కోసం వెళ్తుండగా అనుకోకుండా పేలుడు సంభవించిందా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 13కి చేరటం, గాయపడినవారిలో పలువురి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటం పేలుడు తీవ్రతను చాటుతోంది. తమ చర్యల ద్వారా సమాజంలో భయోత్పాతాన్ని సృష్టించటం, అందుకోసం జన సమ్మర్దం గల ప్రాంతాలను ఎంచుకోవటం ఉగ్రవాదుల అలవాటు. తమ మతిమాలిన చర్య వల్ల ఏ వర్గాలవారు బలవుతారు, ఎన్ని కుటుంబాలను విషాదంలో ముంచెత్తుతామన్న విచక్షణ ఉగ్రవాదుల కుండదు. వీరి ఉన్మాదానికి తోపుడు బళ్లు నడిపేవారు, ఆటో డ్రైవర్లు, పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని సొంతగూటికి చేరటం కోసం వెళ్తున్న సామాన్య పౌరులు, దగ్గర్లోని దుకాణదారులు బలయిపోయారు. పేలుడు తర్వాత ఎటుచూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలూ, తెగిపడిన కాళ్లూ చేతులూ కనబడ్డాయి. కొన్ని సెకన్ల క్రితం జీవంతో తొణికిసలాడిన మనుషులు ఛిద్రమైన శరీరాలతో ఆర్తనాదాలు చేస్తూ శోకించటం... కొందరు భయంతో పరుగులు పెట్టడం, అయినవారి జాడ కోసం మరికొందరు వెదుకులాడటం తలుచుకుంటేనే గగుర్పాటు కలిగించే భీతావహ దృశ్యం.ఏదైనా ఘటన జరిగినప్పుడు అది తమ పనేనని చెప్పుకోవటం అలవాటున్న ఉగ్రవాదులు 24 గంటలు గడిచినా కిమ్మనకపోవటం అయోమయాన్ని సృష్టించటానికే కావొచ్చనిపిస్తోంది. సాధారణంగా పేలుడు జరిగిన మూడు నాలుగు గంటల్లో ఘటన స్థలిలో లభ్యమయ్యేవాటి ఆధారంగా కారకుల విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకొస్తారు. కానీ ప్రస్తుత ఘటనలో కొంత సమయం తీసుకోకతప్పదని ఎన్ఐఏ భావించి ఉండొచ్చు. వాస్తవానికి మొదట్లో వాహనంలోని సీఎన్జీ ట్యాంక్ పేలివుండొచ్చనుకున్నా, ఆ వాహనం యజమాని పుల్వామా వాసిగా అర్ధరాత్రికి ధ్రువపడటం, క్రయవిక్రయాల సమయంలో తప్పుడు పత్రాలు దాఖలు చేశాడని తేలడం ఉగ్రవాద ప్రమేయాన్ని సూచిస్తోంది. కేంద్రం తీసుకున్న అనేక చర్యల పర్యవసానంగా ఉగ్రదాడులు దేశంలో గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఢిల్లీలో 2012లో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం దగ్గర జరిగిన పేలుడు ఘటన తర్వాత మరేదీ చోటుచేసుకోలేదు. 2008 నాటి ముంబై పేలుళ్ల ఘటన తర్వాత ఎన్ఐఏను ఏర్పర్చటం, నిఘా వ్యవస్థను పటిష్ఠపరచటం, అందుకోసం ప్రత్యేకంగా జాతీయ నిఘా గ్రిడ్(నేట్గ్రిడ్) రూపకల్పన, అక్రమ ద్రవ్య చలామణీ నిరోధక చట్టాన్నీ, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టాన్నీ మరింత కఠినతరం చేస్తూ సవరణలు తీసుకురావటం ఉగ్రవాదం నియంత్రణకు గణనీయంగా తోడ్పడ్డాయి. అయితే ఎక్కడో ఒకచోట ఏర్పడే చిన్నపాటి ఉదాసీనత అయినా భారీ మూల్యం చెల్లించక తప్పదని తాజా ఉదంతం రుజువు చేస్తోంది. అరెస్టయిన ఉగ్రవాదుల్ని ప్రశ్నించాక పాకిస్తాన్ ప్రమేయం కనబడటాన్ని బట్టి ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత కూడా అది తన వెనకటి గుణాన్ని విడనాడలేదని అర్థమవుతోంది. అన్ని స్థాయుల్లోనూ మరింత అప్రమత్తత అవసరమని ఢిల్లీ పేలుడు ఘటనైనా, ఉగ్రవాదుల అరెస్టులైనా వెల్లడిస్తున్నాయి. -
బాలోత్సవం
కథ పుట్టడమూ, పిల్లల కథ పుట్టడమూ వేరుగా జరిగివుండదు. పిల్లల కంటే బాగా ‘ఊ’కొట్టగలిగేవారెవరు! పిల్లలను మైమరిపించడానికే పెద్దలు కథలు అల్లివుంటారు. ఆ వంకతో తమ చిన్నతనంలోకీ జారుకునివుంటారు! చిన్నతనానికీ పెద్దరికానికీ ఉన్న స్పష్టమైన తేడా: బాల్యంలో ఊహలకు సంకెళ్లుండవు. తార్కిక పరిమితి కలలను అణిచి వేయదు. ఎంత సాగితే అంత, ఎంత చూస్తే అంత, ఎంత కావాలనుకుంటే అంత. అక్కడ ఆశలు అనంతం. రెక్కలు అమాంతం. కప్పలు పకపకా నవ్వొచ్చు. కుందేళ్లు చకచకా మాట్లాడొచ్చు. కాకులు నీతులు చెప్పొచ్చు. జింకలు కోతలు కోయొచ్చు.పిల్లల కథ అనేది మబ్బుల్లోకి గెంతించే మాయా కిటికీ. సముద్రం అడుగుకు ఈదనిచ్చే గాలి పడవ. ప్రతి తరమూ తర్వాతి తరానికి అవసరమయ్యే వివేకపు రాశిని కథల రూపంలోనే బదిలీ చేస్తుంది. లోకాన్ని ఎదుర్కోవడానికి అవసరమయ్యే కాఠిన్యాన్ని అందులోనే కూరి ఉంచుతుంది. ఈసప్ కథలు, పంచతంత్రం కథలు, వెయ్యొన్నొక్క రాత్రుల అరేబియన్ కథలు, జంగిల్ బుక్, కాంచన ద్వీపం, గలివర్ సాహసయాత్రలు, ‘చందమామ’ కథల నుంచి; టామ్ శాయర్, నొప్పి డాక్టర్, లిటిల్ ప్రిన్స్, హాబిట్, హారీ పాటర్ దాకా పిల్లల మనో ప్రపంచపు ఎల్లలను విశాలపరిచినవే! కథల వల్ల పిల్లలకు ఊహాశక్తి పెరుగుతుంది, సమస్యా పరిష్కారం తెలుస్తుంది, భాష అబ్బుతుంది, వ్యక్తీకరణ అలవడుతుంది, లోకరీతి అర్థమవుతుంది, ప్రపంచపు భిన్నత్వం పట్ల అవగాహన కలుగుతుంది, సాటి జీవుల పట్ల సానుభూతి కలుగుతుంది, తమ సాంస్కృతిక వారసత్వపు గొప్పతనం అనుభవంలోకి వస్తుంది, అన్నింటికీ మించి అమితమైన ఆనందం దొరుకుతుంది. జీవితపు సంరంభంలోంచి వచ్చే ఆనందానికి అదనంగా, మనిషికి ఉన్న మరో ఆనందపు వనరు కథలు కాక మరేమిటి?అసలు పిల్లల కథలు పిల్లలకు కలిగించే ప్రయోజనాలన్నీ పెద్దలకు కూడా కలిగిస్తాయి. ఏం పెద్దల్లో మాత్రం పిల్లలు బజ్జునిలేరా? అంతెందుకు, ఆరిస్టాటిల్ లాంటి తత్వవేత్త కూడా నిజమైన మంచి జీవితం గడపడం కోసం కాల్పనికత అవసరాన్ని సమర్థించాడు. అసలు సాధ్యం కానిది కూడా ఊహించగలగడం అవసరమని ఆయన వాదించాడు. టాల్‌స్టాయ్ లాంటి మహారచయిత కూడా పిల్లల కోసం కథలు రాశాడు. కాకపోతే ఇదీ నీతి అంటూ ప్రత్యేకంగా చెప్పకూడదనీ, కథ ద్వారా పిల్లలు తమకు కావాల్సింది తాము తీసుకుంటారనీ అన్నాడు. మీరు ఎంతపెద్దవాళ్లయినా బాలసాహిత్యాన్ని చదవాలంటుంది కాథెరీన్ రండెల్ అనే బాలసాహిత్య రచయిత్రి. పిల్లల పుస్తకాలు మనం మర్చిపోయిన విషయాలనే కాదు, మనం మర్చిపోయామని మర్చిపోయిన విషయాలను కూడా గుర్తుచేస్తాయంటుందామె.లండన్‌లోని థేమ్స్ నదిలో పడవ షికారుకు పోయినప్పుడు తన వెంటున్న స్నేహితుడి ముగ్గురు కూతుళ్లకు ఓ కథ చెప్పాడట లూయిస్ కరోల్. అందులో అలీస్ లిడ్డెల్ అనే పదేళ్ల పాప కూడా ఉంది. ఒక రోజు నది ఒడ్డున విసుగ్గా కూర్చున్న ‘అలీస్’కు కోటు తొడుక్కుని, గడియారం పెట్టుకున్న ఒక తెల్ల కుందేలు కనబడటమూ, దానివెంట ఆమె ఆ కుందేలు బొరియలోకి పోవడమూ, అక్కడ్నుంచి వింతలూ విచిత్రాలూ... వాహ్! విన్నవెంటనే దాన్ని తనకోసం రాసిపెట్టమందట అలీస్. అట్లా ‘అలీస్(స్) అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్’ పుస్తకంగా రూపుదాల్చింది. 1865 నవంబర్‌లో తొలిసారి ప్రచురితమైన దీనికి ఈ నెలలోనే 160 ఏళ్లు వచ్చాయి. జంతువులు జంతువుల్లా ఉండకుండా, మనుషులు మనుషుల్లా కాకుండా ప్రవర్తించే సాహిత్యాన్ని ‘నాన్సెన్స్ లిటరేచర్’ అని వర్గీకరించడం ఉంది. దాన్ని నిరర్థకమైనదని కాకుండా, హేతువుకు అందని అర్థవంతమైన సాహిత్యం అన్న అర్థంలో చూడాలి. అందుకేనేమో, ఇకనుంచీ బాల సాహిత్యానికీ తమ అవార్డు ఇవ్వనున్నట్టు బుకర్ ఫౌండేషన్ ఇటీవలే ప్రకటించింది. 8–12 ఏళ్ల చిన్నారులను ఉద్దేశించి రాసే ఉత్తమ రచనకు ‘చిల్డ్రెన్స్ బుకర్ ప్రైజ్’ పేరుతో యాభై వేల పౌండ్లు ఇవ్వనున్నారు. బాలసాహిత్యం అనేది తీసేయదగినది కాదనీ, బాలసాహితీ వేత్తలు తక్కువ రచయితలేమీ కారనీ చెప్పే ఘనమైన వార్త ఇది. కాదామరి... నేటి బాలలే రేపటి ప్రపంచ నిర్మాతలు. -
ట్రంప్‌కు ‘బ్యాలెట్’ షాక్!
తొమ్మిది నెలల క్రితం అధికారంలోకొచ్చింది మొదలు ఇంటా బయటా విపరీత పోకడలతో, వింత నిర్ణయాలతో బెంబేలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తొలిసారి ఓటర్లు షాకిచ్చారు. ఆయన సోషలిస్టు, కమ్యూనిస్టు అంటూ ఈసడించుకున్న 34 ఏళ్ల యువకుడు జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా మంచి మెజారిటీతో ఎన్నికయ్యారు. మరోపక్క నిరుడు అధ్యక్ష ఎన్నికల్లో డెమాక్రటిక్ పార్టీకి మొహం చాటేసిన వర్జీనియా, న్యూజెర్సీ రాష్ట్రాలు గవర్నర్ ఎన్నికల్లో తిరిగి ఆ పార్టీ వైపు మొగ్గాయి. ఆ రెండు చోట్లా డెమాక్రాట్ల తరఫున పోటీచేసిన మహిళా అభ్యర్థులు మికీ షెరిల్, అబిగైల్ స్పాన్‌బెర్గర్ ఘనవిజయం సాధించారు. క్యాలిఫోర్నియాలో ప్రతినిధుల సభకూ, సెనేట్ సీట్లకూ జిల్లాల హద్దులు నిర్ణయించే పోలింగ్‌లో సైతం డెమాక్రాట్లదే పైచేయి. ఈ లెక్కన వచ్చే ఏడాది ప్రతినిధుల సభకూ, సెనేట్‌లోని కొన్ని స్థానాలకూ జరగబోయే ఎన్నికలపై రిపబ్లికన్లు ఆశ వదులుకోవాల్సి రావొచ్చు. ట్రంప్ దూకుడుతో చేష్టలుడిగిన డెమాక్రటిక్ పార్టీకి ఓటర్లే ఊపిరి పోశారని ఫలితాల సరళి చెబుతోంది. న్యూయార్క్ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని స్థాయిలో 20 లక్షల మందిపైగా ఓటు హక్కు వినియోగించుకోవటమైనా, వారిలో సగంమందికి పైగా మమ్దానీ పక్షాన నిలవటం అయినా అసాధారణం. న్యూయార్క్ వందేళ్ల చరిత్రలో ఆయనది ప్రత్యేకమైన రికార్డు. ముస్లిం కావటం, భారతీయ మూలాలున్న వ్యక్తి అయివుండటం, చిన్న వయసులో కీలక పదవికి చేరుకోవటం రికార్డు. విజేతలు ముగ్గురూ కావడానికి డెమాక్రాట్లే అయినా భిన్న దృక్పథాలున్నవారు. గవర్నర్లుగా ఎన్నికైన షెరిల్, స్పాన్‌బెర్గర్ మధ్యేవాదులు కాగా, మమ్దానీ వామపక్ష భావాలున్నవారు. నమ్ముకున్న మధ్యేవాదాన్ని విడనాడితే తప్ప ఉనికి ఉండబోదన్న ఆందోళనలో డెమాక్రాట్లున్న తరుణంలో మొన్న ఫిబ్రవరిలో మేయర్ అభ్యర్థిత్వం కోసం పార్టీలో జరిగిన పోటీలో మమ్దానీ నిలిచారు. అప్పటికి ఆయనకు నిండా ఒక శాతం ఓట్లు కూడా లేవు. పైగా పోటీపడింది పార్టీలో సంవత్సరాలుగా పాతుకుపోయి, గవర్నర్‌గా ఎంతో అనుభవం గడించిన ఆండ్రూ కూమోతో. కూమోకు ఐశ్వర్యవంతుల దన్నుంది. పైగా రిపబ్లికన్లకూ, డెమాక్రాట్లకూ అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలున్నా యూదుల ఓటు బ్యాంక్‌ను దృష్టిలో ఉంచుకుని ఇజ్రాయెల్‌నే సమర్థిస్తారు. అలాంటి పార్టీలో మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ పాలస్తీనాలో ఇజ్రాయెల్ ఊచకోతను వ్యతిరేకించటం, మానవ హక్కుల హననాన్ని నిరసించటం సామాన్యం కాదు. ఆ పని మమ్దానీ చేయగలిగారు. దీంతోపాటు వలసదారులపై ట్రంప్ కత్తిగట్టడాన్ని బాహాటంగా ఖండించారు. ఇదంతా పార్టీకి చేటు తెస్తుందని స్వపక్షంలోనే అనేకులు లబలబలాడారు. కానీ మమ్దానీ దృఢంగా నిలబడ్డారు. కనీస అవసరాలైన తిండిగింజలు, గూడు, ఆరోగ్యం అందుబాటు ధరల్లో ఉండాలన్న నినాదంతో ముందు కెళ్లారు. పార్టీలో తన రేటింగ్‌ను డబుల్ డిజిట్‌కు తీసుకెళ్లారు. సర్వేల్లో సైతం ముందంజలో ఉన్నారు. దీంతో ట్రంప్ బెదిరింపులకు దిగారు. న్యూయార్క్‌కు ఫెడరల్ నిధులు ఆపేస్తాననీ, నగరం సర్వనాశనమవుతుందనీ హెచ్చరించారు. కానీ జనం బేఖాతరు చేశారు. వలసలపై యుద్ధం చేస్తున్న ‘మాగా’ ఉద్యమకారులు, రిపబ్లికన్లకు వారిదైన ‘రెడ్ బుక్’ రాజ్యాంగం ఉంది. దాని సాయంతో విశ్వవిద్యాలయాల్లోనూ, రోడ్లపైనా చెలరేగిపోతున్నారు. ఈ ఎన్నికల్లో వారిది చిత్రమైన అవస్థ. ట్రంప్ నేరుగా స్పందించాలా లేదా అన్నది వారు తేల్చుకోలేకపోయారు. సంప్రదాయ ఓట్లు రాలాలంటే ట్రంప్ స్పందించి తీరాలి. తీరా ఓటమి పాలైతే ట్రంప్‌పై రిఫరెండమ్ అవుతుంది. చివరకు ఆయన మమ్దానీపై నిప్పులు చెరిగారు. సొంత పార్టీ అభ్యర్థి సిల్వాను కాదని కూమో వైపు మొగ్గారు. కానీ వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. అందుకే ఈ ఓటమి పాపం ట్రంప్‌కి చుట్టుకుంది. అధికారం శాశ్వతమని విర్రవీగే దేశ దేశాల పాలకులకూ ఈ ఫలితాలు ఒక హెచ్చరిక. మందబలంతో చెలరేగితే చివరకు అధోగతేనని ఈ ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయి. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 30 రాష్ట్రాలు రిపబ్లికన్లకు నీరాజనం పట్టి ఏడాది కాలేదు. ట్రంప్ తన నియంత పోకడలతో దాన్నంతటినీ కాలదన్నుకున్నారు. చేసుకున్నవారికి చేసుకున్నంత! -
సభాహక్కుల పేరుతో ఎలాపడితే అలా చేయడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: శాసనసభ హక్కులు రాజ్యాంగంలో నిర్దేశించిన సూత్రాలకు లోబడే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. సామాన్యులకు ఏ చట్టాలైతే వర్తిస్తాయో, అవే చట్టాలకు అనుగుణంగా సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాలు, సభ నిర్ణయాలు కూడా ఉంటాయని తేల్చిచెప్పింది. సభా హక్కుల పేరుతో ఎలాపడితే అలా వ్యవహరించడానికి వీల్లేదని పేర్కొంది. పార్లమెంట్ లేదా శాసనసభలు, వాటికి సంబంధించిన కమిటీలు కూడా సాధారణ చట్టాలకు లోబడే ఉంటాయంది. అవేమీ చట్టాలకు అతీతం కాదని స్పష్టం చేసింది. చట్టం చేసేవారు కూడా అదే చట్టానికి లోబడి ఉండాలని, అంతే తప్ప ప్రజల కోసం రూపొందించే చట్టాల అమలు నుంచి వారు మినహాయింపు పొందలేరని తెలిపింది.‘‘ఎంతటి భారీ మెజార్టీ ఉన్నప్పటికీ ప్రతి శాసనసభకు చట్టాలు సమానంగా వర్తిస్తాయి. కాబట్టి సభా హక్కుల తీర్మానంపై తీసుకునే తుది నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడే ఉంటుంది. కోర్టు న్యాయ సమీక్ష చేసే సమయంలో సభా హక్కుల ఉల్లంఘన జరిగిందని నిరూపించాల్సిన బాధ్యత హక్కులకు భంగం కలిగిందన్న సభ, వ్యక్తిదే. ఈ విషయాన్ని సీతాసోరెన్ కేసులో సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. శాసనసభ, సభా హక్కుల కమిటీ రాజ్యాంగ సూత్రాలను, చట్టపరమైన పరిమితులను గుర్తెరిగి సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది’’ అని పేర్కొంది.సభా హక్కుల కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ బి.ఫణికుమార్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇచ్చింది కేవలం షోకాజ్ నోటీసు మాత్రమేనని, అనంతరం చాలా దశలు ఉంటాయని, అందువల్ల ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవి వ్యాఖ్యానించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మంగళవారం తీర్పు వెలువరించారు. ‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు... షోకాజ్ నోటీసు జారీ ఎమ్మెల్యేలకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించాలని శాసనసభ వర్గాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించాయి. ఎమ్మెల్యేలు, అతిథులకు హోటళ్లు, భోజనాలు, బహుమతులు తదితరాల కోసం భారీగా ఖర్చు చేశారు. అయితే, లోక్‌సభ స్పీకర్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఆ ఖర్చంతా వృథా అయింది. దీనిపై ‘సాక్షి’ ఫిబ్రవరి 22న ‘రూ.కోట్లు ఖర్చు... శిక్షణ తుస్సు’ శీర్షికన కథనం ప్రచురించింది. కంగుతిన్న అధికార పార్టీ నేతలు ‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు చేపట్టారు. పత్రిక కథనం సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, దానిని తాను సభలో ప్రస్తావించేందుకు అనుమతించాలని టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య ఫిబ్రవరి 25న అసెంబ్లీ స్పీకర్‌ను కోరుతూ నోటీసు ఇచ్చారు. స్పీకర్ ఈ వ్యవహారాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించారు. దాని ఆదేశాల మేరకు ‘సాక్షి’కి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ షోకాజ్ నోటీసులు జారీచేశారు. పాలనాపరమైన అంశాలపైనే కథనం ఎమ్మెల్యే ఇచ్చిన నోటీసుతో పాటు, సెక్రటరీ జనరల్ ఇచ్చిన షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ ఫణికుమార్ జూన్‌లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్, వి.మహేశ్వర్‌రెడ్డి, అనూప్ కౌషిక్ వాదిస్తూ... సభలో జరిగిన విషయాలపై ‘సాక్షి’ కథనం రాయలేదని, పాలనాపరమైన అంశంపైనే ప్రచురించిందని, దాని కారణంగా ఎవరి హక్కులకూ భంగం వాటిల్లలేదని, ఆ కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు రాదని వివరించారు.శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పిటిషనర్లకు ఇచ్చింది కేవలం షోకాజ్ నోటీసు మాత్రమేనన్నారు. వారి వివరణ తీసుకున్న తరువాత పలు దశలు ఉంటాయని, వివరణతో సభా హక్కుల కమిటీ సంతృప్తి చెందితే తదుపరి చర్యల ఉపసంహరణకు సిఫారసు చేయవచ్చన్నారు. ‘సాక్షి’ కథనం «ధిక్కారం కిందకే వస్తుందని కమిటీ భావించినా అంతిమంగా నిర్ణయం శాసన సభనే తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. షోకాజ్ నోటీసుల దశలో కోర్టుల జోక్యం తగదని, ఈ వ్యాజ్యాలను తోసిపుచ్చాలని కోరారు. పౌరులను కాపాడే రక్షణ కవచమే రాజ్యాంగం ‘‘పౌరుల హక్కులను ప్రభావితం చేసేలా రాజ్యాంగ వ్యవస్థలు ఏకపక్ష, అన్యాయ నిర్ణయాలు తీసుకుంటే, వాటి నుంచి కాపాడే రక్షణ కవచమే రాజ్యాంగం. అధికరణ 194 కింద... రాష్ట్ర అసెంబ్లీలు తీసుకునే నిర్ణయాలు పౌరుల హక్కులను ప్రభావితం చేస్తుంటే, అవి కచ్చితంగా న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి. సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి జారీచేసే షోకాజ్ నోటీసులు పలు దశల్లో చట్టపరమైన పరిశీలనకు లోబడి ఉంటాయి.సభా హక్కుల కమిటీ మొదట పిటిషనర్ల వివరణను పరిగణనలోకి తీసుకుని, తదుపరి చర్యలను ఉపసంహరించాలని శాసనసభకు సిఫారసు చేయవచ్చు. అలాకాకుండా పిటిషనర్ల వంటి పౌరులకు వ్యతిరేకంగా కమిటీ సిఫారసు చేసినప్పటికీ, శాసనసభ పిటిషనర్లు సమర్పించిన వివరణను, ఆధారాలను పరిగణనలోకి తీసుకుని స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
పాఠాలు నేర్వని ప్రభుత్వం
ఎంతో భక్తి ప్రపత్తులతో ఆలయ సందర్శనకొచ్చేవారికి కనీస రక్షణ చర్యలు తీసుకో వటం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వానికి చేతగాదని మరోసారి నిరూపణయింది. భక్తులందరూ పవిత్రంగా భావించే కార్తిక ఏకాదశి రోజైన శనివారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో రెయిలింగ్ ఊడిపడి తొక్కిసలాట జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయిన తీరు ఆయన ఏలుబడికి అద్దం పడుతోంది. ఈ విషాద ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు. వెనువెంటనే ఘటనాస్థలికొచ్చిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కొన ఊపిరితో ఉన్న కొందరికి సీపీఆర్ చేయటంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన చొరవ కారణంగానే అంబులెన్స్‌లు వచ్చి గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించాయి. లేకుంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగేది. రాష్ట్రంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకొచ్చాక ఇలాంటి దుర్ఘటన జరగటం ఇది మూడోసారి. ఈ ఏడాది జనవరిలో పుణ్యక్షేత్రమైన తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ, ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేయటంలో చూపిన నిర్లక్ష్యం పర్యవసానంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. మరో 43 మంది గాయ పడ్డారు. శతాబ్దాల చరిత్ర కలిగిన తిరుపతిలో ఇటువంటి దారుణం జరగటం అదే ప్రథమం. అటు తర్వాత మార్చిలో సింహాచల క్షేత్రంలో అక్షయ తృతీయ సందర్భంగా ఎంతో వేడుకగా జరిగే చందనోత్సవంలో తొక్కిసలాట చోటు చేసుకుని ఏడుగురు చనిపోయారు. 2015లో ఇదే చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయన కారణంగా, ఆయన సమక్షంలో రాజమహేంద్రవరంలో పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 మంది బలయిపోయారు. అనుకోని దుస్సంఘటనలు జరిగినప్పుడు వెనువెంటనే బాధ్యులెవరో గుర్తించి చర్య తీసుకోవటానికి పాలకులు ఉద్యుక్తులవుతారు. బాబు ఒక్కరు మాత్రం కబురు తెలిసిన వెంటనే సాకుల కోసం వెదుకుతారు. ఇలాంటివి సర్వసాధారణమేనన్న తర్కానికి దిగుతారు. పుష్కరాలు మొదలుకొని తిరుపతి, సింహాచలం తొక్కిసలాటల వరకూ ఆయన బాణీ అదే. ఇప్పుడు కూడా దాన్నే తు.చ. తప్పకుండా పాటించారు. కాశీబుగ్గ ఆలయం ప్రైవేటు వ్యక్తిదట. ఆ రోజు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని పోలీసులకు సమాచారం లేదట. ఇంకా నయం... కార్తిక ఏకాదశి రోజున ఆలయాలకు భక్తులొస్తారను కోలేదని అనలేదు! ఇంతకూ తిరుపతి, సింహాచలంలో తొక్కిసలాటలు చోటుచేసుకున్న ప్రాంగణాలు ఎవరి అధీనం లోనివి? చాలాముందుగా తెలిసినా అక్కడ బాబు సర్కారు ఒరగబెట్టిందేమిటి? పోలీసుల సంగతలా ఉంచి అనుకోనిది జరిగితే ముందుకు రికేందుకు అంబులెన్స్‌లూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలనైనా అందుబాటులో ఉంచగలిగారా? మరి ఎవరిని వంచించటానికి ఈ మాటలు? టీడీపీ వందిమాగధ మీడియా ఆయన్ను మించిపోయింది. ఫలానా రోజొచ్చే పర్వదినం మళ్లీ జన్మలో రాదని సోషల్ మీడియాలో ఊదరగొట్టేవారు పెరిగి పోవటం వల్లే ఈ దురదృష్టకర సంఘటన జరిగిందట! పర్వదినాలేవో పంచాంగాలే చెబుతాయి. దేవదాయ శాఖ ఆలయమైనా, ప్రైవేటు ఆలయమైనా భక్తులు క్యూ కడతారు. చెప్పినా చెప్పకున్నా ఏర్పాట్లు చేయటం ప్రభుత్వ బాధ్యత. చంద్రబాబు గుర్తించారో లేదోగానీ, తెలియదు... చెప్పలేదు అనే రోగానికి మూలం మరోచోట ఉంది. ‘నలుగురు కూడిన కాడ నరలోకం యముడుండు’ అని గద్దర్ ఒక పాటలో అన్నట్టు పదిమంది జమయితే పోలీసులు అనుమానంగా చూస్తారు. అది నిరసనైనా, ఉత్సవమైనా, ఊరేగింపైనా వారి స్పందన ఒకేలా ఉంటుంది. అంతమంది గుమిగూడటానికి ముందస్తు అనుమతులున్నాయా అని ఆరా తీస్తారు. తగిన చర్యలు తీసుకుంటారు. ఇంటెలిజెన్స్ విభాగం నిమగ్నమయ్యేది అలాంటి సమాచార సేకరణ లోనే. మరి బాబు రక్షకభటులేం చేశారు? డాక్టర్ సీదిరి అప్పలరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు సహాయచర్యల్లో పాల్గొంటుండగా ప్రత్యక్షమయ్యారు. రాజకీయ కక్ష సాధింపులకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసేచోట, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలయ్యేచోట ఇంతకన్నా మెరుగ్గా పోలీసులు వ్యవహరిస్తారని ఆశించలేం. ఇప్పటికైనా బాబు తెలివి తెచ్చుకుని సవ్యంగా పాలించటం మొదలెట్టాలి. జనం ప్రాణాలు అరచేత బట్టుకుని ఉత్సవాలకెళ్లే్ల దురవస్థ నుంచి తప్పించాలి. -
రహదారుల మృత్యువేగం
మళ్లీ నడిరోడ్డు నెత్తుటి మడుగైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో సోమవారం తెల తెలవారుతుండగా ఎదురుగా దూసుకొచ్చిన టిప్పర్ 19 మంది బస్సు ప్రయాణికుల నిండు జీవితాలను కబళించింది. చదువుల కోసం వస్తున్నవారూ, ఉద్యోగాల నిమిత్తం బస్సెక్కినవారూ, ఉపాధి ఆశించి బయల్దేరినవారూ, వైద్య చికిత్స కోసం ఎదురు చూస్తున్నవారూ... అందరికందరూ మృత్యుదాహంతో దూసుకొచ్చిన టిప్పర్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలవారు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. అది పేరుకు జాతీయ రహదారే కానీ, అడుగడుగునా గుంతలు. స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సిగ్నళ్లు మచ్చుకైనా లేక జిల్లా రోడ్డు కన్నా ఘోరంగా ఉంటుంది. పర్యవసానంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయినా జడత్వం వదుల్చుకోని అధికార యంత్రాంగం తీరువల్ల ప్రమాదాలు నిత్యకృత్య మయ్యాయి. తెలంగాణ ఆవిర్భవించిన ఈ పదకొండేళ్ల చరిత్ర చూసినా ఈ రహదారిపైనే 300 మంది జీవితాలు ముగిసిపోయాయంటే ఎవరిని నిందించాలి? వేగాన్ని అదుపు చేయలేని స్థితిలో టిప్పర్లోని కంకర లోడంతా బస్సు ప్రయాణికులను కమ్మేసింది.అందుకే మృతుల సంఖ్య భారీగా ఉంది. జాతీయ హరిత ట్రైబ్యునల్ కేసు వల్ల రహదారి విస్తరణ పనుల ప్రారంభంలో జాప్యం చోటుచేసుకున్నదని అధికారులు చెబుతున్న మాట పాక్షిక సత్యం. పదేళ్ల క్రితం రహదారిని విస్తరించాలనుకున్నప్పుడే అక్కడ వందలాది ఊడలు దిగిన మర్రి చెట్లున్నా యనీ, వాటి తొలగింపు వివాదమవుతుందనీ అంచనా ఉండాలి. ఆ వృక్షాలకు ఇబ్బంది కలగని రీతిలో రహదారి కోసం ప్రత్యామ్నాయ స్థలమైనా చూడాలి లేదా వాటిని వేరే చోటుకు తరలించి విశాలమైన రహదారి నిర్మాణానికి పూనుకోవాలి. అది వారి బాధ్యత. ఆ విషయంలో ముందస్తు కసరత్తేమీ జరగలేదని జరిగిన పరిణామాలు గమనిస్తే అర్థమవుతుంది. అనాలోచితంగా విస్తరణ పనులకు పూనుకోవటం, సమస్యాత్మకం అయ్యేసరికి నిస్సహాయత ప్రదర్శించటం దారుణం.పర్యావరణ ప్రేమికులు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించేవరకూ చెట్ల తొలగింపును అధికారులు నిజంగానే సమస్యగా పరిగణించలేదా? ఈ విషయంలో జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పాలకవర్గం ఇప్పటికే ఎంతో అనుభవం గడించివుండాలి. రహదారి డిజైన్ సమయంలో అదంతా మంట గలిసిందా? పర్యావరణంపై చైతన్యం పెరిగిన వర్తమానంలో చెట్ల తొలగింపును ఎవరూ అడ్డుకోరన్న భరోసా ఎక్కడిది? ఈ విషయంలో సంజాయిషీ చెప్పాలి. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవటం, పనులకు ఆటంకం కలిగాక తీరిగ్గా హామీలిచ్చి ట్రైబ్యునల్‌లో స్టే తొలగింప జేసుకునే ప్రయత్నం చేయటం కారణంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో వారు గమనించుకున్నారా?ప్రమాదాలు జరిగినప్పుడల్లా పాలకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పరి హారం కూడా ప్రకటిస్తున్నారు. మంచిదే. కానీ దేశవ్యాప్తంగా వందలాది మంది ఉసురు తీస్తున్న ఈ వాహనాల అదుపు కోసం ఏం యోచిస్తున్నారు? ఇప్పుడొస్తున్న వాహనాల డిజైన్లన్నీ పాశ్చాత్య దేశాల రోడ్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించినవి. మన దేశంలో అసలే రోడ్లు అంతంత మాత్రం. జాతీయ రహదారులు కూడా ఇలా అక్కడక్కడ సమస్యా త్మకంగానే ఉంటున్నాయి. అటువంటి రోడ్లపై రాకెట్ వేగంతో దూసుకెళ్లే వాహనాలను అనుమతించటం సబబేనా? కనీసం పెద్ద పెద్ద బండరాళ్లు, కంకర వగైరా లోడ్ మోసుకెళ్లే టిప్పర్ల వేగాన్నయినా పరిమితం చేయాల్సిన అవసరం లేదా?సరిగ్గా చేవెళ్ల వద్ద ప్రమాదం చోటుచేసుకున్న రోజే రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక టిప్పర్ పెనువేగంతో పోయి పలు వాహనాలను ఢీకొన్న ఉదంతంలో 14 మంది మరణించారు. మొన్న సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియా ట్రక్కు రాంగ్రూట్లో పోయి కారును ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇసుక, గ్రానైట్, కంకర, నాపరాళ్లు వగైరా వ్యాపారాల్లో టిప్పర్లు అవసరాన్ని మించి లోడ్ మోసుకెళ్లటం, పెనువేగంతో పోవటం తరచూ కనబడుతోంది. వీటి నియంత్రణకు నిబంధనలు రూపొందించకపోతే, ఈ అరాచకాన్ని నిలువరించకపోతే జనం క్షమించరు. -
కూసింత కళాపోషణ
కళలు మానవానుభూతుల అభివ్యక్తి సాధనాలు. కళలు మానవ నాగరిక ప్రస్థానానికి సాక్షీభూతాలు. కళలు మానవుల సౌందర్య పిపాసకు నిదర్శనాలు. కళలు మానవుల సృజన సామర్థ్యానికి తార్కాణాలు. కళలు సామాజిక సంస్కృతికి ప్రతిబింబాలు. కళలకు చోటు లేని సమాజం మరుభూమితో సమానం. ప్రపంచవ్యాప్తంగా నాగరికతలతో పాటే కళలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. రాజ్యాలు ఏర్పడ్డాక కళలకు ప్రోత్సాహం పెరిగింది. రాజాదరణ పొందిన కవులు, కళాకారులు లోటు లేని భద్రజీవితాలను గడుపుతూ, కళాసృజన చేసేవారు. కళల పట్ల అభిరుచి గల రాజులు కవులకు, కళాకారులకు కనకాభిషేకాలు సహా ఘన సత్కారాలు చేసేవారు. రాజులే కాక సమాజంలోని సంపన్న కులీనులు కూడా కళాకారులను ఆదరించేవారు. కళాపోషణ సమాజంలో ఒక హోదా చిహ్నంగా ఉండేది. తెలుగునాట కళాపోషణకు అనేక ఉదాహరణలు మన చరిత్రలో కనిపిస్తాయి. కవి సార్వభౌముడు శ్రీనాథుడు రాజాస్థానాలలో అనేక ఘనసత్కారాలను పొందాడు. ‘దీనార టంకాల తీర్థమాడించితి/ దక్షినాధీశు ముత్యాల శాల’ అని శ్రీనాథుడు స్వయంగా చెప్పు కున్నాడు. శ్రీనాథుడికి దీనార టంకాలతో కనకాభిషేకం చేసిన రాజు ప్రౌఢదేవరాయలు. శ్రీనాథుడి తర్వాత కనకాభిషేకం పొందిన మరో కవి అడిదం సూరకవి. శ్రీనాథుడికి శతాబ్దాల తర్వాతి వాడు అడిదం సూరకవి.విజయనగరం ఆస్థానానికి వెళ్లిన అడిదం సూరకవి ఆ రాజ్యానికి రాజైన పూసపాటి విజయరామరాజును పొగుడుతూ, ‘రాజు కళంకమూర్తి రతిరాజు శరీరవిహీను డంబికా/ రాజు దిగంబరుడు మృగరాజు గుహాంతర సీమవర్తి వి/ భ్రాజిత పూసపాడ్విజయ రామ నృపాలుడు రాజు కాక ఈ/ రాజులు రాజులా పెను తరాజులు కాక ధరాతలంబునన్’ అని పద్యం చెప్పాడు. విజయరామరాజు సూరకవి పొగడ్తకు మురిసి ముక్కలై, కనకా భిషేకం జరిపాడు. అయితే, ఈ కవిరాజుది మరీ విడ్డూరమైన కథ. ‘స్నానము చేసిన ఉదకమును పానము చేయలేను’ అని చెప్పి, కనకాభిషేకంలో వాడిన బంగారు నాణేలను తీసుకోవడానికి నిరాకరించాడు. అడిదం కవి ఆత్మాతిశయానికి మెచ్చిన విజయరామ రాజు తగురీతిలో ఘనసత్కారం జరిపి, ఆయనను సాగనంపాడట! తెలుగునాట కనకా భిషేకాల కాలం బహుశా అడిదం కవితోనే అంతరించింది.ఎందరో రాజులు రాజ్యాలను ఏలారు. వారిలో చాలామంది చరిత్రలో కలిసి పోయారు. ఆ రాజులలో కొద్దిమంది మాత్రమే ఇంకా జనాలకు గుర్తున్నారు. కారణం ఒక్కటే! వారి ఏలుబడిలో జరిగిన కళాపోషణ. కళాపోషణ బాగా ఉన్న రాజ్యాలలో ప్రశాంతత ఉండేది. నిత్యం అంతర్బహిర్ కలహాలతో అట్టుడికిపోయే రాజ్యాలలో కళలు ఉన్నా; వాటి ఆదరణకు, పోషణకు ఆస్కారం అతి తక్కువ. రాచరికాల కాలంలో కూడా రాజాదరణ పొందిన కళాకారులే సుభిక్షంగా జీవించగలిగేవారు. అయితే, రాజాశ్రయం పొందడం అంత తేలికగా ఉండేది కాదు. అప్పట్లోనూ అనేక రాజకీయాలు ఉండేవి.కృష్ణదేవరాయల ఆస్థానంలో చోటు పొందడానికి తెనాలి రామకృష్ణుడు అష్టకష్టాలు పడిన కథలు ఇంకా ప్రచారంలో ఉన్నాయి. యోగ్యులైన కవులు, కళాకారులకు ఇవ్వాలనే ఉద్దేశం రాజుకు ఉన్నా, అతడి ఈవిని సాగనివ్వని వారు చుట్టూ ఉండేవారు. వారు తమకు పోటీ రాగల ఇతరులను రానివ్వకుండా నిరోధించేవారు. ఇలాంటి వారి గురించే ‘ఇయ్యగ నిప్పించగల/ యయ్యలకే గాని మీసమందఱకేలా?/ రొయ్యకు లేదా బారెడు...’ అని చౌడప్ప నిరసించాడు.కళాపోషణ అంటే చాలామందికి ‘ముత్యాలముగ్గు’ సినిమాలోని రావు గోపాలరావు డైలాగు గుర్తుకొస్తుంది. ఆ మాదిరిగా కానీ ఖర్చులేని కళాపోషణ ఎవరైనా చేయగలరు గాని, ఖర్చుకు వెనుకాడకుండా కళాపోషణ చేయాలంటేనే కళాహృదయం ఉండాలి. వర్తమాన కాలంలో ఐర్లండ్ ప్రభుత్వానికి అలాంటి కళాహృదయమే ఉంది. అందుకే కవులు, రచయితలు, కళాకారుల ఆర్థిక సుస్థిరత కోసం నెలకు 1500 యూరోలు చెల్లించే పథకాన్ని ఇటీవల ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికశక్తి అయిన మన దేశంలో ఇలాంటి పథకాన్ని కనీసం కలలోనైనా ఊహించగలమా! -
అన్నీ ఉన్నా... అరచేతిలో అలజడి!
అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో గెలవడం పెద్ద విశేషమేమీ కాదు. గెలవడానికి అవసరమైన వనరులన్నీ వారికి పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. సాధారణ ఎన్నికలకు ఇంకో రెండు మూడేళ్ల గడువు ఉన్న సందర్భాల్లో ఆ ప్రాంతంలో ఉండే ప్రభావశీల వర్గాలు కూడా అధికార పార్టీకి అనుకూలంగా మెలగడం చూస్తూనే ఉన్నాము. స్థానిక సమస్యల పరిష్కారానికి కదలిక వచ్చే అవకాశముంటుందన్న ఆశ సహజం కనుక అధికార పార్టీ వైపు కొంత మొగ్గు ఉంటుంది. అధికార దుర్వినియోగమనే ఆయుధాన్ని కూడా పాలకపార్టీలిప్పుడు యథేచ్ఛగా వాడేస్తున్నాయి.తెలంగాణలో మొన్నటి సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు మునుగోడు అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరిగింది. అప్పటికే బీఆర్ఎస్ తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం పరుచుకుంటున్న దశ అది. బీజేపీ తరఫున పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డికి నియోజకవర్గంలో గణనీయమైన పలుకుబడి ఉన్నది. అర్థబలం, అంగబలం కూడా ఆయనకు దండిగానే ఉన్నాయి. అయినప్పటికీ అధికార పార్టీకి ఉండే వనరుల దన్నుతో బలమైన రాజగోపాల్‌రెడ్డిని బీఆర్ఎస్ ఓడించ గలిగింది.అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల పదవీకాలం మిగిలే ఉన్న దశలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ఎదుర్కొంటున్నది. పార్టీ తరఫున పదిమంది మంత్రులు, పలువురు ఎంపీలు, 30 మంది ఎమ్మెల్యేలు నియో జకవర్గ వ్యాప్తంగా జాతర చేస్తున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు, నేటి ప్రజా ప్రభుత్వాలు తలుచుకుంటే డబ్బులకు కరువేముంటుంది? బీసీ రిజర్వేషన్ల అంశం మీద రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఉద్యమానికి సన్నాహాలు జరుగుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న బలమైన బీసీ వర్గం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నట్లు రౌడీషీటరా? సంఘసేవకుడా? అనే మీమాంసను పక్కనబెడితే కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ అక్కడ అంతో ఇంతో పలుకుబడి ఉన్న వ్యక్తే.సంఘ సేవకులకు మాత్రమే టిక్కెట్లిస్తామనే నియమాన్ని దేశంలో ఏ రాజకీయ పార్టీ పెట్టుకోకపోవడం ఒక నయా వాస్తవి కత. రౌడీషీటర్, యాంటీసోషల్ వగైరా టైటిళ్లు బలహీన వర్గాలకు లభించినంత సులభంగా ఉన్నత వర్గాలకు లభించవు. అదేవిధంగా కొన్ని బిరుదులూ, సత్కారాలూ ఉన్నత వర్గాలకు లభించినంత తేలిగ్గా బలహీన వర్గాలకు దక్కవు. ఇదొక సామాజిక రీతి. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో వలసవచ్చిన ప్రజలు నివాసం ఏర్పరచుకున్న ప్రాంతం కనుక, దాదాపు లక్షమంది అపార్టుమెంట్లలో నివసిస్తున్న భద్రలోకులు కనుక రౌడీషీటర్ ప్రచారం వల్ల తమకు మేలు జరుగుతుందని బీఆర్ఎస్ శ్రేణులు నమ్మకంతో ఉన్నాయి.మైసూర్ పాక్‌లో మైసూర్ ఉండదనే కుళ్లు జోకు తరహాలోనే హైదరాబాద్‌లోనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ ఉండదు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాలు ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. శ్రీనగర్ కాలనీ, మధురా నగర్, యూసఫ్‌గూడ, వెంగళరావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ వంటి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతోపాటు షేక్‌పేట, రహ మత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ వంటి కార్మికులు, చిరుద్యో గులు ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. మొత్తం ఓటర్లలో ఇరవై ఐదు శాతం మంది ముస్లిం మైనారిటీలు. మజ్లిస్ పార్టీ తన అభ్యర్థిని రంగంలోకి దించకుండా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యన ప్రధాన పోటీ ఉన్న సందర్భాల్లోనే ముస్లిం ఓటు కాంగ్రెస్‌కు పడే సంప్రదాయం ఉన్నది. రెండు సెక్యులర్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉన్నప్పుడు ముస్లిం ఓటు ఏకపక్షంగా ఉండదు.జూబ్లీ హిల్స్‌లో బీజేపీ అభ్యర్థి రంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్–కాంగ్రెస్‌ల మధ్యనే నెల కొన్నట్టు ప్రచార పర్వంలో నిరూపితమైంది. ముస్లిం ఓటు కూడా ఏకపక్షంగా లేదని అర్థమైనందువల్లనే హఠాత్తుగా అజారుద్దీన్‌కు మంత్రిపదవి నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకున్నట్టు తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ముస్లిం మైనారిటీకి ఒక మంత్రి పదవి ఇవ్వాలనేది కాంగ్రెస్ సంకల్పమైతే ఇంతకు ముందే ఈ నిర్ణయాన్ని తీసుకొని ఉండేది. కొత్తగా ముగ్గుర్ని మంత్రివర్గంలోకి తీసుకున్న సందర్భంలోనే వారికే ప్రాతినిధ్యం కల్పించి ఉండేది. అలాకాకుండా ఉప ఎన్నిక పోలింగ్‌కు సరిగ్గా పది రోజుల ముందు అజారుద్దీన్ చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం కచ్చితంగా అనైతిక చర్యగానే భావించవలసి ఉంటుంది.అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఓటరు కాక పోవచ్చు. కానీ ఆ నియోజకవర్గం నుంచి గత సాధారణ ఎన్ని కల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా కూడా పార్టీ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆయనకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించిన పార్టీ ప్రచార రంగంలో మైనారిటీ ఓటుపై భరోసా కనిపించకపోవడం వల్లనే ఇప్పుడు ఆదరాబాదరాగా మంత్రి పదవి కట్టబెట్టిందనే వాదనలో ఔచిత్యం కనిపిస్తున్నది. క్రీడారంగంలో దేశానికి అజర్ చేసిన సేవకు గుర్తింపుగానే ఆయనకు మంత్రిపదవి ఇచ్చినట్టు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో పస లేదు. అటువంటి గ్రహింపు కేవలం పోలింగ్‌కు పది రోజుల ముందే కలగడమేమిటనే ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదు.ఆరు మాసాల్లోగా అజర్ భాయ్ శాసనమండలికో, శాసనసభకో ఎన్నిక కావలసి ఉన్నది. లేకపోతే ఈ మంత్రి పదవి ఆరు నెలల ముచ్చటగానే మిగిలిపోతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో క్రికెటర్‌గా ఆయనపై జీవితకాల నిషేధం కొనసాగుతున్నది. హెచ్‌సీఏ అధ్యక్షునిగా ఉన్న కాలంలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయన క్రిమినల్ కేసును ఎదు ర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ కోటాలో ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి కేంద్రం ఏ మేరకు సహక రిస్తుందనేది అనుమానమే. గడువులోగా ఏదో సభకు ఎన్నిక కానట్టయితే ‘దేశానికి అజర్ చేసిన సేవలకు’గాను ఆయన్ను కాంగ్రెస్ పార్టీ అవమానించినట్టవుతుంది.మజ్లిస్ మద్దతు కారణంగా గుండుగుత్తగా పడే మైనారిటీ ఓట్లతో జూబ్లీ హిల్స్ గెలుపు తమకు నల్లేరుపై బండి నడకే కాగలదని కాంగ్రెస్ పార్టీ తొలుత భావించినట్టుంది. క్షేత్ర స్థాయిలో ఏదో తేడా కొట్టడంతోనే హడావిడిగా అసందర్భంగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారనే అభిప్రాయం బల పడుతున్నది. బీజేపీ అభ్యర్థిని ప్రధాన పోటీదారుగా నియోజక వర్గ ప్రజలు భావించడం లేదు. అందువల్ల అక్కడ మతపరమైన పోలరైజేషన్ ఏమాత్రం కనిపించడం లేదు. ప్రధాన పోటీ దార్లుగా కనిపిస్తున్న కాంగ్రెస్–బీఆర్ఎస్లు అభివృద్ధి ఎజెండానే ప్రచారం చేసుకుంటున్నాయి. ఓటర్లు కూడా ఇదే ప్రాతిపదికన చీలుతున్నారు. ఇందులో మైనారిటీ, మెజారిటీ అన్న తేడాలేమీ కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అజారుద్దీన్‌కు మంత్రిపదవి ఇవ్వడం వల్లనో, ముంబైలో సల్మాన్‌ఖాన్‌తో ముఖ్యమంత్రి దిగిన ఫొటోలను సీఎమ్ఓ విడుదల చేయడం వల్లనో మైనారిటీలు ప్రభావితులయ్యే అవకాశాలు తక్కువ.ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల్లో సానుకూల స్పందనే ఉన్నది. అదే సందర్భంలో ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అక్కడక్కడా మహిళలే నిలదీస్తున్న వార్తలు కూడా మీడియాలో రిపోర్టవుతున్నాయి. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండున్నర వేల గురించి అడుగుతున్నారు. తులం బంగారం సంగతేమిటని నిలదీస్తున్నారు. ‘మాకు స్కూటీలిస్తామన్నారు, ఇంకెప్పుడి స్తార’ని ఒకచోట పది మంది బాలికలు ప్రశ్నించారు. వృద్ధాప్య పెన్షన్‌ను పెంచుతామని ఇచ్చిన హామీని విస్మరించడాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు.ఉప ఎన్నికలకు ముందు 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేసింది. అందులో కొన్ని పనులు పూర్తి చేశారు కూడా! ఇది కాంగ్రెస్ అభ్యర్థికి మేలు చేసే అంశం. కానీ, కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ముందు అక్కడ కాంగ్రెస్ వాళ్లు అనేక హామీలు గుప్పించి మోసం చేశారని ఆ ప్రాంతం నుంచి వచ్చిన మహిళల టీమ్ ఒకటి జూబ్లీ హిల్స్‌లో విస్తారంగా ప్రచారం చేస్తున్నది. ఇటువంటి ఉదంతాలు కొన్ని స్వచ్ఛందంగా జరిగి ఉండవచ్చు. కొన్ని ప్రతిపక్ష పార్టీ ఆర్గనైజ్ చేసి ఉండవచ్చు. ఎలా జరిగినా ఇవి కాంగ్రెస్ ప్రచారానికి ఇబ్బంది కలిగించే విషయాలే! కేసీఆర్ హయాంలో తమకు అందిన రంజాన్ తోఫా, షాదీ ముబారక్‌ల గురించి కూడా మైనారిటీ ప్రజలు గుర్తు చేస్తున్నారు.కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నియోజకవర్గానికి జరిగిన లబ్ధిపై బీఆర్ఎస్ పార్టీ ఒక పత్రాన్ని విడుదల చేసింది. దానితోపాటు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఎగవేసిన అంశాలను ఉటంకిస్తూ ఒక బాకీ పత్రాన్ని కూడా ఆ పార్టీ ప్రచారంలో పెట్టింది. ఇవి జనంలో చర్చనీయాంశాలుగా మారాయి. సినీ రంగంలో పనిచేసే కార్మికులు దాదాపు పది హేను వేలమంది వరకు ఈ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకోవడానికి స్వయంగా ముఖ్య మంత్రే ఒక సభకు హాజరై, వారికి అనేక హామీలిచ్చారు. కానీ ఆ కార్మికులు సంతృప్తి చెందినట్లయితే కనిపించలేదు. పదివేల మంది వరకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలు పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి.గడచిన రెండేళ్ళలో మార్కెట్లో ద్రవ్య చలామణీ బాగా తగ్గిందనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. దాని ప్రభావం అన్ని రంగాల మీద కనిపిస్తున్నది. జీఎస్టీ వసూళ్లలో, స్థిరాస్తి రిజి స్ట్రేషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వ అథోముఖయానం దీన్ని ధ్రువీక రిస్తున్నది. కేసీఆర్ కాలం నాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో జనం పోల్చి చూసుకుంటున్నారు. ఈ రకంగా క్షేత్రస్థాయి నాడి కాంగ్రెస్‌కు అంత సానుకూలంగా ఏమీ లేదు. కానీ అధికార పార్టీగా దానికుండే బలాలను కూడా తీసిపారేయలేము. పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీ ఓట్ల కోసం ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం వేసిన ఎత్తుగడ మిస్ఫైరయినప్పటికీ అందులోంచి ప్రయోజనం పొందడం కోసం ప్రయత్నాలను మానలేదు. నియోజకవర్గంలో విస్తృత సంబంధాలున్న కుటుంబాన్ని బరి లోకి దింపింది. రేషన్ కార్డుల మీద సన్నబియ్యం పంపిణీ చేయడం కూడా కలిసొస్తుందని ఆ పార్టీ ఆశిస్తున్నది. కొత్తగా నియోజకవర్గంలో నలభై వేల రేషన్ కార్డులు పంపిణీ చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వాస్తవాలు పరిశీలిస్తే వెయ్యికి మించి పంపిణీ చేయలేదని తెలిసింది. ఇక డబ్బులు వెద జల్లడం, ప్రలోభాలకు తెరలేపడం అధికార పార్టీకి పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి అనుకూలాంశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌లో ఏదో తెలియని అలజడి కనిపిస్తున్నది. ఓడిపోతే తర్వాత పర్యవసానాలెలా ఉంటాయోనన్న కలవరం ఆ శిబిరంలో నెలకొన్నది. ఉపఎన్నిక పోలింగ్‌కు ఇంకా 9 రోజుల సమయం ఉంది. ఆలోగా అధికార పార్టీకి అనుకూలంగా ఏదైనా అద్భుతం జరుగుతుందేమో చూడాలి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అన్యాయానికి పరిహారం
ఒక పెత్తందారు కన్నెర్ర చేయటం వల్లనో, ఒక ఉన్నతాధికారి కక్షబూనటం వల్లనో, లేదా వ్యవస్థలు ఏకమై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టడం వల్లనో జైళ్లలో మగ్గి చివరకు నిర్దోషులుగా విముక్తులవుతున్నవారికి ఊరటనిచ్చే అంశమిది. అలాంటివారికి నష్టపరిహారం చెల్లించేందుకు అనువైన మార్గదర్శకాలు రూపొందించాలని సర్వోన్నత న్యాయస్థానం సంకల్పించింది. అమాయకుల్ని కేసుల్లో ఇరికించటం, ఏళ్ల తరబడి వారు జైలు పాలవటం మన దేశంలో ఎప్పటి నుంచో రొటీన్‌గా సాగిపోతోంది. నిందితులు నిర్దోషులని తేలినప్పుడు న్యాయస్థానాలు దర్యాప్తు చేసినవారినీ, ప్రాసిక్యూషన్‌నూ తప్పుబట్టడం తరచూ కనబడుతుంది. కానీ అందువల్ల ఒరిగేదేమిటి? సమాజం వారిని అమాయకులుగా, సాధారణ పౌరులుగా పరిగణించి ఆదరిస్తుందా? అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల్లో అలాంటివారు నష్టపరిహారం పొందేందుకు నిబంధనలున్నాయి. అమెరికాలో జైల్లో మగ్గిన కాలానికి ఏడాదికి 50,000 డాలర్ల చొప్పున పరిహారం చెల్లిస్తారు. బ్రిటన్‌లో దీర్ఘకాలం జైల్లో ఉన్న నిర్దోషులకు 10 లక్షల పౌండ్లు ఇస్తారు. జర్మనీలో ఇది రోజుకు 75 యూరోలు. మన దేశంలో అభాగ్యులు కేసుల నుంచి విముక్తి పొందటమే అదృష్టమన్నట్టు సరిపెట్టుకుంటున్నారు. పరిహారం సంగతలా ఉంచి వారికి ప్రభుత్వం నుంచి క్షమాపణైనా దక్కటం లేదు. శిక్ష పడుతున్న కేసులు మన దేశంలో ఏటా సగటున 54 శాతం మించటం లేదన్న గణాంకాల్ని గమనిస్తే ఇలాంటి అభాగ్యులెందరో అర్థమవుతుంది. పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు భావించిన కేసు పూర్వాపరాలు చూస్తే ఈ నిర్ణయం ఎంత సరైందో అర్థమవుతుంది. మహారాష్ట్రలో 2013లో ఒక మైనర్‌పై అత్యా చారం చేసి హతమార్చాడన్న కేసులో ఇరుక్కుని జైల్లో మగ్గుతూ, 2019లో ఉరిశిక్ష పడిన నిరుపేద పౌరుడి కథ ఇది. ఆయన పన్నెండేళ్ల కారాగారవాసంలో ఆరేళ్లు ఉరికంబం నీడన బతుకీడ్చాడు. అతణ్ణి అన్యాయంగా ఇరికించారనీ, దర్యాప్తు మొత్తం తప్పులతడకనీ సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఈ ఏడాది ఇంతవరకూ ఉరిశిక్ష పడిన ముగ్గురు ఖైదీల విషయంలో సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. నిజానికి 2014లోనే ఒక కేసులో తీర్పునిస్తూ క్రిమినల్ కేసుల్లో నిందితులు నిర్దోషులుగా తేలితే దర్యాప్తు అధికారుల్ని బాధ్యులుగా పరిగణించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అది ఏ మేరకు అమలవుతున్నదో అనుమానమే. అమాయకులపై తప్పుడు కేసులు బనాయించటం వల్ల అనేక విధాల నష్టం. నిజమైన దోషులు తప్పించుకు తిరుగుతూ అవే నేరాల్ని పదే పదే చేస్తుంటారు. అమాయక పౌరులు నిస్సహాయంగా జైల్లో మగ్గుతారు. దోషులు తప్పించుకు తిరుగుతున్నా, చేయని నేరానికి నిర్దోషులు శిక్ష అనుభవిస్తున్నా ప్రజలకు చట్టబద్ధ పాలనపై విశ్వాసం పోతుంది. రాజ్యాంగంలోని 21వ అధికరణం జీవించే హక్కుకూ, వ్యక్తి స్వేచ్ఛకూ పూచీ పడుతున్నా దానికి అనుగుణంగా అక్రమ కేసుల వల్ల జైలు పాలైనవారికీ, ఆలస్యంగా న్యాయం దక్కినవారికీ పరిహారం చెల్లించే చట్టాలు లేవు. జీవితంలో విలువైన కాలాన్నీ, స్వేచ్ఛనూ, పరువు మర్యాదలనూ కోల్పోయి మానసికంగా కుంగిపోయినవారికి పరిహారం పొందే హక్కుండి తీరాలి. మానవీయ దృక్పథంతో న్యాయస్థానాలు కొన్ని కేసుల్లో పరిహారానికి ఆదేశిస్తున్నాయి. బాధితులందరికీ న్యాయం జరగాలంటే తగిన చట్టం అవసరం.తొంభై శాతం అంగవైకల్యం ఉన్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా, మరికొందరు తప్పుడు కేసుల పర్యవసానంగా పదేళ్లు కారాగారంలో మగ్గటం, చివరకు నిర్దోషులుగా విడుదల కావటం ఇటీవలి వైనం. విడుదలైన కొన్నాళ్లకే ప్రొఫెసర్ సాయిబాబా తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారని ఆరోపిస్తూ 17 మందిపై దేశద్రోహ నేరంతో సహా పలు కేసులు పెట్టగా ఆరేళ్ల తర్వాత నిర్దోషులుగా బయటపడ్డారు. గూఢచర్యం, దేశద్రోహం కేసుల్లో ఇరుక్కున్న ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ రూ. 50 లక్షల పరిహారం పొందటానికి రెండు దశాబ్దాలు పట్టింది. ఇలాంటి పోకడలు ఆగాలంటే, తప్పుడు కేసుల పర్వానికి తెరపడాలంటే పరిహారం చెల్లించే విధానం రావాల్సిందే! -
అమాత్యా... ఇది తగునా?
ఇతర విషయాల మాటెలా ఉన్నా మహిళలకు సంబంధించి బాధ్యతాయుతంగా మాట్లాడటం, నాగరికంగా వ్యవహరించటం మన నేతలకు ఇప్పట్లో చేతకాదని మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయ్‌వర్గియా నిరూపించారు. ఆ రాష్ట్రంలోని ఇండోర్‌లో గురువారం ఆస్ట్రేలియా క్రీడాకారిణులిద్దరి పట్ల ఒక దుండగుడు అసభ్యంగా ప్రవర్తించిన ఉదంతంలో ఆయన స్పందన అందరికీ దిగ్భ్రాంతి కలిగించింది. అది అర్ధరాత్రో అపరాత్రో జరిగింది కాదు. పట్టపగలు 11 గంటలకు నడిరోడ్డుపై చోటుచేసుకుంది. తాము బస చేసిన హోటల్ నుంచి కేవలం కొన్ని మీటర్ల దూరంలోని కెఫేకు వెళ్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగుడు వారిపై ఈ అఘాయిత్యానికి పూనుకున్నాడు. సమీపంలోని వ్యక్తి ఆ వాహనం నంబర్ గుర్తుపెట్టుకుని పోలీసులకు చెప్పటంతో వెనువెంటనే దుండగుణ్ణి అరెస్టు చేశారు. అకిల్ ఖాన్ అనే ఆ యువకుడిపై పాత కేసులు కూడా ఉన్నాయని తేలింది. పోలీసులు తక్షణం స్పందించి చర్య తీసుకున్న తీరు ఉన్నంతలో ప్రశంసించదగ్గదే. కానీ దాన్నంతటినీ మంత్రి వ్యాఖ్యలు నీరుగార్చాయి. మన దేశంలో క్రికెటర్లపై చచ్చేంత మోజు ఉంటుందట. అందువల్ల వారు బయట తిరిగేటపుడు సెక్యూరిటీని తోడు తీసుకుని వెళ్లాలట. ఈ ఘటన ఆ క్రీడాకారిణులకు ఒక గుణపాఠమట. క్రికెటర్లంటే ఉన్న మోజు వల్లే ఈ ఉదంతం జరిగిందని ఆయన ఎలా అనగలిగారో అనూహ్యం. మన పర్యాటక రంగం గతంతో పోలిస్తే ఎంతో విస్తరించింది. మన సాంస్కృతిక వారసత్వ వైభవం, వైవిధ్యభరితమైన ప్రకృతి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ రంగం ద్వారా మన జీడీపీకి రూ. 20 లక్షల కోట్లు సమకూరుతున్నదనీ, ఏటా పర్యాటకం 25 శాతం చొప్పున వృద్ధి చెందుతున్నదనీ ఇటీవలే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖవత్ ఆ రాష్ట్రంలో జరిగిన సదస్సులోనే ప్రకటించారు. పైగా ఈ రంగంలో 8.4 కోట్ల మందికి ఉపాధి లభిస్తోంది. నిజానికి పర్యాటకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక పోతున్నామని నిపుణులు ఏనాటి నుంచో చెబుతున్నారు. నిరుడు మన దేశాన్ని కోటిమంది విదేశీ పర్యాటకులు సందర్శించగా, థాయ్‌లాండ్‌కు మూడు న్నర కోట్లమంది వెళ్లారు. మన దేశాన్ని సందర్శించేవారికి అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు జాగ్రత్తల పేరిట ఇచ్చే సలహాలు చదివితే ఆగ్రహం కలిగిస్తాయి. మనల్ని చిన్నచూపు చూస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతుంది. మహిళలకు భద్రత, రక్షణ ఉండేలా చర్యలు తీసుకోవటం ద్వారా అవి దురభిప్రాయాలేనని చూపవచ్చు. అది చేయకపోగా ఇష్టానుసారం మాట్లాడటం తగునా?ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలో శాంతిభద్రతల విభాగం ఉంటుంది. రాష్ట్ర హోంమంత్రి ఇండోర్‌కు ఇన్‌ఛార్జి. స్థానికంగా ఉన్న హోల్కర్ స్టేడియంలో జరిగే అయిదు మ్యాచ్‌ల కోసం వేర్వేరు దేశాల టీమ్‌లు ఆ హోటల్లో బస చేశాయి. ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలో ప్రోటోకాల్స్ ఉంటాయి. వాటిపై అధికారుల స్థాయిలో చర్చించుకునే ఉంటారు. తీసుకున్న భద్రతా చర్యలేమిటో తెలి యదుగానీ ఈ సిగ్గుచేటైన ఘటన చోటుచేసుకుంది. ఇందుకు క్షమాపణ చెప్పి, ఇవి పునరావృతం కానీయబోమని మంత్రి చెప్పివుంటే హుందాగా ఉండేది. బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థినిపై దుండగుడు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆందోళన చేస్తున్నవారితో ‘అసలు సాయంత్రం ఆరు తర్వాత ఆడపిల్లలు బయటికెందు కొస్తారు?’ అంటూ అప్పటి వీసీ త్రిపాఠీ చిందులు తొక్కారు. ఇలాంటి అనాగరిక, అనా రోగ్య అభిప్రాయాలు అన్ని వ్యవస్థల్లోనూ పాతుకుపోవటం వల్లే మహిళల పట్ల సమాజంలో చిన్నచూపు కొనసాగుతోంది. లైంగిక నేరాల విషయంలో మన ప్రభుత్వాలు ఉండాల్సినంత కఠినంగా ఉంటున్నాయా? మహిళలపై జరిగే ఇతర నేరాల సంగతలా ఉంచి అత్యాచారాల విషయంలో పడే శిక్షలే మూడు శాతం కన్నా తక్కువున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఏళ్ల తరబడి సాగే విచారణలు మరింతమంది నేరగాళ్లు పుట్టుకురావటానికి దోహదపడుతున్నాయి. ఇది మన వ్యవస్థల ఉదాసీనతను తేటతెల్లం చేస్తోంది. కనీసం ఈ కేసులోనైనా సత్వర విచారణ జరిగి, శిక్ష పడేలా చేయగలిగితే విదేశీ పర్యాటకులకు భరోసా ఇచ్చినట్టవుతుంది. -
అక్షరాల మండువా!
రచయితలు ఫోన్ కోసం ఎదురు చూస్తుంటారు. కవులు రావలసిన ఆ ఈ–మెయిల్ వస్తే బాగుండని అనుకుంటారు. విమర్శకులు ఫలానా విషయంపై తప్పక తమ పాయింట్‌ను అక్కడ ప్రెజెంట్ చేయాలనుకుంటారు. ఒక కొత్త పుస్తకందారు తన పుస్తకాన్ని ఆ చోటనే ఆవిష్కరించుకోవడం సంతసమైన సంగతిగా తలుస్తాడు. అసలు నలుగురినీ కలవడం, పలకరించుకోవడం, పరామర్శించుకోవడం... మనమంతా ఒకటి... మన బృందమే మనకు తోడు అనే భావన కల్పించుకోవడం... దానిని వేడుక అనండీ... సమ్మేళనం అనండి... అందరూ కలిసి చేసే సంబరం అనండి... సాహితీ సంబరం... లిటరేచర్ ఫెస్టివల్. ఇవి ప్రతి భాషలో జరుగుతుంటాయి. సాహిత్యాభిమానులకు ఇవి స్వాతిచినుకులు.తెలుగువారి సాహిత్యానికి ఉన్నంత చరిత్ర సాహితీ ఉత్సవాలకు లేదు. అవి చాలా పరిమితమైనవి. వారికి తెలిసినవి పుస్తక ఆవిష్కరణలు. ఇన్విటేషన్ ప్రచురించడం, నలుగురిని ఆహ్వానించి వచ్చిన యాభై, అరవై మంది సమక్షాన పుస్తకం గురించి మాట్లాడుకుని, అదే పండుగగా తలవడం. ఇక శతజయంతి సభలు, కొందరు సాహితీవేత్తలు తమ సాహిత్యంపై ఏర్పాటు చేసుకునే ఒక రోజు సదస్సులు, తమ సాహిత్యంపై ప్రయత్నపూర్వకంగా జరిపే వారోత్సవాలు... ఇవన్నీ అందరూ పాల్గొనే అందరినీ నిమగ్నం చేసేవి కావు. అందువల్ల జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్, కేరళ లిటరేచర్ ఫెస్టివల్, హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ తీరుతెన్నులు తెలిసినప్పుడు ఇక్కడ అలాంటివి ఎందుకు జరగవు... అని కవులు, రచయితలు అనుకోవడం పరిపాటి. అవి తాము పాల్గొనడానికే కాదు... అవి వదిలించగలిగే కొన్ని నిర్లిప్తతల కోసం, పెళ్లగించగలిగే మరికొన్ని జడత్వాల కోసం.కొన్నేళ్ల క్రితం తిరుపతిలో ఏటా సాగిన భాషా బ్రహ్మోత్సవాలు తెలుగు సాహిత్యావరణంలో పెద్ద సందడి, కదలిక సృష్టించగలిగాయి. అదే తిరుపతిలో, ఆపై హైదరాబాద్‌లో జరిగిన ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ దేశ విదేశ సాహితీకారులను తరలి వచ్చేలా చేసి ఇది మన జాతి, మన భాష, మన సృజన అని మురిసిపోయేలా చేయగలిగాయి. కాని ఎందుచేతనో ఆ తర్వాత ప్రభుత్వాల నిష్ఠ సన్నగిల్లింది. వాటిని పురిగొలిపే బయటి సంస్థలు, వ్యక్తులు కూడా ఊరికే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల వారికి సాహితీ ఉత్సవాలంటే బుక్ఫెయిర్సే శరణమయ్యాయి. హైదరాబాద్, విజయవాడ బుక్‌ఫెయిర్స్... వీటినే లిటరేచర్ ఫెస్టివల్‌గా భావించి అదే చారనుకో, అదే మజ్జిగనుకో అనే చందంగా అక్కడే ఆవిష్కరణలు, సమ్మేళనాలు జరుపుకొని సరిపుచ్చుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా లిటరేచర్ ఫెస్టివల్స్ జరుపుకోవడం ఆ యా దేశాల జాతి సంస్కారంలో భాగం. నాగరికత వికాసాన్ని వ్యక్తపరిచగలిగే సభ్యత. మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఈ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ముఖ్య నగరాల పేరుతో కూడా అదనంగా ఈ ఉత్సవాలు సాగుతున్నాయి. ఇవి ఎందుకు? సాహిత్యమే సంస్కారం కనుక. పుస్తకమే దిక్సూచి కనుక. కావ్యమే దీపం, అక్షరమే ఆలోచన కనుక. సాహిత్యం మనిషి ఇలా ఎందుకు ఉన్నాడో, ఇలా ఎందుకు ఉండకూడదో చెప్పగలిగే సృజనాత్మక రూల్‌బుక్. ఈ రూల్‌బుక్‌ను తరచి చూసుకోవడం కోసం, అప్డేట్ చేసుకోవడం కోసం, లిటరేచర్ ఫెస్టివల్స్ అవసరం. మూడు నుంచి ఐదురోజుల ఈ ఫెస్టివల్స్‌లో ఆ భాషలోని కథ, కవిత, నాటకం, సినిమా, విమర్శ, బాలసాహిత్యం, కళా ప్రదర్శనలు... ఎంత బాగుంటుంది. కాని తెలుగునాట ఆధ్యాత్మిక ఉత్సవాలు అందుకున్నంత ఊపును ఈ సాహితీ ఉత్సవాలు అందుకోవడం లేదు. ప్రభుత్వాలు పూనుకోకపోవడం ఒక కారణమైతే, ప్రయివేటు వ్యక్తులు చేయాలనుకున్నా స్పాన్సర్స్ పైసా రాల్చకపోవడం మరో కారణం. ఈ నేపథ్యంలో ఒకే సందర్భంలో విజయవాడలో అమరావతి లిటరేచర్ ఫెస్టివల్, హైదరాబాద్‌లో ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ జరగడం ఆహ్వానించదగ్గ విషయం. హైదరాబాద్‌లో అంబేద్కర్ యూనివర్సిటీ చేయూతతో జరిగిన ‘ఛాయా లిటరేచర్ ఫెస్టివల్’ ఒక పెద్ద ఆసక్తిని ఏర్పరచడమే గాక దానికి హాజరైన సాహితీప్రియుల సంఖ్యను చూసి ఇలాంటివి మనం కూడా చేయవచ్చే అన్న ఉత్సాహాన్ని మరెందరికో కలిగించగలిగింది. ఇది పెద్దవిషయం.నవంబర్ నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి వరకు లిటరేచర్ ఫెస్టివల్స్‌కు దేశంలో సీజన్. తెలుగువారికి ఎన్ని ముఖ్య నగరాలు... హైదరాబాద్, వరంగల్, విశాఖ, తిరుపతి, రాజమండ్రి... వీటిలో కనీసం రెండు రోజుల లిటరేచర్ ఫెస్టివల్స్ జరపడం స్థానిక ప్రజా ప్రతినిధులు, వదాన్యులు, సాహితీ సంస్థలు పూనుకుంటే పెద్ద కష్టమేమీ కాదు. వాటిని చేయవచ్చనీ, చేస్తే ప్రజలు మెచ్చుతారనీ తెలియడం ముఖ్యం. -
టీచర్లపై ‘ఎన్నికల’ ఒత్తిళ్లు
సమస్య పాతదే. ఎన్నికల రుతువు సమీపించినప్పుడల్లా ఉపాధ్యాయులు ఓటర్ల జాబితా సవరణ మొదలుకొని పోలింగ్ నిర్వహణ విధుల వరకూ ఎన్నెన్నో నిర్వహించక తప్పదు. వారినుంచి ప్రతిసారీ అభ్యంతరాలు, నిరసనలు కూడా రివాజే. ఈసారి సమస్యాత్మకమైన బెంగాల్ వంతు వచ్చింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందున బిహార్ మాదిరిగా అక్కడ కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం(ఈసీ) సన్నాహాలు చేస్తోంది. అందులో పాలుపంచుకొనేది లేదని రెండు నెలలుగా టీచర్లు చెబుతున్నారు. ఈసీ ఆదేశాలను పాటించి తీరాలని గత నెలలో కలకత్తా హైకోర్టు వారిని హెచ్చరించింది. అయినా దానివల్ల పెద్దగా ఫలితం కనబడలేదు. పైకి ఏం చెప్పినా సర్వసాధారణంగా ఉపాధ్యాయుల నిరాకరణకు రెండు కారణాలుంటాయి. అందులో ఒకటి– పార్టీల నుంచి వచ్చే ఒత్తిళ్లు. రెండోది విద్యా సంబంధమైనది. పార్టీలు తెచ్చే ఒత్తిళ్లు అన్నీ ఇన్నీ కాదు. ఫలానా పేర్లు తీసేయాలని కోరటం, లేదా ఫలానా డోర్ నంబర్ కింద పేర్లు చేర్చాలని ఒత్తిడి చేయటం మామూలే! ‘మా ఓటు గల్లంతైంద’ని పోలింగ్ రోజున పలువురు లబోదిబోమంటారు. నకిలీ ఓటర్లు జాబితాలోకెక్కిన సందర్భాల్లో ఫిర్యాదులుండవు. ఎందుకంటే తమ అడ్రస్‌తో నకిలీలు రిజిస్టరయ్యారన్న సంగతి ఇళ్ల యజమానులకు తెలియదు. పార్టీలు గమనించి ఫిర్యాదు చేసేసరికి సమయం మించిపోతుంది. ఈసారి వివాదాస్పదమైన ‘సర్’ అడుగుపెడుతున్నది గనుక సమస్య మరింత జటిలం కాబోతోంది. ఇన్నాళ్లూ పార్టీల నుంచి ఎదురైన ఒత్తిళ్లు వేరు. ఇది వేరు. కొత్త విధానం ప్రకారం నిర్దిష్టమైన పత్రాలుంటేనే ఓటర్లుగా గుర్తిస్తారు. ఆ పత్రాలు లేకుంటే అంతే సంగతులు. అందువల్లే ఈసారి జాబితా విడుదలైన వెంటనే ఓటు ఉందో ఊడిందో చూసుకునే ఓటర్లు ఎక్కువే ఉంటారు. తమవారి పేర్లున్నాయో లేదో వెంటవెంటనే నిశితంగా గమనించే పార్టీలూ ఉంటాయి. పేరు గల్లంతైతే రాజకీయ పక్షాల నేతలైనా, జనమైనా విరుచుకుపడేది బీఎల్‌ఓలపైనే! బిహార్‌లో ఎంతో పకడ్బందీగా ఓటర్ల జాబితాను సవరిస్తున్నామని ఈసీ చెబుతుండగానే అనేక లొసుగులు బయటపడ్డాయి. పెంపుడు కుక్కల పేర్లతో, సినీతారల పేర్లతో నమోదైన ‘ఓటర్లు’ కొందరుంటే... ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరు కూడా జాబితాలో చేరి అందరినీ నిర్ఘాంత పరిచింది. బెంగాల్ తీరు వేరు. అధికారంలో ఉన్న తృణమూల్ అయినా, ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అయినా ‘సర్’ ప్రక్రియ మొదలైనప్పటినుంచీ తమ సర్వశక్తులూ కేంద్రీకరిస్తాయి. నమోదు సమయంలోనే బీఎల్ఓలు ‘ఫలానా పత్రం ఇస్తే తప్ప కుదరద’ంటే ఒత్తిళ్లూ, బెదిరింపులూ తప్పవు. కొన్ని సందర్బాల్లో దాడులకు దిగేవారూ ఉంటారు. వాటికి జడిసి చూసీచూడనట్టు వెళ్తే ప్రత్యర్థి పార్టీలు రచ్చచేస్తాయి. తప్పని తేలితే బీఎల్ఓలపై క్రమశిక్షణ చర్యలుంటాయి. వారి సర్వీస్‌పై మచ్చ పడుతుంది. ఉపాధ్యాయులు మీవల్లే బీఎల్ఓ విధులు నిర్వర్తించేందుకు భయపడుతున్నారంటూ తృణమూల్, బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇక ఈసీ పక్షపాత వైఖరి గురించి వచ్చే ఆరోపణల సంగతి సరేసరి. ఈ బెడదంతా ఎందుకున్న ఉద్దేశంతోనే టీచర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని చూస్తున్నారు.టీచర్లకు ఎన్నికల సంబంధ విధులే కాదు... విద్యేతరమైనవి అనేకం చుట్టుకుంటున్నాయి. చదువు చెప్పటంతోపాటు పాఠశాలల్లో పర్యవేక్షించాల్సినవే అనేకం ఉంటున్నాయి. ఇన్నింటివల్ల సకాలంలో సిలబస్ పూర్తిచేయటం కష్టమవుతోందనీ, పిల్లల ప్రమాణాలు పడిపోతున్నాయనీ ఉపాధ్యాయులంటారు. ఈ రెండింటికీ తమనే బాధ్యుల్ని చేస్తున్నారన్నది వారి ఆవేదన. ఒకరో ఇద్దరో టీచర్లతో నడిచేచోట ఈ కష్టాలు అనేక రెట్లు ఎక్కువుంటాయి. ఈసీకి ఇదంతా అనవసరం. కేటాయించిన విధుల్ని పరిపూర్తి చేయాల్సిందేనంటుంది. ఎన్నికల విధుల్లో పాల్గొని తీరాలన్న ఈసీ ఆదేశాలపై 2014లో మహారాష్ట్ర ఎయిడెడ్ స్కూళ్ల టీచర్లు బొంబాయి హైకోర్టులో సవాలు చేసినప్పుడు విధులకు గైర్హాజరైనవారిపై కఠిన చర్యలు తీసుకోబోమని ఈసీ హామీ ఇచ్చింది. ఇప్పుడు బెంగాల్ టీచర్లకు ఉపశమనం దొరుకుతుందా లేదా అన్నది వేచిచూడాలి. -
సంకట స్థితిలో యూరప్
తీరికూర్చుని ఉక్రెయిన్ ద్వారా రష్యాను రెచ్చగొట్టి అనవసర యుద్ధానికి కారణమైన యూరప్ దేశాలకు రెండేళ్లు గడిచాక ఆ ఊబి నుంచి గౌరవప్రదంగా బయటపడే మార్గం తెలియటం లేదు. ఎప్పుడేం మాట్లాడతారో, ఎలాంటి ప్రతిపాదన తెస్తారో తెలియని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యాక జరిగిన పరిణామాలతో ఆ దేశాలకు ఎటూ పాలుబోవటం లేదు. ట్రంప్ తాజా ప్రతిపాదన ప్రకారం రష్యా, ఉక్రెయిన్లు రెండూ పరస్పరం తలపడుతున్న ప్రాంతం వద్ద వెంటనే యుద్ధం నిలిపివేయాలి. ఆ తర్వాత ఎవరికి వారు విజయం తమదేనని ప్రకటించుకోవచ్చు. దీనర్థం ఏమంటే... తమ భూభాగంలో ఇంతవరకూ రష్యా చొచ్చుకువచ్చి ఆక్రమించిన డోన్బాస్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ మరిచిపోవాలి. ఆ తర్వాత కావాలనుకుంటే రెండు దేశాలూ చర్చించుకుని ఇతరేతర అంశాలపై అంగీకారానికి రావొచ్చు. జెలెన్స్కీకి ట్రంప్ వద్ద భంగపాటు ఎదురుకావటం ఇది మొదటిసారి కాదు. ఆయన అధ్యక్షుడైన కొన్నాళ్లకే వైట్‌హౌస్‌కు వెళ్లినప్పుడు అంతర్జాతీయ చానెళ్ల సాక్షిగా ట్రంప్ ‘ప్రపంచ కోర్టు’ నడిపారు. జెలెన్స్కీపై నిప్పులు చెరిగారు. తన ఆత్మగౌరవం కాపాడుకోవటానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఆయనకు రెట్టింపు చీవాట్లు పడ్డాయి. చివరకు ట్రంప్ ఇవ్వదల్చుకున్న విందును కూడా బహిష్కరించి వెనుదిరగాల్సి వచ్చింది. అటుపై ఏం జరిగిందో ఏమో... నేతలిద్దరూ సఖ్యంగా కనబడ్డారు. ఉక్రెయిన్ అడిగిన సాయమల్లా చేస్తానని హామీ ఇవ్వటమేకాక రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను దారికితెస్తానని చెప్పారు. గత నెలలో కూడా ట్రంప్... జెలెన్స్కీకి పెద్ద వాగ్దానాలే చేశారు. పెను విధ్వంసాన్ని సృష్టించగల తోమహాక్ క్రూయిజ్ క్షిపణులు అందిస్తామని, వాటి సాయంతో కోల్పోయిన భూభాగాన్ని వెనక్కితీసుకోవటంతోపాటు మరింత ముందుకు చొచ్చుకుపోయి రష్యా భూభాగాన్ని ఆక్రమించవచ్చంటూ అభయం ఇచ్చారు. వీటిని నమ్మబట్టే గంపెడంత ఆశతో జెలెన్స్కీ మొన్న వాషింగ్టన్ వెళ్లారు. కానీ జరిగింది వేరు. తోమహాక్ ఇవ్వలేనని తేల్చి చెప్పారు.ట్రంప్ తాజా వైఖరి మారదన్న గ్యారెంటీ ఏమీ లేదు. కానీ ఇప్పటికైతే ఇది సరైనది. ఎందుకంటే సోవియెట్ యూనియన్ 15 దేశాలుగా విడిపోయి ప్రధాన భూభాగం రష్యాగా మిగలటంతో ప్రచ్ఛన్నయుద్ధ దశ ముగిసింది. నాటి సోవియెట్ అధ్యక్షుడు గోర్బచెవ్ తమ ఆధ్వర్యంలోని ‘వార్సా’ కూటమి రద్దయిందని ప్రకటించారు. ‘నాటో’లో చేరడానికి సంసిద్ధత తెలిపారు. ఆ రోజుతో నాటో కూటమికి ప్రాతిపదిక లేకుండా పోయింది. దాన్ని రద్దుచేయాలి. కానీ అమెరికా, యూరప్ దేశాలు అందుకు అంగీకరించలేదు. నాటో విస్తరణ ఉండబోదనీ, కొత్తగా ఎవరినీ చేర్చుకోబోమనీ హామీ ఇచ్చాయి. జరిగిందంతా ఇందుకు విరుద్ధం. గత వార్సా కూటమిలోని పది దేశాలను చేర్చుకున్నాయి. ఈ నాటకంలో ఉక్రెయిన్ చివరి పావు.తోమహాక్ సాయంతో మాస్కోతో సహా రష్యా నగరాలన్నిటినీ ధ్వంసం చేయొచ్చు. దాని ప్రయోగానికి అమెరికా బలగాలు రంగంలోకి దిగుతాయి. కానీ ఆ తర్వాత? అది రష్యా–నాటో ఘర్షణగా మారుతుంది. పుతిన్ రెచ్చిపోయి తన పంతం నెరవేర్చుకోవటానికి అణ్వస్త్ర ప్రయోగానికి తెగించే ప్రమాదం ఉంటుంది. ఇది వెనువెంటనే యూరప్‌నూ, ఆపై అమెరికానూ... చివరకు ప్రపంచ దేశాలన్నిటినీ వినాశనం వైపు నెడుతుంది. దీనివల్ల ఒరిగేదేమిటి? నిజానికి, నాటోను అడ్డంపెట్టుకుని అమెరికా జూదమాడుతోంది. గత అమెరికా అధ్యక్షులంతా యూరప్ దేశాలను రష్యాపై ఉసిగొల్పటం, సమస్య జటిలమైనప్పుడు ట్రాక్–2 దౌత్యం ద్వారా రష్యాను చల్లబరచటం ఒక కళగా అభివృద్ధి చేసుకున్నారు. బైడెన్ వరకూ అది సజావుగా సాగింది. కానీ ట్రంప్‌కు దానిపై ఏ మేరకు అవగాహన ఉందన్నది ప్రశ్నార్థకం. ఒకవేళ తెలిసినా దాన్ని ట్రంప్ గుట్టుచప్పుడు కాకుండా చేయగలరన్న నమ్మకం లేదు. ఇన్నాళ్లూ అమెరికాతో అంటకాగి పొరుగునున్న రష్యాతో సొంతంగా దౌత్యం నెరపటం తెలియని యూరప్‌కు తగిన శాస్తి జరిగింది. ఇప్పటికైనా ఉక్రెయిన్ను వెనక్కులాగి, ట్రంప్ తాజా ప్రతిపాదన బాగుందని కీర్తిస్తే ఈ లంపటం నుంచి బయటపడటం ఆ దేశాలకు తేలిక. ఇంకా శ్రుతి మించితే మొదటికే మోసం వస్తుంది. -
చీకటి వెలుగుల రంగేళి
భాషలో అదో విచిత్రం. వ్యతిరేక పదాలు పక్కపక్కనే ఉంటాయి, జంటగా సాగుతూ ఉంటాయి; మంచి–చెడు, పాపం–పుణ్యం, కీర్తి–అపకీర్తి; అలాగే, వెలుగు–చీకటి! అసలు జగత్తులో ఉన్నదంతా చీకటే, వెలుగు రాగానే అది మాయమవుతుంది. వెలుగు నిచ్చేది దీపం. ప్రకృతి వెలిగించిన అతిపెద్ద దీపం సూర్యుడు. ఆయన సంచారానికి వెడుతూ వెడుతూ తన కాంతిని నింపి ఆకాశపు నట్టింట ఉంచే చిన్నా, పెద్దా ప్రమిదలే నక్షత్రాలూ, చంద్రుడూ. తెలతెల్లని సూర్యుడు ఉదయించగానే, నల్లని పెనుచీకటులన్నీ కాకుల్లా ఎగిరిపోయాయంటాడు ఓ కవి. మనిషి జీవితంతో పడుగూ పేకలా అల్లుకుపోయిన ఉపమానం ‘చీకటి వెలుగు’లను మించి మరొకటి లేదు. అందుకే, ‘చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి’ అంటాడొక సినీకవి. ‘దీపాలు బాగుంటాయి, పాపల్లాంటి దీపాలు, కనుపాపల్లాంటి దీపాలు, దీపం ఆసరాతో చీకటి నైజాన్ని తెలుసుకో, పాపం ఆసరాతో మానవుడి నైజాన్ని తెలుసుకో’ అంటాడు – కవి తిలక్. దీపోపమానం మహాకవి కాళిదాసుకు ఏకంగా దీపశిఖ అనే బిరుదునే తెచ్చిపెట్టింది. విదర్భ రాకుమారి ఇందుమతీదేవి స్వయంవర సభలో వరమాల పుచ్చుకుని ఒక్కొక్క రాజునే దాటివెడుతున్నప్పుడు అచ్చం దీపశిఖలా ఉందని తన రఘు వంశ కావ్యంలో వర్ణిస్తాడాయన. ఆమె తనను సమీపించగానే ఆశతో వెలిగిపోయిన రాజుల ముఖాలు, తమను దాటిపోగానే నిరాశతో నల్లబడిపోయాయంటాడు. రఘు మహారాజు కొడుకు అజుడు – ఒక దీపం వెలిగించిన మరో దీపంలా – రూపంలో, శౌర్యంలో, ఔన్నత్యంలో ముమ్మూర్తులా తండ్రి పోలికేనంటాడు. అంటుకున్న అడవి దీపాలతో రాత్రిళ్ళు చీకటిని జయించే తొలిపాఠాలు మనిషికి నేర్పింది కూడా ప్రకృతే. అప్పటినుంచి సంస్కృతీ, నాగరికతల మీదుగా మనిషి వెలుగుల ప్రస్థానం బహుముఖ దీపతోరణాలతో ముందుకు సాగుతూ జీవితాన్ని నిత్య దీపావళిగా మలుస్తూనే ఉంది. ‘ఆరని ఎర్రని దీపంగా, నిరంతర జీవన తాపంగా, తనను తాను కాల్చుకుని భస్మ మయే మోహన శాపం’గా కూడా తిలక్ అభివర్ణించిన దీపం, దేశ కాల మత భేదాలకు అతీతంగా సర్వత్రా మనిషికి దారిదీపమవుతూనే ఉంది. దీపాల వరుసలతో ఇళ్ళు, గుళ్ళు, రహదారులతో సహా సమస్త పరిసరాలనూ సముజ్వలం చేయడం పితృదేవతా హ్వానంలో భాగంగానే మొదలైందంటారు. మెక్సికోతో మొదలుపెట్టి, కంబోడియా, బర్మా, చైనా, జపాన్, ఈజిప్టు, రోమ్ సహా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక రూపంలో దివ్వెల పండుగ జరుపుకోవడం పరిపాటిగా వస్తోంది. మన దగ్గర దీపావళి పండుగ మూలాలు అతిప్రాచీన కాలంలోనే ఉన్నాయనీ, ‘ఉల్కాదానం’ పేరిట అది మన పురాణాలకు ఎక్కిందనీ, దీపాలు వెలిగించడంతోపాటు, సూరేకారం వంటివి ఉపయో గించి పేలుళ్లను సృష్టించడం కూడా అప్పటినుంచీ ఉందని అంటున్నవారూ ఉన్నారు.నింగీనేలా దద్దరిల్లే పెను శబ్దాలతో, ఆకసాన చిత్రవిచిత్ర కాంతులతో రంగుల రంగ వల్లులు తీర్చే బాణాసంచా వాడకం మాత్రం మనకు పదిహేనవ శతాబ్దిలోనే పరిచయ మైందనీ, బహుశా అది చైనా నుంచి వ్యాపించిందనీ, తుపాకీ మందు కనిపెట్టడం దానికి ప్రారంభమనీ అంటున్నారు. ఆ విధంగా తుపాకీ మందుతో జమిలిగా అల్లుకున్న బాణా సంచా రాజులకు యుద్ధ, వినోదాలు రెంటితోనూ అలరిస్తూ వచ్చిందనీ, పోర్చుగీసు వర్తకుల ద్వారా తమకు పరిచయమైన బాణాసంచా ధగధగలను, ఫెళఫెళలను విజయ నగర రాజులు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆస్వాదించేవారనీ చరిత్ర. అయితే, ‘చీకటి వెలుగుల’ మధ్య ఎడం లేకపోవడం భాషావైచిత్రే కాక, ప్రకృతి వైచిత్రి కూడా! పెద్ద ఎత్తున బాణసంచా జోడింపుతో రానురాను దీపావళి వెలుగులు పర్యావరణ, ప్రజారోగ్యపరమైన సమస్యల చీకట్లనూ వెంటబెట్టుకుని వస్తున్నాయి. సమస్య తీవ్రరూపం ధరించడంతో, ఢిల్లీలో బాణసంచా వాడకంపై పూర్తి నిషేధం విధించిన సుప్రీంకోర్టు తాజాగా కొన్ని ఆంక్షలూ, హెచ్చరికలతో ఆ నిషేధాన్ని సడలించింది. కాలుష్యాన్ని తగ్గించే బాణసంచా రకాల వాడకంతోపాటు నిర్దిష్ట సమయాల్లో, నిర్దిష్ట కాల పరిమితుల్లో మాత్రమే బాణసంచా వినియోగించాలని ప్రభుత్వాలూ చెవినిల్లు కట్టుకుని చెబుతున్నాయి. బాణసంచా కాల్పులకు ప్రత్యేక స్థలాలను కేటాయించడం ద్వారా అమెరికా లాంటి కొన్ని దేశాలు ఈ సమస్యను ఉభయతారకంగా పరిష్కరించుకున్నాయి. ఆ ఒరవడిని ఇప్పటికిప్పుడు మనం పూర్తిగా అనుసరించలేమనుకున్నా, ఇతోధిక జాగ్రత్తలు అత్యవసరం. కాటుక, కన్నే పోగొట్టకూడదు; వెలుగుల విస్ఫోటం చీకటి వాకిట మనల్ని నిలబెట్టకూడదు. అతి అనర్థం, మితిలోనే అందం, ఆనందం. -
ప్రశ్నలు రేపిన మరణాలు
వారం రోజుల వ్యవధిలో హరియాణా పోలీస్ విభాగంలో జరిగిన రెండు ఆత్మహత్యలు ఆ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇందులో ఒకరు ఈ నెల 7న ఆత్మహత్య చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దళిత ఐపీఎస్ అధికారి, అదనపు డీజీపీ వై. పూరన్‌కుమార్ కాగా, ఏఎస్ఐ సందీప్ లాఠర్ మంగళవారం ప్రాణం తీసుకున్నారు. ఈ రెండు ఆత్మహత్యలూ పోలీస్ విభాగంలో నిలువెల్లా నెలకొన్న అవ్యవస్థకు అద్దం పడుతున్నాయి. పూరన్ తనకెదురవుతున్న కులవివక్ష గురించి ఆత్మహత్యకు ముందు తొమ్మిది పేజీల లేఖ రాశారు. అయితే మూడు పేజీల లేఖతో పాటు వీడియో విడుదల చేసి మరణించిన సందీప్, అదనపు డీజీపీ పూరన్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ, ‘నిజాన్ని’ బట్టబయలు చేయటానికి ప్రాణత్యాగం చేస్తున్నాననటం, ఈ కేసులో బదిలీ అయిన ఒక ఎస్పీ మంచివారంటూ చెప్పటం ఆశ్చర్యం కలిగించింది. సందీప్ సమర్థుడిగా పేరు తెచ్చుకున్నవారే. పూరన్‌పై దర్యాప్తుచేస్తున్న బృందంలో సభ్యుడు. పూరన్ అవినీతిపరుడైతే పకడ్బందీ దర్యాప్తుతో ఆ సంగతిని బట్టబయలు చేయాలి తప్ప అందుకోసం ప్రాణత్యాగం ఎందుకు? సమాజాన్ని పట్టి పీడిస్తున్న కులజాడ్యం విద్యాసంస్థలూ, ప్రభుత్వ విభాగాలూ మొదలుకొని సమస్త వ్యవస్థల్లోనూ వేళ్లూనుకున్నదని తరచూ జరుగుతున్న ఉదంతాలు నిరూపిస్తున్నాయి. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ప్రాంతీయ వివక్ష వంటివి సరేసరి. చిత్రమేమంటే అన్ని వ్యవస్థలూ ఇవేమీ లేనట్టు నటిస్తుంటాయి. అందుకే కావొచ్చు... ఈ జాడ్యాలు నిక్షేపంలా కొనసాగుతున్నాయి. 2016లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యా లయంలో రోహిత్ వేముల, 2019లో ముంబైలోని ఒక వైద్య కళాశాలలో పీజీ చేస్తున్న డాక్టర్ పాయల్ తాడ్వి బలవన్మరణాలైనా, వివిధ ఐఐటీల్లో ఆత్మహత్యలు చేసుకున్న ఇతర దళిత విద్యార్థులైనా తమ బలిదానాల ద్వారా ఈ సమస్య తీవ్రతను ప్రభుత్వాల దృష్టికీ, సమాజం దృష్టికీ తీసుకొచ్చారు. కానీ పాలకుల నుంచి ప్రతిస్పందనలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. హరియాణా కేడర్ ఐపీఎస్ అయిన పూరన్ ఉన్నత విద్యావంతుడు. కంప్యూటర్ సైన్స్‌లో పట్టభద్రుడై, అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చేశారు. వివిధ జిల్లాల్లో ఎస్పీగా,అంబాలా ఐజీగా శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన కృషినీ, పోలీస్ విభాగాన్ని ఆధునికీకరించటంలో ఆయన పాత్రనూ అందరూ గుర్తుచేసుకుంటున్నారు. పాలనా పరమైన బాధ్యతల్లోనూ, కీలకమైన కేసుల దర్యాప్తులోనూ సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. గత నెలలో రోహ్తక్ నుంచి ఒక పోలీస్ శిక్షణ కేంద్రానికి బదిలీ చేసేవరకూ ఆయనపై అవినీతి ఆరోపణలు లేవు. కానీ అక్కడి నుంచి నిష్క్రమించాక రోహ్తక్లో ఆయన దగ్గర పనిచేసిన హెడ్ కానిస్టేబుల్అవినీతి ఆరోపణలపై అరెస్టు కావటం అనుమానాలకు తావిస్తోంది. అవినీతికి పాల్పడినవారిని రక్షించాలని ఎవరూ కోరరు. కానీ ప్రశ్నలు లేవనెత్తే పూరన్ వంటి దళిత అధికారిని ఆ మాదిరి కేసుల్లో ఇరికించే అవకాశం లేదా? ఆయన పని చేసినచోటల్లా ఈ మాదిరే ఆరోపణలొస్తే వేరే విషయం. ఐఏఎస్ అధికారిణి అయిన ఆయన భార్య అమ్నీత్ కుమార్‌కు సైతం సర్వీసులో మంచి పేరుంది. కుమార్ ఆత్మహత్య చేసుకున్న సమయానికి ఆమె సీఎం నయబ్సింగ్ సైనీ వెంట జపాన్ వెళ్లిన అధికార బృందంలో ఉన్నారు. హరియాణా మాఫియా ముఠాలకు నిలయం. మీడియాలో మార్మోగే లారెన్స్ బిష్ణోయ్ ముఠా మొదలుకొని ఎన్నో గ్యాంగ్‌లున్నాయి. పూరన్ అంటే గిట్టని వారు మరో గ్యాంగ్‌స్టర్ ఇందర్‌జిత్‌ను అడ్డంపెట్టుకుని కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశారా? ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన 16 మంది సీనియర్ ఐపీఎస్‌లకు ఏడాదిపైగా కాలం నుంచి పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్న వైనం కళ్ల ముందే కనబడుతోంది. వీరిలో అత్యధికులు దళిత వర్గాలవారు. వీరి పేర్లు ‘రెడ్‌బుక్’లో ఉండటం తప్ప వేరే కారణం కనబడదు. దేశవ్యాప్తంగా ఇలా బాహా టంగా కులవివక్ష రాజ్యమేలుతుంటే పూరన్ వంటివారు ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదనుకోవటంలో వింతేముంది? ఈ కేసులో పారదర్శకంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపించి హరియాణా ప్రభుత్వం తన తటస్థతను నిరూపించుకోవాలి. -
శాశ్వత శాంతికి నిరీక్షణ
గత రెండేళ్లుగా అపారమైన ప్రాణనష్టాన్నీ, కనీవినీ ఎరుగని విధ్వంసాన్నీ చవిచూసిన గాజా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇజ్రాయెల్–హమాస్‌ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా సమకూరిన విజయాన్ని శాంతిగా మలచుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ ఇజ్రాయెల్ పార్లమెంటు కెన్సెట్నుద్దేశించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పటం... ఆయన గత కాలపు అధ్యక్షులందరికన్నా గొప్ప స్నేహితుడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కీర్తించటం ప్రపంచ ప్రజానీకమంతా వీక్షించింది. హమాస్ చెరలో మిగిలిన 20మంది ఇజ్రాయెల్ పౌరులూ విడుదల కావటం, అటు ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న దాదాపు 10,000 మంది పాలస్తీనా పౌరుల్లో 1,718 మందిని ఆ దేశం విడుదల చేయటం పూర్తయింది. విముక్తులై సొంతగడ్డపై అడుగుపెట్టిన బందీలకూ, ఖైదీలకూ లభించిన అపూర్వ స్వాగతాలు గమనిస్తే వారి కోసం అయినవారు ఎంత ఆత్రంగా నిరీక్షించారో అర్థమవుతుంది. బందీలది రెండేళ్ల చెర అయితే...ఖైదీలది అంతకన్నా చాలా ఎక్కువ. వారిలో మూడేళ్ల నుంచి ఇరవయ్యేళ్ల వరకూ జైళ్లలో మగ్గుతున్నవారున్నారు. పలువురికి తిరిగి పాలస్తీనాలో అడుగుపెట్టేందుకు అనుమతి లేదంటూ ఈజిప్టుకు తరలించారు. అసలు చాలామందికి వెళ్లి నివసించేందుకు కొంపా గోడూ లేవు. అవన్నీ క్షిపణి దాడుల్లో కుప్పకూలాయి. శాంతి అంటే కేవలం యుద్ధం లేకపోవటమో, కాల్పుల విరమణకు అంగీకరించ టమో కాదు. పశ్చిమాసియాకు సంబంధించినంతవరకూ అదెంత మాత్రమూ సరిపోదు. ఎందుకంటే అక్కడ ఎంత త్వరగా కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందో, అంత త్వరగానూ ఉల్లంఘనలు కూడా మొదలైపోతాయి. యుద్ధానికీ, యుద్ధానికీ మధ్య ఏర్పడే తాత్కాలిక ఉపశమనంగా అది మారిపోయింది. 1978లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జిమ్మీ కార్టర్ కాలంలో కుదిరిన క్యాంప్ డేవిడ్ ఒప్పందం మొదలుకొని ఇందుకు ఎన్ని ఉదాహరణలైనా చూపవచ్చు. చిత్రమేమంటే 1993లో కుదిరిన ఓస్లో–1 ఒప్పందం ద్వారా ఇజ్రాయెల్ ఉనికిని పాలస్తీనా విమోచన సంస్థ (పీఎల్ఓ) గుర్తించగా, పాలస్తీనా ప్రజలకు ‘నిజమైన ప్రతినిధి’గా పీఎల్‌ఓను ఇజ్రాయెల్ గుర్తించింది. కానీ అందువల్ల పీఎల్ఓకు ఒరిగింది లేకపోగా, అది వలసవాద పోలీసు దళంగా మిగిలింది. దాన్ని నీరుగార్చేందుకు అనంతర కాలంలో హమాస్‌కు పురుడుపోసింది కూడా ఇజ్రాయెలే. 1995 నాటి ఓస్లో–2 ఒప్పందమూ ఇంతే. ఇలా ఇరుపక్షాల మధ్యా కుదిరిన మధ్య వర్తిత్వాలూ, రాజీలూ అసంఖ్యాకం. కానీ వైమానిక, క్షిపణి దాడులు వాస్తవం... శాంతి మిథ్య. ఇజ్రాయెల్‌కు నిరంతరాయంగా అమెరికా సైనిక సాయం అందుతూనే ఉంటుంది. హమాస్ ఉగ్రదాడి తర్వాత 2023 నుంచి ఇంతవరకూ ఇజ్రాయెల్‌కు లభించిన అమెరికా సైనిక సాయం విలువ 2,200 కోట్ల డాలర్ల పైమాటే.తాజా ఒప్పందం హమాస్ 72 గంటల్లో తన దగ్గరున్న బందీలందరినీ విడుదల చేయాలని, చనిపోయివుంటే మృతదేహాలు అప్పగించాలని నిర్దేశించింది. కానీ మొత్తం 20 అంశాల్లోనూ ఇజ్రాయెల్‌కు నిర్దిష్ట కాలపరిమితిని సూచించే ప్రతిపాదనలేవీ లేవు. అసలు స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుపై స్పష్టత లేదు. ధ్వంసమైన ఆవాసప్రాంతాల పునర్నిర్మాణం సంగతి, జవాబుదారీతనం ఊసు లేదు. ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా గాజాను తీర్చిదిద్దుతామని ఇప్పటికే ట్రంప్ చెప్పారు. దాని ప్రసక్తి ఇందులో లేకపోయినా చివరకు ఆ దిశగా పావులు కదిపేలా పరిణామాలు ఉండబోతాయన్నది స్పష్టం. అటు షర్మ్ అల్ షేక్‌లో ఆర్భాటంగా జరిగిన శిఖరాగ్ర శాంతి సదస్సుకు నెతన్యాహూ రాకపై తుర్కియే, ఇరాక్‌లు అభ్యంతరం చెప్పటంతో చివరి నిమిషంలో ఆయన ఆగిపోవటమైనా... ఈ సదస్సుకు ఆఖరి నిమిషంలో ఆహ్వానం అంది వచ్చిన పాలస్తీనా అధ్యక్షుడు మహ్ముద్ అబ్బాస్ ప్రేక్షకుడిగా మిగిలిపోవటమైనా జరగబోయేదేమిటో సూచిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ చొరవ తీసుకుని ట్రంప్ దగ్గరకు ఆయన్ను తీసుకెళ్లటం, వారిద్దరూ కొన్ని సెకన్లు సంభాషించుకోవటం చిన్నపాటి ఓదార్పు. ఎన్ని లోటుపాట్లున్నా ఇప్పుడు కుదిరిన ప్రశాంతత శాశ్వతం కావాలని ఆశించనివారంటూ వుండరు. అది సాకారం కావాలంటే ప్రపంచ ప్రజాభిప్రాయం ఇంకా పదునెక్కాలి. దురాక్రమణలు కనుమరుగై స్వేచ్ఛాయుత పాలస్తీనా దిశగా అడుగులు పడాలి. -
బిహార్‌లో కొత్త ప్రయోగం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పరుగు పందెంలో తనది ముందంజేనని పాలక పక్షమైన ఎన్డీయే నిరూపించుకుంది. ఆదివారం చర్చోపచర్చల తర్వాత జేడీ(యూ), బీజేపీలు చెరో 101 సీట్లకూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. భాగస్వామ్య పక్షాల్లో ప్రధానమైన లోక్ జనశక్తి పార్టీకి 29 స్థానాలీయగా, మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ నేతృత్వంలోని హిందూస్తానీ అవామీ పార్టీ (సెక్యులర్), ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్ఎల్ఎం)కు ఆరేసి సీట్ల చొప్పున కేటాయించారు. సర్దుబాటు వ్యవహారం గమనిస్తే బిహార్‌ను గత నాలుగు దశాబ్దాలుగా శాసిస్తున్న మండల్ రాజకీ యాల ప్రభావం కొడిగట్టిందని బీజేపీతోపాటు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా భావిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. వేర్వేరు కారణాలతో ఈసారి బిహార్ పతాక శీర్షికలకెక్కింది. హడావిడిగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణకు పూనుకోవటం వివాదాస్పదంగా మారింది. బీజేపీ వ్యతిరేక ఓటర్ల పేర్లు తొలగింపే దీని ఆంతర్యమని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. వచ్చే నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగబోయే పోలింగ్ కూడా పెద్ద వార్తే. 2010లో ఆరు దశలలో పోలింగ్ జరిగిన ఆ రాష్ట్రంలో అది క్రమేపీ తగ్గుతూ వస్తోంది. క్రితంసారి దాన్ని మూడు దశలకు కుదిస్తే, ఈసారి రెండు దశలుగా మారింది. తొలి దశలో జరిగే 121 స్థానాల్లో అత్యధిక భాగం మధ్య బిహార్ లోనివి కాగా, కొన్ని ఉత్తరప్రదేశ్‌కు పొరుగు నున్నాయి. రెండో దశలోని 122 స్థానాలూ నేపాల్ సరిహద్దుల్లోనూ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల పొరుగున ఉన్నాయి.ఎన్డీయే సీట్ల పంపకమే అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలిసారి 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు కుదిరినప్పటినుంచీ జేడీ(యూ) తనకు రావాల్సిన సీట్ల సంఖ్యపై పట్టుదలతో ఉండేది. తమదే పెద్ద పార్టీ గనుక అత్యధిక స్థానాలుండాలని కోరేది. కానీ 2020 ఎన్నికల్లో ప్రజలు జేడీ(యూ)ను బాగా దెబ్బతీశారు. అప్పుడు పట్టుబట్టి బీజేపీ కన్నా ఒక్క సీటైనా తనకు అధికంగా ఉండాల్సిందేనని కోరి 122 స్థానాలు తీసుకున్న జేడీ(యూ), ఒప్పందం ప్రకారం తన వాటా నుంచి మరో భాగస్వామ్య పక్షమైన హిందూస్తానీ ఆవామ్ మోర్చా (హెచ్ఏఎం)కు 11 ఇచ్చింది. 111 చోట్ల పోటీ చేయగా తీరా గెల్చుకున్నవి 43 మాత్రమే. 121 స్థానాలు రాబట్టుకున్న బీజేపీ, వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ)కి 11 కేటాయించింది. 110కి పోటీ చేసి 74 చోట్ల విజయం సాధించింది. అప్పుడు ఎన్డీయే నుంచి బయటకుపోయి 135 చోట్ల పోటీ చేసిన లోక్ జనశక్తి ఒక స్థానమే గెల్చుకున్నా 33 చోట్ల తమను దెబ్బతీయగలిగిందన్న బాధ జేడీ(యూ)ను పీడించింది. బీజేపీ లోపాయకారీ మద్దతు వల్లే ఇలా జరిగిందన్న అభిప్రాయం ఏర్పడింది. అందుకే సీఎంగా ఉన్నా మధ్యలోనే ఎన్డీయేకు గుడ్‌బై చెప్పి మహా కూటమి వైపు వెళ్లి సీఎం పదవిని పదిలం చేసుకున్నారు నితీశ్. కానీ అది కూడా ఎంతోకాలం సాగలేదు. తిరిగి ఎన్డీయే వైపు వచ్చారు. బిహార్ రాజకీయాల్లో నితీశ్ శకం ముగిసిందనీ, తన ప్రాభవం మొదలైందనీ బీజేపీ విశ్వసిస్తోంది. తాజా సర్దుబాటులో 29 స్థానాలు పొందిన ఎల్జేపీ పూర్తిగా తన చెప్పుచేతల్లో ఉంటుంది గనుక ఈసారి సీఎం పదవి సునాయాసంగా రాగలదని భావిస్తోంది. క్రితం అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీశే తమ సీఎం అని చెప్పిన ఎన్డీయే ఇప్పుడు మౌనం వహించటాన్ని జేడీ(యూ) కూడా గమనించకపోలేదు. కానీ ఆ పార్టీకి వేరే గత్యంతరం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనే జేడీ(యూ) కన్నా ఒక స్థానం అధికంగా డిమాండ్ చేసి సాధించుకున్న బీజేపీ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే సరళిని అనుసరిస్తుందని నితీశ్ ముందే గ్రహించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీది పైచేయి అయితే అది నితీశ్‌కు మాత్రమే కాదు... మొత్తంగా మండల్ రాజకీయాలకే విఘాతం. ఎందుకంటే బీజేపీ అధికారం కైవసం చేసుకోవటమంటే విపక్ష ఆర్జేడీని కూడా వెనక్కి నెట్టినట్టే అవుతుంది. పైగా జాతీయ స్థాయిలో బీజేపీ బలం పుంజుకోవటానికి దోహదపడుతుంది. ఇంత కీలకమైన ఈ పోరులో తమ వైఖరి మారబోదని బిహార్ ఓటర్లు తేలుస్తారా... బీజేపీ కోరుకునే కొత్త దోవన పయనిస్తారా అన్నది వచ్చే నెల ఎన్నికల తర్వాత వెలువడబోయే ఫలితాలతో వెల్లడవుతుంది. -
హాస్టళ్లా... నరక కూపాలా?
‘‘ప్రతి బాల్యంలోనూ ఓ నందనోద్యానం ఉంటుంది. అది మెరిసిపోయే రంగులతో అల్లుకున్న మంత్రముగ్ధ నగరి. పిల్ల తెమ్మెరలక్కడ మృదువుగా హత్తుకుంటాయి. ప్రతి ఉదయమూ అక్కడ పరిమళ భరితమే’’ – బాల్యం గురించి ఓ రచయిత్రి అలా వర్ణించారు. బాల్యం ఇలాగే ఉండాలి. ఈ విధంగానే ఎదగాలని చాలామంది కోరుకుంటారు. అందుకే ప్రతి నాగరిక దేశం బాలల హక్కులకు ప్రత్యేక రక్షణను ఏర్పాటు చేసింది. భారత రాజ్యాంగం కూడా అటువంటి ఏర్పాట్లు చేసింది. స్వయంగా తల్లిదండ్రులే తమ పిల్లల్ని స్వల్పంగా దండించినా సహించకుండా జైల్లో పెడతారు స్కాండినేవియన్ దేశాల్లో! ఏ జాతికైనా అమూల్య సంపద బాలలే కనుక మానవత్వం సున్నితత్వమున్న వ్యవస్థలన్నీ బాలల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాయి. ‘మనం చూడలేని కాలానికి మనం పంపించే సజీవ సందేశాలు పిల్లలే’! కనుక వారికా ప్రత్యేక హక్కులుంటాయి.ఆచరణలో ప్రతి బాల్యం నందనోద్యానంలా ఉంటున్నదా? ఏలుతున్నవారు అలా ఉండటానికి అనుమతిస్తున్నారా? అందమైన బాల్యాన్ని అంగడి సరుకుగా మార్చడానికి దోహద పడుతున్న ప్రభుత్వాలనిప్పుడు చూస్తున్నాము. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే పేద పిల్లలకు కూడా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరగాలని ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసినప్పుడు మోకాలడ్డే ప్రయత్నం చేసిందెవరు? ఆ ప్రయత్నం చేసిన చంద్రబాబు కూటమే ఇప్పుడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఎత్తివేసింది. విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యతలు కావనేది ఆయన ఫిలాసఫీ. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకున్నారు. కనుకనే ఆయన మళ్లీ గద్దెనెక్కగానే కొనగలిగినవారికి నాణ్యమైన విద్య... లేనివారికి నాసిరకం విద్యావిధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానపు దుర్మార్గానికి పుట్టిన విషపు పుండే మొన్నటి కురుపాం ఘటన.పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థుల్లో కామెర్ల వ్యాధి ప్రబలిన నేపథ్యాన్ని గమనిస్తే ఒళ్లు జలదరిస్తుంది. లక్షలాదిమంది పేద తల్లిదండ్రులు వారి బిడ్డల భవిష్యత్తుపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏపీ సర్కార్ వమ్ము చేస్తున్న వైనం దిగ్భ్రాంతికరమైనది. కురుపాం ఆశ్రమ పాఠశాలలో ఉంటున్నది ఆరొందల పైచిలుకు బాలికలే కావచ్చు. అన్ని రకాల సంక్షేమ హాస్టళ్ళు, అన్ని రకాల ఆశ్రమ పాఠశాలలూ కలిపి ఏపీలో 3,800కు పైగా ఉన్నాయి. వీటిల్లో లక్షలాది మంది పేదవర్గాల పిల్లలు ప్రభుత్వం మీద భరోసాతో తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటు న్నారు. ప్రస్తుత ప్రభుత్వపు విధానపరమైన వైఖరి ఫలితంగా కొద్దిపాటి తేడాలు తప్ప కురుపాం ఆశ్రమ పాఠశాలకు పూర్తి భిన్నమైన పరిస్థితులు ఎక్కడా లేవు. కురుపాం దారుణానికి సంబంధించిన ప్రకంపనలు తగ్గకముందే గుంటూరు జిల్లాలో బీసీ హాస్టల్ విద్యార్థులు సామూహికంగా అస్వస్థులు కావడం నివ్వెరపరిచింది. గత ఏడాది కాలంగా ఈ తరహా వార్తలు అడపాదడపా వెలుగు చూస్తున్నా ఎటువంటి చర్యలూ తీసుకోక పోవడంతో పరిస్థితులిప్పుడు దారుణంగా దిగజారాయి.అసలేం జరిగింది కురుపాంలో? మరొకసారి పునరా లోకనం చేసుకోవాలి. కురుపాం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరొందల పైచిలుకు విద్యార్థినులుంటున్నారు. సగటున ఇరవై మందికో మరుగుదొడ్డి. వాటి నిర్వహణ కూడా అంతంత మాత్రమే. డ్రైనేజీ ఏర్పాట్లు సరిగా లేక మురుగు నీరంతా ఒక పక్కకు చేరి అక్కడినుంచి బోర్ నీళ్లలో కలిసిపోతున్నదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. దసరా సెలవులు ప్రకటించిన తర్వాత సొంత ఊరికి వెళ్లిన అంజలి అనే బాలిక కామెర్ల లక్షణాలతో సెప్టెంబర్ 25న చనిపోయింది. తోయక కల్పన అనే టెన్త్ క్లాస్ చదువుతున్న బాలిక పది రోజులపాటు స్థానిక జిల్లా ఆస్పత్రుల్లో చికిత్స తీసుకొని నయం కాకపోవడంతో వైజాగ్ కేజీహెచ్‌లో చేరింది. సెప్టెంబర్ 29న ఆ బాలిక కూడా కామెర్ల వ్యాధి (హెపటైటిస్ ఏ)తో ప్రాణాలు కోల్పోయింది. అంటే ఆశ్రమ పాఠశాలకు సెలవులు ఇవ్వకముందే కామెర్ల లక్షణాలు బయటపడినట్టు స్పష్టమవుతున్నది.కురుపాంలోనే మరో హాస్టల్లో చదువుతున్న ఇంకో ఇద్దరు బాలురు అక్టోబర్ 5, 6 తేదీల్లో ఇవే లక్షణాలతో చనిపోయారు. గిరిజన బాలికల గురుకులం నుంచి మొత్తం 170 మంది బాలికలకు కామెర్లు సోకి ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో యాభై మంది విశాఖ కేజీహెచ్ దాకా రావలసి వచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో బాలికలకు సురక్షిత మంచినీటి కోసం ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం దానికి రిపేర్ రావడంతో పక్కన పడేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్న సమాచారం ప్రకారం డ్రైనేజీ వ్యవస్థ లేక మరుగుదొడ్ల మురుగు నీరు కలుస్తున్న బోర్ నీటినే బాలికల చేత తాగిస్తున్నారు. వంటకూ వాటినే వినియోగిస్తున్నారు. విద్యార్థుల మెడికల్ రిపోర్టులు కూడా దాన్నే నిర్ధారిస్తున్నాయి. మురుగుతో నీటి కాలుష్యం వల్లనే విద్యార్థులు ‘హెపటైటిస్–ఏ’ వ్యాధికి గురయ్యారని చెబుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే నిర్వాహకులు ఏం చేస్తున్నట్టు? పిల్లల చేత మురుగునీళ్లు తాగిస్తూ ఉపాధ్యాయులు మాత్రం మినరల్ వాటర్ తెచ్చుకుని తాగేవారని గిరిజన పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.పిల్లలు తరచూ అస్వస్థతకు గురవుతుంటే నిర్వాహకులు వారిని ఇళ్ళకు పంపించి చేతులు దులిపేసుకోవడమేమిటి? పై అధికారులకు వీళ్లు రిపోర్టు చేయలేదా? చేసినా వారు పట్టించు కోవడం లేదా అన్నది తేలాల్సి ఉన్నది. యథా రాజా తథా ప్రజా అంటారు కదా! పేద పిల్లల ఆరోగ్యం సంగతి ప్రభుత్వానికే పట్టనప్పుడు తమకెందుకని అధికారులు అలక్ష్యంతో ఉంటు న్నారేమో తెలియదు. విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, ఐటీడీఏ, జిల్లా యంత్రాంగాలు, వాటి అధికార శ్రేణులు ఉన్నప్పటికీ ఇన్ని దుర్ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి?సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం కోసం అనుసరించ వలసిన ప్రోటోకాల్‌ను కూడా పాటించకపోవడం విస్మయం కలిగించే విషయం. ఆర్వో ప్లాంట్ చెడిపోతే వెంటనే ఎందుకు బాగు చేయించలేదు? నిర్ణీత కాలానికోసారి తాగునీటికి నాణ్యతా పరీక్షలు చేయడం లేదా? ఒకరిద్దరు పిల్లలు జబ్బుపడిన తర్వాత మిగిలిన పిల్లల విషయంలో వ్యాధి నిరోధక చర్యలు చేపట్టారా, లేదా? కనీసం తాగునీటిని క్లోరినేషన్ చేసినా ఇటువంటి ఘటనలు జరిగేవి కావు కదా!సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల విద్యార్థుల ఆరోగ్య, వసతి సమస్యలపై ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా వరసగా అనేక దుర్ఘటనలు ఈ ఏడాది కాలంలో రికార్డయ్యాయి. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన సంక్షేమ హాస్టళ్ల గురుకులాల్లోనే ఈ కాలంలో 11 మంది విద్యార్థులు అనారోగ్య కారణాలతో చనిపోయారు. తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేడ్కర్ సంక్షేమ గురుకులంలో పాచిపోయిన ఆహారం పెట్టడం వల్ల వందమంది విద్యార్థులు అస్వస్థులయ్యారు. ఇటువంటి ఘటనే అదే జిలాల్లోని జ్యోతిబా ఫూలే బీసీ హాస్టల్లో జరిగింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం, అనకాపల్లి జిల్లా రాజగోపాలపురం, నూజివీడు ట్రిపుల్ ఐటీల్లో కూడా కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు జబ్బుపడిన ఘటనలు జరిగాయి. ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని బీసీ హాస్టల్లో కలుషితాహారం తిని 50 మంది విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారు. శనివారం నాడు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగి తమ పిల్లల్ని హాస్టల్ నుంచి ఖాళీ చేయించారు. సంపన్నుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లలో మిగిలిపోయిన ఆహారాన్ని మర్నాడు తీసుకొచ్చి హాస్టల్ విద్యార్థులకు పెట్టడం ఏపీలో ఇప్పుడో ట్రెండ్‌గా మారింది. పాచిపోయిన ఆహారం తిని పిల్లలు అస్వస్థతకు గురైన ఘటనలు పలుచోట్ల జరిగాయి.తాజాగా కురుపాంలో జరిగిన ఘటన మానవత్వానికే సవాల్ విసురుతున్నది. ఆరొందల మందికి పైగా బాలికలు రోజుల తరబడి మురుగునీళ్లు తాగవలసిన పరిస్థితి ఎవరి పాపం? పక్కనే ఉన్న విశాఖ నగరంలో అతి ఖరీదైన భూముల్ని కారుచౌకగా లుల్లూ భయ్యాలకూ, లల్లూ భయ్యాలకూ కట్టబెడు తున్న సర్కార్, ఏజెన్సీ గిరిజన బిడ్డలకు శుభ్రమైన మంచినీటిని కూడా ఎందుకు నిరాకరిస్తున్నట్టు? చంద్రబాబును పెత్తందారీ వర్గాల ప్రతినిధిగా పిలవడం ఇటువంటి కారణాల వల్లనే! పేదల సంక్షేమాన్ని ‘పీ–4’కు అప్పగించాలని ఆయన నిర్ణయించారు. సంపన్నుల ఫంక్షన్లలో మిగిలిపోయిన, పాచిపోయిన ఆహారాన్ని పేదలకు పంచడం లాంటిదే ‘పీ–4’ ఫిలాసఫీ. ఇదేనా మన రాజ్యాంగం చాటిచెప్పిన సమానత్వం? ఎటువంటి వివక్షా లేకుండా అన్ని వర్గాల పిల్లలందరూ ఉచితంగా విద్యను అభ్యసించడమే కాదు, వారి ఆరోగ్య సంరక్షణ కూడా ప్రాథమిక హక్కుల్లో భాగమే. కూటమి సర్కార్ హయాంలో సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న ఉదంతాలు కచ్చి తంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలే. జీవించే హక్కును కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తున్నట్టే!కామెర్ల వ్యాధి ప్రబలుతున్నదని తెలిసిన తర్వాత కూడా పాఠశాల నిర్వాహకులు, అధికారులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగానే ఉన్నది. వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం వల్లనే విద్యార్థులకు కామెర్ల వ్యాధి సోకిందని సాక్షాత్తూ ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించడం గిరిజన ప్రజానీకాన్ని అవమానించడమే! నలతగా ఉంటున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా వారిని ఇళ్లకు పంపించి పాఠశాల నిర్వాహకులు చేతులు దులుపుకొన్నారు. సరైన వైద్యం అందించకుండా కాలయాపన చేసి, రోజుల తరబడి స్థానిక ఆస్పత్రుల్లో తిప్పి చివరకు మాత్రమే కేజీహెచ్‌కు తరలించినందువల్లనే కల్పన అనే బాలిక చనిపోయింది. బాలిక మరణానికి కారణం సెరెబ్రల్ మలేరియా అని రాశారట! వైద్యులు చికిత్స చేసింది కూడా దానికేనా? అధికారుల ఒత్తిడికి లొంగి వైద్యులు అలా రాయ వచ్చునా? చనిపోయిన పిల్లలకు పోస్ట్‌మార్టమ్ ఎందుకు నిర్వహించలేదు? కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పిల్లల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారనే వార్తలు రాగానే వారిని బలవంతంగా డిశ్చార్జి చేయించడానికి అధికారులు ఎందుకు ప్రయాస పడినట్టు? దాచేస్తే సత్యం దాగుతుందా? విద్య, వైద్యం ఉచితంగా అందజేయడం ప్రభుత్వం విధానం కాదనేది కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు వైఖరి. అందువలన పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ఆయనకు ప్రాధాన్య రంగం కాదు. వారికి పోషకాహారం, వసతి సౌకర్యాలు వారి ఎజెండాలో ఉండవు. ఈ విధానానికి వ్యతిరేకంగా పోరాడటమా? లేక మౌనంగా అవమానాలు దిగమింగి అన్యాయాలను సహించ డమా? ఏ మార్గం అనుసరించాలో పేద–మధ్యతరగతి వర్గాల ప్రజలు, ప్రజాస్వామ్య – రాజ్యాంగవాదులు నిర్ణయించుకోవ లసి ఉంటుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
గాజాలో శాంతివీచిక!
రెండేళ్ల నుంచి అవిచ్ఛిన్నంగా క్షిపణులు, బాంబుల వర్షంతో కంటిమీద కునుకు లేకుండా గడిపిన గాజా ఇకపై గుండెల నిండా ఊపిరి పీల్చుకోనుంది. హమాస్– ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయిందనీ, ఇరు పక్షాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయనీ, శాంతి ప్రణాళికలో ఇది తొలి దశ అనీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన గమనిస్తే పూర్తిస్థాయి శాంతి స్థాపనకు మరికొంత సమయం పట్టొచ్చని స్పష్టంగానే తెలుస్తోంది. ఇంత హడావిడిగా సంధి కుదిరినట్టు ప్రకటించటం వెనక శుక్రవారం ప్రకటించబోయే నోబెల్ శాంతి బహుమతికి అర్హత సాధించటం కోసమేనని అందరికీ తెలుసు. ట్రంప్ అందుకు అర్హుడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సిఫార్సు చేస్తున్నారు. తమ భూభాగంలోకి చొరబడి 2023 అక్టోబర్ 7న 1,100 మంది పౌరులను హతమార్చి, 251 మందిని అపహరించుకుపోయిన హమాస్ దుందుడుకు చర్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ 24 నెలల పాటు గాజాపై నిప్పుల వాన కురిపించింది. ఏ క్షిపణి ఎక్కడ పడుతుందో, ఏ బాంబు ఎవరి ప్రాణం తీస్తుందో తెలియక గాజా వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. జనావాస ప్రాంతాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా క్షిపణులు ప్రయోగించటం, ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు క్షణంలో కూలి శిథిలాల గుట్టగా మారటం ప్రపంచ ప్రజలంతా చూశారు. కనీసం ఇద్దరో ముగ్గురో మరణించని కుటుంబం లేదు. కొన్ని కుటుంబాలైతే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మధ్యలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాలు... ఇజ్రాయెల్ ఉల్లంఘనల వల్ల పెద్దగా ఉపశమనం ఇచ్చింది లేదు. దీన్ని యుద్ధం అనడం ఇజ్రాయెల్ సాగించిన నరమేధాన్ని కప్పిపుచ్చే యత్నమే అవుతుంది. బలాబలాల్లో ఎంత వ్యత్యాసం ఉన్నా రెండు దేశాల మధ్య పరస్పరం కొన సాగే ఘర్షణల్ని యుద్ధం అంటారు. ఇక్కడ జరిగిందంతా వేరు. ఇజ్రాయెల్ లోపాయకారీ మద్దతుతో ఎన్నికల ద్వారా అధికారం చేజిక్కించుకుని గాజా ప్రజలపై పెత్తనం సాగిస్తూ, పాలస్తీనా అథారిటీని బేఖాతరు చేస్తూ వచ్చిన హమాస్ ఉన్నట్టుండి ఉగ్రవాద దాడికి పూనుకొంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో అధికారిక లెక్కల ప్రకారమే 67,183 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 1,69,841 మంది గాయాల పాలయ్యారు. వైద్య సిబ్బంది, పాత్రికేయులన్న విచక్షణ లేకపోగా, చాలా సందర్భాల్లో వారిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యాలు హతమార్చటం ఆధునిక చరిత్రలో కనీవినీ ఎరుగనిది. దాడులు ఆగుతాయంటున్నారు గనుక శిథిలాల తొలగింపు మొదలవుతుంది. అప్పుడు గానీ మృతుల అసలు సంఖ్య ఎంతో తెలియకపోవచ్చు. ఇప్పటికీ ఆచూకీ తెలియనివారు వేలల్లో ఉన్నారు. ఇజ్రాయెల్ ఘాతుకాల వెనక జాత్యహంకారం స్పష్టంగా కనబడుతుండగా, ఆ దుండగాన్ని ధర్మబద్ధంగా వ్యతిరేకించినవారిని యూదులపై వివక్ష ప్రదర్శిస్తున్నవారిగా జమకట్టి వేధించటం, విశ్వవిద్యాలయాల్లోకి పోలీసులు చొరబడి అరెస్టులు చేయటం ట్రంప్ నైజానికి అద్దం పడుతుంది. గాజాలో హమాస్ ఒక్కటే లేదు. పాలస్తీనా విమోచన కోసం పోరాడే సంస్థలు డజను వరకూ ఉన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వెనక్కి పోలేదు. గాజాలోనే ఒక హద్దు నిర్ణయించుకుని ఆగింది. ఇప్పుడు కుదిరిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఎంతవరకూ గౌరవిస్తుందో తెలియదనీ, ఒప్పందంలోని చాలా క్లాజులు అస్పష్టతతో ఉన్నా కేవలం ట్రంప్ హామీని నమ్మి సమ్మతించామనీ ఆ సంస్థల ప్రతి నిధులు చెబుతున్న తీరు గమనార్హం. ట్రంప్‌కు నోబెల్ వస్తే తప్ప ఈ ఒప్పందం సజావుగా ముందుకు పోదు. రెండో దశ చర్చల్లోనే అసలు అంశాలు ప్రస్తావనకొస్తాయి. అప్పుడు మరణమో, శరణమో పాలస్తీనా సంస్థలు తేల్చుకోక తప్పదు. ట్రంప్‌కు పురస్కారం లభిస్తే గాజా వాసులకు ఉన్నంతలో గౌరవప్రదమైన పరిష్కారం దొరకొచ్చు. రాకపోతే పరిణామాలు వేరుగా ఉండే అవకాశం ఉంది. అయితే నరమేధాన్ని కొనసాగించటం ఇక సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే హమాస్ చెరలోని బందీలంతా విడుదలయ్యారు. అటు ఇజ్రాయెల్ జైళ్లలోని పాలస్తీనా పౌరులు దాదాపు 2,000 మంది విడుదలవుతున్నారు. గాజా విషయంలో ఐక్యరాజ్య సమితిలో అమెరికా, ఇజ్రాయెల్ ఒంటరిగా మిగిలిపోయిన కొన్ని రోజులకే ఆ రెండు దేశాలూ తమకేం పట్టనట్టు ఈ శాంతి ఒప్పందం సాధించటం ఒక వైచిత్రి. -
తాలిబన్లతో సఖ్యత!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులుండరన్న నానుడి దౌత్యానికి కూడా వర్తిస్తుంది. పైకి ఏం చెబుతున్నా, ఇతరేతర ప్రత్యామ్నాయాల సాధ్యాసాధ్యాలను పరిశీలించటమనే ప్రక్రియ దౌత్యంలో నిరంతరం కొనసాగుతుంటుంది. పర్యవసానంగా ఒక్కోసారి అనూహ్య పరిణామాలు కూడా చోటుచేసుకోవచ్చు. తాలిబన్ల ఆధ్వర్యంలోని అఫ్గానిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ గురువారం అయిదు రోజుల భారత సందర్శనకు రావటం అటువంటిదే. ఇది దక్షిణ, మధ్య ఆసియా భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేసే పరిణామం. ప్రపంచ దేశాల్లో రష్యా మినహా మరే దేశమూ ఇంతవరకూ అఫ్గాన్ ప్రభుత్వాన్ని లాంఛనంగా గుర్తించలేదు. మన దేశం తొలిసారి ఆ దిశగా అడుగులేస్తున్నది. అమీర్ ఖాన్ రానున్న సందర్భంగా తాలిబన్‌ను ప్రాంతీయ బృందంలోని భాగస్వామిగా గుర్తించటానికి భారత్ సిద్ధపడింది. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించటం ఇక లాంఛన ప్రాయం. భద్రతా మండలి ఉగ్రవాదులుగా గుర్తించి ఆంక్షలు విధించిన వారిలో అమీర్ ఖాన్ ఒకరు. దానికింద ఆయన తారసపడితే అరెస్టు చేయాల్సి ఉంటుంది. భారత్ చొరవతో ఈ విషయంలో తాత్కాలికంగా మినహాయింపు లభించింది.తొలిసారి 1996లో అఫ్గాన్ తాలిబన్ల వశమైనప్పుడు మనకు ఎన్ని విధాల సమస్య లొచ్చాయో ఎవరూ మరిచిపోరు. సోవియెట్ దురాక్రమణను ప్రతిఘటించి పాలనాధి కారాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు అనేకమంది మిలిటెంట్లను కశ్మీర్‌కు తరలించారు. పర్యవసానంగా అక్కడ నెత్తురుటేర్లు పారాయి. కేంద్రంలో వాజ్‌పేయి నాయ కత్వాన తొలి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక 1999లో ఉగ్రవాదులు ఖాట్మండు నుంచి న్యూఢిల్లీ వచ్చే విమానాన్ని హైజాక్ చేసి అఫ్గాన్‌లోని కాందహార్‌కు తరలించారు. ముగ్గురు ఉగ్రవాదుల్ని విడిపించుకున్నారు. ఈ చర్య వెనక నేరుగా తాలిబన్లు లేక పోయినా ఉగ్రవాదులు సురక్షితంగా వెళ్లటానికి సహకరించారు. తాలిబన్లతో చర్చలు గానీ, గుర్తింపుగానీ ఉండబోదని అప్పట్లో మన దేశం ప్రకటించింది. ఇంటా, బయటా వారు సాగిస్తున్న అరాచకాలను తీవ్రంగా ఖండించేది.ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా 2001లో అఫ్గాన్‌ను దురాక్రమించాక ఏర్పడిన ప్రభుత్వాలకు మన దేశం మద్దతుగా నిలిచింది. 2021లో తాలిబన్ల పునరాగమనంతో అష్రాఫ్ ఘనీ ప్రభుత్వం పడిపోయేవరకూ మన దేశం పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టింది. రూ. 25,000 కోట్ల వ్యయంతో పార్లమెంటు భవనాన్నీ, సల్మా ఆనకట్టనూ, ఒక జాతీయ రహదారినీ నిర్మించింది. విద్యుదుత్పాదన ప్రాజెక్టులు, విద్య, వైద్యం తదితరాల్లో పాలుపంచుకుంది. ఇవన్నీ తాలిబన్లలో సద్భావన కలిగించటంతో పాటు పాకిస్తాన్‌తో వచ్చిన విభేదాలు కూడా వారిని భారత్‌వైపు మొగ్గేలా చేశాయి. పాక్– అఫ్గాన్ దీర్ఘకాల సంబంధాలూ, ఉజ్బెకిస్తాన్ ద్వారా సన్నిహితం కావటానికి పాక్ చేస్తున్న ప్రయత్నాలూ, చైనా వరస మంతనాలూ మన దేశంలో కూడా పునరాలోచన కలిగించాయి. మనం ముందడుగు వేయనట్టయితే ఏదోనాటికి తాలిబన్–పాకిస్తాన్ సంబంధాలు మెరుగుపడి, చైనా పలుకుబడి పెరిగి అది మన భద్రతకు ముప్పు కలిగించే అవకాశం కూడా ఉంటుంది. పైగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మకంగా కీలకమైన అఫ్గాన్‌లోని బగ్రాం వైమానిక స్థావరాన్ని తమకు అప్పగించాలని కోరుతున్నారు. ఇది కూడా మన భద్రతను ప్రశ్నార్థకం చేసే పరిణామం. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోబట్టే తాలిబన్లతో సత్సంబంధాలకు మన దేశం సిద్ధపడింది. ఏ దేశానికైనా స్వీయ ప్రయోజనాలు, భద్రత అత్యంత కీలకం. ఆ తర్వాతే మిగిలిన వన్నీ. గత నాలుగేళ్లుగా మన దేశం వేలాది టన్నుల గోధుమలు, వందల టన్నుల మందులు, వ్యాక్సిన్లు, భారీ మొత్తంలో పురుగుమందులు, అత్యవసర సరుకులు పంపింది. ఇటీవల భూకంపం వచ్చినప్పుడు టెంట్లు, మందులు, దుప్పట్లు, జనరేటర్లు అందించింది. కాబూల్‌లో పూర్తిస్థాయి దౌత్య కార్యాలయం కాకపోయినా సాంకేతిక కార్యాలయాన్ని తెరిచింది. తాలిబన్ ప్రభుత్వం ఢిల్లీలో రాయబార కార్యాలయం ప్రారంభించుకోవటానికి అనుమతినిచ్చింది. ఈ అనుకూల వాతావరణంలో అఫ్గాన్‌తో సత్సంబంధాలకు ప్రయత్నించటం అనేక విధాల శుభ పరిణామం. -
దిక్కుతోచని ఫ్రాన్స్
తీరి కూర్చుని సమస్యలు తెచ్చుకోవటంలో, ఉన్నవాటిని పెంచుకోవటంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌కు ఎవరూ సాటిరారు. స్వీయ సమర్థతపై అతిగా అంచనా వేసుకుని ఆయన తీసుకుంటున్న వరస నిర్ణయాలు ఫ్రాన్స్‌ను నిలువునా ముంచేశాయి. పీఠమెక్కి నిండా నెల రోజులు కాకుండానే ప్రధాని సెబాస్టిన్ లెకొర్నూ సోమవారం నిష్క్రమించటం వాటి పర్యవసానమే. లెకొర్నూ కేబినెట్ ఏర్పాటు ప్రయత్నంలో మెక్రాన్ తలదూర్చి, తన అనుకూలురకు పదవులు ఇప్పించేందుకు ప్రయత్నించారు. కూటమిలోని ఇతర పక్షాలకు దీంతో ఆగ్రహం కలిగి బడ్జెట్‌కు మద్దతునీయబోమనీ, అవిశ్వాస తీర్మానం తెస్తామనీ చెప్పటంతో లెకొర్నూ రాజీనామా తప్పలేదు. మరో రెండు నెలల్లో బడ్జెట్ ఆమోదించకపోతే దేశం దివాలా స్థితిలో పడుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుండగా, తదుపరి ఏం చేయాలన్నది మెక్రాన్‌కు సైతం బోధపడటం లేదు. కరోనా మహమ్మారి కాటేయకముందు యూరప్‌లో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్సే. ఆ తర్వాత పల్టీలు కొట్టడం ప్రారంభమైంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం దాన్ని మరింత దెబ్బతీసింది. జర్మనీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తూ ఏదోమేరకు సఫలీకృతమవుతుంటే, ఫ్రాన్స్ మాత్రం గుడ్లు తేలేస్తోంది. అక్కడ పాలన అసాధ్యమైన స్థితికి చేరుకుంది. సామాజిక అశాంతి పెరగటం, నిజ వేతనాలు పడిపోయి ఉద్యోగ వర్గాల ఆగ్రహావేశాలూ, ఉపాధి కొరవడి యువత నిరాశ, ఆకాశాన్నంటుతున్న ధరలూ, అంతంతమాత్రంగా ఉన్న మార్కెట్లూ ఫ్రాన్స్‌ను కుంగదీస్తుండగా పులి మీద పుట్రలా ఈ రాజకీయ సంక్షోభం ముంచుకొచ్చింది. ఫ్రాన్స్ చరిత్రలో ఇలాంటి పరిస్థితి రాలేదని కాదు. 1946–58 మధ్య ఆ దేశం 22 ప్రభుత్వాలను చూసింది. ఎవరికీ మెజారిటీ రాని దశలో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వాలు పేకమేడల్లా కూలిపోవటమే అందుకు కారణం. పర్యవసానంగా అప్పటి అధ్యక్షుడు చార్లెస్ డీగాల్ భవిష్యత్తులో ఇంకెప్పుడూ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడకుండా నిరోధించేందుకు రాజ్యాంగాన్ని సవరించారు. అటుతర్వాత కూటమికి నాయకత్వం వహించే ప్రధాన పార్టీ మాటేచెల్లుబాటు కావటం రివాజైంది. ఇప్పుడు ఆయన్ను అనుకరించబోయి మెక్రాన్ బోర్లాపడుతున్నారు. ఫ్రాన్స్ కష్టాలకు కేవలం మెక్రాన్ ఒక్కరే కారణం కాదు. కానీ వాటిని మరిన్ని రెట్లు పెంచటంలో ఆయన పాత్ర కాదనలేనిది. 577 మంది సభ్యులుండే దిగువ సభ అసెంబ్లీ నేషనల్లో పాలక పక్షంగా అవతరించాలంటే కనీసం 289 మంది మద్దతు అవసరం. నిరుడు జూలైలో జరిగిన ఎన్నికల్లో వామపక్షాల సారథ్యంలోని న్యూ పాపులర్ ఫ్రంట్ 182 స్థానాలతో అగ్రభాగంలో ఉంది. మెక్రాన్ నాయకత్వంలోని మధ్యేవాద కూటమి ఎన్సెంబుల్కు 168 లభించాయి. వలసలను వ్యతిరేకించే తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ(ఆర్ఎన్) 143తో సరిపెట్టుకుంది. తొలి దశలో అందరికన్నా అత్యధిక శాతం ఓట్లు రాబట్టిన ఆర్ఎన్ను అధికారంలోకి రానీయకుండా రెండో దశలో వామపక్ష, మధ్యేవాద పార్టీలు అనుసరించిన సర్దుబాటు వ్యూహం ఫలించింది. కానీ ప్రభుత్వ ఏర్పాటులో మెక్రాన్ దీన్ని విస్మరించారు. తన విధానాలను వ్యతిరేకించే వామపక్షాలకు అధికారం అప్పగించరాదన్న కృతనిశ్చయంతో మధ్యేవాద పక్షాలతో ప్రయోగాలు మొదలుపెట్టారు. పర్యవసానంగా ఏడాదిలో ముగ్గురు ప్రధానులు వచ్చారు. పార్లమెంటు రద్దు చేయొద్దని అందరూ ఇచ్చిన సలహాను నిరుడు మెక్రాన్ బేఖాతరు చేశారు. ఎన్నికల తర్వాత మధ్యేవాద పక్షాలు పుంజుకుంటాయనీ, అప్పుడు తాననుకున్న రీతిలో పెన్షన్ల కోత, సంపన్నులకు రాయితీలు, ప్రభుత్వ వ్యయం అదుపు వగైరాలు అమలు చేయొచ్చనీ ఆయన భావించారు. కానీ అదంతా అడియాస అయింది. ఇప్పుడు నిజంగానే పార్లమెంటు రద్దు చేయక తప్పని స్థితి ఏర్పడింది. కానీ అలా చేస్తే ఆర్ఎన్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచే స్థాయికి పుంజుకోవచ్చనీ, దాని ప్రభావం 2027లో జరిగే అధ్యక్ష ఎన్నికలపై పడుతుందనీ మెక్రాన్ ఆందోళన. తక్షణ కర్తవ్యమైన బడ్జెట్ ఆమోదానికి తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఆయనకు స్పష్టత కొరవడింది. ఏతావతా ఫ్రాన్స్ కింకర్తవ్య విచికిత్సలో పడింది. -
బిహార్ ఎటువైపు?
కేంద్రంలోని పాలక పక్షం ఎన్డీయే, విపక్ష కూటమి ‘ఇండియా’ జీవన్మరణ సమస్యగా భావిస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 6, 11 తేదీల్లో రెండు దఫాలుగా పోలింగ్ జరగబోతోంది. 14న ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. వీటితోపాటు ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఎనిమిది స్థానాలకు ఉప ఎన్నికలుంటాయి. వివాదాస్పద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఎన్నికల జాబితాను నవీకరించాక అది స్వచ్ఛంగా మారిందని జ్ఞానేశ్ ఇప్పటికే చెప్పారు. బిహార్‌లో ఇంతవరకూ సొంతంగా అధికారం చవిచూడని బీజేపీ ఈసారి ఎలాగైనా ఆ అదృష్టాన్ని దక్కించుకోవాలని తహతహ లాడుతోంది. కానీ కేంద్రంలో మద్దతిస్తున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ)తో ఎప్పటిలా కూటమి కట్టక తప్పలేదు. 2020 అసెంబ్లీ ఎన్నికల అనంతర పరిణామాలను గుర్తుంచుకుంటే నవంబర్ 15 తర్వాత ఏం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తం స్థానాల సంఖ్య 243 కాగా, అప్పట్లో జేడీ(యూ) 122, బీజేపీ 121 స్థానాలు పంచుకున్నాయి. తమకన్నా ఒక్కటి ఎక్కువిచ్చి కాబోయే సీఎం నితీశేనని బీజేపీ చాటాల్సివచ్చింది. తీరా ఎన్నికలైన రెండేళ్లలోనే... అంటే 2022 ఆగస్టులో నితీశ్ ప్లేటు ఫిరాయించి ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహా కూటమితో చేయి కలిపి మళ్లీ సీఎం అయ్యారు. అది ఎక్కువకాలం సాగలేదు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండగా ఇండియా కూటమిని నిరుడు జనవరిలో చావుదెబ్బతీసి మళ్లీ ఎన్డీయే గూటికి చేరారు. ఫిరాయించిన ప్రతిసారీ సీఎం పదవికి రాజీనామా చేయటం, కొత్త కూటమి పక్షాన మళ్లీ దక్కించుకోవటం నితీశ్ ప్రత్యేకత. సాధారణ సమయాల్లో రాజకీయాలే ఊపిరిగా భావించే బిహార్ ప్రజానీకం పోలింగ్‌పై పెద్దగా ఆసక్తి చూపరంటే ఆశ్చర్యం కలుగుతుంది. అక్కడ సగటు పోలింగ్ శాతం ఎప్పుడూ 56 శాతం దాటలేదు. ఓటేసేవారిలో కూడా దాదాపు 60 శాతం మహిళలే. ఇది ప్రతిసారీ బీజేపీకి కలిసొస్తున్నది. క్రితంసారి ఎన్డీయేలో జేడీ(యూ) కేవలం 43 గెలుచుకుంది. బీజేపీ 74 సాధించింది. కానీ పొత్తు ధర్మానికి తలొగ్గి నితీశ్‌కే సీఎం పగ్గాలు అప్పగించింది. అప్పట్లో అలిగివెళ్లిన ఎల్జేపీ ఒక స్థానంమించి గెలవకపోయినా 33 చోట్ల అది జేడీ(యూ)ను దెబ్బ తీయగలిగింది. ఇప్పటికైతే ఆ పార్టీ ఎన్డీయే పంచన ఉంది.ఎంఐఎం వల్ల నష్టపోతున్నామన్నది విపక్షాల భావన. సీమాంచల్‌లో క్రితంసారి అది అయిదు గెల్చుకుంది. ఇక ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ పార్టీ ఏ మేరకు ఓట్లు చీల్చగలదో చూడాల్సి ఉంది. బిహార్‌లో వామపక్షాలు బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీలు 16 స్థానాలు సాధించాయి. రాష్ట్రంలో నితీశ్‌తో కలిస్తేనే అధికారం దక్కుతుందన్న భావన అన్ని పార్టీల్లోనూ ఉంది. అందుకే ఆయన ఎటు దూకినా, తిరిగొస్తే అక్కున చేర్చుకోవటం ప్రధాన పక్షాలకు అలవాటైంది. నాలుగు దఫాలు సీఎంగా చేశాక ఇంకా ఆయనలో ఆ ‘మ్యాజిక్’ ఉందా అన్నది ఈ ఎన్నికలు తేల్చేస్తాయి. 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బొత్తిగా జనాకర్షణ లేని పార్టీతో కలిసి వెళ్లినా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అద్భుతమైన పనితీరు కనబరిచారు. ఎన్డీయేతో పోలిస్తే కేవలం 16,825 ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యారు. ఈసారి ‘ఓట్ చోరీ’ ప్రచారం ప్రభావం వల్ల తన స్థితి మెరుగైందన్న భరోసాతో కాంగ్రెస్ స్వరం పెంచుతోంది. ఆర్జేడీకి అది గుదిబండగా మారుతుందా... లేక స్వీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా మెలగుతుందా అన్నది చూడాలి. సాధారణ సమయాల్లో జనాకర్షణ పథకాలు ప్రమాదమంటూ గంభీరంగా మాట్లాడే ఎన్డీయే, ఎప్పటిలాగే బిహార్‌లో చేతికి ఎముక లేకుండా తాయిలాలు ప్రకటించింది. గత నెలలో ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద 75 లక్షల మంది మహిళలకు రూ. 10,000 చొప్పున అందించారు. నెలకు రూ. 2,500 చొప్పున ఇస్తామన్న మహా కూటమి హామీకి ఇది విరుగుడు. ఏదేమైనా ఈసారి బిహార్ తీర్పుపై కేంద్రంలోని ఎన్డీయే కూటమి మనుగడ ఆధారపడి ఉంటుంది. అక్కడ బీజేపీ ప్రాభవం తగ్గితే జేడీ(యూ), టీడీపీలు తోకజాడించే ప్రమాదముంది. అదీగాక 2027 మార్చిలో జరిగే యూపీ ఎన్నికలపై కూడా దాని ప్రభావం పడుతుంది. ఇన్నివిధాల కీలకమైన బిహార్ ఎటు మొగ్గుతుందన్నది మరో నెల్లాళ్ల వ్యవధిలో తేలిపోతుంది. -
సారీ చెప్పకుండా... సంబరాలా?
నవరాత్రి ఉత్సవాలు మొదలుకొని దీపావళి పండుగ ముగిసే వరకూ ఈ నెల రోజుల సీజన్‌ను ఎన్డీఏ సర్కార్ హైజాక్ చేసింది. జీఎస్టీ పేరుతో వసూలు చేస్తున్న పన్నులను హేతుబద్ధీకరణ చేయడం వల్ల పేద, మధ్య తరగతుల ప్రజలకు బాగా ఆదా అవుతుందనీ, అందువల్ల ఈ సీజన్‌ను పొదుపు ఉత్సవంగా పాటించాలనీ దేశ ప్రజలకు ఎన్డీఏ సర్కార్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వాలు అధికారిక కార్యక్రమాలను కూడా ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ దీంతో పాటు మరో అంశాన్ని కూడా జోడించింది. అయితే దాన్ని అధికారిక కార్యక్రమాల్లో కలపకుండా పార్టీ వేదికల ద్వారా ప్రచారం చేసుకోవాలని సంకల్పించారు. వసూలు చేసిన కరెంటు బిల్లుల్లో యూనిట్‌కు 13 పైసల చొప్పున తిరిగి వినియోగదారులకు జమ చేస్తారట! దీన్నే ట్రూ–డౌన్ అంటున్నారు. ఇది చరిత్ర ఎరుగని మహత్కార్యం అన్నట్టు ముఖ్యమంత్రి ట్వీట్ కూడా చేశారు.నిజంగా ఇవి సంబరాలు చేసుకోదగిన సందర్భాలేనా? ఒంటినిండా వాతలు పెట్టి అక్కడక్కడా ఆయింట్మెంట్ రాస్తే ఉపశమనం లభించినట్టేనా! ఆ బాధితుడు అందుకు కృతజ్ఞతగా ఎగిరి గంతేసి పండుగ చేసుకోవాలా? జీఎస్టీని హేతుబద్ధం చేస్తున్నారంటే ఎనిమిదేళ్ల నుంచి అనుసరిస్తున్న విధానం నిర్హేతు కమైనదని అంగీకరించినట్టే కదా! ఈ ఎనిమిదేళ్లుగా సాధారణ ప్రజల రక్తాన్ని తాము జలగల్లా పీల్చుకున్నామని పరోక్షంగా చెప్పినట్టే కదా! ఈ హేతుబద్ధీకరణ వలన ప్రజలకు రెండున్నర లక్షల కోట్ల మేరకు లబ్ధి జరుగుతుందని ప్రధానమంత్రి ప్రకటించారు. దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇందులో మళ్లీ కొన్ని మెలికలున్నాయి. అందువల్ల ప్రభుత్వం చెబుతున్నంత స్థాయిలో ఉపశమనం కలుగదనే వాదన ఉన్నది. పాప్‌కార్న్ మీద జీఎస్టీ 5 శాతం మాత్రమే అన్నారు. కానీ బ్రాండెడ్ అయితే 12 శాతం, షుగర్ కోటెడయితే 18 శాతం జీఎస్టీ ఉంటుంది. జీవిత బీమా ప్రీమియం మీద జీఎస్టీ లేదన్నారు. కానీ అది వ్యక్తిగత బీమాలకు మాత్రమే వర్తిస్తుంది. గ్రూప్ బీమాకు జీఎస్టీ కట్టాల్సిందే. ఇలాంటివి చాలా ఉన్నాయి.స్థూలంగా పన్ను రేట్లు తగ్గడం వలన అదే నిష్పత్తిలో విని మయం కూడా పెరిగి ప్రభుత్వ ఖజానాకు వాటిల్లే నష్టం నామమాత్రంగానే ఉండబోతున్నదని ఎస్బీఐ ఇదివరకే అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే ఈ నవరాత్రి వేడుకల్లో వివిధ అంశాలవారీగా 25 శాతం నుంచి 100 శాతం వరకు గతంతో పోలిస్తే అమ్మకాలు పెరిగాయని అధికార వర్గాలను ఉటంకిస్తూ పత్రికల్లో వార్తలొచ్చాయి. ఈ ఎనిమిదేళ్లలో అమలు చేసిన గబ్బర్ సింగ్ ట్యాక్స్ విధానం వల్ల ప్రజలకు జరిగిన నష్టమెంత అనేదానిపై మాత్రం ఎటువంటి సింహావలోకనం అధికారికంగా జరగలేదు. జీఎస్టీ అమలుకు ముందు సంవత్సరం అంటే, 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు జీఎస్టీ పరిధిలో ఉన్న పరోక్ష పన్నుల ద్వారా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వా లకు సమకూరిన ఆదాయం సుమారు 12 లక్షల కోట్లని అంచనా. ఇదే ఆదాయం 2024–25 నాటికి 22 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇందులో ఏటికేడు సహజంగా వుండే వృద్ధి కొంత ఉండవచ్చు. కాని సింహభాగం వృద్ధి మాత్రం జీఎస్టీ ద్వారా సాధ్యమైనదే.అయితే ఇంత భారీ పెరుగుదలకు కారణమెవరు? దేశంలో ఈ పదేళ్లలో శరవేగంగా పుట్టుకొచ్చిన బిలియనీర్లూ, మిలియ నీర్లా? కానేకాదు. సాధారణ పేద మధ్య తరగతి ప్రజలు కడుపు కట్టుకొని ఖజానాకు ముడుపు కట్టిన ఫలితమే ఈ అసాధారణ పెరుగుదల. ఆదాయాల్లో, ఆస్తిపాస్తుల్లో అట్టడుగున ఉండే 50 శాతం మంది పేద ప్రజలు జీఎస్టీలో 64 శాతం చెల్లిస్తున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. వీరికంటే ఎగువన ఉండే 40 శాతం మంది జీఎస్టీ చెల్లింపుల వాటా 33 శాతం. ఇక అగ్రశేణి పది శాతం సంపన్నుల సంగతి. ఈ పదేళ్లలో వీరి సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని అనేక అధ్యయనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ పది శాతం కుబేరులు సమష్టిగా మోస్తున్న జీఎస్టీ భారం కేవలం మూడు శాతం. యాభై శాతం మంది పేదలు 64 శాతం చెల్లిస్తుంటే 10 శాతం పెద్దలు 3 శాతం చెల్లిస్తున్నారనేది ఈ జీఎస్టీ రాజ్‌లో ఒక కఠిన వాస్తవం. అధికాదాయం కలిగిన వారు చెల్లించడానికి జీఎస్టీ కాకుండా వేరే పన్నులున్నాయని వాదించవచ్చు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయ పన్ను, అధికాదాయంపై సర్ఛార్జ్, కేపిటల్ గెయిన్స్ అంతా కలిపి సమకూరింది 11,56,000 కోట్లు. అదే సమయంలో 50 శాతం పేదలు జీఎస్టీ రూపంలో చెల్లించింది 22 లక్షల కోట్లలో 64 శాతం. అంటే సుమారు 14 లక్షల కోట్లు. మన సమాజంలో త్యాగమెవరిదో, భోగమెవరిదో చెప్పడానికి ఈ అంకెలు అద్దం పడతాయి. ఈ జీఎస్టీ కాలంలోనే దేశ ప్రజల ఆదాయాల్లో పెరుగుతున్న అసమానతలపై ఆక్స్‌ఫామ్ లాంటి సంస్థలు ఏటేటా సవివర మైన నివేదికలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ విష యాలకు మరో కొత్త పార్శ్వం తోడైంది. కార్తీక్ మురళీధరన్ అనే ఆర్థికవేత్త శనివారం నాటి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ఒక వ్యాసం రాస్తూ ఆదాయాల పరంగా ఇండియాను మూడు ఇండియా లుగా పేర్కొన్నారు. గతంలో లోహియా, ఫెర్నాండెజ్ వంటి సోషలిస్టులు గ్రామీణ భారత్, అర్బన్ ఇండియాలుగా రెండుగా విభజించి మాట్లాడేవారు. ఇప్పుడది మూడుకు చేరింది. ఇండస్ వ్యాలీ రిపోర్ట్‌ను ఉటంకిస్తూ కార్తీక్ మురళీధరన్ ఈ ప్రస్తావన చేశారు. ఇందులో ఒకటవ ఇండియా పది శాతం జనాభా గల సంప న్నులది. వీరి తలసరి ఆదాయం 15 వేల డాలర్లు. తర్వాత శ్రేణిలోని రెండో ఇండియా 20 శాతం మంది ప్రజలది. వీరి తలసరి ఆదాయం 3 వేల డాలర్లు. ఇక 70 శాతం మంది భారతీయుల ఆదాయం వెయ్యి డాలర్లు. వాళ్లే మూడో భారత్. ప్రపంచ బ్యాంకు వర్గీకరణ ప్రకారం 13,936 డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయం వున్న దేశం అధికాదాయం గల దేశం కింద లెక్క. 14 కోట్లకు పైగా జనాభా ఉన్న మన ఫస్ట్ ఇండియా ఈ శ్రేణిలోకి వస్తుంది. 4,496 డాలర్ల నుంచి 13,935 డాలర్ల మధ్యన తలసరి ఆదాయం ఉండే దేశాలను అప్పర్ మిడిల్ ఆదాయం గల దేశంగా ప్రపంచ బ్యాంకు పరిగణించింది. మూడు ఇండియాల్లో ఒకటి కూడా ఈ శ్రేణిలోకి రాలేదు. లోయర్ మిడిల్ క్లాస్‌లోకి మన 20 శాతం జనాభా (సుమారు 30 కోట్లు) ఉన్న ఇండియా చేరింది. 1,136 డాలర్ల నుంచి 4,495 డాలర్ల తలసరి ఆదాయమున్న దేశాలు ఈ లోయర్ మిడిల్ క్లాసులోకి వస్తాయి. 1,135 డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయమున్న దేశాలు ప్రపంచ బ్యాంకు దృష్టిలో అల్పాదాయ దేశాలు, అంటే పేద దేశాలు. ఇందులోకి మన 70 శాతం (సుమారు వంద కోట్లు) జనాభా వస్తుంది. అంటే మన దేశంలోని వంద కోట్లమంది జీవన ప్రమాణాలు ఆఫ్రికా ఖండంలోని అతి పేద దేశాల ప్రజలతో ఇంచుమించు సమానమన్నమాట. ఇదిగో ఈ నిరుపేదలే గడచిన ఒక్క సంవత్సరంలో వసూలైన జీఎస్టీలో (22 లక్షల కోట్లు) అత్యధిక భాగాన్ని చెల్లించారు. ఈ ప్రజలకు ఇప్పుడు కొంత ఉపశమనం కలిగించడాన్ని స్వాగతించవలసిందే. కానీ ఈ ప్రభుత్వమే చెబుతున్నట్టు ఎనిమిదేళ్ల ‘నిర్హేతుక’ విధానానికి పేదలు చెల్లించిన మూల్యం సంగతి? కనీసం క్షమాపణలైనా చెప్పరా? పైగా పండుగ చేసుకోమనడం ఒక క్రూర పరిహాసం.ఇటువంటి పరిహాసాలు చేయడం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి నాయకుడు చంద్రబాబుకు పరిపాటి. కరుడుగట్టిన పేద ప్రజల వ్యతిరేకిగా ఆయనది చెక్కుచెదరని ట్రాక్ రికార్డు. గడిచిన ఎన్నికలకు ముందు ఆయన చేసిన అనేక బూటకపు వాగ్దానాల్లో కరెంటు ఛార్జీలు తగ్గిస్తామనేది ఒకటి. కానీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 15,450 కోట్ల మేరకు ట్రూ–అప్ పేరుతో జనాన్ని బాదారు. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఆమోదించిన దానికంటే విద్యుత్ కొను గోలు – పంపిణీ మీద ఎక్కువ వ్యయమైతే ఈఆర్సీ అనుమతితో పెరిగిన వ్యయానికి అనుగుణంగా ట్రూ–అప్ ఛార్జీలు వసూలు చేస్తారు. వివిధ కారణాల వల్ల ఆమోదించిన వ్యయం కంటే తక్కువ ఖర్చయినప్పుడు ఆ మిగులును వినియోగ దారులకు రీఫండ్ చేయవలసి ఉంటుంది. తొలి రోజుల్లో బాదేసిన 15,545 కోట్ల బాదుడుకు తోడు మరో విడత 2,700 కోట్ల బాదుడుకు ప్రతిపాదనలు పంపించారు. ట్రూ–డౌన్ చేయవలసిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అందులో 1,800 కోట్ల బాదుడుకే ఈఆర్సీ అనుమతించింది. అ సొమ్మును అప్పటికే వసూలు చేసినందున 900 కోట్లు వినియోగదారులకు రీఫండ్ చేయాలని ఆదేశించింది.ఇప్పటికే వినియోగదారులపై ట్రూ–అప్ పేరుతో బాదేసి వసూలు చేస్తున్న మొత్తం 15,545 కోట్లు, ట్రూ–అప్‌కు అదనపు ప్రతిపాదన 2,700 కోట్లు. వెరసి 18 వేల కోట్ల పైచిలుకు. ఇందులో 900 కోట్లను రీఫండ్ చేయాలని ఈఆర్సీ ఆదేశించింది. మొత్తం బాదుడులో ఇది ఐదు శాతం. వినియోగదారుని జేబు లోంచి రూపాయి లాగేసుకొని ఓ ఐదు పైసలు చేతిలో పెట్టి ఎంజాయ్ చేయాలని చెబుతున్నారు. మొదట్లో ఇదో గొప్ప వరంలాగా యెల్లో మీడియా, ‘దేశం’ పెద్దలు తెగ హడావుడి చేశారు. కానీ ఈఆర్సీ ఆదేశాల సంగతి బయటపడేసరికి జీఎస్టీ ఉత్స వాలలో కలపకుండా విడిగా పార్టీ వేదికల ద్వారా ఇదో అద్భుత చర్యగా ప్రచారం చేసుకోవాలని నిర్ణయించారు. చంద్రబాబు స్వయంగా ఇది కనీవినీ ఎరుగని కార్యక్రమంగా వర్ణించు కున్నారు. ఎన్నికల హామీకి అనుగుణంగా చార్జీలను తగ్గిస్తు న్నామనీ, ఇది తమ సమర్థ నిర్వహణ ఫలితమనీ కూడా ఆయన చెప్పుకొన్నారు. వంద రూపాయలు పెంచి ఐదు రూపాయలు తగ్గించడమా ఎన్నికల హామీని నెరవేర్చడమంటే? దీన్ని సమర్థవంతమైన నిర్వహణగా పరిగణించాలా?ప్రజలకు ఇటువంటి షాకులివ్వడం పండుగ చేసుకో మనడం చంద్రబాబు సర్కార్‌కు అలవాటే. ఈ పదహారు మాసాల కాలంలోనే ఆయన సర్కార్ చేసిన గాయాలు పేద, మధ్య తరగతి ప్రజల నిలువెల్లా కనిపిస్తున్నాయి. చేసిన నమ్మక ద్రోహాలకు ఊరూరా శిలాఫలకాలు వేయవచ్చు. ఏటా సమారు 32 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన ‘ఆడబిడ్డ’ పథ కాన్ని పూర్తిగా ఎత్తివేసి, ప్రతి నిరుద్యోగికి నెలకు 3 వేల రూపా యలు ఇస్తామన్న హామీని ఎగవేసి, మిగిలిన హామీలను అర కొరగా, అదీ ఏడాది ఆలస్యంగా ప్రారంభించి సూపర్ సిక్స్‌ను అమలుచేశామని చెప్పుకోగలిగిన ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుంది అనుకోవాలి.ఈ పదహారు మాసాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ కొలువులు తీసి ‘నరేగా’ పథకాన్ని నీరుగార్చి గ్రామీణ ఉపాధిని దెబ్బతీసినందువల్ల జరిగిన నష్టమెంత? పేద ప్రజలు కోల్పోయిన ఆదాయ మెంత? లెక్కతీయాలి కదా! ప్రజారోగ్యాన్ని పడకేయించిన కారణంగా, ఆరోగ్యశ్రీని కోమాలోకి పంపినందువల్ల, ఆరోగ్య ఆసరా గొంతు నులిమిన ఫలితంగా, అంబులెన్స్ సర్వీసులకు పెట్టిన పంచర్ల పాపం వలన పేద మధ్య తరగతి ప్రజలకు జరిగిన, జరుగుతున్న నష్టమెంత? వైద్య వ్యాపారులకు ఒన గూరిన లాభమెంత? విద్యారంగంలో గేమ్ ఛేంజర్ వంటి ‘నాడు–నేడు’ అనే బృహత్తర కార్యక్రమాన్ని నిలిపివేసి, పేద విద్యార్థులు అందుకున్న ఉన్నతమైన వసతులను ఊదిపారేసినందువల్ల ఐదున్నర లక్షలమంది పేద మధ్యతరగతి వర్గాల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లను వదిలేశారు. ఫలితంగా విద్యా వ్యాపారులకు కలిగిన లాభమెంత? పేద ప్రజలకు కలిగిన నష్టమెంత? జగన్ ప్రభుత్వం కొనసాగి వుంటే అప్పటికే పూర్తయిన పది లక్షల ఇళ్ళకు అదనంగా మరో పది లక్షలు పూర్తయ్యేవి. ఆ కుటుంబాల కలలను కాల్చేసినందుకు వారి గుండెల్లో గూడుకట్టుకున్న విషా దపు విలువెంత? 30 లక్షల మంది నడివయసు స్త్రీల చేయూతను లాగేసినందువల్ల ఆ మహిళలు చేస్తున్న ఆక్రందనను ఎలా ఉపశ మింపజేస్తారు! ఇటువంటి పర్యవసానాలు ఈ పదహారు మాసాల పాలన ఫలితంగా ఎన్నో ఉన్నాయి. అన్ని లెక్కలూ వేసి లాభపడ్డవాళ్ళను పండుగ చేసుకోమంటే బాగుంటుంది. గాయ పడిన వారితో గేమ్స్ ఆడటం అమానుషం!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఇప్పటికీ వీడని సందేహాలు
బిహార్‌లో వివాదరహితంగా, పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించాలన్న సదుద్దేశం ఎన్నికల సంఘానికి(ఈసీ)కి ఉందా? మంగళవారం విడుదల చేసిన బిహార్ ఓటర్ల తుది జాబితా గమనిస్తే ఈ విషయంలో ఎవరికైనా సంశయం కలుగుతుంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లని ఆ జాబితా ప్రకటిస్తోంది. వివాదాస్పదమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట జూన్ 24న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభించే నాటికి బిహార్ ఓటర్ల సంఖ్య 7.89 కోట్లు. అంతకు ఆర్నెల్ల ముందు ప్రకటించిన ఆ జాబితాను కాదని మళ్లీ ఆదరా బాదరాగా ఈ సవరణ దేనికని విపక్షాలు ప్రశ్నించాయి. 2003 జనవరి 1ని ప్రాతిపదికగా తీసుకుని, అటుపై జాబితాలోకి ఎక్కిన వారిని సంశయ ఓటర్లుగా పరిగణించి వారి నుంచి వివిధ రకాల పత్రాలు కోరటం కొత్తగా అమల్లోకి తెచ్చిన ప్రక్రియ సారాంశం. దాని ప్రకారం 1987 జూలై 1 లేదా అంతకు ముందు జన్మించినవారు జనన ధ్రువీకరణ పత్రం లేదా పుట్టిన ఊరు ధ్రువీకరణ పత్రం... లేదా రెండూ సమర్పించాలి. జూలై 1, 1987– డిసెంబర్ 2, 2004 మధ్య జన్మించిన వారు ఈ పత్రాలతో పాటు తల్లితండ్రుల్లో ఎవరో ఒకరి జనన లేదా ప్రాంత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. ఆ తర్వాత జన్మించిన వారు తమ ధ్రువీకరణ పత్రాలతో పాటు తల్లితండ్రులిద్దరివీ కూడా సమర్పించాలి. లేనట్టయితే జాబితాలో చోటుండబోదని ఈసీ ప్రకటించింది. సుప్రీంకోర్టు జోక్యంతో చివరకు ఆధార్‌ను చేర్చారు. ఆగస్టు 1న ప్రకటించిన తొలి ముసాయిదా జాబితా ఓటర్ల సంఖ్యను 7.24 కోట్లుగా ప్రకటించినప్పుడు విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆధార్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న ధర్మాసనం సూచన అమలు చేసి తాజాగా ప్రకటించిన ముసాయిదాలో కూడా సంశయాలు తప్పలేదు. 2020 జూలైలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ – జనాభా జాతీయ కమిషన్ సంయుక్తంగా విడుదల చేసిన జనాభా అంచనా నివేదిక ప్రకారం బిహార్‌లో 18 ఏళ్లు, అంతకుపైబడి వయసున్న జనాభా 8.18 కోట్లు. తాజా ఓటర్ల జాబితా గమనిస్తే ఇందులో 76 లక్షలమంది ఓటర్లుగా నమోదు చేసుకోలేదనుకోవాలి. అయిదేళ్లనాటి కేంద్ర నివేదిక కేవలం అంచ నాయే అనుకున్నా తాజాగా ప్రకటించిన ఓటర్ల జాబితాలోని సంఖ్య దానికి దరిదాపు ల్లోనైనా ఉండొద్దా? ఈసీ తీరుపై సంశయాలు వ్యక్తం కావటానికి మరో కారణముంది. సెప్టెంబర్ 1న గడువు ముగిసే సమయానికి ఓటర్ల జాబితాలో చేర్చమంటూ తమకు 16.93 లక్షల దరఖాస్తులు అందాయని సంస్థ స్వయంగా ప్రకటించింది. ఇకపై దరఖాస్తులు స్వీకరించేది లేదని కూడా చెప్పింది. మరి 21.53 లక్షలమంది కొత్త ఓటర్లు చేరారని ఇప్పుడెలా ప్రకటించారు? సెప్టెంబర్ 1 తర్వాత కూడా దరఖాస్తులు తీసుకున్నారనుకోవాలా?రెండింటి మధ్యా వ్యత్యాసం ఏకంగా 4.60 లక్షలుంది. మరి సంశయాలు రావా? దీనిపై వివరణనివ్వొద్దా? ఆ సంగతలా ఉంచి తొలగించిన 47 లక్షలమందిలో ఏయే కారణాలతో ఎంతమందిని తొలగించారన్న డేటా లేదు. ఈసీ అనుమానించినట్టు వాస్తవంగా ‘విదేశీయులు’గా ముద్రపడిన వారెందరు? ‘అనర్హులైన ఓటర్లు’గా పరిగణించి 3.66 లక్షలమందిని తొలగించామన్నారు. వీరంతా ‘విదేశీయులు’ అనుకోవాలా? ఏ పత్రమూ దాఖలు చేయలేని వారి మాటేమిటి? ఇక మృతులు, శాశ్వతంగా వలసపోయినవారు,రెండుచోట్ల నమోదైనవారు ఎందరన్న వర్గీకరణ కూడా లేదు. జిల్లాలవారీ డేటా సైతం ఇవ్వలేదు. పట్నా జిల్లాలో ఓటర్ల సంఖ్య 1.63 లక్షలు పెరిగిందని అక్కడి జిల్లా పాలనాయంత్రాంగం చెప్పింది. ఇతర జిల్లాల్లో తగ్గిందని చెప్పటం తప్ప వాటి వివరాలు లేవు.ఇది ఇక్కడితో ఆగిపోదు. తొలగించిన పేర్లు, కొత్తగా చేర్చిన పేర్లు విపక్షాలు జల్లెడపట్టి ఈసీ ప్రకటించిన తుది జాబితా దుమ్ము దులుపుతాయి. దేశమంతటా ‘సర్’ అమలు చేస్తామని సంబరంగా ప్రకటించటం కాదు... బిహార్‌లో తలెత్తుతున్న సందే హాలకు ఈసీ సమాధానం చెప్పాలి. పారదర్శకంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో ఈవీఎంలపై వచ్చిన సంశయాలను ఇంతవరకూ ఈసీ నివృత్తి చేయలేదు. ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను పెంచడానికి ఏం చేయబోతున్నారో చెప్పిందీ లేదు. ఈ దశలో ఈసీ చిత్తశుద్ధిని పార్టీలైనా, ప్రజానీకమైనా నమ్మగలరా? -
పాక్‌పై ట్రంప్ మోజు!
మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి వైభవం పునరావృతమవుతుందని బహుశా పాకిస్తాన్ ఇన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ ఊహించివుండదు. ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను స్వల్ప వ్యవధిలో మూడుసార్లు వైట్‌హౌస్‌కు ఆహ్వానించి గౌరవించటం, నాలుగు రోజుల నాడు మునీర్‌తోపాటు ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాదరంగా హత్తుకోవటం పాకిస్తాన్ దృష్టిలో చిన్న విషయాలేమీ కాదు. పైగా వారిద్దరికీ ట్రంప్ నుంచి దండిగా ప్రశంసలు దక్కాయి. ఒక పాక్ ప్రధాని అమెరికా అధ్యక్షుణ్ణి కలుసుకుని మాట్లాడటం 2019 తర్వాత ఇదే తొలిసారి. అలాగని పాకిస్తాన్‌ను ఎప్పుడూ పూర్తిగా దూరం పెట్టింది లేదు. ప్రపంచం నలుమూలలా గాలిస్తున్న ఉగ్రవాది బిన్ లాడెన్‌కు పాక్ ఆశ్రయమివ్వటం వంటి ఉదంతాలు అమెరికాకు ఆగ్రహం కలిగించినా, ప్రచ్ఛన్నయుద్ధ కాలం నాటి పాక్ సహకారాన్ని అమెరికా మరువదల్చుకోలేదు. అదే సమయంలో మనం నొచ్చుకోకుండా ఉండేందుకు ఆ దేశాన్ని కాస్త దూరం పెట్టినట్టు కనబడేది. ట్రంప్ తొలిసారి అధికారంలో కొచ్చినప్పుడు పాకిస్తాన్ పేరు చెబితే భగ్గుమనే వారు. అనంతరం వచ్చిన జో బైడెన్ సైతం పాకిస్తాన్‌ను తగినంత దూరంలోనే పెట్టారు. కానీ రెండోసారి అధికారంలో కొచ్చాక ట్రంప్ వైఖరి మారింది. భారత్ తన ఆదేశాలను శిరసా వహించటం లేదన్న అక్కసుతోపాటు స్వప్రయోజనాలపై దృష్టి పడింది. అందుకే పాకిస్తాన్‌కు అతిగా ప్రాధాన్యమిస్తున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.గత కాలపు చెలిమికీ, వర్తమాన సాన్నిహిత్యానికీ చాలా తేడా ఉంది. అప్పట్లో మన దేశం సోవియెట్ యూనియన్‌కు సన్నిహితంగా ఉండటం, తన ఒత్తిళ్లకు లొంగకపోవటం తదితర కారణాలతో ఆసియాలో అమెరికాకు పాకిస్తానే దిక్కయ్యేది. ప్రస్తుత పరిస్థితి వేరు. ట్రంప్‌కు ఇప్పుడు దేశ ప్రయోజనాల కన్నా స్వీయ ప్రయోజనాలే ముఖ్యం. మాజీ అధ్యక్షుడు ఒబామా మాదిరే తనకూ నోబెల్ బహుమతి వచ్చితీరాలని ఆయన పట్టు దలగా ఉన్నారు. భారత్–పాక్ యుద్ధంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఏడు ఘర్షణలు ఆపాననీ, అందువల్ల శాంతి బహుమతికి తాను అర్హుడిననీ ఆయన తరచూ చెప్పుకుంటు న్నారు. మధ్యమధ్యన మాట మార్చినా భారత్–పాక్‌లు రెండూ చర్చించుకోబట్టే యుద్ధం ఆగిందని ట్రంప్ స్వయంగా మూడు నాలుగు దఫాలు అన్నారు. మునీర్ సైతం ఘర్షణలు నిలపాలన్నది ఇరు దేశాల నిర్ణయమని తెలిపారు. ఇప్పుడు ట్రంప్ అబద్ధానికి పాక్ వంత పాడుతోంది. ట్రంప్ కోరుకుంటున్నవి ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఖనిజాలు ప్రధాన మైనవి. పాక్ భూగర్భంలో అపార ఖనిజ సంపద ఉంది. బంగారం, రాగి, మాంగనీస్, క్రోమైట్ వగైరా 92 రకాల ఖనిజాలు అక్కడ లభ్యమవుతాయని చైనా ఖనిజాభివృద్ధి సంస్థ పరిశోధనలు తేల్చిచెప్పాయి. ఇవిగాక ఏఐ, ఎలక్ట్రిక్ కార్లు వగైరాల్లో ఉపయోగపడే కీలక ఖనిజాలున్నాయి. ఇందులో అధికభాగం ఉగ్రవాదుల హవా సాగుతున్న బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రాంతాల్లో ఉన్నాయి. అందుకే ఖనిజ సంపద ద్వారా పాక్‌కు సమకూరే ఆదాయం 2 శాతం మించటం లేదు. నిరుడు పాకిస్తాన్ 521 ఉగ్రదాడులు ఎదుర్కొంది. అక్కడ విద్యుత్ కొరత కూడా తీవ్రంగా ఉంది. ఖనిజశుద్ధి పరిశ్రమలు స్థాపిస్తామంటేనే గనులు అప్పజెబుతామని పాక్ ఆశ చూపుతున్నా ఉగ్ర వాదం, విద్యుత్ సంక్షోభం కారణాలుగా చూపి ఏ దేశమూ ముందుకు రావటం లేదు. ఇప్పుడు ఆ ఖనిజ సంపదపై ట్రంప్ కన్నుపడింది. ఇదిగాక ట్రంప్ కుటుంబ భాగస్వామ్యం ఉన్న లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ నడిపే క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు పాక్ అనుమతులిచ్చింది. ఆ దేశంపై మోజు పెరగటంలో వింతేముంది?పాకిస్తాన్లో ప్రజా ప్రభుత్వం ఉండగా, ట్రంప్ దాన్ని బేఖాతరు చేసి సైనిక దళాల చీఫ్‌కు ప్రాధాన్యమిచ్చి వ్యవహారాలు చక్కబెట్టుకోవటం ఆందోళనకరం. పాక్ సైన్యం అమెరికా ఒత్తిడి పర్యవసానంగా గత రెండు దశాబ్దాల నుంచి ప్రభుత్వంలో ప్రత్యక్ష జోక్యాన్ని తగ్గించుకుంది. తెరవెనక మంత్రాంగానికే పరిమితమైంది. కానీ ట్రంప్ పుణ్యమా అని మళ్లీ సైన్యం ప్రభావం పెరుగుతోంది. ఇది ఆ దేశానికి మాత్రమే కాదు... పొరుగునున్న మనకు కూడా ప్రమాదకరమైన పరిణామం. మన ప్రభుత్వం దీన్ని పరిగణనలోకి తీసుకోక తప్పదు. -
లద్దాఖ్ జనఘోష
అలజడి రేగినప్పుడూ, అశాంతి జాడలు కనబడినప్పుడూ సకాలంలో దాన్ని చక్క దిద్దటమే పాలకుల ప్రథమ కర్తవ్యం కావాలి. వేరే దేశాలతో సరిహద్దులున్న ప్రాంతాల్లో ఇది మరింత అవసరం. ఆ దృష్టి లేకపోవటం వల్లే చైనా సరిహద్దుల్లో ఉన్న లద్దాఖ్‌లో సాగుతున్న ఉద్యమం అదుపు తప్పి హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు బీజేపీ కార్యాలయాన్ని దగ్ధం చేయటంతో పాటు కొన్ని వాహనాలకు కూడా నిప్పుపెట్టారు. ఇళ్లు, దుకాణాలపై దాడులు చేశారు. సీఆర్పీఎఫ్ కాల్పుల్లో నలుగురు మరణించారు. కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. 2019లో జమ్మూ–కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, జమ్మూ, కశ్మీర్‌ను చట్టసభ గల కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ను చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చినప్పుడు ఈ ఆందోళనకు బీజం పడింది. లద్దాఖ్‌ను రాష్ట్రం చేసి చట్ట సభ ఏర్పాటు చేయాలని, ఈశాన్య రాష్ట్రాల మాదిరిగా రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ను తమకూ వర్తింప చేయాలని లద్దాఖ్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగంలోని 244వ అధికరణం కింద ఉన్న ఆరో షెడ్యూల్ పరిధిలోకి లద్దాఖ్‌ను తీసుకొస్తే శాసన, న్యాయ, పాలనాపరమైన నిర్ణయాలు తీసుకొనే స్వయంపాలిత జిల్లా మండళ్లు ఏర్పడతాయి. అవి లేనట్టయితే పరిశ్రమల స్థాపన పేరిట భూములు బయటివారికి పోతాయనీ, వారి ప్రాబల్యం పెరుగుతుందనీ ఉద్యమకారులు చెబుతున్నారు. గత అయిదేళ్లుగా ఎంతో శాంతియుతంగా ఉద్యమం కొనసాగుతోంది. దీనికి లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ), కార్గిల్ డెమాక్రటిక్ అలయెన్స్ (కేడీఏ) నాయకత్వం వహిస్తున్నాయి. ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వాటిని స్వప్రయోజనాలకు వినియోగించుకోవాలని చూసేవారు ఎప్పుడూ ఉంటారు. అలాంటి శక్తులకు అవకాÔ¶ మీయరాదనుకుంటే సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గాన్ని అన్వేషించాలి. లద్దాఖ్ ఉద్యమ డిమాండ్లు చూస్తే అవి గొంతెమ్మ కోరికలేమీ కాదని తెలుస్తుంది. ఈ ప్రాంత యువతకు ప్రభుత్వో ద్యోగాల్లో అన్యాయం జరగకూడదనుకుంటే లద్దాఖ్‌కు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జమ్మూ–కశ్మీర్లో భాగంగా ఉన్నప్పుడు అక్కడి సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలుండేవి. కేంద్రపాలిత ప్రాంతమైనాక అది కాస్తా పోయింది. మూడేళ్ల పాటు నిరుద్యోగులు ఆశగా ఎదురుచూశాక కేంద్ర సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) రంగంలోకి దిగింది. కానీ ఆ ప్రక్రియ ఒక కొలిక్కి రావటానికి ఎంతో సమయం పట్టింది. నిరుడు ఎస్సెస్సీ 797 పోస్టుల భర్తీకి ప్రకటనిస్తే 30,000 మంది దరఖాస్తు చేశారు. 2021–22, 2022–23 మధ్య పట్టభద్రుల్లో నిరుద్యోగిత ఒక్కసారిగా 16 శాతం పెరిగింది. పలువురికి వయఃపరిమితి దాటింది. దానికి తోడు స్వయంపాలిత మండళ్లు రెండున్నా... వాటిలో స్థానికేతర అధికారుల హవా నడుస్తోంది. సహజంగానే రాజకీయ వ్యవస్థకు చోటు లేదు గనుక పార్టీలు సైతం ఈ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నాయి. లద్దాఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తితో పాటు దాని పరిధిలోని లేహ్, కార్గిల్‌లకు రెండు పార్లమెంటరీ స్థానాలు ఇవ్వాలని ఉద్యమకారులు కోరటం గమనించదగ్గది.భౌగోళికంగా పర్వతప్రాంతం, తీవ్ర వాతావరణ స్థితిగతుల వల్ల అక్కడ పరిశ్రమల స్థాపనకు వచ్చేవారు తక్కువ. 13 గిగావాట్ల సౌరశక్తి ప్లాంట్‌కు లేహ్‌లోని పాంగ్ ప్రాంతంలో అనుమతించారు. కానీ దానికి దాదాపు 80 కిలోమీటర్ల ప్రాంతం కావాలి. ఈ ప్రాజెక్టు వస్తే పశుపోషణపై, సంచారజాతుల వారిపై తీవ్ర ప్రభావం పడుతుందనీ, జీవిక దెబ్బతింటుందనీ ఉద్యమకారుల ఆరోపణ. అసలే పర్యావరణం క్షీణించి అకాల వర్షాలూ, అత్యధిక ఉష్ణోగ్రతలతో హిమానీనదులు కొడిగడుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిశ్రమలు అవసరం లేదన్నది వారి వాదన. ఉద్యమకారుల డిమాండ్లలో హేతుబద్ధమైన వాటిని తక్షణం పరిష్కరించటం, మిగిలినవాటిపై పరిశీలనకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయటం అవసరమని ఇప్పటికైనా పాలకులు గ్రహించాలి. ఉద్యమ నాయకుడు సోనమ్ వాంగ్చుక్కు చెందిన స్వచ్ఛంద సంస్థపై వెంటనే చర్యలు మొదలుపెట్టడం సబబేనా? హింసకు ఆయనే కారకుడని తేలితే వేరే విషయం. తగిన విచారణ జరిగితే అన్నీ బయటికొస్తాయి. ఉద్యమం మరింత తీవ్రం కాకూడదనుకుంటే అంతవరకూ ఓపిక పట్టడం అత్యవసరం. -
ట్రంప్ అధికప్రసంగం!
అమెరికా అధ్యక్షుడై ఎనిమిది నెలలు దాటుతున్నా అధ్యక్ష ఎన్నికల మనఃస్థితి నుంచి డోనాల్డ్ ట్రంప్ ఇంకా బయటపడినట్టు లేరు. అడ్డగోలు హామీలూ, ఆర్భాటపు ప్రకటనలూ, స్వోత్కర్షలూ, శాపనార్థాలూ ఏ దేశ ఎన్నికల ప్రచార సభల్లోనైనా రివాజు. కానీ న్యూయార్క్‌లో మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశ సందర్భంలో అవన్నీ ట్రంప్ నోట వినబడ్డాయి. 150 దేశాల అధినేతలూ, వారి ప్రతినిధులూ ఇందులో పాల్గొంటున్నారు. తనకిచ్చిన 15 నిమిషాల వ్యవధిని అతిక్రమించి ట్రంప్ దాదాపు గంటసేపు వారినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగం ఆద్యంతం గమనిస్తే ఆయన అమెరికా అధ్యక్షుడిగా కాక వ్యక్తిగత హోదాలో మాట్లాడారని, సభాసదులు ఓటర్లనే భావనలోనే ఆయనున్నారనిపిస్తుంది. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వైఫల్యాలను ప్రస్తావించటం మొదలుకొని, తాను సాధించాననుకుంటున్న విజయాలను ఏకరువు పెట్టడం వరకూ ఆయన దేన్నీ వదల్లేదు. పర్యావరణం, పునర్వినియోగ ఇంధన వన రులు వగైరాలన్నీ మోసగాళ్ల పన్నాగమని ట్రంప్ నిశ్చితాభిప్రాయం. వాటిని అమలుచేసే వాళ్లంతా బుద్ధిహీనులని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతలను తగ్గించటంలో, యుద్ధా లను నివారించటంలో సమితిసహా అన్ని సంస్థలూ విఫలమైతే, తాను ఒంటిచేత్తో ఏడు యుద్ధాలను ఆపానని ప్రకటించుకున్నారు. యధావిధిగా భారత్–పాక్ యుద్ధం కూడా ఈ జాబితాలో వుంది. దీంతో సహా ఆయన ప్రస్తావించిన ఏ అంశానికీ ఆధారాల్లేవు.ఏటా సెప్టెంబర్‌లో సమితి సర్వసభ్య సమావేశాలు జరగటం, ధరిత్రి ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించటం ఆనవాయితీ. ఈసారి సంస్థ 80వ సంస్థాపక దినోత్సవం సమీపిస్తున్నందున ‘కలిసుంటేనే మెరుగ్గావుంటాం’ అనే అంశం ప్రాతిపదికగా ‘శాంతి, అభివృద్ధి, మానవహక్కులు’ తదితర విషయాలపై అధినేతలంతా ప్రసంగించాలి. ప్రాతి పదిక అంశం మొదలుకొని దేనిపైనా ట్రంప్‌కు ఏకీభావం లేదు. అసలు ఆయన వ్యవహరిస్తున్న తీరుకూ, అక్కడ చర్చిస్తున్న అంశాలకూ చుక్కెదురు. మానవ నాగరికతా ప్రస్థానానికి మూలకారణమైన వలసలంటేనే ఆయనకు ఏహ్యభావం. సరిహద్దుల్ని మూసివేసి, బయటివారు రాకుండా కట్టడి చేయాలని యూరప్ దేశాలకు ఆయన హితబోధ చేశారు. స్వాభిమానంగల దేశాలన్నీ తమ సంస్కృతి, సంప్రదాయాలతో, మతంతో సంబంధంలేనివారి నుంచి ప్రజలనూ, సమాజాలనూ రక్షించుకునే హక్కుండాలని ఆయన చెప్పిన మాట ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఆయన పూర్వీకులు జర్మన్ సంతతివారు. అసలు అమెరికాయే వలసదారుల దేశం. ఆ వలసదారులు పొట్టపోసుకోవడానికి వచ్చిన వారు కాదు. మూలవాసులైన అనేక జాతుల వారిని సమూలంగా తుడిచిపెట్టినవారు. మొన్నీమధ్యే బ్రిటన్ వెళ్లి ఘనమైన రాజవంశ ఆతిథ్యం స్వీకరించి, ఆ దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్ సమితి ప్రసంగంలో మాత్రం దాన్ని దుయ్యబట్టారు. వలసలను అడ్డుకోలేక పోతున్నదని ఆ దేశంపై ట్రంప్ అభియోగం. చట్టబద్ధ వలసలను సైతం నేరంగా పరిగణించటం, వేరే దేశాల వారెవరూ వుండటానికి వీల్లేదన్న రీతిలో మాట్లాడటం ఆశ్చర్యకరం. ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ తాను హెచ్1బి వీసాతోనే వచ్చానని స్వయంగా ప్రకటించుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ చీఫ్ సుందర్ పిచాయ్‌లు సైతం ఆ వీసాతో ప్రవేశించినవారే. ఈ ముగ్గురూ లక్ష కోట్ల డాలర్ల టర్నోవర్‌గల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. అమెరికా అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారు. అయినా ట్రంప్‌కు వలసలు ససేమిరా ఇష్టం ఉండవు. గతకాలపు అమెరికా అధ్యక్షుల ఆచరణ ఎలావున్నా ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో వారి ప్రసంగాలు గంభీరంగా ఉండేవి. ఈ ప్రపంచానికి చోదకశక్తి తామేనన్న అభి ప్రాయం కలిగించటానికీ, తమతోనే భవిష్యత్తుందని చెప్పటానికీ ప్రయత్నించేవారు. ట్రంప్ అందుకు భిన్నం. ప్రపంచదేశాలపై నిందలేయటం, అమెరికా కష్టాలకు వారంతా కారణమన్నట్టు మాట్లాడటం ఆయనకు రివాజు. ఆయన తాజా ప్రసంగం కూడా ఆ కోవ లోనే సాగింది. తమ మాట చెల్లుబాటు కావటంలేదన్న ఉక్రోషంతో ఆయన సమితిని డొల్లసంస్థగా అభివర్ణించారుగానీ...నిజానికి దాని ఉన్నత లక్ష్యాలకు గండికొట్టి, ఆ సంస్థను నామమాత్రావశిష్టం చేసింది అమెరికాయే. -
పాలస్తీనాకు ప్రపంచం ఆసరా
‘అమెరికా సొమ్ముతో, బ్రిటన్ ఆయుధాలతో ఉగ్రవాదాన్ని ఆసరా చేసుకుని యూదులు పాలస్తీనా దేశంలోకి చొరబడి అక్కడ దేశాన్ని నిర్మించుకుంటామనటం ఏం న్యాయం? నాజీల చేతుల్లో అనుభవించిన దుర్దశ వారికి శాంతి పాఠాలు నేర్పితే సర్వులూ సంతోషించేవారు’ –ఇజ్రాయెల్ ఆవిర్భావానికి అగ్రరాజ్యాలు బాటలుపరుస్తున్నప్పుడూ, యూదు ఉగ్రవాదులు మానవబాంబులుగా మారి విధ్వంసం సృష్టిస్తున్నప్పుడూ మహాత్ముడు తన ‘హరిజన్’ పత్రికలో రాసిన వ్యాసంలోని వాక్యాలివి. ఏడున్నర దశాబ్దాలుగా పాలస్తీనాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న విధ్వంసం, జనహననం మరిన్ని దేశాల కళ్లు తెరిపించాయి. పాలస్తీనాను ప్రపంచపటం నుంచి తుడిచిపెట్టడానికి ఉవ్విళ్లూరుతూ గాజా స్ట్రిప్‌లో అమా నుష హత్యాకాండకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు చెంపపెట్టులా పాలస్తీనాను లాంఛనంగా గుర్తిస్తున్నట్టు పది దేశాలు ప్రకటించాయి. బ్రిటన్, కెనడా, పోర్చుగల్, ఆస్ట్రేలియాలు ఆదివారం... ఫ్రాన్స్, మరో అయిదు దేశాలు ఆ మరునాడూ ఈ గుర్తింపు ప్రకటన చేశాయి. ఇప్పటికే భారత్ సహా 147 దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. దీంతో ఐక్యరాజ్యసమితిలోని 193 దేశాల్లో 80 శాతం పాలస్తీనాను గుర్తించినట్టయింది. రెండు దేశాల ఉనికిని గుర్తిస్తూ, పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటూ సమితి నిర్వహించిన ఉన్నత స్థాయి అంతర్జాతీయ సదస్సులో 33 దేశాల ప్రతినిధులు ప్రసంగించారు. ఇప్పటికే 65,300 మంది పౌరులను హతమార్చి, గాజాను మరు భూమిగా మారుస్తున్న ఇజ్రాయెల్ ఆగడాలను ఖండించిన ఈ నిండు సభకు గైర్హాజరు కావటంద్వారా అమెరికా తన నైజాన్ని చాటుకోగా, ఇజ్రాయెల్‌కు మొహం చెల్లలేదు.పాలస్తీనాను గుర్తించటమంటే ఉగ్రవాద సంస్థ హమాస్‌కు బహుమతి ఇచ్చినట్టేనన్న ఇజ్రాయెల్, అమెరికాల తర్కం అర్థరహితమైనది. శాంతియుతంగా పాలస్తీనా కోసం పోరాడుతున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఓ)ను బలహీనపరచటానికి 1987లో హమాస్ ఆవిర్భావానికి లోపాయకారీగా మద్దతునిచ్చింది ఇజ్రాయెలే! దాని కనుసన్న ల్లోనే జనంలో పలుకుబడి పెంచుకుని, మరో సంస్థ ఫతాపై పైచేయి సాధించి, చివరకు 2007లో గాజాలో పాలనా బాధ్యతలు చేపట్టిన హమాస్ ఉగ్రవాద విధానాలను మెజారిటీ ప్రజలు మొదటి నుంచీ వ్యతిరేకించారు. ఎంతో పకడ్బందీగా ఉండే ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థ కన్నుగప్పి 2023 అక్టోబర్ 7న 1,200 మంది పౌరులను కాల్చిచంపి, 240 మందిని అపహరించటం వెనక కూడా ‘ఏదో జరిగిందన్న’ అనుమానాలు అనేక మందిలో ఉన్నాయి. ఆ సంగతలా ఉంచి హమాస్ దాడిని ఆసరా చేసుకుని సాధారణ ప్రజానీకంపై బాంబుల వర్షం కురిపించి వేలాదిమందిని హతమార్చటం, ఆహార పదార్థాలూ, నీళ్లు అందకుండా చేసి ఆకలిమంటల్లో ఆహుతి చేయటం ఏ విధంగా సమర్థనీయం? ఇజ్రాయెల్ ఆగడాలను ప్రశ్నించినప్పుడల్లా అక్టోబర్ 7 ఘటన మాటేమిటని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమాయకంగా అడుగుతున్నారు. ఆయనకు ముందున్న జో బైడెన్ ఇదే తర్కంతో ఇజ్రాయెల్ దుర్మార్గాలకు మద్దతునిచ్చారు. అమెరికాలో ఉన్న యూదు ఓటుబ్యాంకుకు ఆశపడి అక్కడి పాలకులు ఇజ్రాయెల్ సాగిస్తున్న ఆగడాలకు డబ్బూ, ఆయుధాలూ సమకూరుస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలో అమెరికా ఏకాకి అవుతున్నదని మరుస్తున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పని చేసి మానవ హక్కుల కోసం, ముఖ్యంగా మహిళల, పిల్లల హక్కుల కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న నవీ పిళ్లై ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్ అధ్యక్షురాలిగా ఇటీవల సమర్పించిన నివేదికలోని వివరాలు దిగ్భ్రాంతి గొలుపుతాయి. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, ప్రధాని నెతన్యాహూ, మాజీ రక్షణమంత్రి యోవ్ గాలెంట్, ఇజ్రాయెల్ సైన్యం నరమేధం అనదగ్గ చర్యలకు పాల్పడ్డారని ఈ కమిషన్ నిర్ధారించింది. దీని ఆధారంగా అంతర్జాతీయ న్యాయస్థానం నరమేధం జరిగిందని ప్రకటించాల్సి ఉంది. వచ్చే నెలలో 80వ వార్షికోత్సవం జరుపుకోబోతున్న ఐక్యరాజ్యసమితి నిస్సహాయంగా మిగిలిపోవటం ప్రపంచానికి పొంచివున్న పెనుముప్పును తెలియజెబుతోంది. దౌత్యపరంగా ప్రపంచ దేశాలన్నీ తీసుకొస్తున్న ఒత్తిళ్లు ఫలించి కనీసం ఈ దశలోనైనా ఇజ్రాయెల్ దుర్మార్గాలు నివారించలేకపోతే భవిష్యత్తరాలు క్షమించవు. -
ట్రంప్ తెచ్చిన తంటా!
ఎవరి అంచనాలకూ అందకుండా ప్రవర్తిస్తూ అయోమయానికి గురిచేయటంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిద్ధహస్తుడు. ఆర్నెల్లక్రితం రెండోసారి అధికారంలో కొచ్చింది మొదలు తీసుకుంటున్న విపరీత నిర్ణయాల మాదిరే హెచ్1బీ వీసా ఫీజు దాదాపు లక్ష డాలర్లు చేసి ఐటీ, ఫార్మా, సాంకేతిక రంగాల నిపుణుల ఆశలను భగ్నం చేశారు. ఈ వీసా లబ్ధిదారుల్లో అత్యధికులు భారతీయులని తెలిసే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని వేరే చెప్పనవసరం లేదు. ప్రస్తుతం హెచ్1బీ వీసాదారులు 7,30,000 మందిలో దాదాపు 71 శాతం మంది భారతీయులు. ఇప్పటికే మన సరుకులపై సుంకాల మోత మోగించి భిన్నరంగాల కార్మికుల పొట్టగొట్టిన ట్రంప్, ఇప్పుడు ఐటీ, ఫార్మా,సాంకేతిక రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న అత్యంత నైపుణ్యంగల ఇంజనీర్ల ఆశలు అడియాసలు చేశారు. మొదట ఫీజు పెంపుపై చేసిన అస్పష్ట ప్రకటన అమెరికాలోని భారతీయుల్లో తీవ్ర ప్రకంపనలు రేపింది. పండగ కోసం స్వస్థలాలకు చేరుకుంటున్న వేలాదిమంది మార్గమధ్యంలో వెనుదిరిగే ప్రయత్నం చేయగా, అలాంటివారిని మరింత ఇబ్బంది పెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ట్రంప్ కనుసన్నల్లో పనిచేసే ‘మాగా’ ఉద్యమకారులు విమానాల్లో భారీయెత్తున సీట్లు బ్లాక్ చేసి టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటేలా చేశారు. అసలు జరుగుతున్నదేమిటో అర్థంకాక అమెజాన్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలన్నీ ఆదివారం మధ్యాహ్నం గడువు ముగిసే వేళకు వచ్చితీరాలని సందేశాలు పంపటంతో స్వస్థలాలకొచ్చినవారంతా ఉన్నపాటున బయల్దేరారు. అంతా అయిన తర్వాత ఈ పెంపు కొత్త దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందంటూ, అది కూడా వార్షిక ఫీజు కాదు... ఒక్కసారి కట్టాల్సిన రుసుమేనంటూ వైట్‌హౌస్ అధికార ప్రతినిధి తీరిగ్గా ప్రకటించారు. పైగా రెండు మూడేళ్లలో వీసాను నవీకరించుకోవాల్సినవారికి కూడా ఇది వర్తించబోదని చెప్పారు. కానీ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఛాంబర్ ఆఫ్ ప్రోగ్రెస్ సంస్థల ప్రతినిధుల ప్రకటనలు గమనిస్తే ఇప్పటికీ దిగ్గజ సంస్థల్లో ఏర్పడిన అయోమయం పోలేదని అర్థమవుతుంది. అసలు ఇప్పుడు చెప్పిన మాటకు ట్రంప్ కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ కూడా లేదు.తీరికూర్చుని నిందలేయటానికి తప్ప వలసదారుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కొచ్చిన నష్టం లేశమాత్రమైనా లేదు. అర్హులైన అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొట్టిందీ లేదు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందన్న ఉద్దేశంతోనే ఆ కట్టుకథను మాగా ప్రచారంలో పెట్టింది. ప్రారంభంలో వలసదారులు తక్కువ వేతనానికి చేరినా త్వరలోనే తమ నైపుణ్యంతో, చురుకుదనంతో అక్కడివారితో సమానంగా వేతనం అందుకుంటున్నారు. నిజానికి ఐటీ, ఫార్మా, సాంకేతిక రంగాల మాట అటుంచి చిప్ డిజైన్,క్లౌడ్ కంప్యూటింగ్, పెనువేగంతో విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) తదితర ప్రాజెక్టుల్లో సమర్థంగా పనిచేసే చాలినంతమంది స్థానిక నిపుణులు దొరకటం అక్కడి సంస్థలకు అసాధ్యం. ఏఐలో అమెరికాను చైనా దాటిపోతోందన్న వార్త ఇప్పటికే అక్కడి పరిశ్రమల్ని కలవరపెడుతోంది. దాన్ని మరింత పెంచటం, చివరకు అమెరికా వెనకబాటుకు కారకుడు కావటం మినహా ట్రంప్ సాధించేదేమీవుండదు. వలసదారుల వల్ల అమెరికా పొందిన లబ్ధి అంతా ఇంతా కాదు. ప్రపంచంలో ఎక్కడా లేనంత సంపద పోగు పడటానికి వలసదారులే కారణం. 1990–2000 మధ్య నోబెల్ సాధించిన శాస్త్రవేత్తల్లో 26 శాతంమంది వలసదారులు. ఇప్పుడు ప్రముఖ కంపెనీలుగా ఉన్న సంస్థల వృద్ధి వెనక 25 శాతం వలసదారులే ఉన్నారు. తన విపరీత నిర్ణయాలు అనుద్దేశిత పర్యవసానాలకు దారి తీస్తాయన్న ఎరుక ట్రంప్‌కు లేకుండా పోయింది. తాజా పెంపు నిర్ణయాన్ని న్యాయస్థానాలు తప్పుబట్టి తాత్కాలికంగా నిలిపేయవచ్చంటున్నారు. ఆ సంగతెలావున్నా ట్రంప్ సృష్టించిన అనిశ్చితి పర్యవసానంగా స్థానిక కంపెనీలు తమ కార్యక్షేత్రాలను వేరే దేశాలకు తరలిస్తాయి.దాంతోపాటు వృత్తిరంగ నిపుణులు, విద్యార్థులు ఇతర దేశాల వైపు దృష్టి సారిస్తారు. ఇదంతా అమెరికాకే నష్టం. మన ప్రభుత్వం మెరుగైన విధానాలతో ముందు కొస్తే, ఆ ప్రతిభా సామర్థ్యాలకు ఆసరాగా నిలిస్తే ఆ చర్య దేశాభివృద్ధికి దోహదపడుతుంది. -
దయనీయుడు కాకూడదు!
‘మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, మానవుడే మాననీయు’డంటాడు కవి ఆరుద్ర ఒక సినీ గీతంలో! సందేహమేముంది? ఆయనే అన్నట్టు, మంచిని తలపెడితే మనిషికి అడ్డే లేదు, దివిజ గంగ భువి దించిన భగీరథుడు మానవుడే, సృష్టికి ప్రతిసృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే; చంద్రలోకమైన, దేవేంద్రలోకమైన బొందితో జయించి భువికి తిరిగి రాగలిగినవాడూ మానవుడే! కానీ, అంతటి మహనీయుడు కూడా ఒక్కోసారి దయనీయుడైపోతాడు. ఎంతో ముందుకు చూడగలిగి కూడా తరచూ హ్రస్వ దృష్టికి లోనవుతాడు. పదిమందికీ మంచిని తలపెట్టేవాడు కూడా స్వప్రయోజనాన్ని మరిగి చివరికి సొంతానికే చేటు తెచ్చుకుంటాడు. సర్వతోముఖ వికాసం మనిషికి వరమే కానీ, తనకు తనే చెరుపు చేసుకునే బహుముఖ వైఫల్యం పెనుశాపం. అసాధారణ వర్షాల కారణంగా హిమాలయ ప్రాంత రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. హఠాత్తుగా అతివృష్టి, మెరుపు వరదలు, మట్టిపెళ్ళలు విరిగిపడటం వగైరా ఉత్పాతాల కారణంగా ఈ సంవత్సరం ఇప్పటికి దాదాపు మూడు వేల మంది మరణించారు, లక్షల కోట్ల విలువైన ఆస్తినష్టం సంభవించింది. అడ్డూ అదుపూ లేని పట్టణాభివృద్ధి, అడవుల నిర్మూలన, రోడ్ల నిర్మాణం, విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన అభివృద్ధి చర్యలను ఇందుకు కారణంగా పర్యావరణ వాదులు ఎత్తిచూపుతున్నారు. ఇటువంటివి లేని రోజుల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగిన సంగతిని కొందరు ఉదాహరిస్తున్నారు. కారణమేమైనా ప్రాణనష్టం, ఆస్తినష్టం కళ్లముందు కటిక నిజాలు. పటిష్ఠమైన ముందస్తు హెచ్చరిక యంత్రాంగాన్ని ఇప్పటికీ ఏర్పరచుకోలేక పోవడం – దీనంతటి వెనుకా మహనీయుడైన మానవుడి పరంగా చెప్పుకోవలసిన ఒకానొక వైఫల్యం. దీనికితోడు, దేశంలో ప్రకృతి విపత్తులకు గురికాగల ప్రాంతాల గురించిన గణాంకాలు గుండె గుభేలుమనిపిస్తాయి. ఏకంగా 27 రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలూ ఇందులోకి వస్తాయి. వ్యవసాయ యోగ్యమైన 68 శాతం భూమి ఏ క్షణంలోనైనా అనావృష్టికి గురికావచ్చు, 15 శాతం ప్రాంతంలో ఉన్నట్టుండి రాళ్ళవర్షం కురవచ్చు, 12 శాతం ప్రాంతంలో మెరుపు వరదలు సంభవించవచ్చు. ఈ విపత్తులు ఏటా పెరగడమే తప్పే తగ్గే అవకాశం లేదట! శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధిలో మానవుడి బుద్ధి ఎంతో చురుగ్గా పని పనిచేయడం ఎంతైనా శ్లాఘనీయమే; అభివృద్ధిని ప్రజలకు మరింత సుఖమయ జీవన యోగ్యంగా మలచే దిశగా శరవేగంతో కదలడమూ అభినందనీయమే; కానీ, దానిని అంటిపెట్టుకుని వచ్చే సమస్యల నివారణలో మాత్రం అతని అడుగు చురుగ్గా పడటం లేదు. దాంతో అభివృద్ధి అస్తవ్యస్తానికీ, అభద్రతకూ చిరునామా అవుతోంది. దేశంలోని మహా నగరాలలో రోడ్ల పరిస్థితే ఇందుకు మరో ఉదాహరణ. ఆయా నగరాలలో జనాభా పెరుగుదలా, కొత్త జనావాసాల విస్తరణా, రాకపోకల అవసరాలూ, వాహనాల పెంపూ విమాన వేగాన్ని అందుకున్నాయి; కానీ, ఆ దామాషాలో రోడ్ల నిర్వహణా, ఇతర వసతుల కల్పనలో ప్రభుత్వాల ప్రణాళికలు ఎడ్లబండి వేగంతో నడుస్తున్నాయి. అనేక నగరాలలో రాకపోకల రద్దీ ఎంతటి సమస్యాత్మక స్థాయికి చేరిందంటే, జనం గంటల తరబడి కాలాన్ని ట్రాఫిక్ జామ్ లోనే గడపవలసి వస్తోంది, ఎంతో విలువైన ఉత్పాదక సమయం రోడ్లపాలైపోతోంది. రకరకాల జీవనోపాధి పనుల మీద తిరిగే జనాలను అది మానసికంగా విపరీతమైన ఒత్తిడికి గురిచేసి ఆర్థిక సమస్యలతోపాటు ఆరోగ్య సమస్యలనూ తెచ్చిపెడుతోంది. ఈ ఏడాది తొలి అయిదారు మాసాల్లోనే దేశవ్యాప్తంగా నగరాల రోడ్లపై సంభవించిన దుర్ఘటన మరణాలు వేలసంఖ్యను దాటిపోయాయి. అయినాసరే, పౌరరవాణా సదుపాయాల అభివృద్ధీ వగైరాలు కాగితాల దశను దాటి కార్యరూపం ధరించడానికి ఏళ్లూపూళ్లూ పట్టిపోతోంది. మొత్తంమీద కవి చెప్పినట్టు గ్రహరాశుల నధిగమించి ఘనతారల పథము తొక్కగలిగిన మహనీయుడే తన లోకాన్ని సర్వతోభద్రంగా మార్చుకోవడంలో విఫలమవుతున్నాడు. మనిషి జైత్రయాత్రలో ఎక్కడో అడుగు తడబడి అపజయపు దారి పడుతోంది. తనను దయనీయుడిగా రూపుకట్టే ఆ తడబాటును సరిదిద్దుకుని మహనీయుడన్న ఖ్యాతి నిలుపుకోవడం మనిషి తక్షణావసరం -
ట్రంప్‌తో బ్రిటన్‌కు మేలేనా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల బ్రిటన్ పర్యటన గురువారం పూర్తయింది. ఇరు దేశాల మధ్యా సుదీర్ఘకాలంగా ఎంతో గాఢమైన అనుబంధం ఉన్నదని, ట్రంప్ హయాంలో అది మరింత విస్తరించిందని ఉమ్మడి మీడియా సమావేశంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కొనియాడారు. అది నిజమే. ఎందుకంటే వేరేచోట పెట్టుబడులు పెట్టొద్దని తమ దిగ్గజ సంస్థల్ని డిమాండు చేస్తున్న ట్రంప్ బ్రిటన్‌లో దాదాపు 15,000 కోట్ల పౌండ్ల విలువైన పెట్టుబడులకు సిద్ధపడ్డారు. ఇందుకు సంబంధించిన ఒప్పందా లపై ఇరు దేశాల మధ్యా సంతకాలయ్యాయి. అలాగే రక్షణ సాంకేతిక ఒప్పందం కూడా కుదిరింది. బ్రిటన్ తన డిమాండ్లన్నిటికీ తలొగ్గి అందరి కన్నా ముందు మొన్న ఫిబ్రవరి లోనే వాణిజ్యం ఒప్పందానికి సై అనటం, మరో మూడు నెలల్లో ఒప్పందాన్ని ఖరారు చేసుకోవటం ట్రంప్‌కు నచ్చింది. దానికితోడు ప్రధాని కీర్ స్టార్మర్ అమెరికా వెళ్లినప్పుడు అధికారిక పర్యటనకు రావాలంటూ బ్రిటన్ రాజు చార్లెస్... స్టార్మర్ ద్వారా ఆహ్వానం పంపటం ఆయన్ను మరింత ఉక్కిరిబిక్కిరి చేసివుంటుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిని రాజసౌధం రెండోసారి అధికారిక పర్యటనకు ఆహ్వానించటం, ఘనమైన విందునీ యటం ఇదే తొలిసారి. గత ఏలుబడిలో ట్రంప్ 2019లో బ్రిటన్‌లో అధికారిక పర్యటన జరిపారు. జార్జి డబ్ల్యూ బుష్, ఒబామాలకు ఆ అదృష్టం మొదటి దఫాలో మాత్రమే దక్కింది. రెండోసారి నాటి బ్రిటిష్ రాణి నుంచి విందు ఆహ్వానాలు మాత్రమే అందాయి.కానీ ట్రంప్ షరతులన్నిటికీ తలొగ్గటం ద్వారా బ్రిటన్ ప్రయోజనాలను స్టార్మర్ దెబ్బతీశారని జనం ఆగ్రహించారు. వాణిజ్య ఒప్పందంలో అమెరికా సరుకులపై 10 శాతం మించి సుంకాలు విధించబోమని ఒప్పుకుని, తమ దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే స్టీల్, అల్యూమినియంలపై మాత్రం 25 శాతం సుంకాలు విధించినా మౌనంగా ఉండిపోయారని ఆ విమర్శల సారాంశం. దీన్ని పునఃపరిశీలించాలని బ్రిటన్ కోరినా ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పటం తప్ప 25 శాతం సుంకాలపై ట్రంప్ మరే హామీ ఇవ్వలేదు. బహుశా ఆయన దృష్టిలో ఆదుకోవటమంటే 15,000 కోట్ల పౌండ్ల పెట్టుబడులు పెట్టడం కావొచ్చు. వీటి ద్వారా దేశంలో 7,600 ఉద్యోగాలు వస్తాయని బ్రిటన్ ఆశిస్తోంది. ఇరు దేశాలకూ అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. నాటో, ఉక్రెయిన్, పశ్చిమాసియా, చైనా తదితర అంశాల్లో రెండు దేశాలకూ ఏకీభావం ఉన్నా విభేదాలు కూడా ఉన్నాయి. లోగడ స్టార్మర్ ప్రకటించిన ప్రకారం వచ్చేవారం పాలస్తీనాను బ్రిటన్ గుర్తించాల్సి ఉంది. ఆ పనిచేస్తే హమాస్ ఉగ్రవాదానికి మద్దతు పలికినట్టే అవుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇటీవల హెచ్చరించారు. ట్రంప్ పర్యటనలో కూడా దీనిపై ఇరు దేశాధినేతల మధ్యా చర్చ జరిగింది. ఈ విషయంలో విభేదాలున్నాయని ఇద్దరూ అంగీకరించారు. బ్రిటన్ తాజా నిర్ణయమేమి టన్నది చూడాల్సి ఉంది. రెండు దేశాలూ ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించేవి. ప్రపంచ సమస్యల పరిష్కార బాధ్యత భారం తమదేనని భావించేవి. కనీసం అలా చెప్పుకొనేవి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అవి సమష్టిగా పనిచేశాయి. ధిక్కరించిన దేశాలపై నాటో మాటున దాడులు కూడా చేశాయి. ప్రపంచంలోనే చైనా రెండో శక్తిమంతమైన ఆర్థిక శక్తిగా ఎదిగాక పరిస్థితి తలకిందులైంది. పశ్చిమాసియా మొదలుకొని ప్రపంచమంతటా ఎటుచూసినా విధ్వంసం, నిరాశా నిస్పృహలు ఆవరించాయి. యుద్ధాలు, వాణిజ్య యుద్ధాలు, వలసదా రులపై ఆంక్షలు, ప్రజాస్వామ్య దేశాల్లో నియంతల హవా తదితరాలు వర్తమాన దుఃస్థితికి అద్దం పడుతున్నాయి. సమస్యలొస్తే ఇప్పుడెవరూ అమెరికా, బ్రిటన్ల వైపు చూడటం లేదు. అవి చక్కదిద్దుతాయన్న భ్రమలేవీ లేకపోగా... చాలా సమస్యలకు అమె రికా కారణమైతే, బ్రిటన్ వైఖరి కూడా అందుకు దోహదపడుతోందన్న అభిప్రాయమే అనేకుల్లో ఉంది. పైగా నిలకడ లేని ట్రంప్‌కు విశ్వసనీయత తక్కువ. భారత్ తమకు అత్యంత సన్నిహితమని, ప్రధాని మోదీ కావాల్సినవారనీ మీడియా సమావేశంలో చెప్పిన ట్రంప్... ఉక్రెయిన్ విషయంలో ఆ దేశంతో కఠినంగా ఉండక తప్పడంలేదని గొప్పగా చెప్పుకొన్నారు. ఇలా మాట్లాడేవారిని ఏ దేశ ప్రజలైనా విశ్వసిస్తారా? మొత్తానికి ట్రంప్ తాజా పర్యటన వల్ల బ్రిటన్‌కు లాభించేది అంతంత మాత్రమేనని చెప్పాలి. -
మళ్లీ అమెరికాతో నెయ్యం
ఇది స్పీడ్ యుగం. కరచాలనాలైనా, కలహాలైనా ఎంత త్వరగా మొదలవుతాయో అంత త్వరగానూ కనుమరుగవుతాయి. భారత్–అమెరికాల సంబంధాల తీరు గమనిస్తే ఇది అర్థమవుతుంది. నెల్లాళ్ల క్రితం దాదాపు ఛిద్రమయ్యాయనుకున్న ఈ సంబంధాల్లో మళ్లీ సుహృద్భావం మొగ్గ తొడుగుతోంది. ద్వైపాక్షిక ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా సాకారం చేసుకోవాలని మంగళవారం న్యూఢిల్లీలో అమెరికా వాణిజ్య దూత బ్రెండాన్ లించ్ నేతృత్వంలోని ప్రతినిధి వర్గంతో మన వాణిజ్య మంత్రిత్వ బృందం చర్చించాక అంగీకారం కుదిరింది. అంతేకాదు... ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ట్రంప్ ఆయనకు ఫోన్‌చేసి శుభాకాంక్షలు చెప్పటం, దాన్ని ఎక్స్‌లో మోదీ ప్రస్తావించి రష్యా–ఉక్రెయిన్ ఘర్షణలకు శాంతియుత పరిష్కారం కోసం ట్రంప్ చొరవ తీసుకోవటాన్ని ప్రశంసించటం గమనించదగ్గవి. సరిగ్గా నెల్లాళ్ల క్రితం పరిస్థితి వేరు. రష్యా దురాక్రమణ యుద్ధం కొనసాగటానికి భారత్ వైఖరే ప్రధాన కారణమంటూ ట్రంప్ నిందించారు. అంత క్రితం ఆగస్టు మొదటి వారంలో విధించిన 25 శాతం సుంకాలతో పాటు రష్యా ముడిచమురు కొంటున్నందుకు ఆ నెల చివరిలో మరో 25 శాతం అదనంగా వడ్డించి దాన్ని 50 శాతానికి తీసుకెళ్లారు. కేవలం భారత్‌పై విషం కక్కడం కోసం నియమితులైనట్టుగా వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మొదలుకొని వాణిజ్యమంత్రి హొవార్డ్ లుత్నిక్ వరకూ ఇష్టానుసారం మాట్లాడారు. వీరిలో నవారో మిగిలినవారికన్నా భిన్నం. ఆయన ఆశువుగా అబద్ధాలాడగలరు. ఆధారాలతోగానీ, ఇరు దేశాల చారిత్రక సంబంధ బాంధవ్యాలతో గానీ ఆయనకు పనిలేదు. ఫలానా కులానికి లబ్ధి చేకూర్చటం కోసం భారత ప్రభుత్వం కోట్లాది మంది ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతోందని వ్యాఖ్యానించగలరు. ఇరు దేశాల మధ్యా చర్చలు మొదలవుతున్న తరుణంలో కూడా భారత్‌ను ‘ట్యారిఫ్ల మహారాజు’ అనగలరు. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించగలరు. మన దేశం ఎంతో సంయమనం పాటించబట్టే అయిదో రౌండ్ తర్వాత ఆగిపోయిన చర్చలు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. మధ్యలో అనవసరంగా పేచీకి దిగి విపరీతాలకు పోయింది అమెరికాయే!భారత్‌పై అదనపు సుంకాలు విధించటాన్ని సవాల్ చేస్తూ అమెరికా సుప్రీంకోర్టులో దాఖలైన కేసు విచారణలో భారత్ రష్యా చమురుకొనటాన్ని ట్రంప్ సర్కారు కారణంగా చూపింది. ఇప్పుడు సుంకాలను వెనక్కి తీసుకుంటే ఆ కేసు బలహీనపడుతుంది.ట్రంప్‌కు దౌత్యపరమైన మర్యాదలు తెలియవు. తన చర్యల వల్ల అవతలి దేశం స్థానికంగా ఎదుర్కొనక తప్పని ఒత్తిళ్లేమిటో అర్థం కావు. అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపై విధించే సుంకాల్లో 95 శాతం కోత పెట్టడానికి మన ప్రభుత్వం అంగీకరించింది. కానీ 43 శాతం మంది గ్రామీణ ప్రజానీకానికి ఉపాధి కల్పిస్తున్న సాగు రంగాన్ని పణంగా పెట్టడానికీ, చిన్న వ్యాపారుల, పాడిపరిశ్రమ రంగ ఉత్పత్తిదారుల ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలకూ తాము వ్యతిరేకమని మన ప్రభుత్వం కుండబద్దలు కొడుతోంది. జన్యుపరంగా మార్పిడి చేసిన మొక్కజొన్న మాకొద్దని చెబుతోంది. ఈ విషయంలో భారత్ మనోభావాలను అర్థం చేసుకోకుండా ఒక ధూర్త వ్యాపారిలా ట్రంప్ ప్రవర్తించారు. ఇప్పుడు తామే వెనక్కి తగ్గక స్థితిని సృష్టించుకున్నారు.తమ దయా దాక్షిణ్యాలపై ఆధారపడే దక్షిణ కొరియా, జపాన్‌లు సాగిలపడటాన్ని చూసి అందరిపైనా ఆ వ్యూహమే పనికొస్తుందని ట్రంప్ భావించటమే ఇందుకు కారణం. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో చెట్టపట్టాలేసుకున్నారు. ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను నెత్తిన పెట్టుకున్నారు. ఈ పరిణామాలతో భారత్ బెంబేలు పడుతుందని భావించారు. కానీ షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సమావేశానికి మోదీ చైనా వెళ్లటం, అక్కడి పరిణామాలూ గమనించాక జరగబోయేదేమిటో ఆలస్యంగానైనా గ్రహించక తప్పలేదు. భారత్‌కు తాను తప్ప దిక్కులేదనుకోవటం ఘోర తప్పిదమని గ్రహించారు. పర్యవసానంగానే ఇప్పుడు మళ్లీ పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచంలో వ్యాపారం తప్ప మరేం లేదన్న వైఖరిని ట్రంప్ విడనాడితేనే ప్రపంచంతో ఆయనకు సామరస్యం కుదురుతుంది. అలా కానట్టయితే నష్టపోయేది అమెరికాయే! -
ఉన్నంతలో ఉపశమనం
వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు సోమవారం జారీచేసిన మధ్యంతర ఆదేశాలు అటు పిటిషనర్లకూ, ఇటు కేంద్ర ప్రభుత్వానికీ పాక్షిక ఉపశమనం ఇచ్చాయి. చట్టంపై మొత్తంగా స్టే విధించకపోవటం కేంద్రానికి సంతృప్తి కలిగిస్తే, కొన్ని కీలకనిబంధనల అమలును నిలిపేయటం విపక్షాలకూ, పిటిషనర్లకూ సంతోషాన్నిచ్చింది. అయితే ఈ కేసులో పిటిషనర్ అయిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ వంటివారు ఈ ఉత్తర్వులపై నిరాశ పడకపోలేదు. పిటిషనర్లలో ఒవైసీతోపాటు ఎంపీలు మహువా మొయిత్రా(టీఎంసీ), మనోజ్ కుమార్ ఝూ(ఆర్జేడీ), జియావుర్ రహమాన్(కాంగ్రెస్) ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ కూడా చట్టాన్ని సవాలు చేశాయి. మొన్న ఏప్రిల్‌లో పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టంపై మొత్తం 65 పిటిషన్లు దాఖలయ్యాయంటేనే ఇదెంత వివాదాస్పదమైనదో అర్థమవుతుంది. చట్టం రాజ్యాంగబద్ధమో కాదో ఈ ఉత్తర్వులు తేల్చలేదు. తుది తీర్పు ఆ అంశాన్ని పరిశీలిస్తుంది. వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగానికి గురవుతున్నాయనీ, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయనీ కేంద్రం భావించింది. వాటిని చక్కదిద్దే ఉద్దేశంతోనే సవరణలు తెచ్చామని చెప్పింది. ముఖ్యంగా రిజిస్టర్ కాకపోయినా నిరాటంకంగా వక్ఫ్ అధీనంలో ఉంటే ఆ ఆస్తులు దానికే చెందుతాయన్న (వక్ఫ్ బై యూజర్) భావనను ఈ చట్టం రద్దు చేసింది. ఇకపై వక్ఫ్ ఆస్తులకు లిఖిత పూర్వక దస్తావేజు ఉండి తీరాలని నిర్దేశించింది. సుప్రీంకోర్టు ఈ నిబంధనపై స్టే విధించేందుకు నిరాకరించింది. కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురవుతున్నాయని చట్టసభ గుర్తించి, దాన్ని నివారించాలనుకోవటం ఏకపక్ష చర్య ఎలా అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే వక్ఫ్ ఆస్తులకు 1995 నాటి చట్టం ఒక ప్రత్యేక ప్రతిపత్తినిచ్చింది. దాని ప్రకారం వక్ఫ్ ఆస్తి దురాక్రమణకు గురైందని ఏ దశలో గుర్తించినా దాని స్వాధీనానికి వక్ఫ్ బోర్డు చర్యలు తీసుకోవచ్చు. తాజా సవరణ దీన్ని రద్దు చేయటాన్ని ధర్మాసనం సమర్థించింది. ఇతర ఆస్తులతో సమానంగా పరిగణించటం వివక్ష తొలగింపే అవుతుందని భావించింది.అన్య మతస్థులు కనీసం అయిదేళ్లుగా ఇస్లాం ఆచరణలో ఉంటేనే వక్ఫ్‌కు ఆస్తులు దానం చేయొచ్చన్న నిబంధనపై ధర్మాసనం స్టే విధించటం ఒక రకంగా ఊరట. ఇస్లాం ఆచరణంటే ఏమిటో చట్టం వివరించకపోవటం, దాన్ని గుర్తించటానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేసే నిబంధనలు, అందుకోసం ఏర్పాటయ్యే వ్యవస్థ సంగతి తేలేవరకూ ఈ నిబంధన నిలిచిపోతుంది. పౌరులు తమ ఆస్తిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకునే హక్కు రాజ్యాంగంలోని 300వ అధికరణం ఇచ్చింది. అన్య మతస్థులు వక్ఫ్ బోర్డుకు ఆస్తులివ్వరాదన్న నిబంధన దీన్ని ఉల్లంఘించటం లేదా? తుది తీర్పులోనైనా దీన్ని పరిశీలించక తప్పదు. వివాదాస్పద ఆస్తులపై వక్ఫ్ బోర్డుకూ, ప్రభుత్వాలకూ తగువు ఏర్పడినప్పుడు కలెక్టర్ స్థాయి అధికారి నిర్ణయించవచ్చన్న నిబంధనపై ధర్మాసనం స్టే ఇచ్చింది. ఈ నిబంధనలో మరో వైపరీత్యముంది. అసలు అలాంటి విచారణ మొదలైన మరుక్షణమే అది వక్ఫ్ ఆస్తిగా పరిగణించటానికి వీల్లేదని చెబుతోంది. మొత్తానికి వివాదాలను ట్రైబ్యునల్స్ లేదా హైకోర్టులు మాత్రమే తేల్చాలనటం సరైన నిర్ణయం. అయితే వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు స్థానం కల్పించాలన్న నిబంధనను కొంత మార్పుతో అలాగే ఉంచటం సబబు కాదు. హిందూ, సిక్కు, క్రైస్తవ మతాలకు చెందిన సంస్థల్లో అన్య మతస్థులకు చోటు లేనప్పుడు, వక్ఫ్ బోర్డుల్లో మాత్రం ఎందుకుండాలి?వక్ఫ్ చట్టంలో సమస్యలున్నాయి... సరిచేయమని కోరేవారిలో ఆ మతస్థులూ ఉన్నారు. అలా చేసే ముందు ముస్లిం మతాచార్యులతో, ముస్లిం పర్సనల్ లా బోర్డుతో మాట్లాడాలి. పార్టీల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి. పార్లమెంటులో అలజడి రేగాక బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) ఏర్పాటు చేశారు సరే... కానీ విపక్షాల అభ్యంతరాలను పట్టించుకున్నారా? సమర్థమైన, లోప రహితమైన విధానాలు తీసుకురాదల్చుకుంటే స్వాగతించాల్సిందే. కానీ ఆ విషయంలో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలి. అటువంటి చర్య ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. -
మణిపూర్‌కు సాంత్వన!
మానవీయ స్పర్శ లేశమాత్రం లేని మానవాకార మృగాలు రోజుల తరబడి సృష్టించిన బీభత్సం పర్యవసానంగా అయినవారినీ, ఆవాసాలనూ మాత్రమే కాదు... జీవిక కోల్పోయి చెట్టుకొకరు పుట్టకొకరై 28 నెలల నుంచి అనాథలుగా బతుకీడుస్తున్న మణిపూర్ పౌరులకు ఆలస్యంగానైనా సాంత్వన లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తొలుత చురాచాంద్‌పూర్ బహిరంగ సభలో బాధితులనుద్దేశించి మాట్లాడాక, రాజధాని ఇంఫాల్‌లో ఉన్న కాంగ్లా ఫోర్ట్ వద్ద జరిగిన సభలో పాల్గొన్నారు. సాధారణ పరిస్థితుల్ని పునరుద్ధరించటానికి చేయాల్సిందంతా చేస్తామని ఆయన హామీ ఇవ్వటంతో పాటు వేలాది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని ప్రారంభించటం, మరికొన్నిటికి శంకుస్థాపన చేయటం హర్షించదగ్గవి. ఇవన్నీ రాగల కాలంలో సామరస్య వాతావరణానికి దోహదపడే అవకాశం ఉన్న మాట నిజమే అయినా, చేయాల్సింది ఇంకా చాలా ఉంది. మెజారిటీగా ఉన్న మెయితీలకూ, కుకీ–జో తెగలకూ మధ్య తలెత్తిన ఘర్షణల పర్యవసానంగా మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారు. ఆ తెగల మధ్య పరస్పర అవిశ్వాసం, ఘర్షణలు ఈనాటివి కాదు. వీటిని చక్కదిద్దటానికి ఏ ప్రభుత్వమూ పెద్దగా ప్రయత్నించింది లేదు. బీరేన్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ కూటమి ప్రభుత్వమైతే మెయితీల అనుకూలమన్న ముద్ర పడేలా వ్యవహరించి ఆ ఘర్షణ వాతావరణాన్ని పెంచింది. 2023 మే 3 మొదలుకొని సాగిన దారుణాలు సిగ్గు చేటైనవి. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న మెయితీలకూ, కుకీ–జో తెగలకూ తలెత్తిన ఘర్షణల్లో మహిళలపై గుంపులు దాడిచేసి వారిని వివస్త్రలను చేయటం, నగ్నంగా ఊరేగించి అత్యాచారాలకు తెగబడటం వంటివి చోటుచేసుకున్నాయి. చురాచాంద్‌పూర్‌లో కుకీ–జో తెగలవారికి సహాయక శిబిరాలు నెలకొల్పగా, మెయితీ బాధితులు ఇంఫాల్ రక్షణ శిబిరాల్లో ఉంటున్నారు. దురదృష్టమేమంటే కుకీ–జో తెగలవారు ఇంఫాల్‌లో అడుగుపెట్టలేరు. మెయితీలు కొండప్రాంత జిల్లాలకు పోలేరు. ఇదంతా ఇప్పట్లో చక్కబడే అవకాశం లేదు. కుకీ–జో తెగల మండలి ప్రధానికి సమర్పించిన వినతిపత్రంలో తమకు ప్రత్యేక పాలనాధికార వ్యవస్థ కావాలని కోరింది.అటు మెయితీలకు ప్రాతినిధ్యం వహించే మణిపూర్ సమగ్రతా సమన్వయ కమిటీ (కొకొమీ) అందుకు ససేమిరా అంటున్నది. ఆ వ్యవస్థ ఏర్పాటైతే రాష్ట్ర ప్రతిపత్తి దెబ్బతింటుందనీ, పౌరసత్వాన్ని తెగల వారీగా గుర్తించి, రాష్ట్రాన్ని విభజించినట్టవుతుందనీ దాని వాదన. ‘చట్ట విరుద్ధ’ వలసలను అరికట్టాలని డిమాండ్ చేస్తోంది. పైగా మెయితీలు ఏనాటి నుంచో ఎస్టీ ప్రతిపత్తి కోరుతున్నారు. ఇదే జరిగితే భూహక్కులు కోల్పోతామని కుకీ–జో తెగల భయం. ఈ వాదనలూ, భయాందోళనలూ వర్తమాన సంక్లిష్టతకు అద్దం పడతాయి. రాష్ట్రాన్ని ఆవరించిన కల్లోలం ‘మన పూర్వీకుల స్మృతికి కళంకం మాత్రమే కాదు... భవిష్యత్ తరాలకు అన్యాయం చేయటం కూడా’ అని మోదీ సరిగానే అన్నారు. దీన్ని చక్కదిద్దటానికి ఇంఫాల్ లోయకూ, కొండ ప్రాంత జిల్లాలకూ మధ్య పటిష్ఠమైన వారధులు నిర్మించాల్సి ఉందన్న ఆయన అభిప్రాయం కూడా సబబైనదే. ఇది జరగాలంటే వైషమ్యాలను పెంచి పోషిస్తున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. వదంతుల వ్యాప్తిని సహించకూడదు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను ప్రచారంలో పెట్టడంతోనే సమస్య మొదలైందనీ, ప్రధాన స్రవంతి మీడియా ‘మెయితీ మీడియా’గా మారి వీటిని పెంచిపోషిందనీ ఎడిటర్స్ గిల్డ్ నిజనిర్ధారణ కమిటీ గతంలో ఆరోపించింది. ఇందుకు నాటి మణిపూర్ ప్రభుత్వం ఆగ్రహించి కేసులు కూడా పెట్టింది. మణిపూర్ తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో మయన్మార్‌తో 352 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. నిరవధిక ఉద్రిక్త వాతావరణం ఎంతమాత్రమూ మంచిది కాదు. బీరేన్‌సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయటంతో సహా చాలా విషయాల్లో ఎంతో జాప్యం జరిగింది. ఇప్పటికైనా నిర్దిష్ట కాల వ్యవధిలో అమలయ్యేలా చర్యలుండాలి. అభివృద్ధి జరిగేలా, ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా, జన జీవనం మళ్లీ పట్టాలెక్కేలా చూడాలి. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారన్న అపవాదు కలగని రీతిలో పాలనను చక్కదిద్దాలి. -
ఆదిమ నిద్రకళ
నిద్ర అనే మాటే ఒక మత్తు, మహత్తు. అలసిన శరీరానికి హాయి... నిద్ర. గడిచిన దినానికి తీపి వీడ్కోలు... నిద్ర. నిద్ర పోవడం అనే దశ నుంచే శిశువు జీవితం ఆరంభమవుతుంది. రోజులో పదహారు గంటలు నిద్రపోతూనే దినదిన ప్రవర్ధమానమవుతాడు. ఏ పాటా రాని తల్లి కూడా పసివాడిని నిద్రపుచ్చడానికి ‘ఉళుళుళు హాయి’ అని లాలి రాగం తీస్తుంది. ఆ లెక్కన ప్రతి తల్లీ ఒక గాయనే అనుకోవాలి. నిద్ర అనేది మనిషికి ప్రకృతి ప్రసాదించిన చవకైన విలాసం.నిద్ర అనేది నిజమైన సమవర్తి కూడా! ఏ మనిషైనా తన దగ్గర అన్ని కిరీటాలనూ పక్కన పెట్టాల్సిందే. కేవలం శ్వాసించే మాంసపు బంతులుగా ఆడాల్సిందే. ‘‘ఈ నీడల నాటకరంగం మీద జీవితపు మెరకపల్లాల్లోంచి వచ్చిన వాళ్లందరూ ఒకే హోదాతో నిలబడతారు. ఇక్కడ విభేదాలు లేవు. ఈ కౌగిలి అందరికీ ఒకేరకపు శాంతినిస్తుంది. ఇక్కడ యాచన లేదు. లేదనటం లేదు. అవమానం లేదు. ఈ వాకిలి దగ్గరకు వచ్చినవాడెవ్వడూ ఉత్త చేతులతో తిరిగి వెళ్లడు’’ అంటాడు కథక కవి ఆలూరి బైరాగి. నిద్ర అనేది దివ్యలోకాలకు తలుపులు తెరిచే సాధనం. ఏ మనిషికా మనిషి సమాంతర ప్రత్యేక లోకాలను ఆవిష్కరించుకోగలిగే తరుణోపాయం. కలల రెక్కల మీద ప్రతి జీవీ అక్కడ ఎల్లలు లేకుండా తిరుగుతాడు. తెల్లారేసరికి ఏమీ ఎరగనట్టే మామూలుగా ఉండిపోతాడు.మనిషికి ఉన్నవి రెండే స్థితులు: పగలు పని, రాత్రి నిద్ర. అవి తారుమారవ్వడం ఆధునిక పరిణామం. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదంటారు. నిద్రలోంచి లేవడమంటే దాదాపు చచ్చి మళ్లీ బతికినట్టే! అందుకే కొందరు నిద్ర లేవగానే కృతజ్ఞతగా దేవుడికి దండం పెట్టుకుంటారు. కానీ అదంతా కాయకష్టం చేసిన రోజుల్లో! ఇప్పుడు మనిషి స్థానాన్ని యంత్రం ఆక్రమించాక, నడుం వంచడం అనేదే పెద్ద పనైపోయింది. లక్షల ఏళ్ల మనిషి నాగరికతా ప్రస్థానంలో 10,000 ఏళ్ల నుంచే మనుషులు నగరాల్లో జీవించడం మొదలుపెట్టారు. పంతొమ్మిదో శతాబ్దం చివరలోనే కరెంట్ మనిషి జీవితంలోకి వచ్చింది. 1970ల తర్వాతే కంప్యూటర్లు ఇళ్లల్లోకి ప్రవేశించాయి. వీటన్నింటికీ మనిషి మెదడు సర్దుకుపోతూ వచ్చింది.ఈ క్రమంలో చరిత్ర పూర్వ మనుషులు ఎలా నిద్దరోయారు అనేది ఒక ఆసక్తి. చెట్టు కొమ్మలనే పాన్పులుగా చేసుకుని అదే చెట్ల మీద పడుకోవడమూ ఉండేది. ఎటో జారిపోతున్న భావన కలిగి ఉన్నట్టుండి మనం ఇప్పుడు నిద్రలోంచి మేల్కొనడం అనేది మన పూర్వీకుల చెట్ల నిద్ర తాలూకు అవశేషం మన రక్తంలోకి ఇంకిపోవడం వల్ల జరుగుతున్నదని నిద్రా నిపుణులు చెబుతుంటారు. అలా జారిపోతున్న సంవేదన ఆ ఆదిమ మానవులకు ఒక రక్షాకవచంలా పనిచేసి, క్రూర మృగాల పట్ల అప్రమత్తతతో ఉంచింది. అయితే, రెండు లక్షల ఏళ్ల క్రితమే మనుషులకు ‘మంచం’ లాంటిది ఏర్పాటు చేసుకోవడం తెలుసు అంటారు ‘హౌ టు స్లీప్ లైక్ ఎ కేవ్‌మ్యాన్: ఏన్షియెంట్ విజ్డమ్ ఫర్ ఎ బెటర్ నైట్స్ రెస్ట్’ రచయిత డాక్టర్ మెరిజిన్ వాన్ డెలార్. పట్టు పాన్పు, మబ్బు దుప్పట్లు లేకపోయినా, మట్టిని బల్లపరుపుగా చేసుకొని, దాన్ని మరిన్ని పొరలుగా ఉబ్బుగా దిద్దుకుని, దాన్ని కొమ్మలు, గడ్డి, ఆకులతో మెత్తబరుచుకొని పడుకునేవాళ్లు. పురుగూ పుట్రను తరిమికొట్టే మొక్కలను అక్కడ ఉంచేవాళ్లు. పక్కనే క్యాంప్ ఫైర్ ఉండనే ఉంటుంది. అదే మంటతో ఆ మంచాన్ని నియమిత సమయాల్లో కాల్చుతుండేవాళ్లు. దానివల్ల కూడా పురుగూ పుట్రా ఆ దరికి చేరకుండా ఉండేవి. అవే మంచాలను బహుముఖంగా పని ప్రదేశాలుగానూ, పని ముట్లను సాఫుచేసుకోవడానికీ వాడుకునేవాళ్లు. అందుకే చరిత్ర పూర్వ మనుషులనగానే అనాగరికమైన ఊహ రావడాన్ని వ్యతిరేకిస్తారు వాన్ డె లార్. నిద్ర, తిండి విషయంలో వాళ్లు అత్యంత వివేకంతో వ్యవహరించారన్నది నెదర్లాండ్స్‌కు చెందిన ఈ ‘స్లీప్ సైంటిస్ట్’ వాదన. వ్యాయామం ఉండటం, తిండిలో చక్కెర లేకపోవడం అనే రెండు కారణాల వల్ల వాళ్లకు ఇట్టే నిద్రపట్టేది. ఆ రెండూ రివర్సు కావడం వల్ల ఇప్పుడు నిద్ర కరవవుతోంది. వీటినే సూచనలుగా స్వీకరిస్తే మనం కోల్పోతున్న నిద్రను మళ్లీ పొందొచ్చేమో! -
ఇజ్రాయెల్ ఘాతుకం
గాజాలో రెండేళ్లుగా తాను సాగిస్తున్న దుశ్చర్యలను చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయిన ప్రపంచానికి ఇజ్రాయెల్ ఊహించని షాక్ ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందంపై ఖతార్ రాజధాని దోహాలో సమావేశమైన హమాస్ రాజకీయ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని మంగళవారం వైమానిక దాడులకు తెగబడి ఆరుగురిని హతమార్చింది. రాయబార కార్యాలయాలు, సూపర్ మార్కెట్లు, పాఠశాలలు ఉన్న కట్టుదిట్టమైన భద్రత గల ప్రాంతంలో దాడి జరపటాన్ని గమనిస్తే ఇజ్రాయెల్ దేన్నీ ఖాతరు చేయదల్చు కోలేదని స్పష్టమవుతోంది. కాల్పుల విరమణ సాకారమై, హమాస్ చెరలోని బందీలు విడుదల కావాలని ఇజ్రాయెల్ కూడా కోరుకుంటోంది. కనీసం పైకి అలా చెబుతోంది. ఒప్పందానికి హమాస్‌కు ఇదే చిట్టచివరి అవకాశమని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలోనే ఆ సంస్థ సమావేశమైంది. రెండేళ్లుగా ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య రాజీ కుదిర్చేందుకు ఖతార్ ప్రయత్నిస్తోంది. అందుకు అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుంది. హమాస్‌ను ఒప్పించాల్సిన అవసరం ఏర్పడినప్పుడల్లా ఆ రెండూ ఖతార్నే ఆశ్రయించేవి. పైగా అమెరికాకు అది అత్యంత సన్నిహిత దేశం. పశ్చిమాసియాలోని అతి పెద్ద అమెరికా సైనిక స్థావరం ఆ దేశంలోనే ఉంది. ఇటీవల ట్రంప్ ఖతార్ వచ్చినప్పుడు ఆయనకు అత్యంత విలాసవంతమైన బోయింగ్–747 జెట్ విమానాన్ని కానుకగా సమర్పించుకుంది. అమెరికాతో లక్ష కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇన్ని ‘మంచి లక్షణాలు’ గల దేశంపై ఇజ్రాయెల్ ఎట్లా దాడి చేయగలిగిందన్నదే గల్ఫ్ దేశాల రాజధానుల్లో ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. గాజాలో శాంతి నెలకొనకుండా చూడటమే ఇజ్రాయెల్ ఉద్దేశంగా కనబడుతోందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ చేసిన వ్యాఖ్య నిజమే కావొచ్చుగానీ... అందుకు ఖతార్ సహా గల్ఫ్ దేశాల బాధ్యత కూడా ఉంది. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాద చర్యకు పాల్పడి 1,195 మందిని అమానుషంగా కాల్చిచంపి 250 మంది పౌరులను అపహరించింది. ప్రపంచ దేశాలన్నీ ఆ ఘాతుకాన్ని ఖండించాయి. ప్రతీకారం పేరుతో ఈ రెండేళ్లలో ఇజ్రాయెల్ 64,656 మంది పాలస్తీనా పౌరులను పొట్టనబెట్టుకుంది. రేపో మాపో పూర్తిగా గాజాను అధీనంలోకి తెచ్చుకోబోతోంది. ఈ కాలమంతా గల్ఫ్ దేశాలు చోద్యం చూశాయి. సిరియా, లెబనాన్, ఇరాన్, ఇరాక్, యెమెన్లలో అది వైమానిక దాడులు సాగించినా మౌనంగా ఉండిపోయాయి. దాని పర్యవసానంగానే ‘మిత్రదేశం’గా ఉన్న ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. మరో దేశం సార్వభౌమ త్వాన్ని దెబ్బతీసేందుకు ఏ దేశమూ పూనుకోరాదని ఐక్యరాజ్యసమితి చార్టర్ నిర్దేశిస్తోంది. అలాచేస్తే అది దురాక్రమణే అవుతుందంటున్నది. కానీ తాను అన్నిటికీ అతీతమని ఇజ్రాయెల్ భావన.గల్ఫ్ దేశాలన్నీ కలిసి ఏదో ఒకటి చేయాలని ఖతార్ ఇచ్చిన పిలుపుతో గురువారం సమావేశం జరిగింది. త్వరలో అరబ్–ఇస్లామిక్ శిఖరాగ్ర సదస్సు కూడా ఉంటుందంటున్నారు. అయితే ఆ ‘ఏదో ఒకటి’ సైనిక చర్య అయితే కాదు. కనీసం ఆ ఆలోచన చేసినా అమెరికా నొచ్చుకుంటుందని వాటికి తెలుసు. అమెరికా–గల్ఫ్ దేశాల బంధం ఉభయ తారకం. అమెరికా సైనిక సాయంపై గల్ఫ్ ఆధారపడి ఉండగా... పశ్చిమాసియాలో తన పలుకుబడి చెక్కుచెదరకుండా ఉండటానికి గల్ఫ్ దేశాల అవసరం అమెరికాకుంది. ఈ అమరికను మార్చటమే ఇజ్రాయెల్ ఆంతర్యం కావొచ్చు. ఎటూ గాజా హస్తగతం కాబోతున్నది కనుక, ఇదే అదునుగా ఈ ప్రాంతంలో తానే ప్రధాన కేంద్రంగా ఉండాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్టు కనబడుతోంది. కానీ అదంత సులభం కాదు. సౌదీ, యూఏఈ, ఖతార్, ఒమన్, కువైట్, బహ్రెయిన్ల సమష్టి మదుపు నిధి 4 లక్షల కోట్ల డాలర్ల పైమాటే. ఈ సంపద ఆసరాతో గల్ఫ్ దేశాలు ప్రపంచ ఇంధన మార్కెట్లను శాసించగలవు. గణనీయంగా పలుకుబడి పెంచుకోగలవు. అందుకే ‘ఏదో ఒకటి’ చేయాలన్న ఖతార్ పిలుపుపై ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. తమ చాప కిందకు నీళ్లొస్తుంటే చూస్తూ ఊరుకోవటం ఆత్మహత్యా సదృశమని గల్ఫ్ దేశాలు ఇప్పటికైనా గుర్తించాలి. ఈ సంక్షోభ సమయంలో అమెరికాకు వంతపాడటం కాక, సొంత గొంతుక వినిపిస్తేనే మనుగడ ఉంటుందని తెలుసుకోవాలి. -
తిరగబడిన నేపాల్!
చిన్న నిప్పురవ్వ చాలు... పెనుమంటలు ఎగిసిపడటానికి! ఒక్క కారణమే చాలు... అసంతృప్తి పెల్లుబుకటానికీ, అధికార పీఠాల్ని కూలదోయటానికీ!! ఆ మధ్య శ్రీలంకలో, మొన్న బంగ్లాదేశ్‌లో, నెల క్రితం ఇండోనేసియాలో రోడ్లపైకి వెల్లువలా వచ్చిపడిన యువత శక్తేమిటో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి గ్రహించలేకపోయారు. నిరసనంటే తెలియని, ఉద్యమమంటే ఎరుగని ‘జెన్ జీ’ తరాన్ని తక్కువ అంచనా వేశారు. అందుకే అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలై 36 గంటలు కాకుండానే ఆయనకు పదవీ భ్రష్టత్వం తప్పలేదు. అధ్యక్షుడు రాంచంద్ర పౌడ్వాల్ సైతం రాజీనామా చేశారు. కానీ ఈలోగా హింస పెల్లుబికి పార్లమెంటుకు నిప్పంటుకుంది. అధ్యక్షుడు, ప్రధాని భవంతులు తగలడిపోయాయి. మంత్రుల నివాసాలూ, పార్లమెంటు ఉన్న సింఘా దర్బార్ ఆవరణ ఉద్యమకారుల లక్ష్యంగా మారింది. మంత్రుల్ని రక్షించటానికి ఆర్మీ హెలికాప్టర్లు రంగ ప్రవేశం చేయాల్సివచ్చింది. మాజీ ప్రధాని, పాలకపక్షంలో భాగస్వామిగా ఉన్న నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా, ఆయన భార్య విదేశాంగమంత్రి అర్జూరమా దేవ్బా, నేపాల్ మావోయిస్టు పార్టీ నేత, మాజీ ప్రధాని ప్రచండ తదితరుల ఇళ్లపై దాడులు చేయగా, దేవ్బా దంపతులపై దౌర్జన్యం చేసి, నెత్తురోడుతున్న దేవ్‌బాను ఈడ్చుకెళ్లారు. భద్రతా దళాల కాల్పుల్లో 19 మంది మరణించగా, దాదాపు 500 మంది గాయపడ్డారని చెబుతున్నారు.చెప్పుకోదగిన నాయకుడు లేకున్నా సోమవారం ఉదయం వందల మందితో మొదలైన ఉద్యమం మధ్యాహ్నానికే వేలసంఖ్యకూ, అటు తర్వాత లక్షల్లోకి మారింది. దేశ రాజధాని కఠ్మాండూను దాటి జిల్లాలకు వ్యాపించింది. లాఠీచార్జి, బాష్పవాయు గోళాలు, రబ్బరు బుల్లెట్లు, చివరకు కాల్పులు ఫలితాన్నివ్వలేదు సరిగదా... ఆగ్రహించిన గుంపులు అధికార సౌధాలపై పడ్డాయి. హింసకు దిగొద్దన్న వినతులు బేఖాతరు కావటంతో ఉద్యమాన్ని విరమిస్తున్నామని నిర్వాహకులు ప్రకటించాల్సి వచ్చింది. మొదట ఉద్యమం శాంతియుతంగా ప్రారంభమైంది. దానికి ప్రభుత్వమే ఆజ్యం పోసింది. సామాజిక మాధ్యమాల ద్వారా పిలుపందుకుని వస్తున్న విద్యార్థులు, యువతతో ఆ ప్రాంతం నిండుతుండగానే ప్రభుత్వం యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర 26 వెబ్ సైట్లను నిలిపివేసింది. ఆ మాధ్యమాలు పన్నులు చెల్లించకపోవటం వల్లే నిలిపేశామని సంజాయిషీ ఇచ్చినా నిజమేమిటో అందరికీ తెలుసు. కనబడే కారణం మాధ్యమాల నిషేధమే అయినా అక్కడ నెలకొన్న ఆర్థిక సంక్షోభం అసలు హేతువు. సగటున రోజుకు రెండు వేలమంది పొట్టనింపుకోవటానికి దూర తీరాలకు వలసపోయే దుఃస్థితి నెలకొంది. దీన్ని సరిచేయకపోగా ప్రాజెక్టులన్నీ అవినీతి మయంగా మారాయి. సంపన్నుల పిల్లలు విదేశాల సందర్శనకు పోయి విలాసాల్లో గడుపుతూ సామాజిక మాధ్యమాల్లో ఆ దృశ్యాలు షేర్ చేయటం సహజంగానే నిరుద్యోగంతో దుర్భర జీవనం సాగిస్తున్న యువతలో ఆగ్రహాన్ని కలిగించింది. ఇందుకు ప్రస్తుత పాలక పక్షంలోని సీపీఎన్(యూఎంఎల్), నేపాలీ కాంగ్రెస్‌లతోపాటు అరకొర సీట్లతో కింగ్‌మేకర్‌గా మిగిలిపోయిన మావోయిస్టు పార్టీ సైతం సిగ్గుపడాలి. శ్రీలంకలో మూడేళ్ల క్రితం, నిరుడు బంగ్లాదేశ్‌లో, నేడు నేపాల్‌లో ఒకే మాదిరి దృశ్యాలు కనిపించటం యాదృచ్ఛికం కాదు. ఈ మూడు ఉద్యమాలూ యువత, విద్యార్థుల నాయకత్వంలోనే జరిగాయి. మూడింటి మధ్యా కనబడే మరో పోలిక ఏమంటే... వీటికి చైనాయే అధిక వడ్డీలకు అప్పులిచ్చి ఆర్థికంగా కుంగదీసింది. ఉదాహరణకు నేపాల్ పౌర విమానయాన మౌలిక సదుపాయాల మెరుగు కోసమంటూ తలపెట్టిన పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయానికి చైనా ప్రధాన రుణదాత. 2,200 కోట్ల డాలర్ల ఈ ప్రాజెక్టు రెండేళ్ల క్రితం సాకారమైంది. కానీ అది వృథా వ్యయమని కొన్నాళ్లకే తేలిపోయింది. అందులో 10.5 కోట్ల డాలర్లకు పైగా అవినీతి జరిగిందని నిర్ధారణ అయింది. ఆ రుణాన్ని రీషెడ్యూల్ చేయాలని నేపాల్ కోరుతున్నా చైనా ససేమిరా అంటోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్(బీఆర్ఐ) ప్రాజెక్టు కూడా కష్టాల్లో పడింది. సరిగ్గా ఆగ్రహ జ్వాలల్లో నేపాల్ మండుతుండగా ఓలి శర్మ చైనా పర్యటన ముగించుకుని రావటం గమనించదగ్గది. -
అక్షరాల చదువులు
అన్నమే కాదు, అక్షరమూ పరబ్రహ్మ స్వరూపమే! బొందిలో ప్రాణాన్ని నిలుపు కోవడానికి అన్నం ఎంత అవసరమో; ఆలోచనలను పదును పెట్టుకోవడానికి, పదును పెట్టుకున్న ఆలోచనలను పదికాలాల పాటు పదిలపరచుకోవడానికి అక్షరం అంతే అవసరం. ‘అక్షరం బ్రహ్మ పరం స్వభావో అధ్యాత్మముచ్యతే/ భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః’ అని ‘భగవద్గీత’ చెబుతోంది. అంటే, నాశనం లేని అక్షరమే పరబ్రహ్మం. అక్షర స్వభావమే, తన ఆత్మరూపమే అధ్యాత్మం అని అర్థం. అక్షరం జ్ఞానకళిక. ప్రపంచం సాధించిన నేటి పురోగతికి అక్షరమే ఆలంబన. అక్షరమే లేకుంటే, నేటికీ ప్రపంచం అజ్ఞాన తమస్సమాధిలోనే కూరుకుని ఉండేది.అనంత జ్ఞానయానానికి అక్షరం తొలి అడుగు మాత్రమే! కేవలం అక్షరాస్యత వల్లనే ఎవరూ జ్ఞానఖనులు కాలేరు. ‘జీవితంలో విజయవంతం కావాలంటే అక్షరాస్యత, డిగ్రీలు మాత్రమే చాలవు; విద్య కావాలి’ అన్నారు ప్రఖ్యాత హిందీ రచయిత మున్షీ ప్రేమ్‌చంద్. ఆయన మాట అక్షరసత్యం. మన దేశంలో పట్టభద్రుల సంఖ్య పెరుగు తున్నంతగా విద్యావంతుల సంఖ్య పెరగడం లేదు. అక్షరాస్యత సాధించడమే ఘనకార్యంగా ప్రచారం చేసుకునే దశ నుంచి మన ప్రభుత్వాలు ఎంత త్వరగా బయటపడితే దేశానికి అంత మంచిది. మన దేశంలోని బడిపిల్లల్లో అక్షరాస్యత కూడా అరకొరగానే ఉంటోంది. ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థుల్లో దాదాపు సగం మందికి ప్రాథమిక స్థాయి అంశాలపై కూడా అవగాహన లేదని; చిన్న చిన్న లెక్కలు చేయడానికి, సరళమైన వాక్యాలు రాయడానికి కూడా వీరు సతమతమయ్యే స్థితిలోనే ఉన్నారని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ పరిశీలనలో తేలింది. నేటి బడిపిల్లలే రేపటి పట్టభద్రులు. నేటి పునాదులే ఇంత చక్కగా ఉంటే, ఈ పునాదుల పైనే వెలిసే రేపటి భవంతులు ఎంత దృఢంగా ఉంటాయో ఊహించుకోవాల్సిందే! మన చదువుల తీరుతెన్నులపై ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఆందోళన కాదిది. ఈ పరిస్థితి బ్రిటిష్ హయాంలోనూ ఉండేది. ‘ఇంగిలీషుతో పాటుగా నిపుడు సంస్కృ/ తమ్మునకు గూడ డిగ్రీల తంపి వచ్చె/ నట్లు ప్యాసగు వారలయందెవండొ/ తక్క దక్కినవారు శుద్ధ జడమతులె’ అని చెళ్లపిళ్లవారు అప్పట్లోనే వాపోయారు. బ్రిటిష్ పాలన ముగిసి, దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా, మన అక్షరాస్యత డెబ్బయి ఐదు శాతానికి లోపే! అంటే, ఇంకా దాదాపు నాలుగో వంతు జనాభా అక్షరాస్య తకు దూరంగానే ఉంది. స్వాతంత్య్రం వచ్చే నాటితో పోల్చుకుంటే దేశంలోని పట్టభద్రుల సంఖ్య దాదాపు నూటయాభై రెట్లు పెరిగింది. డిగ్రీల మీద డిగ్రీలు సంపాదించుకుంటున్న బహుపట్టభద్రుల్లో ఎంతమంది వివేకం కలిగిన విద్యావంతులో నిగ్గుతేల్చడం అంత సాధ్యమయ్యే పనికాదు. అయినా, ఎవరి డిగ్రీలు వారి వ్యక్తిగతాలు. వాటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అక్షరాస్యత వలన విద్య; విద్య వలన వినయ వివేకాలు ఒనగూరుతాయనేది ఒక చిరకాల విశ్వాసం. విశ్వాసాలు విశ్వాసాలే! విశ్వాసాలన్నీ వాస్తవాలు కావాలనే నిబంధనేదీ లేదు. ‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్/ బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/పొదవెడు నుప్పులేక రుచి బుట్టక నేర్చునటయ్య భాస్కరా!’ అన్నాడు శతకకారుడు. ఎంత చదువు చదివినా, కాస్త రసజ్ఞత లేకుంటే ఆ చదువు నిరర్థకమే! గుణవంతులెవరూ అలాంటి చదువును మెచ్చరు అని మారవి వెంకయ్య కవిహృదయం. ‘చదువని వాడజ్ఞుండగు/ చదివిన సదసద్వివేక చతురత గలుగున్/ చదువగ వలయును జనులకు/ చదివించెదనార్యులొద్ద చదువుము తండ్రీ!’ అని పోతనా మాత్యుడు భాగవతంలో హిరణ్యకశిపుడి పాత్ర ద్వారా చెప్పారు. ప్రహ్లాదుడిని చండా మార్కుల గురుకులానికి పంపిస్తూ, ఎందుకు చదువుకోవాలో చెప్పాడు హిరణ్యకశిపుడు. మన పూర్వ కవులకు తెలిసిన చదువుల ప్రయోజనానికీ, నేటి జనాలకు తెలిసిన చదువుల ప్రయోజనానికీ నడుమ యోజనాల దూరం ఉంది. అక్షరాస్యత వలన డిగ్రీలు; డిగ్రీల వలన కొలువులు ఒనగూరుతాయనేదే నేటి విశ్వాసం. -
మారిన శ్లాబుల మురిపెం
ఎటు చూసినా నిరాశామయ వాతావరణమే అలుముకుని అంతటా నిర్లిప్తత ఏర్పడిన తరుణంలో బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన అందరిలోనూ ఉత్సాహం నింపింది. ఈ క్షణం కోసం సామాన్యులు మొదలుకొని రైతులూ, చిరు వ్యాపారులూ, చిన్నా చితకా పరిశ్రమలవారూ ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. సరుకులు, సేవల పన్ను (జీఎస్టీ)ను హేతుబద్ధీకరిస్తూ, సాధారణ ప్రజానీకం వాడే అనేకానేక నిత్యావసరాలకు పన్ను తగ్గించటం లేదా పూర్తిగా ఎత్తేయటం... ఆరోగ్య బీమాకు పన్నుపోటు నుంచి మినహాయించటం తదితరాలు ఇప్పుడున్న గడ్డు పరిస్థితుల్లో ఊరట నిస్తాయి. సామాన్యుల్లో జీఎస్టీ ‘గబ్బర్‌సింగ్ టాక్స్’గా అపకీర్తి పాలైందంటేనే వారిని ఎంతగా కష్టపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే పన్నుల హేతుబద్ధీకరణను అమలు చేయబోతున్నామని పదే పదే ప్రకటించటంతో జీఎస్టీ మండలి సమావేశమైనప్పుడల్లా అందరిలోనూ ఆశలు చిగురించేవి. తీరా మరిన్ని సరుకుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటంతో వారంతా బిత్తరపోయేవారు. ప్రధాన రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడూ, వార్షిక బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడూ జీఎస్టీ తగ్గింపుపై ఊహాగానాలు రావటం, చివరకు నిట్టూర్చటం రివాజైపోయింది. ఈ దశలో మొన్నటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీని సరళీకృతం చేయబోతున్నామని వెల్లడించారు. మొత్తానికి ఇప్పుడిక 5 శాతం, 18 శాతం పన్నుల విధానం అమలు కాబోతోంది.ఆరంభమైన మొదలుకొని జీఎస్టీని ఎవరూ మెచ్చింది లేదు. తమ ఆదాయ వనరు లకు గండి కొట్టిందని రాష్ట్రాలూ, తమ జేబులు కత్తిరిస్తోందని మధ్యతరగతి జీవులూ,ఎంతో కష్టపడి సంపాదిస్తున్నది కాస్తా జీఎస్టీ పేరు మీద ప్రభుత్వం తన్నుకు పోతున్నదని వ్యాపారులూ ఆక్రోశిస్తూనే ఉన్నారు. జీఎస్టీ చిత్రవిచిత్రాలు పోయింది. వడాపావ్ వెన్నతో తింటే ఒక రకమైన పన్ను, అది లేకుండా తింటే వేరే రకం పన్ను వేయటాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు. ఆ మధ్య నిర్మలా సీతారామన్ సమక్షంలో ఒక వ్యాపారవేత్త జీఎస్టీపై వెటకారంగా వ్యాఖ్యానించటం, ఆ వీడియో కాస్తా వైరల్ కావటంతో ఆయన కంగారుపడి మంత్రిని కలిసి క్షమాపణలు చెప్పటం అందరికీ తెలుసు. జీఎస్టీ అరాచకం అంతా ఇంతా కాదు. సబ్బు, షాంపూలపై 18 శాతం, స్కూలు పుస్త కాలు, పెన్సిళ్లు, రంగు పెన్సిళ్లు తదితరాలపై 12 శాతం, ఆఖరికి కోచింగ్ తీసుకుంటే 18 శాతం పన్నులతో ఎడాపెడా బాదటం అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. అయినా కేంద్రంలో కదలిక రాలేదు. అమెరికా విధించిన 50 శాతం సుంకాల వల్ల ఎదురుకాగల సమస్యల్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రంలో కదలిక వచ్చిందని ఆర్థిక నిపుణులంటున్నారు. ఆ సంగతలా ఉంచితే ప్రజల్లో వినిమయాన్ని పెంచి ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు తీసుకురావటానికి తాజా నిర్ణయాలు దోహదపడతాయి. ప్రభుత్వాలు ఆదాయాన్ని పెంచుకోవటానికి ఎంతసేపూ పరోక్ష పన్నులపైనే ఆధారపడతాయి. ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే నిజానికిది చాలా తక్కువ. కానీ పారిశ్రామికవేత్తలనూ, సంపన్నులనూ నొప్పించటం ప్రభుత్వాలకు ఇష్టం ఉండదు. వాళ్లంతా ఉపాధి కల్పనలో పాలుపంచుకుంటున్నారన్న కారణం చెబు తారు. పరోక్ష పన్నుల్ని ‘తిరోగమనం’గా అభివర్ణించేవారు కూడా ఉన్నారు. సినిమా టిక్కెట్లపై విధించే వినోదపు పన్నునే వారు ఉదాహరిస్తారు. సామాన్యుడికైనా, కోట్లకు పడగెత్తిన సంపన్నుడికైనా ఆ పన్ను ఒకేలా ఉంటుంది. అయితే పన్ను విధింపులో కాస్తంత హేతుబద్ధత చూపటం ద్వారా సామాన్యుల్ని కూడా సంతుష్టి పరచవచ్చు. అర్థశాస్త్రంలోని ‘లేఫర్ కర్వ్’ భావన అటువంటిదే. పన్నులు తక్కువగా ఉంటే సామాన్య జనం అధికంగా కొని ఖజానా ఆదాయాన్ని పెంచుతారని ఈ భావన చెబుతుంది.కానీ ప్రభుత్వాలు ఎంతసేపూ అధిక పన్నుల ద్వారా అధికాదాయం అనే ఆలోచనలోనే ఉంటాయి. అధిక పన్నులూ, వాటిని చెల్లించలేదంటూ వేధింపులూ వగైరాలను ‘ట్యాక్స్ టెర్రరిజం’గా కొందరు అభివర్ణిస్తున్నారు. ఈ సంస్కరణలు మైలురాయి వంటివా... కాదా అన్నది రానున్న కాలంలో తేలిపోతుంది. పనిలో పనిగా జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు కలుగుతున్న నష్టాన్ని భర్తీ చేసే యోచన కూడా చేస్తే దేశంలో ఫెడరలిజం వర్ధిల్లుతుంది. -
పరువుతీస్తున్న ‘ప్రక్షాళన’!
అనుకున్నదొకటైతే అయింది మరోటి. బిహార్‌లో ఆఖరి నిమిషంలో ఆదరాబాదరాగా ఎన్నికల సంఘం (ఈసీ) తలపెట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆ సంస్థ ప్రతిష్ఠను మరింత దెబ్బ తీసింది. ఓటర్లలో దొంగలున్నారన్న నిర్ణయానికొచ్చి, వారందరినీ ఏరిపారేయాలను కోవటం దీనంతటికీ కారణం. పోనీ అందుకు ప్రాతిపదికేమిటో ఎవరికీ తెలియదు. ఏడెనిమిది నెలల క్రితం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తానే రూపొందించిన జాబితాలో అవకతవకలున్నాయని అంగీకరించటమంటే తన పనితీరు సరిగా లేదని ఒప్పు కోవటమేనని ఆ సంస్థకు తోచలేదు. 2.74 కోట్ల మంది ఓటర్లలో 99.5 శాతం మంది తమ అర్హతలకు సంబంధించిన పత్రాలు సమర్పించారని ఈసీ సర్వోన్నత న్యాయస్థానానికి చెప్పగా ముసాయిదా జాబితా అవకతవకలు ఒక్కోటే బయటపడి దిగ్భ్రాంతి కలిగి స్తున్నాయి. అర్హులైన ఓటర్లు ఈసీ అడిగిన 11 పత్రాల్లో ఏదో ఒకటైనా దాఖలు చేయటానికి తిప్పలు పడుతుంటే అనర్హులైనవారు, అనుమానాస్పద వ్యక్తులు దర్జాగా జాబితాలో చోటు దక్కించుకున్నారు. కేవలం 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీడియా సంస్థ ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ నిశితంగా పరిశీలిస్తే అనేక అవకతవకలు బయటపడ్డాయి. ఒకే పేరు,తండ్రి/భర్త పేర్లు ఉండి కనీసం రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాకెక్కిన 1,87,643 కేసుల్ని ఆ సంస్థ బయటపెట్టింది. కొందరైతే ఒక నియోజకవర్గంలోనే నదురూ బెదురూ లేకుండా ఆ పని చేశారు. మరికొందరు చిరునామాలు మార్చే శ్రమ కూడా తీసుకోలేదు.‘స్వచ్ఛమైన జాబితా’ రూపకల్పనే ధ్యేయమంటున్న ఈసీ ఈ దొంగ ఓటర్ల విజృంభణకు ఏం సంజాయిషీ ఇస్తుంది? కనీసం అలాంటి విపరీతాలకు కారణమైనవారిపై చర్య తీసుకుంటామని చెప్పటం లేదు. పైగా బిహార్ ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ వెల్లడించిన అంశాలను ఖండించారు. ఈ క్రమంలో వారు ఎక్కడెక్కడ పొరబడ్డారో చెప్పేందుకు కూడా ప్రయత్నించలేదు. తనకున్న పరిమిత వనరులతో కేవలం 39 చోట్ల ముసాయిదాలో ఒక సంస్థ ఇన్ని లోపాల్ని పసిగట్టగలిగితే, ఓటర్లు అందజేసిన అర్హతా పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి నిగ్గుదేల్చే పనిలో తలమునకలైవున్న వేలాదిమంది ఎన్నికల సిబ్బంది ఏం పనిచేస్తున్నట్టు? వారిపై అధికార పక్షాల ఒత్తిళ్లు న్నాయా? ముసాయిదాలో తొలగించిన 65 లక్షల మందీ ఈసీ దృష్టిలో నకిలీ ఓటర్లు.అందుకోసమే వారి వినతుల్ని పరిశీలించటానికి మొదట్లో ఆ సంస్థ సిద్ధపడలేదు. అందు కోసం సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గడువు ముగిసిన సోమ వారం నాటికి కేవలం 33,000 మంది మాత్రమే పత్రాలు సమర్పించారని ఈసీ చెబుతోంది. పొట్ట చేతబట్టుకుని నలు మూలలకూ పోయే సాధారణ కూలీలు, కార్మికులు తమ చిరునామాల్లో ఉండటం, ఈసీ అడిగిన పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించటం అంత తేలికా? చిరునామాల్లో లేకపోతే మరణించినట్టు లేదా శాశ్వతంగా ఆ చిరునామా నుంచి నిష్క్రమించినట్టు ఎన్నికల సిబ్బంది రాసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే ‘ఓట్ చోరీ’ నినాదంతో ఉద్యమిస్తున్న విపక్షాలు సైతం ఆ సమస్య విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలి. సర్వోన్నత న్యాయస్థానం చెప్పినట్టు రాజకీయ పక్షాలు చురుగ్గా కదలాలి. తమ కార్యకర్తల సాయంతో అర్హులైనవారు ఓటర్ల జాబితాలకెక్కేలా సాయపడాలి. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరిది పైచేయి అవుతుందన్న ప్రశ్న అర్థరహితం. ఎన్నికల నిర్వహణ క్రతువులో తలమునకలై ఉండాల్సిన ఈసీ జవాబుదారీతనాన్ని ప్రదర్శించాలి. నిలదీస్తున్నదెవరన్న విచికిత్సకు పోకుండా నిజాన్ని నిగ్గుతేల్చి తేల్చాలి.ఎందుకంటే రాగల కాలంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ‘సర్’ అమలు ప్రారంభ మవుతుందని ఆ సంస్థే చెబుతోంది. ప్రతిచోటా ఇదే మాదిరి తప్పుల తడకలతో ఆ ప్రక్రియను సాగిస్తే ఈసీ దేశ ప్రజల దృష్టిలో మాత్రమే కాదు... ప్రపంచ దేశాల ముందు కూడా పలచనవుతుంది. ఓటర్ల జాబితాలో చేరటానికి విధించిన గడువును పొడిగించుకుంటూ పోతే మొత్తం ప్రక్రియ గందరగోళంగా తయారై, తుది జాబితా ఖరారు సమస్యా త్మకమవుతుందంటున్న ఈసీ వాదనల్లో నిజం లేకపోలేదు. కానీ అందుకు బాధ్యత వహించాల్సింది తాను కాదా? అసలు ఎవరూ కోరకుండానే చివరి నిమిషంలో ఈ పెనుభారాన్ని నెత్తిన వేసుకున్నదెవరు? ఈసీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. -
అఫ్గాన్‌కు ఆపత్సమయం
అంతరిక్షాన్ని దాటి గ్రహాలను పలకరించి, సూర్యుడిపై సైతం నిశితంగా చూపు సారించేందుకు తహతహలాడుతున్న మనిషి తన కాళ్లకిందనున్న నేలలో జరిగే కల్లోలం ఏమిటో, అది ఎప్పుడు ఎందుకు కంపించి పెను విపత్తుల్ని తెచ్చిపెడుతున్నదో తెలియని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాడు. అంతా అయినాక భూకంప కేంద్రం ఎక్కడో, దాని తీవ్రత ఏపాటో చెప్పగలుగుతున్నా ముందుగా పసిగట్టడం అసాధ్యంగానే ఉంది. సోమవారం అఫ్గానిస్తాన్‌లో సంభవించిన భూకంపంలో ఇంతవరకూ 1,400 మందికి పైగా మరణించగా వేలాది మంది గాయపడ్డారు. ఆకలి, అనారోగ్యం, పేదరికం వంటి అనేకానేక క్లేశాలతో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్ ప్రజలకు అక్కడి తాలిబన్ పాలకులు అదనపు సమస్య. వారి విధానాలను సాకుగా చూపి పలు దేశాలు ఇప్పటికీ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. భారత్ గుర్తించకపోయినా వివిధ రూపాల్లో దౌత్యం నెరపుతున్నది. ఇప్పుడు తక్షణ సాయం అందించింది. 2021 ఆగస్టులో తాలిబన్లు కూలదోసిన అష్రాఫ్ ఘనీ సర్కారే చాలా దేశాల దృష్టిలో ‘నిజమైన’ ప్రభుత్వం. చాలా దేశాల్లో ఘనీ ప్రభుత్వ రాయబార కార్యాలయాలే ఉన్నాయి. అఫ్గాన్‌కు ఆ దేశాలు అందించాల్సిన సాయమంతా ఐక్యరాజ్యసమితి సంస్థలకే వెళ్తుంది. వాటిని స్వచ్ఛంద సంస్థలు స్వీకరిస్తాయి. అఫ్గాన్‌ను 2001–21 మధ్య తన ఉక్కు పిడికిట్లో బంధించి, ఆ దేశాన్ని అనేక విధాల ధ్వంసం చేసి నిష్క్రమించిన అమెరికా... యూఎస్ఎయిడ్ కింద ఏటా అఫ్గాన్కిచ్చే 380 కోట్ల డాలర్ల మానవీయ సాయానికి ఈ ఏడాది జనవరి నుంచి కోత విధించింది. పర్యవసానంగా ఆ సాయం 76 కోట్ల డాలర్లకు పడిపోయింది. అందుకే ఇప్పుడు తక్షణమే అందాల్సిన వైద్యసాయం మొదలుకొని పునరావాసం వరకూ అన్నిటికన్నీ పడకేశాయి.ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రీతిలో క్రియాశీలంగా ఉన్న భూకంప ప్రాంతాల్లో అఫ్గాన్ ఉన్న హిందూకుష్ పర్వత శ్రేణి ప్రాంతం ఒకటి. ఇక్కడ భారత పలక, యూరేసియా పలకలు పరస్పరం ఢీకొంటున్నాయి. పర్యవసానంగా ఏర్పడే రాపిడి వల్ల శక్తి విడుదలై అది తరంగాల రూపంలో భూ ఉపరితలానికి చేరటంతో ప్రకంపనలు జనం అనుభవంలోకొస్తాయి. భూకంప కేంద్రం భూ ఉపరితలానికి దగ్గర లో ఉంటే ఆ ప్రకంపనల తీవ్రత అధికంగా ఉండి పెను ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. తాజాగా సంభవించిన భూకంప కేంద్రం ఉపరితలానికి కేవలం 8 కిలోమీటర్ల లోతులో ఉందంటున్నారు.అందువల్లే తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6గా నమోదైనా, ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎక్కువున్నాయి. లోలోతు పొరల్లో సంభవించే భూకంపాల వల్ల విడుదలయ్యే తరంగాలు ఉపరితలానికి చేరేలోపే తమ శక్తిని చాలాభాగం కోల్పోతాయి. కనుకనే నష్టం తక్కువుంటుంది. ఉత్తర అఫ్గాన్‌లోని పామీర్–హిందుకుష్ ప్రాంతంలో భూకంపాల తీవ్రత ఎక్కువ. కానీ అవి దాదాపు 200 కిలోమీటర్ల లోతులో సంభవిస్తుంటాయి. ఇందుకు భిన్నంగా పశ్చిమ పాకిస్తాన్, ఆగ్నేయ అఫ్గాన్ ప్రాంతంలోని సులేమాన్ పర్వత శ్రేణి వద్ద భూ ఉపరితలానికి సమీపంగా భూకంప కేంద్రాలుంటాయి. భూకంపాలు వాటంతటవే ప్రమాదకరమైనవి కాదు. అవి సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో ఉండే కట్టడాలు, ఆ విపత్తు విషయంలో అక్కడి పౌరుల్లో ఉండే అవగాహన నష్టం తీవ్రతను తగ్గిస్తాయి. భూకంపాల విషయంలో ఎంతో అనుభవాన్ని గడించి, ప్రాథమిక విద్యాస్థాయి నుంచీ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్న జపాన్ ఇందుకు ఉదాహరణ. అక్కడ భూకంపాన్ని తట్టుకునే విధంగా భవంతులు నిర్మించటం తప్పని సరి. అందువల్లే భూకంప తీవ్రత ఎక్కువున్న సందర్భాల్లో సైతం జపాన్‌లో ప్రాణనష్టం కనిష్ఠంగా ఉంటున్నది. మెరుగైన, శాస్త్రీయమైన ఆవాసాల నిర్మాణానికయ్యే అధిక వ్యయాన్ని భరించే స్తోమత దారిద్య్రంలో కొట్టుమిట్టాడే అఫ్గాన్ ప్రజలకు లేదు. అందుకే స్థానికంగా లభించే మట్టి, రాళ్లు, ఇటుకలతో ఇళ్లు నిర్మించుకుంటారు. పైగా అవి పర్వత సానువుల్లో ఉంటాయి. విపత్తుల సమయాల్లో ఒక్కసారిగా కుప్పకూలి పౌరులకు బయట పడే వ్యవధినీయవు. ఈ ఆపత్సమయంలో అఫ్గాన్‌ను ఆదుకోవటం ప్రపంచ దేశాల బాధ్యత. సాధారణ సమయాల్లో ఏం చేసినా చెల్లుతుందిగానీ, విపత్తులు విరుచుకు పడినప్పుడు అందరూ ఏకం కావాలి. మానవీయతను చాటుకోవాలి. -
అర్థరాత్రి సాక్షిపై దాడి.. ఎడిటర్‌పై అక్రమ కేసు
సాక్షి, అమరావతి: ప్రజావ్యతిరేక విధానాలపై అక్షర సమరం సాగిస్తున్న సాక్షి మీడియాపై తొలి నుంచి చంద్రబాబు కూటమి సర్కారు కక్షసాధింపునకు తెగబడు తోంది. దీనిలోభాగంగా తాజాగా ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసు పెట్టిన పోలీసులు అర్ధరాత్రి విజయవాడ ఆటో నగర్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలోకి దూసుకొచ్చారు. అర్ధరాత్రి 12.30 గంటల నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు హల్చల్ చేశారు. సిబ్బంది, పాత్రికేయులపై ప్రశ్నల వర్షం కురిపించారు.ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని నిలదీస్తున్న ‘‘సాక్షి’’ పత్రికపై చంద్రబాబు ప్రభుత్వం మరోసారి కక్షసాధింపు చర్యలకు తెగబడింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తూ, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ... ‘‘సాక్షి’’ ఎడిటర్‌పై అక్రమ కేసు బనాయించింది. పోలీసు అధికారులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన పదోన్నతులను కల్పించలేదనే విషయాన్ని వెలుగులోకి తెచ్చి ఏ పోలీసు అధికారుల హక్కుల కోసమైతే గళమెత్తిందో, వారితోనే అక్రమ కేసు నమోదు చేయించడం ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనం. అది కూడా రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనుకుల శ్రీనివాస్‌తో ఫిర్యాదు చేయించి మరీ అక్రమ కేసు పెట్టడం గమనార్హం. ⇒ రాష్ట్రంలో డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు ప్యానల్ కాలపరిమితి ఆగస్టు 31తో ముగిసింది. అయినా, పదోన్నతులు ఇవ్వకపోవడంతో డీఎస్పీలు తీవ్రంగా నష్టపోయారు. కొందరు గత నెల 31న రిటైరయ్యారు. ప్యానల్ ఏర్పాటు చేసి పదోన్నతులు కల్పించేసరికి మరికొందరు రిటైరవుతారు. భారీగా ముడుపులు ఇవ్వలేదనే తమకు పదోన్నతులు ఇవ్వలేదని పలువురు డీఎస్పీలు వాపోయారు.‘‘పోలీసు శాఖ క్రమశిక్షణను గౌరవిస్తూ బహిరంగంగా మాట్లాడలేకపోతున్నాం. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రకటనలు జారీ చేయలేకపోతున్నాం. నిరసన వ్యక్తం చేయలేకపోతున్నాం. అదే ఆర్టీసీ ఉద్యోగులు పదోన్నతుల కోసం కొంతకాలంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబునూ కలిశారు. పోలీసులం అయినందున మేం అడగలేకపోతున్నాం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే విషయాన్ని ‘‘సాక్షి’’ వెలుగులోకి తెచ్చింది. వారి ఆవేదనను గుర్తించి, పదోన్నతులకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, ఉన్నతాధికారులు అందుకు విరుద్ధంగా ‘‘సాక్షి’’పై అక్రమ కేసులతో కక్షసాధింపునకు దిగడం విస్మయపరుస్తోంది. ⇒ జనుకుల శ్రీనివాస్‌తో ఇప్పించిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి స్టేషన్లో.. సాక్షి పత్రికపై అక్రమ కేసు బనాయించారు. బీఎన్ఎస్ సెక్షన్లు 61(2), 196(1), 353(2) కింద సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై క్రైమ్ నంబరు 543/ 2025 కింద సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్కసుతోనే వరుసగా అక్రమ కేసులు గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం.. ‘‘సాక్షి’’ మీడియాపై అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట యథేచ్ఛగా సాగిస్తున్న అరాచకాన్ని ప్రశ్నిస్తుండడంతో గొంతు నొక్కే కుట్ర పన్నుతోంది. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ అక్రమ కేసులు బనాయించడంపై కోర్టులు తప్పుపడుతున్నా ప్రభుత్వం తీరు మారడం లేదు. పత్రికలు, మీడియా, సోషల్ మీడియా, కళారూపాలతో భావ ప్రకటన విషయంలో వచ్చే ఫిర్యాదుపై కేసుల నమోదు విషయంలో పాటించాల్సిన ప్రమాణాలను హైకోర్టు ఇటీవల స్పష్టం చేసింది.పోలీసు శాఖతో పాటు జిల్లా మేజి్రస్టేట్లకు స్పష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించింది. అయినా, రాష్ట్ర పోలీసు శాఖ వైఖరిలో మార్పు రావడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ఎత్తిచూపుతున్న ‘‘సాక్షి’’ని అక్రమ కేసులతో వేధించడమే పనిగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే పోలీసులు ఎలాంటి నోటీసులు లేకుండా... ‘‘సాక్షి’’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో తనిఖీల పేరుతో హల్చల్ చేశారు. ఓ ఎడిటర్ నివాసంలో సోదాల పేరిట వేధింపులకు దిగడం తెలుగు రాష్ట్రాల్లో అదే తొలిసారి కావడం గమనార్హం. ⇒ గత ఏడాది విజయవాడను వరదలు ముంచెత్తిన సమయంలో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసినందుకు కూడా ‘‘సాక్షి’పై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తను తెలంగాణలో దారుణంగా హత్య చేసిన ఉదంతాన్ని ప్రచురించినందుకు, కర్నూలు జిల్లాలో ప్రభుత్వ టీచర్ కుటుంబం కిడ్నాప్ ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చినందుకు, అదే జిల్లాలో ఓ ఐపీఎస్ అరాచకాలను ఎండగట్టినందుకు అక్రమ కేసులు నమోదు చేసి ‘‘సాక్షి’’ పత్రిక గొంతు నొక్కేందుకు యత్నించారు. ⇒ బాలికపై అత్యాచారం చేసిన దారుణాన్ని ప్రశ్నించినందుకు సాక్షి టీవీపై అక్రమ కేసు నమోదు చేయడం విభ్రాంతి కలిగించింది. ఇటీవలి భారీ వర్షాలకు రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని వీడియో ఆధారాలతో సహా ప్రసారం చేసిన సాక్షి టీవీపై కూడా అక్రమ కేసు నమోదు చేయడం గమనార్హం. తాజాగా డీఎస్పీలకు పదోన్నతులు కల్పించకుండా అన్యాయం చేస్తుండడంపై సాక్షి కథనం ప్రచురించడంపైనా ప్రభుత్వం కక్ష సాధింపునకు తెగబడింది. పత్రికా స్వేచ్ఛకు విఘాతం పాత్రికేయ సంఘాలుపత్రికలపై ప్రభుత్వ వేధింపులు, అక్రమ కేసులు నమోదు చేయడాన్ని పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రాష్ట్రంలో భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేందుకు ప్రభుత్వం యత్నింస్తోందని విమర్శించాయి. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలపై సమష్టిగా పోరాడతామని ప్రకటించాయి. -
శుభ పరిణామం... త్రైపాక్షికం
ఏడేళ్ల అనంతరం తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో జరిపిన పర్యటన అనేక విధాల సత్ఫలితాలనిచ్చింది. ఇది అంతర్జాతీయ పెత్తందార్లకు తగిన సందేశం పంపింది. పెహల్గామ్ ఉగ్రవాద దాడిపై మూణ్ణెల్లు గడిచినా ఉలుకూ పలుకూ లేకుండా ఉండి పోయిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో)తో ఆ ఘటనను ఖండిస్తూ తీర్మానం చేయించింది. చైనా, రష్యాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే దిశగా ప్రగతి సాధించింది. ఈ పరిణామాలన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కాదు.అంతర్జాతీయ సంబంధాల్లో అమెరికా సృష్టించిన సరికొత్త గందరగోళం వల్ల ఏర్పడిన అయోమయ వాతావరణాన్ని ఎస్సీవో శిఖరాగ్ర సదస్సు ఒక కుదుపు కుదిపింది. ప్రపంచవ్యాప్త మీడియా ఈ శిఖరాగ్ర సదస్సు కన్నా మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు చర్చించుకుంటున్న వీడియోకూ, ఛాయాచిత్రాలకూ అత్యధిక ప్రాధాన్యమివ్వటం మోదీ చైనా సందర్శనలోని అంతరార్థాన్నీ, దాని పరిణామాలనూ అవగాహన చేసుకోవటం వల్లే. అయితే కేవలం ఈ పర్యటన వల్లే అంతా మారిపోతుందనీ, చైనా మనతో సవ్యంగా ఉంటుందనీ, అమెరికా తన తెలివితక్కువ విధానాలను సవరించుకుంటుందనీ అనుకోనవసరం లేదు. ఇప్పటికైతే యూరేసియాలోని మూడు అగ్ర దేశాల కలయిక అవసరార్థ బంధమే. బలపడాలంటే చేయాల్సింది చాలా ఉంటుంది. రష్యాకిది వర్తించదు. ఆ దేశంతో మన మైత్రి చిరకాలమైనది. దాన్ని నీరుగార్చడానికి అమెరికా ఎంత ప్రయత్నించినప్పటికీ అదేమంత తగ్గలేదు. కానీ పెరగాల్సినంత పెరగలేదు. ఈ మూడు దేశాల కలయికా ఈ దేశాల ప్రయోజనాలు నెరవేర్చుకోవటంతోపాటు ఈ ప్రాంత శాంతికీ, సుస్థిరతకూ, అభివృద్ధికీ దోహదపడుతుంది. దీని మూలాలు ప్రచ్ఛన్న యుద్ధానంతర పరిణామాల్లో ఉన్నాయి. సోవియెట్ యూనియన్ కుప్పకూలి రష్యాగా మిగిలిపోయిన 1990వ దశకంలో అప్పటి ఆ దేశ ప్రధాని యెవ్జెనీ ప్రైమకోవ్ ఈ భావనకు రూపుదిద్దారు. ఈ వ్యూహాత్మక కలయిక భవిష్యత్తులో అమెరికా ఆధిపత్యా నికి చెక్ పెట్టగలదని భావించారు. మంత్రుల స్థాయిలో, నిపుణుల స్థాయిలో పలు సమావేశాలు కూడా జరిగాయి. కానీ 2020లో గల్వాన్ ఉదంతం అనంతరం నిలిచిపోయాయి. చైనాతో మనకున్న సరిహద్దు తగాదాలూ, చేదు అనుభవాలూ తక్కువేం కాదు. నిజానికి మొన్నటికి మొన్న ఎస్సీవో మంత్రుల స్థాయి భేటీ అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనలో పెహల్గామ్ ప్రస్తావన లేకపోవటాన్ని నిరసిస్తూ మన దేశం దానిపై సంతకం చేసేందుకు నిరాకరించింది. ఇప్పుడు ఎస్సీవో తన తప్పు దిద్దుకోవటం శుభæపరిణామం.ఈ త్రైపాక్షిక కలయికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాటలు గమనిస్తే ఆయనెంత కలవరపడుతున్నారో తెలుస్తుంది. ఇది ‘ఏకపక్ష విపత్తు’గా పరిణమిస్తుందట! ఆ దేశ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సరేసరి. రోజుకో రకంగా నోరు పారేసు కుంటున్నారు. మన దేశం సంయమనంతో అమెరికా 50 శాతం సుంకాలు ఎంత అర్థరహితమో చెప్తూ వస్తోంది. తాను తప్ప దిక్కులేదనే స్థితికి చేరిన అమెరికా కళ్లు తెరిపించటం ప్రస్తుతావసరం. దేశాల మధ్య పటిష్ఠమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్న కాలంలో తనకు అనుకూలమైన నిబంధనలతో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)ను అమల్లోకి తెచ్చింది అమెరికాయే. పర్యవనసానంగా ఎడాపెడా ఆర్జించి, స్వీయ తప్పిదాల కారణంగా సంక్షోభంలో పడిన ఆ దేశం అందుకు ఇతరులను నిందిస్తూ మూర్ఖంగా ప్రవర్తిస్తోంది. భారత–చైనా సంబంధాలపై రెండు వైపుల నుంచీ వెలువడిన ప్రకటనలు ఒకే స్వరంతో ఉండటం గమనించదగ్గది. ఇరు దేశాలూ భాగస్వాములే తప్ప ప్రత్యర్థులు కారని ఆ ప్రకటనలు గుర్తుచేశాయి. చైనాతో మన సంబంధాలు బాగున్నప్పుడు పాకిస్తాన్ అణిగిమణిగి ఉండటం మొదటినుంచీ కనబడుతోంది. ఇకపై కూడా అదే జరిగితే మంచిదే. ఏదేమైనా పెత్తందారీ పోకడలు చెల్లబోవని చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. కాకపోతే భారత్–చైనా–రష్యా కలయిక వికసించాలంటే ఎంతో చిత్త శుద్ధితో, నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుంది. అది జరగాలని ఈ మూడు దేశాలు మాత్రమే కాదు... ప్రపంచమే కోరుకుంటోంది. -
తొలి ఉపాధ్యాయుడు
ఆ సాయంత్రం ఎవరో అపరిచితుడు ఇంటి తలుపు ముందుకు వచ్చాడు. ‘నాన్నగారు ఉన్నారా?’ అని అడిగాడు. ‘లేరండీ... బయటకు వెళ్లారు’ అని చెప్పాడు ఇంటి బాలుడు. ఆ బాలుడి నాన్న ఆ చిన్న ఊరికి పంచాయితీ బోర్డు ప్రెసిడెంట్‌గా ఎన్నికై ఉన్నాడు. ‘ఈ కానుక ఇక్కడ పెట్టి వెళ్లనా?’ అని అడిగాడా అపరిచితుడు. అందుకు కనీసం తల్లి అనుమతి కావాలని బాలుడు తల్లిని అడిగాడు. ఆమె ఆ సమయానికి ప్రార్థనలో ఉండి బదులు ఇవ్వలేదు. ‘సరే... పెట్టి వెళ్లండి’ అన్నాడా బాలుడు. కాసేపటికి తండ్రి వచ్చాడు. కానుకను చూశాడు. ‘ఎవరిచ్చారు ఇది’ అని బాలుడిని అడుగుతూ కానుక తెరిచి చూశాడు. అందులో ఖరీదైన ధోతి, మిఠాయిలు, పండ్లు ఉన్నాయి. చిన్నచీటీ కూడా ఉంది ఆయన పేరున, కానుకిచ్చిన వ్యక్తి సంతకంతో. అందాక ఆ బాలుడు ఎన్నడూ చూడనంత కోపం వచ్చింది తండ్రికి. ‘ఎవరు తీసుకోమన్నారు నిన్ను’ గద్దించి అడిగేసరికి బాలుడు భయంతో ఏడుపు అందుకున్నాడు. ‘నిన్నూ’... ఒక దెబ్బ వేశాడు. తల్లి కొడుకును పొదువుకుంది. తండ్రి కళ్లల్లో సిగ్గుతో, అవమానంతో కన్నీరు ఉబికింది.‘చూడు... ఇది కానుక. నా నుంచి ప్రయోజనం పొందడానికి ఇచ్చి వెళ్లింది. నేను పదవిలో ఉండగా తరతమ భేదం లేకుండా చేయవలసిన సాయం అందరికీ చేస్తాను. ఇలా కానుక తీసుకుంటే చేయకూడని సాయం కూడా చేయాల్సి రావచ్చు. మన ధర్మంలో కానుకలు నిషిద్ధం. మనుస్మృతిలో కూడా కానుకలు మనిషిలోని దైవిక కాంతిని హరిస్తాయి అని ఉంది. కాబట్టి ఇలాంటి తప్పు జీవితంలో చేయకు’ అని కొట్టిన చేత్తోనే దగ్గరికి తీసుకున్నాడు. అబ్దుల్ కలామ్ అనే ఆ బాలుడు తర్వాత పెరిగి పెద్దవాడై భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు. తండ్రి నేర్పిన పాఠాన్ని పొల్లుపోకుండా పాటించినందువల్ల రాష్ట్రపతి భవన్‌ను వీడి వచ్చే సమయానికి ఆయన వద్ద ఉన్నవి కేవలం రెండు చిన్న సూట్‌కేసులలో పట్టే దుస్తులు. తన సొంత బంధువులు రాష్ట్రపతి భవన్‌కు వస్తే వారి ఆతిథ్యానికి ఎంతయ్యిందో లెక్కవేసి అక్షరాలా 3,52,000 రూపాయలు చెల్లించిన ఆ ఉన్నతుడు నేడు జాతి గౌరవం అందుకుంటున్నాడు. తండ్రి పాఠాలు సరిగా చేరితే పిల్లలు ఇలా ఉంటారు.ఐ.ఐ.టి.లో టాపర్‌గా వచ్చిన విదార్థిని ‘నీకు ర్యాంక్ రావడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత?’ అనడిగితే ‘చాలా ఉంది. నాన్న నన్ను విద్యార్థిలా పెంచాడు... అమ్మ కొడుకులా పెంచింది.. రెండూ మేలు చేశాయి’ అన్నాడు. ఇల్లు అనే పాఠశాలలో తొలి ఉపాధ్యా యుడు తండ్రి. లాలనతో నిండిన తల్లి పాఠాలతో పాటు చూపులతోనే దండించగల తండ్రి పాఠాలు ఉంటేనే బాల్య, కౌమార సమయాల్లో లోకరీతులకు కొట్టుకుపోని విలువలను పాదుకొల్పవచ్చు. తండ్రి పిల్లల క్షేమం కోరతాడు, భవిష్యత్తుకై ఆరాటపడతాడు, అందుకై ఆర్థిక వనరుల కోసం రేయింబవళ్లు కష్టపడతాడు. నిజమే. కాని ఈ క్రమంలో అతడు తన ‘టీచరు పోస్టు’ను, బోధనా బాధ్యతను విస్మరించజాలడు. ‘నా పిల్లలకు ఏమి ఇస్తున్నాను’ అనే తపనలో ‘ఏమి’ అనే ప్రశ్నకు జవాబు ఆర్థికమే కానక్కర లేదు. వాత్సల్యమే కానక్కర్లేదు. వారసత్వమే కానక్కర్లేదు. నేర్పవలసిన పాఠాలు ఉంటాయి, ఇంట్లోని ఈ కొడుకు/కూతురు సమాజంలో పౌరులవుతారు. ఎలాంటి పౌరులవుతారనే స్పృహ ప్రతి తండ్రికీ ముఖ్యం. ‘ఇలా పెంచి వదిలారా’ అనే మాట ఎందుకు రావాలి?చైనాలో ‘యెన్ చువాన్ షెన్ జియొవ్’ అనే సంప్రదాయం ఉంది. తండ్రి తన చర్యలు, ప్రవర్తన, పాటించే విలువల ద్వారా పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలని దాని అర్థం. ‘నువ్వు ఏమిటో అదే నీ పిల్లలు’ అని తాత్పర్యం. ప్రతి ఆఫ్రికా తండ్రి పిల్లలకు బోధించే తొలిమాట ‘నీ పై నువ్వు ఆధారపడు’ అని. ప్రాదేశిక, సామాజిక, రాజకీయ కారణాల రీత్యా తండ్రులు చెప్పాల్సిన పాఠాలు స్వల్ప తేడాతో ఉంటాయిగానీ అన్నింటి అంతిమ లక్ష్యం విలువలతో కూడిన వ్యక్తిత్వమే. ఈ సిలబస్‌ను తండ్రులు పక్కనో గట్టునో పెట్టడం, సిలబస్ పూర్తి చేయడానికి సమయం లేదని వంక చెప్పడం ఒక సంగతి. అసలు సిలబసే లేదనుకోవడం మరో సంగతి.సెప్టెంబర్ 5–‘టీచర్స్ డే’ అంటే అందరూ బడిలో ఉండే టీచర్స్ వైపు చూస్తారు. ఈ టీచర్స్ డే నాడు ఇంట్లోని తొలి ఉపాధ్యాయుడికి మొదటి శుభాకాంక్షలు చెప్పాలి. పిల్లలు ఆశీస్సులు తీసుకోవాలి. వారి సమగ్ర వ్యక్తిత్వాన్ని బేరీజు వేస్తూ ప్రతి తండ్రి తనకు తాను మార్కులు వేసుకోవాలి. ర్యాంకులు అక్కర్లేదు. పాసైతే చాలు. హ్యాపీ టీచర్స్ డే. -
సుంకాలపై ‘సమష్టి’ పోరు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. మన దేశంపై ఉన్న అదనపు సుంకాల భారాన్ని 50 శాతానికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకాలకూ బుధ వారం నుంచి మరో 25 శాతం చేరింది. క్షణానికో రకంగా, రోజుకో విధంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవటంలో సిద్ధహస్తుడైన ట్రంప్ చివరికి ఏం చేస్తారోనన్న ఉత్కంఠ అందరిలో ఉండేది. మూర్ఖత్వం విచక్షణను ఎరుగదు. తన ఆదేశాలను ధిక్క రిస్తూ రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయటం వల్లే ఈ చర్య తీసుకున్నట్టు అమెరికా చెప్పుకొంటోంది. మనల్ని మించి ముడిచమురు కొంటున్న చైనాకు ఆ తర్కం ఎందుకు వర్తించదో ఇంతవరకూ అది సంజాయిషీ ఇవ్వలేకపోయింది. అసలు రష్యా– ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే శక్తి అమెరికాకు తప్ప మరెవరికీ లేదు. ఎందుకంటే తెరవెనకుండి యూరప్ దేశాల ద్వారా ఉక్రెయిన్ను రష్యాపై ఉసిగొల్పిందీ, ఆ యుద్ధానికి అంకు రార్పణ చేసిందీ తానే. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించటం ద్వారా... లేక ఇక వెనక్కు తగ్గాలని ఉక్రెయిన్ను కోరటం ద్వారా శాంతికి దోహదపడాల్సింది కూడా తానే. కానీ ఆ పని చేయకపోగా ఆ యుద్ధం కొనసాగటానికి మనమే బాధ్యులమంటూ దబాయిస్తోంది. దాన్ని ‘మోదీ యుద్ధం’గా అభివర్ణిస్తూ వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో నోరు పారేసుకున్నారు. మనం చమురు కొనటం వల్లే రష్యా యుద్ధం కొనసాగుతోందని తప్పుడు భాష్యానికి దిగారు. ఏ రకంగా చూసినా ప్రపంచంలో సకల అవలక్షణాలకూ బాధ్యత వహించక తప్పని అమెరికాయే రష్యా– ఉక్రెయిన్ యుద్ధానికి కూడా కర్త, కర్మ, క్రియ. ఏకకాలంలో భిన్న సూచనల్ని పంపి అవతలి పక్షాన్ని గందరగోళపరచటం అమెరికాకు అలవాటైన విద్య. ఈ దబాయింపులకు ముందురోజే ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ‘చివరకు రెండు దేశాలూ ఒక్కటవుతాయి’ అని మాట్లాడారు. అందరికన్నా ముందు ఏప్రిల్‌లోనే వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు మొదలెట్టిన భారత్... మే 1 లేదా జూన్ 1 కల్లా దానిపై సంతకాలు చేయాల్సిందని ఆయన చెబుతున్నారు. చర్చించు కుని ఒప్పందంపై సంతకాలు చేస్తారు తప్ప, తమకు నచ్చినట్టు రాసుకుని, ఒప్పందం పూర్తయినట్టేనని చెబితే అంగీకరించేదెవరు? ఇలాంటివి మాఫియా సామ్రాజ్యాల్లో చెల్లుబాటవుతాయి. నాగరిక ప్రపంచంలో సాధ్యపడదు. భారత్–అమెరికా సంబంధాలు ఆదినుంచీ సంక్లిష్టమైనవే. ఇందుకు అమెరికా తనను తానే నిందించుకోవాలి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాకిస్తాన్‌కు సాయపడుతూ, మనల్ని చీకాకు పరిచేందుకు నిరంతరం ప్రయత్నించేది. ఆ దశ దాటి ఇరు దేశాల మధ్యా స్నేహం చిగురించి, దృఢమైన బంధంగా మారి దశాబ్దాలు దాటుతోంది. కానీ పాకిస్తాన్‌ను దువ్వటం ఆపలేదు. ఉగ్రవాద ఘటనలు జరిగినప్పుడల్లా మన దేశం డిమాండ్ చేస్తే తాత్కాలికంగా ఆర్థిక సాయం ఆపటం లేదా ఆయుధ సామగ్రి ఎగుమతి నిలిపినట్టు కనబడటం, ఆ తర్వాత పునరుద్ధరించటం అమెరికా దురలవాటు. మొన్నటికి మొన్న పెహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్యపై ఒక్క మాట మాట్లాడటానికి నోరు పెగలని ట్రంప్, భారత్–పాక్ ఘర్షణల్ని ఆపానని స్వోత్కర్షకు పోవటం ఇప్పటికీ ఆపలేదు. సరిగదా పాక్ ఆర్మీ చీఫ్‌కు ఘన ంగా మర్యాదలు చేశారు. కెనడాలో జరిగిన జీ–7 శిఖరాగ్ర సదస్సు నుంచి రావాలన్న ఆహ్వానాన్ని మోదీ తిరస్కరించటం, తమ డెయిరీ ఉత్పత్తులనూ, జన్యుమార్పిడి ఆహార ఉత్పత్తులనూ అనుమతించాలన్న ఒత్తిడికి అంగీకరించకపోవటం ట్రంప్ కడుపుమంటకు కారణం. కానీ ముడిచమురు సాకు చెబుతున్నారు. భారత్‌లో 46 శాతం మంది సాగు రంగంపై ఆధారపడతారు. అమెరికాలో ఇది ఒక్క శాతమే. ఆ ఒక్కశాతం కోసం దేశ జనాభాలో సగంమంది ఆధారపడే రంగాన్ని ధ్వంసం చేయాలట! ఏమైతేనేం తాజా సుంకాల భారం మన దేశంనుంచి పోయే 66 శాతం ఎగుమతులపై తీవ్ర ప్రభావమే చూపగలదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందువల్ల ఈ ఏడాది, వచ్చే ఏడాది మన వృద్ధిపై 0.8 శాతం కోత పడవచ్చంటున్నారు. రత్నాభర ణాలు, దుస్తులు, వాహనాల విడిభాగాలు, స్టీల్, రొయ్యలు, తోలు ఉత్పత్తులు వగైరాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందనీ, ఈ రంగాల్లో అనిశ్చితి ఏర్పడుతుందనీ అంచనా. లక్షలాదిమంది కార్మికుల ఉద్యోగాలకు ముప్పు కలగవచ్చు కూడా. ఈ ఎగుమతుల్ని వేరే దేశాలకు మళ్లించగలిగితే నష్టాన్ని తగ్గించుకోగలం. అదృష్టవశాత్తూ మనది ఎగుమతుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాదు. అందుకే దేశ ప్రజానీకమంతా ఒక్కటై పట్టుదలగా ఇక్కడి ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తే ఈ గండాన్ని గట్టెక్కడం కష్టం కాదు. -
క్షతగాత్ర గాజా
అంతర్జాతీయంగా ఏకాకి అవుతున్నకొద్దీ ఇజ్రాయెల్‌లో ఉన్మాదం ప్రకోపిస్తోంది. గాజాలో దాని దుర్మార్గాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచానికి చాటుతున్న పాత్రికేయులను గురిచూసి కాటేస్తూ, మరోపక్క గాజా వాసులను ఆకలితో మాడ్చి చంపుతున్న వైనం అమెరికాకు తప్ప అందరికీ ఆందోళన కలిగిస్తోంది. మనుషులు సృష్టించిన దుర్భిక్షంతో గాజా అల్లాడుతున్నదని ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతను అంచనా వేసే ఐరాస అనుబంధ సంస్థ ఐపీసీ ప్రకటించిందంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోంది. మర్యాదలు అడ్డువచ్చాయో, నిబంధనలు అనుమతించలేదో గానీ... గాజా దుర్భిక్షాన్ని మానవ మృగాల సృష్టిగా ప్రకటిస్తే వర్తమాన స్థితికి సరిగ్గా సరిపోయేది. ఇజ్రాయెల్ఇంతగా ఎందుకు దిగజారుతున్నదో తెలిసిందే. ఇన్ని దశాబ్దాలుగా ఆ దేశానికి గట్టి మద్దతు దార్లుగా నిలిచి, దాని దురాగతాలను సమర్థిస్తూ వచ్చిన బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియాలు వచ్చే నెలలో జరిగే ఐరాస సర్వసభ్య సమావేశంలో పాలస్తీనాను అధికారికంగా గుర్తించనున్నట్టు ప్రకటించాయి. దాంతో భారత్‌తో సహా 1988లోనే పాలస్తీనా ఆవిర్భావాన్ని గుర్తించిన 147 దేశాల సరసన అవి చేరనున్నాయి. భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్యదేశాల్లో రష్యా, చైనాలు ఇప్పటికే పాలస్తీ నాను గుర్తించగా బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఆ జాబితాలో చేరనున్నాయి. అంటే ఇజ్రాయెల్ నరమేధానికి మౌనంగా అంగీకారం తెలుపు తున్న అమెరికా ఇకపై మండలిలో ఏకాకి కానుంది. అందుకే ఇజ్రాయెల్ ఉన్మాదం ముమ్మరించింది. సమితిలోనూ, మండలిలోనూ పాలస్తీనాపై చర్చ వచ్చేనాటికల్లా పాలస్తీనా ఉనికినే తుడిచేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తాపత్రయపడుతు న్నారు. అది సాధ్యంకాదని గాజాను వదలబోమంటున్న ప్రజానీకం చాటుతోంది.రెండేళ్ల క్రితం పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ ఇజ్రాయెల్ గడ్డపై ఉగ్రవాద చర్యకు పాల్పడి 1,200 మంది పౌరులను హతమార్చటంతోపాటు 250 మందిని అపహ రించాక నెతన్యాహూ హమాస్‌పై చర్య నెపంతో ఈ నెత్తుటి హోమాన్ని మొదలుపెట్టారు. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ, వియత్నాం, అఫ్గాన్లలో అమెరికా సాగించిన దురాక్ర మణ యుద్ధాల్లోనూ మరణించిన మీడియా సిబ్బంది కన్నా అధికంగా గాజాలో 245 మంది పాత్రికేయులు ఇజ్రాయెల్ క్రౌర్యానికి బలయ్యారు. ఈ దురాగతాలు అమెరికా అధ్యక్షుడికి తెలియనే తెలియవట. ఈ పరిణామాలకు ఆయనేమీ సంతోషంగా లేరట! నటనలో ట్రంప్‌ను నెతన్యాహూ మించిపోతున్నారు. పాత్రికేయుల మరణం విషాదకర మనీ, వైద్యసిబ్బందికీ, పౌరులకూ తామెంతో విలువిస్తామనీ చెబుతున్నారు. సోమవారం ప్రాణాలు తీసిన పాత్రికేయులపై ఆయనగారు ఎందుకనో ఉగ్రవాద ముద్ర వేయలేదు.ఐపీసీ ఇరవయ్యేళ్ల చరిత్రలో కరవు కాటకాలను ప్రకటించింది నాలుగే సందర్భాల్లో. సోమాలియాలో 2011లో, దక్షిణ సూడాన్‌లో 2017, 2020లలో, సూడాన్‌లో నిరుడు ఆ సంస్థ దుర్భిక్షం నెలకొన్నట్టు ప్రకటించింది. ఇప్పుడు ఆ జాబితాలో గాజా చేరింది. గాజా దుర్భిక్షం ఫేజ్–5లో ఉన్నదని ఐపీసీ చెబుతోంది. పిల్లల్లో 30 శాతంమంది తీవ్రమైన పౌష్టికాహార లోపంతో ఉన్నారని, ప్రతి పదివేల మందిలో ముగ్గురు మరణిస్తున్నారని దానర్థం. ఇదే కొనసాగితే గాజా జనాభాలో మూడోవంతు మంది... అంటే 6,41,000 మంది ప్రమాదకర స్థితిలో పడతారని, అయిదేళ్లలోపు చిన్నారులు 1,32,000 మంది మృత్యువాత పడతారని అంచనా వేస్తోంది. ఇప్పటికే ఆకలితో 112 మంది పసివాళ్లతో సహా 271 మంది చనిపోయారు. ఇవిగాక పంపిణీ ట్రక్కుల వద్ద గుమిగూడుతున్నవారిని కాల్చి చంపటం నిత్యకృత్యమైంది. దిగ్బంధాలతో ఆహారం, సరుకులు, ఔషధాలు ప్రజానీకానికి చేరట్లేదు. గాజా వెలుపల 6,000 ట్రక్కులు అనుమతులకై ఎదురుచూస్తున్నాయి. నిత్యం క్షిపణులు, బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నా, ఈ మారణ హోమాన్ని మౌనంగా తిలకిస్తున్న ప్రపంచంలో అనాథలమయ్యామని తెలుస్తూనే ఉన్నా అత్యధిక జనాభా పాలస్తీనాను విడిచిపెట్టడానికి ససేమిరా అంటున్నది. ఆకలితో,హంతక దాడులతో మృత్యువాత పడతామని తెలిసినా వెరవట్లేదు. రెండో ప్రపంచ యుద్ధా నంతరం ఎక్కడా దిక్కులేక అగ్రరాజ్యాల అండతో ఒక దేశాన్ని ఆక్రమించుకున్న దురాక్ర మణదారుకేం తెలుసు... మాతృభూమిపై మమకారమంటే ఏమిటో?! ఇవాళ హంతకు లది పైచేయి కావొచ్చు, ప్రపంచ ప్రజానీకం మౌనంగా మిగిలిపోవచ్చు. కానీ ఈ నేరాలు సమసిపోవు... వాటికి శిక్షపడకా తప్పదు. అప్పుడు నటనలు చెల్లవు, ముసుగులు కుద రవు. ఆ రోజు ఆగమించేవరకూ పాలస్తీనా పంటి బిగువన ఈ కష్టాలు భరించక తప్పదు. -
ఈ మారణహోమం ఆగేదెలా?
‘భార్యాభర్తలన్నాక ఇదంతా మామూలే కదా...’ అన్నాడు గ్రేటర్ నోయిడాలో భార్యను హత్యచేసిన తర్వాత విపిన్ భాటీ అనే యువకుడు. బహుశా హైదరాబాద్‌లోని మేడిపల్లిలో గర్భిణిగా ఉన్న భార్యను గొంతు కోసి చంపి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి మూసీ నదిలో పడేసిన మహేందర్‌రెడ్డిని అడిగినా... భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో రెండేళ్లపాటు భార్యను మానసికంగా, శారీరకంగా హింసించి తిండి కూడా పెట్టకుండా మాడ్చి ఆమె మరణానికి కారణమైన నరేశ్బాబును అడిగినా... పెళ్లయిన మూడు నెలలకే భార్యను ఊపిరాడకుండా చేసి చంపేసిన వరంగల్ జిల్లాలోని గణేశ్‌ను అడిగినా... మహబూబ్‌నగర్ జిల్లాలో భార్యను హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేసిన శ్రీశైలంను అడిగినా ఇదే చెబుతాడు. కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలో వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనలు సమస్య తీవ్రతను చాటుతున్నాయి. అదనపు కట్నం కోసమో, అనుమానంతోనో, తమకన్నా అధికంగా సంపాదిస్తున్నదనో భార్యల్ని హింసించడం, హతమార్చటం సర్వసాధారణంగా మారింది. అందుకే ‘భార్యాభర్తలన్నాక ఇదంతా మామూలేగా...’ అనగలిగాడు విపిన్. ఈ ఉదంతాలన్నిటిలో మధ్యవర్తులు రాజీ చేశారని, అంతా బాగానే ఉందనుకున్నామని, ఇంతలోనే ఘోరం జరిగి పోయిందంటూ తల్లి తండ్రులు బావురుమనటం చూస్తాం. ఒకపక్క ఐపీసీ సెక్షన్ 498–ఏ దుర్వినియోగానికి గురవుతున్నదంటూ పదేళ్ల క్రితం మొదలైన అలజడి పర్యవసానంగా 2014లో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. అటు తర్వాత అరెస్టులు తగ్గిపోయాయనీ, ఇది బాధిత మహిళలకు మరింత సమస్యాత్మకంగా మారిందనీ మహిళా సంఘాలూ, హక్కుల సంఘాలూ అభ్యంతరాలు చెప్పినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు 498–ఏ భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లో సెక్షన్ 85గా వచ్చిచేరింది. జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదికల్లో ప్రస్తావించే వరకట్నం వేధింపు కేసుల సంఖ్య, వాటిల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలవుతున్న వైనం చూపి రాజీకి వీలున్న నేరం (కాంపౌండబుల్ అఫెన్స్)గా మార్చాలని గతంలో ప్రయత్నాలు జరిగినా మహిళా ఉద్యమాలతో కేంద్రం వెనక్కి తగ్గింది. సమాజంలోనైనా, కుటుంబా ల్లోనైనా మహిళలపై ఇలాంటప్పుడు నలుమూలల నుంచీ వచ్చే ఒత్తిళ్లు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలుసు. భర్త పూర్తిగా మారిపోయాడనీ, ఇకపై జాగ్రత్తగా మసలుకుంటాడనీ ఒత్తిళ్లు తెస్తే సులభంగా కరిగిపోయే భార్యలు కోకొల్లలు. భర్తపై కేసు పెట్టిందని చిన్నచూపు చూసే సమాజం, ఎలాగోలా కాపురాన్ని నిలబెట్టుకోవాలని అయినవారు బతిమాలటం, చంటిపిల్లలతో కోర్టుల చుట్టూ తిరగకతప్పని స్థితి, ఒంటరి మహిళగా బతకటం కష్టమన్న భయాందోళనలూ స్త్రీలు రాజీపడక తప్పనిస్థితిని కల్పిస్తున్నాయి. విచారణ పూర్తవుతున్న దశలో మాట మార్చటంవల్ల కేసులు వీగిపోతున్నాయి. దారుణ మేమంటే... కన్నకూతురిని హతమార్చాడన్న కోపం కూడా లేకుండా కొన్నిసార్లు తల్లితండ్రులు రాజీ పడుతున్నారు. డబ్బుల వల్లనో, బెదిరింపుల వల్లనో వెనక్కి తగ్గుతున్నారు. దేశంలో సామాజిక కట్టుబాట్లూ, సంప్రదాయాలూ మహిళల్ని కట్టిపడేసినంతగా మగవాళ్లను పట్టించుకోవటం లేదు. పర్యవసానంగానే ఈ హింసాత్మక ఘటనలు పదే పదే జరుగుతున్నాయి. జరుగుతున్న హింసతో పోలిస్తే పోలీస్ స్టేషన్లకూ, కోర్టులకూ వెళ్లే ఉదంతాల సంఖ్య అత్యల్పం. కులం పేరిట, మతం పేరిట ‘పెద్దలు’ రంగంలోకి దిగి భర్తను మందలించినట్టుగా, అతడు మారాడన్నట్టుగా చూపించి ఇకపై సమస్యలు రావని హామీ ఇస్తున్నారు. ఇప్పుడు కన్నుమూసిన యువతుల్లో అనేకులు ఆ నరకకూపాల్లోకి మళ్లీ ప్రవేశించి ప్రాణాలు కోల్పోయినవారే. ఇలాంటివి జరిగినప్పుడు గతంలో రాజీకి ప్రయత్నించిన ‘పెద్దల్ని’ కూడా బాధ్యులుగా చేరిస్తే తప్ప ఈ మారణ హోమం ఆగదు. దౌర్జన్యం చేయటం, హింసించటం చట్టం దృష్టిలో నేరం. ఆ నేరాన్ని పోలీసుల వరకూ పోనీయకుండా చేసి, నోళ్లు మూయించి రాజీకి ప్రయత్నిస్తున్న వారు కూడా నేరంలో భాగస్వాములే అని గుర్తించాలి. అసలు 2022 తర్వాత ఎన్సీఆర్బీ నివేదికలు కేంద్రం వెలువరించటం లేదు. కనీసం పోలీసుల వరకూ వస్తున్న కేసుల గణాంకాలైనా తెలియక పోతే సమాజాన్ని పీడిస్తున్న సమస్యపై కఠిన చట్టాలతోపాటు ఇతరత్రా ఏం చేయాలో ఆలోచించటం ఎలా సాధ్యం? విపిన్ లాంటివాళ్లు భార్యల్ని హింసించడం మామూలే అన్న ధోరణికి పోవటాన్ని చూసైనా తీరు మార్చుకోవాలి. మౌనంగా ఉండిపోయి మనమంతా పరోక్షంగా ఆ నేరాల్లో భాగస్వాములమవుతున్నామని గుర్తుంచుకోవాలి. -
నేల విడిచిన సమరం
చిన్నపాటి ప్రాంతాన్ని ఏలిన రాజును సైతం భూమండలమేలినవాడిగా పేర్కొని ఆకాశానికెత్తడం మన ఇతిహాస, పురాణాల్లో కనిపిస్తుంది. మహాభారతంలో దుష్యంతుని గురించి నన్నయ రాస్తూ, అతడు మహాబలవంతుడనీ, దిక్కుల చివర ఏనుగులతో అలంకృతమైన భూమండలమంతా తన అధీనంలో ఉండగా; సూర్య కిరణాలు, గాలీ కూడా చొరలేని మహారణ్యాలను, దేశాలను అజేయ పరాక్రమంతో ఏలాడనీ అంటాడు. అన్ని రకాల బలాలూ, బలగాలూ కలిసొస్తే భూమి మొత్తాన్ని శాసించాలనే పాలకుల ఆకాంక్ష అలాంటి అభివర్ణనలలో తొంగిచూస్తుంది. యుద్ధాలనేవి భూమినింకా దాటని దశ అది. నేటి సాంకేతిక అభివృద్ధి పుణ్యమా అని యుద్ధాలు ఆకాశ మార్గం పట్టేశాయి. భూయుద్ధాలు గతస్మృతులై, యుద్ధం ఈ రోజున అక్షరాలా నేల విడిచిన సమరమైంది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మనం జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’ దానిని అత్యాశ్చర్య కరంగా కళ్ళకు కట్టింది. ‘అర్థశాస్త్రం’తో సహా ప్రాచీన గ్రంథాలు యుద్ధతంత్రంలో చెప్పిన అన్ని ఉపాయాలను, మాయోపాయాలను, పూర్తిగా సైనిక సాయంతో కాకుండా శాస్త్ర సాంకేతిక సాయంతో అందులో ప్రయోగించినట్టు చెబుతున్నారు. అంతర్జాల కేంద్రితంగా, కృత్రిమ మేధ సృష్టించిన సమాచారంతో, ద్రోణులపైనా, గ్రౌండ్ పొజిషనింగ్ సిస్టమ్స్(జీపీఎస్)పైనా, ఉపగ్రహాలపైనా ఆధారపడి చేసిన ఎలక్ట్రానిక్ యుద్ధంగా అభివర్ణిస్తున్నారు. రష్యా సాయంతో మనం అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను, రఫేల్ వంటి యుద్ధ విమానాలను బరిలోకి దింపి విజయవంతంగా వాడుకున్న తీరు, నేటి యుద్ధాలు భూమ్యాకాశాల మధ్య పోరుగా మారడాన్ని ప్రత్యక్షంగా చాటాయి. సాంప్రదాయిక యుద్ధాలతో పోల్చితే, ఈ గగనతల యుద్ధాలు దేశాలకూ, జనాలకూ తెచ్చిపెట్టే కష్టాలూ అనేక రెట్లు ఎక్కువనీ; ఏ దేశానికాదేశం ఎప్పటికప్పుడు సాంకేతికంగా పై చేయిని సాధించడమే దీనికి పరిష్కారమన్న హెచ్చరికా వినిపిస్తోంది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో వెలుగు చూసిన వివరాలు ఇలాంటి యుద్ధాలతో ముడి పడిన ప్రమాదాలను భయభ్రాంతంగా చూపిస్తున్నాయి. ఉక్రెయిన్ జనానికి టెలివిజన్ సేవలందించే ఒక ఉపగ్రహాన్ని రష్యా నిపుణులు హ్యాక్ చేసి వాటిలో యుద్ధ శకటాల తోనూ, ఆయుధ సంపత్తితోనూ తమ సైనికులు జరిపే విన్యాసాల దృశ్యాలను ప్రసారం చేశారు. ఒక్క గుండు కూడా పేల్చకుండా, ఉపగ్రహాలను నిర్వీర్యం చేయడం ద్వారా, సమాచార అంధకారాన్ని సృష్టించి ఒక దేశ భద్రతనూ, దాని ఆర్థిక వ్యవస్థనూ దెబ్బతీసే ప్రమాదాన్ని రూపుగడుతున్నారు. సాంకేతికతను మెరుగుపరచుకుంటూ అన్ని విధాలా పోటీకి సన్నద్ధమైతే తప్ప ఈ సవాలును ఎదుర్కోవడం కష్టమనీ, సాంకేతిక సంపత్తి దేశాల మనుగడకు గీటురాయి అయిందనీ అంటున్నారు. అంతేకాదు, యుద్ధాలు గగన సీమను దాటి గ్రహాంతరాలకు చేరుకోవడమూ పొడగడుతోంది. చంద్ర మండలం మీది ఖనిజాలను, ముఖ్యంగా అణు విచ్ఛేదానికి తోడ్పడే హీలియం–3ను కొల్లగొట్టే పోటీకి అగ్రదేశాలు సిద్ధమవుతూ, అక్కడ అణు రియాక్టర్లను నెలకొల్పే యత్నంలో ఉన్నాయట! మబ్బు చాటు మాయా యుద్ధాలను మన పూర్వులు ఊహించకపోలేదు. రాక్షసులు వాటిలో ప్రవీణులని మన ఇతిహాస, పురాణాలంటాయి. రామాయణంలో మారీచ సుబా హులు అలాంటివారే. రావణుని కొడుకు ఇంద్రజిత్తయితే, నింగి నుంచే కానీ, నేల మీద యుద్ధం చేయడు. మాయసీతను చూపించి నిజసీతగా భ్రమింపజేసి హత మార్చడం లాంటి మాయావి చేష్టలలో రావణుడు కూడా అతనికి చాలడు. సూర్యాస్తమ యంలోగా సైంధవుని చంపుతానన్న అర్జునుని ప్రతిజ్ఞను నిజం చేయడానికి కృష్ణుడు సూర్యుడికి చక్రాన్ని అడ్డేసి సూర్యాస్తమయాన్ని సృష్టించడం నేటి కృత్రిమ సాంకేతిక విన్యాసాల్లాంటిదే. అప్పటివన్నీ ఊహలనుకుంటే, ఇప్పటి శాస్త్ర సాంకేతికత సృష్టించేవి నిండునిజాలు. యుద్ధాలు నేలనూ, నింగినీ దాటి గ్రహాంతరాలకు చేరుకునే పరిస్థితిలో శాంతి గతే మిటి; ఇది పురోగమనమా, తిరోగమనమా అన్న ప్రశ్నా వేసుకోక తప్పదు; యుద్ధమూ, శాంతి అనే జంటలో ఒకటి కాపురం కూల్చేసి గగనమార్గం పట్టిపోతే రెండవది నేల మీద కుమిలిపోతూ ఉండవలసిందేనా అన్న బాధకూ లోనవక తప్పదు. బాహ్యయుద్ధాల ఎండమావుల వేట నుంచి మనిషి వెనుదిరిగి అంతరంగ యుద్ధం వైపు ఎప్పుడు దృష్టి సారి స్తాడు?! లోకాలన్నీ జయించావు కానీ, అరిషడ్వర్గాలనే నీ లోపలి శత్రువులను ఎప్పుడు జయిస్తావని హిరణ్యకశిపుని ప్రహ్లాదుడు అడిగిన ప్రశ్న ఇప్పటికీ ఎంత ప్రాసంగికం!! -
సమాఖ్య వ్యవస్థకు తూట్లు!
రాజకీయ అవినీతిని అంతం చేయటానికి, దేశంలో రాజ్యాంగ నైతికతను నెలకొల్పటానికి అని చెబుతూ లోక్‌సభలో బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, అందుకు సంబంధించిన మరో రెండు బిల్లులపై దేశవ్యాప్తంగా సకారణంగానే నిరసనలు వ్యక్త మవుతున్నాయి. లోక్‌సభలో అయితే తీవ్ర వాగ్వివాదాలు, పరస్పర ఆరోపణలు వెల్లువెత్తాయి. బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలి వరస నుంచి మూడో వరసకు వెళ్లి ప్రసంగించాల్సి వచ్చిందంటే... ఆయనకు రక్షణ వలయంగా పార్లమెంటరీ భద్రత సేవలో ఉండే 12 మంది గార్డులు మోహరించాల్సి వచ్చిందంటే... బిల్లు ప్రతులు చించి పడేశారంటే... సభలో ఆగ్రహావేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రధాని మొదలుకొని ముఖ్యమంత్రులూ, మంత్రులూ అవినీతి ఆరోపణలపై అరెస్టయి, 30 రోజుల్లోగా బెయిల్‌పై విడుదల కాని పక్షంలో వెనువెంటనే పదవుల నుంచి తప్పించేందుకు ఉద్దేశించామని చెబుతున్న ఈ బిల్లులు చట్టాలైతే ప్రకటిత లక్ష్యాలను నిజంగా నెరవేరుస్తాయా అన్నది ప్రశ్నార్థకం. ఏ వ్యవస్థలోనైనా నేర న్యాయచట్టాలు పాలకుల అధికారాన్నీ, వారి రాజకీయ స్వప్రయోజనాలనూ ప్రతిఫలించినంతగా... న్యాయాన్ని ప్రతిబింబించవు. ఆచరణ సంగతి చెప్పనవసరమే లేదు. ఎక్కడి దాకానో ఎందుకు, ఆంధ్రప్రదేశ్‌లో తమ ఎన్డీయే కూటమి పాలన ప్రత్యర్థుల్ని వెంటాడి వేటాడి వేధిస్తున్న వైనం, తప్పుడు కేసులు బనాయిస్తున్న తీరు తెలియదా? కేవలం నిందగా, రుజువుకాని నేరంగా, ఒక ఆరోపణగా మాత్రమే ఉన్న దశలో బెయిల్ రాలేదన్న కారణంగా పదవులకు అనర్హులవుతారని చెప్పడం అంటే ప్రజల దృష్టిలో వారిని శాశ్వతంగా నేరం చేసిన వారుగా ముద్ర వేయటమే అవుతుంది. నేరం చేశారో లేదో తేలకుండా, శిక్షేమీ పడకుండా... విచారణ ప్రక్రియ దానికదే శిక్షగా మారటం మన దేశంలో కళ్లముందు కనబడుతున్న సత్యం. ఈ విషయంలో సీబీఐ, ఈడీ సంస్థలు అనేకసార్లు న్యాయస్థానాలతో చీవాట్లు తింటున్న వైనం తెలియంది కాదు. అలాంటపుడు ఈ సవరణ ద్వారా రాజ్యాంగాన్నే ఆయుధంగా మార్చాలని చూడటం ఎవరి ప్రయోజనాల కోసం?ఈ బిల్లులు కొందరంటున్నట్టు త్వరలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడున్న ‘వోట్ చోరీ’ నినాదాన్ని వెనక్కినెట్టి ‘అవినీతి నిర్మూలన’ ఎజెండాను అగ్రభాగాన నిలబెట్టి తాము మాత్రమే సచ్ఛీలురమనీ, ప్రత్యర్థులంతా అవినీతిపరులనీ ముద్రేయటానికా? నిజమే కావొచ్చు. ఆ మాటెలావున్నా ఇది దేశ ఫెడరల్ వ్యవస్థ అమరికను తీవ్రంగా దెబ్బ తీస్తుంది. రాష్ట్రాల్లో ఎన్డీఏ యేతర పక్షాల ప్రభుత్వాలను ఎన్నికల ముందు పడగొట్టడానికి ఈ చట్టాలను ఎడాపెడా దుర్వినియోగం చేసే వీలుంది. న్యాయసమీక్షకు అవకాశం ఉందనేది అర్థరహిత తర్కం. పెండింగ్ కేసులతో సతమతమవుతున్న న్యాయస్థానాల్లో కేసుల విచారణ పూర్తికావటానికి ఎంత సమయం పడుతున్నదో అందరికీ తెలుసు. సారాంశంలో నేరం రుజువయ్యేవరకూ ప్రతి ఒక్కరినీ నిర్దోషిగా పరిగణించాలన్న న్యాయశాస్త్ర సిద్ధాంతానికి ఇది తూట్లు పొడుస్తోంది.అవినీతి ప్రక్షాళనకు తొలి అడుగు వేయదల్చుకుంటే ముందు సీబీఐ, ఈడీ వంటి సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తినీయాలి. ఆ సంస్థల విశ్వసనీయతను పెంచాలి. అందుకోసం ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం చేసిందేమిటి? యూపీఏ హయాంలో సీబీఐకి ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అనే ముద్రపడింది. సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే ‘పంజరంలో చిలుక’గా సంస్థను అభివర్ణించింది. గత పదకొండేళ్ల పాలనలో ఈ అపప్రథను తొలగించటానికి తీసుకున్న చర్యలేమిటో ఎన్డీఏ చెప్పగలదా? మొన్న మే నెలలో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్‌పై ఈడీ దాడి చేసిన కేసులో ఆ సంస్థ అన్ని హద్దుల్నీ ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కటువుగా వ్యాఖ్యానించారు. నాలుగు నెలల క్రితం కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభలో వెల్లడించిన గణాంకాలు దిగ్భ్రాంతిపరుస్తాయి. గత పదేళ్లలో ఈడీ 193 మంది రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేయగా, వారిలో కేవలం ఇద్దరికి శిక్ష పడింది. ఆప్ సర్కారులో మంత్రిగా ఉండి అరెస్టయిన సత్యేంద్ర జైన్‌పై సీబీఐ నాలుగేళ్లు దర్యాప్తు జరిపి చివరకు అంతా సవ్యంగానే ఉన్నట్టు తేల్చి కేసును మూసేస్తున్నట్టు న్యాయస్థానానికి తెలిపింది. కానీ ఈలోగా ఆయన ఏడాదిన్నరపాటు జైల్లో మగ్గాల్సి వచ్చింది. అవినీతిని వ్యతిరేకించటమూ, ఈ బిల్లుల్ని సమర్థించటమూ ఒకటి కాదు. పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ లేకుండా ఈ బిల్లులు తీసుకురావటం గమనిస్తే ఇది కేవలం విపక్షాలను అవినీతిపరులుగా ముద్రేయటానికే అని అర్థమవుతుంది. పాలకులెవరైనా దుర్వినియోగానికి విస్తృతంగా అవకాశమున్న ఈ బిల్లుల్ని సంయుక్త పార్లమెంటరీ సంఘానికి (జేపీసీకి) పంపటం కాదు... పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. -
మళ్లీ చివురించిన చెలిమి
ఏ దేశానికైనా ప్రథమ ప్రాధాన్యం స్వీయ ప్రయోజనాలు. ఆ తర్వాతే మిగిలినవన్నీ. గాల్వాన్ ఘర్షణల తర్వాత గత అయిదేళ్లుగా భారత్, చైనాల మధ్య ఏర్పడిన వివాదాలు అనేకానేక చర్చల పరంపర తర్వాత కూడా అసంపూర్ణంగానే ఉండిపోయిన నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మన దేశంలో రెండురోజులు పర్యటించటం, ఇరు దేశాల మధ్యా ఏదో మేరకు సదవగాహన కుదరటం హర్షించదగ్గ పరిణామం. ఆయన ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అంతకు ముందు విదేశాంగ మంత్రి జైశంకర్‌తో చర్చలు జరిపారు. ఇరుగు పొరుగు అన్నాక సమస్యలు ఉంటాయి. ఒకటి రెండు పర్యటనలతోనో, రెండు మూడు దఫాల చర్చల్లోనో అవి పరిష్కారం కావాలంటే సాధ్యం కాకపోవచ్చు. అందుకు ఎంతో ఓరిమి, తమ వైఖరిపై అవతలి పక్షాన్ని ఒప్పించే నేర్పు అవసరం. దీర్ఘకాలం ఆ వివాదాలను కొనసాగనిస్తే మూడో దేశం తనకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. నిరుడు అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అప్పటికి నాలుగేళ్ల తర్వాత తొలిసారి కలుసుకున్నారు. ఇరు దేశాల సంబంధాలనూ సాధారణ స్థితికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే మొన్న జూన్‌లో కైలాస– మానససరోవర్ యాత్రకు భక్తులను అనుమతించేందుకు చైనా అంగీకరించింది. భారత్ సందర్శించే చైనా యాత్రికులకు మన దేశం పర్యాటక వీసాలు పునరుద్ధరించింది. ఈనెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలోని తియాన్జిన్లో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో వాంగ్ యీ వచ్చారు. ఆ సదస్సుకు మోదీ హాజరుకావాలంటే సుహృద్భావ సంబంధాలు అవసరమని కూడా చైనా భావించింది. ప్రధాని ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరైతే ఆయన ఏడేళ్ల అనంతరం చైనా సందర్శించి నట్టవుతుంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైనికుల మధ్యా జరిగిన ఘర్షణల తర్వాత సైనికాధికారుల స్థాయిలో చాలా దఫాలు చర్చలు సాగాయి. అయినా సరిహద్దుల్లో ఏప్రిల్ 2020కి ముందున్న పరిస్థితులు ఏర్పడలేదు. ఆఖరికి కజాన్‌లో మోదీ–షీల మధ్య సమావేశం తర్వాత కూడా గత పది నెలల్లో చెప్పుకోదగ్గ ప్రగతి లేదు. వాంగ్ యీ పర్యటన సందర్భంగా ఇరుదేశాలూ 12 అంశాల్లో కీలక నిర్ణయాలు తీసు కున్నాయి. రెండు దేశాల మధ్యా విమాన రాకపోకలను పునరుద్ధరించుకోవాలనీ, వివాదాస్పద సరిహద్దు సమస్యపై చర్చించేందుకు మూడు వేర్వేరు బృందాలు ఏర్పాటు చేసుకోవాలనీ తీర్మా నించాయి. సరిహద్దు విషయంలో ఇప్పుడు పనిచేస్తున్న బృందంతో పాటు తూర్పు, మధ్య సెక్టార్లకు సంబంధించి వేర్వేరు బృందాలు ఏర్పడితే త్వరితగతిన పరిష్కారం సాధించవచ్చని ఇరు దేశాల విదేశాంగమంత్రులూ భావించారు. అలాగే వాణిజ్యాన్ని పెంచుకోవటానికి సరి హద్దుల్ని మళ్లీ తెరవాలని నిర్ణయించారు. లిపూలేఖ్ పాస్, షిప్కి లా పాస్, నాథూ లా పాస్‌ల గుండా ఈ వాణిజ్యం సాగుతుంది. అలాగే పరస్పరం పెట్టుబడుల ప్రవాహానికి కూడా అనుమ తిస్తారు. అన్నిటికన్నా ముఖ్యం – అరుదైన ఖనిజాల ఎగుమతులకు చైనా అంగీకరించటం. స్మార్ట్ ఫోన్ల నుంచి ఫైటర్జెట్ల వరకూ, విండ్ టర్బైన్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకూ ఉత్పాదన ప్రక్రియలో ఈ అరుదైన ఖనిజాలు అత్యవసరం. ఇవి ప్రపంచంలో 99 శాతం చైనాలోనే లభ్యమవుతాయి. వీటితోపాటు ఎరువుల ఎగుమతులపై లోగడ విధించిన నిషేధాన్ని తొలగించ టానికి చైనా అంగీకరించటం ఈ పర్యటనలో ప్రధానాంశం. మన రైతులు ఎక్కువగా మొగ్గు చూపే డీఏపీ ఎరువులు చైనాలో ఉత్పత్తవుతాయి. రెండుచోట్లా ప్రవహించే నదీజలాలపై డేటాను ఇచ్చిపుచ్చుకోవటానికి భారత్, చైనా అంగీకరించాయి. త్రీగోర్జెస్ డ్యామ్‌ను మించిన స్థాయిలో బ్రహ్మపుత్ర నదిపై 16,000 కోట్ల డాలర్ల వ్యయంతో భారీ ఆనకట్ట నిర్మించాలని చైనా తలపెట్టిన నేపథ్యంలో నదీ జలాల డేటాపై అంగీకారం కుదరటం హర్షించదగ్గది.చర్చల తర్వాత తాజా ప్రపంచ పరిణామాలపై వాంగ్ యీ విడుదల చేసిన ప్రకటనలో పరోక్షంగా అమెరికా వ్యవహారశైలిపై విమర్శలుండటం గమనార్హం. స్వేచ్ఛా వాణిజ్యాన్నీ, అంతర్జాతీయ సంబంధాలనూ భగ్నం చేసేలా కొందరు ఏకపక్షంగా బెదిరింపులకు దిగుతున్న పర్యవ సానంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన ప్రస్తావించారు. ఆధిపత్య ధోరణులు ఏ రూపంలో ఉన్నా గట్టిగా ప్రతిఘటించటం చాలా అవసరం. ఏదేమైనా ఇరుదేశాలూ సాధ్యమైనంత త్వరగా సరిహద్దు సమస్యకు పరిష్కారం అన్వేషించగలిగితే, ఉగ్రవాదం అంతానికి చేతులు కలిపితే... ప్రధాని మోదీ చెప్పినట్టు అది రెండు దేశాల మధ్య మాత్రమే కాదు, ఆసియా ఖండంలోనే కాదు... యావత్ ప్రపంచశాంతికీ, సౌభాగ్యానికీ దోహదపడుతుంది. సాధ్యమైనంత త్వరగా అది సాకారం కావాలని ఆశించాలి. -
జీఎస్టీ కొత్త రూపు
ఎనిమిదేళ్ల క్రితం అమల్లోకొచ్చిన సరుకులు, సేవల పన్ను (జీఎస్టీ) ఎట్టకేలకు వచ్చే దీపావళి నాటికి కొత్త రూపాన్ని సంతరించుకోబోతోంది. మొన్న శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుపై నుంచి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ చల్లని కబురందించారు. 2016లో లోక్‌సభ 122వ రాజ్యాంగ సవరణను ఆమోదించి జీఎస్టీకి మార్గం సుగమం చేయటానికి ముందు పదిహేనేళ్లపాటు ఈ ఏకీకృత పన్నుల వ్యవస్థపై చర్చోపచర్చలు జరిగాయి. రాష్ట్రాలను ఒప్పించేందుకు అంతకు ముందున్న ఎన్డీయే సర్కారు, తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం ఎడతెగని ప్రయత్నాలు చేశాయి. కానీ ఏకాభిప్రాయం కుదరలేదు. చివరకు 2017లో అమల్లోకి వచ్చినప్పుడు సైతం విపక్ష రాష్ట్రాలు రుసరుసలుపోయాయి. ఇంత పెద్ద సంస్కరణలో తన పాత్ర ఘనం అని చెప్పుకోవటానికైనా పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగే ఉత్సవానికి వెళ్లాలని కాంగ్రెస్ అనుకుంది. కానీ చివరకు ముఖం చాటేసింది. జీఎస్టీ విషయంలో వివిధ వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోలేదని, చిన్న వ్యాపారులూ వర్త కులూ దీనివల్ల అగచాట్లు పడతారని కారణాలుగా చూపింది. వామపక్షాలు సరేసరి. నిజాలు నిష్టూరంగానే ఉంటాయి. జీఎస్టీ రాకతో కేంద్రం విధిస్తున్న ఏడెనిమిది రకాల పన్నులు రద్దుకావటంతో పాటు రాష్ట్రాలు విధించే రకరకాల పన్నులకు స్వస్తి చెబుతామని, పన్ను వసూళ్లను హేతుబద్ధీకరిస్తామని అప్పట్లో ప్రకటించారు. ఇందువల్ల ఆదాయం కోల్పోతామన్న రాష్ట్రాల ఆందోళనను ఉపశమింపజేసేందుకు అయిదేళ్లపాటు ఆ లోటును పూడుస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ ఆచరణలో సమస్యలెలా వస్తాయో తెలియాలంటే ఇటీవల కర్ణాటకలో చిన్న వ్యాపారులు పడిన అగచాట్లను ప్రస్తావించుకోవాలి. వివిధ రకరకాల యాప్‌ల ద్వారా వినియోగ దారుల నుంచి చెల్లింపులు స్వీకరిస్తున్న తోపుడు బండి వ్యాపారులనూ, వీధుల్లో చిన్నా చితకా దుకాణాలు నడుపుకునేవారినీ లక్ష్యంగా చేసుకుని జీఎస్టీ నిబంధనలు ఉల్లంఘించారంటూ అక్కడి వాణిజ్య పన్నుల విభాగం 13,000 నోటీసులు జారీచేసింది. వీటికి ఏం జవాబివ్వాలో, ఎవరిని ఆశ్రయించాలో కూడా తెలియక, అందుకయ్యే ఖర్చు భరించలేక చాలామంది నగదు చెల్లించాలని వినియోగదారుల్ని కోరటం మొదలుపెట్టారు. వాజపేయి హయాంలో నాటి ఆర్థిక మంత్రి జశ్వంత్సింగ్కు సలహాదారుగా వ్యవహరించిన విజయ్ కేల్కర్ ఈ జీఎస్టీ ఆలోచనకు ఆద్యుడు. ఆయన ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ పలు దేశాల పన్ను వ్యవస్థలను అధ్యయనం చేసి దీన్ని రూపొందించింది. మధ్యతరగతి, అట్టడుగువర్గాలవారు పన్నుపోటు నుంచి ఉపశమనం పొందుతారని చెప్పింది. కానీ జరిగిందంతా వేరు. పరోక్ష పన్నులు చెల్లించేవారి నుంచి మరింత పిండుకోవడానికే జీఎస్టీ తీసుకొస్తున్నారని, ప్రత్యక్ష పన్నుల జోలికి వెళ్లాలన్న ఆలోచనే కేంద్రం చేయటం లేదని విమర్శలొచ్చాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 11.7 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లుండగా ఇప్పుడది దాదాపు రెట్టింప యింది. సగటున ప్రతి నెలా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ సాధారణ వర్గాల అవస్థలు అంతకంతా పెరిగాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు, ఇంకా ఆ దిగువనుండేవారూ జీఎస్టీ కింద దాఖలు చేయాల్సిన రకరకాల పత్రాలు, వివాదాలు, ప్రభుత్వం నుంచి వెనక్కు రావలసిన సొమ్ము కోసం పడి గాపులు... వీటన్నిటితో విసిగిపోయారు. ఈ సంక్లిష్ట వ్యవస్థను సంతృప్తిపరిచే మార్గం దొరక్క అల్లాడిపోయారు. ఈ ప్రత్యక్ష పన్నుల వ్యవస్థ ద్వారా వసూళ్లు భారీగా పెరుగుతుంటే, ప్రత్యక్ష పన్నులు చెల్లించే కార్పొరేట్ల నుంచి రావాల్సిన ఆదాయం పడిపోవటం ఒక వైచిత్రి. 2023 –24లో వివిధ రకాల ప్రోత్సాహాల కింద దాదాపు లక్ష కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇచ్చామని ఇటీవల పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.జీఎస్టీ సరికొత్త రూపంలో రాబోవటం అన్ని వర్గాలకూ శుభవార్త. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతాలుగా ఉన్న నాలుగు స్లాబ్‌ల స్థానంలో ఇకపై రెండే... 5, 18 శాతాలు ఉంటాయని కేంద్రం చెబుతోంది. లగ్జరీ కార్ల వంటి విలాస వస్తువుల పైనా... పొగాకు, పాన్‌మసాలా, ఆన్లైన్ గేమింగ్ వంటి హానికారకాల పైనా మాత్రం 40 శాతం వరకూ ఉంటుంది. జీఎస్టీ వసూళ్లు స్థిరత్వంలో పడటం వల్ల సాధారణ ప్రజానీకాన్ని పన్నుపోటు నుంచి తప్పించాలని భావించినట్టు కనబడుతున్నా, ఇంతకాలమూ ఈ పరిధిలో లేని మద్యం, ఇంధనం వంటివాటిని చేర్చబోతున్నారని అంటున్నారు. సహజంగానే దీనిపై రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ప్రపంచమంతటా ఒకరకమైన మాంద్యం అలుముకున్న వర్తమానంలో జీఎస్టీ సంస్కరణలు మన ఆర్థికవ్యవస్థకు ఊతాన్నివ్వగలవనీ, ఈ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలూ చాలావరకూ తగ్గుతాయనీ ఆశించాలి. -
కుక్క కథ
కుక్కల మీద మనిషికి ఎప్పుడూ సదభిప్రాయం ఉన్నట్టు లేదు. ‘కుక్క’ అనే మాటనే తిట్టుగా వాడగలడు. కుక్క బుద్ధి అని నిందించగలడు. కుక్కల కొట్లాట అని దూషించగలడు. కుక్క బతుకు అని బాధపడగలడు. కుక్క మూతి పిందెలు అని తూలనాడగలడు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అని దెప్పిపొడవగలడు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని వెక్కిరించగలడు. ‘కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి’ అని పాడగలడు. ఆఖరికి కుక్క చావును తనకు ఇష్టంలేని మనిషి జీవితయాత్రకు భరత వాక్యంగా జోడించగలడు.కుక్కలను వాటిమానాన వాటిని అడవిలో మననీయకుండా ఇంటిదాకా తెచ్చుకున్నది మనిషే. సుమారు 15,000 సంవత్సరాల క్రితమే మనిషి దాన్ని మచ్చిక చేసుకున్నాడు. మానవులు తొట్టతొలిగా మచ్చిక చేసుకున్న జంతువు కుక్కేనంటారు. కాదు, గొర్రె అని మరో వాదన. ఏమైనా మనిషితో తొట్టతొలిగా స్నేహం చేసిన జంతువుల్లో కుక్క అగ్రభాగాన ఉందన్నది సత్యం. అప్పటినుంచీ అది మనిషికి వేటలో సాయపడింది. పంటలను కాపు కాసింది. మంచులో స్లెడ్జ్ బళ్లను లాగింది. దొంగలు, హంతకుల జాడను పసిగట్టింది. బాంబులను గుర్తించింది. ఒంటరి జీవులకు తోడుగా నిలిచింది. ‘దేవదాసు’లకు సాంత్వననిచ్చింది. తెగించి యజమానుల ప్రాణాలను కాపాడింది. మనిషి నాగరికతా ప్రస్థానంలో తనకు తెలియకుండానే విశ్వసనీయమైన పాత్రను పోషించింది. దాని తోక మాత్రమే వంకర కావొచ్చుగానీ దాని పనికి ఏ వంకా లేదు. అంతెందుకు! 1957లో రష్యన్లు ‘స్పుత్నిక్’లో తొట్టతొలిగా ఒక జీవిని అంతరిక్షంలోకి పంపాలనుకున్నప్పుడు వాళ్లు ఎంచుకున్నది కూడా ఒక కుక్కనే. అది మాస్కో వీధుల్లో తిరుగాడిన మూడేళ్ల ఆడ ఊరకుక్క. పేరు లైకా. అది ప్రాణాలతో తిరిగిరాదని దానికి తప్ప శాస్త్రవేత్తలందరికీ తెలుసు!జపాన్ లో హచికో కుక్కది మరో కథ. తన యజమాని టోక్యో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసేవాడు. విధులు ముగించుకుని ఆయన సాయంత్రం షిబూయా రైల్వే స్టేషన్ లో రైలు దిగేవాడు. అప్పటికి రెండేళ్ల వయసున్న హచికో అతడి కోసం అక్కడ వేచివుండేది. ఒకరోజు ఉన్నట్టుండి ఆ ప్రొఫెసర్ విధుల్లోనే బ్రెయిన్ స్ట్రోక్‌తో కుప్పకూలి చనిపోయాడు. ఇదేమీ తెలియని హచికో రోజులాగే యజమాని కోసం స్టేషన్ కు వచ్చింది. తెల్లారీ వచ్చింది. మరునాడూ వచ్చింది. క్రమం తప్పకుండా వస్తూనే ఉంది, ఎదురుచూస్తూనే ఉంది. అప్పటికిగానీ స్థానికులు దాన్ని గుర్తించలేదు. తనని ప్రేమించిన యజమాని కోసం, తాను ప్రేమించిన యజమాని కోసం 1925– 1935 కాలంలో అది చనిపోయేదాకా సుమారు పదేళ్లపాటు ఆ స్టేషన్ లో ఎదురుచూసింది. జపాన్ లో ఇప్పుడు హచికో ఒక సాంస్కృతిక చిహ్నం. కుక్క అంటే విశ్వాసం అనే పేరు దానికి ఊరకే రాలేదు. వేల ఏళ్లుగా లక్షలాది కుక్కలు సమష్టిగా సముపార్జించుకున్న ఘనత అది.ప్రపంచంలో సుమారు 360 రకాల కుక్కలున్నాయి. వీటన్నింటినీ తిరిగి ఇంటికుక్క, ఊరకుక్క అని రెండు రకాలుగా విభజించవచ్చు. ఈ రెండింటికీ మధ్య ఉన్నది స్వల్ప భేదమే. ఇది జాతిపరమైనది కాదు. పెంచుకుంటే ఇంటి కుక్క. ఎవరికీ పట్టనిది ఊర కుక్క. ‘మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి కరిస్తే వార్త’ అని జర్నలిజంలో ఒక తొలి పాఠం చెబుతుంటారు. కానీ మనుషులను కుక్క కరిచినా వార్త అవుతుండటం కుక్క కాట్ల తీవ్రతను తెలియజేస్తోంది. ఇది అత్యంత ఆందోళనకరంగా పరిణమించడం వల్లే ఊరకుక్కలను ఊళ్లో ఉంచాలా వద్దా అనే చర్చ దేశమంతా నడుస్తోంది; వాటికి అనుగుణంగా, వ్యతిరేకంగా ఎన్నో వాదనలు వినబడుతున్నాయి.జాక్ లండన్ రాసిన ‘కాల్ ఆఫ్ ద వైల్డ్’ నవలలోని బక్ కుక్క ‘దుడ్డుకర్ర చేతగలవాడిది పైచేయి’ అని ఇట్టే అర్థం చేసుకుంటుంది. ఆ పాఠాన్ని జీవితంలో ఎన్నడూ మరవదు. మనిషి సాధారణంగా ద్వంద్వ జీవి. దుడ్డుకర్రతో కుక్కలకు ‘ఆటవిక శాసనాన్ని’ పరిచయం చేయగలడు; లైకా అంతరిక్షంలో విలవిల్లాడి చచ్చిపోయిందంటే జీర్ణం చేసుకోలేక దాన్ని గ్రహాంతరవాసులు కాపాడినట్టు ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని సృజించుకోగలడు (ఉదా: జూలియన్ మే రాసిన ‘ఇంటర్వెన్షన్ ’). ‘పాతాళ్ లోక్’ వెబ్‌సిరీస్‌లో హథోడా త్యాగీకి తన గురువు ఒక మాట చెబుతాడు: ఒక మనిషి మంచివాడా కాదా అన్నది తెలుసుకోవడానికి అతడు కుక్కలతో ఎలా ఉంటున్నాడో చూడమంటాడు. దేశంలో సుమారు ఆరు కోట్ల ఊరకుక్కలున్నాయట. మనం వద్దనగానే అవి మాయం కావు. ఈ భూమ్మీది నుంచి ఎక్కడికీ పోవు. వాటిని మననిస్తూ, మనం ఇబ్బందిపడకుండా ఏ శాస్త్రీయ మార్గాలున్నాయో అన్వేషించడమే ఉత్తమ మార్గం. ప్రతి కుక్కకూ ఒక రోజంటూ ఉండాలిగా! -
వివాదంలో ‘గవర్నర్ కోటా’
రాష్ట్రాల్లో అసెంబ్లీలుండగా శాసన మండళ్ళు అవసరమా అన్న వాదనతోపాటే ఆ శాసన మండళ్ళకు కొందరు సభ్యుల్ని నామినేట్ చేయటానికి గవర్నర్లకుండే అధికారాలపై, ఆ కోటాలో ఎంపికైన అభ్యర్థుల అర్హతలపై కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంటుంది. తెలంగాణ శాసన మండలికి నిరుడు గవర్నర్ కోటాలో ఎంపికైన విద్యావేత్త ప్రొఫెసర్ కోదండరామ్, పాత్రికేయుడు అమేర్ అలీఖాన్‌ల సభ్యత్వాలు రద్దుచేస్తూ బుధవారం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలీయటంతో ఆ అంశాలపై మళ్లీ చర్చ మొదలైంది. రాష్ట్రాల్లో శాసన మండళ్ళ మాదిరే కేంద్ర స్థాయిలో ఉండే రాజ్యసభకు చేసే ఎంపికలు కూడా అందరిలో ఆసక్తి రేపుతాయి. అంతేకాదు... వివాదాలకూ, అభ్యంతరాలకూ దారితీస్తుంటాయి. పాలకులుగా ఎవరున్నా ఈ రివాజు మారదు. ఇప్పుడు ఎమ్మెల్సీ సభ్యత్వాలు రద్దయిన ప్రొఫెసర్ కోదండరామ్, అమేర్ అలీఖాన్‌ల నేపథ్యం చూస్తే గవర్నర్ కోటాలో ఎంపికకు వారికి అన్ని విధాలా అర్హతలున్నాయని అర్థమవుతుంది. తెలంగాణ సాధనలో జేఏసీ కన్వీనర్‌గా ప్రొఫెసర్ కోదండరామ్ పాత్ర తెలియనివారు లేరు. ఉర్దూ పత్రిక ‘సియాసత్’లో సీనియర్ పాత్రికేయుడైన అమేర్ అలీఖాన్ విద్యా, సంక్షేమ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే స్థానాలకు దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణలను ఎంపిక చేసింది. వీరిద్దరికీ కూడా సామాజిక ఉద్యమాల్లో, సేవాకార్యకలాపాల్లో పాల్గొన్న చరిత్ర ఉంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ పాలిస్తున్నప్పుడు గవర్నర్ కోటా ఎంపికలపై రాష్ట్ర మంత్రివర్గ సిఫార్సులకు గవర్నర్ నుంచి దాదాపు అభ్యంతరాలు వినబడవు. వేర్వేరు ప్రభుత్వాలున్నప్పుడే సమస్యంతా! విపక్షాలు ఎటూ అన్ని వేళలా విమర్శిస్తాయి. అయితే గవర్నర్ కోటాకు వీలు కల్పించే రాజ్యాంగంలోని 171(5) అధికరణం స్ఫూర్తిని చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు బేఖాతరు చేస్తున్నాయనీ, ‘రాజకీయ నిరుద్యోగుల’ పునరావాసానికి దాన్ని వినియోగిస్తున్నారనీ ఆరోపణలున్నాయి. ఆ అధికరణం ప్రకారం సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, కళ, సహకారోద్యమం, సామాజిక సేవ తదితర రంగాల్లో పాటుబడినవారిని, ఆ రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం, వ్యావహారిక అనుభవం ఉన్నవారిని గవర్నర్ కోటాలో నామినేట్ చేయొచ్చు. మేధావులూ, కళాకారులూ, సేవాతత్పరత కలిగినవారూ నేరుగా పోటీచేసి నెగ్గే అవకాశం తక్కువ కాబట్టి శాసనాల రూపకల్పనలో, పాలనలో అటువంటివారి సేవలు పొందాలన్న ఉద్దేశంతో ఈ కోటా ఏర్పాటు చేశారు. ఇలాంటివారితో ఏర్పడే సభ కనుకే పెద్దల సభ అనీ, ఎగువసభ అనీ శాసన మండళ్ళకూ, రాజ్యసభకూ పేరుంది. రాజ్యాంగంలోని 80వ అధికరణం రాజ్యసభకు రాష్ట్రపతి కోటా కింద ఎంపిక చేసే వీలు కల్పిస్తోంది. అయితే దేశ చరిత్రలో కేబినెట్ సిఫార్సు లేకుండా గవర్నర్ తనంత తానే నామినేట్ చేసిన ఏకైక ఉదంతం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 1952లో సీనియర్ నాయకుడు చక్రవర్తి రాజగోపాలాచారిని నాటి గవర్నర్ శ్రీ ప్రకాశ ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. అప్పటి ఎన్నికల్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని కూటమి అధిక స్థానాలు గెల్చుకోవటం, కాంగ్రెస్ మైనారిటీలో పడటంతో నాటి ప్రధాని నెహ్రూ మంత్రాంగం నడిపి అనారోగ్యంతో ఉన్న రాజగోపాలాచారిని సీఎంగా రప్పించారు. అటుపై ఉప ఎన్నిక ద్వారా ఎమ్మెల్యే కావాలని ఆదేశించినా రాజగోపాలాచారి తిరస్కరించటంతో నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారంటారు. బల నిరూపణ సమయానికి రాజగోపాలాచారి ఫిరాయింపుల్ని ప్రోత్సహించి పదవి నిలబెట్టుకున్నారు. శ్రీ ప్రకాశ తీరును మాత్రం ఇప్పటికీ ‘రాజ్యాంగ అనౌచిత్యం’గా రాజ్యాంగ నిపుణులు అభివర్ణిస్తారు.దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులైన మేధావులూ, కళాకారులూ, సాహితీవేత్తలూ లేకపోలేదు. అయితే ఆ యా రంగాల్లో ఎన్నదగిన వైశిష్ట్యం ఉన్నా, రాజకీయ అనుకూలతలు తోడైనప్పుడే వారికి పదవులు దక్కుతున్నాయి. పదవులిస్తామన్నా వద్దని తిరస్కరించినవారూ లేకపోలేదు. కర్ణాటక సీఎంగా దేవరాజ్ అర్స్ ఉన్నప్పుడు సీనియర్ పాత్రికేయుడు టీఎస్ రామచంద్రరావుకూ, రామకృష్ణ హెగ్డే సీఎంగా ఉన్నప్పుడు సాహితీవేత్త దేవనూర్ మహదేవకూ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అవకాశమిస్తామని చెప్పినా వారు తిరస్కరించారు. నిరుడు అక్టోబర్‌లో మహారాష్ట్రలో గవర్నర్ కోటా కింద 12 మందిని ఎంపిక చేసినప్పుడు కూడా వివాదం రాజుకుంది. వారిలో కొందరు రాజ్యాంగం నిర్దేశిస్తున్న నిబంధనలకు తగినవారే అయినా, కొందరు పూర్తిగా రాజకీయ ప్రాపకంతోనే ఎంపికయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. ఎటూ వచ్చే నెల 17న సర్వోన్నత న్యాయస్థానం తాజా వివాదంలో తదుపరి విచారణ కొనసాగిస్తుంది. దీనిలో వెలువడే తుది తీర్పు ప్రభుత్వాలకు మార్గదర్శకం కాగలిగితే మంచిదే! -
మునీర్ మూర్ఖత్వం!
ఉగ్రవాదాన్ని దశాబ్దాలుగా ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పాలకులకూ, సైన్యానికీ ఆత్మాహుతి భాష నిండా ఒంటబట్టినట్టుంది. మున్ముందు భారత్ దాడికి దిగితే అణ్వస్త్రాలు ప్రయోగించి సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని పాకిస్తాన్ సైనిక చీఫ్ మునీర్ బెదిరించటాన్ని గమనిస్తే ఆ దేశంలో మూర్ఖత్వం ఎంతగా ముదిరిందో అర్థమవుతుంది. పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడిన నాటినుంచీ సక్రమంగా మాట్లాడటం, సవ్యంగా మసులుకోవటం దానికి చేతకావటం లేదు. అమెరికా, పాశ్చాత్య దేశాలు దాన్ని తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రోత్సహిస్తూనే వచ్చాయి. అమెరికా ఈ విషయంలో ఒకడుగు ముందుంది. ఎదురుతిరిగిన పాలకుల్ని సైనిక కుట్రలో కూలదోయటం, కీలుబొమ్మను ప్రతిష్ఠించటం దానికి అలవాటైన విద్య. అమెరికా సాగు, పాడి రంగ ఉత్పత్తుల్ని భారత్‌లో అనుమతించాలన్న డిమాండ్‌ను మన ప్రభుత్వం అంగీకరించనందుకు ఆగ్రహంతో రగిలిపోతున్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే మన సరుకులపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆసిఫ్ మునీర్ అధిక ప్రసంగం కూడా ఆయనగారి పథక రచనే కావొచ్చన్న సంశయాలు తలెత్తుతున్నాయి. మొన్న జూన్‌లో మునీర్‌ను పిలిపించుకుని అయిదు రోజులపాటు ఇంటల్లుడి మర్యాదలు చేసిన వైనం మరవకముందే మరోసారి ఆయన అక్కడికి వెళ్లి వాలాడంటే దాన్ని సాధారణ విషయంగా తీసుకోకూడదు. తొలి పర్యటనలో ప్రోటోకాల్స్ పక్కనబెట్టి మునీర్‌కు దేశాధినేతలకిచ్చే స్థాయి ఘనమైన విందునిచ్చి, ముడి చమురు సహా పాకిస్తాన్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నామని ట్రంప్ ప్రకటించిన తీరు చూసి ప్రపంచం విస్మయపడింది. పాకిస్తాన్లో చచ్చో పుచ్చో... ఎన్నికైన ప్రభుత్వం అంటూ ఒకటుంది. అమెరికాతో సహా ఏ దేశంలోనైనా సైన్యం పని ప్రభుత్వాదేశాలు పాటించటం మాత్రమే. కానీ తోకే కుక్కను ఆడిస్తున్న చందంగా పాక్ పోకడ ఉంది. సైన్యం ఏం చేసినా అక్కడి పాలకులు కిక్కురుమనరు. అందువల్లే మునీర్ ట్రంప్‌తో సహకార ఒప్పందాలు కుదుర్చుకోగలిగాడు. ఈ విషయంలో ట్రంప్‌ను తప్పుబట్టాలి. తమ సైనిక దళాల చీఫ్ జనరల్ రాండీ ఏ. జార్జి ఏ దేశమైనా పోయి ఒప్పందాలు కుదుర్చుకొని వస్తే ఆయన శిరసావహిస్తారా? ఈసారి మునీర్ నాలుగు రోజులు అక్కడ తిష్ఠ వేశారు. నెల రోజుల్లోనే ఎందుకెళ్లాడో, ఆయన చేస్తున్న రాచకార్యమేమిటో తెలియదు. అటు అమెరికా ప్రభుత్వమూ బయటపెట్టదు. కానీ అమెరికాకు సంబంధించిన రాజకీయ నాయకులతోనూ, సైనిక నాయకత్వంతోనూ ఆయన భేటీలు జరిపాడు. అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైకేల్ ఈ.కురిలా రిటైర్మెంట్ సభలో పాల్గొనడానికి అక్కడికెళ్లినట్టు మీడియా కథనం. పాకిస్తాన్ సంతతి ప్రజలతోనూ సమావేశమయ్యారు. మునీర్ బెదిరింపులుగా ఇప్పుడు ప్రచారంలో ఉన్నవన్నీ ఆ సమావేశంలో మాట్లాడినవేనని చెబుతున్నారు. అధికారికంగా అయితే మునీర్ లేదా పాకిస్తాన్ సైన్యం ఈ మాటల్ని ధ్రువీకరించటానికి సిద్ధపడటం లేదు. అణ్వస్త్ర దేశమని మిడిసిపడితే ఎవరు వూరకున్నా ఇరుగు పొరుగు దేశాలు మౌనంగా ఉండవు. మన విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పినట్టు ఈమాదిరి బాధ్యతా రాహిత్యాన్నీ, బ్లాక్మెయిలింగ్నూ మన దేశమైతే సహించదు. మునీర్ మాటల్ని భారత్ వక్రీకరిస్తోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అనటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనేమీ కోడ్ భాషలో మాట్లాడలేదు. ఆ ప్రసంగానికి సంబంధించిన కథనాన్ని బయటపెట్టింది కూడా అమెరికా మీడియానే. పైగా పాకిస్తాన్ ఏలికలు ఇలా మాట్లాడటం మొదటిసారేమీ కాదు. ఇక వక్రీకరణకు చోటెక్కడ?! ఏదో ఉన్మాదంలో నోరు జారివుంటే ఆ మాట చెప్పి తప్పయిందని ఒప్పుకోవాలి. విషయం బయటికొచ్చాక వణుకుడు దేనికి? ఉగ్రవాద మూకల్ని పంపి కల్లోలం సృష్టిస్తే, అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తామని బెదిరిస్తే భారత్ హడలెత్తుతుందని పెహల్గాం అనంతర పరిణామాల తర్వాత కూడా పాకిస్తాన్ భ్రమల్లో ఉందంటే దాన్ని ఎవరూ రక్షించలేరు. అమెరికా సంపన్న రాజ్యమే కావొచ్చుగానీ మంచీ మర్యాదా పాటించటం నేర్చుకోవాలి. కొత్తగా వచ్చిన భుజకీర్తుల మత్తుతో అమెరికాలో వాలిన మరో దేశ సైనిక దళాల చీఫ్ మిత్రదేశంతోపాటు ప్రపంచాన్నే బెదిరిస్తున్న వైనం కనబడుతున్నా గుడ్లప్పగించి చూడటం సబబేనా? చీవాట్లు పెట్టి పంపాల్సిన బాధ్యత లేదా? ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో ఈ మాదిరి వైఖరే ప్రదర్శించి అమెరికా భారత్‌కు దూరమైంది. ఆర్థిక సంస్కరణల అనంతరం క్రమేపీ చక్కబడుతూ వచ్చిన ద్వైపాక్షిక సంబంధాలు ఇలాంటి వింత చేష్టలతో ఛిద్రం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ట్రంప్‌దే! మునీర్ లాంటివాళ్లు ఇష్టానుసారం చెలరేగటాన్ని నిలువరించకపోతే తమకూ నష్టమేనని ఆయన గ్రహించాలి. -
చట్టసభలే సరైన వేదికలు
మన చట్టసభల వల్ల ప్రజలకూ, ప్రజాస్వామ్యానికీ ఏ మేరకు ప్రయోజనం కలుగుతోందన్న అంశంలో ఎవరి అభిప్రాయాలు వారికున్నా... అక్కడి చర్చల సరళి ఇంకా మెరుగుపడాలని, ప్రభుత్వ జవాబుదారీతనం మరింత పెరగాలన్న విషయంలో అందరూ ఏకీభవిస్తారు. గత నెలాఖరున మూడు రోజులపాటు ‘ఆపరేషన్ సిందూర్’పై విస్తృత చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలోనూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలోనూ సమాధానమిచ్చారు. కానీ భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ శనివారం చేసిన ప్రసంగంలోనూ, అంతక్రితం ఈ నెల 4న సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది మద్రాస్ ఐఐటీలో చేసిన ఉపన్యాసంలోనూ కనబడిన స్పష్టత, వివరాలు చర్చ సందర్భంగా ప్రధాని, కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటనల్లో లేవు. ఇరు దేశాల మధ్యా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం వెనక ఏ ప్రపంచ నాయకుల ఒత్తిళ్లూ లేవని ఇద్దరూ నిర్ద్వంద్వంగా చెప్పటం హర్షించదగ్గదే అయినా, ఆ ఆపరేషన్‌లో మనం సాధించిన విజయాలనూ, ఆ క్రమంలో ఎదురైన సవాళ్లనూ వివరించకపోవటం, అసలు పెహల్గాం భద్రతా లోపాలూ, వాటిపై చర్యలూ వెల్లడించకపోవటం లోటే అనిపిస్తుంది. అనర్గళంగా మాట్లాడగలిగే శక్తివున్నవారెవరో, అవతలి పక్షాన్ని వ్యంగ్యంతో, వెటకారంతో గేలిచేసి చిన్నబుచ్చగలవారెవరో తెలుసుకోవటానికి ప్రజలు చట్టసభల ప్రత్యక్ష ప్రసారాలు చూడరు. వాస్తవాలు తెలుసుకోవా లనుకుంటారు. విపక్షాల సందేహాలకు ప్రభుత్వం సూటిగా, స్పష్టంగా జవాబిచ్చిందా లేదా అనేది గమనిస్తారు. కానీ పార్లమెంటులో జరిగింది వేరు. ఎప్పటిలా పరస్పరం నిందారోపణలు చేసుకోవటంతోనే చాలా సమయం గడిచింది. ‘సిందూర్’లో జరిగిందేమిటో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ చెప్పారు. పాకిస్తాన్‌కు చెందిన అయిదు యుద్ధ విమానాలను కూల్చటంతోపాటు మరో భారీ విమానాన్ని సైతం పడగొట్టామని, దాదాపు 90 గంటల వ్యవధిలో అనుకున్న లక్ష్యాలను సాధించామని ఆయన వివరించారు. మన గగనతల రక్షణ వ్యవస్థ, డ్రోన్ వ్యవస్థ సక్రమంగా పనిచేయటంతో పాక్ సైన్యం పాచికలేమీ పారలేదని, వారి ఎఫ్–16లూ, డ్రోన్లూ, క్షిపణులనూ కూల్చేయటంతోపాటు రెండు కమాండ్ కంట్రోల్ కేంద్రాలనూ, ఒక వైమానిక స్థావరాన్నీ ధ్వంసం చేశామని ప్రకటించారు. జనరల్ ద్వివేది అయితే ప్రభుత్వం రాజకీయ స్పష్టతతో దిశానిర్దేశం చేయటం, విశ్వాసాన్నీయటం, నిర్ణయాన్ని తమకే వదిలేయటం తొలిసారి చూశామని చెప్పారు. ఇటువంటి ప్రకటనలు పార్లమెంటు వేదికపై ప్రభుత్వం వైపుగా వస్తే, వాటిపై విపక్షం ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు వెల్లడయ్యేవి. ముఖ్యంగా జనరల్ ద్వివేది ప్రసంగం వాస్తవ స్థితేమిటో చెప్పింది. శత్రువుతో ఇప్పుడు నాలుగు రోజుల్లోనే ఘర్షణలు సమసినా... త్వరలోనే మరో యుద్ధం జరిగినా ఆశ్చర్యం లేదని, ఈసారి ఒంటరిగా వస్తారా, వేరే దేశాలతో కలిసి వస్తారా అన్నది కూడా చెప్పలేమని ఆయన అనటం గమనించదగ్గది. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్జీత్, జనరల్ ఉపేంద్ర ద్వివేది కూడా ‘ఆపరేషన్ సిందూర్’ దేశాన్ని ఏకం చేయటం గురించి ప్రస్తావించారు. దేశ ప్రజానీకమంతా ఒక్కటై నిలబడటం సాధారణ విషయం కాదు. ఇందులో విపక్షాల పాత్రను కొట్టిపారేయలేం. పెహల్గాంలో భద్రతా లోపాలపై తీసుకున్న చర్యలేమిటో చెప్పకపోవటం, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్–పాక్ ఘర్షణలు ఆగటం తన ఘనతేనని ప్రకటించటం విపక్షాలకు అభ్యంతరకరం అయింది. ట్రంప్ మధ్యలో స్వరం మార్చినా తిరిగి దాన్నే పదే పదే చెబుతున్నారు. అందువల్ల పార్లమెంటు వేదికగా దేశానికి మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి జరిగిందేమిటో చెప్పాల్సిన బాధ్యత పాలకులపై పడింది. ప్రశ్నిస్తున్న విపక్షాలు పాకిస్తాన్‌తో కుమ్మక్కయ్యాయని ప్రత్యారోపణ చేయటం ఇందుకు ప్రత్యామ్నాయం కాదు. యుద్ధ రంగంలో వ్యూహాలూ, ఎత్తుగడలూ ఎలావుండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికి వదిలిపెట్టినా, ఆ క్రమంలో ఏర్పడ్డ సమస్యలను తెలుసుకుని అవసరమైన సూచనలీయటం, జరిగిందేమిటో ప్రజలకు తేటతెల్లం చేయటం దేశ రాజకీయ నాయకత్వం బాధ్యత. మన రక్షణ దళాల చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్‌లో జూన్ నెలాఖరున మాట్లాడుతూ మన దళాలు చేసిన కొన్ని ‘వ్యూహాత్మక తప్పిదాల’ కారణంగా జెట్ విమానాలు కోల్పోయామని చెప్పటం వివాదాస్పదమైంది. పార్లమెంటులో దానిపై ప్రభుత్వం వైపునుంచి ఎలాంటి వివరణా లేదు. ఇప్పుడు దళాధిపతుల ప్రసంగాల్లోనూ ఆ వివరాల్లేవు. ఈ విషయమై సందేహాలు పోగొట్టడానికి పార్లమెంటే సరైన వేదిక. దాన్నుంచి వెలువడే సందేశం దేశ ప్రజానీకాన్ని ఒక్కటి చేస్తుంది. ఆ సంగతిని అధికార పక్షంతోపాటు విపక్షం కూడా మరువరాదు. -
విచక్షణ మరిచిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తన మాట వినని దేశాలపై తోచిన మోతాదులో సుంకాలు వేయటం నిత్యకృత్యమైంది. ఈ క్రమంలో న్యాయం, ధర్మం, విచక్షణ, హేతుబద్ధత వగైరాలు లేవు. రెండోసారి దేశాధ్యక్షుడైనా తమ దేశం ఎవరెవరితో ఏ స్థాయి వాణిజ్యం నెరపుతున్నదో తెలియని ట్రంప్... వేరే దేశాలు ఎవరితో ఎలాంటి సంబంధాలు నెలకొల్పుకోవాలో, వద్దో నిర్ణయించటానికి తగుదునమ్మా అంటూ తయారయ్యారు. ఈనెల 1 నుంచి మన దేశంపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు లోగడ ప్రకటించిన ట్రంప్, వారం తిరగకుండానే మరో 25 శాతం మేర సుంకాలుంటాయని తాజాగా నిర్ణయించారు. ఇవిగాక పరోక్ష సుంకాలు మొదలవు తాయట. ఇవన్నీ 250 శాతం దాటినా దాటొచ్చని లోగడే ఆయన సెలవిచ్చారు. తన మాట నెగ్గటానికి కనిపించిందల్లా విసిరికొట్టే అల్లరిపిల్లల మొండిధోరణికీ, ట్రంప్ చేష్టలకూ తేడా ఉందా? తనకు రష్యా నచ్చలేదు గనుక ఆ దేశం నుంచి ముడి చమురు కొనరాదని ఆయన శాసిస్తున్నారు. ఉక్రెయిన్‌తో జగడం ఆపేయాలని పదే పదే కోరుతున్నా వినని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అక్కసుతో ఇవన్నీ చేస్తున్నట్టు అందరికీ కనబడుతోంది. కానీ అసలు కారణాలు వేరు. నిజానికి రష్యా చమురు కొని ప్రపంచమార్కెట్లు స్థిరంగా ఉండేలా చూడమని గతంలో చెప్పింది అమెరికాయే!ప్రేమాభిమానాలను అపాత్రదానం చేయకూడదు. ట్రంప్ వ్యవహారశైలి చూచాయగా తెలుస్తున్నా, తొలి దఫాలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారు. దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలకు సానుకూలత అవసరమే. కానీ దానికి కూడా అవధులుంటాయి. 2019 సెప్టెంబర్‌లో అమెరికాలోని టెక్సాస్‌లో ‘హౌడీ మోదీ’ కార్యక్రమమైనా,ఆ మరుసటేడాది ట్రంప్ భారత్ సందర్శించినప్పుడు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ‘నమస్తే ట్రంప్’ అయినా దౌత్య పరిమితులు దాటాయన్న విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం సంగతి సరే... పౌరులు కూడా ఆ మాదిరే ఉన్నారు. అమెరికాలోని కొందరు ఎన్నారైలు ఆయన దేశాధ్యక్షుడు కావాలని యజ్ఞయాగాదులు చేశారు. అంతేకాదు... ప్యూ రీసెర్చ్ సంస్థ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ప్రపంచ వ్యవహారాల్లో ట్రంప్ వ్యవహారశైలిపై 24 దేశాల్లో 28,333 మందిని సర్వే చేస్తే సగం మంది భారతీయులు ఆయనపై విశ్వాసం వ్యక్తపరిచారట. ఆ సంగతి అప్పట్లో ఆ సంస్థ ప్రకటించింది. టర్కీ, జర్మనీ, మెక్సికో లాంటి దేశాల్లో మాత్రం అత్యధికులు (80 శాతం పైగా) ట్రంప్‌పై నమ్మకం లేదని తెలిపారు. ఈ ఫలితాల్లో మనం హంగేరి, ఇజ్రాయెల్, నైజీరియా, కెన్యాల సరసన చేరాం.అయితే ట్రంప్ వికృత విన్యాసాలు గమనించాక మోదీ ఆయన విషయంలో దృఢవైఖరి ప్రదర్శిస్తున్నారు. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి అన్నదాతల, మత్స్యకారుల ప్రయోజనాలను విస్మరించే ప్రశ్నే లేదని గురువారం ఆయన మరోసారి కుండబద్దలు కొట్టారు. ఇందుకు వ్యక్తిగతంగా మూల్యం చెల్లించాల్సి వచ్చినా సిద్ధమేనన్నారు. మోదీ, ట్రంప్‌ల మైత్రి గురించి ఉన్న అభిప్రాయంతో సుంకాల ఒప్పందంలో అమెరికాదే పైచేయి అవుతుందనుకున్న మన విపక్షాలకు ఇది నిరాశ కలిగించే పరిణామమే. దేశంలో 70 కోట్లమంది ప్రజానీకం ఆధారపడి బతికే రంగాలను విదేశాలకు గంపగుత్తగా అప్పగించే దుస్సాహసం ఎవరైనా చేయగలుగుతారా? పైగా అవి జన్యుమార్పిడి చేసినవి. ఆ చెత్త మన మార్కెట్లను ముంచెత్తితే కలిగే దుష్పరిణామాల గురించి చాన్నాళ్లుగా పర్యావరణవాదులు చెబుతూ వచ్చారు. తమ సాగు, పాడి ఉత్పత్తులపై అసలు సుంకాలే విధించరాదన్నది ట్రంప్ ఆంతర్యం. ఆశపడటం సహజం... కానీ అది దురాశగా మార రాదని ఆయన గారికి చెప్పేదెవరు? ‘జీరో’ సుంకాల సంగతి బహిరంగంగా చెబితే నలుగురూ నోళ్లు నొక్కుకుంటారని ట్రంప్ భయపడి రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపుతూ, రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు ఆపాలన్న రాగం అందుకున్నారు. ఏ సరుకు ధరైనా మార్కెట్ శక్తులు నిర్ణయించే వర్తమానంలో రష్యా నుంచి చవగ్గా కొనరాదని, దాన్ని హెచ్చు ధరకు అమ్మ రాదని ఆంక్షలు విధించాలని చూడటం ట్రంప్ తెలివితక్కువతనం. అమెరికా ఇన్నాళ్లూ ప్రవచించిన ప్రపంచీకరణకు వ్యతిరేకం. పైగా చైనాతో పోలిస్తే మన ముడిచమురు కొనుగోళ్లు తక్కువ. అయినా ఆ దేశంపై ట్రంప్ సానుకూలంగా ఉన్నారు.ట్రంప్ పాత, కొత్త సుంకాలు అమలైతే భారత్ జీడీపీపై 0.6 శాతం ప్రభావం పడుతుందని ప్రముఖ మదుపు సంస్థ గోల్డ్‌మాన్ శాక్స్ ప్రకటించింది. ఇదిగాక వాణిజ్య అనిశ్చితి వల్ల పరోక్ష ప్రభావం ఉండొచ్చని ఆ సంస్థ చెబుతోంది. మొత్తానికి ట్రంప్ ఇదే మంకుపట్టుతో ఉంటే మనకు ఏదోమేర సమస్యలుండక తప్పదు. ఈ వైరం మనం కోరుకున్నది కాదు. అయినా వచ్చి పడింది. కనుక కలిసికట్టుగా ఉండి ఎదుర్కొనటమే ఏకైక మార్గం. -
జలప్రళయం
ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, ఎంతగా ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నా బేఖాతరు చేస్తున్న మనిషిపై ప్రకృతి మరోసారి తన విశ్వరూపాన్ని చూపింది. దేవభూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్‌లోని ధరాలీ గ్రామంపై మంగళవారం ఉవ్వెత్తున విరుచుకుపడిన వరద అక్కడి ఇళ్లూ, హోటళ్లూ, రెస్టారెంట్లూ, దుకాణాలూ వగైరాలను ఊడ్చిపెట్టేయగా దాదాపు వందమంది ఆచూకీ తెలియటం లేదని వార్తలొస్తున్నాయి. హార్సిల్ ప్రాంతంలో ఉన్న సైనిక శిబిరం కొట్టుకుపోగా అందులోని పదిమంది జవాన్ల ఆచూకీ తెలియటం లేదు. కుంభవృష్టితో ఖీర్గంగా నది పోటెత్తి ఇంత విలయానికి దారితీసింది. ఆకస్మిక వరదకు అరగంట ముందే ధరాలీ మార్కెట్ ప్రాంతానికి విరిగిపడ్డ కొండచరియలు, బురద కొట్టుకొచ్చాయనీ, అంతలోనే భారీయెత్తున వరదనీరు విరుచుకుపడిందనీ స్థానికుల కథనం. ఆత్మరక్షణ కోసం సమీపంలోని కొండపైకి ఎక్కినవారికి ఖీర్‌గంగ పెనుగర్జన వినబడిందంటే ఉద్ధృతి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. కేవలం 15 సెకన్ల వ్యవధిలోనే ఈ జలప్రళయం విరుచుకుపడింది. ప్రకృతి విలయం సంభవించినప్పుడల్లా ఎన్నో విషాద ఘట్టాలు ఆవిష్కృతమవుతాయి. ఇకపై అత్యంత జాగ్రత్తగా మెలగాలన్న సంకల్పమూ వినబడుతుంది. నెలలు కాదు... రోజులు గడిచేసరికే అదంతా మరుగునపడుతుంది. పర్యావరణాన్ని బేఖాతరు చేస్తూ నిర్మాణాలు మొదలవుతాయి. నదుల్ని దేవతలుగా కొలిచే సంప్రదాయం మనది. అయినా వాటికి అవరోధం కలిగించే నిర్మాణాలైనా, వాటిని కాలుష్యంలో ముంచే కర్మాగారాలనైనా అనుమతించరాదన్న గ్రహింపు పాలకులకు లేదు. గంగానదిని మాఫియాల బారి నుంచి కాపాడాలంటూ 2011లో ఉపవాసదీక్షకు పూనుకున్న స్వామి నిగమానంద ప్రాణత్యాగం చేసినా పాలకుల వైఖరిలో మార్పు లేదు. ఉత్తరాఖండ్‌కు విపత్తులు కొత్తగాదు. దశాబ్దాలుగా ఇంచుమించు ఏటా రివాజుగా వరదలొస్తాయి. గ్రామాలకు గ్రామాలు వరదనీటిలో చిక్కుకుంటాయి. కొన్నిసార్లు పెద్దగా సమస్యలేమీ లేకుండా ముగుస్తుంది. 2013లో సంభవించిన విలయం ఏకంగా 6,000 మందిని బలి తీసుకుంది. అంతకు ముందూ తర్వాతా కూడా పదుల నుంచి వందలమంది వరకూ మృత్యువాత పడిన సందర్భాలున్నాయి. అభివృద్ధి ముసుగులో ప్రకృతినీ, పచ్చటి ప్రాంతాలనూ ధ్వంసం చేయటం... వేర్వేరు ప్రాజెక్టులకు ఎడాపెడా అనుమతులీయటం మన దేశంలో పాలకులకు అలవాటైన జాడ్యం. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో వరదలొచ్చిన ప్రాంతం భాగీరథి పర్యావరణ జోన్ పరిధిలో ఉంది. దాన్ని అత్యంత జాగ్రత్తగా పరిరక్షించాల్సిన ప్రాంతంగా గుర్తించారు. 4,157 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఆ జోన్‌ను 2012లో నోటిఫైడ్ ప్రాంతంగా పరిగణించారు. అక్కడ జరిగే విచక్షణారహిత అభివృద్ధిని నియంత్రించటానికి ఉద్దేశించిన ఈ చర్య ఆచరణలో ఎందుకూ కొరగాకుండా పోయింది. నదులూ, ఉపనదుల సమీపంలో నిర్మాణాలు ఉండరాదన్న ఇంగితజ్ఞానం ఎవరికీ లేదు. ప్రతిష్ఠాత్మకమైన చార్ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టు సైతం ఆ ప్రాంతంలోనే ఉంది. పర్యావరణ ఉద్యమకారులు న్యాయ స్థానాల్లోనూ, వెలుపలా పోరాడినా... చివరకు ప్రభుత్వానిదే పైచేయి అయింది. ఏడాదిక్రితం 34వ జాతీయరహదారిపై హినా–టెక్లాల మధ్య నిర్మించతలపెట్టిన బైపాస్ రోడ్డు గురించి కూడా ఆందోళనలు జరిగాయి. ఆ ప్రాంతం ధరాలీకి దక్షిణంగా ఉంది.ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అమరికలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ధ్రువ ప్రాంతాల్లో, హిమపర్వతశ్రేణిలో మాత్రమే కుంభవృష్టి, ఆకస్మిక వరదలు ఉండేవి. అలాంటి రాతినేలలకు వరద నీటిని పట్టివుంచే గుణం తక్కువ. నిమిషాల వ్యవధిలో వరదలు పోటెత్తుతాయి. కొండచరియలు విరిగిపడి ముప్పును మరిన్నిరెట్లు పెంచుతాయి. పర్యావరణంలో వచ్చిన మార్పుల పర్యవసానంగా ప్రకృతి వైపరీత్యాలకు ఏ ప్రాంతమూ అతీతం కాని స్థితి వచ్చేసింది. వాతావరణాన్ని కొలవటానికి ఉపయోగించే నమూనాలు, ఉపకరణాలు ఒక్కోసారి విఫలం కావటానికి మారిన స్థితిగతులే కారణం. వేడిగాలులు ఎక్కువ తేమను పట్టి ఉంచుతాయి. ఒక డిగ్రీ ఉష్ణోగ్రత హెచ్చితే తేమ ఏడు శాతం పెరుగుతుందనీ, దీనికి అధికశక్తి ఉంటుందనీ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. వాతావరణంలో తేమ పెరిగినకొద్దీ వేడిగాలుల వల్ల ఆకస్మిక కుంభవృష్టికి అనువైన పరిస్థితులేర్పడతాయి. అందుకే ఉత్తరాఖండ్ వంటిచోట్ల మాత్రమే కాదు... అన్నిచోట్లా పర్యావరణాన్ని ప్రాణప్రదంగా చూసుకుంటూ దానికి విఘాతం కలగనీయని రీతిలో ఆచరణ ఉండాలి. కానీ పట్టించుకునేదెవరు? అందుకే ప్రభుత్వాల అభివృద్ధి నమూనాలు మారాలి. పర్యావరణానికి విఘాతం కలిగించే అవకాశమున్నదని భావించే ఎలాంటి ప్రాజెక్టునైనా నిస్సంకోచంగా తిరస్కరించాలి. ఇప్పుడొచ్చిన ఉత్పాతం ఆఖరిది కావాలి. -
ఈ సంక్షోభాన్ని దాటేదెలా?
రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు ఆపాలంటూ వరస బెదిరింపులతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌ను లొంగదీసుకోవాలని చూస్తున్న తరుణంలో మన విదేశాంగ శాఖ తొలిసారి నేరుగా బదులీయటం కీలక పరిణామం. దీనికి రెండురోజుల ముందు స్థానిక తయారీ ఉత్పత్తుల్ని, సరుకుల్ని కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. అమెరికాలో గత కొన్ని దశాబ్దాలుగా అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తూ వచ్చిన అస్తవ్యస్త విధానాల పర్యవసానంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి ట్రంప్ అమలుచేసిన తప్పుడు నిర్ణయాలు తోడై ఆర్థికవ్యవస్థను ఊపిరాడకుండా చేస్తున్నాయి. వాటి నుంచి బయటపడటం కోసం ఆయన ప్రపంచ దేశాలపై ఆర్థిక దండయాత్ర మొదలుపెట్టారు. చైనాపై 145 శాతం సుంకాల మోత మోగించటంతో మొదలుపెట్టి తన సన్నిహిత దేశాలపై సైతం దాదాపు 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించి, అనంతరకాలంలో వెనక్కితగ్గారు. ఈ దశలో ఆయన మన జోలికి రాలేదు. మోదీతో 2016 నుంచీ ఉన్న సాన్నిహిత్యంతో ఆయన తాను చెప్పినట్టు వింటా రని ట్రంప్ భ్రమపడ్డారు. తీరా కథ అడ్డం తిరిగేసరికి ఆగ్రహోదగ్రుడవుతున్నారు. అందుకే కావొచ్చు... జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం, బంగ్లాదేశ్, ఇండొనేసియాలపై 15–20 శాతంమధ్య సుంకాలు విధించిన పెద్ద మనిషి మన దగ్గరకొచ్చేసరికి ఇప్పటికే విధించిన 25 శాతం సుంకాలతోపాటు రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు ఆపకపోతే మరిన్ని రెట్లు పెంచుతానని హెచ్చరించారు. స్వదేశంలో సంపన్నులకూ, పారిశ్రామికవేత్తలకూ లక్షల కోట్ల డాలర్ల పన్ను రాయితీలు ప్రకటించి, ప్రపంచ దేశాలపై అదనపు సుంకాలు విధించటం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవాలన్నది ఆయన పథకం. దీన్ని చూసీచూడనట్టు వూరుకుంటే ఈ బాణీయే కొనసాగిస్తారు. అమెరికా పాటించే ద్వంద్వ ప్రమాణాలు ఎవరికీ తెలియనివి కాదు. కానీ ట్రంప్ మరింత నిస్సిగ్గుగా వాటిని ఆచరిస్తున్నారు. ఒకపక్క తమ అణు పరిశ్రమలకు కావాల్సిన యురేనియం హెక్సాఫ్లోరైడ్ అయినా, విద్యుత్ వాహనాల తయారీలో అవసరమైన ప్లాటినం రకానికి చెందిన రసాయన మూలకం పలాడియం, ఎరువులు, రసాయనాలు వంటివి రష్యా నుంచి ఇప్పటికీ దిగుమతి చేసుకుంటూ... మనం మాత్రం ముడి చమురు కొనకూడదని శాసిస్తున్నారు. అందుకే మోదీ స్వదేశీ ఉత్పత్తుల్నీ, సరుకులనూ కొనటం అత్యవసరమని ప్రజలకు పిలుపునిచ్చారు. వర్తమాన తరుణంలో స్వదేశీ నినాదం సరైనది. అయిదేళ్లక్రితమే మోదీ ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం ఈ విషయంలో పెద్దగా చేసిందేం లేదు. అంతక్రితం ఉన్న యూపీఏ ప్రభుత్వం గురించి చెప్పనవసరం లేదు. గతంలో ప్రణాళికా సంఘం, ఇప్పుడు నీతి ఆయోగ్... అలాగే సాంకేతిక నిపుణుల మాట చెల్లుబాటవుతూ వచ్చింది. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ ఈ విషయంలో ప్రభుత్వాన్ని గతంలో పలుమార్లు తీవ్రంగా తప్పుబట్టింది. కానీ మారిందేమీ లేదు.ట్రంప్ ఒక్కరే కాదు...బ్రిటన్, ఈయూలు సైతం తమ వినియోగవస్తువులపై, యంత్ర పరిక రాలపై సుంకాలు తగ్గించమంటున్నాయి. అందుకు తలొగ్గితే మన సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) దెబ్బతింటాయి. అమెరికా ఒత్తిళ్లకు లొంగితే మన సాగు రంగం, పాడి పరిశ్రమ రంగం ఇబ్బందుల్లో పడతాయి. ఆ రెండు రంగాలపైనా 70 కోట్లమంది ప్రజానీకం ఆధారపడతారు. ఇవిగాక జన్యుమార్పిడి చేసిన మొక్కజొన్న, సోయాబీన్స్ దిగుమతి చేసు కోవాలని అమెరికా కోరుకుంటోంది. ఇది ప్రమాదకరం. వాటి సంగతలావుంచి వర్తమాన అనిశ్చిత వాతావరణంలో మనమే కాదు...దేశాలన్నీ ఆత్మరక్షణ బాటపట్టాయి. తమ దేశానికొచ్చే విదేశీ సరుకుపై అధిక సుంకాలు విధించటం, విదేశాలకు ఎగుమతయ్యే తమ సరుకుకు తక్కువ సుంకాల కోసం ఒత్తిళ్లు తీసుకురావటం రివాజైంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, సెమీకండ క్టర్లు, రక్షణ, సౌరశక్తి రంగాలకు పెద్దయెత్తున ప్రోత్సాహకాలు ఇవ్వాల్సివుంది. పెంచిన సుంకాల పరిధిలో ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు వగైరాలను ట్రంప్ మినహాయించారు. ‘జాతీయ ప్రయోజనాల రీత్యా’ ఈ నిర్ణయం తీసుకున్నారట. కానీ ఆ ఉత్పత్తుల ధరల్ని పెంచటం ద్వారా అదనపు రాబడికి వ్యూహరచన చేస్తే అమెరికా సృష్టించదల్చుకున్న సంక్షోభంనుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే వాటికి మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తేనే ఇదంతా సాధ్యం. ఇప్పటికే స్వావలంబన దిశగా అడుగులేసివుంటే వేరుగా వుండేది. ఇప్పటికిప్పుడు తీసుకునే చర్యల నుంచి వెంటనే ఫలితాన్ని ఆశించలేం. ఈలోగా అమెరికా కోరుతున్నదేమిటో, మన తిరస్కరణకు కారణమేమిటో పార్లమెంటు వేదికగా తేటతెల్లం చేయాలి. అది జరిగితేనే ప్రజలు మరింత దృఢంగా మద్దతిస్తారు. -
యాభై ఏళ్ల షోలే
థియేటర్లోని ప్రేక్షకులు సీటు కిందకు తల ఒంచి అటూ ఇటూ వెతికారు... కాయిన్ ఇక్కడెక్కడైనా పడిందా అని. ‘షోలే’ క్లయిమాక్స్‌లో అమితాబ్ మరణించాక అతని చేతిలోని కాయిన్ చూసి ధర్మేంద్ర షాక్ అవుతాడు. ఆ కాయిన్ కు రెండు వైపులా ‘హెడ్స్’ ఉంటుంది. ఇంతకాలం తన ప్రాణమిత్రుడు దొంగటాస్ వేసి మోసం చేశాడని, ఇవాళ అదే టాస్‌తో తనను కాపాడితాను మరణించాడని గ్రహించి, ఆగ్రహంతో కాయిన్ ని విసిరి కొడతాడు. అది గల్గల్మంటూ థియేటర్లోనే ఎక్కడో పడుతుంది. ఒక క్షణం ప్రేక్షకులు దాని కోసం అటూఇటూ వెతుకుతారు. ఎందుకంటే అందాక వారికలాంటి అనుభూతి తెలియదు. స్టీరియోఫోనిక్ వల్ల వచ్చింది. షోలేను షోలే అభిమానులు స్టీరియోఫోనిక్ థియేటర్ వెతుక్కుంటూ నగరాలకు వెళ్లి చూశారు. 70 ఎం.ఎంలో చూశారు. స్కోప్‌లో చూశారు. 35 ఎం.ఎం.లో చూశారు. చిన్న ఊళ్లలో నిడివి కుదించి జయభాదురి ఫ్లాష్‌బ్యాక్ లేని వెర్షన్ రిలీజ్ చేస్తే అదీ చూశారు. దూరదర్శన్ లో చూశారు. కేబుల్ టీవీలో చూశారు. యూ ట్యూబ్‌లో చూశారు. ఓటిటిలో చూశారు. యాభై ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు. షోలే అభిమానులది వేరే లెవల్.ఆడే సినిమాలు ఆడదగ్గ రీతిలో తీస్తే ఆడతాయి. సెట్స్ వల్ల, విఎఫ్ఎక్స్ వల్ల, భారీ బడ్జట్ వల్ల, ముహూర్తబలం వల్ల ఆడవు. ఆడదగ్గ రీతిలో కథ అనుకుని ఇవన్నీ కలిపితే ఆడొచ్చు. షోలే సినిమా తొలిషాట్ తీయడం కుదరలేదు. వాన. ముహూర్తం అప్సెట్ అయ్యింది. రెండోరోజు తెల్లచీర కట్టుకుని వితంతువు పాత్రలో ఉన్న జయభాదురి అమితాబ్‌కు ఇనప్పెట్టె తాళాలు ఇవ్వడం ఫస్ట్‌షాట్‌గా తీశారు. దక్షిణాది సినీచరిత్రలో నేటి వరకు వితంతువు పాత్రపై ముహూర్తం షాటు తీసిన దాఖలా లేదు. అలా తీస్తే ఫ్లాప్ అవుతుందా? అలా తీయకపోతే హిట్ ఏమైనా అయ్యిందా? తాము చేసే దుర్మార్గాలకు, దోపిడీలకు దైవబలాన్ని తోడు అడగడం కూడా షోలే తీసేసింది. గబ్బర్ సింగ్ ఒక్కనాడు కూడా కాళీమాత విగ్రహం ఎదుట ప్రమాణం చేసి దోపిడీకి బయలుదేరడు. అప్పటి వరకూ హిందీ సినిమాలలోని బందిపోట్లు అందరూ కాళీమాత బలాన్ని తోడు అడిగేవారే.సమాజం చెడ్డను భరించగలదుగానీ మరీ దారుణమైన చెడ్డను సహించలేదు. ఆ చెడ్డను పరిహరించడానికి మెరుగైన చెడ్డనైనా శరణుజొచ్చడానికి వెనుకాడదు. గబ్బర్ సింగ్ అఘాయిత్యాలు పట్టనలవి కానప్పుడు అంత చెడ్డవాణ్ణి నిర్మూలించడానికి కొంచెం చెడ్డవాళ్లను నియమిస్తారు. వీరు, జయ్ చిల్లర దొంగలే గాని వారిలో బహాదూరి ఉంది. మానవత్వం కూడా ఉంది. ఊరు వారిని ఆదరిస్తుంది. వర్తమానంలో కరడుగట్టిన నేరస్తుల శిక్షకు పోలీసులు ఎన్ కౌంటర్ అనే చెడ్డమార్గం ఎంచుకుంటే ప్రజలు ఆదరించడం ఇలాంటిదే కావచ్చు. వ్యక్తిగత ఆగ్రహాన్ని సామాజికస్థాయికి తీసుకెళ్లమని షోలే చెబుతుంది. గబ్బర్ సింగ్ వల్ల ఠాకూర్ తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయాడు. గబ్బర్‌ని శిక్షించడం వ్యక్తిగతమైన కక్షే... కాని అందులో సామాజిక న్యాయం ఉంది. ఇవాళ సగటు మనిషి తన నెత్తిన పన్నులు పడుతున్నా, తన ప్రమేయం లేకుండా కుల, మత, పార్టీల జంజాటంలో పడుతున్నా, తన సంపాదనను స్కూళ్లు, హాస్పిటళ్లు బట్టలిప్పించి దోచుకుంటున్నా, చిల్లర జీతాలతో సంస్థలు గాడిద చాకిరీ చేయిస్తున్నా, న్యాయం కోసం ఏళ్లకేళ్లు అంగలార్చాల్సి వస్తున్నా కిమ్మనడం లేదు... శాపనార్థాలు పెట్టుకోవడం తప్ప. ఎలుక శాపం పిల్లికి తగలదు. ఠాకూర్‌లా కార్యాచరణకు దిగితే, ఒకరొకరుగా కదిలి ఊరు మొత్తం గబ్బర్ అంతు చూసినట్టు సమస్య అంతు చూడొచ్చు. దురదష్టవశాత్తు జనంలో అది పూర్తిగా పోయింది.షోలేలోని మహిళలు ధీర వనితలు. గబ్బర్ను ధిక్కరించే బసంతి గాని, పరిస్థితులకు చలించక స్థైర్యం చూపే ఠాకూర్ కోడలుగాని ‘ఊ అంటావా మావా... ఉఊ అంటావా’ తరహా కాదు. షోలే కథ ‘రేప్’ సీన్ కు చోటివ్వలేదు. నేడులా బడ్జెట్లో సగాన్ని బకెట్ల బకెట్ల బ్లడ్‌కు కేటాయించే పని లేకుండా రక్తమే చూపలేదు. కొండలు, గుట్టలు, పచ్చదనం ఉన్న బెంగళూరు సమీపంలోని రామ్‌నగర్ అనే చోట షూటింగ్ చేయడం తప్ప షోలే చేసిన సర్కస్ ఏదీ లేదు. షోలే మానవ ఉద్వేగాల మేజిక్. కెమెరా, సంగీతం, మాట, పాత్ర, దర్శకత్వం... వీటిని ఎంత మేలిమి నైపుణ్యంతో వాడి ఈ మేజిక్ చేయవచ్చో చరిత్ర చెప్పుకునేలా చూపింది. 1975 ఆగస్టు 15న షోలే విడుదలైంది. ఈ ఆగస్టు 15కు యాభై ఏళ్లు. ఇప్పటికే దేశంలో చర్చలు, కార్యక్రమాలు, జ్ఞాపకాల రీవిజిట్లు సాగుతున్నాయి. తెలుగు అభిమానులు ఎలాగూ ఉత్సవాలు జరుపుతారు. మన పరిశ్రమ... ముఖ్యంగా సినీ రచయితలు, దర్శకులు షోలేకు ఎటువంటి స్మరణ, సత్కారం చేస్తారో చూడాలి. -
సుంకాలు... శాపనార్థాలు!
రాక తప్పదనుకుంటున్న ముప్పు ముంగిట్లోకొచ్చింది. అమెరికా అధ్యక్షపీఠం అధిష్ఠించింది మొదలు నిలకడలేనితనంతో, పొంతనలేని వ్యాఖ్యలతో మిత్రుల్ని, వ్యతిరేకుల్ని కూడా సమానంగా ఇరకాటంలో పడేస్తున్న డోనాల్డ్ ట్రంప్... గతంలో హెచ్చరించినట్టే సుంకాల మోత మోగించారు. శుక్రవారం నుంచి భారత్ నుంచి వచ్చే సరుకులపై 25 శాతం సుంకాలు విధిస్తామని, ఇవిగాక రష్యా నుంచి ముడిచమురు, రక్షణ సామగ్రి కొంటున్నందుకు అదనంగా జరి మానా ఉంటుందని ప్రకటించారు. అది ఎంత శాతమో చెప్పకపోయినా రష్యాతో వాణిజ్యం సాగించే భారత్, చైనాలపై 500 శాతం వరకూ అదనపు సుంకాలుంటాయని ఆయన లోగడ ప్రకటించారు. కనుక ఈ సుంకాల కన్నా జరిమానా వాటాయే ఎక్కువుంటుందని అంచనా వేయొచ్చు. తన ఆదేశాలను ఔదలదాల్చనందుకు మన ఆర్థిక వ్యవస్థను ‘మృత ఆర్థిక వ్యవస్థ’గా దూషించారు. అనాల్సిన వన్నీ అన్నాక ‘ఇంకా భారత్‌తో చర్చలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం’ అని ముక్తాయించారు. ఆయన హుకుం అమలైతే వస్త్రాలు, రొయ్యలు, ఆభర ణాలు, వజ్రాలు, తోలు ఉత్పత్తులు వగైరాలపై తీవ్ర ప్రభావం పడుతుందనీ, ఆ రంగాల్లో ఉపాధి దెబ్బతింటుందనీ నిపుణుల అంచనా. ఈ రంగాల్లో 8,700 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులుంటున్నాయి. ఈ ఏడాది జీడీపీ 6.5 శాతానికి మించి వుండొచ్చని అంచనాలున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అది బాగా తగ్గవచ్చంటున్నారు. ట్రంప్‌కు దౌత్య మర్యాదల సంగతి అటుంచి వ్యక్తిగా ఎలా మెలగాలో కూడా తెలియదు. బహిరంగ బెదిరింపులకు దిగటం, అన్యాయమని అందరికీ తెలిసేలా ప్రవర్తించటం ఆయన నైజం. బ్రెజిల్ సంగతే తీసుకుంటే అక్కడ ఆ మధ్య అధికారం కోల్పోయిన బోల్సొనారో ఆయ నకు ఇష్టుడు. కనుక అతనిపైవున్న నేరారోపణలు ఉపసంహరించి వదిలేయమని తాఖీదు పంపారు. అంగీకరించనందుకు అదనపు సుంకాలు విధించారు. దేశాలకు సార్వభౌమత్వం ఉంటుందనీ, దానికి లోబడి సంబంధాలు నెరపాలనీ ఆయన భావించరు. వాణిజ్య ఒప్పందాలు సాకారం కావాలంటే వాటిని కుదుర్చుకోదల్చుకున్న రెండు పక్షాలకూ పరస్పర విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఓపిగ్గా చర్చించాలి. బ్రిటన్‌తో మనకు ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే ఇందుకు ఉదాహరణ. దాదాపు మూడేళ్లపాటు ఆ ఒప్పందంపై చర్చలు సాగాయి. ఒప్పందం అన్నాక ఇచ్చిపుచ్చుకోవడాలుంటాయి. ‘మేం పుచ్చుకుంటాం... ఇవ్వం’ అంటున్నారు. ‘మాతో ఒప్పందానికి భారత్ సుముఖంగా వుంది... ఇక సంతకాలే తరువాయి’ అంటూ చాన్నాళ్ల క్రితమే మన ప్రభుత్వం తరఫున తానే ప్రకటించారు. ట్రంప్ ఆగ్రహావేశాలకు వేరే కారణాలున్నాయి. మన సాగు, పాడి రంగాలను పరిరక్షించేందుకు అమెరికా నుంచి వచ్చే ఆ ఉత్పత్తులపై మన దేశం అధిక సుంకాలు విధిస్తోంది. ఇందులో సహేతుకత ఉంది. అమెరికాలో ఆ రంగాలకు భారీ సబ్సిడీలుంటాయి. దాంతో తమ ఉత్పత్తుల్ని వేరే దేశాల్లో కారుచౌకగా అమ్ముకోవటానికి వీలుంటుంది. అమెరికాతో పోలిస్తే మన సబ్సిడీలు చాలా తక్కువ. అవి రైతులకు లాభదాయకం కాకపోగా, ఆ రెండు రంగాల్లోనూ వ్యయం విపరీ తంగా పెరిగింది. రైతులు అధిక వడ్డీకి బయట అప్పులు చే యాల్సి వస్తోంది. తీరా గిట్టుబాటు ధర లభించక, అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ట్రంప్ ఒత్తిడి చేస్తున్నట్టు అధిక సుంకాలు తొలగిస్తే ఈ సంక్షోభం మరింత పెరుగుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆసరాగా ఉన్న ఆ రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నిజానికి ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో చేరినప్పుడే మన పాలకులు నిక్కచ్చిగా ఉండాల్సింది. కానీ దాటవేత ధోరణి ప్రదర్శించారు. రష్యాతో వాణిజ్యంపైనా ఇంతే. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలన్నట్టు ఉంటే వేరుగా ఉండేది. కానీ మన దేశం వారి ఆదేశాలు పాటించింది. 2009–13 మధ్య మన ఆయుధ కొనుగోళ్లలో రష్యా వాటా 76 శాతం. అదిప్పుడు 36 శాతానికి పడిపోయింది. దీన్ని ఆపేయాలని, తన ఎఫ్–35 యుద్ధ విమానాలు, ఎంక్యూ–9బి డ్రోన్లు, పీ–81 సాగర ప్రాంత గస్తీ విమానాలు కొనితీరాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. నిజానికి భారత్‌కు ఆయుధ అమ్మకాలపై 1960 ప్రాంతాల్లో అమెరికా నిషేధం విధించబట్టే రష్యాపై ఆధారపడటం పెరిగింది. ముడి చమురు విషయానికొస్తే మొన్న ఫిబ్రవరికి రష్యా నుంచి కొనుగోళ్లు 25 శాతం మేర పడిపోయాయి. అదే సమయంలో అమెరికా నుంచి కొనుగోళ్లు వంద శాతం పెరిగాయి. తన అంధభక్త గణాన్ని సంతృప్తిపరచటం కోసం, ఓటుబ్యాంకు పెంచుకోవటం కోసం ట్రంప్ దశాబ్దాల తరబడి ఎంతో ఓపిగ్గా నిర్మించుకుంటూ వచ్చిన ఇరు దేశాల సంబంధాలపైనా గొడ్డలి వేటు వేశారు. దీని పర్యవ సానాలు మనపై ఉన్నట్టే, అమెరికాపైనా ఉంటాయి. ఆయన ధోరణి మారకపోతే మన ఆర్థిక వ్యవస్థ మాటేమోగానీ... అమెరికా ఆర్థిక వ్యవస్థ ‘మృతప్రాయం’ కావటం ఖాయం. -
వాదం – అనువాదం
స్వతంత్ర రచయితా, అనువాదకుడా – ఎవరు గొప్ప అని ప్రశ్నిస్తే; ఎవరైనా స్వతంత్ర రచయితే నంటారు, రచయిత లేకుండా అనువాదకుడు ఉండనే ఉండడు కనుక ఎప్పుడైనా స్వతంత్ర రచయితదే ప్రథమ స్థానం. ‘అనువాద’ మనడంలోనే ఆ సూచన ఉంది. ‘ఒకరు చెప్పిన దానిని వేరొక భాషలో తిరిగి చెప్పడ’మని ఆ మాటకు వ్యుత్పత్త్యర్థం. క్రియలో చూస్తే, అనువాదకుడు స్వతంత్ర రచయితకు సమవుజ్జీ అనే కాక, కొన్ని విషయాల్లో అతణ్ణి మించగలడని కూడా అనిపిస్తుంది. అయినాసరే, మూల రచనను అందించిన స్వతంత్ర రచయితదే ప్రథమ స్థానమూ, అనువాదకుడిది ద్వితీయస్థానమేనంటారా; అనువాదకుడిది మరీ తక్కువ స్థానమేమీ కాదని గుర్తిస్తే చాలు! స్వతంత్ర రచనా, అనువాదమూ సృష్టీ, పునఃసృష్టి లాంటివి. సృష్టి గొప్పదా, పునఃసృష్టి గొప్పదా అంటే; దేని గొప్ప, దేని కష్టాలు, దేని సౌలభ్యాలు దానికే ఉన్నాయి. సృష్టిలో సృజనశక్తి కీలకమవుతుంది కనుక ఆ మేరకు దాని స్థానం దానిదే, ఎంతైనా అనువాదం అనుçసృజన మాత్రమే. అయితే సృష్టిలో ఉన్న ఒక సౌలభ్యమేమిటంటే, అది ఇంకొకదాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు కనుక, ఏది ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో నిర్ణయించుకునే అపరిమిత స్వేచ్ఛ దాని కుంటుంది. అనువాదకునికి లేనిదదే; మూలరచన విధించిన హద్దులకు లోబడే తన అనుకృతిని తీర్చి ఒప్పించి మెప్పించవలసిందే. ఆ కోణంలో, అనువాదమనేది నెత్తిమీద కలశాలను పెట్టుకుని, పళ్ళెం అంచుల మీద చేసే నృత్య విశేషం లాంటిదైతే, మూలరచన నిర్నిబంధ, స్వేచ్ఛానర్తనం. అనువాదమంటే ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి తేవడమే కదా అనుకుంటాం; అందుకూ కొంత నేర్పూ, శ్రమా అవసరమే కానీ, ఇటీవలి కాలంలో కృత్రిమ మేధ దానిని మరింత సులభ తరం చేసిందని కూడా అనుకుంటున్నాం. అయితే, అనువాదమంటే కేవలం భాషానువాదమే కాదన్న సంగతి అనువాదంలోకి తలదూర్చితేనే అర్థమవుతుంది. భాషానువాదం పైకి కనిపించే తొలిమెట్టు మాత్రమే; దానికి పైన కనిపించని మెట్లు చాలా ఉంటాయి. వాటిని కూడా మనోనేత్రంతో దర్శించి వాటి మీదుగా తన అనుకృతిని చివరి మెట్టు దాకా ఒడుపుగా నడిపించి మూలాన్ని మరిపించడంలోనే అనువాదకుడి ప్రతిభ పండుతుంది. అంటే, అతను భాషనే కాక మూలరచయిత శైలీ, శిల్పం, భావం సహా సమస్త రచనాంగాలనూ అనువదిస్తాడు; అంతిమంగా మూలరచయిత హృదయాన్నీ, మేధనూ అనువదిస్తాడు; అలా తనే మూల రచయిత అయి పోతాడు. ఇది మాంత్రికులు చెప్పే పరకాయ ప్రవేశానికేమాత్రం తక్కువ కాదు. ఎంత కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చినా ఈ సహజ మేధకు ప్రత్యామ్నాయమవుతుందా అన్నది సందేహమే. ఇంతకీ సారాంశమేమిటంటే, మూల రచయితది ఏకపాత్రాభినయమైతే, అనువాదకుడిది ద్విపాత్రాభినయం; అతని(లేదా ఆమె)లో అనువాదకుడు, మూల రచయితా ఇద్దరూ ఉంటారన్న మాట. అలా చూసినప్పుడు ప్రతిభలో అనువాదకుడు మూల రచయితకు దాదాపు సమానుడవుతాడు; అదే అతను పడే పరిశ్రమకు వస్తే, అది ద్విగుణితమూ, త్రిగుణితమూ కూడా అవుతుంది. ఆ విధంగా, స్వతంత్ర రచయిత ప్రథమ గణ్యుడే కానీ, అనువాదకుడు అగస్త్య భ్రాతేమీ కాదు.ఆధునిక కాలానికి వస్తే, దేశీయంగా, విదేశీయంగా కూడా బహు భాషా సాహిత్యాలు, సాహిత్య ప్రక్రియలతో పరిచయం పెరిగి, అనువాద రంగం బహుముఖాలుగా అభివృద్ధి చెందడం చూస్తు న్నాం. కాకపోతే, అనువాదంలో మెళకువలు, ప్రమాణాలు, ఎదుర్కొనే క్లిష్టతా మొదలైన విష యాల్లో ప్రాచీనులు, ఆధునికుల అవగాహనలో పెద్ద తేడా లేకపోవడం ఒక విధంగా ఆశ్చర్యకరమే. అసలు తెలుగు సాహిత్యం నన్నయ భారతానువాదంతో ప్రారంభమవడమే ఒక విశేషమనుకుంటే, అనువాదంలోని క్లేశాన్ని గుర్తించి చెప్పిన తొలి అనువాదకుడు కూడా నన్నయే కావడం మరో విశేషం. అనువాదమంటే కేవలం భాషానువాదం కాదు కనుకనే, ‘గహనమైన అర్థాలనే జలాలతో నిండిన భారతమనే మహాసముద్రాన్ని చివరిదాకా ఈదడం బ్రహ్మకైనా సాధ్యమవుతుందా? అయినా నాకు చేతనైన మేరకు ప్రయత్నిస్తా’నని చెప్పుకుని ముందే జాగ్రత్తపడతాడు. ఆ ఒరవడి లోనే తిక్కన, ‘నా నేర్చిన భంగి చెబుతా’నంటూనే, మహాభారత మూలకర్త వ్యాసమహర్షిని మనసు నిండా నిలుపుకొని మరీ ముందుకెడతానంటాడు. నన్నయ మిగిల్చిన అరణ్య పర్వ శేషాన్ని పూరించిన ఎఱా<ప్రగడ అయితే, అనువాదంతోపాటు, అచ్చం నన్నయలానే రచించాలనే మరో సవాలును మీదేసుకుంటాడు. భట్ట హర్షుని ‘నైషధ’ కావ్యాన్ని ‘శృంగార నైషధము’ పేరిట అనువదిస్తూ శ్రీనాథుడు నిర్దేశించిన ప్రమాణాలు త్రికాలాలలోనూ శిరోధార్యాలే. ‘శబ్దాన్ని అనుసరించి, అభి ప్రాయాన్ని గుర్తించి, భావాన్ని ఉపలక్షించి, రసాన్ని పోషించి, అలంకారాన్ని భూషించి, ఔచిత్యాన్ని ఆదరించి, అనౌచిత్యాన్ని పరిహరించి మూలానుసారంగా రచిస్తా’నంటాడాయన.అలా ‘మూలానుసారంగా’ అనువదించడం కూడా ఒక సార్వకాలికమైన ప్రాథమిక విధేనను కుంటే, ‘స్వేచ్ఛానువాదం’, ‘సంక్షిప్తానువాద’ మనేవి మూలాతిక్రమణలే కావచ్చు; సరే, అది వేరే ముచ్చట. ఏ రెండు భాషల నిర్మాణమూ ఒకేలా ఉండాలని లేదు కనుక ఒక్కోసారి మూలం నుంచి పక్కకు జరగడమూ అనివార్యమవుతుంది, నిజమే కానీ, అలాంటివి మినహాయింపులు మాత్రమే, నిబంధన మాత్రం మూలానుసరణమే! అసలు దేనికైనా తప్పనిసరి ముడిసరకు ప్రతిభే అనుకున్న ప్పుడు స్వతంత్రమా, అనువాదమా అన్న చర్చ పక్కకు తప్పుకుని అనువాదమే స్వతంత్ర రచన లానూ భాసించవచ్చు. -
స్వేచ్ఛావాణిజ్యం కల సాకారం
దాదాపు నాలుగేళ్ల కాలం... పదహారు దఫాల చర్చలు... నలుగురు ప్రధానులు– ఎట్టకేలకు బ్రిటన్ అభీష్టం నెరవేరింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌ల సమక్షంలో రెండు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్ గోయెల్, జొనాథన్ రేనాల్డ్స్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై లండన్‌లో సంతకాలు చేశారు. ఈ ద్వైపాక్షిక ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంటు ధ్రువీకరించాల్సి వుంది. ఆ ప్రక్రియకు ఏడాది సమయం పడుతుందంటున్నారు. 2030 నాటికి ఇరు దేశాల వాణిజ్య పరిమాణం 12,000 కోట్ల డాలర్లకు చేరుకోవాలన్నది ఎఫ్‌టీఏ లక్ష్యం. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతున్న భారత్‌తో ఎఫ్‌టీఏ సాకారం కావాలని ఆ దేశం ఎంతగానో ఎదురుచూసింది. అందుకు కారణముంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బయటికొచ్చాక సాగిస్తున్న ఒంటరి ప్రయాణం దాని ఆర్థిక వ్యవస్థను ఒడిదుడుకుల్లో పడేసింది. ఒకప్పుడు ప్రపంచంలో రవి అస్తమించని సామ్రాజ్యాన్నేలిన దేశం నేల చూపులు చూడటం మొదలైంది. అందుకే కన్సర్వేటివ్ పార్టీకి చెందిన బోరిస్ జాన్సన్ ప్రధానిగా వున్నప్పుడు 2022లో తొలిసారి ఎఫ్‌టీఏ కుదుర్చుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. ఆయన స్థానంలో అదే పార్టీకి చెందిన లిజ్ ట్రస్ వచ్చారు. ఆమె 49 రోజుల్లోనే పదవి పోగొట్టుకున్నారు. తదనంతరం భారత్ మూలాలున్న రిషి సునాక్ ప్రధాని అయ్యారు. ఆయన కూడా నిష్క్రమించి ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించి ప్రస్తుత ప్రధాని స్టార్మర్ బాధ్యతలు స్వీకరించారు. వీరిలో అందరూ భారత్‌తో ఎఫ్‌టీఏ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చినవారే. మొన్నటి ఎన్నికల్లో లేబర్ పార్టీ ప్రధాన వాగ్దానాల్లో భారత్‌తో ఎఫ్‌టీఏ కుదుర్చుకుంటామన్నది ఒకటి. మొత్తానికి అనేక రకాల అడ్డంకులూ, అపోహలూ అధిగమించి ఒప్పందం సాకారమైంది. ఎఫ్‌టీఏ వల్ల బ్రిటన్‌లో ఏటా కొత్తగా 2,200 ఉద్యోగాలొస్తాయని, దేశ జీడీపీ 480 కోట్ల పౌండ్ల (రూ. 56,150 కోట్లు) మేర పెరుగుతుందని అంచనా. అయితే రెండు దేశాల్లోనూ ఎఫ్‌టీఏపై అసంతృప్తి తక్కువేమీ లేదు. ఈ ఒప్పందం వల్ల ప్రధానంగా లాభపడేది స్కాచ్ విస్కీ, జిన్ ఉత్పత్తిదార్లు, బ్రిటన్ కార్ల పరిశ్రమలు. జిన్, స్కాచ్ విస్కీలపై ప్రస్తుతం 150 శాతం దిగుమతి సుంకాలుండగా, అవి 75 శాతానికి పడిపోతాయి. వచ్చే పదేళ్ల కాలంలో 40 శాతానికొస్తాయి. అలాగే బ్రిటన్ కార్లపై ప్రస్తుతం 100 శాతం సుంకాలున్నాయి. అవి పది శాతానికి పడిపోతాయి. ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాలకు ఇది ఊరటనిచ్చే కబురు. మన ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లకు కూడా గిరాకీ ఏర్పడుతుంది. ఈ రంగంలో టాటాలకు డబుల్ ధమాకా అని చెప్పాలి. బ్రిటన్‌లో ఆ సంస్థ ఉత్పత్తి చేసే జాగ్వార్ ల్యాండ్ రోవర్లకు మన దేశంలో... ఇక్కడ ఉత్పత్తయ్యే టాటా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లకు బ్రిటన్‌లో మార్కెట్ లభ్యత పెరుగుతుంది. మన దేశం నుంచి వెళ్లే 99 శాతం ఎగుమతులకు కూడా ఎఫ్‌టీఏ అమల్లోకొస్తే సుంకాల బెడద వుండదు. బ్రిటన్ నుంచి మనకొచ్చే దిగుమతులపై సుంకాలు 15 శాతం నుంచి ఒక్కసారిగా 3 శాతానికి పడిపోతాయి. చాలా సరుకులపై కస్టమ్స్ సుంకాలు తగ్గిపోతాయి. మన సాగు రంగానికి ఎఫ్‌టీఏ ఎంతగానో దోహదపడుతుందని వాణిజ్య నిపుణులంటున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌కు మన వార్షిక సాగు ఎగుమతుల విలువ కేవలం 81 కోట్ల డాలర్లు. ఈ ఒప్పందం వల్ల మన నుంచి తేయాకు, మామిడిపళ్లు, ద్రాక్ష, సుగంధ ద్రవ్యాలు, చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు వగైరాల ఎగుమతులు అపారంగా పెరుగుతాయని అంచనా వుంది. సేవల రంగా నికి సంబంధించినంతవరకూ యోగా బోధకులు, సంగీతవేత్తలు, పాకశాస్త్ర ప్రవీణులకు డిమాండ్ పెరుగుతుంది. ఈ రంగాల్లో పనిచేసే వారికోసం ఏటా 1,800 వీసాలు జారీచేస్తారు. వాహన విడి భాగాలు, వస్త్రాలు, పాదరక్షలు, క్రీడోపకరణాలు, ఆటబొమ్మలు, బంగారం, వజ్రాభరణాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, సేంద్రీయ రసాయనాలు, ఇంజిన్లు వగైరాలపై దాదాపు 4 నుంచి 16 శాతం వరకూ సుంకాలు విధిస్తున్నారు. ఒప్పందం అమల్లోకొస్తే ఆ సుంకాలు కనుమరుగవుతాయి. కనుక ఎగుమతులు ఊపందుకుంటాయి. పర్యవసానంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.ఎఫ్‌టీఏపై రెండు దేశాల్లోనూ విమర్శలూ, ఆందోళనలూ వున్నాయి. ఇది అమల్లోకొస్తే స్వల్పకాలిక వీసాపై వచ్చే భారతీయ కార్మికులకూ, వారి యాజమాన్యాలకూ జాతీయ బీమా సంస్థ ఎన్ఐసీకి చేసే చెల్లింపుల నుంచి మూడేళ్ల మినహాయింపు ఇవ్వదల్చుకున్నారని, ఇందువల్ల దేశ ఖజానాకు ఏటా పది లక్షల పౌండ్ల నష్టంతోపాటు దేశీయ కార్మికుల ఉపాధికి గండిపడుతుందని కన్సర్వేటివ్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఆ మినహాయింపు ఏడాది కాలానికి మాత్రమే వుంది. వలస విధానం మారదని, ఇప్పటికన్నా భారతీయ కార్మికుల సంఖ్య పెరిగే అవకాశం లేదని ప్రభుత్వం చెబుతోంది. తమ రంగాన్ని ఎఫ్‌టీఏ విస్మరించిందని, మేధోహక్కుల పరిరక్షణ సంగతి పట్టించుకోలేదని బ్రిటన్ ఫార్మా రంగం ఆరోపణ. ఒకవేళ పట్టించుకుని ఉంటే మన దేశంలో జెనెరిక్ ఔషధ పరిశ్రమ దెబ్బతింటుంది. ఆటోమొబైల్ విడిభాగాల రంగంలో బ్రిటన్ ప్రవేశిస్తే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగం నష్టపోతుంది. అందుకు ప్రతిగా మన ఎంఎస్ఎంఈలకు కూడా బ్రిటన్ చోటిస్తే వేరుగా వుండేది. ఇక 2027 నుంచి బ్రిటన్ అమలుచేయబోతున్న ‘కార్బన్ టాక్స్’ అంశాన్ని ఏం చేశారో వెంటనే తెలియలేదు. కార్బన్ టాక్స్ వల్ల మన ఇనుము, ఉక్కు, అల్యూమినియం, ఎరువులు, సిమెంట్ రంగాలు దెబ్బతినే అవకాశం వుంది. మొత్తానికి ఎఫ్‌టీఏ అమల్లోకొచ్చాకే దాని అసలు కథ ఏమిటన్నది తెలుస్తుంది. -
ఎన్నాళ్లీ జనహననం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ గాజాలో కొనసాగిస్తున్న మారణకాండను ఆపదల్చుకోలేదని తాజా అమానుష ఉదంతం రుజువు చేస్తోంది. నిరాయుధ పౌరులనూ, మరీ ముఖ్యంగా స్త్రీలనూ, పిల్లలనూ హతమార్చటం ఇజ్రాయెల్ సైన్యానికి గత ఇరవైయ్యొక్క నెలలుగా రివాజుగా మారినా... ఆదివారం జరిగిన ఘోరం అత్యంత హేయమైనది. ఐక్యరాజ్యసమితి సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ) ఆధ్వర్యాన ఆహార పంపిణీ మొదలుపెట్టబోతుండగా పౌరు లను చుట్టుముట్టి శతఘ్నులతో, స్నైపర్లతో విరుచుకుపడి 90 మందికిపైగా పౌరుల్ని ఇజ్రాయెల్ సైన్యాలు పొట్టనబెట్టుకున్నాయి. 2023 అక్టోబర్ 7న తమ భూభాగంలోకి అడుగుపెట్టి 1,200 మంది పౌరులను కాల్చిచంపి, మరో 251 మందిని అపహరించిన మిలిటెంట్ సంస్థ హమాస్‌ను తుదముట్టించటానికి దాడులంటూ మొదట్లో చెప్పిన ఇజ్రాయెల్ ఆనాటినుంచి మారణకాండ కొనసాగిస్తూనే ఉంది. అధికారిక లెక్క ప్రకారం ఇప్పటికి 60,000 మంది పౌరులు మరణించారంటున్నా... అంతర్జాతీయ మేగజిన్ లాన్సెట్ నిరుడు జూన్‌లో ప్రకటించిన నివేదిక అది దాదాపు రెండు లక్షలంటోంది. మధ్యధరా సముద్ర తీరానవున్న గాజా స్ట్రిప్ అనే చిన్న ప్రాంతాన్ని వదిలి రావటానికి ససేమిరా అంటున్న స్థానికులను హతమార్చయినా ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ప్రయ త్నిస్తోంది. ఆ ప్రాంతాన్ని సైతం తమ దేశంలో విలీనం చేసుకోవాలన్నది దాని ఆంతర్యం. గతంలో పాలస్తీనాపై విరుచుకుపడినప్పుడల్లా ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని 51వ అధికర ణాన్ని ఇజ్రాయెల్ ప్రస్తావించేది. సాయుధ ముఠాలు దాడులకు దిగితే ఆత్మరక్షణ చేసుకునే హక్కు దేశాలకుంటుందని ఆ అధికరణ చెబుతోంది. కానీ పాలస్తీనాలో తనదికాని భూభాగాన్ని ఆక్రమించుకుని, దాన్ని విస్తరించాలనుకున్నప్పుడల్లా ఇజ్రాయెల్ ఈ అధికరణను సాకుగా చూపుతోంది. హమాస్ సంస్థ దాడుల్ని ఎవరూ సమర్థించరు. ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని చెబుతూ వారికే నష్టం కలిగించే ఆ సంస్థ చర్యల్ని మొదటినుంచీ అందరూ వ్యతిరేకి స్తున్నారు. కానీ గత 21 నెలలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండ మాటేమిటి? కేవలం 365 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంగల చిన్న ప్రాంతంపై యుద్ధ విమానాలతో, బాంబులతో, క్షిపణులతో దాడులు సాగించటం ఏ అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం సబబవుతుంది?ఇజ్రాయెల్ మిత్ర దేశమన్న సాకుతో పెద్ద పెద్ద దేశాలే అది సాగిస్తున్న మారణకాండను విస్మ రిస్తున్న తరుణంలో ఇటీవల 12 చిన్న దేశాలు కొలంబియాలోని బగోటాలో అత్యవసర శిఖరాగ్ర సదస్సు నిర్వహించి కార్యాచరణకు దిగబోతున్నట్టు ప్రకటించటం ఉన్నంతలో వూరటనిచ్చే అంశం. బొలీవియా, కొలంబియా, క్యూబా, ఇండొనేసియా, ఇరాక్, లిబియా, మలేసియా, నమీ బియా, నికరాగువా, ఒమన్, సెయింట్ విన్సెంట్, దక్షిణాఫ్రికాలు వీటిలో వున్నాయి. ఈ సమావేశానికి హాజరైనా, అది విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై సంతకం చేయాలా వద్దా అన్న మీమాంసలో పడిన మరో 20 దేశాలు వచ్చే సెప్టెంబర్‌కల్లా ఏ సంగతీ తేల్చాలని సదస్సు గడువు విధించింది. ఇజ్రాయెల్‌పై దక్షిణాఫ్రికా ఇప్పటికే అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. తనదికాని ఒక ప్రాంతంపై దండెత్తి, అక్కడి పౌరులు ఎటువైపు కదలాలో హుకుం జారీ చేసే ఇజ్రాయెల్ ఆగడం నాగరిక ప్రపంచ ఉనికికే పెను సవాలు. ఇజ్రాయెల్ ఇష్టారాజ్యంగా మానవ హననానికి పాల్పడుతుంటే చూస్తూ కూర్చున్న దేశాలకు కూడా రేపన్నరోజు ఇదే గతి పట్టదన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకే అంతర్జాతీయ చట్టాలకూ, ఐక్యరాజ్యసమితి చార్టర్లకూ, మానవ హక్కులకూ ఇజ్రాయెల్ పెనుముప్పుగా మారిందని 12 దేశాల సదస్సు వ్యాఖ్యానించింది.అయితే ఇజ్రాయెల్ ఏం చేసినా సమర్థించటం అలవాటైన అమెరికాను కాదని ఎన్ని దేశాలు ఈ సదస్సుతో గొంతు కలుపుతాయన్నది ప్రశ్నార్థకం. ఇప్పటికే ‘ఇంకా’ సంతకం చేయని దేశాలకు దూతల్ని పంపి ‘దారికి తేవాలని’ అమెరికా నిర్ణయించుకుంది. ఈ సదస్సుపై ట్రంప్ కారాలూ మిరియాలూ నూరుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఉనికిలోకొచ్చిన అంతర్జాతీయ సంస్థలు మొదటినుంచీ ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తున్నాయి. అందరికీ ఒకే న్యాయం భావన వదిలి సంపన్న దేశాలతో ఒక విధంగా, బడుగు దేశాలతో మరో రకంగా ప్రవర్తిస్తున్నాయి. అందువల్లే ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి తదితర వేదికలపై ఇప్పుడెవరికీ పెద్దగా భ్రమలు లేవు. ఉన్నంతలో కొలంబియా సదస్సు ఒక ఆశాకిరణం.ఆహార పంపిణీ కేంద్రాలు ఐక్యరాజ్యసమితి సంస్థల కనుసన్నల్లోనే వుంటున్నా అవి పాలస్తీనా ప్రజల పాలిట ఉచ్చుగా మారుతున్నాయి. ఆసుపత్రులు, శరణార్థ శిబిరాలు మాత్రమే కాదు.. చివరకు ఆహార పంపిణీ కేంద్రాలు సైతం ఇజ్రాయెల్ సైనికుల దాడులకు లక్ష్యమవుతున్నాయి. ఆకలితో నకనకలాడుతూ తిండికోసం జనం ఒకచోట గుమిగూడినప్పుడు కాల్చి చంపితే గాజాను ఖాళీ చేయించాలన్న తమ పథకం పారుతుందని ఇజ్రాయెల్ భావిస్తున్నట్టుంది. ఒకనాడు నాజీ జర్మనీ లక్షలాదిమంది యూదుల్ని చిత్రహింసల శిబిరాలకు చేర్చి అమానుషంగా అంతమొందించింది. ఆ తరహాలోనే పాలస్తీనాలో రఫా వంటి చోట్ల శిబిరాల నిర్మాణం మొదలైంది. మరో జనహననాన్ని నాగరిక ప్రపంచం సహిస్తుందా? ప్రపంచ ప్రజానీకం మేల్కొని తమ తమ దేశాల్లోని ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తే తప్ప ఇజ్రాయెల్ దురాగతాలు ఆగవు. -
కృత్రిమ రచన
ఆత్మ అనేది కేవలం స్వర్గలోక సంబంధి కాదు. దానికి భౌతిక ఉనికి లేనంతమాత్రాన అది భావ వాదులకు మాత్రమే చెందినది కాదు. అదేంటో చూపలేకపోయినా, అది లేకపోవడమంటే ఏమిటో మనకు తెలుసు. ఈ మెటీరియలిస్టు ప్రపంచంలో ఆత్మగల్ల మనుషులను వెతికే ప్రయత్నం కాదిది. కృత్రిమ మేధ (ఏఐ) సందర్భంలో ఆత్మ ప్రాధాన్యతను అర్థం చేయించాలన్న ఆరాటం. మానవీయ సహజ మేధనూ, యాంత్రిక కృత్రిమ మేధనూ విడదీస్తున్నది ముఖ్యంగా ఆ ఒక్కటే!‘ఈ కంప్యూటర్ కాలంలో’ అని చెప్పడం నుంచి, ‘ఈ కృత్రిమ మేధ కాలంలో’ అనడం వరకు పయనించాం. మానవ నాగరికత ఒక క్రమ పరిణామమే అయినా, అది ఒక్కోసారి పెద్ద అంగ వేస్తుంది. నిప్పును పుట్టించడం, విద్యుత్‌ను కనుగొనడం, ఇంటర్నెట్ లాంటి మరో విప్లవాత్మకమైన మార్పు కృత్రిమ మేధ అని పండితులు అంటున్నారు. మనిషి తాను ఎదిగే క్రమంలో ఎన్నో ఉపకరణాలనూ, సాంకేతిక పరిజ్ఞానాలనూ రూపొందించుకున్నాడు. ఆ ఉపకరణాలు, పరిజ్ఞానాల ఊతంగా మరింత ఎదిగాడు. కానీ ఏఐ కేవలం మనిషి చేతిలో మరో పనిముట్టు కాదు, మరో అద నపు పరిజ్ఞానం అంతకన్నా కాదు. అంతకు మించి! పర్యావరణ పరిష్కారాలు సూచిస్తుందంటున్న ఏఐ టెక్నాలజీ నిజానికి అత్యధిక కార్బన్ ఫుట్‌ప్రింట్స్‌కు కారణమవుతోందనీ, జలవనరులను విపరీతంగా తోడేస్తోందనీ పర్యావరణవేత్తలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. కానీ ఇవేవీ ఏఐని వ్యతిరేకించడానికి తక్షణ కారణాలు కాదు. ఇతర పరిజ్ఞానాలు కనీసం మన అంచనాలో మనిషిని సుఖపెట్టడానికి రూపొందినవి. కానీ ఏఐ ఏం చేయనుందో మనకు ఏ అంచనా లేదు!సాహిత్య ప్రపంచంలో కొంతకాలంగా ఉన్న భయం ఈ మధ్య ఒక ‘ఓపెన్ లెటర్’ రూపం దాల్చింది. యంత్రాలు సృష్టించిన పుస్తకాలను విడుదల చేయకూడదంటూ ఈ జూన్ నెలలో పదుల కొద్దీ రచయితలు అమెరికాలోని పెంగ్విన్ రాండమ్‌హౌజ్, హార్పర్ కొలిన్స్ లాంటి ప్రచురణకర్తలకు బహిరంగ లేఖ రాశారు. ఏఐ–కల్పిత పుస్తకాలను విడుదల చేయడానికి ‘రచయితల’ను సృష్టించ బోమనీ, ఒకవేళ మానవ రచయితలే అలాంటివి కల్పిస్తే వాటిని ‘మారుపేర్ల’తో అనుమతించ బోమనీ, ఈ ‘దొంగతనానికి’ ఏ విధంగానూ మద్దతివ్వబోమనీ ప్రచురణకర్తలు ప్రతిన బూనాలని వారు కోరారు. ఒక పుస్తకం తుదిరూపు వరకు భాగమయ్యే మనుషుల ఉద్యోగాలను ఏఐ టూల్స్‌కు బలిపెట్టకూడదనీ అడిగారు. ఘంటాలను దాటి, పెన్నుకు బదులుగా టైప్ రైటర్‌నో, కంప్యూటర్నో వాడటం లాంటి పరిణామం కాదిది. ఏకంగా రచయితనే పక్కకు తప్పించేది! అందుకే రచయితల అనుమతి లేకుండా, రాయల్టీలు చెల్లించకుండా రూపొందిన కృత్రిమ మేధను ప్రచురణకర్తలు వాడకూడదనే విన్నపం కూడా వీటిల్లో ఉంది. ఎటూ ‘దోపిడీ’కి గురవుతున్న శ్రమకు పరిహారం కోరుకోవడం ఇది! సాహిత్యం అంటేనే మానవ అనుభవం. లోలోపలి తరంగం, అంతరంగ జ్వలనం, ఆనంద చలనం. అవేమీ లేని ఏఐ ఎలా రాస్తుంది? ‘ఎలక్ట్రిక్ గొర్రెలను కలగంటుందా ఏఐ?’ అని అడుగు తాడు కవి డేవిడ్ స్టీర్. ‘ఒక రచన చేస్తున్నప్పుడు రచయిత రాస్తున్న ప్రతి పదాన్నీ తెలిసో, తెలియకో ఎంపిక చేసుకుంటాడు. పది వేల పదాల కథకు పది వేల ఎంపికలు. అలాంటి స్పృహ లేనందువల్ల కృత్రిమ మేధ ‘కళ’ను సృష్టించలేదంటాడు అమెరికన్ సైన్స్ ఫిక్షన్ రచయిత టెడ్ చియాంగ్. ‘‘ఒక మనిషి మీకు ‘ఐ యామ్ సారీ’ అని చెప్పినప్పుడు, గతంలో ఇతర జనాలు క్షమాపణ కోరుకున్నా రన్నది విషయం కాదు; ‘ఐ యామ్ సారీ’ అనేది పరిగణించాల్సినంతటి అసాధారణమైన పదబంధం కాదన్నది విషయం కాదు. ఒకవేళ ఒకరు నిజాయితీగా చెబితే, ఆ క్షమాపణ విలువైనదీ, అర్థవంతమైనదీ అవుతుంది; అలాంటి క్షమాపణలు గతంలో చెప్పివున్నప్పటికీ.’’ ఒక రచయిత రాసేది అతడిదైన లోలోపలి వాక్యం. అది అతడికి మాత్రమే ప్రత్యేకం. అతడి అనుభవమే ఆ వాక్యం రాయడానికి పురిగొల్పుతుంది. యజమానిని చూడగానే కుక్క ప్రేమగా తోక ఊపుతుంది. దాని అన్ని కండరాలూ సంతోషంతో నర్తించడాన్ని ఆ తోక ఊపు సంకేతిస్తుంది. ఇలాంటి చిరు ఉద్వేగపు అనుభవం కూడా ఉండని ఏఐ ఏం రాయగలదు? ప్రదేశాలు, వస్తువులు మనిషి ఉనికితో ముడిపడి ప్రత్యేకమవుతాయి. ఏఐకి లేనిదే ఆ మహత్తర మానవీయ స్పర్శ. కేవలం అన్నింటినీ రుబ్బి, ‘అలాగరిథమ్’ వండివార్చే రచనలో ఆత్మ ఎలా ఉంటుంది? మరి, ఎటూ కళ కాకుండాపోయే ఆ ఏఐ కల్పిత కృత్రిమ రచనల పట్ల భయం దేనికి అనేది ప్రశ్న. సగటు పాఠకుడికి ఆ మీడియోకర్ రచనే బాగుందనిపించొచ్చు. ఇక అదే ప్రమాణం అయ్యి, ‘అసలు’ది తీర్పునకు లోనవుతుందేమో నని ఒక సృజనాత్మక భయం!త్రిపురనేని గోపీచంద్ నవల ‘పండిత పరమేశ్వర శాస్త్రి’లో ఒక పాత్రను ‘సజ్జలు సజ్జలు’ అని వెక్కిరిస్తారు అతడి సాహిత్య మిత్రులు. కోడి సజ్జలు తిని సజ్జలు విసర్జిస్తుంది, ఏమీ జీర్ణం చేసు కోకుండానే. ఎంతో మేధావిగా కనబడే ఆ రచయిత, ఏదీ తనలోకి ఇంకించుకోకుండానే మాటలు వల్లెవేస్తుంటాడని వారి ఉద్దేశం అనుకోవాలి. ఏఐ రచనలకు ఈ ఉదాహరణ బాగా పనికొస్తుంది. అయితే, అసలు ఇప్పుడు ఉన్నది ఇంకా ‘ఆదిమ’ ఏఐ మాత్రమేననీ, మున్ముందు ఇంకా ఆధునికం అవుతుందనీ చెబుతున్నారు. అప్పుడు అది ఏ రూపం తీసుకుంటుందో! ప్రస్తుత భయం రచ యితను పక్కనపెట్టడం గురించే. మున్ముందు మనిషినే పక్కన పెట్టడం అవుతుందేమో! అప్పుడు సమస్త మానవాళి మరొక బహిరంగ లేఖ రాసుకోవాల్సి ఉంటుంది! -
ఏదీ 'సునాయాసం' కాదు!
థాంక్యూ! హలో క్లాస్ ఆఫ్ 2024! నేనెంత ఉత్సాహంగా ఉన్నానో మీకెవరికీ తెలియదు. నేనొక కాలేజీ క్యాంపస్‌లో అడుగుపెట్టడం నా జీవితంలో ఇది రెండోసారి. కానీ, మీరు దేన్నో దృష్టిలో పెట్టుకుని నాకు డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేస్తున్నారు. నేనిక్కడ ప్రసంగించడానికి వచ్చాను. కానీ, ‘డాక్టర్ రోజర్’గా ఇంటికి తిరిగి వెళతాను. అది నాకు గొప్ప బోనస్ లాంటిది. ‘డాక్టర్ రోజర్’. ఇది నేను ఏమాత్రం ఊహించని విజయం! ఇది నాకు కొద్దిగా పరిచయం లేని వాతావరణం. ఇది నేను ఎప్పుడూ చూసే దృశ్యం కాదు... ఈ దుస్తులు కూడా నేను సాధారణంగా వేసుకునేవి కావు. ఈ పొడవాటి గౌను బరువుగా ఉంది. గత 35 ఏళ్ళుగా ఇంచుమించుగా ప్రతి రోజు నేను పొట్టి నిక్కర్లు, టీ షర్టులతోనే గడిపాను. నాలుగు పదాలే చెప్పగలిగాను!నేను ఇలాంటి ప్రసంగాలు చేసే వ్యక్తిని కూడా కాను. నేను స్విట్జర్లాండ్ జాతీయ జట్టులో చేరేనాటికి నాకు 17 ఏళ్ళు. అప్పట్లో నేను ఎంతగా కలవరపడ్డానంటే నాలుగు పదాలకు మించి మాట్లాడలేకపోయాను. ‘‘ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది’’ అన్నానంతే. ఇప్పుడు ఇక్కడ 25 ఏళ్ళ తర్వాత, నాకు ఇప్పటికీ కొద్ది కలవరంగానే ఉంది. కాకపోతే ఇపుడు మీకు చెప్ప డానికి నా దగ్గర నాలుగు మాటలకు మించి చాలా ఉన్నాయి. ఈ స్థాయికి వచ్చేందుకు మీరెంతో కష్టపడి ఉంటారు. మీరంతా సాధించిన దానిపట్ల నాకెంతో గౌరవం ఉంది. ఎందుకంటే, పూర్తి స్థాయి టెన్నిస్ ఆటగాడిగా మారేందుకు నేను 16వ ఏటనే స్కూలు చదువుకు స్వస్తి చెప్పేశాను. కనుక, నేను కాలేజీలో అడుగు పెట్టింది లేదు. కానీ, నేను ఇటీవలే టెన్నిస్‌లో గ్రాడ్యుయేట్‌నయ్యా. ‘రిటైర్’ అనే మాట ఉపయోగించాలని నాకు తెలుసు. ‘‘రోజర్ ఫెదరర్ టెన్నిస్ నుంచి రిటైర్ అయ్యాడు.’’ రిటైర్ అవడమా? ఆ మాట వినడానికే బాగా లేదు. కాలేజీ నుంచి రిటైర్ అవుతున్నామని మీరు చెప్పలేరు. ఔనా? మీలాగే నేను కూడా ఒక పెద్ద పని పూర్తి చేసి మరో దానికి మరలుతున్నా. మీలాగే నేను కూడా తదుపరి ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నా. మీ బాధ నాకు అర్థమవుతోంది. చదువు పూర్తయిందిగా, ఏం చేయబోతున్నావు? అని అందరూ అడ గడం మొదలెడతారు. ఆ మాటకొస్తే, ‘‘ఇంక ఇపుడు నువ్వు వృత్తిపరమైన టెన్నిస్ ఆటగాడివి కాదు కదా! ఏం చేయ బోతున్నావు?’’ అని నన్నూ అడుగుతారు. ఏం చేయాలో నాకూ తెలియదు. తెలియకపోవడమూ మంచిదే. మరి నేను కాలాన్ని ఎలా వెళ్ళబుచ్చుతా? తండ్రిగా పిల్లల్ని స్కూల్లో దింపి రావచ్చు. ఎవరో అపరిచితులతో ఆన్లైన్లో చదరంగం ఆడవచ్చు. వాక్యూమ్ క్లీనర్‌తో ఇంటిని శుభ్రం చేయ వచ్చు. వాస్తవానికి, టెన్నిస్ పట్టభద్రునిగా జీవితాన్ని నేను ఇష్టపడతున్నా. నేను 2022లో టెన్నిస్‌లో గ్రాడ్యుయేట్‌నయ్యా. మీరు 2024లో పట్టభద్రులవుతున్నారు. ఈ పరిణామ క్రమంలో నేను ఆకళింపు చేసుకున్న కొద్ది పాఠాలను మీతో పంచుకోవా లనుకుంటున్నా. వాటిని మనం టెన్నిస్ పాఠాలు అనుకోవచ్చు.స్నేహపూరిత ప్రత్యర్థులు: రఫేల్ నదాల్‌తో రోజర్ ఫెదరర్ టెన్నిస్ పాఠాలుమొదటిది. ‘సునాయాసంగా’ అనే మాట ఒక భ్రమ! నేను సునాయాసంగా ఆడతానని అంటూంటారు. చాలా సందర్భాల్లో దాన్ని ఒక పొగడ్తగానే చెబుతారు. కానీ, ‘‘అతని దేహంపై ఒక్క స్వేద బిందువు కూడా లేదు చూడండి’’ లాంటి మాటలు వారి నుంచి విన్నప్పుడు నాకు అసహనంగా ఉండేది. సత్యం ఏమంటే, తేలిగ్గా ఆడినట్లు కనిపించడం వెనుక నేను చేసిన కఠోర శ్రమ ఉంది. నన్ను నేను తమాయించుకోవడం నేర్చుకోవడానికి ముందు చాలా ఏళ్ళు కోర్ట్‌లో విసుగు ప్రదర్శించేవాడిని, అనుచితమైన మాటలనేవాడిని, చేతిలో రాకెట్‌ను విసిరేసేవాడిని. కానీ, క్రీడా జీవితం ఆరంభంలోనే, వాటిని సరిదిద్దుకునే అవకాశం లభించింది. ఒకసారి ఇటాలియన్ ఓపెన్‌లో నా ప్రత్యర్థి ఒకరు నా మానసిక క్రమశిక్షణను బాహాటంగానే ప్రశ్నించాడు. ‘‘మొదటి రెండు గంటలు రోజర్ గెలుస్తాడనుకుంటారు. ఆ తర్వాత, నేను ఫేవరెట్‌గా మారతాను’’ అని వ్యాఖ్యానించాడు. మొదట, నాకు ఆ మాటలు అర్థం కాలేదు. తర్వాత, అతని మాటలలోని ఆంతర్యాన్ని గ్రహించాను. మొదటి రెండు గంటలపాటు ప్రతి ఆటగాడు బాగానే ఆడతాడు. శారీరకంగా శక్తితో ఉంటారు. వేగంగా కదులుతారు. రెండు గంటల తర్వాత, కాళ్ళు పీకడం మొదలెడతాయి. మనసు ఏకాగ్రతను కోల్పోతుంది. నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆ మాటలతో అర్థం చేసుకున్నా. ఆ దిశగా ప్రయాణం ప్రారంభించి, కోరుకున్న స్థితికి చేరుకున్నా. ఆ క్రమంలో నా తల్లితండ్రులు, కోచ్‌లు, ఫిట్ నెస్ కోచ్ నా ప్రవర్తనను సరిదిద్దుతూ వచ్చారు. నా ప్రత్యర్థి ఆటగాళ్ళు కూడా ఆ పని చేస్తున్నారు. ఈ విషయంలో, నాతోటి ఆటగాళ్ళకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.డార్ట్‌మౌత్‌లో మీరు దీన్ని మరో విధంగా గమనించి ఉంటారు. తోటి విద్యార్థులు ర్యాంకుల మీద ర్యాంకులు సాధించడాన్ని చూసి శాన్‌బర్న్ లైబ్రరీలో మీరు ఓ మూలన మౌనంగా రోదించి ఉంటారు. నా లాగానే మీరు కూడా ‘అప్రయత్నంగా’ అనే మాట ఒక భ్రమేనని తెలుసుకుని ఉంటారని భావిస్తున్నా. కేవలం ప్రతిభతోనే నేను ఈ స్థితికి చేరుకోలేదు. ప్రత్యర్థులకన్నా ఎక్కువసేపు, ప్రభావశీలంగా, కఠిన శ్రమకోర్చి ప్రాక్టీసు చేయ బట్టే ఈ స్థితికి చేరా. నిజంగా గర్వపడే విజయాలు అవే!మనం నిరాశతో చతికిలపడే సందర్భాలూ ఎదురవుతా యని గుర్తుంచుకోవాలి. వెన్ను, మోకాళ్ళు నొప్పి పుట్టవచ్చు. స్వల్పంగా అనారోగ్యం పాలుకావచ్చు లేదా ముందున్న లక్ష్యం భయపెట్టనూవచ్చు. అయినా, గెలుపొందడానికి మీరొక మార్గాన్ని కనుగొని తీరాలి. అలా సాధించిన విజయాల గురించి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, మీరు ఉత్తమమైన స్థితిలో ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా విజయాలు సాధించగలరని అవి నిరూపిస్తాయి. ఔను. ప్రతిభ కూడా ఉండి తీరాలి. దానితో పని లేదని చెప్పడానికి నేను ఇక్కడ నుంచో లేదు. కానీ, ప్రతిభ అనే మాటకు విస్తృతమైన నిర్వచనం ఉంది. చాలా సందర్భాలలో, దాన్ని వరంగా చూడకూడదని, వజ్ర సమాన సంకల్పంగా భావించాలని చెప్పదలచుకున్నాను. కానీ, జీవితంలో మాదిరి గానే... టెన్నిస్‌లో కూడా క్రమశిక్షణే ప్రతిభగా పరిణమిస్తుంది. ఓర్పు కూడా అంతే అవసరం. మీపై మీకు నమ్మకం ఉండటం కూడా ప్రతిభే. ఏ ప్రక్రియనైనా సరే స్వాగతించడం, ప్రేమించడం ప్రతిభ కిందకే వస్తుంది. మీ జీవితాన్ని, మిమ్మల్ని నడుపుకోవడం కూడా ప్రతిభ కోవలోకే వస్తుందేమో. కొందరికి పుట్టుకతోనే ఆ లక్షణాలు ఉంటాయి. మిగిలిన అందరూ వాటిని సంతరించుకునే కృషి చేయాలి.అదొక పాయింట్ అంతే!రెండవ పాఠం. అదొక పాయింట్ మాత్రమే! మీరు సాధ్యం అనుకున్నదానికన్నా ఎక్కువగానే శ్రమించి ఉంటారు... అయినా పరాజయం పాలయ్యారు. ఈ రోజు మీలో ఒక్కరే డిగ్రీ పొందా రని ఊహించుకుందాం. విజేతకు అభినందనలు తెలుపుదాం. మిగిలిన వెయ్యి మంది మాటేమిటి? తదుపరి విడతలో ఉత్తీర్ణులు కావచ్చు... నేనెప్పుడూ గెలుపొందడానికే ప్రయత్నించానని మీకు తెలుసు. కానీ, నేను ఓడిన సందర్భాలున్నాయి. కొన్నిసార్లు పెద్ద టోర్నమెంట్లలోనే ఓటమి చెందా. వింబుల్డన్ 2008 ఫైనల్స్ వాటిలో ఒకటి. నేను, రఫేల్ నదాల్ తలపడ్డాం. కొందరు దాన్ని చరిత్రలోనే మరపురాని మ్యాచ్‌గా అభివర్ణిస్తారు. రఫా మీద నాకు పూర్తి గౌరవం ఉంది. కానీ, ఆ మ్యాచ్‌లో నేను గెలుపొంది ఉంటే ఇంకా బాగుండేది. వింబుల్డన్‌లో ఓటమిని తేలిగ్గా తీసు కోలేం... ఏ టెన్నిస్ ఆటగాడికైనా వింబుల్డన్‌లో విజయమే సర్వస్వం. నేను 2008లో వరుసగా ఆరవసారి టైటిల్ సాధించేందుకు బరిలోకి దిగా. చరిత్రలో సుస్థిర స్థానం కోసం ఆడుతున్నా. ఆ మ్యాచ్‌లో ఒక్కో పాయింట్ మా ఇద్దరిలో ఎవరెవరికి ఎలా వచ్చిందీ నేను ఇపుడు వివరించబోవడం లేదు. అదంతా చెప్పా లంటే కొన్ని గంటలు పడుతుంది. సరిగ్గా చెప్పాలంటే, ఆ మ్యాచ్ దాదాపు ఐదు గంటలు సాగింది. రఫా రెండు సెట్లు గెలి చాడు. టై–బ్రేక్స్‌లో తదుపరి రెండు సెట్లు నేను గెలిచా. ఐదవ సెట్లో ఏడు పాయింట్లతో ఇద్దరం సమ స్థితిలో ఉన్నాం. ఆట చివరి భాగంపై అందరూ ఎందుకు అంత దృష్టి కేంద్రీ కరిస్తారో నాకు అపుడు అర్థమైంది... చివరి నిమిషాల్లో నాకు కళ్ళు బైర్లు కమ్మాయి. గ్రాస్ కోర్టుపై తెల్లని చారలు కూడా మసకగా కనిపించడం మొదలెట్టాయి. అన్నిసార్లూ గెలవలేము!ఇపుడు వెనుతిరిగి చూసుకుంటే... ఆ మ్యాచ్‌లో మొదటి పాయింట్ అప్పుడే నేను ఓటమి పాలయ్యాననిపిస్తుంది. ‘ఏయ్, నువ్వు ఐదు విడతలుగా గెలుస్తూ వస్తున్న డిఫెండింగ్ చాంపియన్‌వి! పైగా, ఆడుతున్నది గ్రాస్ కోర్ట్‌లో. ఇక్కడ ఎలా ఆడాలో నీకు బాగా తెలుసు’ అని నా అంతరంగంలో నేను గుర్తు తెచ్చుకోవడానికి మూడవ సెట్ దాకా సమయం పట్టింది. కానీ, ఆ ధైర్యం చాలా ఆలస్యంగా వచ్చింది. రఫా గెలుపొందాడు. దానికతను అన్ని విధాలా యోగ్యుడే!కొన్ని ఓటములు మిగిలినవాటికన్నా ఎక్కువ బాధిస్తాయి. వరుసగా ఆరవసారి టైటిల్ కోసం పోటీ పడే అవకాశం జీవితంలో మళ్ళీ లభించదని నాకు తెలుసు. వింబుల్డన్‌లో ఓడాను.నంబర్ వన్ ర్యాంకింగ్ కోల్పోయాను. టెన్నిస్‌లో పరిపూర్ణత అనేది అసాధ్యం. నా వృత్తి జీవితంలో నేను ఆడిన 1,526 సింగిల్స్ మ్యాచ్‌లలో దాదాపు 80% గెలుపొందా. కానీ, ఇక్కడ నేను మీకో ప్రశ్న వేయదలచుకున్నా. ఆ మ్యాచ్‌లలో, నేను గెలి చిన పాయింట్ల శాతం ఎంతనుకుంటున్నారు? కేవలం 54%. మరో విధంగా చెప్పాలంటే, అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాళ్ళు కూడా వారు అడిన మ్యాచ్‌ల పాయింట్లలో కేవలం సగంపైన మాత్రమే గెలిచి ఉంటారు. కొంపేం మునిగిపోయింది. అది ఒక పాయింట్ మాత్రమే అని మీకు మీరే నేర్చుకోవాలి. జీవితంలో మీరు ఏ ఆట ఆడినా... కొన్నిసార్లు ఓటమి తప్పదు. అది ఒక పాయింట్, ఒక మ్యాచ్, ఒక సీజన్, ఒక ఉద్యోగం కోల్పోవడం ఏదైనా కావచ్చు. జీవితం అనేక ఎత్తు పల్లాలున్న రోలర్ కోస్టర్. కుంగిపోయినపుడు మీ సామర్థ్యంపై మీకు సందేహాలు ఏర్పడటం సహజం. కానీ, మీ ప్రత్యర్థులకు కూడా వారి సామర్థ్యాలపై వారికి సందేహాలుంటాయని మరచి పోకండి. కానీ, నెగెటివ్ ఎనర్జీ వృథా ఎనర్జీ! ప్రపంచంలో ఉత్తములుగా పరిగణన పొందుతున్నవారు అన్నింటిలోనూ గెలవడం వల్ల అలాంటి హోదా ఏమీ పొందడం లేదు. ఓటమి పాలవుతామనీ, పరాజయాలు పదే పదే వెక్కిరి స్తాయనీ వారికి తెలుసు. వాటిని తట్టుకుని ఎలా నిలబడాలో వారు నేర్చుకుంటారు కాబట్టి గొప్పవారు అనిపించుకుంటారు. చేస్తున్న పనిని ఆనందించండి!మూడవ పాఠం. జీవితం కోర్ట్ కన్నా పెద్దది. టెన్నిస్ కోర్ట్ చిన్న ప్రదేశం. నిక్కచ్చిగా చెప్పాలంటే, 2,106 చదరపు టడుగులు. అది సింగిల్స్ మ్యాచ్‌లు ఆడే కోర్ట్ వైశాల్యం. ఒక సత్రం గదికన్నా మరీ పెద్దదిగా ఏమీ ఉండదు. ఆ చిన్న ప్రదేశంలోనే నేను ఎంతో శ్రమించాను. నేర్చుకున్నాను. ఎన్నో మైళ్ళు పరుగెత్తాను. కానీ, ప్రపంచం దానికన్నా చాలా చాలా పెద్దది. టెన్నిస్ లోకి అడుగు పెట్టినప్పుడే, టెన్నిస్ నాకు ప్రపంచాన్ని చూపిస్తుంది కానీ, టెన్నిస్సే ప్రపంచం కాదన్న సంగతి నాకు తెలుసు. టెన్నిస్ నుంచి నిష్క్రమించగానే నేను మాజీ టెన్నిస్ క్రీడాకారుడిని అయి పోయా. కానీ, మీరు దేనికీ మాజీలు కాదు. మీరు భవిష్యత్ రికార్డు బ్రేకర్లు. ప్రపంచ యాత్రికులు. భవిష్యత్ కార్యకర్తలు. దాతలు. విజేతలు, నాయకులు.ఈ గౌరవ డిగ్రీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ విజయో త్సవంలో నాకూ భాగం కల్పించినందుకు కృతజ్ఞతలు. మీలో ప్రతి ఒక్కరి తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఏమిటో చూడాలని నాకు ఉత్సాహంగా ఉంది. మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా, మీ శక్తి మేరకు ప్రతిభను ప్రదర్శించండి. మీకు నచ్చిన రీతిలో ఆడండి. స్వేచ్ఛగా ఆడండి. అన్నింటిని ప్రయత్నించి చూడండి. అన్నింటికన్నా ముఖ్యంగా, పరస్పరం దయ కలిగి ఉండండి. చేస్తున్న పనిని ఆనందించండి. క్లాస్ ఆఫ్ 2024కి మరోసారి అభినందనలు. -
ఇకనైనా చైనా మారేనా?
గల్వాన్ లోయలో భారత, చైనాల మధ్య ఘర్షణలు జరిగిన అయిదేళ్లకు మన విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాలో అడుగుపెట్టారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) విదేశాంగ మంత్రుల సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మంగళవారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ఇతర దేశాల విదేశాంగమంత్రులతోపాటు కలవటమేకాక, చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌తో ముందు రోజు భేటీ అయ్యారు. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీతో కూడా విడిగా భేటీ అయ్యారు. ఇరుగుపొరుగన్నాక సమస్యలు రావటం సహజం. అందునా చైనా వంటి దేశం పొరుగున వుంటే ఇవి మరింత క్లిష్టం కావటం, అవి ఘర్షణలుగా రూపాంతరం చెందటంలో ఆశ్చర్యం లేదు. సరిహద్దుల్లో ఎవరి భూభాగం ఎంతవరకూ వుందన్న అంశంలో మాత్రమే కాదు... పాకిస్తాన్‌తో మనకు సమస్య తలెత్తినప్పుడల్లా ఆ దేశాన్ని నెత్తిన పెట్టుకోవటం చైనాకు అలవాటైంది. ఉగ్రవాద దాడులకు కారణమైన సంస్థల్ని, ఉగ్రవాదుల్ని నిషేధ జాబితాలో చేర్చాలని భద్రతా మండలిలో కోరినప్పుడల్లా చైనా మోకాలడ్డుతోంది. ఇలాంటి సమస్యలెన్ని వున్నా సామర స్య వాతావరణంలో చర్చించుకుని పరిష్కరించుకోవటమే విజ్ఞత. అందుకే అయిదేళ్ల జాప్యం తర్వాతైనా ఈ పరిణామం చోటుచేసుకోవటం హర్షించదగ్గది. నిరుడు అక్టోబర్‌లో రష్యాలో జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కలుసుకున్నారు. ఉభయ దేశాల సంబంధాలనూ మళ్లీ పూర్వ స్థితికి తీసుకెళ్లాలని ఆ సమావేశంలో నిర్ణయించు కున్నారు. అటు తర్వాత మధ్య మధ్యలో చైనా వ్యవహార శైలివల్ల ఇబ్బందులేర్పడినా ఇరు దేశాల మధ్య సంబంధాలూ ఎంతో కొంత మెరుగయ్యాయని చెప్పాలి. సరిహద్దుల్లోని డెమ్చోక్,డెస్పాంగ్ ప్రాంతాల్లో సైన్యాలను వెనక్కి పిలవాలని ఇరు దేశాలూ నిరుడు అక్టోబర్‌లో నిర్ణయించ టంతో పరిస్థితుల్లో గణనీయంగా మార్పు వచ్చింది. కానీ మొన్న ఏప్రిల్‌లో హఠాత్తుగా విద్యుత్ వాహనాల తయారీలో, ఏఐ సహా అధునాతన సాంకేతికతల్లో తోడ్పడే అత్యంత కీలక ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఒడంబడిక ప్రకారం ఇది సరైంది కాదని మన దేశం చెబుతూ వచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటానికి కూడా ఇలాంటి ఆంక్షలు ప్రతిబంధ కమవుతాయి. ఈ సంబంధాలు మెరుగుపడటం, అభివృద్ధి చెందటం అంత సులభంగా సాధ్య పడలేదని, జాగ్రత్తగా వ్యవహరించి దీన్ని సుస్థిరపరుచుకోవాల్సిన అవసరం వున్నదని చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ అన్నట్టు అక్కడి మీడియా తెలిపింది. ఈ విషయంలో చైనా నిజంగా చిత్తశుద్ధి ప్రదర్శిస్తే, కీలక ఖనిజాల ఎగుమతులపై వున్న నిషేధాన్ని తొలగిస్తే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో రెండూ అతి పెద్ద మార్కెట్లు. కానీ వృథా వివాదాల కారణంగా వాటిని వినియోగించుకోలేని నిస్సహాయత రెండు దేశాలనూ ఆవరిస్తోంది. ఈ ఏడాది చివరిలో ఎస్సీఓ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు చైనాలో జరగబోతోంది. దానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తున్నారు. కనుక ఈలోగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచు కోవటానికి కృషి చేయాల్సి వుంది. కశ్మీర్‌లోని పెహల్గాంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడిచేయటం, అనంతరం ‘ఆపరేషన్ సిందూర్’తో మన దేశం గట్టిగా జవాబీయటం వంటి పరిణామాల్లో చైనా, పాకిస్తాన్ వైపే నిలబడింది. ఇక దలైలామా వారసుడి నిర్ణయం తమ అంతర్గత వ్యవహారమంటూ చైనా వాదిస్తోంది. గత నెలలో బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో కలిసి చైనా త్రైపాక్షిక సమావేశం నిర్వహించటాన్ని కూడా సాధారణ విషయంగా పరిగణించటానికి వీల్లేదు. ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యతేమీ లేదని బంగ్లాదేశ్ చెప్పినా, పాకిస్తాన్ మాత్రం భవిష్యత్తు త్రైపాక్షిక సమావేశాలకు ఇది ఆరంభమని ప్రకటించింది. ఇదిగాక అమెరికాలో ట్రంప్ ఆగమనం తర్వాత ఆ దేశం బంగ్లాదేశ్ వ్యవహారాల్లో ఏ పాత్ర పోషిస్తుందనేది ఇంకా అస్పష్టంగా వుంది. చైనాకు వ్యతిరేకంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో మనతో కలిసి కూటమి కట్టిన అమెరికా, దానిపై కూడా తన వైఖరేమిటని చెప్పటం లేదు. తన మనసులోని మాట చెప్పకుండా ఈ మధ్య జపాన్, ఆస్ట్రేలియాలతో జరిపిన సమావేశంలో తైవాన్ విషయంలో చైనా దూకుడు నిర్ణయం తీసుకుంటే మీ చర్యలెలావుంటాయంటూ ట్రంప్ ఆరా తీశారు. అమెరికా ఏం చేస్తుందో, ఏ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో తెలియకుండా హామీ ఇవ్వటానికి రెండు దేశాలూ నిరాకరించాయి. ఆస్ట్రేలియా అయితే నేరుగానే అది తన సమస్య కాదన్నట్టు మాట్లాడింది. కనుక స్వీయ ప్రయోజనాల రీత్యా చైనా విషయంలో మనం కూడా ఆచితూచి అడుగేయక తప్పదు.అయితే మన భద్రత విషయంలో రాజీ పడాల్సిన పనిలేదు. ఎస్సీఓలో మంగళవారం మాట్లాడిన జైశంకర్ నిర్మొహమాటంగానే మన వైఖరేమిటో చెప్పారు. ఉగ్రవాదం, వేర్పాటు వాదం, తీవ్రవాదం అనే మూడు దుష్టశక్తులతో పోరాడాల్సి వుంటుందని ఆయన ప్రకటించారు. పెహల్గాం దాడి జమ్మూ కశ్మీర్ పర్యాటకాన్ని దెబ్బతీసేందుకు జరిగిన కుట్రని చెప్పటంతోపాటు ఎస్సీఓ తన ప్రకటిత లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. ఎస్సీఓకు నేతృత్వం వహిస్తూ దాని లక్ష్యాలకు భిన్నంగా పాకిస్తాన్‌కు మద్దతీయటం సరికాదని చైనా గుర్తించక తప్పదు. స్నేహ సంబంధాలుంటే వాటిని పెంపొందించుకోవటానికి ఇతరేతర మార్గాలున్నాయి. అంతేతప్ప పాక్ తప్పులన్నిటినీ భుజాన మోసుకెళ్లటం తన ఎదుగుదలకు కూడా చేటు తెస్తుందని చైనా గుర్తించాలి. -
ఈ అరకొర నివేదిక దేనికి?!
ఒక పెను విషాదంపై జరిగే దర్యాప్తు ఎంతో బాధ్యతాయుతంగా వుండాలి. ఆ ఉదంతంలో అసలు జరిగిందేమిటో చెప్పే ప్రయత్నం చేసినప్పుడు అస్పష్టతకు తావీయకూడదు. ప్రాథమిక దర్యాప్తుకైనా, పూర్తిస్థాయి దర్యాప్తుకైనా ఇదే వర్తిస్తుంది. కానీ గత నెల 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం విషయమై శుక్రవారం అర్ధరాత్రి వెలువరించిన ప్రాథమిక దర్యాప్తు ఆ నియమాలను ఉల్లంఘించింది. బాధిత కుటుంబాల్లో అయోమయాన్ని మరింత పెంచింది. ఆ ప్రమాదం వైమానిక ప్రమాదాల చరిత్రలో పెద్దది. ఆ విషాద ఘటన సమ యంలో విమానంలో 242 మంది ప్రయాణికులుండగా, ఒకరు క్షేమంగా బయటపడ్డారు. భవంతిపై కూలినందువల్ల అక్కడున్న 19 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఇంధనాన్ని నియంత్రించే స్విచ్‌లు రెండూ ఆపివేసి వుండటం వల్లనే ప్రమాదం జరిగివుండొచ్చని దర్యాప్తు చేస్తున్న విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక భావించింది. ఇది కేవలం ప్రాథమిక నివేదికే గనుక వెంటనే నిర్ణయానికి రావటం తగదని కేంద్ర వైమానిక మంత్రిత్వ శాఖ అంటున్నది. మంచిదే. అటువంటప్పుడు ఏఏఐబీ నివేదిక స్విచ్‌ల విషయంలో మరింత సమాచారం అందాకే వాటిని ప్రస్తావించి వుండాల్సింది. పైలెట్ల సంఘం కూడా నివేదికను తప్పుబడు తోంది. పైలెట్ల తప్పిదమే కారణమని అర్థం వచ్చేలా నివేదిక వుండటం సరికాదని విమర్శిస్తున్నారు. దర్యాప్తులో తమ ప్రతినిధికి ఇప్పటికైనా చోటీయాలని వారు అంటున్నారు. ఈ అయోమయం ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో వున్న బాధిత కుటుంబాలను మరింత నొప్పించదా? అంతర్జాతీయ వైమానిక నిబంధనల ప్రకారం ప్రమాదం జరిగిన ఏడాదిలోగా తుది నివేదిక రావాలి. ఈలోగా విడుదల చేసే ప్రాథమిక నివేదిక పైలెట్లను తప్పుబట్టే విధంగా వుండటం, ఆ తర్వాత దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదనటం న్యాయమేనా? ఘటనా స్థలంలో దొరికిన స్విచ్‌లున్న పరికరంలో అవి రెండూ ‘ఆన్’ చేసివున్నాయి. కానీ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో ఒక పైలెట్ మరొకరితో ‘ఇంధనం ఎందుకు నిలిపివేశావ్’ అని అడగటం, అందుకు రెండో పైలెట్ ‘నేనలా చేయలేదే...’ అంటూ జవాబివ్వటం వినబడటాన్నిబట్టి స్విచ్‌లు ఆపివేసి వున్నట్టు దర్యాప్తు బృందం నిర్ధారణకొచ్చింది. కానీ రెండో పైలెట్ ఆ వెంటనే వాటిని సరిచేసి వుండొచ్చని, అందుకే అవి సక్రమంగా వున్న స్థితిలో లభించాయని నివేదిక అంటున్నది. ఈ సంభాషణల్లో అడిగిన వారెవరో, జవాబిచ్చిన వారెవరో దర్యాప్తు చేసినవారు గుర్తించారా?గుర్తించి వుంటే ఆ సంగతి వెల్లడించటానికి వారికున్న అభ్యంతరమేమిటి? ఒకవేళ అలాంటి అభ్యంతరం వున్నప్పుడు అసలు ఆ సంభాషణను బయటపెట్టడం దేనికి? విమానంలోని యాంత్రిక వ్యవస్థలు సంక్లిష్టమైనవి. విమాన గమనంలో మనుషుల జోక్యం దాదాపు అవసరం లేని ‘ఫ్లై బై వైర్’ వ్యవస్థ అందుబాటులోకొచ్చి దశాబ్దాలవుతోంది. ముఖ్యంగా విమానం టేకాఫ్ సమయంలోనూ, దిగే సమయంలోనూ ఆ వ్యవస్థ పూర్తిగా తనకు తానే అన్నిటినీ సరిచేసుకుంటుంది. పైకెగిరినప్పుడూ, కిందకు దిగినప్పుడూ అవసరమైన ఇంధనం సరఫరా అయ్యేలా చూసుకుంటుంది. ఇవి విఫలమైన పక్షంలో పైలెట్ అవసరమైన మార్పులు చేసుకోవ డానికే స్విచ్‌లుంటాయి. రెండు స్విచ్‌లకూ రెండువైపులా రింగ్‌లుంటాయి. వాటికి ప్రత్యేక లాకింగ్ వ్యవస్థ వుంటుంది. మనిషి ప్రత్యేకించి వాటిని స్విచాన్ చేయటానికైనా, స్విచాఫ్ చేయటానికైనా ముందు ఆ లాకింగ్‌ను తెరవక తప్పదు. రెండు స్విచ్‌లూ ఆగిపోవటానికి మధ్య సెకను వ్యవధి వుందని తేల్చారు. పైగా పైకెగురుతున్న సమయంలో ఎక్కువ ఇంధనం సరఫరా కావాల్సి వుండగా దాన్ని కావాలని ఏ పైలెట్ కూడా స్విచాఫ్ చేయడు. దానిపై దర్యాప్తు బృందం ఏ నిర్ధారణకూ రాలేదు. పైలెట్లుగా వ్యవహరించినవారి చరిత్ర చూసినా ఉద్దేశపూర్వకంగా ఆపివుంటారని ఊహించటం అసాధ్యం. ప్రధాన పైలెట్ సుమీత్ సభర్వాల్‌కు బోయింగ్ 787ను 8,600 గంటలు నడిపిన సర్వీస్ (మొత్తంగా 15,638 గంటల సర్వీస్) వుండగా, కో పైలెట్ క్లైవ్ కుందేర్‌కు బోయింగ్‌పై 1,100 గంటల అనుభవం, మొత్తంగా 3,403 గంటల అనుభవం వుంది. ఇద్దరూ ఈ విమానం నడపటానికి ముందు తగినంత విశ్రాంతి తీసుకున్నవారే. ప్రధాన పైలెట్ పర్యవేక్షణలో కో పైలెట్ ఇష్టానుసారం చేయటం సాధ్యపడదు. ఒకవేళ ఆ ప్రయత్నం జరిగివుంటే వాగ్వాదం చోటుచేసు కునేది. అది రికార్డయ్యేది. పూర్తి స్థాయి పారదర్శకతకు దర్యాప్తు సంస్థ ఎందుకు వెనకాడుతోంది? ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను కేవలం ఒక ప్రశ్న, జవాబు స్థాయికి కుదించటంలోని మర్మమేమిటి? అటు తర్వాత లేదా అంతకుముందు వారేం మాట్లాడుకున్నారు? ఇది చెప్పకపోతే పైలెట్లలో ఒకరు ఆత్మాహుతికి పాల్పడ్డారా అనే సంశయం బయల్దేరుతుంది. ఎయిర్‌లైన్స్ రేటింగ్స్ వెబ్సైట్ ప్రధాన సంపాదకుడు జెఫ్రీ థామస్ అడుగుతున్నది ఇదే. దర్యాప్తు ఫలితాల గురించి అంతర్జాతీయంగా అనేకులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రకం విమానాలను బ్రిటిష్ ఎయిర్వేస్ సంస్థ, వర్జిన్ అట్లాంటిక్ సంస్థ ప్రధానంగా వినియోగిస్తున్నాయి. ప్రాథమిక నివేదిక విడుదల చేయటం స్వాగతించదగిందే. కానీ ఇప్పటికే వున్న సంశయాలను మరింత పెంచేలా, అస్పష్టత అలుముకునేలా అది వుండటం సరికాదు. పైలెట్ల మధ్య జరిగిన సంభాషణ పూర్తి పాఠం విడుదల చేస్తే అటు పైలెట్ల సంఘం అభ్యంతరాలతోపాటు, ఇటు బాధిత కుటుంబాల సంశయాలు కూడా సమసిపోతాయి. -
ట్రంప్ తిరుగుబాట!
ఈసారి ఎలాగైనా నోబెల్ శాంతి బహుమతి చేజిక్కించుకోవాలన్న ఆత్రపడుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఆగ్రహించి ఉక్రెయిన్‌కు తిరిగి ఆయుధాలు సరఫరా చేయబోతున్నట్టు మంగళవారం ప్రకటించారు. ట్రంప్ వచ్చే నాటికే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగా దాన్ని ఆపాలంటూ పిలుపునిచ్చి పలు దఫాలు రెండు దేశాలతోనూ మాట్లాడారు. దూతల్ని పంపారు. కానీ పుతిన్ ముందు అవేమీ పనిచేయలేదు. మారణాయుధాల డ్రోన్లతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు పలు నగరాలపై దాడులు సాగిస్తూనే ఉన్నారు. అమెరికా నుంచి ఆయుధ సరఫరా నిలిచి పోవటం, దాడులకు అనువైన వేసవి కాలం కావటం రష్యాకు కలిసొచ్చింది. తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెస్క్ ప్రాంతాన్ని కైవసం చేసుకోవటం ఆయన లక్ష్యంగా కనబడుతోంది. 2022 తర్వాత ఈ ప్రాంతంలో రష్యాది పైచేయి కావటం ఇదే తొలిసారి. ఇప్పటికే డొనెస్క్ ప్రాంతంలో మూడింట రెండొంతుల ప్రాంతం రష్యా దళాల అధీనమైంది. అక్కడి కాస్టన్టేనుకా నగరం తమ వశమైతే డొనెస్క్ ప్రాంతంలో వరసగా ఉన్న నగరాలన్నీ కుప్పకూలుతాయని ఆ దళాలు భావిస్తున్నాయి.దౌత్యం నెరపదల్చుకున్నప్పుడు నిర్దిష్టమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలి. మధ్యవర్తిగా రెండు పక్షాలతో మాట్లాడి వారి డిమాండ్లేమిటో ముందు తెలుసుకోవాలి. అటు ఉభయ పక్షాలూ కొంత తగ్గటానికి సిద్ధపడాలి. తగ్గటం మాట అటుంచి రష్యా–ఉక్రెయిన్లు రెండూ యుద్ధం కొన సాగింపులోని నిరర్థకతను గుర్తించటం లేదు. ఎప్పటిలా అమెరికా ఆయుధాలు అందజేస్తే తన వంతుగా రష్యాపై దాడులు సాగిస్తాననీ, పర్యవసానంగా ఎప్పటికైనా ఆధిక్యత సాధించగలననీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెబుతున్నారు. ఈ మాటలు మాట్లాడేది ఆయనే అయినా, పలికి స్తున్నది పాశ్చాత్య దేశాలు. ట్రంప్ ఊగిసలాట ధోరణి, దేనికీ కట్టుబడి ఉండని ఆయన వైఖరి వగైరాలు ఏదో దశలో ఉక్రెయిన్‌కు అక్కరకొస్తాయని అవి భావిస్తున్నాయి. నిజానికి ఉక్రెయిన్ ఈ యుద్ధంలో ఎప్పుడో ఓటమిపాలైంది. దాన్ని కప్పిపుచ్చటానికి బైడెన్ ఏలుబడిలోని అమెరికా, పాశ్చాత్య దేశాలూ ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌కు అధునాతన ఆయుధాలందిస్తూ రష్యా నగరాలపై, దాని యుద్ధ నౌకలపై, ఇతరేతర కీలక ప్రాంతాలపై దాడులు కొనసాగేలా చూశాయి. కానీ ట్రంప్ వచ్చాక ఆయుధ సాయం ఆగిపోయింది. ఆర్థిక సాయమూ నిలిచిపోయింది. పాశ్చాత్య దేశాలు అతి కష్టమ్మీద తమ వంతుగా ఆ బరువును భుజాలకెత్తుకున్నా అది ఏ మూలకూ చాలటం లేదు. అందుకే గత పక్షం రోజులుగా రష్యా సాగిస్తున్న వరస దాడులతో ఉక్రెయిన్‌కు ఊపిరాడటం లేదు. డొనెస్క్ నగరాన్ని రక్షించటంలో నిమగ్నమైన తన దళాలకు ఆహారమూ, ఆయుధాలూ పంపటం మాట అటుంచి కనీసం గాయపడినవారిని వెనక్కి తీసుకొచ్చే వెసులుబాటు కూడా దొరకటం లేదు. ఆ నగరం చుట్టూవున్న ప్రాంతాలన్నీ రష్యా చేజిక్కించుకుంది. నిజానికి ఈ యుద్ధం ఉక్రెయిన్ స్వయంకృతం. అమెరికా, పాశ్చాత్య దేశాల మాట విని రష్యాపై గిల్లికజ్జాలకు పోయింది. పక్షంరోజుల్లో రష్యాను దారికి తీసుకురాగలమని పాశ్చాత్య దేశాలు విశ్వసించాయి. రష్యా తమపైకి దండెత్తి వస్తే ‘నాటో’ సైన్యాలతో దాన్ని సులభంగా మట్టికరిపించగలమను కున్నాయి. ఇందుకోసం ఉక్రెయిన్‌లో తమకు అనుకూలుడైన జెలెన్స్కీకి పట్టంగట్టాయి. రష్యాతో సమవుజ్జీ కాకపోవటంతో ఇప్పటికే ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. పాశ్చాత్య దేశాల బాసటతో రష్యాకు నష్టం కలిగించిన మాట నిజమే అయినా, అదే ఇప్పుడు రష్యా పట్టుదలకు కారణమైంది. యుద్ధం ఆపాలని ట్రంప్ నేరుగా పుతిన్‌తో ఫోన్ సంభాషణలు సాగించినప్పుడు ఆయన ‘మూల కారణాల’ను ప్రస్తావించారని, అవి పరిష్కారం అయితే తప్ప యుద్ధం ఆపేది లేదన్నారని కథనాలు వెలువడ్డాయి. ఆ మూల కారణాల్లో నాటో దూకుడు ఒకటైతే, ఉక్రెయిన్ను ఉసిగొల్పటం రెండోది. యూరప్ భద్రతకు సంబంధించి కొత్త అమరిక ఉండాలని, యుద్ధం ఆగాక ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వమీయరాదని పుతిన్ కోరుతున్నారు. నాటో కూటమి ఏర్పడినప్పుడు సోవియెట్ యూనియన్ నుంచి పశ్చిమ యూరప్‌ను పరిరక్షించటమే ధ్యేయమని అది ప్రకటించింది. అదే నిజమైతే 1989లో సోవియెట్ కుప్పకూలి అనేక దేశాలుగా విడివడినాక నాటో అవసరం ఏముంది? సోవియెట్ చివరి అధినేత గోర్బచెవ్ అప్పట్లో ఒక ప్రతిపాదన చేశారు. ‘నాటోను రద్దయినా చేయండి... లేక ఆ కూటమిలో మాకు చోటైనా ఇవ్వండి’ అన్నదే దాని సారాంశం. అందువల్ల యూరప్ బలపడుతుందనీ, సౌభాగ్యవంతమవుతుందనీ ఆయన చెప్పారు. కానీ అమెరికా ఇందులో కీడు శంకించింది. యూరప్ తనను మించి ఎదుగుతుందని భయపడింది.తూర్పు యూరప్ దేశాలను నాటోలో చేర్చుకోబోమని అప్పట్లో గోర్బచెవ్కి హామీ ఇచ్చారు. కానీ అర డజను దేశాలకు సభ్యత్వమిచ్చారు. వేరే దేశాలతో సరిహద్దు తగాదాలు లేని దేశాలను మాత్రమే చేర్చుకోవాలన్న నిబంధనకు మంగళం పాడారు. చివరకు ఉక్రెయిన్ను చేర్చుకోవటానికీ సిద్ధపడ్డారు. రష్యాపైకి ఉసిగొల్పారు. వీటిని చర్చించకుండా, ఎలాంటి పరిష్కారం అవసరమో యోచించకుండా ట్రంప్ తన ట్రూత్ సామాజిక మాధ్యమం ద్వారా ‘యుద్ధం ఆపండం’టూ సందేశాలు పెడుతూ, నోబెల్ శాంతి బహుమతి కోసం ఎదురుచూస్తూ కాలం గడిపితే ఫలితం ఉండదు. ట్రంప్ నిజంగా యుద్ధం ఆపదల్చుకుంటే తటస్థ ఉక్రెయిన్‌కు పూచీపడాలి. నాటో విస్తరణ ఉండబోదని తెలపాలి. ట్రంప్ ఆ పని చేయగలరా? -
ఠాక్రే సోదరుల యుగళం
రాజకీయాల్లో ఏ నిర్ణయం ఎటువైపు లాక్కెళుతుందో చెప్పటం కష్టం. మహారాష్ట్రలో నిరుడు నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు 235 గెల్చుకుని అధికారంలోకొచ్చిన బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి... అంతా సవ్యంగా ఉందనుకున్న వేళ హిందీని ప్రాథమిక విద్య స్థాయిలో ఒకటో తరగతి నుంచి తృతీయ భాషగా నేర్చుకు తీరాలని జీవో తీసుకొచ్చి కష్టాల్లో పడింది. అటు తర్వాత రాష్ట్రంలో క్రమేపీ హిందీ వ్యతిరేక, మరాఠీ ఆత్మగౌరవ ఉద్యమం బలపడు తుండటాన్ని గమనించి గత్యంతరం లేక దాన్ని వెనక్కు తీసుకుంది. కానీ ఇలా వచ్చి, అలా పోయిన ఆ జీవో చేసిన చేటు అంతా ఇంతా కాదు. రక్త సంబంధాన్ని కూడా బేఖాతరు చేసి గత రెండు దశాబ్దాలుగా పరస్పరం కత్తులు నూరుకుంటున్న రెండు దాయాది వర్గాలను అది ఏకం చేసింది. మహాయుతికి రాజకీయంగా తగని తలనొప్పి తెచ్చిపెట్టింది. బాల్ ఠాక్రే వున్న రోజుల్లోనే అన్న దమ్ముల పిల్లలైన రాజ్ ఠాక్రే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కయ్యానికి దిగారు. వీరిలో ఉద్ధవ్, బాల్ ఠాక్రే కుమారుడు. శివసేనపై ఎవరి ఆధిపత్యం ఉండాలన్న అంశంలో అన్నదమ్ములు తగువు పడ్డారు. అవసాన దశలో బాల్ ఠాక్రే రాజీకి ఎంతగానో ప్రయత్నించినా ఇద్దరికిద్దరూ పట్టుదలకు పోయారు. చివరకు 2005లో ఉద్ధవ్‌ను బాల్ ఠాక్రే తన వారసుడిగా ప్రకటించటంతో శివసేన నుంచి రాజ్ నిష్క్రమించారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పేరిట పార్టీ స్థాపించారు. మధ్యలో ఒకటి రెండుసార్లు కుటుంబీకంగా కలిసిన సందర్భాలుండొచ్చుగానీ ఒకే వేదికను పంచు కున్నది లేదు. రాజకీయాల్లో కలిసి పనిచేస్తామని చెప్పింది లేదు. కానీ ఆ పని మహారాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేయగలిగారు. తప్పనిసరి హిందీ జీవోతో వారిని సన్నిహితం చేశారు. బీజేపీకి అధికారమే పరమావధి కాదు. దాని ఎజెండా దానికుంది. దేశవ్యాప్తంగా ఎప్పటికైనా హిందీని జాతీయ స్థాయిలో అధికార భాష చేసి తీరాలన్న సంకల్పం అందులో ఒకటి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎన్ని వాగ్దానాలైనా ఇవ్వొచ్చుగానీ హిందీకి ప్రాముఖ్యమీయటం దాని ప్రచ్ఛన్న సంకల్పం. ఈమధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంగ్లిష్ మాట్లాడేవారంతా సిగ్గుపడే రోజొకటి వస్తుందని ప్రకటించటం యాదృచ్ఛికం కాదు. ఆ మాటెలావున్నా బీజేపీకీ, ఠాక్రే సోదరులకూ రెండు అంశాల్లో ఏకీభావం వుంది. అవి ఒకటి – హిందూ, రెండు – హిందూస్తాన్. కానీ హిందీ విషయంలోనే ఆ సోదరులకు బీజేపీతో పేచీ. అధికార పంపకం సమస్య సరేసరి. ఏదేమైనా అసాధ్య మనుకున్నది జరిగిపోయింది. సోదరులిద్దరూ ఏకమయ్యారు. హిందీ జీవోను వెనక్కి తీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ముంబైలో శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాజ్ ఠాక్రే భవిష్యత్తు కార్యాచరణ గురించి చెప్పటానికి కొంత మొహమాట పడ్డారుగానీ ఉద్ధవ్ ఠాక్రే నేరుగా చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీల మధ్యా పొత్తు ఉంటుందని ప్రకటించారు. బాల్ ఠాక్రే కాలంలో ముంబైలో శివసేన తిరుగులేని పక్షంగా ఉండేది. తిరిగి ఆ వైభవాన్ని తీసుకురావాలన్నది ఉద్ధవ్ ఉద్దేశం. కానీ అదంత సులభమేమీ కాదు. నాయకులిద్దరూ కలిసినంత మాత్రాన శ్రేణులు అంత తేలిగ్గా ఏకమవుతాయా అన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే గత ఇరవైయ్యేళ్లుగా ఆ పార్టీల మధ్య దాయాది పోరు నడుస్తోంది. అదీగాక ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన (యూబీటీ) ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో ఇప్ప టికే మహావికాస్ అఘాదీ(ఎంవీఏ)లో భాగస్వామిగా ఉంది. సోదరులిద్దరూ ఏకమైతే ఎంవీఏ కూటమి అయోమయంలో పడుతుంది. ఉద్ధవ్ ఆ రెండు పార్టీలతో కలిసి ప్రయాణించగలుగు తున్నారు. కానీ రాజ్ అందుకు సిద్ధపడతారా లేక వారిద్దరూ కలిసి ఇక ఎంవీఏ కథ ముగిస్తారా అన్నది చూడాల్సి ఉంది. కానీ ఈ కలయిక రాజకీయాల్లో ఒక కొత్త దూకుడును ప్రవేశపెట్టింది. ముంబైలో బతకడానికొచ్చినవారు మరాఠీ నేర్చుకు తీరాలని విజయోత్సవ ర్యాలీలో రాజ్ ప్రకటించారు. ఇక శ్రేణులు రెచ్చిపోవటంలో వింతేముంది? నిజానికి ఆ ప్రకటనకు ముందే ముంబైలో ప్రముఖ ఇన్వెస్టర్ సుశీల్ కేడియా ‘మరాఠీ నేర్చుకొనేది లేదం’టూ ట్విటర్లో ప్రకటించాక ఈ నెల 3న ఎంఎన్ఎస్ శ్రేణులు ఆయన కార్యాలయంపైబడి విధ్వంసానికి పూనుకున్నాయి. దీన్ని రాజ్ ఖండించకపోగా ‘మరాఠీ మాట్లాడనంత మాత్రాన ఎవరినీ కొట్టనవసరం లేదు. కానీ అనవసర డ్రామాకు దిగేవారి కర్ణభేరికి కింద తగిలేలా కొట్టండ’ని పిలుపునిచ్చారు.భాషాధిపత్యం తగువు ఈనాటిది కాదు. దేశానికి జాతీయ భాష అవసరమనీ, అది హిందీ అయితీరాలనీ జాతీయోద్యమ కాలంలో కాంగ్రెస్ నేతలు వాదించారు. వారిపై వినాయక్ దామోదర్ సావర్కర్, ఆరెస్సెస్‌ల ప్రభావం ఉంది. కానీ తమిళనాడు ద్రవిడ ఉద్యమ నాయకులతోపాటు ప్రఖ్యాత తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వంటి వారు హిందీ వ్యతిరేకతను చాటారు. స్వాతంత్య్రం వచ్చాక హిందీని జాతీయ భాషగా చేయబోమని హామీ ఇస్తేనే కాంగ్రెస్‌తో కలిసి నడ వాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత ఎన్డీయే పాలకులు మాత్రమే కాదు... యూపీఏ ఏలు బడిలో సైతం హిందీ ఆధిపత్యాన్ని నిలపాలని శతధా ప్రయత్నించారు. దక్షిణాదిన అందుకు ప్రతిఘటన వస్తూనే ఉంది. భాషా సంస్కృతులు సున్నితమైనవి. ప్రజామోదం లేకుండా వాటి జోలికి పోకపోవటం ఉత్తమం. ప్రస్తుతానికి రాజకీయంగా అయోమయంలో ఉన్న ఠాక్రే సోదరులకు మరో ఆర్నెల్లలో జరగబోయే స్థానిక ఎన్నికలకు హిందీ జీవో అందివచ్చిందన్నది వాస్తవం. ప్రజల మనోభావాల్ని బేఖాతరు చేస్తే అధికార కూటమికి చేటు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. -
నీళ్లు నమిలిన క్వాడ్!
అమెరికాలో బుధవారం జరిగిన చతుర్భుజ కూటమి (క్వాడ్) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అనుకున్న విధంగానే కశ్మీర్‌లోని పెహల్గామ్లో మొన్న ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడిచేసి 26 మందిని పొట్టన బెట్టుకున్న ఉదంతాన్ని తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటంలో సహకరించుకోవటానికి సిద్ధంగా ఉన్నామని ఉమ్మడి ప్రకటన తెలియజేసింది. ‘ఇందుకు కారకులైనవారినీ, దాడిలో పాల్గొన్నవారినీ, వారికి ఆర్థికంగా సహకరించినవారినీ ఎలాంటి జాప్యం లేకుండా శిక్షించటానికి ఐక్యరాజ్యసమితి దేశాలన్నీ తోడ్పడాల’ని సూచించింది. క్వాడ్ వంటి కూటములు ఏర్పడటం వెనకుండే ధ్యేయం సంక్షోభ సమయాల్లో సమష్టిగా అడుగు మందుకేయటం కోసమే. కానీ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తున్నా ఆ దేశాన్ని వేలెత్తి చూపటానికీ, అటువంటి కార్యకలాపాలు మానుకోవాలని హెచ్చరించటానికీ కూటమిలోని మిగతా మూడు దేశాలూ సిద్ధంగా లేవంటే క్వాడ్ ఆవిర్భావానికి గల ప్రాతిపదికే ప్రశ్నార్థకంగా మిగిలినట్టు లెక్క. పెహల్గామ్ ఘటన అనంతరం మన దేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడిచేసింది. దానికి ప్రతిగా పాకిస్తాన్ సైన్యం మనపై క్షిపణులతో, డ్రోన్లతో దాడికి దిగాక మన దళాలు వాటిని తిప్పికొట్టడంతోపాటు అక్కడి వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇరు దేశాల మధ్యా ఇది పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించే సూచనలు కనబడ్డాయి. కారణాలేమైతేనేం...నాలుగు రోజుల అనంతరం కాల్పుల విరమణకు ఇరు దేశాలూ అంగీకరించాయి. ప్రపంచ దేశాలన్నీ ఈ పరిణామాలను ఎంతో ఆందోళనతో గమనించాయి. కానీ ఉమ్మడి ప్రకటన పాక్ పేరెత్తి ఖండించకుండా మర్యాదపూర్వకంగా, లౌక్యంగా మాట్లాడితే ఒరిగేదేమిటి? క్వాడ్ ఈనాటిది కాదు. పద్దెనిమిదేళ్ల క్రితం జపాన్ ద్వారా మన దేశాన్ని ఒప్పించి ఈ కూటమి ఏర్పాటుకు నాంది పలికింది అమెరికాయే. 2007లో కూటమి ఏర్పాటుపై చర్చించటానికి నాలుగు దేశాలూ సమావేశమైనప్పుడే చైనా ఉరిమింది. తనకు వ్యతిరేకంగానే ఈ కూటమి ఏర్పడుతున్నదంటూ నిష్టూరానికి పోయింది. ఏడాది గడవకముందే జపాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి కూటమి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. 2008లో ప్రభుత్వం మారి ఆస్ట్రేలియా సైతం నిష్క్రమిస్తున్నట్టు తెలియజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో 2017లో తిరిగి క్వాడ్‌కు జీవం పోసింది అప్పటి ట్రంప్ ప్రభుత్వమే. అప్పటికల్లా దక్షిణ చైనా, తూర్పు చైనా సముద్ర జలాల్లో చైనా కార్యకలాపాలు పెరిగాయి. ‘అన్నీ నేనే... అంతా నాదే’ అంటూ పగడాల దిబ్బలు, ఇసుక మేటలు చైనా తన ఖాతాలో వేసుకుంది. అంతటితో ఊరుకోక స్ప్రాట్లీ దీవుల చుట్టూ ఏడు కృత్రిమ దీవుల నిర్మాణం ప్రారంభించింది. ఇది జపాన్‌తో పాటు ఆస్ట్రేలియానూ... ఆ రెండు దేశాలకూ అన్ని విధాలా అండగా ఉంటున్న అమెరికానూ చికాకు పెట్టిన పర్యవసానంగానే క్వాడ్ మళ్లీ పురుడు పోసుకుంది. సారాంశంలో ఇది అమెరికా, చైనాల మధ్య జరిగే ఆధిపత్య పోరులో భాగంగా వచ్చింది. అందులో మనల్ని భాగస్వాముల్ని చేసి తన వివాదాన్ని మనకు కూడా అంటించిన అమెరికా మనకు సమస్య వచ్చినప్పుడు మాత్రం మనవైపుండదని పెహల్గామ్ రుజువు చేసింది. మరి ఇలాంటి కూటములు పెట్టి ప్రయోజనమేమిటి? విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబల్ అన్నట్టు పాకిస్తాన్‌తో మిగిలిన మూడు సభ్య దేశాలకూ, ముఖ్యంగా అమెరికాకూ స్నేహ సంబంధాలుండటం వల్ల ఉమ్మడి ప్రకటనలో నేరుగా దాన్ని ప్రస్తావించటానికి మొహమాటపడి ఉండొచ్చు. మరి అదే పరిస్థితి మనకు ఉండదా? మనకూ, పాకిస్తాన్‌కూ వున్న వైషమ్యాలపై క్వాడ్ పెట్టేనాటికే మిగిలిన మూడు దేశాలకూ అవగాహన ఉండాలి. మరి ఎందుకు కలుపుకొన్నట్టు? ఇలాంటి పరిస్థితి తలెత్తగలదని ఆనాడు తెలియదా?భూగోళంలో ఏమూల ఉగ్రవాదం ఉన్నా దాన్ని నిర్మూలించేదాకా వదలబోమని, దానిపట్ల దయాదాక్షిణ్యాలుండబోవని 2001లో తాను చేసిన శపథం అమెరికాకు గుర్తుందా? క్వాడ్ కూటమి సమావేశానికి ముందు మన విదేశాంగ మంత్రి జైశంకర్ మూడు దేశాల విదేశాంగ మంత్రులతో విడివిడిగా భేటీ అయ్యారు. పెహల్గామ్, తదనంతర పరిణామాలపై వారితో చర్చించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును వివరించారు. బహుశా దాని పర్యవసానంగా కనీసం పెహల్‌గామ్‌ను ప్రకటనలో ప్రస్తావించి చర్య తీసుకోవాలన్న డిమాండైనా చేశారు. లేకుంటే దానికి కూడా దిక్కు లేకపోయేదేమో! పాకిస్తాన్ ఎన్ని తప్పుడు పనులకు పాల్పడుతున్నా అమెరికాకు ఆ దేశమంటే మోజు. ‘రెండు దేశాలనూ బెదిరించి యుద్ధం ఆపాన’ని గొప్పలు పోయిన ట్రంప్, ఆ తర్వాత వారం గడవకుండా ఆ దేశ ఆర్మీ చీఫ్‌తో భేటీ అయి పొగడ్తలతో ముంచెత్తారు. చైనాతో మనకు సరిహద్దు వివాదాలున్న సంగతి నిజమే. ఆ విషయంలో మన దేశం రాజీ పడకుండా చర్చలు సాగిస్తోంది. దురాక్రమణకు ప్రయత్నించినప్పుడల్లా ఎదుర్కొంటున్నది. క్వాడ్ ఉనికిలోకి రాకముందునుంచీ అది కొనసాగుతోంది. పరస్పరం సహకరించుకోవటానికీ, ఎదగటానికీ కూటములు అవసరం. అధునాతన సాంకేతికతల్లో తోడ్పడే అత్యంత కీలకమైన ఖనిజాల, ఇతర వనరుల సరఫరాపై చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఎదిగేందుకు, సరఫరాలకు అంతరాయం ఏర్పడకుండా చూసేందుకూ సమష్టిగా కృషి చేయాలని క్వాడ్ తీర్మానించటం హర్షించదగ్గదే. ఈ ఏడాది చివరిలో క్వాడ్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు మన దేశంలో జరుగుతున్న నేపథ్యంలో కూటమి భాగస్వాముల్లో మరింత సదవగాహన, సమన్వయం అవసరమని... కీలక సమయాల్లో నిర్మొహమాటంగా ఉండటం ముఖ్యమని తెలుసుకుంటే మంచిది. -
ఘోర విషాదం
ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ పాశమైలారంలో ఊహకందని ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం అక్కడి సిగాచి ఫార్మాస్యూటికల్ పరిశ్రమలోని రియాక్టర్ పేలి, క్షణాల్లో మంటలు వ్యాపించి పెద్ద సంఖ్యలో కార్మికులూ, ఉద్యోగులూ మరణించటం అందరినీ కలచివేసింది. పేలుడు సమయంలో వంద మందికి పైగా పనిచేస్తుండటం, కొద్దిమంది మాత్రమే సురక్షితంగా తప్పించుకోగలగటం, పలువురి ఆచూకీ లేకపోవటం గమనిస్తే కీడు శంకించాల్సి వస్తోంది. మొదట్లో 13 మంది మరణించినట్టు వెల్లడైనా గంటలు గడుస్తున్నకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. పేలుడు ధాటికి సెకన్ల వ్యవధిలో కుప్పకూలిన రెండు మూడంతస్తుల భవనాలకు సంబంధించిన శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండటంతో ఇంతవరకూ 45 మంది మరణించారని ప్రకటించినా ఈ సంఖ్య మరింత పెరగవచ్చన్నది సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారి అంచనా. శిథిలాల కింద కొందరైనా సజీవంగా ఉండొచ్చని చెబుతున్నారు. శరీరాలు ఛిద్రమై చాలా మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేనంతగా మారటం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. డీఎన్ఏ పరీక్షలు జరిగితే తప్ప మరణించినవారిని నిర్ధారించటం సాధ్యం కాదంటున్నారు. ఈ ఫ్యాక్టరీలో రెండు తెలుగు రాష్ట్రాల వారితో పాటు బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలవారు కూడా పనిచేస్తున్నారు.భారీ యెత్తున పరిశ్రమలు రావాలని, యువతకు ముమ్మరంగా ఉద్యోగావకాశాలు లభించాలని పాలకులు ఉవ్విళ్లూరుతున్నారు. మాకు ఏ రాష్ట్రమూ పోటీకాదు... ప్రపంచ దేశాలతోనే మా పోటీ అంటూ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. మంచిదే. పరిశ్రమలు వస్తే, ఉత్పాదకత పెరిగితే, వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది. వృద్ధి రేటు పైపైకి ఎగబాకుతుంది. రాష్ట్రం సంపద్వంతం అవుతుంది. కానీ ఇదే స్థాయిలో భద్రతా ప్రమాణాలపై దృష్టి పెడుతున్నారా? ఆ అంశంలో దృష్టి కేంద్రీకరించే విభాగాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయా? వాటిపై సరైన పర్యవేక్షణ ఉంటున్నదా? అసలు ఆ విభాగాల్లో తగినంత మంది సిబ్బంది ఉంటున్నారా? వీటన్నిటికీ లేదన్న సమాధానమే వస్తోంది. ఒక్క హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న పరిశ్రమల్లోనే గత అయిదేళ్లలో వేయికి పైగా ప్రమాదాలు సంభవించాయని గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఏటా సగటున 200 ప్రమాదాలు! ఈ ప్రమాదాల్లో 1,500 మంది ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. గత 30 నెలల్లోనే 10 భారీ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వీటిల్లో అధిక భాగం పాశమైలారం, పటాన్చెరు ప్రాంతాల్లో జరగటం గమనించదగ్గ అంశం. ఈ ప్రమాదాల్లో ఆస్తి నష్టం గురించి చెప్పనవసరం లేదు. అధునాతన సాంకేతికతలు అభివృద్ధి చెందుతున్నాయి. వంద మంది చేసే పనిని అంతకన్నా చాలా తక్కువ వ్యవధిలో పది మంది సునాయాసంగా చేయగలిగేంతగా యాంత్రీకరణ జరిగింది. యాజమాన్యాలకు లాభాలు కూడా ఆ స్థాయిలోనే వస్తున్నాయి. కానీ సగటు కార్మికుడి భద్రత మాత్రం గాల్లో దీపంగా మారుతోంది. అయినా ఈ ఫ్యాక్టరీల్లో భద్రత భేషుగ్గా ఉందంటూ ధ్రువీకరణ పత్రాలు వస్తున్నాయి. సిగాచికి భద్రతా ప్రమాణాల్లో, వృత్తిగత ఆరోగ్య అంశాల్లో ఐఎస్ఓ సర్టిఫికెట్ కూడా వచ్చింది. అలాంటి చోట ప్రమాదం జరిగిందంటే ఎవర్ని నిందించాలి? విఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మనిషి తన పట్లా, తన భద్రత పట్లా పట్టింపుతో ఉండటమే సకల సాంకేతికతల పరమార్థం కావాలని ఆకాంక్షించారు. కానీ లాభాల వేటలో ఇవేమీ పట్టడం లేదని ప్రమాదాల పరంపర చెబుతోంది. తరచుగా చోటు చేసుకుంటున్న చాలా పేలుళ్లు డ్రయ్యర్లు, రియాక్టర్లకు సంబంధించినవే కావటం గమనించదగ్గది. ఇప్పుడు ప్రమాదం జరిగిన సిగాచిలో గత డిసెంబర్లో తనిఖీలు నిర్వహించి, భద్రతా ప్రమాణాలు బాగున్నాయని అధికార గణం తేల్చింది. అదే చోట ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం చోటుచేసుకున్నదంటే ఆ తనిఖీలు ప్రామాణికంగా లేవన్న సందేహం కలుగుతుంది. జరిగే ప్రమాదాలపై వెంటవెంటనే దర్యాప్తు, నిపుణుల ద్వారా అందుకు దారితీసిన లోటుపాట్ల నిర్ధారణ, బాధ్యుల్ని త్వరగా శిక్షించటం వంటివి జరిగితే తప్ప ఈ ప్రమాదాలు ఆగేలా కనబడటం లేదు. ఫ్యాక్టరీ యాజమాన్యాలతో మాట్లాడతారు సరే... అక్కడి కార్మికులనడిగి ప్రాణాంతక సమస్యలేమిటో తెలుసుకోవద్దా? తనిఖీలకెళ్లే అధికారుల జవాబుదారీతనాన్ని తేల్చి, ప్రమాదం జరిగిన పక్షంలో యాజమాన్యాలతోపాటు వారిని కూడా బాధ్యుల్ని చేసేలా చట్ట సవరణ జరిగితేనే, భారీ జరిమానాలు విధిస్తేనే పరిస్థితులు మెరుగుపడతాయి. తెలంగాణలో దాదాపు 22,000 ఫ్యాక్టరీలుండగా వీటిల్లో 8 లక్షల మందికి పైగా పని చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీల్లో అత్యంత ప్రమాదకరమైనవి చాలానే ఉన్నాయి. వీటన్నిటిలో సగటు కార్మికుడి శ్రేయస్సుపై యాజమాన్యాలు దృష్టి పెట్టడం లేదని తరచు ఆరోపణలొస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 163 ప్రమాదాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రమాదకరమైన ప్రక్రియల్లో పాలుపంచుకుంటున్న వారికి ఎక్కడెక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో, ఏం చేస్తే వాటి నివారణ సాధ్యమయ్యేదో చెప్పే నిరంతర శిక్షణ జరుగుతోందా? ఆ రంగంలో జరిగే మార్పులపై కార్మికులకు అవగాహన కల్పిస్తున్నారా? భద్రత ఆడిట్ మాటేమిటి? లాభార్జన తప్ప దేనిపైనా శ్రద్ధలేని యాజమాన్యాలు కార్మికుల ప్రాణాలతో, ఆ ప్రాంత ప్రజల ప్రాణాలతో, పర్యావరణంతో చెలగాటం ఆడుతున్నట్టే. కఠిన చర్యలకు ఉపక్రమిస్తే తప్ప ఇలాంటివారు దారికి రారు. -
ఎందుకొచ్చిన ‘సర్’?!
దేశంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఆరోపణలు రావటం, మౌనంగా ఉండిపోయి నెలలు గడిచాక ముక్తసరిగా మాట్లాడటం ఎన్నికల సంఘం(ఈసీ)కి అలవాటైపోయింది. ఈసారి మార్పేమిటంటే... ఓటర్ల జాబితా సవరణ దశలోనే దానిపై ఆరోపణలు రావటం! రాజ్యాంగంలోని 326వ అధికరణం ప్రకారం పద్దెనిమిదేళ్లు నిండిన భారతీయ పౌరులు మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకోవాలి గనుక దానికి అనుగుణంగా ఈ దఫా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు ఈసీ చెబుతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కింద ఓటర్ల వివరాలు సేకరిస్తామంటున్నది. ఇదే మాదిరి సవరణ 2003లో జరిగింది. కానీ ఆ ‘సర్’ వేరు! అప్పట్లో ఇంటింటికీ వెళ్లి జాబితాలోని ఫొటోలతో ఓటర్లను పోల్చిచూడటం, అనుమానాస్పదం అనిపిస్తే తొలగించటం వగైరాలు చేశారు. 2003 జనవరి 1ని ప్రాతిపదికగా తీసుకుని, ఆ తర్వాత జాబితాల్లోకి ఎక్కినవారందరినీ సంశయ ఓటర్లుగా పరిగణించి వారి నుంచి వివిధ పత్రాలు అడగాలన్నది ఈసీ తాజా నిర్ణయం. ఇవన్నీ 1955 నాటి జాతీయ పౌరసత్వ చిట్టా (ఎన్ఆర్సీ)లో నిర్దేశించిన పత్రాలు. సారాంశంలో ఈ ఓటర్లంతా జాబితాలో కెక్కాలంటే ముందుగా ఈ దేశ పౌరులమని నిరూపించుకోవాల్సి ఉంటుంది. తమ పుట్టుకకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు మాత్రమే కాదు... తమ తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేయాలి. ప్రస్తుతం ఓటర్లను ఈసీ మూడు కేటగిరీలుగా విభజించింది. దాని ప్రకారం 1987 జూలై 1 లేదా అంతకుముందు జన్మించినవారు జనన ధ్రువీకరణ పత్రం లేదా పుట్టిన ఊరు ధ్రువీకరణ పత్రం... లేదా రెండూ సమర్పిస్తే సరిపోతుంది. జూలై 1, 1987– డిసెంబర్ 2, 2024 మధ్య జన్మించినవారు ఈ పత్రాలతోపాటు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి జనన లేదా ప్రాంత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. ఆ తర్వాత జన్మించినవారు తమ ధ్రువీకరణ పత్రాలతోపాటు తల్లిదండ్రులిద్దరివీ కూడా సమర్పించాలి. ఇవి అందజేయలేనివారి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. తుది జాబితా ప్రచురణలోగా అందిస్తేనే తిరిగి చేరుస్తారు.ఎన్నికలను సక్రమంగా నిర్వర్తించటంలో తరచూ విఫలమవుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈసీ దొడ్డిదారిన ఎన్ఆర్సీని అమల్లో పెట్టజూస్తున్నదని విపక్షాలు చేస్తున్న ఆరోపణ కొట్టిపారేయదగ్గది కాదు. అలాగని దొంగ ఓటర్ల సమస్య లేదని కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, అటు తర్వాత రెండు విభజిత రాష్ట్రాల్లో వేర్వేరు పోలింగ్ తేదీలున్నప్పుడు తెలుగుదేశం దీన్నొక కళగా అభివృద్ధి చేసింది. అక్కడా ఇక్కడా ఓటేయించటం, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ఓటర్లను తరలించటం ఆ పార్టీకి అలవాటైన విద్య. ఇక అస్సాం, పశ్చిమ బెంగాల్, బిహార్ వగైరాల్లో బంగ్లాదేశ్, మయన్మార్ల నుంచి వచ్చినవారు ఓటర్లుగా నమోదై ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే అందుకు సంబంధించిన డేటా ఈసీ ఇంతవరకూ బయటపెట్టలేదు. అది విడుదల చేసివుంటే ఈ వ్యవహారం ఇంత వివాదం అయివుండేది కాదు. కానీ అలా చేయటం తన స్థాయికి తగదని సంస్థ భావిస్తున్నట్టుంది. బిహార్ మాత్రమే కాదు... వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ఈ ‘సర్’ వచ్చిపడుతుందంటున్నారు. ఏడేళ్ల క్రితం అస్సాంలో ఈ దేశ పౌరులెందరు... ఇతరులెందరన్న ఆరా తీశారు. భారత రిజిస్ట్రార్ జనరల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వే తర్వాత 40.07 లక్షల మంది ‘విదేశీయులని’ నిర్ధారించారు. ఎన్నో ఆందోళనలు జరిగాక ఈ సంఖ్య 19 లక్షలకు తగ్గింది. వీరిలో అన్ని మతాలవారూ ఉండగా బిచ్చగాళ్లు, నిరుద్యోగులూ, ఇల్లూ వాకిలీ లేనివారూ ఎక్కువ. ఒక ఇంట్లో పెద్దన్న ‘భారతీయుడైతే’ మిగిలిన అన్నదమ్ములు ‘విదేశీయులు’గా ముద్రపడిన వారున్నారు. భర్తకు ఎన్ఆర్సీలో చోటు దక్కితే భార్య పేరు గల్లంతయిన ఉదంతాలు కోకొల్లలు. సైన్యంలో రిటైరై, అస్సాం సరిహద్దు పోలీసు విభాగంలో సబ్ఇన్స్పెక్టర్గా పనిచేసే మహమ్మద్ సనావుల్లా పేరు సైతం మాయమైతే అరెస్టు చేసి నిర్బంధ శిబిరానికి తరలించారు. జాబితాలో ఉన్న కుటుంబ సభ్యులంతా గువాహటి హైకోర్టును ఆశ్రయించాక బెయిల్ దొరికింది. ఆ రాష్ట్రంలో ఏడేళ్లయినా ఇప్పటికీ లక్షల కేసులు తేలని నేపథ్యంలో ఇంత పని ఈసీ ఎందుకు నెత్తికెందుకుందన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది. బిహార్‌లో ఇప్పుడున్న ఓటర్ల సంఖ్య 7 కోట్ల 90 లక్షలు. ఇందులో 20–38 ఏళ్ల మధ్య వయస్కులు దాదాపు సగమని చెబుతున్నారు. ఈసీ లెక్క ప్రకారం ఈ సంఖ్య 2.93 కోట్లు. వీరు తమతోపాటు తమ తల్లిదండ్రుల్లో కనీసం ఒకరి పౌరసత్వాన్ని తేల్చిచెప్పాల్సి ఉంటుంది. నాలుగు నెలల్లో ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఏర్పడాల్సిన బిహార్‌లో ఇది అంత తేలిగ్గా తేలే వ్యవహారమా? ఆ వంకన పాలక పక్షాల ఒత్తిడితో భారీయెత్తున ఓటర్లను తొలగించే ప్రమాదం ఉండదా? జాబితాలో చోటుదక్కనివారు న్యాయస్థానాలకెక్కితే పరిస్థితేమిటి? పాలకులుగా ఎవరున్నా పేదరికం రాజ్యమేలే బిహార్ నుంచి భారీయెత్తున వలసలుంటాయి. అక్కడ వృద్ధాప్య పింఛన్ నెలకు రూ. 700. ఇటీవలే దాన్ని రూ. 1,100 చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆర్భాటంగా ప్రకటించారు. పనుల కోసం వందలాది కిలోమీటర్లు దాటి తెలుగు రాష్ట్రాలకు వలస వస్తున్నవారి సంఖ్య తక్కువేమీ కాదు. అక్కడి జనాభాలో 7 శాతం మంది వేరే రాష్ట్రాలకు పోగా, అందులో 30 శాతం మంది ఉపాధి వెదుక్కొని వెళ్లినవారే. వారంతా వెనక్కొచ్చి తమ పత్రాల కోసం వెతుకులాడటం జరిగే పనేనా? బిహార్‌లో సకాలంలో ఎన్నికలు జరుగుతాయని ఈసీ విశ్వసిస్తోందా? -
నానాకాలం చదువులు
‘వానాకాలం చదువు’లంటారు. ఇప్పటికీ దేశంలో చాలాచోట్ల వానకీ, చదువుకీ చుక్కెదురే. చెట్ల కిందో, అరుగుల మీదో, అంతంతమాత్రపు కప్పు కిందో బడులు నడిపేటప్పుడు; చక్కా నడిచి పోడానికి పక్కారోడ్లు లేనప్పుడు వానాకాలంలో చదువుకు గంట కొట్టి ఇంటికి పరిమితమవక తప్పదు. వెనకటి కాలంలో చదువు చెప్పే రోజులతో సమానంగా నిషేధించే రోజులూ ఉండేవి. అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి మొదలైన తిథుల్లో, గ్రహణం పట్టినప్పుడూ అధ్యయనం కూడదు. వాటిని ‘అనధ్యయన దినా’లనేవారు. వేదాలు, ఇతర రహస్య విద్యల వల్లింపైతే వర్షాకాలంలో పూర్తిగా నిషిద్ధం. నేర్చుకున్నది మాత్రం నెమరు వేసుకోవచ్చు. క్రమంగా కేలండర్ మారిపోయి వర్షర్తువూ, చదువుల ఋతువూ ఒకేసారి మొదలవడం ప్రారంభించాయి. మినహాయింపులున్నా ఆ రెంటి మధ్యా వైరుద్ధ్యం పోయి సయోధ్య వెల్లివిరుస్తోంది. వానలతో పచ్చదనాన్ని తెచ్చుకుని కొత్త ఉత్సాహాన్ని నింపుకొనే ప్రకృతితో చదువుల ఋతువు పోటీపడుతూ రహదారులనూ, బడితావులనూ పిల్లల సందడితో వర్ణరంజితమూ, కర్ణరంజితమూ చేస్తోంది. మరోపక్క విచిత్రంగా ముల్లు ఈ కొస నుంచి పూర్తిగా దాని వ్యతిరేక దిశకు తిరగడమూ జరుగుతోంది. చదువుల అభావ దినాలు పోయి ఉల్బణ దినాలు వచ్చాయి. ఋతు నిర్బంధాలూ, తిథివార నిషేధాలూ పోయి చదువుల కేలండర్ ‘సార్వకాలికత’ను తెచ్చుకుంటోంది. వానా కాలం చదువులు పోయి నానాకాలం చదువులొచ్చాయి. అది మరోరకం వైపరీత్యానికి దారి తీసింది. అంతటా కాకపోయినా, అనేక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలలో వేసవి సెలవులు కుదించుకుపోతున్నాయి. ప్రత్యేకించి పబ్లిక్ పరీక్షలు రాయబోయే పిల్లలకు వేసవి తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ పైన వేసవి పొడవునా ట్యూషన్ తరగతులకు హాజరవడం అనివార్యమవుతోంది. భుజాలను వంచే పుస్తకాల బరువుకు తోడు మస్తకాలను భయాందోళనలతో నింపే చదువు బరువూ పెరిగిపోతోంది. ‘స్కూలు వర్కు’ను మించి ‘హోము వర్కు’ నివ్వడంతో బడికీ, ఇంటికీ తేడా చెరిగిపోయి, వేరే వృత్తి ఉద్యోగాల్లో తలమునకలయ్యే తల్లితండ్రులే టీచర్లు గానూ మారి, అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. తల్లుల పరిస్థితి మరీ ఘోరం. ఉద్యోగానికి అదనంగా వంటపనీ, ఇంటిపనీ, పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూనే ఉపాధ్యాయిని పాత్రనూ పోషించవలసి వస్తోంది. స్త్రీ, పురుష బాధ్యతల మధ్య అసమానతలు కొనసాగుతున్న పరిస్థితిలో గృహిణికి ఇదెంత భారమో ఊహించగలం. స్కూలు ఫీజులూ, ఇతరత్రా వసూళ్ల రూపంలో వేలు, లక్షలు ధారపోస్తున్నా తల్లితండ్రులకు ‘టీచరీ’ రూపంలో ఈ అదనపు చాకిరీ తప్పడం లేదు. ఆటపాటలతో సహా ఇతరేతర మానసికోల్లాసాలకు ఒకటి, రెండు గంటలైనా ఒత్తిడి లేని స్వేచ్ఛా సమయం చిక్కని పిల్లల పాలిట చదువు అక్షరాలా ‘నిర్బంధ’ విద్యే అవుతోంది. విద్యాసంస్థలు చదువు బరువు తగ్గించకుండానే అదనపు వేళల్లో ఆటపాటల బరువునూ మోపడంతో పిల్లలకసలే ఊపిరి సలపడం లేదు. దేశంలో విద్యాబోధన ఎంత శాస్త్రీయంగా జరుగుతోందో పట్టించుకునే వ్యవస్థ అసలేదైనా ఉందా, చదువులు పిల్లల శారీరక మానసిక వికాసానికేమైనా సాయపడు తున్నాయా అన్న ప్రశ్నలు తల్లితండ్రుల నుంచే ఎదురవుతున్నాయి. పరీక్షలలో సాధించాల్సిన మార్కుల గరిష్ఠ శాతం కూడా ఇప్పుడు మారిపోయింది. తదుపరి చదువుకు ఏ ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలోనైనా సీటు రావడానికి డెబ్బై, ఎనభై శాతం మార్కులు కూడా సరిపోవడం లేదు, తొంభై శాతం దాటి తీరాల్సిందే. దాంతో పిల్లల్లో పోటీ, అసూయ, అలజడి, ఆందోళన, ఒత్తిడి పెరిగి పోతున్నాయి. తమ చదువూ, భవిష్యత్తుల గురించి తల్లితండ్రులు కనే కలల భారం పిల్లల కను రెప్పల మీద పడి వాళ్ళ నిద్రను హరిస్తోంది.పిల్లల్లో గ్రహణశక్తి, చురుకుదనం పెరిగిన మాట నిజమే కానీ, మొత్తంగా నేటి ఈ చదువుల తీరు ఆదర్శవంతమేనా అన్న సందేహం మాత్రం వదలకుండా వేధిస్తూనే ఉంది. ఇక చదువుల్లో రకరకాల అసమానతలు పెరగడమే తప్ప తగ్గుతున్న జాడలేదు. ఉజ్జ్వల భవిష్యత్తు వైపు నడిపించే చదువుల నిచ్చెనపై చివరి మెట్ల మీద చతికిల బడుతున్నవారు నేటికీ అసంఖ్యాకమే. ఇంకోవైపు నూటికి నూరుశాతం అక్షరాస్యతను సాధించడానికి ప్రభుత్వాలు ఇప్పటికీ ఆపసోపాలు పడుతూనే ఉన్నాయి. నూటయాభయ్యేళ్ళ క్రితం, బ్రిటిష్ వలస పాలన ప్రారంభం నాటికి మూడు శాతం పైచిలుకు ఉన్న అక్షరాస్యత ఇప్పుడు ఎనభై శాతానికి చేరడం, విడిగా చూసినప్పుడు ఒకింత ఊరటే కానీ, ఎన్నో దేశాలతో పోల్చితే ఈ పెరుగుదల వేగమూ, శాతమూ ఏమంత విశేషం కావని పెదవి విరిచేవారూ ఉన్నారు. ఇందులో మళ్ళీ ప్రాంతీయంగా, జెండర్ పరంగా అంతరాలూ యథాతథం. ఎప్పుడో కానీ సోదిలోకి రాని ఈశాన్య రాష్ట్రాలు అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉండటం ఒక విశేష మైతే, ఎంత ప్రామాణికమో తెలియదు కాని, బిహార్‌తో కలసి ఆంధ్రప్రదేశ్ ఆ పట్టికలో అడుగు బొడుగు స్థానాలలో కనిపించడం కలవరపరిచే విషయం. ఇక చదువుల నాణ్యత విషయానికొస్తే, పట్టికలో మన దేశం స్థానం ఉసూరుమనిపించే మరో అధ్యాయం. చదువుకీ, మంచి రాబడిగల ఉద్యోగాలకూ పీటముడి పడిన దశలో విద్యాభ్యాసం పూర్తిగా పరుగు పందెంగా మారి పిల్లల్ని విపరీత శ్రమకూ, అలసటకూ గురిచేస్తున్న మాట నిజం. చదువుల మరో పరమార్థమైన జ్ఞాన సముపార్జనకు కూడా పెద్ద పీట వేస్తూ ఎప్పటికది నిలకడ తెచ్చుకుంటుందో, పిల్లల్ని పరీక్షల భయతీరాన్ని దాటించి వైజ్ఞానికపు వెలుగుల ఉల్లాస తీరం వైపు నడిపిస్తుందో కాలమే తేల్చాలి. -
మనుగడ కోసం ‘మహా’ కుట్ర!
సుభద్రాదేవి గర్భంతో ఉన్న సమయంలో ఒకసారి అర్జునుడు ఆమెకు యుద్ధరంగంలో పద్మవ్యూహానికి సంబంధించిన జ్ఞానాన్ని బోధిస్తున్నాడట! ఆమె నిద్రలోకి జారుకోవడాన్ని గమనించకుండా అర్జునుడు చెప్పడం కొనసాగిస్తుండగా గర్భస్థ శిశువైన అభిమన్యుడు ఊ... కొడుతూ వింటున్నాడట! పద్మ వ్యూహంలో ఎలా ప్రవేశించాలనే ఉపదేశాన్ని పూర్తిచేసి, ఎలా నిర్గమించాలనే కథను అర్జునుడు ప్రారంభిస్తాడు. అదే సమయంలో కృష్ణపరమాత్ముడు ప్రత్యక్షమై సుభద్ర నిద్రపోతు న్నది... ఇక చాల్లే అని ఆపించాడట! ఆ రకంగా అభిమన్యుడు పద్మవ్యూహ ప్రవేశాన్ని గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే క్షుణ్ణంగా నేర్చుకోగలిగాడు. భారత రామాయణాది ఇతిహాసాలు, పురా ణాలు మన సంస్కృతిలో భాగం కనుక, వాటికి సంబంధించిన కథలన్నీ నమ్మాలనే కట్టుబాటు ఉన్నది కనుక ఈ కథను కూడా మనం నమ్ముతాము.ఈ కాలంలో కూడా అంతకు మించిన వండర్ టెలీపతీ ఉన్నదనే సంగతి నిన్ననే తెలిసింది. ‘ఏపీ పోలీస్–హ్యాకథాన్ –25’ అనే పేరుతో నిన్న గుంటూరులో ఒక టెక్నాలజీ సదస్సు జరిగింది. సందర్భం ఏదైనా సరే, టెక్నాలజీకి ఆది మధ్యాంతాలు తానేనని చెప్పుకోవడం చంద్రబాబు ఆనవాయితీ. అదే ఒరవడిని ఇక్కడ కూడా కొనసాగించారు. దేశంలో ఆటోలు, మోటార్ బైక్‌ల ఊబరైజేషన్ కోసం రూపొందించిన ‘ర్యాపిడో’ వృత్తాంతాన్ని ఆయన సభికులకు వివరించారు. ఆ యాప్‌ను రూపొందించిన వ్యక్తి తండ్రి గతంలో తెలుగుదేశం పార్టీ కార్య కర్తగా ఉండేవారట! అందువల్ల బాబు దగ్గరికి వస్తూపోతూ ఆయన చెప్పే సంగతులన్నీ వినేవారట. అలా విన్న ఫలితమే ఆయన కుమారుడు ర్యాపిడో యాప్‌ను డెవలప్ చేయడానికి కారణమైందట! చంద్రబాబు చేసిన జ్ఞానబోధ తండ్రి తలలోంచి తరంగయానం చేసి కుమారుడి మేధను తేజోమయం చేసిందన్నమాట!ఇటువంటి విడ్డూరాలను శషభిషలేమీ లేకుండా చెప్పు కోవడం చంద్రబాబుకు పరిపాటే! భారతదేశానికి ఐటీని పరి చయం చేసిందీ, సెల్‌ఫోన్ తీసుకొచ్చిందీ తానేనని చెప్పు కోవడం చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఎవరూ మరిచి పోకుండా ఉండడానికి ఆయన మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తూనే ఉంటారు. కలామ్‌ను రాష్ట్రపతిని చేసిందీ, వాజ్‌పేయికి జ్ఞానో దయం కలిగించి ‘స్వర్ణ చతుర్భుజి’ పథకానికి శ్రీకారం చుట్టించిందీ తానేనని కూడా ఆయన చెప్పుకున్నారు. సత్య నాదెళ్ల,పీవీ సింధు విజయాల వెనుక తన పాత్ర, కోవిడ్‌కు వ్యాక్సిన్ కనిపెట్టడం వెనుక తన దూరదృష్టీ వగైరాల గురించి పలు సందర్భాల్లో ఆయన నొక్కి వక్కాణించారు. ఇటువంటి వాగాడంబరాన్ని చూసి చాలామంది చాలారకాల అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. ఎటువంటి అనుమానమూ అవసరం లేదు. ఆయన పూర్తి స్వస్థతతోనే ఇలా మాట్లాడుతుంటారు. ఉద్దేశ పూర్వకంగానే ఆయన ఈ హాస్యరసాన్ని పండిస్తుంటారు.ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమైపోతుందనే గోబెల్స్ సూత్రాన్ని ఆయన తన పొలిటికల్ ఫిలాసఫీకి పునాదిగా భావిస్తారు. తాను వందసార్లు చెబితే వెయ్యిసార్లు రీసౌండ్ ఇచ్చేందుకు యెల్లోమీడియా ఉండనే ఉన్నది. ఈ సూత్రాన్ని ప్రత్యర్థులను అప్రతిష్ఠ పాల్జేయడానికీ, తనను ప్రమోట్ చేసు కోవడానికీ రెండు వైపులా పదునున్న కత్తిలా ఆయన వాడుతుంటారు. ఇప్పుడీ కత్తిని దూయడం బాగా ఎక్కువైంది. తనకి ప్పుడు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న అఖండ ప్రజాదరణ ఆయనకు కలవరం కలిగిస్తున్నది. ఇంచుమించు తన రాజకీయ అనుభవంతో సమానమైన వయసున్న జగన్ మాస్ ఇమేజ్ ఎన్ని జన్మలెత్తితే తనకు లభించాలి? లభించదు! అందుకే ఆయనపై దాడి. ఆయన వ్యక్తిత్వంపై కనీవినీ ఎరుగని దాడి. కోడికత్తి, తల్లీ – చెల్లీ, బాబాయ్–గొడ్డలి అనే పసలేని పదబంధాలతో అరిగిపోయిన రికార్డుల్నే ఆశ్రయిస్తూ చేస్తున్న అనైతిక దాడి. మద్య నియంత్రణ కోసం జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఒక మంచి పాలసీకి సైతం అవినీతి మరక అంటించేందుకు ఆపసోపాలు పడుతూ చేస్తున్న అసహ్య కరమైన దాడి.ఏడాది గడిచిపోయింది. జగన్ వ్యక్తిత్వ హననం కోసం ఎక్కుపెట్టిన దాడులు, ఆయన పార్టీ శ్రేణుల్ని చెల్లాచెదురు చేయడానికి పెడుతున్న కేసులు, చేస్తున్న అరెస్టులు ఫలిత మిస్తున్న సూచనలేవీ కనిపించడం లేదు. పైపెచ్చు ఎదురుదాడి మొదలైంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక గళం వీధివీధినా ప్రతిధ్వనిస్తున్నది. ఇక వ్యక్తిత్వ హనన కార్యక్రమమొక్కటే సరిపోదని, ఇంకేదో పెద్ద దాడే జరపాలని భావిస్తున్నట్టు పలు వురు అనుమానిస్తున్నారు. జగన్‌పై ఏదో దారుణమైన కుట్ర జరుగుతున్నదని రాష్ట్ర ప్రజలు బహిరంగంగానే శంకిస్తున్నారు. ఈ అనుమానాలను నిజం చేస్తూ జగన్‌ను ఉద్దేశించి ‘ఆ భూతం తిరిగి రాదు, భూస్థాపితం చేస్తాన’ని ముఖ్యమంత్రి చెబు తున్నారు. టీవీ ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. పెట్టుబడిదారు లతో జరిగే సమావేశాల్లో చెబుతున్నారు. పోలీసు అధికారుల సమావేశాల్లోనూ అదే రాజకీయ ఉపన్యాసం. కలెక్టర్ల మీటింగ్ లోనూ అదే తరహా సంస్కారహీనమైన ప్రసంగం.‘జగన్ మళ్లీ వస్తే ఎలా’ అని పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎప్పుడు ప్రశ్నించారో తెలియదు. జగన్ హయాంలో పారి పోయిన కంపెనీలేమిటో చెప్పరు. కూటమి వచ్చాక రూపాయికి ఎకరం ఇస్తామంటే తప్ప పరుగెత్తుకొచ్చిన ఇతర కంపెనీలేమిటో చెప్పరు. నిజానికి వాస్తవాలను పరిశీలిస్తే పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. కూటమి నేతల కప్పం డిమాండ్లకు బెదిరి‘ఇండియా సిమెంట్స్’ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. చెట్టినాడు, భవ్య సిమెంట్లు లంచాలివ్వలేక లాకౌట్లు ప్రకటించాయి. నవీన్ జిందాల్‌పై తప్పుడు కేసు పెట్టి వేధిస్తే జెఎస్‌డబ్లు్య కంపెనీ రాష్ట్రాన్ని వదిలేసి మహారాష్ట్రలో 3 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నది. మామూళ్ళ కోసం కూటమి నేతలు యూబీ కంపెనీ లారీలను అడ్డుకున్న ఖ్యాతి ఢిల్లీ సర్కార్‌ను కూడా తాకింది. గ్రీన్‌టెక్ రీమిక్స్‌లో, కోకాకోలా ప్లాంట్‌లో స్థానిక ఎమ్మెల్యేలు లంచాలు డిమాండ్ చేసి రచ్చ కెక్కారు. రామాయపట్నం పోర్టు పనుల్లో వాటా కోసం ఎమ్మెల్యే లారీలను అడ్డుకొని గబ్బు లేపాడు. కూటమి పాలనలో ఇటువంటి ఘటనలను డజన్లకొద్దీ ఉదాహరించవచ్చు.ఇక రూపాయికి ఎకరం కోటా పెట్టుబడిదారులను మిన హాయించి కూటమి సర్కార్ తెచ్చిన పెట్టుబడులు ఏమున్నాయి? ఎన్టీపీసీ వాళ్ళు గ్రీన్ ఎనర్జీ కోసం లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు జగన్ హయాంలోనే ఒప్పందం కుదిరింది. దానికి సంబంధించిన పరిపాలనా అనుమతులు, భూ బదలాయింపులు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు దాన్ని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. జగన్ హయాంలో ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే పది లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరి గాయి. ‘అవి మా ఘనతే’నని ఇప్పుడు కూటమి సర్కార్ ప్రక టించుకుంటున్నది. జగన్మోహన్రెడ్డి దావోస్‌లో ఆదిత్య మిట్టల్‌తో సమావేశమై స్టీల్ ప్లాంట్ స్థాపనకు ఒప్పందం చేసుకుంటే అది కూడా బాబు తన జేబులో వేసుకున్నారు. నిజం చెప్పాలంటే ఏపీలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగం పారి శ్రామికవేత్తలను భయకంపితులను చేస్తున్నది. రాష్ట్రానికి రావడా నికి వారు నిరాకరిస్తున్నారు. కాని, జగన్‌కు భయపడి పరిశ్ర మలు వెళ్ళిపోయాయనే తప్పుడు ప్రచారాన్ని మాత్రం కూటమి నేతలు హోరెత్తిస్తున్నారు. యెల్లో మీడియా గగ్గోలు పెడు తున్నది.జగన్‌ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు ఒకటికి రెండు సార్లు అనగానే, ఓ వృద్ధ నేత జగన్ తల నరుకుతానంటూ బీపీ పెంచుకుంటాడు. ఒకరి తర్వాత ఒకరు చొప్పున కూటమి నేతలు ఇటువంటి ప్రకటనలే చేస్తారు. జగన్మోహన్రెడ్డి జనంలోకి వెళ్తున్నప్పుడు ఆయనకు ఇవ్వాల్సిన జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను నిరాకరించడం ద్వారా కూటమి సర్కార్ తన ఉద్దేశాన్ని బయటపెట్టుకుంటున్నది. ఆయనొక విశేష ప్రజా దరణ కలిగిన మాస్ లీడర్. ఆయన బయటకు వెళ్ళినప్పుడు ప్రజలు ఏ స్థాయిలో ఆయన వెంట నడుస్తా రన్నది అనేకమార్లు రుజువైంది. పోలీసులకు ప్రత్యేకంగా చెప్ప వలసిన పని లేదు. రాప్తాడు హెలిప్యాడ్‌ను అసంఖ్యాక జన సమూహం చుట్టుముట్టిన విజువల్స్‌ను టీవీల్లో చూడలేదా? ఆయన రోడ్డు ప్రయాణాల్లో వాహనాన్ని చుట్టుముట్టి కారు బానెట్‌పైకి కూడా ఎగబాకడం కనిపించలేదా? ఆయనకు ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకపోతే ఆయనంటే గిట్టని శక్తులు సమూహంలో చొరబడి ఆయన సమీపానికి చేరుకునే అవకాశం లేదా? అటువంటిదేదో జరగాలనే ఉద్దేశం లేకపోతే ఆయన భద్రతను ఎట్లా ఉపేక్షిస్తారు? ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, కుట్రపూరిత నిర్లక్ష్యం!ఈ వ్యవహారంపై పోలీసులు చెబుతున్న కహానీ చిత్రంగా ఉన్నది. మేము వందమందికి మాత్రమే అనుమతిచ్చాము, కానీ వాళ్ళు వేలాదిమంది వెళ్లారని పోలీసుల అభియోగం. ప్రజలు వేలాదిగా తరలిరావాలని జగన్మోహన్రెడ్డి గానీ, ఆయన పార్టీ వాళ్ళు గానీ దండోరా వేయలేదే? వార్త తెలిసిన ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వాళ్ళను అడ్డుకోవడానికి రెంటపాళ్ల చుట్టూ ఇరవై చెక్‌పోస్టులు పెట్టి పోలీసుల్ని మోహరించారు కదా! నియంత్రించగలిగారా? రోడ్డు మీద అడ్డుకుంటే చేలల్లోంచి, చెలకల్లోంచి, వంకల్లోంచి, డొంకల్లోంచి తండోప తండాలుగా జనం చేరుకోలేదా? చెక్‌పోస్టుల్లో మోహరించిన పోలీసు సైన్యాన్ని జగన్ భద్రత కోసం కేటాయిస్తే అవాంఛనీయ సంఘటనలేమీ జరగవు కదా! అవాంఛనీయ ఘటనలు జరగా లన్నదే ప్రభుత్వ ఉద్దేశమైనపుడు, అందుకోసమే కుట్ర చేస్తున్నప్పుడు ఈవిధంగా ఆలోచించడం కూడా కుదరని పని.ఈ కార్యక్రమంలో ఒక వైసీపీ అభిమాని దురదృష్టకర మరణాన్ని కూడా కుట్రపూరిత కథకు ఉపయోగించుకోవడం రోత పుట్టించే చర్య. మరో కారు కింద పడి గాయాలైన సింగయ్య మృతి చెందాడని ప్రకటించిన ఎస్పీ, మూడు రోజుల తర్వాత ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ప్లేటు మార్చిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారు. ఒక ఫేక్ వీడియోను సృష్టించి జగన్ ప్రయాణించే కారు కిందనే పడి సింగయ్య మర ణించాడనే కథను ప్రచారం చేశారు. మూడు నాలుగు రోజుల పాటు యెల్లో మీడియా దీనిపై వీరంగం వేసింది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ లోకల్ నాయకురాలు మాత్రం కూటమి తానా అంటే తందానా అనే స్థాయికి దిగజారిపోయారు. సింగయ్య మరణంపై ఎస్పీ ముందుగా చెప్పిన ప్రకారం నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌కు వర్తించే సెక్షన్లపై కేసులు పెట్టారు. జగన్మోహన్రెడ్డి కారును రంగంలోకి దించిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే ప్రమాదం చేసినట్టు సెక్షన్లు మార్చారు. తమ పార్టీ కార్యకర్తను జగన్మోహన్రెడ్డితో పాటు అందులో ఉన్న వాళ్లంతా హత్య చేసే ఉద్దేశంతో కారు ఎక్కించారట! వాహనం ప్రమాదం చేస్తే అందులో ఉన్న ప్రయాణికులు ఎట్లా బాధ్యత వహిస్తారని ఉన్నత న్యాయస్థానమే చీవాట్లు వేయవలసి వచ్చింది. సాక్ష్యాధా రాలతో మళ్ళీ వస్తామని ప్రభుత్వ లాయర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. మరి ఏ సాక్ష్యాలున్నాయని కూటమి నేతలు, యెల్లో మీడియా నిపుణులు వీరంగం వేశారో?జగన్ భద్రతపై కూటమి సర్కార్ కపట నాటకమాడు తున్నది. ఒక ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన భద్రతను ఇస్తున్నామని హోంమంత్రి చెబుతున్నారు. జగన్మోహన్రెడ్డి కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనా? ఒంటరిగా పోటీలోకి దిగిన ఆయన పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి. మూడు పార్టీల కూటమికి 55 శాతం ఓట్లు పడ్డాయి. అవన్నీ నిజంగానే పడ్డాయని వాదన కోసం ఒప్పుకుందాం. 2024 ఎన్నికలపై పరిశోధన చేసిన వోట్ ఫర్ డెమోక్రసీ (విఎఫ్‌డీ) అనే సంస్థ అనేక అనుమానాలు వ్యక్తం చేసిన సంగతిని వదిలేద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసి ఎనిమిది గంటలకు తుది ప్రకటన చేసిన తర్వాత, వారం రోజుల పిదప అనూహ్యంగా పన్నెండున్నర శాతం ఓట్లు పెరిగిన మాయాజాలాన్ని కూడా వదిలేద్దాం. ఈవీఎమ్లలో ఎన్నికలు జరిగితే నూటికి నూరుపాళ్లు ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉన్నదని ఎలాన్ మస్క్ లాంటి వాళ్లు ఎంతోమంది చెబుతున్న విషయాన్ని పక్కనపెడదాం. ఈవీఎమ్‌లతో జరుగుతున్న ఎన్ని కల్లో అక్రమాలు జరుగుతున్నాయనీ, అందుకు సాక్ష్యాలున్నా యనీ అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్ చెబుతున్న మాటల్ని కూడా పెడచెవిన పెడదాం. అయినా మూడు పార్టీలకు కలిసి వచ్చిన ఓట్లు 1 కోటీ 53 లక్షలు. జగన్ ఒక్కడికే 1 కోటీ 33 లక్షల ఓట్లు పడ్డాయి. తేడా ఇరవై లక్షలు. వారంరోజుల తర్వాత అనూహ్యంగా పెరిగిన ఓట్లు 49 లక్షలని విఎఫ్‌డీ ప్రకటించింది. అయినా, జగన్ కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనా? ఇటు వంటి సాకులతో జగన్ భద్రతను ప్రమాదంలో పడేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తే, ఆయనకు పార్టీ కార్యకర్తలే రక్షణ కవచమవుతారు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
దారి మరిచిన ఎస్సీవో!
ఆర్భాటంగా ఏర్పడటం, ఘనంగా లక్ష్యాలు చాటుకోవటం, కీలక సమయాల్లో మొహం చాటేయటం ప్రాంతీయ సహకార సంస్థలకు అలవాటుగా మారింది. సంక్షుభిత ప్రపంచంలో సమస్యలు రావటం సహజమే అయినా, దేశాల మధ్య తలెత్తే విభేదాలు అలాంటి సంస్థల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆ సంస్థల వల్ల ఉద్రిక్తతలు ఉపశమిస్తాయనుకోవటం అమాయకత్వమని రుజువు చేస్తున్నాయి. సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) అవస్థ అలాగే ఉంది. ఆ సంస్థ రక్షణ మంత్రుల స్థాయి శిఖరాగ్ర సదస్సు రెండు రోజులు జరిగి గురువారం చైనాలోని చింగ్దావ్లో ముగిశాక విడుదల కావాల్సిన ఉమ్మడి ప్రకటన భారత్ కారణంగా మూలన పడింది. ఆ ప్రకటనపై సంతకం చేసేందుకు మన రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిరాకరించటంతో చేసేదేమీ లేక ఉమ్మడి ప్రకటన ఆలోచనే విరమించుకున్నారు. ఈ సదస్సుకు మన దేశంతోపాటు చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాన్, కిర్గిజ్ రిపబ్లిక్, కజఖ్‌స్తాన్ తదితర దేశాల రక్షణమంత్రులు హాజర య్యారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటం ఎలా అనే అంశంపై సదస్సు జరిగింది. ఎస్సీవో 2001లో షాంఘైలో ఏర్పడినప్పుడు అది అందరిలో ఆశలు రేకెత్తించింది. ఎందుకంటే మధ్య ఆసియా దేశాల భద్రత, అభివృద్ధిపైనే ప్రధానంగా కేంద్రీకరిస్తామని సంస్థ తెలిపింది. భారత్, చైనాల మధ్య ఏనాటి నుంచో సరిహద్దు వివాదాలున్నాయి. ఇక పాకిస్తాన్ నాలుగు దశా బ్దాలుగా సరిహద్దు చొరబాట్లను ప్రేరేపిస్తూ ఉగ్రవాద ఘటనలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఎస్సీవో వల్ల చైనా, పాక్‌లతో ఉన్న సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందన్న ఆశ ఉండేది. 2005 నుంచి మన దేశం పరిశీలక హోదాలో సదస్సులకు హాజరవుతూ వచ్చింది. 2017లో రష్యా అధినేత పుతిన్ చొరవతో భారత్ పూర్తి స్థాయి సభ్యదేశమైంది. కానీ, సభ్య దేశాల వ్యవహార శైలి దేని దారి దానిదే! ఎస్సీవో స్థాపనలో కీలక పాత్ర పోషించిన చైనాయే 2020 జూన్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)వద్ద చొరబాటు యత్నం చేసింది. చైనా సైన్యం రాళ్లతో, కర్రలతో, రాడ్లతో దాడి చేసి 21 మంది మన జవాన్ల ప్రాణాలు తీసింది. అంతకుముందూ, ఆ తర్వాతా చైనా తీరు అదే.తాజా శిఖరాగ్ర సదస్సులో విభేదాలకు దారితీసిన అంశం ఆశ్చర్యం కలిగిస్తుంది. మొన్న మార్చిలో పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసి పలువురు పాక్ సైనికులను హతమార్చారు. పాక్ సైన్యం కూడా ప్రతీకార దాడికి దిగి ఆ ఘటనలో పాల్గొన్న మిలిటెంట్లలో అత్యధికుల్ని కాల్చిచంపింది. ఆ మరుసటి నెలలో కశ్మీర్‌లోని పెహల్గామ్లో పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు నిరాయుధులైన పర్యాటకులపై దాడి చేసి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ రెండు దాడుల్లో కేవలం బలూచిస్తాన్ ఘటనను ఉమ్మడి ముసాయిదా ప్రకటన ప్రస్తావించి పెహల్‌గామ్‌ను మినహాయించింది. ఆ ఉదంతం తర్వాత మన దేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయటం, పాక్ సైన్యం దాడుల్ని తిప్పికొట్టడానికి వారి వైమానిక స్థావరాలను ధ్వంసం చేయటం పతాక శీర్షికలకెక్కాయి. ఆ ఘటనల పరంపర జరిగి నిండా నెల్లాళ్లు కాకుండానే ఎస్సీవో ఎలా మరిచి పోతుంది? చైనా, పాక్‌ల మధ్య సాన్నిహిత్యం ఉంది గనుక ఆ దేశం చెప్పి నట్టల్లా ఆడి ఉమ్మడి ప్రకటన రూపొందించటం, దానిపై మన దేశం సంతకం చేయాలని కోరుకోవటం తెలివితక్కువతనం కాదా? అసలు ఇలాంటి తీరుతెన్నులు సమష్టి తత్వాన్ని దెబ్బ తీస్తాయన్న స్పృహ ఉండొద్దా?ఎస్సీవో స్థాపించిన కాలంకన్నా ఇప్పుడు ప్రాంతీయంగా సవాళ్లు ఎన్నో రెట్లు పెరిగాయి. ఉగ్రవాదం వల్ల ఈ ప్రాంత శాంతికీ, భద్రతకూ ముప్పు ఏర్పడుతోంది. దేశాల మధ్య పరస్పరం అవిశ్వాసం కూడా గతంతో పోలిస్తే ఎంతగానో పెరిగింది. ఈ సమయంలో ఎస్సీవో వంటి సంస్థ ఈ సమస్యలకు అర్థవంతమైన పరిష్కారం ఆలోచించాలి. కానీ జరిగిందంతా వేరు. ఈ సదస్సులో ప్రసంగించిన రాజ్‌నాథ్ సింగ్ అన్నట్టు రాజ్యేతర శక్తుల వల్లా, ఉగ్రవాద ముఠాల వల్లా ప్రమాద కరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి వెనకున్న దేశాలు ఆ పరిస్థితుల పర్యవసానాలను ఎదుర్కొని తీరాలని కూడా ఆయన అన్నారు. రాజ్‌నాథ్ ప్రసంగంలో పెహల్గామ్, ‘ఆపరేషన్ సిందూర్’ ప్రస్తావనకొచ్చాయి. అయినా ముసాయిదా ప్రకటన వాటిని మరిచినట్టు నటించింది.ఎస్సీవోను సభ్యదేశాలు తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి తప్ప సమష్టిగా అడుగులేయాలన్న సంకల్పం ప్రదర్శించటం లేదు. ఈ సంస్థ చాటున తన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ)నూ, పలుకుబడినీ పెంచుకోవటమే చైనా ఎజెండా. సంస్థను మధ్య ఆసియా దేశాలకు మించి విస్తరింప జేయాలన్న ఉద్దేశంలోని ఆంతర్యం కూడా అదే. ఇక రష్యాకు ప్రధానంగా పాశ్చాత్య దేశాలతో లడాయి ఉంది. వాటిని ఎదుర్కొనటానికి సంస్థ ఎంతో కొంత తోడ్పడుతుందన్న ఆశ ఉంది. ఎస్సీవోను చిత్తశుద్ధితో నిర్వహిస్తే ఈ ప్రాంత దేశాలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎస్సీవో వాటా 23 శాతం. ప్రపంచ జనాభాలో వాటా 42 శాతం. సంస్థ పెట్టినప్పుడు సభ్య దేశాలమధ్య సైనిక సహకారం, నిఘా నివేదికల్ని పంచుకోవటం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటం, విద్య, ఇంధనం, రవాణా రంగాల్లో సహకరించుకోవటం వంటి ఉద్దేశాలున్నాయి. కానీ ఇవన్నీ మరిచి ముఠాలు కట్టి నచ్చినవారికి అనుకూలంగా వ్యవహరించదల్చుకుంటే ఇలాంటి సంస్థలెందుకు? ఈ గంభీరమైన లక్ష్య ప్రకటనలెందుకు? అందుకే ఎస్సీవో తీరు మారాలి. -
అంతరిక్షంలో మనవాడు!
నాలుగు దశాబ్దాల అనంతరం రోదసి నుంచి భారతీయ స్వరం మోగింది. మన వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతోపాటు అమెరికా, పోలెండ్, హంగేరీలకు చెందిన మరో ముగ్గురు వ్యోమగాములు స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 12.01 నిమిషానికి 28 గంటల అంతరిక్షయాత్ర ప్రారంభించారు. వీరు అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు చేరుకుని 14 రోజులపాటు దాదాపు 60 పరిశోధనలు చేస్తారు. ‘మేం భూకక్ష్యలో తిరుగుతున్నాం. భారత మానవ అంతరిక్ష కార్యక్రమం మొదలైంద’ంటూ శుభాంశు శుక్లా పంపిన సందేశం ఈ మొత్తం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న శాస్త్రవేత్తల్లో భావోద్వేగం కలిగించింది. ఎప్పుడో 1984లో రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర చేశాక భారత్ నుంచి మరొకరు వెళ్లటం ఇదే ప్రథమం. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ యాత్ర ప్రారం¿¶ మైంది. గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఐఎస్ఎస్... ప్రతి 90 నిమిషాలకూ భూకక్ష్యలో ఒక రౌండ్ పూర్తిచేస్తుంది. ఆ కారణంగా మన శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు రోజూ 16 సూర్యోదయాలనూ, 16 సూర్యాస్తమయాలనూ వీక్షిస్తారు. అవనిపై ఎలావున్నా అంతరిక్షంలో దేశాల మధ్య ఇంతవరకూ కొనసాగుతున్న సహకారానికీ, సమన్వయానికీ ఐఎస్ఎస్ ఒక ప్రతీక. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, రష్యా సంస్థ రోస్కాస్మోస్, జపాన్ సంస్థ జాక్సా, కెనడా అంతరిక్ష సంస్థ సీఎస్‌ఏలు ఉమ్మడిగా ఐఎస్ఎస్ నిర్మాణానికి ముందుకు కదిలాయి. అంతరిక్షంలో ప్రపంచ దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలని, దాన్ని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించాలని, అక్కడి పరిశోధనల ఫలితాలు సమస్త మాన వాళికి అందించాలన్న లక్ష్యాలతో ఐఎస్ఎస్కు అంకురార్పణ జరిగింది. రెండున్నర దశాబ్దాల క్రితం గనుక ఇదంతా కుదిరింది. వర్తమానంలో ఇది సాధ్యమయ్యేదా? ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ రచయిత ఆర్థర్ సి. క్లార్క్ చాన్నాళ్ల క్రితం ‘ఈ విశాల విశ్వంలో రెండే రెండు సంభావ్యతలుంటాయి... అవి–మానవాళి ఒంటరైనా కావాలి లేదా కాకపోవాలి’ అన్నారు. సకల అంతరిక్ష యాత్రల సారాంశం దాన్ని ఛేదించటమే. ఈ క్రమంలో ఐఎస్ఎస్ ఒక సాధనం. ప్రయోగశాలగా, భిన్న సాంకేతికతల నిగ్గుతేల్చేదిగా భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో సేవలందిస్తున్న ఐఎస్ఎస్ ఇప్పటికి భిన్న శాస్త్రాల్లో 4,000 ప్రయోగాలకు వేదికైంది. జీవశాస్త్రం మొదలుకొని ఔషధాల వరకూ... భూ విజ్ఞాన శాస్త్రాలు మొదలుకొని భౌతిక శాస్త్రం వరకూ... పర్యావరణ పర్యవేక్షణ నుంచి అంతరిక్ష అన్వేషణ వరకూ ఎన్నెన్నో అంశాల్లో ఐఎస్ఎస్ వ్యోమగాములకు తోడ్పాటునందిస్తోంది. గురుత్వాకర్షణ శక్తి బలంగావుండే భూ వాతావరణంలో కొన్ని కొన్ని పరిశోధ నలు అసాధ్యమవుతాయి. అత్యంత సూక్ష్మ గురుత్వాకర్షణ కలిగి భారరహిత స్థితిలో ఉండే ఐఎస్ఎస్లో సంక్లిష్టమైన పరిశోధనలూ, ప్రయోగాలూ చేయటం, వాటినుంచి ఫలితాలు రాబట్టడం ఎంతో సులభం. ఇవి మనిషి జీవితాన్ని సుఖవంతం చేయగల అనేక సృజనాత్మక సాంకేతికతల ఆవిష్కరణకు తోడ్పడ్డాయి. కమ్యూనికేషన్ల రంగంలో, వనరుల యాజమాన్య నిర్వహణలో, తాగు నీరు స్వచ్ఛతకు వినియోగించే సాంకేతికతల రూపకల్పనలో, అంతరిక్ష యాత్రకు పనికొచ్చే అధు నాతన సాంకేతికతల అభివృద్ధిలో ఈ పరిశోధనలు ఉపయోగపడ్డాయి. అంతేకాదు... మానవాళి భవిష్యత్తు అంతరిక్ష అన్వేషణలకు ఐఎస్ఎస్ వేదికవుతున్నది. ఐఎస్ఎస్ భూమ్మీద రూపొందించి ప్రయోగించింది కాదు. అది కొన్ని రోజుల్లోనో, నెలల్లోనో పూర్తయినది కూడా కాదు. అందుకు దాదాపు పదమూడేళ్లు పట్టింది. అందులోని విడిభాగాల్లో ఎవరేమి తయారుచేయాలో, ఎప్పుడు పట్టుకెళ్లాలో సమగ్ర ప్రణాళికలు రూపొందించుకోగా, 1998 నవంబర్‌లో మొదలుపెట్టి 2011 వరకూ పునర్వినియోగ అంతరిక్ష నౌకలద్వారా, రష్యన్ రాకెట్ల ద్వారా 30 దఫాలు వందకుపైగా ఐఎస్ఎస్ విడిభాగాలు, సౌరశక్తి ప్యానెళ్లు, కేబుళ్లు వగైరాలు చేర్చారు. వ్యోమగాములు స్పేస్‌వాక్ చేస్తూ ఈ కేంద్రానికి రూపకల్పన చేశారు. నిద్రపోవటానికీ, తిండికీ, వ్యాయామాలకూ, పరిశోధనలకూ ఇక్కడి నుంచి ప్రయోగించిన మాడ్యూళ్లు తోడ్పడ్డాయి. మొదట్లో ఇది గరిష్ఠంగా 2020 వరకూ పనిచేయొచ్చని అంచనా వేయగా ఇప్పటికీ నిక్షేపంలా ఉంది. తాజా అంచనా ప్రకారం 2030తో దీని జీవితకాలం పూర్తవుతుందని, ఆ తర్వాత కక్ష్య తప్పించి నేలపై పడేవిధంగా చర్యలు తీసుకోవచ్చని భావిస్తున్నారు. కానీ ట్రంప్ ఏలుబడి మొదల య్యాక 2030 కన్నా ముందే దాన్ని దించేయాలని ఎలాన్ మస్క్ వాదించటం మొదలుపెట్టారు. ప్రస్తుతం మస్క్ స్థానమేమిటన్న దాన్నిబట్టి ఐఎస్ఎస్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. మామూలుగా దూరప్రాంతాలకు వెళ్లినప్పుడే ఇంటిల్లిపాదీ ఎంతో భావోద్వేగానికి లోనవు తారు. అంతరిక్ష యాత్రంటే చెప్పేదేముంది? అందులో సాహసమూ, సమస్యలూ కలగలిసి ఉంటాయి. ఎన్నో త్యాగాలకు సిద్ధపడాలి. శిక్షణ కోసం అయినవాళ్లకు దూరంగా ఉండాలి. కష్టతరమైన వ్యాయామాలు తప్పనిసరి. శుభాంశు వీటన్నిటినీ తట్టుకుని నిలబడ్డాడు. వాయుసేన నుంచి అంతరిక్షయాత్ర వైపు అడుగులేశాడు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు ఇప్పుడు 140 కోట్లమంది భారతీయుల ఆకాంక్షలనూ, నమ్మకాలనూ మోసుకెళ్లాడు. యువతకు స్ఫూర్తిగా నిలిచాడు.శుభాంశు యాత్ర దిగ్విజయం కావాలని, మరో ముగ్గురితో కలిసి ఆయన సాగించే ప్రయోగాలూ, పరిశోధనలూ మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని దేశ పౌరులంతా ఆకాంక్షిస్తున్నారు. -
ఎవరి కోసం ఈ యుద్ధం?
అకారణ యుద్ధాలతో నిండా మునిగి, ఆర్థికంగా పతనావస్థకు చేరుకున్న అమెరికా, మరోసారి పశ్చిమాసియా రణరంగంలో దూకి తన మూర్ఖత్వాన్ని చాటుకుంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ‘నాకెందుకో నోబెల్ బహుమతి రావటం లేద’ని వగచి 48 గంటలు కాలేదు... తన యుద్ధోన్మాదాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఇంటా బయటా ‘వద్దుగాక వద్ద’ని మొత్తుకుంటున్నా, ఆంక్షలతో బక్కచిక్కిన ఇరాన్‌పై తన ప్రతాపాన్ని చూపారు. ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’ పేరిట శనివారం అర్ధరాత్రి దాటాక అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ కొండప్రాంతాల్లోని భూగర్భంలో వున్న ఫోర్దో, నతాంజ్, ఇసాఫన్ అణుస్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో అమెరికా చెబుతున్నట్టు ఆ స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయా లేదా అన్నది ఇంకా తెలియాల్సివుంది. కానీ ఫోర్దో కేంద్రంపై సోమవారం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు మరోసారి దాడి చేశాయన్నది గమనిస్తే తీవ్ర నష్టం కలిగివుండొచ్చనిపిస్తోంది. ఇందుకు ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్ నగరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఎన్నడూలేని విధంగా హోర్ముజ్ జలసంధిని మూసేయాలని ఇరాన్ కేబినెట్ నిర్ణయించటం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై పిడుగుపాటే. ఇరాన్‌పై అమెరికా పగ ఈనాటిది కాదు. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం అనంతరం అమెరికా రాయబార కార్యాలయంపై దాడిచేసి 52 మంది దౌత్యవేత్తలనూ, పౌరులనూ 444 రోజుల పాటు బందీలుగా చేసిన వైనాన్ని ఆ దేశం మరిచిపోలేకపోతోంది. బందీలను విడిపించ టానికి అప్పటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ‘ఆపరేషన్ ఈగిల్ క్లా’ సైతం విఫలమైంది. ఆ పరాభవంనుంచి కోలుకోలేక ఏదో సాకుతో ఆంక్షలు విధిస్తూనేవుంది. ఆ తర్వాత 1980లో అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను ఇరాన్‌పైకి ఉసిగొల్పింది. ఎనిమిదేళ్ల ఆ యుద్ధం రెండు దేశాలనూ దెబ్బతీయగా, అమెరికా ఆయుధ విక్రయంతో బాగుపడింది. అటుపై అడపా దడపా ఇజ్రాయెల్‌తో దాడులు చేయిస్తూనే ఉంది. కొత్త కొత్త ఆంక్షలతో ఇరాన్‌ను దెబ్బతీస్తూనే ఉంది. తీరికూర్చుని వేరే దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, వనరుల కైంకర్యానికి ప్రయత్నించటం అమెరికా విదేశాంగ విధానంలో భాగం. ఇరాన్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన జాతీయవాది ప్రధాని మహమ్మద్ మొసాదిని 1953లో బ్రిటన్‌తో చేతులు కలిపి సైనికకుట్రతో కూల్చిన పాపం అమెరికాదే. అప్పట్లో బ్రిటన్ చేతుల్లోవున్న ఇరాన్ చమురు కంపెనీని జాతీయం చేయటంతో రెండు దేశాలూ ఈ దుస్సాహసానికి ఒడిగట్టాయి. అటుపై తమ కీలు బొమ్మ మహ మ్మద్ రెజా పెహ్లవీని అందలమెక్కించాయి. రెండు దశాబ్దాలు గడవకుండానే అతగాడు పదవీభ్ర ష్టుడయ్యాడు. ఇస్లామిక్ దేశాల్లో అమెరికా జోక్యంతో ఛాందసవాదుల ప్రాబల్యం పెరగటం 1953 నాటి ఇరాన్‌తో మొదలుపెట్టి ఇటీవలి బంగ్లాదేశ్ వరకూ కనబడుతూనే ఉంది. అఫ్గానిస్తాన్, ఇరాక్, లిబియా, లెబనాన్, సోమాలియా, సిరియా వగైరాలన్నీ ఇందుకుదాహరణ. అఫ్గాన్‌లో తాలిబన్లు మొదలుకొని సిరియాలో ఐఎస్ వరకూ అన్ని ఉగ్రవాద సంస్థల పుట్టుకకూ అమెరికాయే కారణం. డెమాక్రాట్లు మళ్లీ నెగ్గితే అమెరికాను సర్వనాశనం చేస్తారని, మూడో ప్రపంచయుద్ధానికి కారకు లవుతారని అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం చేసిన పెద్ద మనిషి ఇప్పుడు తానే ఆ పెను ముప్పు వైపు అడుగులేశారు. అమెరికన్ కాంగ్రెస్‌కు మాట మాత్రమైనా చెప్పలేదు. అంతర్జాతీయ చట్టాల్ని లేశమాత్రమైనా గౌరవించలేదు. చివరకు ఏమవుతుందోనన్న చింత అసలే లేదు. యుద్ధాల్ని ప్రారంభించటం తేలిక. వాటి ముగింపు ఎవరి వల్లా కాదు. వ్యక్తుల ఇష్టానిష్టాలకు అది లోబడి ఉండదు. అసలే పశ్చిమాసియా వైరుద్ధ్యాల పుట్ట. పరస్పరం కలహించుకునే దేశాలు అక్కడ డజనుకు పైగా ఉంటాయి. అలాంటిచోట ‘తగుదునమ్మా...’ అంటూ ట్రంప్ వేలెట్టి పెద్ద తప్పు చేశారు. కానీ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సింది... అమెరికన్ పౌరులూ, ప్రపంచ ప్రజానీకం.మూడున్నర దశాబ్దాల ఏలుబడిలో అలీ ఖమేనీకి ఇది పరీక్షా సమయం. దాడులకు లొంగి ట్రంప్‌తో దౌత్యానికి సిద్ధపడతారా లేక ఇజ్రాయెల్ అంతు చూసేదాకా వదలరా అన్నది తేలటానికి సమయం పడుతుంది. కానీ శక్తిమంతమైన అమెరికాపై ప్రతీకార దాడులకు దిగి భారీ నష్టానికి సిద్ధ పడకపోవచ్చు. అకారణ దాడులపై రౌద్రంగా ప్రకటనలిస్తున్నా ఆచరణ రూపం దాల్చక పోవచ్చు. అటు అమెరికా సైతం ఇరాన్ అణ్వాయుధ ప్రయత్నాలపై యుద్ధమే తప్ప ఆ దేశంపై యుద్ధం తమ ఉద్దేశం కాదంటోంది. కానీ ఇజ్రాయెల్, అమెరికాల ఉమ్మడి దురాలోచన ఇరాన్లో నాయకత్వ మార్పు... అమెరికా ప్రాపకంతో నడిచే ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వంటి ఆర్థిక సంస్థల ప్రమేయం లేకుండా సర్వస్వతంత్రంగా, నిటారుగా నిలబడగల్గిన ఇరాన్‌ను ‘ప్రధాన స్రవంతి’కి మళ్లించటం. ఆ రెండూ మాత్రం నెరవేరే అవకాశం లేనే లేదు. ఇరాన్లో పెట్టుబడులు లేవు గనుక అమెరికా ఎంతకైనా తెగిస్తుంది. కానీ మనకు ఆ దేశంతో ఆర్థికబంధం ఉంది. పాకిస్తాన్ ప్రమేయం లేకుండా మధ్య ఆసియా దేశాలతో, అఫ్గాన్‌తో నేరుగా, చౌకగా వాణిజ్యాన్ని నెరపగలిగే చాబహార్ పోర్టు ఇరాన్లో నిర్మించింది మనమే. కానీ ఆంక్షల కారణంగా అది అరకొరగా ఉంది. ఇరాన్ చౌకగా ఇచ్చే చమురును కూడా ఆ ఆంక్షల పర్యవసానంగానే కాలదన్నుకున్నాం. ఈ యుద్ధం ఉగ్రరూపం దాలిస్తే ఆర్థికంగా మరింత నష్టపోతాం. చైనా, రష్యాల పరిస్థితి కూడా ఇదే. అటు నాటో కూటమి సైతం అయోమయంలో పడింది. అందుకే ఈ మతిమాలిన యుద్ధం చాలించమని ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలన్నిటిపైనా ఉంది. -
పేరుకు చెడ్డపేరు?
వేసుకుంటే పాత ప్రశ్నే. పేరులో ఏమున్నది? గులాబీకి ఆ పేరు లేకపోయినా అది గులాబీ అయ్యేది కాదా? ఆ పువ్వుకు అంత అందం వచ్చేది కాదా? పేరు వల్ల కూడా అందం ఇనుమడిస్తుంది. పేరులో ఏమున్నది అనుకుంటే అందమైన పేర్ల కోసం ఆధునిక తల్లిదండ్రులు అంతగా ప్రయత్నించరు. ఈ అందం అనేది ఒక్కోసారి సాపేక్షం. అన్ని మతాల్లోనూ, సమాజాల్లోనూ పిల్లలకు పేరు పెట్టడం అనేది అనాదిగా పెద్ద పండుగ. నామకరణం తర్వాతే శిశువు నిజంగా ఈ భూమ్మీద ‘ఉనికి’లోకి వచ్చినట్టు!మనిషికి పేరు అనేది దానికదే ఒక చిరునామా. ఎవరికైనా తన పేరును మించిన అందమైన పిలుపు మరొకటి ఉండదు, అంతకంటే మంచి కవితను ఇంకే కవీ రాయలేడు. పేరు అనేది మనిషిని ఎప్పటికీ వదలని హేంగోవర్. ఆ పేరులోని ప్రత్యేకత కంటే, ఆ పేరును మళ్లీ మళ్లీ వినడం వల్ల అది వారికి ప్రత్యేకమైపోతుంది. శిశువు ఈ భూమ్మీదకు రాగానే కూడగట్టుకోగలిగే తొలి సొంత ఆస్తి కూడా ఈ పేరే. ఇంక దాన్ని పెంచుకోవడం, తగ్గించుకోవడం అన్నది ఒక జీవితకాల ప్రయాణం తర్వాతే తేలుతుంది. ప్రాచీన రోమన్ సామ్రాజ్యంలో శుద్ధీకరణ పేరుతో నామకరణోత్సవం జరిగేది. ఆడశిశువులకు ఎనిమిదో రోజున, మగపిల్లలకు తొమ్మిదో రోజున పేర్లు పెట్టేవారు. ఆడపిల్లలు మగపిల్లల కంటే త్వరగా ఎదిగి పరిపూర్ణత్వాన్ని పొందుతారనేది ఈ తేడాకు కారణం.పెట్టిన పేర్లు తికమకగా మారిపోవడం ఒక తమాషా. సుగుణ ఎంతటి గుణవంతురాలో మనకు తెలియదు. కోమలిది ఎలాంటి రూపమో ఊహించలేము. బలవంతరావు బలహీనంగా ఉండకూడదనేం లేదు. పేరుకు తగ్గట్టుగా మనిషి ప్రవర్తనను ఆశించడం కొన్నిసార్లు ఆశాభంగం కావొచ్చు. హరిశ్చంద్రుడు అబద్ధాలకోరు అవ్వకూడదనే కోరుకుంటాం. ధర్మరాజు అవినీతికి పాల్పడితే మరీ ఎక్కువ బాగోదు. పెట్టిన పేరుకు తగ్గట్టుగా ఉండలేక పిల్లలు సతమతమవడం మరో కోణం. కొన్ని పేర్లను కొందరు కుట్రపూరితంగా కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు మోసం. కానీ దాన్ని వాళ్లు ప్రేమ అనొచ్చు, స్నేహం అని పిలవొచ్చు. ఒక యుద్ధానికి ఏం పేరు పెడదామని అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ సలహా అడిగితే, ‘అనవసర యుద్ధం’ అందామని సలహా ఇచ్చారట బ్రిటన్ ప్రధాని చర్చిల్. తగిన పేరు!జనాలు తాము ఉన్నదాన్ని బట్టి తమ పేర్లను అందమైనవిగానో, వికారమైనవిగానో చేస్తారు అంటారు కెనడా రచయిత ఎల్.ఎమ్.మాంటొగోమెరీ. అది చాలావరకు నిజమే అయినా అన్నిసార్లూ నిజం కాదు. సూర్యకాంతం అంటే మనకు ఇప్పుడు ఒక పేరు కాదు. ఒక గయ్యాళి ముసలి. గిరీశం అంటే నక్కజిత్తులవాడే! భగవంతరావు అని వచ్చిందంటే ఒక స్థాయి మనిషి అనే అర్థం. పరమానందయ్య అనగానే వాలుకుర్చీలో విశ్రాంతిగా కూర్చునే సగటు మధ్యతరగతి మానవుడే. సాహిత్యమో, సినిమానో వేసే ముద్రలవల్ల కూడా పేర్ల స్వభావాలు మారిపోతాయి. కన్యాశుల్కం ఎంత గొప్ప నాటకమైనా లుబ్ధావధాన్లు, సౌజన్యారావు అంటూ పాత్రల పేర్లను వారి స్వభావాలకు తగ్గట్టుగా పెట్టడం కొంతమందికి నాటకీయంగా అనిపించింది. పాత్రకు తగ్గ పేరు పెట్టడం సహజం కాకపోయినా, ఔచిత్యం అనుకున్నారు మన రచయితలు. లేదంటే జనాలే పాత్రల పేర్లను మార్చేయొచ్చు. ఉదాహరణకు మహాభారతంలో ‘దుర్యోధనుడి’ పేరును సుయోధనుడు అనుకోనివాళ్లే ఎక్కువ. పిల్లల పేర్ల కోసం తల్లిదండ్రులు కొన్నిసార్లే తలలు బద్దలు కొట్టుకుంటారు. కానీ రచయితలు తాము సృష్టించే ప్రతి పాత్ర కోసం ఆ ‘పురిటి నొప్పులు’ పడాల్సిందే!‘డ్రాకులా’ అనగానే దవడల పక్కన తెరుచుకున్న కోరలతో, మెడను కొరికి పచ్చినెత్తురు తాగే భయానక ఆకారం గుర్తొస్తుంది. అన్ని సాహిత్య రూపాల్లో అత్యధికసార్లు (700కు పైన) పునరావృతం అయిన పాత్రగా ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. గాథిక్ శైలిలో నిర్మితమైన మధ్య యుగాల యూరోపియన్ భవనాలను ఒక వాతావరణం కోసం వాడుకుంటూ రాసిన గాథిక్ హారర్ సాహిత్యంలో ‘డ్రాకులా’ పేరుతోనే వచ్చిన నవల ఒక క్లాసిక్. సుమారు 125 ఏళ్ల క్రితం, 1897 మే 26న డ్రాకులా విడుదలైంది. అలాంటి గాథిక్ హారర్ సాహిత్యాన్ని డ్రాకులాకు ముందూ, తర్వాతా అని విభజిస్తారు వెండీ డోనిగర్. ఈ పాత్ర సృష్టికర్త లండన్‌లో స్థిరపడిన ఐరిష్ రచయిత బ్రామ్ స్టోకర్ (1847–1912) అనబడే అబ్రహామ్ స్టోకర్. ప్రపంచంలో డిటెక్టివ్ పాత్రలకు మోడల్‌గా నిలిచే షెర్లాక్ హోమ్స్‌ను సృష్టించిన ఆర్థర్ కానన్ డాయిల్ ఈయనకు దూరపు బంధువు కూడా! ‘ద ఫేట్ ఆఫ్ ఫెనెల్లా’(1891) పేరుతో 24 మంది రచయితలు రాసిన ఒక గొలుసుకట్టు నవలలో వీళ్దిద్దరూ కూడా భాగమయ్యారు. ఒకసారి లైబ్రరీలో బ్రామ్ స్టోకర్ ఏ పుస్తకాలో తిరగేస్తూవుంటే ‘డ్రాకులా’ అనే పేరు కంటబడింది. ఆ పేరులో ఆయనకు నిలువెల్లా దుష్టత్వం కనబడటమే కాక, దానికి అలాంటి అర్థమే ఉంటుందనుకున్నాడు. అందుకే ఆ పేరునే తన ప్రతినాయకుడికీ, నవలకూ వాడుకున్నాడు. ఇంతాచేస్తే ఈ డ్రాకులా అనేది ఒక వంశనామం. ఆగ్నేయ యూరప్ దేశమైన రొమేనియా పాలకుడు... వ్లాద్ డ్రాకులా. 15వ శతాబ్దిలో రొమేనియాను పాలించాడు. ఆయన్ని ఆ దేశ జాతీయ హీరోగా ఆరాధిస్తారు. ఈయన డ్రాకులా వంశంలో మూడోవాడు. ఈయన తండ్రి రెండో వ్లాద్ డ్రాకులా. అలాంటి పేరుకు ఈ నవల మచ్చ తెచ్చిందో, ఆ పేరును ఎప్పటికీ నిలిచేలా చేసిందో తీర్పునివ్వడం కష్టం. గులాబీకి గులాబీ అనే తగిన పేరు ఉండటం వల్లే అది పూరాణిగా రాణించిందా, ‘డ్రాకులా’కు డ్రాకులా అని పెట్టడం వల్లే అది ఒక పాత్రగా ఇంతగా నాటుకుపోయిందా చెప్పడం కష్టం. అది ఒక మనిషిని తన పేరుకు బదులుగా ఇంకొకటి చెప్పుకొమ్మనడం లాంటిది. -
జీ7 మేల్కొనదా?!
నానాటికీ మసకబారుతున్న ప్రతిష్ఠను కాస్తయినా పునరుద్ధరించుకోవాలన్న స్పృహ కూడా లేకుండా ఎప్పటిలా జీ7 రెండు రోజుల సమావేశాలు కెనడాలోని ఆల్బెర్టాలో పేలవంగా ముగిశాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం అంతూ దరీ లేకుండా కొనసాగుతుండగా, తాజాగా ఇరాన్‌పై అమెరికా అండతో ఇజ్రాయెల్ దండెత్తింది. కానీ రెండు విషయాల్లోనూ తన వైఖరి ఎలావుండాలో, ఏం చేయాలో జీ7 తేల్చుకోలేకపోయింది. సమావేశాల ముగింపులో లాంఛనంగా విడుదల కావాల్సిన ఉమ్మడి ప్రకటన కరవైంది. ఏకపక్షంగా ఇరాన్‌పై దాడులకు దిగి పశ్చిమాసియాలో మరో మహాసంగ్రామానికి తెరలేపిన ఇజ్రాయెల్‌ను పల్లెత్తు మాట అనకుండా తప్పంతా ఇరాన్‌దేనని ఈ దేశాలు తేల్చాయి. ఆ యుద్ధం పర్యవసానాలు తమను సైతం చుట్టుముడతాయనీ, అమెరికా ఆ ఊబిలోకి దిగితే అది మరో ప్రపంచ యుద్ధంగా పరిణమించే ప్రమాదం ఉన్నదనీ తెలిసినా కిక్కురుమనలేదు. ఇరాన్‌ను ఏదో ఒకటి అనకపోయినా... రష్యాను నిందించే ప్రయత్నం చేసినా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆగ్రహం కలుగుతుందన్న భయం జీ7 దేశాలను వెన్నాడింది. సమావేశాలకు ముందు బ్రిటన్, కెనడాలు రష్యాపై మరిన్ని ఆంక్షలుంటాయని ఆర్భాటంగా ప్రకటించాయి. కానీ ట్రంప్ తీరు చూశాక వాటికి నోరుపెగల్లేదు. గాజా విషయంలో ఇజ్రాయెల్‌ను తప్పుబట్టినట్టు కనబడుతూనే, ఇరాన్‌పై దండయాత్ర విషయంలో ఒక్క మాట అనలేకపోయాయి. అసలే జీ7 ‘నిన్నటి క్లబ్’ అని పేరుబడింది. ఆ అపకీర్తిని మరింత పెంచుకోవటానికే సభ్యదేశాలు పాటుపడుతున్నట్టు కనబడుతోంది!ఒకప్పుడు జీ7 మహా శక్తిమంతమైనది. 1980వ దశకంలో ప్రపంచ జీడీపీలో దాని వాటా ఏకంగా 70 శాతం. నిరుడు ఆ వాటా 30 శాతానికి కాస్త అటూ ఇటూగా ఉంది. ఆర్థిక కార్యకలా పాలు పశ్చిమం నుంచి తూర్పు దిశకు వలసవచ్చి చాన్నాళ్లవుతోంది. ఈ పారిశ్రామిక దేశాలకు చైనా సవాలుగా నిలిచింది. ఆర్థికంగా బలపడుతోంది. ఆ దేశానికి జీ7లో చోటు లేదు. అటు రష్యాకు మధ్యలో కొన్నాళ్లు సభ్యత్వం ఇచ్చినా 2014లో క్రిమియాను దురాక్రమించటంతో వెళ్లగొట్టారు. మన దేశం సైతం ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అయినా పరిశీలక హోదాయే తప్ప సభ్యత్వం లేదు. ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక ప్రపంచ సంస్థలను అమెరికా చిన్నచూపు చూడటం మొదలైంది. భద్రతామండలికి విలువే లేకుండా పోయింది. తానే నిర్మించిన డబ్ల్యూటీవోను అమెరికా బేఖాతరు చేస్తోంది. ప్యారిస్ ఒప్పందం నుంచి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటికొచ్చింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఏర్పడుతున్న ఖాళీని భర్తీ చేయొచ్చన్న ఆలోచనగానీ, అందుకు తగిన ప్రణాళికలుగానీ జీ7 దగ్గర లేవు. ఎంతసేపూ అమెరికా తోకపట్టుకు పోవాలన్న ధోరణే. ట్రంప్ మాటలు గమనిస్తే ఆయనకు ప్రధాన ఎజెండా అయిన వాణిజ్యంపై ధ్యాసలేదన్న సంగతి తెలుస్తుంది. సదస్సులో ఎక్కువసేపుంటే ఉక్రెయిన్ విషయంలో ఒత్తిడి తప్పదన్న భయం వల్లనో, ఇరాన్ సంగతి తేల్చాలన్న ఆవేశంతోనో ఆయన మధ్యలోనే నిష్క్రమించారు. వెళ్లేముందు రష్యా దురాక్రమణకు మీరే కారణమంటూ నిందించారు. తమ మాజీ అధ్యక్షుడు ఒబామా, అప్పటి కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్లు 2014లో రష్యాను జీ7నుంచి బయటకు నెట్టకపోతే ఇవాళ ఆయన సమావేశాల్లో ఉండేవారని, యుద్ధం ఆపటానికి ఒత్తిడి తెచ్చేవారమని నిష్ఠూరమాడారు. అసలు యుద్ధమే వచ్చి వుండేది కాదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అందుకే, ఇక్కడ న్యాయానికి చోటులేదని గ్రహించారో ఏమో... ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం సమావేశాలకు మధ్యలోనే గుడ్‌బై చెప్పారు. నిరుడు జూన్‌లో జరిగిన జీ7 సమావేశాల సందర్భంగా ఉక్రెయిన్‌కు 5,000 కోట్ల డాలర్ల రుణమిస్తామని తీర్మానించారు. దాని ప్రకారం నెలకు వంద కోట్లు ఉక్రెయిన్‌కు అందించాలి. కానీ ట్రంప్ రాకముందే డిసెంబర్లోనే అప్పటి అధ్యక్షుడు బైడెన్ దానికి కోత పెట్టారు. ఆయనొచ్చాక ఇక చెప్పేదేముంది? ఈ భారాన్ని ఇతర సభ్య దేశాలు మోస్తున్నాయి. నిజానికి, గత వైభవం మళ్లీ దక్కాలంటే జీ7 పరిపూర్తి చేయాల్సిన లక్ష్యాలు చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ శాంతికి, భద్రతకు తమ వంతు కృషి అవసరం. కృత్రిమ మేధ, క్వాంటమ్‌లకు కావాల్సిన అత్యంత కీలకమైన ఖనిజాల సరఫరా ఆటంకం లేకుండా చూసుకోవాలి. పటిష్ఠమైన మౌలిక సదుపాయాల కల్పనకూ, యువతకు భారీయెత్తున ఉద్యోగావకాశాలు వచ్చిపడే రంగాలపై దృష్టి సారించాలి. కానీ ఇవన్నీ సాకారం కావాలంటే యుద్ధాలు లేని ప్రపంచం ఉండాలి. మరి దానికోసం జీ7 చేసిందేమిటి? ఈ దేశాలన్నీ అమెరికా సాగించిన యుద్ధాల్లో భాగస్వాములుగా మారి చేజేతులా ఆర్థిక వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసుకున్నాయి. నిజానికి ఇజ్రాయెల్‌ను పూర్వంలా యూరప్ దేశాల్లో జనం వెనకేసుకు రావటం లేదు. ఇరాన్ అణ్వస్త్రం తయారు చేయటం అనర్థమన్న అభిప్రాయం ఉన్నా ఆ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి దాన్ని ఒప్పించాలని మెజారిటీ జనం భావిస్తున్నట్టు సర్వేల్లో తేలింది. అయినా జీ7 దేశాలకు పట్టదు. మనవరకూ చూస్తే ఈ సదస్సు ఎంతో కొంత తోడ్పడిందని చెప్పాలి. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత నేరుగా పారిశ్రామిక దేశాధినేతలందరినీ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కలిసి ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ తీరు గురించి, దానిపై చర్య తీసుకోక తప్పని పరిస్థితి గురించి వివరించగలిగారు. ఏదేమైనా ఇలాంటి సదస్సులు మొక్కుబడిగా, బాతాఖానీ క్లబ్‌లుగా మారితే ఫలితం ఉండదు. కనీసం వచ్చే సమావేశాల నాటికైనా జీ7 దేశాలు ఈ సంగతి గ్రహించాలి. -
వలసలే వర్తమాన వాస్తవం
ఆకలి నుంచి, అగడ్తల నుంచి, వేధింపుల నుంచి, ఘర్షణల నుంచి, మృత్యువు నుంచి సుదూరంగా వెళ్లిపోవడానికీ, సురక్షితంగా బతకడానికీ సాధారణ ప్రజానీకం చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచంలో అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. ప్రతి దేశంలోనూ జాతీయవాద ధోరణులు పెరిగి, మెజారిటీ వాదం ముదిరి సరిహద్దులు మూసుకుపోతున్నా బతుకుపోరులో పరాజితులవుతున్న సాధారణ జనం ఎప్పటిలా ‘వలస గీతం’ పాడుతూనే ఉన్నారు. నిరుడంతా ఒక దేశం నుంచి మరో దేశానికి కోట్లాదిమంది ప్రజానీకం వలసపోయారని లాన్సెట్ నివేదిక ప్రకటించింది. ఒక్క మాటలో– ప్రతి ఎనిమిది మందిలో ఒకరు స్వస్థలాలను వదిలిపోతున్నారు. ఒక్కో దేశంలో ఒక్కో సమస్య.నియంత పోకడలతో ఉండే పాలకులు కావొచ్చు... సాయుధ ముఠాల బెదిరింపుల వల్ల కావొచ్చు, కళ్లముందు జరుగుతున్న ఘర్షణలు ముదిరి తమను కూడా కబళిస్తాయన్న భయం కావొచ్చు–ఎందరెందరో సురక్షిత ప్రదేశాలను అన్వేషిస్తూ తెలియని తీరాలకు పయనమవుతున్నారు. వీటికి తోడు ఈ 21వ శతాబ్దంలో వాతావరణ మార్పుల కారణంగా వచ్చిపడుతున్న సమస్యలు కూడా వలసలను పెంచుతున్నాయని లాన్సెట్ నివేదిక సూచిస్తోంది. భారీ ఆనకట్టల నిర్మాణం, మైనింగ్, పరిశ్రమల స్థాపన వంటì వాటికి అభివృద్ధి పేరిట అనుమతులిస్తున్నారు. ప్రభుత్వాలు నామమాత్రంగా ఇచ్చే పరిహారం ఏ మూలకూ చాలక, చేసేందుకు పనులేమీ లేక వలసలు తప్పటం లేదు.ఇలాంటి ‘అభివృద్ధి’ పర్యవసానంగా కరువు, వరదలు, ఇతరేతర ప్రకృతి వైపరీత్యాలు కాటేస్తు న్నాయి. ఆహారం, మంచినీరు సంగతలా ఉంచి కనీసం తలదాచుకోవటానికి కూడా ఏమీ మిగలక పోవటం సమస్యాత్మకం అవుతోంది. ఇలాంటివారిని స్వదేశంలోనే సంశయంతో చూస్తారు. తమ వనరులు కాజేస్తారని, జీవికకు ముప్పు తెస్తారని ఆందోళన పడతారు. పరాయి దేశాలకు పోతే చెప్పేదేముంది? మన దేశం వరకూ చూస్తే వలసల్లో దాదాపు 99 శాతం అంతర్గతమైనవేనన్నది నిపుణుల మాట. ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వలసలు అధికంగా ఉంటుండగా, వారికి ఆశ్రయమిచ్చే రాష్ట్రాల్లో ఢిల్లీ, మహారాష్ట్రలది అగ్రస్థానం. వలసపోయే వారిలో ఇతరేతర సమస్యలకు తోడు ఆరోగ్య సమస్యలు కూడా తక్కువేమీ కాదు. ఎండనక, వాననక, తిండితిప్పలు లేక గత్యంతరం లేక కాలినడకన వెళ్లేవారుంటారు. ఎగిసిపడు తున్న అలలు కలవరపరుస్తున్నా, ఏ క్షణమైనా మింగేస్తాయన్న భయాందోళనలున్నా నాటుపడవ లపై సముద్రాలను దాటాలని చూసేవారూ ఉంటున్నారు. ఇలాంటివారంతా వ్యాధుల బారినపడి ఆదరించేవారు లేక, వైద్యసాయం అందక మృత్యుముఖంలోకి పోతున్నారు. తొలుత 2008లో, ఆ తర్వాత 2017లో ఐక్యరాజ్యసమితి ఈ సమస్యపై తీర్మానాలు చేసింది. ప్రత్యేకించి వలసదారుల ఆరోగ్యావసరాలను చూసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సభ్యదేశాలకు సూచించింది. అయిదేళ్ల క్రితం ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ ఆ సంస్థలో దీనిపై శ్రద్ధపెట్టి పనిచేసే విభాగాలు ఆర్థిక సమస్యలతో మూతబడ్డాయి. వలసదారుల్ని చూసి భయపడే సాధారణ ప్రజానీకం, దీన్ని తమకనుకూలంగా మార్చుకుని అధికారం అందుకోవాలనుకునే రాజకీయ పక్షాల నాయకులు సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో వలసదారుల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా ఉన్నాయి. కానీ పట్టించుకునే వారేరి? సక్రమంగా ఆలోచించి వినియోగించుకుంటే వలసదారులు ఏ సమాజాభివృద్ధికైనా తోడ్పడతారు. చాలా రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే నిర్మాణరంగ, వ్యవసాయరంగ కార్మికులకు పనులు లభిస్తున్నాయి. కానీ వారి యోగక్షేమాలు పట్టక పోవటం, వారి నైపుణ్యాభివృద్ధికి అవసరమైన పథకాలు లేకపోవటం సమస్యలకు దారి తీస్తోంది.దురదృష్టవశాత్తూ హింసనుంచీ, వేధింపులనుంచీ తప్పించుకుని వస్తున్న వలసదారుల్ని అనుమాన దృక్కులతో చూసే వైఖరి పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించిన మొదట్లోనే ప్రపంచ మానవ హక్కుల డిక్లరేషన్ వెలువరించింది. దానికి అనుగుణంగా 1951లో శరణార్థుల ఒడంబడిక అమల్లోకొచ్చింది. మన దేశంతోపాటు ఇండొనేసియా, క్యూబా, ఎరిత్రియా, లిబియా వంటి దేశాలు దానిపై సంతకం చేయలేదు. అలా సంతకం చేయకపోయినా శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి దేశాలనుంచి వచ్చిన శరణార్థులను భారత్ ఆదుకుంది. టిబెట్ నుంచి వచ్చిన 80,000 మంది గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఆ్రÔ¶ యం పొందుతున్నారు. కానీ ఆ ఒడంబడికను గుర్తించి సంతకం చేస్తే దానికింద శరణార్థులకు కల్పించాల్సిన తప్పనిసరి సదుపాయాలు వగైరా వుంటాయి. ఇక్కడికొచ్చినవారు వాటిని కోల్పోవాల్సి వస్తోంది. ఎంతో సంపన్నవంతమైన అమెరికాయే వలసలను అడ్డుకోవటానికి వేలాది మందిని జైళ్లపాలు చేస్తోంది. వెనక్కి పంపుతోంది. చాలా యూరప్ దేశాలు ఆ మార్గాన్నే అనుసరిస్తున్నాయి. ఇక అంతంత మాత్రం ఆర్థిక వ్యవస్థలతో సతమతమయ్యే దేశాల్లో శరణార్థులను, వలసదారులను ఆదరిస్తారని ఆశించటం దురాశే. ఎవరెంత వ్యతిరేకిస్తున్నా, ద్వేషిస్తున్నా వలసలు మున్ముందు మరింత పెరుగుతాయని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. ఎందుకంటే వారు తమ ఇష్టానుసారం రావటం లేదు. తప్పనిసరై, గత్యంతరం లేక స్వస్థలాలను వదల వలసి వస్తోంది. వలసలను వ్యతిరేకించటం కాక, వాటిని అనుకూలంగా మలుచుకోవటం ఎలాగో నేర్చుకోవటం అన్ని దేశాలకూ తప్పనిసరి. -
యుద్ధం కాదు... చర్చలే దిక్కు!
ఏ యుద్ధంలోనైనా కనబడే దూకుడే అయిదోరోజుకల్లా ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణలో కనబడుతోంది. ఎవరికెవరూ తీసిపోకుండా క్షిపణులు, బాంబులు యథేచ్ఛగా ప్రయోగిస్తున్నారు. జనావా సాలను గురిచూస్తున్నారు. ప్రత్యర్థుల్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నట్టు ప్రకటించుకుంటున్నారు. ఇజ్రా యెల్ విమానాల బాంబుదాడుల్లో 406 మంది ఇరాన్ పౌరులు మరణించగా, 654 మంది గాయపడ్డారని వాషింగ్టన్‌లోని మానవహక్కుల కార్యకర్తలు ప్రకటించారు. అటు రాజధాని టెల్ అవీవ్‌తో పాటు పలు నగరాలపై ఇరాన్ సాగించిన క్షిపణి దాడులకు ఇజ్రాయెల్‌లో 14 మంది మర ణించగా, 390 మంది గాయపడ్డారని అక్కడి సైన్యం తెలియజేసింది. తొలుత అణుకేంద్రాలపై దాడులు చేశామన్న ఇజ్రాయెల్ రెండోరోజు నుంచి నగరాలూ, పట్టణాలూ లక్ష్యంగా చేసుకుని బాంబులు ప్రయోగిస్తోంది. తయారీరంగ పరిశ్రమలనూ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలనూ, పోలీస్ స్టేషన్లనూ, మౌలిక సదుపాయాలనూ ధ్వంసం చేస్తోంది. ఒక్క తెహ్రాన్‌లోనే శని ఆదివారాల్లో 250 లక్ష్యాలను దెబ్బతీశామని చెబుతోంది. దక్షిణ ఇరాన్‌లోని ప్రపంచంలోనే అతి పెద్ద సహజవాయు క్షేత్రాన్ని, తెహ్రాన్ వెలుపల ఒక చమురు డిపోను ఇజ్రాయెల్ సైన్యాలు పేల్చివేశాయి.అణ్వస్త్రాల తయారీకి ఇరాన్ చేరువలో ఉన్నదని, అందుకే దాడులకు దిగామని ఇజ్రాయెల్ ఇస్తున్న సంజాయిషీ బూటకం. వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అది శుద్ధిచేసిన యురే నియం నిల్వలు ఉంచుకున్నా, బాంబు తయారీకి దరిదాపుల్లో లేదని సాక్షాత్తూ అమెరికా ఇంటెలి జెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ కొన్ని వారాల క్రితం తెలిపారు. అణు ఒప్పందం గురించి అమెరికా– ఇరాన్‌ల మధ్య చర్చలు సాగుతుండగానే హఠాత్తుగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ అణు ఆరోపణ ఎందుకు చేసినట్టు? ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ను అడ్డు తప్పించటానికి ఆ దేశంలో రసాయన ఆయుధాలున్నాయని కపట నాటకమాడిన అమెరికా అడుగుజాడల్లో ఇజ్రాయెల్ నడుస్తోంది. ఆ సాకుతో సద్దాంను తప్పించి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠిద్దామని అప్పట్లో అమెరికా, నాటో దేశాలు భావించాయి. కానీ జరిగిందంతా వేరు. రసాయన ఆయుధాల జాడలేదు సరిగదా... ఉగ్రవాదం మరింతగా విజృంభించింది. ఇప్పటికీ ఇరాక్ కుదుట పడలేదు. అఫ్గాన్, లిబియా, యెమెన్, సిరియాలు సైతం అదే దుఃస్థితిలో ఉన్నాయి. ప్రధాని నెతన్యాహూ రెండు లక్ష్యాలతో ఇరాన్‌పై విరుచుకుపడ్డారు. మతాచార్యుడు ఖమేనీ కనుసన్నల్లోని పాలకవ్యవస్థను పడగొట్టి అక్కడ తమకు అనుకూలమైన ప్రభుత్వం ప్రతిష్ఠించటం అందులో ఒకటైతే, రెండోది స్వదేశంలో తాను కోల్పోయిన పరువు తిరిగి పొందటం. అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసినా ఇరాన్లో తమకు అనుకూలమైన వారిని ప్రతిష్ఠించటం అసాధ్యం. ఆ రోజులు పోయాయి. 1970వ దశకం వరకూ ఇరాన్‌ను పాలించిన షా రెజాపెహ్లావీ వంటి అమెరికా కీలుబొమ్మ ఆ దేశంలో కొత్తగా పుట్టుకొచ్చే అవకాశం లేదు. ఇరాన్ ప్రతిఘటిస్తున్న తీరు చూస్తే నెతన్యాహూ రెండో లక్ష్యం కూడా నెరవేరే అవకాశం కనబడటం లేదు. పాలస్తీనాలో దిక్కూ మొక్కూలేని నిస్సహాయ పౌరులపై అమెరికా సరఫరా చేసిన మారణా యుధాలతో విరుచుకుపడటం వేరు. ఇప్పుడు ఇరాన్ జోలికి పోవటం వేరు. ఇరాన్ పౌరులకు తమ ప్రభుత్వంపై ఎంతైనా వ్యతిరేకత ఉండొచ్చుగానీ, కొన్ని దశాబ్దాలుగా వారంతా నిత్యం యుద్ధ రంగంలోనే ఉన్నారు. ఇప్పుడంటే సౌదీతో ఒక మేరకు స్నేహసంబంధాలు ఏర్పడ్డాయిగానీ ఆ దేశం కూడా ఇరాన్‌పై కత్తికట్టినదే. గతంలో ఇరాక్‌తో వైరం ఏర్పడినప్పుడు వరసగా పదేళ్లపాటు యుద్ధం సాగించిన దేశం ఇరాన్. ఎంతగా అమెరికా మద్దతున్నా ఈ మాదిరి సుదీర్ఘ యుద్ధాన్ని ఇజ్రాయెల్ ఆర్థికవ్యవస్థ తట్టుకోవటం అసాధ్యం. ఆ మాటకొస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థే అంతటి మహాయుద్ధాన్ని భరించే స్థితిలో లేదు. ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరిట పలు దేశాల్లో నాటో కూటమితో కలిసి సాగించిన యుద్ధాల పర్యవసానంగా ఇప్పటికే అమెరికా నిండా మునిగింది. దాని ప్రస్తుత రుణం 36 లక్షల కోట్ల డాలర్లు. ఆర్థికవ్యవస్థకొచ్చే ఆదాయంలో సింహ భాగం దానిపై వడ్డీలకే ఖర్చవుతోంది. ఇజ్రాయెల్‌కు వత్తాసుగా ఇరాన్‌తో వైరం పెట్టుకుంటే ఆ సుదీర్ఘ పోరు మరో పదిలక్షల కోట్ల డాలర్లను ఆవిరిచేస్తుంది. తాను అధికారంలోకొస్తే ‘అనవసర యుద్ధాల’ నుంచి అమెరికాను తప్పిస్తానని, ఒక్క సైనికుడు కూడా విదేశీగడ్డపై ఉండే అవసరం రాదని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఊదరగొట్టారు. అందుకే ‘ఇజ్రాయెల్ జోలికెళ్తే ఖబడ్దార్’ అంటూ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించటాన్ని స్వపక్షంలో అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికీ మించిపోయింది లేదు. అణు చర్చలకు సిద్ధమంటోంది ఇరాన్. కాకపోతే ఇజ్రాయెల్ వద్ద పుష్కలంగా అణ్వాయుధాలుండగా... పౌర అవసరాలకు సైతం యురేనియం వాడకాన్ని అను మతించబోమనటం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమే అంటున్నది. నిజానికి ఒబామా హయాంలో అమెరికా ఆ వెసులుబాటు ఇవ్వటం వల్లనే 2015లో అణు ఒప్పందం సాకారమైంది. క్రితంసారి ఏలుబడిలో ట్రంప్ ఆ ఒప్పందాన్ని కాలరాశారు. ఇజ్రాయెల్ సృష్టించిన ఈ ఊబి నుంచి బయటపడాలంటే ఇప్పటికీ ట్రంప్‌కు ఆ ఒప్పందమే దిక్కు. ఈ నాలుగు రోజుల్లో డాలర్ విలువ పదిశాతం తరిగిపోయింది. ఇరాన్‌తో చర్చించి సమస్య పరిష్కారానికి సాయపడతామని జర్మనీ విదేశాంగమంత్రి యోహాన్ వాదెఫుల్ ముందుకొచ్చారు. అందుకు సిద్ధపడటమే అమెరికా ముందున్న ఏకైక మార్గం. కాదంటే ఇవాళ పశ్చిమాసియా కావొచ్చుగానీ... రేపు ప్రపంచమే పెను సంక్షోభంలో పడుతుంది. అప్పుడు ఆర్థిక పతనం నుంచి అమెరికాను ఎవరూ కాపాడలేరు. -
నవ్వే నేరమౌనా?
మనుషులకు సహజసిద్ధమైన మనోల్లాస ప్రకటన నవ్వు. మాటలు రాని పసికందుల మొదలుకొని, వయోవృద్ధుల వరకు అందరూ నవ్వుతారు. నవ్వు ఒక విశ్వజనీన భాష. కొందరు అనునిత్యం చిరునవ్వులు చిందిస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఇంకొందరు తాము నవ్వుతూ, ఎదుటివారిని కూడా నవ్విస్తుంటారు. అరుదుగా అతితక్కువ మంది ఉంటారు – వారు నవ్వరు, ఎదుటివారు ఉల్లాసంగా నవ్వుతూ, ఆనందంగా ఉంటే ఏమాత్రం భరించలేరు. నవ్వేవారు తమను చూసే నవ్వుతున్నారేమోననే భ్రమలోపడి లోలోన కుమిలి కునారిల్లిపోతారు. జీవితంలో నవ్వెరు గని మనుషులను చూసి మిగిలిన లోకం జాలిపడటం తప్ప చేయగలిగిందేమీ లేదు.నవ్వు ఒక ఆరోగ్య లక్షణం. పసిపిల్లలు బోసినవ్వులు చిందిస్తుంటారు. బాల్యంలో నవ్వే నవ్వుల సంఖ్య వయసు పెరిగిన తర్వాత క్రమంగా తగ్గిపోతుంది. ఎంత ఎదిగినా పెద్దలు కూడా సమయ సందర్భాలను బట్టి నవ్వుతుంటారు. వైద్య పరిశోధనల ప్రకారం పసిపిల్లలు రోజుకు దాదాపు నాలుగు వందల సార్లు నవ్వులొలికిస్తారు. పెద్దలు రోజులో కనీసం ఇరవైసార్లయినా నవ్వుతారు. సంతోషకరమైన జీవితం గడిపేవారు నలభైసార్లకు పైబడి కూడా నవ్వుతారు. ‘నవ్వడం ఒక భోగం; నవ్వించడం ఒక యోగం; నవ్వకపోవడం ఒక రోగం’ అన్నారు జంధ్యాల. నవ్వెరుగని రోగులే హాయిగా నవ్వుతూ కనిపించే మనుషులను చూసి కుళ్లుకుంటారు.‘ఒకరిని నవ్వమని శాసించలేము; కాని నవ్వవద్దని శాసించినా; నవ్వకూడదని భీష్మించుకొని కూర్చొనినా నవ్వు రాక మానదు... అసలు మన నవ్వుకి కొన్ని చోట్ల అర్థం పర్థం లేకపోవటం కూడ కద్దు’ అని ‘తెలుగు హాస్యం’ రచయిత ముట్నూరి సంగమేశం అన్నారు. ఆయన మాటలు అక్షర సత్యం. నవ్వమని ఎవరో శాసిస్తే నవ్వు రాదు. నవ్వొద్దని ఆంక్షలు విధిస్తే, వచ్చే నవ్వు రాకుండా మానదు. ‘నవ్వు ఒక దిద్దుబాటు చర్య. పెడదారి పట్టినవారిని సన్మార్గంలోకి తీసుకురావడానికి, చాదస్తాలను సరిదిద్దడానికి నవ్వు చేయూతనిస్తుంది’ అన్నారు ఫ్రెంచ్ తత్త్వవేత్త హెన్రీ బెర్గ్సన్. ‘నవ్వులేని రోజు దండగ రోజు’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత హాస్యనటుడు చార్లీ చాప్లిన్. ‘మానవ జాతి చేతిలో గొప్ప ప్రభావవంతమైన ఆయుధం ఉంది, అదే నవ్వు’ అన్నారు అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్. నవ్వు అంటే నవ్వులాట కాదు, నవ్వును నిర్వచించడం అంత తేలిక కాదు. నవ్వులోని సంక్లిష్టత నిర్వచనాలకు అందనిది.‘నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్/ దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు కొన్ని విషప్రయుక్తముల్/ పువ్వులవోలె ప్రేమరసముల్ వెలిగ్రక్కు విశుద్ధమైనవే/ నవ్వులు సర్వ దుఃఖదమంబులు వ్యాధులకున్ మహౌషధుల్’ అన్నారు జాషువా. పురాణకాలంలో నవ్వు వల్ల అపార్థాలు, అనర్థాలు వాటిల్లిన సందర్భాలు రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి మహాభారతంలోని పాంచాలి నవ్వు కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసిన వైనం తెలిసినదే! మరొకటి రామాయణంలో లక్ష్మణుడి నవ్వు. రాముడి పట్టాభిషేక సమయంలో లక్ష్మణుడికి రెప్పలు మూతబడ్డాయి. పద్నాలు గేళ్ల అరణ్యవాస కాలంలో అన్నాళ్లూ రాని నిద్ర పట్టాభిషేక వేడుక జరుగుతున్నప్పుడే రావాలా అనుకుంటూ లక్ష్మణుడు తనలో తాను నవ్వుకున్నాడు. అతడి నవ్వు సీతారాములు సహా ఆ వేడుకలో కొలువుదీరిన వారందరిలోనూ రకరకాల అపార్థాలకు తావిచ్చింది. పాంచాలి నవ్వు అనర్థాలకు దారితీస్తే, లక్ష్మణుడి నవ్వు అపార్థాలకు దారితీసింది. కేవలం ఈ రెండు ఉదంతాలను ఉదహరిస్తూ, ‘నవ్వు నాలుగు విధాల చేటు’ అనే నిర్ధారణకు రావడం పూర్తిగా అసమంజసం. నవ్వులలో రకరకాలు ఉన్నాయి. మన ప్రాచీన అలంకారికులు నవ్వులను ఆరు రకాలుగా విభజించారు. అవి: స్మితం, హసితం, విహసితం, ఉపహసితం, అపహసితం, అతిహసితం. నవ్వుకు నానా ప్రయోజనాలు ఉన్నాయి. నవ్వు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది; రోగ నిరోధక శక్తిని పెంచుతుంది; గుండె జబ్బులను నివారిస్తుంది. నవ్వు వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆధునిక వైద్యశాస్త్రం చెబుతోంది.రాజరికాలు కొనసాగిన కాలంలో రాజులను నవ్వించడానికి విదూషకులు ఉండేవారు. రాజకీయాలతోను, రణతంత్రాలతోను బుర్రలు వేడెక్కిన ప్రభువులకు విదూషకులు తమ హాస్యంతో మనోల్లాసం కలిగించి, వినోదపరచేవారు. పలువురు ఆస్థాన కవులు చమత్కార పద్యాలతో ప్రభువులను నవ్వించేవారు. నేటి ప్రజాస్వామ్యంలోని ప్రభువుల కంటే రాజరికాల నాటి ప్రభువులే హాస్యాన్ని ఆదరించడంలో చాలా నయం అనిపిస్తారు. నవ్వించే విదూషకులకు, కవులకు వారు నజరానాలు ఇచ్చి, గౌరవించేవారు. హాస్యాన్ని ఆస్వాదించాలంటే కాస్త హాస్యప్రియత్వం, చమత్కారాభిరుచి ఉండాలి. ఆనాటి ప్రభువుల్లో అవి కొంత మెండుగా ఉండేవి. హాస్యం కోసం ఆనాటి కవులు బూతులు కూడా ప్రయోగించేవారు. ‘నీతులకేమి ఒకించుక/బూతాడక నవ్వు దొరకు పుట్టదు ధరలో/ నీతులు బూతులు లోక ఖ్యాతులురా’ అన్నాడు చౌడప్ప. ఆనాటి కవులు ప్రభువుల తీరుతెన్నులను, సామాజిక పరిస్థితులను తెగనాడటానికి పదునైన వ్యంగ్యంతో అధిక్షేప పద్యాలు రాశారు. ఆ పద్యాల్లోని వ్యంగ్యం కటువుగా ఉన్నా, నవ్వు తెప్పిస్తుంది. అంతమాత్రాన ఆ ప్రభువులెవరూ ఆ కవులను శిక్షించిన దాఖలాలు లేవు. పాపం, సత్తెకాలం మారాజులు వాళ్లు. మనోభావాల శకం మొదలయ్యాక నవ్వుల వివాదాలు న్యాయస్థానాల ముందుకు వెళుతున్నాయి. నవ్వులను తాళలేని పాలకుల విన్యాసాలు నవ్వులపాలవుతున్నాయి. -
ఆకాశంలో విషాదం!
గుజరాత్‌లోని అహమ్మదాబాద్ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్ బయల్దేరిన ఎయిరిండియా సంస్థ విమానం బోయింగ్–787–8 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కాసేపటికే గురువారం ప్రమాదానికి లోనై కూలిపోవటం ఎంతో విషాదకరం. మన విమానాలు ఎంతో సురక్షితమైనవనీ, ప్రమాదాలకు ఆస్కారం లేనివనీ పేరుంది. ఇప్పుడు కూలిపోయిన విమానం పదకొండేళ్లుగా వినియోగంలో ఉంది. ఈ తరహా విమానాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసే ఆలోచన కూడా ఉంది. ఇంతలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్య మంత్రి విజయ్ రూపానీ సహా 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ వాసులు, కెనడావాసి ఒకరు వున్నారని ఎయిరిండియా సంస్థ ప్రకటన చెబు తోంది. వీరిలో ఒక్కరు గాయాలతో బయటపడ్డారు. భవనంపై ఈ విమానం కూలడంతో అందులో కూడా మరణాలు సంభవించాయని, చాలామంది గాయపడ్డారని అంటున్నారు. వర్తమాన యుగంలో దేశాల మధ్య అనుసంధానం బాగా పెరిగింది. వ్యాపారం, వాణిజ్యం, చదువు, ఉపాధి, పర్యాటకం లాంటి ఎన్నెన్నో అవసరాల నిమిత్తం ఒకచోటనుంచి మరో చోటుకు ప్రయాణిస్తున్నవారి సంఖ్య పదేళ్ల క్రితంతో పోల్చినా ఎన్నో రెట్లు పెరిగింది. ఒకప్పుడు సంపన్న వర్గాల సొంతం అను కునే విమానయానం ఇవాళ మధ్యతరగతి పౌరులకు సైతం జీవితావసరంగా మారింది. ఎప్పటికప్పుడు అందుబాటులోకొస్తున్న సాంకేతికతలు విమానయానాన్ని సురక్షితం చేశాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మానవ తప్పిదాలకు ఆస్కారం ఉంటుంది గనుక విమాన గమనాన్నీ, దాని తీరుతెన్నులనూ నిర్దేశించగల మెకానికల్, హైడ్రో మెకానికల్ నియంత్రిత వ్యవస్థలు ప్రవేశించాయి. ఇందువల్ల పైలెట్ ఒక కమాండ్ ఇవ్వగానే దానికి సంబంధించిన అనుబంధ మార్పులన్నీ ఒకదాని వెంబడి మరోటి వేగంగా పూర్తవుతాయి. ఈ క్రమంలో ఎక్కడ లోపం కనిపెట్టినా సెన్సర్లు గుర్తిస్తాయి. ఆ వెనకే తక్షణం సరిచే యగల వ్యవస్థలకు సంకేతాలిస్తాయి. ఏకకాలంలో అనేక పనుల్ని క్షణాల్లో చేయగలిగే ఈ వ్యవస్థల కారణంగా పైలెట్ల పని గతంతో పోలిస్తే చాలా మేరకు తగ్గిందనే చెప్పాలి. అయితే పైలెట్ సొంతంగా ఆలోచించాల్సిన అవసరం లేకపోవటం ఇందులోని బలహీ నత. ఏ వృత్తిలోనైనా అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగినవెన్నో ఉంటాయి. అన్నీ యంత్రాలే చేయటం ఆ అనుభవాలకు పరిమితులు విధిస్తుంది. మరి ఇంత సాంకేతికాభివృద్ధి జరిగినా ప్రమాదం ఎలా సంభవించిందన్నదే ప్రశ్న. ఒక మాదిరి విశాలంగా, ఒకేసారి 290 మంది ప్రయాణించగల ఈ మోడల్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి. ఎక్కడా ఆగకుండా ఏకబిగిన వేలాది కిలోమీ టర్లు ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. అయినా ఈ విషాదం ముంచుకొచ్చింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం చోటుచేసుకుని ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. పైలెట్ నుంచి తక్షణ సాయం అవసరమని సూచించే ‘మేడే కాల్’ కూడా అందింది. ఆ మరుక్షణమే విమానం ప్రమాదంలో చిక్కుకుంది. దూరప్రయాణం కనుక ఇంధనం అధికంగా ఉంది. దాని వల్ల ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. విమానాశ్రయం చుట్టుపక్కల ఆవాసాలుండటం ఒక సమస్య. అందువల్ల ఆహారం కోసం వచ్చే పక్షులు విమానాలకు ముప్పు తెస్తాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో 92 శాతం వరకూ పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చంటారు. మహా అయితే అత్యవ సర ల్యాండింగ్ తప్పకపోవచ్చు. కానీ ఆ మిగిలిన 8 శాతం మేర ముప్పు పొంచివున్నట్టే లెక్క. పక్షుల గుంపు విమాన మార్గంలో అడ్డు తగలటం, దానికుండే రెండు ఇంజన్లలోనూ అవి చిక్కు కోవటం వంటి కారణాలు ప్రమాదానికి దోహదపడ్డాయా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే ఈ డ్రీమ్‌లైనర్ రకం విమానాల్లో నిర్వహణా లోపాలున్నాయని చాన్నాళ్లుగా ఫిర్యాదు లందుతున్నాయి. వాటి పర్యవసానంగా విమానాలు కూలిపోవటం వంటివి చోటుచేసుకోలేదుగానీ అవి భారీ కుదుపులకు లోనై ప్రయాణికులు గాయపడిన ఉదంతాలున్నాయని ఏవియేషన్ సేఫ్టీ నెట్ వర్క్ (ఏఎస్ఎన్) గణాంకాలు చెబుతున్నాయి. నిరుడు జనవరిలో అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం ప్రయాణంలో ఉండగా దానికి చిల్లుపడి చొచ్చుకొచ్చిన పెనుగాలి ధాటికి ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు. అప్రమత్తమైన పైలెట్ చాకచక్యంగా కిందకు దించటంతో ముప్పు తప్పింది. విమానం ఫ్యూజలాజ్ (ప్రయాణికులు కూర్చునే బాడీ) నిర్మాణం సక్రమంగా లేదని, అందువల్ల ముప్పు ఏర్పడే అవకాశమున్నదని బోయింగ్‌లో పనిచేసిన ఒక ఇంజనీర్ నిరుడు వెల్లడించినప్పుడు సంస్థ కొట్టిపారేసింది. విస్తృతంగా పరీక్షలు జరిపాక వెంటనే సమస్యాత్మకం అయ్యేదేమీ లేదని ప్రకటించింది. అయితే ఈ కంపెనీ రూపొందించిన 737 రకం విమానాలు రెండు 2018, 2019 సంవత్సరాల్లో కుప్పకూలి 346 మంది మరణించారు. ఈ రెండు ఉదంతాల్లోనూ తన నేరసంబంధ బాధ్యత నుంచి తప్పించుకోవటానికి అమెరికా ప్రభుత్వంతో గత నెలలోనే ఒప్పందానికొచ్చింది. ప్రభుత్వ పర్యవేక్షణను తప్పించుకునే ప్రయత్నం చేసినందుకు భారీయెత్తున జరిమానా చెల్లించింది. విమానాల తయారీలో నాణ్యతనూ, భద్రతనూ మరింత పెంచుతామని లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఈ దురదృష్టకర ఘటనపై జరిగే దర్యాప్తులో ఉత్పాదక సంబంధ లోపాలపై కూడా దృష్టి పెట్టాల్సివుంది. ఇదే సమయంలో విమానయాన సంస్థలన్నీ భద్రతపై మరింత శ్రద్ధపెట్టి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. -
మస్క్ ‘కాల్పుల విరమణ’!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సభల్లో డోనాల్డ్ ట్రంప్ వెనుకనో, పక్కనో అంతెత్తు గెంతుతూ... ఆయన అధ్యక్షుడయ్యాక తరచుగా వైట్ హౌస్‌కు సంతాన సమేతంగా వస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎలాన్ మస్క్ నాలుగు రోజులపాటు ట్రంప్‌తో బహిరంగ యుద్ధానికి దిగి, ఇంతలోనే బుధవారం నాడు దానికి శుభం కార్డు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తరచు ఒకటిగానే కనబడే రాజ్యశక్తి, ధనశక్తి నిజంగా కొట్లాటకు దిగితే చివరాఖరికి రాజ్యశక్తిదే పైచేయి అవుతుందని ఈ స్వల్పకాల ఉపాఖ్యానం నిరూపించింది. అధికారంలోకొచ్చినప్పటి నుంచీ ట్రంప్‌కు దాదాపు ప్రతిపక్షం లేదు. ఆయన పాలనపై ఓ కన్నేసి ఉంచాల్సిన అమెరికన్ కాంగ్రెస్ నిరాసక్తంగా ఉంది. వలస విధానం అంశంలో కోర్టులు కాదంటున్నా పంతం నెగ్గించుకుంటున్నారు. ఒకటి రెండు మినహా మిగిలిన విశ్వవిద్యాలయాలు ఆయనకు తలొంచాయి. మీడియా సరేసరి. పర్యవసానంగా ఆయన తలచుకున్నదే ధర్మం, ఆయన అమలుచేసేదే న్యాయం! మన పురాణాల్లో వైరభక్తి అనేది ఒకటుంది. శాపవశాత్తూ శ్రీమహావిష్ణువుకు దూరం కావాల్సివచ్చిన ద్వారపాలకులు జయవిజ యులు... సత్వర శాపవిమోచనకు ఆయనతో మూడు జన్మల్లో వైరానికి దిగి, ఆయన చేతుల్లోనే హతమారి తిరిగి చేరువవుతారు. ట్రంప్–మస్క్ వైరం నిండా నెల్లాళ్లయినా కొనసాగలేదు. ట్రంప్–మస్క్‌ల బంధం ఏడాది క్రితం వరకూ ఎవరూ ఊహించలేదు. మస్క్ తన దారిన తాను ‘ఇన్నొవేషన్ గురు’ అనిపించుకుంటూ ప్రయోగాలు చేశారు. భవిష్యత్తంతా ఎలక్ట్రిక్ కార్లదే అని నమ్మి ఖరీదైన టెస్లా కారును ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ట్విటర్‌ను కొన్నాడు. ఈ భూమికి భవిష్యత్తు లేదని, అంగారకుడిపై ఆవాసాలు నిర్మించుకోవటమే ప్రత్యా మ్నాయమని అందరి చెవుల్లో హోరెత్తుతూ నిజమేనని భ్రమింపజేస్తున్నాడు. ఈలోగా హైపర్‌లూప్ రైళ్ల ఆలోచనను వదిలారు. ఇంతలో డెమాక్రటిక్ పార్టీ పెద్దలతో, ముఖ్యంగా మొన్న అధ్యక్ష ఎన్ని కల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కమలా హ్యారిస్‌తో తేడా వచ్చింది. తాను భారీగా విరాళాలి చ్చినా తన కొత్త సాంకేతికతలను నిర్లక్ష్యం చేశారని అలిగాడు. అంతే... ఉదారవాదానికి స్వస్తిపలికి నిరుడు మితవాది ట్రంప్‌కు చేరువయ్యాడు. ఆయన ప్రచార సభలకైన వ్యయంలో అత్యధిక వాటా మస్క్‌దే. దాదాపు 30 కోట్ల డాలర్ల విరాళం ఇవ్వటమే కాదు... వచ్చే ఏడాది నవంబర్‌లో 435 స్థానా లుండే ప్రతినిధుల సభకు జరగబోయే ఎన్నికలకు 10 కోట్ల డాలర్లు ఇవ్వటానికి వాగ్దానం చేశాడు. ట్రంప్–మస్క్‌ల మైత్రి ఉభయతారకమైనది. ట్రంప్‌కు సొంతంగా ఉన్న సామాజిక మాధ్యమం ట్రూత్, మస్క్ నేతృత్వంలోని ఎక్స్ ఒక్కటై అమెరికా ప్రజానీకాన్ని తమ దారికి మళ్లించుకోవటంలో కృతకృత్యులయ్యారు. డెమాక్రటిక్ పార్టీ ప్రచార లోపాలు కూడా తోడవటంతో అవలీలగా ట్రంప్ విజయం సాధించారు. అధికారంలోకొచ్చాక ప్రభుత్వోద్యోగులను సాగనంపే డోజ్‌లో కీలకపాత్ర పోషించాలని మస్క్ ఉబలాటపడినా అది కాస్తా వివేక్ రామస్వామికి పోయింది. ‘ఉరితీతలు కాదు... ఊచకోతలే’ అంటూ భారీయెత్తున సిబ్బందిని కత్తిరిస్తానని చెప్పిన మస్క్‌కు అది నిరాశ కలిగించినా, త్వరలోనే వివేక్ నిష్క్రమించేలా చేయగలిగారు. తనకు సన్నిహితుడైన జేర్డ్ ఐజాక్ మాన్కు అంతరిక్ష సంస్థ నాసా బాధ్యతలు అప్పగించాలన్నది మస్క్ ఆకాంక్ష. అదే జరిగితే సొంత సంస్థ స్పేస్ ఎక్స్‌కు నాసాను తాకట్టుపెడతాడన్న భయం ట్రంప్‌కు లోలోన ఉంది. ఈ సంగతి అర్థమైన నాటినుంచీ మస్క్ రగిలిపోయారు. పర్యవసానంగా ట్రంప్ అత్యద్భుతమని ప్రకటించిన పన్ను కోతల బిల్లును ఆయన తప్పుబట్టారు. ఒకపక్క తాను ప్రభుత్వ సిబ్బందిని సాగనంపి ఖజానా కళకళల్లాడేలా చేస్తుంటే, ప్రభుత్వ రుణభారాన్ని మరో 3 లక్షల కోట్ల డాలర్లకు పెంచే పన్నుల తగ్గింపేమిటన్నది మస్క్ ప్రశ్న. తన కాంట్రాక్టు ముగిశాక మొదటగా ఆయన దీన్నే ఎత్తు కున్నారు. తనతో ఇన్నాళ్లూ కలిసిమెలిసి తిరిగి, మొదటినుంచీ ఈ బిల్లుపై అవగాహన ఉన్న మస్క్ ఇలా విమర్శించే సరికి ట్రంప్ ఆగ్రహం పట్టలేకపోయారు. ఆ తర్వాత జరిగిందంతా బహిరంగ యుద్ధం! వచ్చేసారి ఎన్నికల్లో డెమాక్రాట్లకు ఆర్థిక సాయం అందిస్తానన్న బెదిరింపు మొదలుకొని బాలలపై లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎపిస్టిన్తో ట్రంప్‌కు గల సంబంధాలు బయటపెడతాననేవరకూ మస్క్ మాటలు జారారు. ప్రతిగా స్పేస్ ఎక్స్ కాంట్రాక్టులు రద్దుచేస్తానని, ఇవ్వబోయే కాంట్రాక్టులు జెఫ్ బెజోస్ నేతృత్వంలోని బ్లూ ఆరిజన్కూ, బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ ఉమ్మడి భాగస్వామ్య సంస్థ యునైటెడ్ లాంచ్ అలయెన్స్కూ కట్టబెడతానని ట్రంప్ బెదిరించారు. డెమాక్రాట్లకు విరాళమిస్తే పర్యవసానాలెలా ఉంటాయో చూపిస్తానని హెచ్చరించారు. తీరిగ్గా లెక్కలేసుకున్నాక ఈ కయ్యం వల్ల కలిసొచ్చేదేమీ లేదని మస్క్ గ్రహించినట్టున్నారు. ‘కాల్పుల విరమణ’ ప్రకటించటంతోపాటు ‘సారీ’ చెప్పారు. ఏడాది నుంచి అవిభక్త కవలల్లా ఎక్కడికెళ్లినా జంటగా పోతూ, మస్క్‌ను ‘సహ అధ్యక్షుడు’ అని అందరూ వేళాకోళం చేసేలా వ్యవహరించిన వీరిద్దరూ మునుపటి మాదిరే మళ్లీ సన్నిహితులవుతారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. హృదయం అద్దం లాంటిది, పగిలితే అతకదంటారు. కనుక చెలిమి చిగురించినా మునుపటి స్థాయిలో ఉండకపోవచ్చు. కానీ ఈ ఉపాఖ్యానంలో ప్రపంచ ప్రజానీకం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఒకటుంది. వ్యక్తులైనా, పార్టీలైనా పరస్పరం లాభదాయకం, పంపకాలు బాగుంటాయనుకుంటే కూటములు కడతారు తప్ప, తమను ఉద్ధరించటం కోసం కాదని వారు గ్రహించాలి. -
ట్రంప్ ‘ఫెడరల్’ పరీక్ష!
వలసలను అరికట్టి తీరతానని వాగ్దానం చేసి గద్దెనెక్కిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అందుకోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడుతున్నారు. క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ఏంజెలెస్ నగరంలోని ఒక ప్రాంతంలో అక్రమ వలసదారుల ఏరివేతకు వచ్చిన ప్రతిఘటన సాకుతో ఆరున్నర దశాబ్దాల తర్వాత ఆ రాష్ట్రం అనుమతి లేకుండా ఆదివారం కేంద్ర బలగాలను పంపారు. డెమాక్రటిక్ ఏలుబడిలోని ఆ రాష్ట్రానికి అలా సవాలు విసిరారు. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన గవ ర్నర్ గావిన్ న్యూసమ్‌ను అరెస్టు చేయిస్తానని, ఆ రాష్ట్రానికి నిధులు నిలిపేస్తానని హెచ్చరించారు. అందుకు ప్రతిగా క్యాలిఫోర్నియా నుంచి పన్నుల రూపంలో ఫెడరల్ ప్రభుత్వానికి వెళ్లే 8,000 కోట్ల డాలర్ల నిధుల్ని ఆపేస్తామని న్యూసమ్ జవాబిచ్చారు. అంతేకాదు... చట్టవిరుద్ధంగా ఫెడరల్ బలగాలను పంపిన ట్రంప్ తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. మొత్తానికి అమల్లో ఉన్న వలస విధానంపై కొన్నేళ్లుగా అంతర్గతంగా రాజుకుంటున్న అసంతృప్తి క్యాలిఫోర్నియాలో భళ్లున బద్దలైంది. నాలుగు లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో సొంతంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోనే నాలుగో స్థానాన్ని ఆక్రమించగలిగిన క్యాలిఫోర్నియాలో అపరిమితమైన సంపద ఉన్నట్టే దాన్ని ఆశ్రయించి వలసలూ అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా మెక్సికో నుంచి ఏటా వచ్చే వేలాదిమంది అక్కడ చిన్నాచితకా పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటారు. స్థానికంగా ఉండే శ్వేత జాతి అమెరికన్లకు ఈ వలసలపై ఆగ్రహావేశాలున్నాయి. దీన్ని సకాలంలో సరిచేయటంలో డెమాక్రాట్లు విఫలమైన కారణంగానే ట్రంప్ వంటి దూకుడైన నేత అమెరికా రాజకీయాల్లో ఆవిర్భవించారు. వర్తమాన స్థితిని ఇలాగే కొనసాగనీయదల్చుకుంటే ట్రంప్ ప్రత్యేకతేముంది? దీన్ని సాకుగా తీసుకుని మరింత ముందుకు చొచ్చుకుపోయేందుకు ఆయన రెడీ అయ్యారు. అలబామాలో పౌర హక్కుల యాత్రకు అక్కడి ప్రభుత్వం ఆటంకం కలిగించవచ్చునన్న సంశయంతో ఆరున్నర దశాబ్దాల క్రితం అప్పటి అధ్యక్షుడు లిండన్ జాన్సన్ గవర్నర్ అనుమతి లేకుండా ఫెడరల్ బలగాలను పంపారు. ఇంకా వెనక్కివెళ్తే 1860ల్లో అప్పటి అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ఈ మాదిరే బలగాలను తరలించిన ఉదంతం ఉంది. ఎన్నడో 1807లో అమెరికాలో తిరుగుబాటు చట్టాన్ని రూపొందించారు. ఏ రాష్ట్రమైనా ఫెడరల్ ప్రభుత్వంపై తిరగబడి ఆత్యయిక స్థితి ఏర్పడితే మెరైన్లను రంగంలోకి దించి వాటిని అణిచేయటం దీని ఉద్దేశం. అప్పట్లో అంతర్యుద్ధాలూ, కొన్ని రాష్ట్రాలు జట్టుకట్టి ఫెడరల్ సర్కారుపై తిరుగుబాటుకు సిద్ధపడటం వగైరా పరిస్థితులను ఎదుర్కొనటానికి ఈ చట్టం తీసుకొచ్చారు. అయితే ఈ అరవయ్యేళ్లలోనూ ఫెడరల్ బలగాలను పంపాల్సిన సందర్భాలు రాలేదని కాదు. 1992లో రోడ్నీ కింగ్ అనే నల్లజాతీయుణ్ణి అత్యంత దారుణంగా హింసించిన కేసులో పోలీసులు నిర్దోషులని తీర్పు వెలువడినప్పుడు ఇదే లాస్ ఏంజెలెస్ దాదాపు వారంరోజుల పాటు అట్టుడికిపోయింది. 50 మంది మరణించటంతో పాటు వందలాది భవంతులు ధ్వంస మయ్యాయి. వేలాది కార్లకు నిప్పుపెట్టారు. ఇప్పుడలా కాదు. నగరంలోని ఒక బ్లాక్‌లో దాదాపు 200 మంది మెక్సికన్ కార్మికులు ఆదివారం ఆందోళనకు దిగారు. కార్లు తగలబెట్టడం, లూటీలు, ఫెడరల్ భవంతులపై రాళ్లు రువ్వటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. క్యాలిఫోర్నియా పోలీ సులే చాలావరకూ అదుపులోకి తెచ్చారు. ఆ ఆందోళన పెద్దగా విస్తరించింది కూడా లేదు.కానీ ట్రంప్ దీన్ని వదలదల్చుకోలేదు. 2020లో తన తొలి ఏలుబడి కాలంలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ను శ్వేతజాతి పోలీసులు ఊపిరాడకుండా చేసి హతమార్చిన ఉదంతం సమయంలో తీవ్ర హింస చెలరేగినా ట్రంప్ ముందుకు కదల్లేకపోయారు. ఆనాటి రక్షణమంత్రి మార్క్ ఏస్పర్, సైనిక బలగాల చీఫ్, అటార్నీ జనరల్ ఫెడరల్ బలగాలను పంపటం ప్రమాదకరమని వారించారు. అందుకే ఈసారి అలాంటివారిని దూరంకొట్టి నిర్విచక్షణగా తనకు మద్దతునిచ్చేవారిని చేరదీశారు. ఇప్పుడు క్యాలిఫోర్నియాకు కేంద్ర బలగాలను పంపాలని నిర్ణయించగానే రక్షణమంత్రి హెగ్సెత్, అటార్నీ జనరల్ బోండీ మద్దతుగా నిలిచారు. ట్రంప్ పని సులభమైంది. రెండోసారి అధికారంలోకొచ్చాక చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న విధానాన్ని ట్రంప్ పాటిస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్ నరమేధాన్ని నిరసిస్తూ విశ్వవిద్యాలయాల్లో చెలరేగిన ఉద్యమం విషయంలో ఆయన ఏం చేశారో ప్రపంచమంతా చూసింది. అందులో పాల్గొన్నవారిని దేశద్రోహులుగా పరిగణించి, సంకెళ్లువేసి జైళ్లకు తరలించటం, దేశం నుంచి గెంటేయటం రివాజుగా మారింది. ప్రస్తుత క్యాలిఫోర్నియా అల్లర్లపైనా ఆయన ఆ వైఖరే తీసుకున్నారు. అసలు తిరుగు బాటు చట్టం అమలును ప్రకటించకుండానే, గవర్నర్‌కు వర్తమానం పంపకుండానే 2,000 మంది బలగాలను అక్కడికి తరలించటం అమల్లోవున్న సంప్రదాయాలను ధిక్కరించటమే! ఏ పార్టీకి చెందిన దేశాధ్యక్షులైనా గతంలో ఇలాంటి దుస్సాహసానికి దిగలేదు. కానీ ఉన్న అధికారాలను మాత్రమే కాదు... ఎక్కడాలేని, ఏనాడూ ఎవరూ వినియోగించని అధికారాలను సైతం దబాయించి అమలు చేయించే నైజం ట్రంప్‌ది. లాస్ ఏంజెలెస్ అల్లర్ల వంటివి ట్రంప్‌కు చేజేతులా ఆ అవకాశాన్నిస్తున్నాయి. అక్కడ చెలరేగిన హింస, అందులో మెక్సికన్ జాతీయ జెండాల ప్రదర్శన స్థానికుల్లో ఆగ్రహావేశాలను రగిలించాయి. విద్వేషాన్ని పెంచాయి. హింసతో దేన్నయినా సాధించు కోవచ్చన్న మనస్తత్వం వికటిస్తుందని ఉద్యమకారులు తెలుసుకోవటం అవసరం. పరిస్థితిని అదుపు చేయటానికి క్యాలిఫోర్నియా ప్రభుత్వానికి సహకరించటమే వారికి శ్రేయస్కరం. -
రెండవ ప్రశ్న
పుస్తకం ప్రచురణ కంటే ఆ పుస్తకాన్ని సాటి రచయితకు చేరవేయడమే ఎక్కువ ఖర్చు అని తెలిసిన రోజు రచయితకు కలిగే ఇబ్బంది, బాధ అన్యులకు తెలియవు. ఎన్నో రాత్రిళ్లు జాగారం చేసి, కొన్ని మార్లు సెలవు పెట్టి, ఇంకొన్నిసార్లు అత్యవసర పనులూ ఆరోగ్య పరీక్షలూ వాయిదా వేసి, ఎలాగోలా పుస్తకం రాసి, అందుకై వేల రూపాయలు వెచ్చించి పుస్తకం ప్రచురించాక రచయితకు ప్రాథమికంగా అనిపించేది సాటి రచయితలు చదివితే బాగుండు, చదివి ఒక మాట చెప్తే బాగుండు అని!ప్రతి కొలతకూ కొన్ని ప్రమాణాలున్నట్టే ప్రతి రచయితకూ కొన్ని ప్రమాణాలు ఉంటాయి. తాను ప్రచురించిన పుస్తకాన్ని ఏ పదిమంది చదివితే రచయితగా గుర్తింపు పొందుతాడో అతనికి అంచనా ఉంటుంది. కాని ఆ పదిమందికి పుస్తకం పంపడం ఎట్లా? వాట్సప్‌లో మెసేజ్ పెట్టాలి. అడ్రస్ తెప్పించుకోవాలి. కొరియర్ ఆఫీసుకు వెళ్లాలి. కొరియర్ చేయాలి. పుస్తకం వెల నూట యాభై అయితే కొరియర్ వెల కూడా అంతే ఉంటుంది. ఖర్చు మీద ఖర్చు. అయినా సరే పుస్తకం పంపి సంతృప్తి పడతాడు రచయిత. అయితే పుస్తకం అందుకున్నవారు వెంటనే పుస్తకం చదివేస్తారా? కొందరు ఫ్రమ్ అడ్రస్‌ను చూసి కవర్‌ను విప్పనే విప్పరు. కొందరు కవర్ విప్పి కృతజ్ఞతల కాలమ్‌లో తన పేరేమైనా రాశాడా చూస్తారు. కొందరు ముందుమాటలు తిరగేసి– అవి రాసిన వాళ్ల పేరు చేసి – హు... ఇతగాడు ముందుమాట రాసేంతటి వాడయ్యాడా అని ఆ పగను పుస్తకం మీద చూపి పక్కన పెడతారు. కొందరి అశ్రద్ధ వల్ల– పాపము శమించుగాక– పుస్తకం వచ్చీ రాగానే న్యూస్పేపర్లలో కలిసిపోయి మరి కనిపించదు. పుస్తకం అందుకున్న పదిమందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ‘పుస్తకం అందింది. థ్యాంక్యూ. చదివి అభిప్రాయం తెలుపగలను’ అని మెసేజ్ పెట్టరు. రచయితే చూసి చూసి ‘దొరవారూ... పుస్తకం అందినదా’ అని మెసేజ్ చేస్తే అప్పుడు బొటనవేలు చూపుతారు.మనం పంపిన పుస్తకాన్ని అందుకున్నవారు చదవాలి అనే అంధ విశ్వాసం నుంచి బయట పడటం రచయితల ఆరోగ్యానికి మంచిది అనిపిస్తుంటుంది. పుస్తకం అందుకున్నవారు గతంలో మనకు తెలిసినవారు అని నేడు అనుకోకూడదు. గతంలో వారు రచయితలు కావచ్చు. గతంలో పుస్తకాలు చదువుతూ ఉండుండొచ్చు. ఇప్పుడూ సాహితీ సమావేశాల్లో అధ్యక్ష స్థానాల్లో, వక్తల స్థానాల్లో కనిపిస్తూ ఉండొచ్చు. అంతమాత్రం చేత వారు పుస్తకాలు చదువుతున్నట్టుగా భావించరాదు. కొందరు పిల్లల బాగోగుల్లో ఉంటుండొచ్చు. కొందరు ఉద్యోగ ఒత్తిడిలో ఉంటుండొచ్చు. కొందరు కుటుంబ సభ్యులూ... బంధువులూ తెచ్చే తంటాల్లో ఉంటారు. కొందరికి ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి. కొందరు ఫేస్బుక్కుల్లో, రీల్సుల్లో జీవితాన్ని ఖర్చు చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ లేకపోయినా తోటి రచయితపై చిన్నచూపు గ్యారంటీ. అదీ గాకుంటే వ్యక్తిగత అభిరుచి చాలా ఎదిగి చాలా గొప్ప సాహిత్యపు రుచిలో ‘ఈ యావరేజ్ రచన ఏం చదువుతాములే’ అనుకుంటూ కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నా సరే, ఒక కొత్త పుస్తకం రచయిత పంపితే చూసి నాలుగు పేజీలైనా చదివి, పుస్తకాన్ని అంచనా గట్టి, చిన్నపాటి వ్యాఖ్య చేయగల సమర్థులే వీరు. పుస్తకం పంపిన రచయితను ఆ మాత్రం ఉత్సాహపరచలేరా? పుస్తకాలను రచయితలే చదవనప్పుడు పాఠకులు ఎందుకు చదవాలి అనే ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది. నిజమే. ఒక పుస్తకం వస్తే, అది మంచి పుస్తకమైనా సరే, వర్తమానంలోని సాటి రచయితలు ఎవరూ దానిపై పోస్ట్ రాయరు. నేను చదివాను... మీరూ చదవండని రికమండ్ చేయరు. అసలు చూడనట్టే నటిస్తారు. కాని తమ పుస్తకాలు మాత్రం అందరూ చదివి, పోస్టులు రాయాలి... పాఠకులు చదవాలి అని కోరుకుంటారు. కామన్ సెన్ ్స ప్రకారం ఇదెలా సాధ్యం? మనం ఇస్తే కదా తిరిగి వస్తుంది.క్రికెట్ వ్యాపారులు తమ క్రికెట్‌ను బుర్రల్లో ఎక్కించగలుగుతున్నారు. భక్తి ఆరాధకులు భక్తిని జనుల జీవనంలో అనుక్షణం నింపడానికి ప్రయత్నిస్తున్నారు. సినిమా బేహారులు పాలాభిషేకాలు ఎలా చేయాలో, పోస్టర్ల ముందు పొర్లుదండాలు ఎలా పెట్టాలో నరాల్లో కూరుతున్నారు. మత్తుపదార్థాలు అమ్మేవాళ్లు వాటికై జీవితాలు అంకితం చేసే స్థాయిలో సామాన్యులను బానిసలుగా మార్చగలుగుతున్నారు. వీరంతా సక్సస్ అయినప్పుడు రచయితలందరూ కలిసి ఒకరికై ఒకరు మద్దతుగా నిలిచి ప్రజలను పాఠకులుగా మలచలేరా? క్యూలలో ఎగబడని, తొక్కిసలాటలకు చోటివ్వని, అల్పమైన కారణాలకు, ఆసక్తులకు జీవితాలను బలి ఇవ్వని వివేకవంతమైన జిజ్ఞాసువు సమాజాన్ని నిర్మించలేరా? దేశంలో సగటు మనిషి, విద్యార్థి, గృహిణి, ఉద్యోగి, వర్తకునికి అవసరమైన మేధో ఆహారమనే బుర్ర తిండి పుస్తకంలో దొరుకుతుందని ఒప్పించలేరా?‘ఇటీవల నీవు చదివిన పుస్తకం ఏది?’ అనే ప్రశ్న కేవలం ఉద్యోగార్థిని ఇంటర్వ్యూల్లో అడిగేది మాత్రమే అనుకున్నన్నాళ్లు ఈ సమాజపు మేధోవికాస స్థాయి ఎదగదు. మరేం చేయాలి? మన మర్యాదల ప్రమాణాలు మారాలి. ప్రశ్నల తీరు మారాలి. సంస్కారాన్ని ఎంచేందుకు కొలమానాలు మారాలి. సమాజంలోని ప్రతి లేయర్లో కుశల ప్రశ్నల నమూనాను నిర్దేశించుకోవాలి. సాటి మనిషి ఎదురుపడితే మొదటి ప్రశ్న– ఎలా ఉన్నావు? అయ్యాక రెండవ ప్రశ్న– ఏ పుస్తకం చదువుతున్నావు అనేదిగానే ఉండాలి.సవాలక్ష రుగ్మతలకు మాత్రమే కాదు అగణిత తొక్కిసలాటలకూ ఈ ప్రశ్నే టీకా. -
ప్రాణాంతక నిర్లక్ష్యం
హద్దులెరుగని అభిమానం, నిర్వాహకుల అంతులేని నిర్లక్ష్యం, తన బాధ్యతేమిటో పూర్తిగా మరి చిన ప్రభుత్వం... వెరసి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం సాయంత్రం 11 నిండు ప్రాణాలు బలయ్యాయి. మరో 50 మంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, అందులో అయిదుగురి స్థితి ఆందోళనకరంగా ఉన్నదంటున్నారు. దుర్మరణం పాలైన వారిలో ఎక్కువమంది టీనేజ్ వయస్కులు. ఎంతో భవిష్యత్తుగల యువత ప్రాణాలు ఇలా హఠాత్తుగా కడతేరిపోవటం వారి తల్లిదండ్రులకూ, తోబుట్టువులకూ మాత్రమే కాదు... సమాజం మొత్తానికి తీవ్ర దుఃఖం కలిగించే అంశం. ఒక కథనం ప్రకారం ఈ కార్యక్రమానికి రాయల్ చాలెంజెర్స్‌బెంగళూరు(ఆర్సీబీ), కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ), డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ సంస్థల్లో ఏ ఒక్కరూ అనుమతి తీసుకోలేదు! ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఇప్పుడు సిటీ పోలీసు కమిషనర్‌నూ, డెప్యూటీ కమిషనర్‌నూ సస్పెండ్ చేశామంటున్నారు. మంచిదే. ఇతరుల మాటేమిటి? సెలబ్రిటీలు వచ్చినప్పుడూ, రాజకీయ సభలప్పుడూ, మతసంబంధ ఉత్సవాల సంద ర్భాల్లో భారీయెత్తున జనం గుమిగూడటం... తొక్కిసలాటలు, మరణాలు రివాజుగా మారాయి. కానీ ప్రభుత్వాలు, పోలీసులు నేర్చుకున్నదేమీ ఉండటం లేదని ఇవి పునరావృతం అవుతున్న తీరు చూస్తే తెలుస్తుంది. ఈ ఏడాది జనవరి మొదట్లోనే తిరుపతిలో టీటీడీ నిర్వాకం కారణంగా తొక్కి సలాటకు ఆరుగురు బలయ్యారు. ఆ నెలాఖరులో ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా వద్ద ఇలాంటి దుర్ఘటనలోనే 30 మంది చనిపోయారు. ఆ మరుసటి నెలలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట వల్ల 18 మంది కన్నుమూశారు. ఎన్ని ప్రాణాలు పోతే ప్రభుత్వాలు మేల్కొంటాయి? సామాజిక మాధ్యమాల ప్రభావమేమిటో అందరికీ తెలుసు. వాటిల్లో ఆ కార్యక్రమం గురించి ఆర్‌బీసీయే విస్తృత ప్రచారం చేసింది. తామున్నచోటికి అభిమాన ఆటగాళ్లు రాబోతున్నారని యువత ఉవ్విళ్లూరటం అసాధారణమేమీ కాదు. మన దేశంలో క్రికెట్‌కు మరే క్రీడకూ లేనంత ఆకర్షణ ఉంది. విరాట్ కోహ్లీ వస్తున్నాడంటే అది మరిన్ని వందల రెట్లు పెరుగుతుంది. ఇవి చాలవా పకడ్బందీ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవటానికి? నిజానికి బెంగళూరు, దాని శివారు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచే అభిమానుల కోలాహలం మొదలైందని, బుధవారం ఉదయం నుంచి అది క్రమేపీ పెరుగుతూ పోయిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇదంతా గమనించాక సాయంత్రం కార్యక్రమానికి అభిమానులు పోటెత్తుతారన్న అంచనా వుండొద్దా? బుధవారం వీధులన్నీ కిక్కిరిసిన వైనం గమనించి క్రికెటర్ల ర్యాలీని రద్దుచేసి కూడా 35,000 మందికి మాత్రమే సరిపడే స్టేడియంలో వేడుకలు సజావుగా ముగుస్తాయని ఎలా అనుకోగలిగారు? అందులోనూ ఈ కార్యక్రమానికి టిక్కెట్ విక్రయాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేవు. మొత్తానికి స్టేడియంకు వెళ్తే తమ అభి మాన క్రికెటర్లనూ, వారు గెల్చుకున్న కప్పునూ స్వయంగా చూడొచ్చన్న సందేశం ప్రచారమైంది. పర్యవసానంగా నియంత్రణకు అందని రీతిలో లక్షల సంఖ్యలో అభిమానులు గుమిగూడారు.కార్యక్రమం కోసం 5,000 మంది పోలీసులను మోహరించామని, అయినా ఈ విషాదం చోటు చేసుకున్నదని కంటతడి పెడుతూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు. పోలీసులు తమ శాయశాక్తులా విధులు నిర్వర్తించారని, దాదాపు మూడు లక్షలమంది రావటంతో విఫల మయ్యామని ఆయన వివరించారు. కానీ ఆ తర్వాత కొన్ని గంటలకే భద్రతా ఏర్పాట్ల కోసం 1,000 మంది పోలీసుల్ని రంగంలోకి దించామని ప్రభుత్వ న్యాయవాది రాష్ట్ర హైకోర్టులో చెప్పారు. ఇది ప్రభుత్వ యంత్రాంగంలో నెలకొన్న అయోమయాన్ని సూచిస్తోంది. అసలు ఆ వేయి మందైనా ఉన్నారా అనే సంశయాన్ని కలగజేస్తోంది. ప్రత్యక్ష సాక్షులైతే పోలీసుల సంఖ్య మొదటి నుంచీ తక్కువేనంటున్నారు. ఇంతమంది గుమిగూడే సందర్భాల్లో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్డీఎంఏ) సలహా తీసుకోవాలి. కానీ అదీ జరిగినట్టు లేదు. అసలు ఎవరు ఏ గేటువైపు వెళ్లాలో, ఎవరెక్కడ కూర్చోవాలో సూచించే బోర్డులు లేవు. మహిళలు, పిల్లల కోసమైనా విడిగా ప్రవేశద్వారం ఉండాలని నిర్వాహకులకు తోచలేదు. అభిమానుల్ని క్యూలో నియంత్రించేవారూ లేరు, పకడ్బందీ బ్యారికేడ్లూ లేవు. ఉన్న కొన్ని బ్యారికేడ్లూ తొక్కిసలాటలో ధ్వంసమయ్యాయి. ఇన్ని లోపాలు పెట్టుకుని ఊహించని స్థాయిలో జనం వచ్చిపడటంవల్లే ఇదంతా జరిగిందని చెబితే సరిపోతుందా? అసలు ఫైనల్ మ్యాచ్ జరిగిన 24 గంటలలోపే క్రికెటర్లకు నగరంలో సన్మానం చేయాలన్న తొందరెందుకు? అందుకోసం ఒకటి రెండు రోజుల వ్యవధి తీసుకుంటే జరిగే నష్టమేమిటి? జనం వేలంవెర్రిగా అభిమానించే క్రికెటర్లు వస్తున్నప్పుడూ, వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించాలనుకున్నప్పుడూ తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం వుంటుందన్న అంచనా లేకపోవటం సహించరానిది. అప్పుడెప్పుడో ఆఫ్రికా దేశాల్లోనూ, వర్తమానంలో పాలస్తీనాలోనూ రోజుల తరబడి పస్తులుండి అనుకోకుండా ఆహార పదార్థాలతో వచ్చిన వ్యాన్ కోసం జనం ఎగబడి తొక్కిసలాటలు చోటుచేసుకున్న ఉదంతాలున్నాయి. ప్రాణాలు నిలుపుకోవా లన్న వారి తాపత్రయాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వెర్రి అభిమానం కోసమో, విశ్వాసాల కోసమో ఎగబడటం, ప్రాణాలు కోల్పోవటం, ప్రభుత్వాలు తమ బాధ్యతేమీ లేదన్నట్టు ప్రవర్తించటం, మళ్లీ మరో విషాదం చోటుచేసుకునేవరకూ అంతా సవ్యంగా వున్నట్టు నటించటం ఎంతకాలం? కనీసం ఈ ఉదంతమైనా దేశంలో అందరి కళ్లూ తెరిపించాలి. ఇలాంటివి జరగనీయరాదని సంకల్పించాలి. -
కొరియా నేతకు పెను సవాళ్లు
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై నియంతృత్వం ప్రతిష్ఠించటానికి ప్రయత్నించిన మితవాద పక్ష నాయకుడు, మాజీ అధ్యక్షుడు యూన్ సెక్–యోల్‌కు దక్షిణ కొరియా ప్రజానీకం తగిన బుద్ధి చెప్పారు. భవిష్యత్తులో ఏ నాయకుడూ నియంత పోకడలకు పోకుండా మంగళవారం జరిగిన ఎన్నికల్లో గట్టి గుణపాఠం నేర్పారు. ఇటీవలి దశాబ్దాల్లో కనీవినీ ఎరుగని భారీ మెజారిటీ కట్టబెట్టి మధ్యేవాద వామపక్షమైన డెమాక్రటిక్ పార్టీని అందలం ఎక్కించారు. ఆ పార్టీ అభ్యర్థి లీ జే మ్యూంగ్ బుధవారం అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక చెప్పినట్టు దక్షిణ కొరియా ఆర్థికంగా గడ్డుస్థితిలో వుంది. ఇందుకు యోల్ అస్తవ్యస్త పాలన కారణం. దీన్ని కప్పిపుచ్చుకోవటానికే ఆయన నిరుడు డిసెంబర్లో ఒక చీకటిరాత్రిలో ఆత్యయిక స్థితిని ప్రకటించి, సైనిక పాలన విధించారు. తనకెదురులేకుండా చేసుకోవటానికి మ్యూంగ్‌పై ముందే దేశద్రోహంతోసహా రకరకాల ఆరోపణ లతో కేసులు రూపొందించారు. కానీ ఆ నిశిరాత్రి వేళే దేశమంతా రోడ్లపైకి రావటంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. రాత్రికి రాత్రి విధించిన సైనిక పాలనను తెల్లారుజాముకే తొలగించక తప్పలేదు. ఆ ప్రహసనానికి తెగించకపోతే యోల్ 2027 వరకూ అధికారం చలాయించేవారు. యోల్ తన చేష్టలకు చెప్పిన కారణాలు చిత్రమైనవి. పొరుగునున్న శత్రుదేశం ఉత్తరకొరియాకు చెందిన కమ్యూనిస్టు పాలకులతో విపక్షాలు కుమ్మక్కయి, దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నాయన్నది ఆయన ఆరోపణ. అయితే ఆయన్ను, ఆ పార్టీనీ మెజారిటీ జనం నమ్మలేదు. కొత్త అధ్యక్షుడు మ్యూంగ్ ముందున్న సవాళ్లు తక్కువేమీ కాదు. అంతర్గతంగా దేశం కుడి, ఎడమలుగా చీలిపోవటం, ఆర్థికవ్యవస్థ కుంగుబాటులో ఉండటం, జనాభాలో యువత శాతమే తక్కువనుకుంటే వారికి కూడా ఉపాధి కల్పించే స్థితి లేకపోవటం వంటివి ఆయన దక్షతను పరీక్షించబోతున్నాయి. మరోపక్క అంతర్జాతీయంగా పరిస్థితులు తారుమారయ్యాయి. దక్షిణ కొరియాకు ఆది నుంచీ అన్నివిధాలా బాసటగా వున్న ఏకైక దేశం అమెరికా. కానీ మ్యూంగ్ ఆ మధ్య చెప్పినట్టు అక్కడ మొన్న జనవరిలో డోనాల్డ్ ట్రంప్ పీఠం ఎక్కాక అంతర్జాతీయంగా ‘ఆటవిక పాలన’ నడుస్తోంది. స్వపర భేదం లేకుండా అందరిపైనా సుంకాల భారం మోపేందుకు ఆయన తహతహ లాడుతున్నారు. తమ సైన్యం రక్షణ కోరుకునే దేశాలు అందుకు భారీయెత్తున డబ్బు చెల్లించాలంటున్నారు. దక్షిణ కొరియాలో అమెరికా సైన్యం గణనీయంగానే ఉంది. అంతమాత్రాన మ్యూంగ్ ఆ దేశానికి దాసోహం అనే స్థితి ఉండకపోవచ్చు. అలాగే గతాన్ని మరిచి జపాన్‌తో సాన్నిహిత్యం పాటించాలన్న అమెరికా సలహాను యోల్ శిరసా వహించిన మాదిరిగా మ్యూంగ్ అంగీకరించక పోవచ్చు. డెమాక్రటిక్ పార్టీ మొదటి నుంచీ జపాన్ తన తప్పులు అంగీకరించి వలసపాలనలో కొరియా వాసులపై సాగించిన దుష్కృత్యాలకు క్షమాపణ చెప్పాలని, అందుకు మూల్యం చెల్లించా లని డిమాండు చేస్తోంది.ఆర్థికవ్యవస్థ బాగుకు చైనా సహాయం స్వీకరించాలని మ్యూంగ్ అనుకుంటున్నా అమెరికాతో స్నేహానికి అది అవరోధం అవుతుంది. మితవాదులు మొదటి నుంచీ దీన్నే ప్రచారం చేస్తూ వచ్చారు. ప్రాంతీయ భద్రతలో భాగంగా అమెరికా, జపాన్‌లతో సాన్నిహిత్యం కొనసాగుతుందని డెమాక్రటిక్ పార్టీ ఆ మధ్య ప్రకటించింది. చైనా, ఉత్తర కొరియాలతో వచ్చిన విభేదాల పరిష్కారానికి కృషి చేస్తానని మ్యూంగ్ తాజాగా తెలిపారు. కానీ ఆచరణలో అదెంత వరకూ సాధ్యమన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి గత అధ్యక్షులెవరికీ లేనంత బలం ఆయనకు సమకూడింది. చట్టసభలో సైతం ఆయన పార్టీదే పైచేయి. దీన్ని ఆయన ఎలా ఉపయోగిస్తారన్నదే అందరిలోనూ ఉన్న సంశయం. ఎందుకంటే ఇంతవరకూ కొత్త అధ్యక్షుడు రాగానే గత అధ్యక్షుడిపై రకరకాల ఆరోపణలతో కేసులు పెట్టడం రివాజుగా మారింది. అయితే దేశాన్ని నియంతృత్వంలోకి నెట్టాలని చూసి యోల్ తన గొయ్యి తానే తవ్వుకున్నారు. ఆయనకు గుదిబండగా మారటానికి ఆ కేసు ఒక్కటీ చాలు. ‘యుద్ధంలో విజయం సాధించటం చాలా ముఖ్యమే. కానీ అసలు యుద్ధం లేకుండానే విజయం సాధించటం అంతకన్నా ఎన్నో రెట్లు కీలకమైనది’ అని మ్యూంగ్ ఇటీవల ప్రకటించారు. చైనా, ఉత్తర కొరియాల విషయంలో దీన్ని ప్రయోగించే అవకాశం ఎటూ ఉంది. కానీ అంతర్గత వ్యవ హారాల్లో కూడా ఈ నీతి పాటిస్తారా? దేశంలో అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది దాని గురించే!ఎందుకంటే గతంలో జాతీయవాదం పేరిట యోల్ విద్వేషాలు రెచ్చగొట్టారు. ఉత్తర కొరియాతో ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నదన్న అభిప్రాయం కలగజేశారు. దానికితోడు ఫెమినిస్టులపై ఆయన ద్వేషం అవధులు దాటింది. దేశ ఆర్థికవ్యవస్థ పతనానికి కూడా వారే కారకులన్న స్థాయిలో యోల్ ప్రచారం చేశారు. అదెంతగా పనిచేసిందంటే ఆ విషయంలో ఏం మాట్లాడితే ఏమవుతుందోనన్న భయంతో డెమాక్రటిక్ పార్టీ మౌనం వహించింది. కానీ దేశంలో హింసాత్మక ఘటనల్లో అత్యధిక బాధితులు మహిళలు. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, వివక్ష ఏమేరకు తగ్గినా వారు సంతోషిస్తారు. యువతకు ఉపాధి, పడిపోయిన జననాల రేటును పట్టా లెక్కించటం కూడా పరిష్కరించాల్సిన సమస్యలే. ఇక పింఛన్లు తీసుకునేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. 80,000 కోట్ల డాలర్ల పింఛన్ నిధి క్రమేపీ ఆవిరవుతున్న దశలో ఉత్పాదకత పెంచి ఖజానా కళకళ లాడేలా చేయటం ఎలా అన్నది అంతుబట్టడం లేదు. ముందు సుస్థిరత సాధించి, ఈ సమస్యలపై దృష్టి సారిస్తే తప్ప మ్యూంగ్ తనకొచ్చిన జనాదరణను నిలబెట్టుకోవటం అంత సులభమేమీ కాదు! -
రష్యాకు తత్వం బోధపడాలి!
శాంతి సాధన కోసం తుర్కియేలో రష్యా–ఉక్రెయిన్ల మధ్య చర్చలకు 24 గంటల ముందు ‘ఆపరేషన్ స్పైడర్స్ వెబ్’ పేరిట ఉక్రెయిన్ ప్రయోగించిన వందలాది డ్రోన్లు ఆదివారం రష్యా సైనిక స్థావరాలు అయిదింటిలో భారీ విధ్వంసం సృష్టించగలిగాయి. మరోవైపు రష్యా అంతకుముందూ, ఆ తర్వాతా ఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇలా పరస్పర దాడుల నేపథ్యంలో సోమవారం జరిగిన చర్చలు సహజంగానే గంటన్నరలో ముగిశాయి. కరచాలనాలు లేకుండా, కాల్పుల విరమణ ఊసెత్తకుండా యుద్ధఖైదీల మార్పిడిపై ఒప్పందం కుదుర్చుకుని రెండు బృందాలూ నిష్క్రమించాయి. అయిదు స్థావరాలపై ఉక్రెయిన్ దాడులకు ప్రయత్నించిన మాట వాస్తవమే అయినా మూడు చోట్ల దాడుల్ని నిరోధించగలిగామని రష్యా చెప్పుకుంటోంది. అందుకు భిన్నంగా తమ డ్రోన్లు రష్యాలోని 41 బాంబర్ విమానాలను ధ్వంసం చేశాయని ఉక్రెయిన్ వివరిస్తోంది. దానికి వేలకోట్ల నష్టం వాటిల్లిందని చెబుతోంది. రష్యా దాడుల పర్యవసానంగా ఈ మూడేళ్ల కాలంలో ఉక్రెయిన్ సైన్యం వేలాదిమందిని కోల్పోయింది. ఇలాంటి నష్టాలను పెద్ద దేశం కనుక రష్యా భర్తీ చేసుకోగలుగుతోంది. అందుకే నల్లసముద్రంలో రష్యా దూకుడును తగ్గించేందుకు ఉక్రెయిన్ పూర్తిస్థాయిలో డ్రోన్లను నమ్ముకున్నట్టు కనబడుతోంది. యుద్ధం మొదలైన తొమ్మిది నెలల తర్వాత ఉక్రెయిన్ తొలిసారి 2022 డిసెంబర్లో రష్యా భూభాగంలో దాడులు మొదలు పెట్టింది. ఈ మూడేళ్ల కాలంలో తన స్థావరాలు, ఇంధన డిపోలు, యుద్ధ విమానాల గోడౌన్లు పటిష్టం చేసుకోవటంలో రష్యా శ్రద్ధ పెట్టిన మాట నిజమే అయినా ఉక్రెయిన్ సైతం డ్రోన్ల వినియోగంలో తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే పనిలోబడింది. ఆ విషయంలో అది విజయవంతమైందని ఆదివారంనాటి దాడులు వెల్లడిస్తున్నాయి. ప్రత్యర్థి దేశం తమతో పోలిస్తే పిపీలకమని, తమది అగ్రరాజ్యం, సంపన్న దేశమని మిడిసిపడే పరిస్థితి వర్తమాన కాలంలో ఎవరికీ లేదని ఉక్రెయిన్ దాడి వెల్లడిస్తోంది. యుద్ధం తప్పనిసరైనప్పుడు అందుకు అనుగుణంగా లోతైన అధ్యయనం చేసి, ఎప్పటికప్పుడు తనను తాను తీర్చిదిద్దుకున్న పక్షమే దీటుగా నిలబడగలుగుతుంది. ఉక్రెయిన్ ఆ పని చేయగలిగిందని ఈ ఉదంతం నిరూపిస్తోంది. యుద్ధం ప్రారంభించిందీ, దాన్ని వద్దు వద్దని ఎంతమంది చెబుతున్నా వినకుండా కొనసాగిస్తున్నదీ రష్యాయే గనుక అది ప్రస్తుత నష్టానికి తనను తానే నిందించుకోవాలి. చర్చలు ప్రారంభమయ్యాకైనా గౌరవప్రదంగా కాల్పుల విరమణకు సిద్ధమై తన డిమాండ్లేమిటో చెబితే వాటిపై ఉక్రెయిన్ వైఖరేమిటో తేటతెల్లమయ్యేది. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడినా, నిలిచిపోయిన యుద్ధాన్ని తిరిగి కొనసాగనీయరాదన్న ఆత్రుత అందరిలో వుండేది. అందువల్ల కొంత రాజీకి ఉక్రెయిన్ను ఒప్పించటానికి కూడా ప్రయత్నాలు సాగేవి. కానీ చర్చలకు ఒప్పుకున్నాక కాల్పుల విరమణ ఇంకా ఉనికిలోకి రాలేదన్న ఏకైక కారణంతో అది దాడుల్ని కొనసాగించింది. రష్యా దురాక్రమించిన భూభాగమంతా వెనక్కిస్తే తప్ప యుద్ధ విరమణ ఉండబోదని మొన్న జనవరి నెలాఖరున ఉక్రెయిన్ చెప్పటంతో ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి ఇకపై అమెరికా నిఘా సమాచారం అందబోదని ప్రకటించారు. తాజా దాడులు గమనిస్తే ఉక్రెయిన్ ఆ అవరోధాన్ని కూడా అధిగమించగలిగిందని అర్థమవుతుంది. పైగా రష్యా గడ్డపైకి ట్రక్కుల్లో డ్రోన్లు తీసుకెళ్లి, లక్ష్యాలను చేరుకోగానే అవి ఒక్కసారిగా ఎగిరి యుద్ధ విమానాలను ధ్వంసం చేసేలా పథకం రచించింది.ఈ పరిణామానికి రష్యా ఎటూ ఆందోళన పడుతుంది. కానీ పాశ్చాత్య దేశాలు సైతం కంగారు పడక తప్పదు. ఎందుకంటే ఎవరి నిఘా సాయమూ లేకుండా చవగ్గా లభించే డ్రోన్లతో రష్యావంటి దేశంలో పెనువిధ్వంసం సృష్టించగలగటం మాటలు కాదు. తమ పొరుగునేవుండి, తమ ప్రోత్సాహంతో రష్యాను చీకాకు పర్చటానికి ముందుకొచ్చిన చిన్న దేశం సైనికంగా ఇంత పటిష్టం కావటం పాశ్చాత్య దేశాలు జీర్ణించుకోలేనిది. 2014 మొదట్లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా వుండిన విక్టర్ యెనుకోవిచ్ తమ కీలుబొమ్మ కాలేదని అతన్ని కుట్రపూరితంగా పడగొట్టి జెలెన్స్కీని ప్రతిష్టించింది పాశ్చాత్య దేశాలే. అందుకు అమెరికా సైతం దన్నుగా నిలబడింది. నాటోను తూర్పువైపు విస్తరించాలన్న ఆ దేశాల దురాలోచనే ఇందుకు కారణమని గ్రహించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ దురాక్రమణకు తెరతీశారు. డ్రోన్ దాడుల్లో రష్యా కోల్పోయిన యుద్ధ విమానాలు టియూ–95, టియూ–160 విమానాలు. అవి క్రూయిజ్ క్షిపణుల్ని ప్రయోగించగల సామర్థ్యం వున్నవి. ఉక్రెయిన్ చెబుతున్నదే నిజమైతే రష్యా వైమానిక పాటవం 34 శాతం కోల్పోయిందని సైనిక నిపుణుల అంచనా. వీటిని తిరిగి సమకూర్చుకోవాలంటే వేలాది కోట్ల రూబుళ్ల వ్యయమవుతుంది. రష్యాకు తత్వం బోధపడినట్టేనా? తమ దాడులతోపాటు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షల తీవ్రతను పెంచాలన్నది జెలెన్స్కీ వాదన. కానీ అమెరికా కనుసన్నల్లో నడిచే ఆ దేశాలు అందుకు సిద్ధపడలేవు. యుద్ధాన్ని ప్రారంభించటం సులభమే, కొనసాగించటమూ పెద్ద కష్టం కాదు. కానీ ముగించటం అత్యంత క్లిష్టమైనది. ఇరుపక్షాలకూ అప్పటికే యుద్ధం ప్రతిష్టాత్మకంగా మారిపోతుంది. విరమణకు సిద్ధపడితే దేశాన్ని పాదాక్రాంతం చేశారన్న అపఖ్యాతి వస్తుంది. అలాంటి అవమానాన్ని దిగమింగటానికి జెలెన్స్కీ సిద్ధంగా వున్నా పుతిన్ ససేమిరా అనటమే ప్రస్తుత సమస్య. ఇప్పటికే ఎంతో జాప్యం జరిగింది. కనుక ఈ యుద్ధం ఆపటానికి ప్రపంచ దేశాలు ప్రయత్నించాలి. తగిన హామీలిచ్చి పుతిన్‌ను ఒప్పించాలి. -
సంయమనం అవసరం
నెత్తురు చిందకుండా, నష్టం జరగకుండా యుద్ధం సాగుతుందనీ, ముగుస్తుందనీ ఎవరూ అనుకోరు. ప్రత్యర్థిని చిత్తు చేద్దామని ఇరుపక్షాలూ విశ్వప్రయత్నం చేస్తాయి. కానీ అనేక కారణాలవల్ల ఎవరో ఒకరినే విజయం వరిస్తుంది. ఇందులో సరైన అంచనాలకు రాలేకపోవటం దగ్గరనుంచి స్థానిక వాతావరణ స్థితిగతుల వరకూ చాలా వుంటాయి. ఈ సంగతి తెలిసి కూడా మన విపక్షాలు, ప్రత్యేకించి కాంగ్రెస్ మొన్నటి ‘ఆపరేషన్ సిందూర్’లో మనకు కలిగిన నష్టాలగురించి వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాయి. యాదృచ్ఛికంగానే కావొచ్చుగానీ... మన రక్షణ దళాల చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ శనివారం సింగపూర్‌లో మాట్లాడుతూ మన దళాలు చేసిన కొన్ని ‘వ్యూహాత్మక తప్పిదాల’ కారణంగా జెట్ విమానాలు కోల్పోయామని చెప్పటం వివాదాస్పదమైంది. ఆ అంశాన్ని ప్రభుత్వ పెద్దలకు వదలటం లేదా వారితో చర్చించి ఎప్పుడు ఏ విధంగా చెప్పాలో సలహా తీసుకోవటం సరైన విధానం. విదేశీ గడ్డపై చెప్పటమైతే ఎంతమాత్రమూ సరికాదు. పైగా ఆయన సింగపూర్ వెళ్లింది ఏటా జరిగే అంతర్ ప్రభుత్వాల భద్రతా వ్యవహారాలపై నిర్వహించే ‘షాంగ్రీ లా డైలాగ్’ కోసం. అందులో పాకిస్తాన్ త్రివిధ దళాల చీఫ్ కూడా పాల్గొన్నారు. ఒకపక్క మన ఎంపీల అఖిలపక్ష బృందాలు పాకిస్తాన్ ఆగడాల గురించీ, వాటిని నిలువరించక తప్పని స్థితి గురించీ వివరించటానికి వేర్వేరు దేశాల్లో పర్యటిస్తున్నాయి. కనుక జనరల్ చౌహాన్ ప్రకటన ఏ రకంగా చూసినా సమయం, సందర్భం లేనిది. కొందరు మాజీ సైనికాధికారులూ, నిపుణులూ చెప్పినట్టు పాకిస్తాన్‌కు మన దళాలు కలిగించిన భారీ నష్టంతోపాటు దీన్నీ చెప్పివుంటే ఇంత వివాదమయ్యేది కాదేమో! గత నెల 7 నుంచి పదో తేదీ వరకూ సాగించిన దాడుల్లో మన నష్టం ఏపాటో చెప్పాలని విపక్షాలు కోరుతున్నాయి. దాడి చేయటానికొచ్చిన రఫేల్ యుద్ధ విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ప్రచారం ఆధారంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఈ డిమాండ్ మొదలుపెట్టారు. మన సైనిక దళాలు సాధిస్తున్న విజయాలను ఎన్డీయే ప్రభుత్వం తన సత్తాకు ప్రతీకగా చెప్పుకోవటాన్ని నిరోధించేందుకు విపక్షాలు ఈ ప్రయత్నం చేసివుండొచ్చు. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా దాడిచేయాలనే అంశాలను పూర్తిగా త్రివిధ దళాలకు అప్పగించాక వాటిపై అనుకూలంగా లేదా వ్యతిరేకంగా మాట్లాడటం ఎవరు చేసినా తప్పే. యుద్ధంలో తొలి క్షతగాత్ర సత్యమేనంటారు. ఎందుకంటే అవతలి పక్షాన్ని చావుదెబ్బ తీశామని, అనేకమంది శత్రు సైనికుల్ని హతమార్చామని, కీలక స్థావరాలు ధ్వంసం చేశామని ప్రభుత్వాలు చెప్పటం ప్రపంచంలో ఎక్కడైనా వున్నదే. యుద్ధం ముగిసిన కొన్నాళ్లకుగానీ వాస్తవ గణాంకాలు బయటకు రావు. మన విపక్షాలు అంతవరకూ ఆగలేకపోయాయి. పాక్ మీడియా వార్తల్ని విశ్వసించి మన ప్రభుత్వాన్ని నిలదీయటం మొదలుపెట్టాయి. ఇదంతా రాజకీయంగా బీజేపీకి లాభిస్తుందన్న ఆందోళనే దీనికి కారణం. ఎప్పుడూ లేనివిధంగా ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో సామాజిక మాధ్యమాల్లో, చానెళ్లలో మన సేనలు పాకిస్తాన్ నగరాలను నేలమట్టం చేయటం మొదలుకొని పలు విజయాలు సాధించినట్టు ప్రచారం సాగింది. ఇదెంత ముదిరిందంటే... ఒక దశలో మన ప్రభుత్వం ఖండించాల్సి వచ్చింది కూడా. మరోపక్క యుద్ధంవల్ల కలిగే అనర్థాల గురించి చెప్పిన మాజీ సైనికాధికారులనూ, వారి కుటుంబసభ్యులనూ దూషించటం, ఉగ్రవాదుల దుర్మార్గానికి భర్తను కోల్పోయిన యువతి ముస్లింలపై ద్వేషం వద్దని అన్నందుకు ఆమెను దుర్భాషలాడటం వంటి వైపరీత్యాలూ చోటుచేసుకున్నాయి. కొందరైతే దాడులు నిలిపేస్తున్నట్టు ప్రకటించిన మన విదేశాంగ శాఖ కార్యదర్శిపైనా, ఆయన కుటుంబసభ్యులపైనా నోరుపారేసుకున్నారు. యుద్ధకాలంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలనూ, సలహాలనూ పాటించటం తప్ప ఉన్మాదం ఆవహించినట్టు ఊగిపోవటం సరైంది కాదు. ఇందువల్ల మన జవాన్లకు వీసమెత్తు ఉపయోగం లేదు సరికదా... ప్రజల్లో తప్పుడు భావాలు వ్యాప్తి చెందే ప్రమాదం వుంటుంది. దాడులు ఎప్పుడు మొదలెట్టాలో, ఎప్పుడు ఆపాలో, ఏ దశలో ఏం చేయాలో నిర్ణయించటానికి ప్రభుత్వం ఉన్నప్పుడు గుంపులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించటం అనర్థదాయకం.చౌహాన్ చెబుతున్న ప్రకారం నాలుగు రోజుల దాడుల్లో తొలి రెండు రోజులూ మనకు నష్టం వాటిల్లింది. వెంటనే లోపాలు గుర్తించి సరిచేసుకోవటం పర్యవసానంగా ఆ తర్వాత మన జెట్ విమానాలు శత్రు స్థావరాలను ధ్వంసం చేయగలిగాయని ఆయన అన్నారు. ఏ లోపమూ చోటుచేసుకోకుండా, ఏ నష్టమూ జరగకుండా మనం కోరుకున్న ప్రకారం అంతా జరిగిపోవాలనుకునేవారికి ఇది నిరాశ కలిగించవచ్చు. బీజేపీ అగ్ర నాయకులంతా ఈ విజయాలను తమ వ్యక్తిగత ఖాతాలో వేసుకోవటం కాంగ్రెస్ పార్టీకి కంటగింపు కావొచ్చు. కానీ దేశ రక్షణకు సంబంధించిన అంశాల్లో సంయమనం పాటించటం అందరి బాధ్యత. దాడులు ప్రారంభించటానికి ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించి వారి మద్దతు కోరిన ప్రభుత్వం ముగించటానికి ముందు కూడా ఆ పనే చేసివుంటే బాగుండేది. కనీసం మన దళాలు సాధించిన విజయాలు, మన నష్టాల గురించి ఈ నెల్నాళ్లలోనైనా అఖిలపక్షం నిర్వహిస్తే సమస్య తలెత్తేది కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ తరహా ఉదంతాలు ఇకపై పునరావృతం కాకూడదనుకుంటే కేంద్రం ఆ పని చేయాలి. అందులో అధికార, విపక్షాల వ్యవహారశైలి గురించీ, కొన్ని శక్తులనుంచి అతిగా వచ్చిన స్పందనల గురించీ తన వైఖరేమిటో చెప్పాలి. కష్టకాలంలో సంయమనం పాటించటం ఎంత ముఖ్యమో వివరించాలి. -
గ్రీష్మవర్షం
‘దేవుడికేం హాయిగ ఉన్నాడూ, మానవుడే బాధలు పడుతున్నాడూ’ అంటాడో సినీకవి. అనాదిగా జరుగుతున్నదీ, మనం అంతగా గమనించనిదీ ఏమిటంటే, ఈ చరాచర జగత్తు మొత్తానికి మనిషి తనే కేంద్రస్థానమనుకుంటాడు; ఈ విశ్వరచన అంతా తన కోసమేననీ, తనే సృష్టిచక్రం తిప్పు తున్నాననే భ్రమలోకి జారిపోతూ ఉంటాడు, తన బాధ ప్రపంచ బాధగా ఊహించుకుంటాడు. నిజానికి మనిషే కాదు, ప్రతి జంతువూ, చెట్టూ, పిట్టా కూడా అలాగే అనుకుంటాయేమో కూడా!కానీ కొంచెం సూక్ష్మంగా యోచిస్తే, దేవుడూ, లేదా ప్రకృతీ కూడా అంత హాయిగా ఏమీలేనట్టూ, తమవైన బాధలను, సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నట్టూ అర్థమవుతుంది. మనం దేవతగా భావించే భూమినే తీసుకుంటే, తన వందల కోట్ల సంవత్సరాల ఉనికిలో అదెన్ని బాధలు పడిందో, ఎన్నెన్ని అస్తిత్వ సమస్యల నెదుర్కొందో, ఎంతటి అస్థిరత్వానికి, అనిశ్చితికి గురైందో భూభౌతిక విజ్ఞానం మనకెంతో కొంత అవగాహన కలిగిస్తూనే ఉంది. మొదట భూమి మొత్తం మండిపోయే ఓ అగ్నిగోళం. క్రమంగా ఉపరితలం చల్లబడుతూ వచ్చింది. అయినా ఇప్పటికీ లోపల, తాపమానం మీద వందల, వేల డిగ్రీల మేరకు సెగలూ, పొగలూ కక్కుతూనే ఉందంటారు. ఆ పైన లక్షల సంవత్సరాల నిడివిగల మంచుయుగాలు, జలప్రళయాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, అంతర్గత ప్రకంపనాలతో అతలాకుతలమవుతూనే వచ్చింది. అప్పుడు తను కూడా మనిషిలానే, తనకన్నా పైన ఉన్న ఏ తీవ్రశక్తినో ఉద్దేశించి, ‘దేవుడికేం హాయిగ ఉన్నా’డని పాడుకునే ఉంటుందేమో! మరీముఖ్యంగా తన ప్రకృతి గమనానికి సంబంధించి భూమి తనదైన ఓ ఋతుభ్రమణాన్ని నిర్దేశించుకుని అదే స్థిరమూ, శాశ్వతమూ అని కూడా భ్రమిస్తూ ఉండచ్చు. ఇక్కడే మనిషికీ, భూమికీ మరో పోలిక. మనిషి కూడా తనదైన ఓ ఋతుచక్రాన్ని కల్పించుకుని, దానినో కాలచక్రంలో బంధించాననుకుంటాడు. తను కోరుకున్నట్టే అవి తిరుగుతూ ఉంటాయనుకుంటాడు. కానీ, తన పైనున్న శక్తులు తను నిర్దేశించుకున్న ఋతుభ్రమణాన్ని తలకిందులు చేయగలవన్న ఎరుక భూమికి తరచు తప్పినట్టే, ప్రకృతి తన ఋతుచక్రాన్ని వెనక్కి తిప్పగలదన్న ఎరుక మనిషికీ తప్పుతుంది. అసలు ప్రకృతీ, తనూ అనుసరించే ఋతుకాల సూచికలు ఒకటే కావాల్సిన అవసరం లేదన్న గ్రహింపూ మనిషికి లోపిస్తూ ఉంటుంది. ఇంతకీ సంగతేమిటంటే, ఈ ఏడాది దేశంలోని పలు ప్రాంతాలు గ్రీష్మతాపాన్ని చవిచూడకుండానే వర్షర్తువు చొరబడిపోయింది. ఆ విధంగా గ్రీష్మానికి, వర్షర్తువుకు మనం నిర్దేశించుకున్న కాలిక మైన హద్దుల్ని ప్రకృతి మరోసారి చెరిపేసింది. దాంతో వాతావరణ, పర్యావరణ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగిపోయి వర్షపాతానికి సంబంధించిన చారిత్రకమైన గణాంకాలు, ఇతర వివరాల కవిలె కట్టల్ని బయటికి తీసి శోధించడం ప్రారంభించారు. కేరళనే తీసుకుంటే, నైరుతి ఋతుపవనాలు 1975, 1990 తర్వాత మళ్ళీ ఇప్పుడే అక్కడికి వారం రోజుల ముందు అడుగుపెట్టాయంటున్నారు. దేశం ఇతర ప్రాంతాలలో ఇలా జరగడం 2009 తర్వాత మళ్ళీ ఇప్పుడేనంటున్నారు. ఆ పైన ఈసారి కేరళతోపాటు, తమిళనాడులోనూ, కర్ణాటక, మహారాష్ట్రలలోని అత్యధిక ప్రాంతాలలోనూ నైరుతి ఋతుపవనాలు మామూలు గడువుకన్నా ముందు రావడమే కాకుండా; ఒకే రోజున ఒకేసారి పెద్ద ఎత్తున ముంచెత్తడాన్ని విశేషంగా చూపుతూ, ఇలా జరగడం 1971 తర్వాత ఇదే మొదటిసారి అంటున్నారు. మళ్ళీ ఇంకోవైపునుంచి చూస్తే, 1970లనుంచీ ఒక పద్ధతి ప్రకారం ఋతుపవనాల రాకలో ఆలస్యం జరుగుతోందంటున్నారు. మొత్తంమీద సంవత్సరాల వారీగా వర్షర్తువు చరిత్రనైతే నమోదు చేయగలుగుతున్నా, అది ఒక్కోసారి గడువు కన్నాముందే ఎందుకు తొలకరించి పలక రిస్తుందో, ఒక్కోసారి ఎందుకు వేళతప్పిన అతిథి అవుతుందో ఇప్పటికీ కారణాలు అంతుబట్టక శాస్త్రవేత్తలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. అలాగని వాతావరణ, పర్యావరణ రంగాల్లో వైజ్ఞానికంగా మనం వేసిన అంగలు చిన్నవేమీ కావు. వర్షాలు ఎందుకు పడతాయో, ఎందుకు పడవో మనకిప్పుడు బాగా తెలుసు. నేలమీది శీతోష్ణాలు, సముద్రాలమీది శీతోష్ణాలు చెట్టపట్టాలు వేసుకుని విడతలవారీగా అల్పపీడనాలను సృష్టిస్తూ వర్షపాతానికి ఎలా కారణమవుతాయో; మారిషస్, మడగాస్కర్ల సమీపంలో పుట్టుకొచ్చే సోమాలీ నిమ్నవాయువులూ, పసిఫిక్ గాలులూ అరేబియా సముద్రం, బంగాళాఖాతాల దాకా వ్యాపించి మన గడ్డమీద వర్షాలకు, లేదా వర్షాభావాలకూ కూడా ఎలా దోహదం చేస్తాయో, ప్రత్యేకించి హిమాలయాలు మన దగ్గర వర్షసామ్రాజ్యాన్ని ఎలా శాసిస్తున్నాయో మనకిప్పుడు మరింత స్పష్టంగా తెలుసు. అసాధారణ ఉపరితల ఉష్ణోగ్రతలను సంకేతించే ‘ఎల్ నినో’, అంతే అసాధారణ శీతలత్వాన్ని సూచించే ‘లా నినా’ అనే వాతావరణ ధోరణులకూ – వర్షాల రాకడకూ, పోకడకూ, ఇతర పరిణామాలకూ ఉన్న సంబంధం గురించిన అవగాహన కూడా మనకుంది. అయినాసరే, గడువుకు ముందే వర్షాలు, వర్షాభావాలూ, వర్షాలస్యాల వెనుక ప్రకృతి అనుసరించే సూత్రబద్ధత ఏమిటో ఇప్పటికీ అంతుబట్టని బ్రహ్మపదార్థంగానే ఉంది. మనకు సరే, ప్రకృతికి మాత్రం అది అంతుబట్టిందా అన్నది అంతిమ ప్రశ్న. అదలా ఉంచితే, ముందుస్తు వర్షాలు రేపటి ఆశల విరిజల్లులను తలపించి సంతోషభరితం చేస్తాయి కానీ, దురదృష్టవశాత్తూ ప్రతిసారి అవి వర్షపుష్కలత్వానికి హామీ ఇవ్వకపోవచ్చని శాస్త్రవేత్తలు పెదవి విరుస్తున్నారు. వారి భయాలు నిజం కాకూడదని మనసారా కోరుకుందాం. -
మహానాడు ‘ఆత్మ’కథ!
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించుకొని చనిపోయిన వారి ఆత్మలను ఆవాహన చేయొచ్చన్న మాట. తెలుగుదేశం పార్టీ మహానాడును చూసిన తరువాత ఈ సంగతి తెలిసి వచ్చింది. ఆవాహన చేసుకున్న ఆత్మలతో మన పుర్రెకు తోచిన విధంగా మాట్లాడించవచ్చు. చరిత్రను చెరిపేయవచ్చు. వక్రీక రించవచ్చు. నిజాలపై నీళ్లు చల్లవచ్చు. అసత్యాలకు ఆజ్యం పోయవచ్చు. మన మేధోజనిత స్క్రిప్టును చనిపోయిన వారి ఆత్మలతో చదివించవచ్చు. కొత్త పుంతలు తొక్కిన ఈ టెక్నాలజీ వాడకాన్ని చూసిన తర్వాత వింత వింత అనుమానాలు కలుగు తున్నాయి. ముందు ముందు మహాత్ముడి ఆత్మను ఆవాహన చేయించి గాడ్సేకు కితాబునిప్పించే రోజులు కూడా వస్తాయేమో! గాడ్సే భక్తులు పుట్టుకొస్తున్న కాలం కదా ఇది.మహానాడు వేదికపై స్క్రీన్ మీద కనిపించిన ఎన్టీఆర్ బొమ్మ విచిత్రంగా మాట్లాడుతుంది. తెలుగుదేశం పార్టీ ఆశయాలను తన తర్వాత చంద్రబాబు గొప్పగా కొనసాగిస్తున్నారట! హైదరా బాదుకు తాను సాంస్కృతిక వారథిగా నిలబడితే, చంద్రబాబు సాంకేతిక వారథిగా నిలిచిపోయారట! రెండు రూపాయలకు కిలో బియ్యంతో తాను పేదవారి కడుపు నింపితే, ‘పి–4’ పథకం తెచ్చి పేదరికాన్ని పారద్రోలేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట! ఎన్టీఆర్ బొమ్మలోని కృత్రిమ ఆత్మ పలికిన పలుకులే ఇవి. ఎన్టీఆర్‌కు వారసుడు ఎవరో కూడా ఆత్మ తేల్చే సింది. తన వారసత్వానికి వన్నె తెస్తున్న లోకేష్‌ను ‘భళా మన వడా’ అని కూడా ఏఐ ఆత్మ ఆశీర్వదించింది.ఎన్టీఆర్ జీవించి ఉన్న రోజుల్లో ఒకసారి తన వారసునిగా బాలకృష్ణ పేరును ఆయన ప్రకటించిన సంగతి అప్పటి వారికి గుర్తుండే ఉంటుంది. మహానాడులో ఎన్టీఆర్ ఆత్మ ప్లేట్ మారు స్తుందని బాలయ్యకు ముందే తెలుసా? అందుకే ఈ కార్య క్రమానికి డుమ్మా కొట్టారా? మహానాడు కంటే అతి ముఖ్యమైన మరో కార్యంలో లగ్నమై ఉన్నందువల్ల కూడా రాకపోయి ఉండవచ్చు. ఒక్క బాలయ్యే కాదు... నందమూరి వంశాంకురాలేవీ ఈ జాతరలో కనిపించలేదని మీడియా రిపోర్టులు వెల్లడి స్తున్నాయి. ఈ మహానాడులో నారా వారసుడే చక్రం తిప్పు తారని అందరూ ఊహించిందే. కాకపోతే పార్టీని శాసించే స్థాయి తనదేనని ఆయనే స్వయంగా ప్రకటించుకుంటారని ఎవరూ ఊహించలేదు.పార్టీ కోసం లోకేష్ ఆరు శాసనాలను ప్రకటించారు. శాసనమంటే అందరూ శిరసా వహించవలసిందే కదా! ఆరు శాసనాల పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి. సామాన్య కార్యకర్తలు ఆ పేర్ల భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఎల్లో బుక్కును అచ్చేయవలసిన అవసరం రావచ్చు. సరిగ్గా 30 ఏళ్ళ కింద ఎన్టీఆర్‌కు చంద్రబాబు బృందం వెన్నుపోటు పొడిచి పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్న సంగతి జగమెరిగిన చరిత్ర. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆయన ఆత్మకు సైతం బాబు పార్టీ వెన్నుపోటు పొడవడం విస్మయానికి గురి చేస్తు న్నది. మరణానికి ముందు వివిధ ఇంటర్వ్యూలలో, ప్రెస్ మీట్ లలో చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమని మాట్లాడారో తెలి యని వారెవరు?తండ్రిని కారాగారంలో బంధించి, సోదరులను హతమార్చి సింహాసనాన్ని హస్తగతం చేసుకున్న ఔరంగజేబుతో చంద్ర బాబును ఎన్టీఆర్ పోల్చారు. తన దగ్గర వినయం నటిస్తూనే పథకం ప్రకారం గోతులు తవ్విన నమ్మకద్రోహిగా నిందించారు. చరిత్ర హీనుడు అతగాడని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై ఎన్టీఆర్ చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. అంతలోనే ఆయన ఆత్మ (అటువంటివి ఉంటాయని నమ్మితే) యూ–టర్న్ తీసుకున్నట్టు ఎలా చిత్రించగలిగారు? జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న పార్టీ వెయ్యేళ్ల భారత చరిత్రను తిరగరాసే పనిలో ఉన్నది. అదే స్ఫూర్తితో ఈ ముప్ఫయ్యేళ్ల ఆంధ్ర చరిత్రను బాబు కూటమి తిరగరాయాలని భావిస్తున్నదా? గూగుల్‌లో వెన్నుపోటు అనే అక్షరాలు టైప్ చేస్తే చంద్రబాబు బొమ్మ కనిపించని రోజు రావాలని ప్రయత్నిస్తున్నదా? ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోతుందనే గోబెల్స్ సూత్రాన్ని గడచిన 30 ఏళ్లుగా చంద్రబాబు పార్టీ, ఎల్లో మీడియా బాగా ఒంట పట్టించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటినుంచే ప్రయత్నం చేస్తే ఇంకో పదేళ్లకో, ఇరవై ఏళ్లకో వెన్నుపోటు కథను బుట్టదాఖలు చేయవచ్చనే విశ్వాసంతో ఉన్నట్టు కనిపిస్తున్నది. అటువంటిదేమీ జరగలేదని, ఎన్టీఆర్ ప్రోద్బలంతోనే, ఆయన ఆశీర్వాదంతోనే చంద్రబాబు ఈ పవిత్ర కార్యాన్ని నెరవేర్చారని చెప్పే కొత్త పరిశోధనలు కూడా ఎల్లో మీడియా వెలువరించవచ్చు. అందుకు ఈ మహానాడులో నాంది పలికారనుకోవాలి.ఒక పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంలో జరుగుతున్న పార్టీ మహాసభల మీద ప్రజలకు కొంత ఆసక్తి ఉంటుంది. ఎన్నికల హామీల అమలుపై సమీక్ష ఉంటుందని, అమలు చేయలేకపోయిన అంశాలపై వివరణ ఉంటుందని, పరిపాలనా తీరుతెన్నులపై ఆడిట్ ఉంటుందని ఆశిస్తారు. విచిత్రంగా ఈ మహానాడులో ఇవేమీ జరగలేదు. ప్రతిపక్ష నాయకుడైన జగన్ మోహన్ రెడ్డిని తిట్టిపోయడమనేది ప్రతి వక్త ప్రసంగంలోనూ తప్పనిసరి అంశంగా నిర్ధారించినట్టున్నారు. అధి నేతల దగ్గర మార్కులు కొట్టేయడానికి వక్తలందరూ దాన్ని తూచా తప్పకుండా పాటించారు.మహానాడు తేదీలకు ముందే తెనాలిలో జరిగిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. దళిత యువకులను బహిరంగంగా నడిరోడ్డుపై పడుకోబెట్టి వారి కాళ్లు కదలకుండా ఒక పోలీసు తొక్కిపట్టి మరో పోలీసు అధికారి వారి అరికాళ్ళ మీద లాఠీతో బాదుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. బాధతో ఆ యువకులు చేస్తున్న ఆర్తనాదాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ అమానుష ఘటన మహానాడులో చర్చకు వచ్చి ఉండాలి. హోం మంత్రి సంజాయిషీ ఇచ్చి ఉండాలి. అటువంటి దేమీ లేకపోగా జరిగిన సంఘటనను పోలీసు ఉన్నతాధికారులు నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు.మహానాడు సమయంలోనే టెన్త్ క్లాస్ పరీక్ష పత్రాల రీవాల్యుయేషన్ బాగోతం బయటపడింది. పరీక్ష పత్రాల మూల్యాంకనం ఒక ప్రణాళిక, పద్ధతి లేకుండా ఇష్టారాజ్యంగా జరిగి, ఆరు లక్షల కుటుంబాల్లో ఆవేదన నింపింది. ఫలితంగా ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు పెట్టుకున్నారు. పదకొండు వేల పరీక్షా పత్రాల మార్కుల లెక్కింపులో పొరపాట్లు జరిగినట్టు వెల్లడైంది. ఆ పొరపాటు ఒకటి రెండు మార్కులు కాదు. కొన్ని పేపర్లలో యాభై మార్కుల వరకు తేడాలొచ్చాయి. కొన్ని సమాధానాలకు మార్కులే వేయని వైనం కూడా బయటపడింది. ఇది అసా ధారణం. రికార్డు సమయంలో ఫలితాలు వెల్లడించాలన్న దుగ్ధతో టీచర్ల మెడ మీద కత్తి పెట్టినందువల్లనే ఇలా జరిగిందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.జగన్ మోహన్ రెడ్డి అపురూపంగా చూసుకున్న విద్యా వ్యవస్థను ఒక్క ఏడాదిలోనే నేలకేసి కొట్టిన ఈ నిర్లక్ష్యంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతున్నది. దీనిపై మహానాడులో చర్చ జరిగి ఉండాలని జనం కోరుకుంటారు. విద్యామంత్రి వివరణ ఇస్తారని ఆశిస్తారు. కానీ ఆయన వివరణ ఇవ్వలేదు. హాజరైన ప్రతినిధులు అడిగే సాహసం చేయలేదు. ఈ రెండు అంశాలే కాదు, పాలనాపరమైన ఏ అంశం పైనా చర్చ జరగ లేదు. నిర్వాహకులు రాసిచ్చిన తీర్మానం కాపీని చదవటమే నాయకులు చేసిన పని. ఎన్నికలకు ముందు ఇబ్బడిముబ్బడిగా చేసిన వాగ్దానాల గురించి గానీ, అందులో ముఖ్యమైన ‘సూపర్ సిక్స్’ గురించి గానీ ఏ చర్చా లేదు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి నట్టున్నారు. 15 నెలల అధికారం కరిగిపోయిన తర్వాత అమలు చేస్తారట! త్వరలో ‘తల్లికి వందనం’ ఇస్తామని చెబుతున్నారు. 80 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన గత సంవత్సరపు బకాయి గురించి మాత్రం మాట్లాడటం లేదు. ‘అన్నదాతా సుఖీభవ’, ‘నిరుద్యోగ భృతి’, ‘ఆడబిడ్డ నిధి’ వంటి కీలకమైన హామీల సంగతి మాట మాత్రంగానైనా మహానాడులో ప్రస్తావనకు రాలేదు.మరి మహానాడులో ఏం మాట్లాడారు? తండ్రి–కొడుకుల భజన, ప్రతిపక్ష నేతపై దూషణ... ఈ రెండూ కంపల్సరీ సబ్జెక్టులుగా కనిపించాయి. వీటితో పాటు అసత్య వాణి, మోసపూరిత వైఖరి, వంచనా శిల్పం, అధికార దాహం అనే నాలుగు అంశాలు మహానాడులో అంతర్లీనంగా ప్రవహించాయి. చరిత్రను వక్రీకరించే విధంగా కృత్రిమ మేధ సాయంతో ఎన్టీఆర్ ’ఆత్మ’ పేరుతో చెప్పించిన మాటల దగ్గర నుంచి మూడు రోజులపాటు జరిగిన అన్ని ఉపన్యాసాల్లో అసత్యాలు, అర్ధసత్యాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఎన్టీఆర్ పట్ల ప్రకటించిన భక్తి, వినయం అన్నీ బూటకమేనని, మోసపూరితమైనవని సభ జరిగిన తీరే తేటతెల్లం చేసింది.ఎన్టీ రామారావుకు భారతరత్న పురస్కారం దక్కాలన్న కోరిక తెలుగుదేశం శ్రేణులతో పాటు తెలుగు ప్రజల్లో చాలామందికి ఎప్పటినుంచో ఉన్నది. ఆ కోరిక మేరకు కనీసం కంటి తుడుపుగా ఒక తీర్మానాన్ని కూడా మహానాడు ఆమోదించలేదు. నిజానికి ఆ పురస్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేగల స్థితిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నది. ఆ పార్టీ మద్దతుపైనే కేంద్ర సర్కార్ ఆధారపడి ఉన్నది. అయినా చంద్రబాబు ఆ డిమాండ్ చేయరు. గతంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తాను చక్రం తిప్పానని చంద్రబాబు పలుమార్లు చెప్పుకున్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కావాలనే డిమాండ్ మాత్రం ఆయన ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు కూడా చేయబోరని మహానాడు మరోసారి నిరూపించింది. ఈ మహానాడులో నందమూరి వంశస్థులు ఎవరూ కనిపించలేదని చెబుతున్నారు. బహుశా వచ్చే మహానాడులో నందమూరి తారక రామారావు బొమ్మ కూడా అదృశ్యం కావచ్చు.వంచనా శిల్పం కూడా అడుగడుగునా కనిపించింది. ఎన్నికలకు ముందు చేసిన ‘సూపర్ సిక్స్’ను పక్కన పెట్టి యువనేత శాసన ‘సిక్స్’ను ప్రవేశపెట్టారు. ఈ శాసనాలకు రూపకర్తలు ఎవరో చెప్పలేదు గనుక వాటి గురించి ప్రసంగించిన ఆయననే ఏకసభ్య శాసనసభగా పరిగణించాలి. అందులో 1) తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2) యువగళం, 3) స్త్రీ శక్తి,4) పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్, 5) అన్నదాతకు అండగా, 6) కార్యకర్తే అధినేత. ఈ పదబంధాల అర్థతాత్పర్యాలను ఏలినవారు ప్రత్యేకంగా విడుదల చేసిన తర్వాతే వీటి గుణ దోషాల గురించి మాట్లాడగలుగుతాము. మహానాడులో కనిపించిన మరో అంశం అంతులేని అధికార దాహం. స్వయంగా పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి తరతరాలు తమ కుటుంబమే పరిపాలించాలన్న కోరికను ఎటువంటి శషభిషలు లేకుండా కుండబద్దలు కొట్టి చెప్పారు. ఒకసారి గెలిపించటం మరోసారి ఓడించడం వంటి వైకుంఠపాళీ వద్దని, ఎప్పటికీ తమనే గెలిపించినట్లయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, లేదంటే లేదని ఆయన మనోగతాన్ని బయటపెట్టారు. ఇదీ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య స్ఫూర్తి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
స్వీయ విధ్వంసక విధానాలు
మొన్న జనవరి నుంచీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలన చూస్తున్నవారికి రేపో మాపో ఆయన మహాద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారన్న భ్రమలు తొలగిపోయి చాన్నాళ్లయి వుంటుంది. నిన్న మొన్నటి నిర్ణయాల కన్నా ఆయన తాజాగా ప్రకటించిన విధానం ఎంత అధ్వాన్నంగా వున్నదో బేరీజు వేసుకోవటమే ఇప్పుడు మిగిలింది. విద్యార్థుల్ని, వృత్తిగత నిపుణుల్ని భయాందోళనల్లో పడేసే బుధవారం నాటి నిర్ణయం ఈ కోవలోనిదే. చదువుల నిమిత్తం జారీచేసే వీసాలకు సంబంధించిన ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపేస్తూ అమెరికా ప్రభుత్వం తీసు కున్న ఆ నిర్ణయం మన దేశం నుంచి వెళ్లదల్చుకున్న లక్షలమంది విద్యార్థుల్ని అయోమయంలోకి నెట్టింది. ఇందులో బిజినెస్ స్కూళ్లలో చదవదల్చుకుని, చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎదురుచూస్తున్నవారు కూడా వున్నారు. ఇప్పటికే వీసా ఇంటర్వ్యూలకు తేదీలు ఖరారైనవారి పరిస్థితి కొంత మేలు. అక్కడ చదువుకునే యోగంవుందో లేదో ఫలానా తేదీకల్లా తెలిసిపోతుందన్న ఆశయినా వారికుంటుంది. కానీ ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నవారికి తిరిగి ఆ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో... వుంటుందో, వుండదో తెలియదు. ఎంపిక ప్రక్రియకు అనుసరించ బోయే నిబంధనలు అన్ని రకాల వారినీ కలవరపరుస్తున్నాయి. విద్యార్థి వీసాలూ, ఎక్చ్సేంజ్ విజిటర్ వీసాల ఇంటర్వ్యూలూ మళ్లీ చెప్పేవరకూ నిలిపేయాలని అమెరికా విదేశాంగ శాఖ తన దౌత్య కార్యాలయాలకూ, కాన్సుల్ కార్యాలయాలకూ ఆదేశాలిచ్చిందన్న కథనాలు గుప్పుమనడంతో అందరూ ఆందోళన పడుతున్నారు. దీనిపై విదేశాంగ శాఖ అర కొర వివరణ ఇచ్చింది. వీసా దరఖాస్తుల స్వీకరణ ఆగదట. వాటి ఇంటర్వ్యూలు ఎప్పుడుంటాయో మాత్రం చెప్పలేదు. క్రమబద్ధంగా సాగే ఇంటర్వ్యూలను ఆపేసి దరఖాస్తుల స్వీకరణ కొనసాగిస్తుంటే అవి ఓ కొలిక్కి వచ్చేందుకు ఎంతకాలం పడుతుంది? ఈ జాప్యం వల్ల యువత విద్యాసంవత్సరం నష్టపోయే ప్రమాదం లేదా? అమెరికాలో మాత్రమే చదవాలనుకున్నవారి సంగతలా వుంచి, అక్కడికెళ్లే అవకాశం రానట్టయితే వేరే దేశంలో ప్రయత్నించాలనుకునేవారి గతేమిటి? అమెరికా సంగతి తేలేసరికి వేరేచోట గడువు ముగిసిపోయే ప్రమాదం లేదా! కుప్పలు తెప్పలుగా వచ్చిపడిన దరఖాస్తులను తాజా నిబంధనలకు అనుగుణంగా జల్లెడ పట్టడానికి ఇప్పుడున్న సిబ్బంది సరి పోతారా? పోనీ అందుకోసం భారీయెత్తున సిబ్బందిని మోహరిస్తారా? వీటికి జవాబు లేదు.సరిగ్గా వీసా ఇంటర్వ్యూలు నిలిపేయటానికి ముందురోజు అమెరికా ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు చేసిన హెచ్చరిక గమనిస్తే అక్కడి వాతావరణం ఏమంత మెరుగ్గా లేదని తెలుస్తుంది. ఇప్పటికే అమెరికాలోని విద్యాసంస్థల్లో చదివేవారు తరగతులు ఎగ్గొట్టినా, మధ్యలో విరమించు కున్నా, ఎంపిక చేసుకున్న ప్రోగ్రాంను చెప్పాపెట్టకుండా వదిలేసినా భవిష్యత్తులో వీసాలకు అర్హత కోల్పోతారన్నది దాని సారాంశం. వేరే దేశానికి పోయినప్పుడు అక్కడి నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. ఉల్లంఘనలను ఎవరూ సమర్థించరు. అత్యధికులు చదువుల కోసం బ్యాంకు రుణాలు తీసుకుని అక్కడికి వెళ్తారు. మనుగడకు అవసరమైన డబ్బు సంపాదనపై దృష్టి పెడతారు. ఇది నిబంధనలకు విరుద్ధమే కావొచ్చు... కానీ అలాంటి తప్పులకు సైతం ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’ మాదిరి ఏకంగా దేశం నుంచి పంపేయటం ఎంతవరకూ సబబు?దరఖాస్తుదారుల రాజకీయ అభిప్రాయాలేమిటో తెలుసుకునేందుకు వారి సోషల్ మీడియా ఖాతాలు తనిఖీ చేస్తారన్న వార్త చాలామందిని కలవరపరుస్తోంది. ఇన్ని శతాబ్దాల చరిత్రలో విద్యా ర్థులకుండే రాజకీయాభిప్రాయాల వల్ల అమెరికా నష్టపోయింది లేదు. ఆ యూనివర్సిటీల్లో చదువు కున్న మన ప్రముఖుల్లో మన్మోహన్ సింగ్, సుబ్రహ్మణ్యస్వామి, కపిల్ సిబల్, శశిథరూర్, చిదంబరం, రాహుల్‌గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా, మహువా మొయిత్రా, సల్మాన్ ఖుర్షీద్, అఖిలేశ్ యాదవ్, జైరాం రమేష్ తదితరులున్నారు. అనేకమంది పేరెన్నికగన్న పారిశ్రామికవేత్తలు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు అక్కడ చదివి అక్కడే సంస్థలు స్థాపించి లక్షలమందికి ఉపాధి కల్పించారు. వారి వల్ల అమెరికా బాగుపడిందేగానీ చెడిందెక్కడ? ఈ చరిత్ర ట్రంప్‌కు తెలిసేదెలా? చెప్పేదెవరు?చదువులకైనా, ఉద్యోగాలకైనా అమెరికా వైపు చూడటానికి కారణం అక్కడి స్వేచ్ఛాయుత, వైవిధ్యభరిత సంస్కృతి. ప్రామాణిక విద్య లభించటం, విభిన్నంగా ఆలోచించటానికీ, మెరుగైన ప్రాపంచిక దృక్పథం ఏర్పర్చుకోవటానికీ అవకాశం ఉండటం. పర్యవసానంగా ఎక్కువ లాభ పడింది అమెరికాయే. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో ఆనాటి సోవియెట్‌పై కావొచ్చు, అనంతరకాలంలో చైనాపై కావొచ్చు మేధారంగంలో పైచేయి సాధించేందుకు ఇవన్నీ తోడ్పడ్డాయి. దేశ ఆర్థిక పురో గతిలో చదువుల కోసం వెళ్లినవారి పాత్ర కీలకం. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో వలస ప్రజలూ లేదా వారి సంతతి నెలకొల్పిన సంస్థల వాటా గణనీయం. ఈ సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా వందల కోట్ల డాలర్లు ఆర్జించి పెడుతున్నాయి. వీటన్నిటినీ విస్మరించి ట్రంప్ ప్రతిదాన్నీ తలకిందులుగా చూస్తున్నారు. తన ప్రియమైన ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాల్లో సాగిన నిరసనోద్యమాలు ఆయనకు ఆగ్రహం తెప్పించినట్టున్నాయి. తప్పుడు నిర్ణయాల వల్ల అంతిమంగా నష్ట పోయేది అమెరికాయే. ఇకపై యువత యూరప్ వైపు దృష్టి సారిస్తారు. ఫలితంగా అమెరికా విశ్వ విద్యాలయాల ఆర్జన పడిపోతుంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఊపిరాడనీయని అక్కడి వాతావరణం చివరకు అందరూ ఆ దేశం నుంచి నిష్క్రమించటానికే దారితీస్తుంది. -
పాశ్చాత్య దేశాల ‘ప్రాయశ్చిత్తం’
గాజాలో కళ్లముందు 19 నెలలుగా మారణహోమం సాగుతున్నా గుడ్లప్పగించి చూసిన పాశ్చాత్య దేశాలు ఇప్పటికి తెలివి తెచ్చుకున్నాయి. ఇజ్రాయెల్ సాగిస్తున్న ఊచకోత ‘నైతికంగా సమర్థించ లేనిది, పూర్తిగా అసమతౌల్యమైనద’ంటూ కొత్త రాగం అందుకున్నాయి. మొదట బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలు ఇజ్రాయెల్ తీరును వ్యతిరేకిస్తూ ప్రకటన చేయగా, కాస్త ఆలస్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ), జర్మనీ శ్రుతి కలపడం కొత్త పరిణామం. ఇన్నాళ్ల పాపానికిది ప్రాయశ్చిత్తం అనుకోవచ్చా? అనుమానమే. గాజాలో ఏణ్ణర్ధం నుంచి అదే పనిగా బాంబుల వర్షం కురి పిస్తూ వేలాదిమంది ప్రజలనూ... వారికి తిండి నీళ్లూ ఇచ్చేందుకూ, చికిత్స అందించేందుకూ వచ్చినవారిని సైతం హతమారుస్తుంటే ఈ దేశాల్లో ఎవరికీ నోరు పెగల్లేదు. ఇప్పటికీ వాటి వైఖరి పెద్దగా మారినట్టు కాదు. ఎందుకంటే... ఊచకోత సమర్థనీయం కాదంటూనే ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉన్నదని ఎప్పటిలా మర్కట తర్కానికి దిగుతున్నాయి. 2023 అక్టోబర్ 7న పాలస్తీనాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ప్రారంభించింది మొదలు పాశ్చాత్య దేశాలు ఈ వాదనే చేస్తున్నాయి. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి 1,200 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని కాల్చిచంపి, 251 మందిని అపహరించుకు వెళ్లినప్పటి నుంచీ ఇజ్రాయెల్ ప్రతీకారం మొదలైంది. ఆత్మరక్షణ చేసుకునే హక్కు ప్రతి దేశానికీ వుంటుంది. కానీ దానికుండే పరిమితి మాటే మిటి? ఎన్ని నెలలపాటు బాంబుల వర్షం కురిపిస్తే... ఎన్ని వేలమందిని చంపితే ఆత్మరక్షణ చేకూరు తుంది? 2,000 పౌండ్ల (907 కిలోల) బంకర్ బస్టర్ బాంబులు ఒక చిన్న ప్రాంతమైన గాజాపై ప్రయోగిస్తుంటే, ఆ దాడుల్లో వేలాదిమంది అమాయక పౌరులూ, ముఖ్యంగా పిల్లలూ, స్త్రీలూ చని పోతుంటే ఎవరూ మాట్లాడలేదు. ఇజ్రాయెల్ దళాలు మూడు నెలలుగా గాజాను పూర్తిగా దిగ్బంధించి అక్కడికి అంతర్జాతీయ సహాయ బృందాలు అడుగుపెట్టకుండా పహారా కాస్తున్నాయి. తామే ఆ సాయాన్ని అందిస్తామంటూ అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించాయి. అదెంత బూటకమో తరచూ మీడియాలో వస్తున్న కథనాలే చెబుతున్నాయి. రోజుల తరబడి ఆహారం, మంచినీరూ లభించక వేలాదిమంది మృత్యుముఖంలో వున్నారని ఆ కథనాలు వివరిస్తున్నాయి. ఆకలికి తాళలేక వాహ నాల వెంబడి పరుగులు తీస్తున్నవారిని కూడా నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపిన ఉదంతాలు వెలుగులో కొచ్చాయి. చివరకు అమెరికా–ఇజ్రాయెల్ సహాయ బృందాలను పర్యవేక్షించే చీఫ్ జేక్ ఉడ్ ఆ బాధ్య తల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ బృందాల సాయమంతా కూడా ఇజ్రాయెల్ అధీనంలోని దక్షిణ గాజాలో నాలుగు శిబిరాల ద్వారా మాత్రమే అందుతోంది. సాయం కావాల్సిన వాళ్లు కిలోమీటర్ల దూరం నడిచిపోవాల్సి వస్తోంది. ఉత్తర గాజాకు ఆ మాత్రం సాయం కూడా లేదు.నదురూ బెదురూ లేకుండా ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండపై సంపన్న రాజ్యాలు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాయి? ఒక నెత్తుటి హోమానికి తాము మౌన సాక్షులుగా మిగిలిపోయా మన్న నింద పడకూడదని, తమ చేతులు కూడా నెత్తుట తడిశాయని చరిత్రలో నమోదు కారాదని అవి తహతహలాడుతున్నాయి. ఈ దేశాలన్నీ ఇజ్రాయెల్‌కు ఎడాపెడా సైనిక సామగ్రి తరలించినవే. కోట్లాది డాలర్లు కుమ్మరించినవే. భద్రతా మండలిలో దాన్ని సమర్థించినవే. ఇప్పుడు బ్రిటన్ ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది. కొనసాగుతున్న వాణిజ్య చర్చలను నిలుపుదల చేసింది. పాలస్తీనా ఏర్పాటు అంశంపై వచ్చే నెలలో సౌదీ అరేబియాతో కలిసి సదస్సు నిర్వహించ నున్నట్టు ఫ్రాన్స్ ప్రకటించింది. ఇవి నిజానికి కంటి తుడుపు చర్యలు. కానీ ఈమాత్రం చర్యలు కూడా సమ్మతం కాదంటోంది ఇజ్రాయెల్. బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలు పరోక్షంగా హమాస్ బలపడేందుకు దోహదపడుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆరోపించారు. ఇప్పటికి 594 రోజులుగా ఏకపక్షంగా ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేథానికి ఇంతవరకూ 61,700 మంది మరణించగా, అందులో 20,000 మంది పసివాళ్లని అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద కన్నుమూసిన వారెందరో ఇంకా తెలియలేదు. వేలాదిమంది పిల్లలు అనాథలుగా మిగిలిపోగా, మరిన్ని వేలమంది పిల్లలు కాళ్లూ చేతులూ పోగొట్టుకుని వైద్యసాయం సక్రమంగా అందక రోదిస్తున్నారు. ఈ మారణహోమానికి ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. రోజుల తరబడి ధర్నాలు సాగాయి. పాశ్చాత్య దేశాల్లో పాలస్తీనా ప్రధాన చర్చనీయాంశమైంది. కానీ ఇవేవీ ఇజ్రా యెల్‌నుగానీ, దానికి అండగా వుంటున్న సంపన్న రాజ్యాల పోకడలనుగానీ మార్చలేకపోయాయి. ఇజ్రాయెల్ వాణిజ్యంలో మూడోవంతు వాటా యూరప్ దేశాలదే. ఆ దేశాలు తల్చుకుంటే, చిత్త శుద్ధితో ఆంక్షలు అమలు చేస్తే ఇజ్రాయెల్ మనుగడ ఇబ్బందుల్లో పడుతుంది. మొదటి నుంచీ అండగా ఉంటున్న అమెరికా ఆ దేశాలతో చేతులు కలిపితే దాని పరిస్థితి మరింత దిగజారుతుంది. కనీసం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆదేశాలను పాటిస్తే ఇజ్రాయెల్‌కు ఊపిరాడదు. కానీ అవి నిజంగా అంత పని చేస్తాయా? అసలు ఇజ్రాయెల్‌లోనే నెతన్యాహూపై తీవ్ర వ్యతిరేకత బయల్దేరింది. ఇప్పుడు ఆయన్ను సమర్థించేవారు 25 శాతం మించరని చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ను ఏమాత్రం తక్కువ చేసినా అది ఇరాన్‌కు బలం చేకూరుస్తుందన్న భయం పాశ్చాత్య దేశాలకుంది. ఆ దేశాల్లో రెండో ప్రపంచ యుద్ధానంతర రాజకీయాలన్నీ ఇజ్రాయెల్‌తో ముడిపడి వున్నాయి. దాన్ని తెంచుకోవటమంటే ఒక కొత్త ఒరవడికి తెరతీయడమే. అంత సాహసం చేయలేక కంటితుడుపు చర్యలు ప్రకటించాయి. కానీ ఇప్పటికే సమయం మించిందని ఆ దేశాలు గ్రహిస్తే మంచిది. -
‘ముంబై’ చెప్తున్నదేమిటి?!
‘కుండపోతలతో వస్తున్నాం... కాచుకోండ’న్నట్టు హెచ్చరిస్తూ ప్రవేశించాయి నైరుతి రుతుపవనాలు. సోమవారం వేకువజామునే కళ్లు తెరిచిన ముంబై మహానగరవాసులు... వస్తూనే తడాఖా చూపించిన భారీ వర్షాన్ని చూసి బిత్తరపోయారు. సాధారణ సమయాల్లో గంభీరంగా, కళ్లు చెదిరేలా కనబడే మన నగరాలు చినుకు రాలితే ఎంత అల్లకల్లోలమవుతాయో మొన్నీ మధ్యే బెంగళూరు నగరం కూడా నిరూపించింది. మన్నూ మిన్నూ ఏకమైనట్టు ధారాపాతంగా రాత్రంతా కురియటంవల్ల 200 మిల్లీ మీటర్లు(ఎంఎం) మించిన వర్షపాతంతో ముంబై నగరం తాజాగా తడిసిముద్దయింది. ఆ నగరానికి ముందుగా జారీచేసిన ‘యెల్లో అలెర్ట్’ను కాస్తా ‘రెడ్ అలెర్ట్’గా సవరిస్తూ, ముంబైతోపాటు దాని ఇరుగుపొరుగునున్న జిల్లాల్లో సైతం పిడుగులతో, పెనుగాలులతో అత్యంత భారీ వర్షం ముంచుకు రాబోతున్నదని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ముంబై పొరుగునున్న కొలాబాలో సోమవారం 295 ఎంఎం వర్షపాతం నమోదై, 107 ఏళ్లనాటి... అంటే 1918 నాటి రికార్డు 279.4 ఎంఎంను అధిగమించింది. ఇంకా కర్ణాటకలోని మంగళూరు నగరం, దక్షిణ కన్నడ జిల్లాలు సైతం భారీవర్షాలతో ఇక్కట్లుపడ్డాయి. కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు పది రోజులకు మహారాష్ట్ర రావాల్సివుండగా కేవలం 24 గంటల్లో అక్కడికి లంఘించాయి. ముంబైకి ఆ మర్నాడే చెప్పాపెట్టకుండా వచ్చాయి.సరిగ్గా అయిదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ ఎర్త్ సైన్స్ విభాగం ఒక ఆసక్తికర ప్రకటన చేసింది. ప్రతియేటా అంతక్రితంతో పోలిస్తే భారీ వర్షాలు నమోదవుతున్నాయన్నదే దాని సారాంశం. ఇలాంటి ప్రకటనలు మన పాలకుల్ని అప్రమత్తుల్ని చేయాలి. ఏటా నగరాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలి. వాటి వికేంద్రీకరణకు ప్రణాళికలు రూపొందించాలి. కానీ తరచు నడుంలోతు నీళ్లల్లో మునకలేస్తున్న నగరాలను చూస్తుంటే వారికంత శ్రద్ధ, తీరిక లేవన్న సంగతి తెలుస్తుంది. శతాబ్దం కిందట లేదా అంతకు చాలాముందు నుంచీ ప్రధాన నగరాలుగా వున్నవాటిపై ఎటూ శ్రద్ధ లేదు. కనీసం కొత్తగా నిర్మిస్తున్న నగరాలపైన అయినా ముందుచూపుతో వ్యవహరిద్దామన్న జ్ఞానం లేదు. నిరుడు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకూ దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా కుండపోత వర్షాలు విజయవాడ నగరంలో కొంత భాగాన్ని ముంచెత్తడంతోపాటు అమరావతిని కూడా వరదలు అస్తవ్యస్తం చేశాయి. దాని పరిధిలోని 29 గ్రామాల్లో 25 నిండా నీళ్లల్లో మునిగాయి. సాక్షాత్తూ సీఎం చంద్రబాబే అక్రమంగా వుంటున్న తన కరకట్ట నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తదితర సంస్థలు మూతపడాల్సి వచ్చింది. లక్షలాదిమంది ప్రజలు సకాలంలో సాయం అందక ఇబ్బందులు పడ్డారు. విజయవాడలో 35 మంది మరణించారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ చెప్పినా మొండి వైఖరితో అమరావతికి పూనుకోవటమే తప్పనుకుంటే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని మళ్లీ పిలిచి అట్టహాసంగా సభ చేసి పనులు మొదలుపెట్టారు. అమరావతి ప్రాంత నేల స్వభావం తెలియకపోతే పోయింది... కనీసం కేంద్రీకృత నగరాల వల్ల కలిగే ముప్పును చూస్తూ కూడా వేలకోట్లు కుమ్మరిస్తున్నారంటే ఏమనుకోవాలి?‘ప్రకృతి వైపరీత్యాలు నిజమైన అర్థంలో ప్రకృతి కల్పిస్తున్న వైపరీత్యాలు కాదు. అవి మనిషి రూపొందించే విధానాల వైఫల్యం’ అంటాడు అమెరికన్ దౌత్య నిపుణుడు జాన్ బోల్టన్. కుంభవృష్టి కురిసినా దాన్నంతటినీ ఇముడ్చుకోగల చెరువులూ, వాగులూ, వంకలూ దాదాపు అన్ని రాష్ట్రా ల్లోనూ వున్నాయి. వాటిల్లో కొన్ని సహజసిద్ధమైనవీ, కొన్ని మన పూర్వీకులు ఎంతో ముందు చూపుతో నిర్మించినవీ. కానీ చేజేతులా మనమే వాటి పీకనొక్కుతున్నాం. ఇష్టానుసారం ఆక్రమించి అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నా కళ్లుమూసుకుంటున్నాం. హైదరాబాద్‌లోని కంచె గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్లు దింపి ప్రకృతి సంపద నాశనం చేస్తున్నారని ఆవేదన చెందిన ప్రధానే, ఆ తర్వాత కొద్దిరోజులకే వేలాది ఎకరాల పంట భూముల్ని మాయం చేసే అమరావతికి రెండోసారి శంకుస్థాపన చేశారు. తమ కూటమి ప్రభుత్వమైతే ఒక లెక్క... వేరే పార్టీ ప్రభుత్వమైతే ఒక లెక్క! నిర్దిష్టమైన విధానాల్లేకుండా ‘ఏ రోటి కాడ ఆ పాట’న్నట్టు ప్రవర్తించే పాలకుల వల్లే వైపరీత్యాలు ముంచుకొస్తున్నాయి. వీటిని నివారించటం మానవ మాత్రులకు సాధ్యం కాకపోవచ్చు. కానీ కాస్త తెలివితో వ్యవహరిస్తే వాటివల్ల కలిగే నష్టాలను కనిష్ఠ స్థాయికి తీసుకురావొచ్చు. కారణాలేమైనా వాతావరణం గతంలో మాదిరి లేదు. మన విధ్వంసకర ఆచరణతో దాన్ని మరింత క్షీణింపజేస్తున్నాం. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణగానీ, వికేంద్రీకరణగానీ లేకపోవటంతో నగరాలు కిటకిటలాడుతున్నాయి. నగరాల్లోనే ఉపాధి అవకాశాలుండటంతో గ్రామీణ ప్రాంత ప్రజలు అక్కడికే క్యూ కడుతున్నారు. పెరిగిన జనాభాకు తగినట్టు డ్రయినేజీ వ్యవస్థ లేకపోవటంతో చిన్నపాటి వర్షానికే నగరాలు నరకాలుగా మారుతున్నాయి. ఈసారి వర్షరుతువు ఎలా వుండబోతున్నదో ముంబై నగరాన్ని ముంచెత్తిన వాన నిరూపించింది. సహాయ సిబ్బందిని అందుబాటులో వుంచటంతో సహా పలు ముందస్తు చర్యలు తీసుకోవటం మినహా ఈ ఏడాది ఎటూ ఇప్పటికిప్పుడు చేసేదేమీ లేదు. కనీసం రాబోయేకాలంలోనైనా అమల్లోవున్న విధానాలను సమీక్షించుకుని మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ప్రణాళికాబద్ధమైన పథకాలు రూపొందించి అమలుచేసి, వికేంద్రీకరణపై దృష్టిసారిస్తే చాలావరకూ సమస్యలు పరిష్కారమవుతాయి. -
కథకు దక్కిన గౌరవం
కన్నడ రచయిత్రి బాను ముష్తాక్ తన ‘హార్ట్ ల్యాంప్’(హృదయ దీపం) కథాసంపుటికిగానూ ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్’ గెలుచుకోవడం చాలా విధాలుగా ప్రత్యేకమైనది. ఇది కర్ణాటకకే కాదు, దక్షిణ భారతదేశానికే దక్కిన తొలి గౌరవం. బుకర్ చరిత్రలో ఒక కథల సంపుటికి ఈ పురస్కారం దక్కడం ఇదే ప్రథమం. ఇది గెలుచుకున్న అత్యంత ఎక్కువ వయసువాళ్లలో(77) ఆమె ఒకరు (ఫిలిప్ రాత్‌కు ఇచ్చినప్పుడు 78 ఏళ్ళు). ఆంగ్లంలో రాసిన పుస్తకాలకు ఇచ్చే ‘బుకర్ ప్రైజ్’ను కొంతమంది భారతీయ, భారత సంతతి రచయితలు ఇంతకుముందు గెలుచుకున్నారు; వాటి గొప్పతనం వాటిదే! కానీ ఆంగ్లంలో రాయనక్కర్లేకుండా తమకు చేరువైన భాషలో రాస్తూనే అంతర్జాతీయ ఖ్యాతి పొందవచ్చని ఈ గౌరవం చెబుతోంది. భిన్న భారతీయ భాషల్లో వస్తున్న శ్రేష్ఠమైన సాహిత్యాన్ని ఆంగ్ల ప్రపంచపు గుమ్మంలోకి ప్రవేశపెట్టే చొరవ చూపేలా ఈ విజయం ప్రచురణకర్తలకు ప్రేరణనిస్తోంది. గట్టిగా ఆంగ్ల భాష తలుపు కొట్టగలిగితే, ఇతర భాషల కిటికీలు వాటికవే తెరుచుకుంటాయి.రచయిత్రి, పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త, న్యాయవాది అయిన బాను ముష్తాక్ ఆరు కథా సంపుటాలు, ఒక వ్యాసాల సంకలనం, ఒక కవిత్వ సంపుటి, ఒక నవల వెలువరించారు. పురుషాధిపత్య సమాజంలో ముస్లిం మహిళల జీవన వ్యథలను ఆమె చిత్రించారు. ఆమె పాత్రలు కన్నడ, దక్కనీ ఉర్దూ, అరబిక్ మాట్లాడుతాయి. 1990–2023 మధ్యకాలంలో ఆమె రాసిన 50కి పైగా కథల్లోంచి 12 కథలను కూర్చడంతోపాటు, వాటిని ఆంగ్లంలోకి అనువదించిన దీపా భాస్తి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న తొలి భారతీయ అనువాదకురాలు అయ్యారు. ‘‘మహిళ రాసి, మహిళ సంపాదకత్వం వహించి, మహిళ అనువదించిన పుస్తకం హార్ట్ ల్యాంప్’’ అన్నారు బెంగాలీ అనువాదకుడు అరుణవ సిన్హా. ఈ పురస్కారాన్ని 2022లో తొలిసారిగా ఇండియా నుండి హిందీ రచయిత్రి గీతాంజలిశ్రీ గెలుచుకోవడానికి కారణమైన అనువాదకురాలు డైసీ రాక్వెల్ ఒక అమెరికన్ అని తెలిసిందే! అవార్డు కింద నగదుగా ఇచ్చే యాభై వేల పౌండ్లను నియమాల మేరకు బాను, దీపా సమానంగా పంచుకుంటారు. భారతీయ భాషల్లోని మంచి సాహిత్యాన్ని మరో దరికి చేర్చాలన్న అనువాదకుల పూనికకు ఇది గట్టి ప్రోత్సాహం కాగలదు. 1970–80ల్లో కర్ణాటకలో మొదలైన బండాయ సాహిత్యోద్యమం దళితులు, ముస్లింలు తమ కథలను తామే రాసుకునే ప్రేరణనిచ్చింది. మంచి ముస్లిం బాలికలు ఉర్దూలో ఖురాన్ చదవగలిగితే చాలు అనే సామాజిక వాతావరణంలో తొలుత ఉర్దూలో చదవడం ప్రారంభించి, తండ్రి (ఎస్.ఎ.రహమాన్, హెల్త్ ఇన్స్పెక్టర్) ప్రోద్బలంతో కన్నడ మాధ్యమంలోకి మారిన బాను ఆ భాషనే తన రచనా వాహికగా ఎంచుకున్నారు. ‘‘నాకు అక్షరాలు వచ్చినప్పటి నుంచీ రాయడం మొదలుపెట్టాను’’ అంటారామె. రష్యన్ రచయిత ఫ్యోదర్ దోస్తోవ్స్కీ, కన్నడ రచయిత దేవనూర్ మహదేవను అభిమానించే ఆమె ‘నాను అపరాధియే?’ పేరుతో తొలి కథ రాశారు. తన స్నేహితురాళ్లు చిన్ననాటనే పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో నిలిచిపోతున్నా ఆమె ఆగకుండా పైచదువులకు వెళ్లారు. సినిమాకు వెళ్లడం మీద ఒక ముస్లిం యువతిని అడ్డుకున్న ఉదంతం గురించి ఆమె రాసిన తొలి వ్యాసం చర్చనీయాంశం కావడంతో పాటు ఆమెను ‘లంకేశ్ పత్రికే’ జర్నలిస్టుగా మార్చింది. 26 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ, వివాహానంతరం బురఖా ధరించాలనీ, ఇంటి పనులకే పరిమితం కావాలనీ అత్తవారింటి నుంచి ఒత్తిడి వచ్చింది. చేస్తున్న హైస్కూల్ టీచర్ ఉద్యోగం మానాల్సి వచ్చింది. ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి కలిగాక ఒక దశలో నిరాశా నిస్పృహలతో వైట్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయారు. మూడేళ్ల పాపను ఆమె కాళ్ల దగ్గర పెట్టి, అలా చేయొద్దంటూ ఆమె భర్త ముష్తాక్ మొహియుద్దీన్ ఆమెను హత్తుకున్నారు. అప్పట్నించీ ఆమెకు అన్నింటా అండగా నిలిచారు. స్త్రీల వేదన, నిస్సహాయత తన మీద లోతైన ప్రభావం చూపి, రాయక తప్పని స్థితిని కల్పించాయంటారు బాను. ‘‘నువ్వు ఈ ప్రపంచాన్ని మళ్లీ నిర్మించదలిస్తే, మగవాళ్లనూ ఆడవాళ్లనూ సృష్టించదలిస్తే అనుభవం లేని కుమ్మరిగా ఉండకు. ప్రభూ! ఈ భూమ్మీదకు ఒక్కసారి ఆడదానిగా రా!’’ అని అడుగుతుంది ‘ఓ దేవుడా! ఒక్కసారి ఆడదానిగా ఉండు’ కథ. ‘‘మతం, సమాజం, రాజకీయాలు స్త్రీల నుంచి ప్రశ్నించకూడని విధేయతను డిమాండ్ చేస్తాయి. ఈ క్రమంలో అమానవీయ క్రూరత్వాన్ని మోపుతాయి’’ అంటారామె. మసీదుల్లో స్త్రీలకు ప్రార్థించే హక్కు ఉండాలంటారు ఈ ‘ఫైర్‌బ్రాండ్’. సొంత సమాజం మీద ఉమ్మివేయడం ద్వారా బయట జేజేలు కొట్టించుకుంటోందన్న నిందలు మోశారు. ఒక దశలో ఆమె మీద కత్తిదాడి యత్నం జరిగింది. అయితే దాడి చేసిన వ్యక్తిని ఆమె క్షమించారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. ‘మన ముక్కులు కోపిస్తుంది’ అని ఆమె తండ్రితో ఆమె కుటుంబ సభ్యులు సరదాగా అనేవాళ్లట. బదులుగా ఇప్పుడు అందరిలోనూ వాళ్లంతా ముఖాలు ఎత్తి నిలబడేలా చేయగలిగారు. ఇంతటి ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడాన్ని ‘ఒక్క ఆకాశాన్ని వెయ్యి మిణుగురులు వెలిగించినట్టుగా’ ఆమె అనుభూతి చెందారు. ‘ప్రతీ గొంతుకనూ వినే, ప్రతీ కథకూ మన్నన దక్కే, ప్రతీ మనిషీ మరొకరికి చెందే ప్రపంచాన్ని సృష్టించాలి’ అని తన పురస్కార అంగీకారోపన్యాసంలో కోరారు. అదే నిజమైతే, మిణుగురులు ఆకాశాన్ని వెలిగించే అనుభూతి ప్రతి ఒక్కరికీ సాక్షాత్కరిస్తుంది. -
మావోలకు పెద్ద దెబ్బ
విస్తీర్ణంలో చాలా దేశాలతో పోలిస్తే ఎంతో పెద్దదైన మధ్య భారతంలో కొన్ని దశాబ్దాలుగా సాగు తున్న వామపక్ష తీవ్రవాదం క్షీణిస్తున్న జాడలు గత కొన్నేళ్లుగా కనబడుతుండగా... మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. అబూజ్‌మఢ్ అడవుల్లో జరిగిన ఆ ఎన్కౌంటర్లో ఆయనతోపాటు మరో 26 మంది నక్సలైట్లు చనిపోయారని, వారిలో పలువురు కీలక నేతలు ఉండొచ్చని అధికారిక ప్రకటన చెబుతోంది. ఇరుపక్షాల మధ్యా జరిగిన కాల్పుల్లో భద్రతా బలగాల్లోని ఒక జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారని అధికారిక కథనం. ప్రధాన కార్య దర్శి స్థాయి నేత మరణించటం మావోయిస్టు పార్టీకి నిస్సందేహంగా కోలుకోలేని దెబ్బ. అందుకే కావొచ్చు... ఈ ఎన్కౌంటర్ గర్వించదగ్గ విజయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివాసీల హక్కుల కోసం, దోపిyీ నిరోధానికీ ఆయుధం పట్టామని చెబుతున్న మావోయిస్టులు ఇన్ని దశాబ్దాల పోరాటంలో తమ చర్యల పర్యవసానాలనూ, వాటి నిరర్థకతనూ గమనించి సరిచేసుకోలేకపోయారని అర్థమవుతుంది. నక్సలైట్ ఉద్యమం పూర్వాపరాలు గమనిస్తే అదెప్పుడూ పడుతూ లేస్తూనే సాగింది. కానీ తమ పోరాటాలపై రాజ్యం ప్రతిసారీ ఎందుకు పైచేయి సాధించ గలుగుతున్నదన్న అంశంపై వారు దృష్టి పెట్టినట్టు లేదు. అంతకుముందు దేశంలో చెదురుమదురుగా జరిగిన సాయుధ పోరాటాలు అంతరించాయనుకుంటున్న తరుణంలో 1967లో పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లా సిలిగుడి డివిజన్లో మారుమూల గ్రామమైన నక్సల్బరీలో రాజు కున్న ఉద్యమం వేగంగా విస్తరించి సీపీఐ(ఎంఎల్) ఆవిర్భావానికి దారితీసింది. మూడేళ్ల లోపునే పోలీసులు ఆ ఉద్యమాన్ని అణిచేయగలిగారు. దానివెంబడే అప్పటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వెల్లువెత్తిన ఉద్యమం సైతం ఎన్కౌంటర్ల పరంపర తర్వాత మూడేళ్లకే సద్దుమణిగింది. తిరిగి మరో ఆరేళ్లకు ఉత్తర తెలంగాణలో తలెత్తి విస్తరించిన ఉద్యమం ఒక్కటే దీర్ఘకాలం సాగిందనుకోవాలి. ఈ మూడు చోట్లా ఒకేవిధంగా మొదట్లో మధ్యతరగతి, మేధావి, విద్యార్థి వర్గాలను ఆకర్షించిన ఉద్యమాలు అనంతర కాలాల్లో ఆ వర్గాలకు ఎందుకు దూరమయ్యాయన్న విశ్లేషణను మావోయిస్టులు చేసుకోలేదని వారి ఆచరణ తీరు గమనిస్తే అర్థమవుతుంది. మరోపక్క నక్సల్ ఉద్యమం చీలికలూ, పేలికలూ అయింది. సీపీఐ (ఎంఎల్) భిన్నవర్గాలుగా విడిపోయింది. లిబరేషన్ వంటి పార్టీలు పార్ల మెంటరీ పంథాకు మళ్లి చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తున్నాయి. పాలకులెవరైనా ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటానికీ, ప్రభుత్వ విధా నాలు సక్రమంగా లేవనుకుంటే ప్రజల్ని కూడగట్టి ఉద్యమించటానికీ ఎప్పుడూ అవకాశాలుంటాయి. 2014లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక భూసేకరణ చట్టం సవరించినప్పుడూ, అనంతర కాలంలో సాగు చట్టాలు తీసుకొచ్చినప్పుడూ రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరకు కేంద్రం ఆ చర్యల్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. మావోయిస్టు పార్టీ వీటిని గమనంలోకి తీసుకుందా? అంతక్రితం 1977 తర్వాత ఉద్యమాల్లోకి ప్రజల్ని కూడగట్టడంలో విజయం సాధించినా అటుపై ఆ ఉద్యమాలకు తోడు సాయుధ చర్యలు కూడా మొదలయ్యాయి. పర్యవసానాలు తెలియని యువ తను మొదట్లో ఇవి ఆకర్షించివుండొచ్చు. కానీ ప్రభుత్వ బలగాలు పకడ్బందీ వ్యూహాలు అమలు చేయటం ప్రారంభించాక ఆ సాయుధ చర్యలు వ్యతిరేక ఫలితాలిస్తాయి. సమస్యలెన్నివున్నా ప్రజలు మౌలికంగా శాంతియుత జీవనాన్ని కోరుకుంటారు. నిత్యం ఉద్రిక్త తల నడుమ అనిశ్చితిలో బతికే స్థితి ఉన్నప్పుడు దాన్నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడటా నికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వాలు అణచివేత చర్యలతోపాటు వారి ప్రశాంతతకు హామీ ఇచ్చిన ప్పుడు సహజంగానే ఉద్యమాల వైపు మొగ్గు తగ్గుతుంది. మొదట్లో ఉన్నత చదువులు చదివినవారు భద్రమైన జీవితాన్నీ, బంగారు భవిష్యత్తునూ వదులుకుని ఆ ఉద్యమాల వైపు వెళ్లిన మాట వాస్తవం. అందుకు నిరుద్యోగం, ప్రభుత్వ వ్యవస్థల్లో పెరిగిన అవినీతి వంటివి కారణం అయ్యాయి. కానీ 1990వ దశకం చివరిలో ప్రపంచీకరణ తర్వాత మన దేశంలో పెట్టుబడులు వెల్లువలా రావటం, యువతకు మెరుగైన అవకాశాలు ఏర్పడటం మొదలయ్యాక ఉద్యమాల పట్ల విముఖత ఏర్పడింది. ఈ తరం విద్యార్థులు అటువైపు వెళ్లటం మాట అటుంచి, వారిలో అత్యధికులకు ఆ ఉద్య మాలపై కనీస అవగాహన కూడా లేదు. మావోయిస్టు ఉద్యమంలో కొత్త రిక్రూట్మెంట్ గణనీయంగా తగ్గి పోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఉద్యమంలో మధ్యతరగతి వర్గానికి బదులు ప్రస్తుతం ఆదివాసీల ప్రాబల్యం గతంతో పోలిస్తే పెరిగింది. కానీ దానికి సమాంతరంగా ఆదివాసీలను తమవైపు తిప్పుకోవటంలో భద్రతా బలగాలు సైతం విజయం సాధించగలిగాయి. నంబాల కేశవరావు తదితర ఉద్యమ నేతలు ఎన్కౌంటర్లలో మరణించటం ఆ పర్యవసానమే! వర్తమానంలో విస్తృతంగా అభివృద్ధి చెందిన సాంకేతికత సైతం బలగాలకు అందివచ్చింది. నక్సలిజాన్ని వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్లా అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరచూ చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అది సాధ్యమేనన్న అభిప్రాయం కలుగుతుంది. ఏదేమైనా ఈ సమస్య హింసకు తావులేకుండా శాంతియుతంగా పరిష్కారమైతే సమాజం సంతోషిస్తుంది. అందుకు మావోయిస్టులు తమ పంథా మార్చుకుని సహకరించాలి. వారు పునరాలోచించుకునేందుకు కేంద్రం కూడా వ్యవధినివ్వాలి. -
గూఢచర్యం జాడలివిగో!
గూఢచర్యానికి నిర్దిష్టమైన రూపురేఖలుండవు. దాన్ని సకాలంలో గుర్తించటం, కట్టడి చేయటం ఆషామాషీ కాదు. మన వేషభాషలతోనేవుంటూ, నిత్యం మనతో సన్నిహితంగా మెలగుతూ ప్రాణ ప్రదమైన మన రహస్యాలను బయటికి చేరేసేవారిని ఆనవాలు కట్టడం అంత సులభం కూడా కాదు. పహల్గామ్లో గత నెల 22న అమాయక పౌరులు 26 మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నాక మన త్రివిధ దళాలు పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వ హించి దాదాపు వందమందిని మట్టుబెట్టాయి. సింధూ నదీజలాల ఒప్పందంనుంచి వెనక్కి రాదల్చుకున్నట్టు ప్రకటించటంతోసహా అనేక అంశాల్లో పాకిస్తాన్‌కు ఇన్ని దశాబ్దాలుగా అందుతున్న ప్రయోజనాలను మన దేశం నిలుపుచేసింది. దానికి అనుబంధంగా దేశంలో అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధాలు సాగటం, పహల్గామ్లో భద్రతాలోపాలపై ప్రశ్నించినవారినీ, జవాబుదారీ తనాన్ని కోరినవారినీ ఉగ్రవాద సమర్థుకులుగా ముద్రేయటం మొదలైంది. ఇది అవాంఛనీయమైన పరిణామం. ఈ నేపథ్యంలో నిఘానేత్రాల కళ్లుగప్పి కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరేస్తున్న 11 మందిని గుర్తించి అరెస్టు చేయటం కీలక మలుపు. అరెస్టయినవారిలో చాలామంది మధ్యతరగతి యువత. వారిలో జ్యోతి మల్హోత్రా అనే యువతి పాకిస్తాన్ గూఢచారి సంస్థలకు కీలకమైన సమా చారం అందించిందన్నది పోలీసుల అభియోగం. సామాజిక మాధ్యమాల సందడి పెరిగాక ఒక కొత్త తరం బయల్దేరింది. విచక్షణా జ్ఞానం లోపించటం, లోతైన సమాచారం లేకుండానే దేనిపైన అయినా అభిప్రాయాలు ఏర్పర్చుకోవటం, ఆధారాలున్నాయా లేదా అనేదాంతో నిమిత్తం లేకుండా సమాచారాన్ని వ్యాప్తిచేయటం, సామాజిక మాధ్యమాలపై మోజున్న యువతరానికి అలవాటుగా మారింది. సెల్‌ఫోన్‌తో దేన్నయినా చిత్రించటం, వెనకా ముందూ ఆలోచించకుండా అందరికీ చేరేయటం రివాజైంది. మనం కూడా ఏదో ఒకటి చేయాలన్న కుతూహలంతో మొదలై, అందరికన్నా ఎక్కువమంది వీక్షకుల్ని ఆకట్టుకోవటం లక్ష్యంగా మారటం, ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందటం, ప్రశంసలు, వాటి వెంబడే ఆదాయం మొదలవుతుంది. ఇక ఆ వ్యామోహం నుంచి వెనక్కిరావటం వాళ్లవల్ల కాదు. తాము చేసే పని ఏ మంచికి హాని చేస్తుందో, ఏ చెడును ప్రోత్సహిస్తుందో గ్రహించేంత సామర్థ్యం లేకపోవటం సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అయిన అత్యధిక యువతలో కనబడే ప్రాథమిక లక్షణం. ఇలాంటివారిని ఆకట్టుకుని, వీరితో సంబంధ బాంధవ్యాలు నెరపి దగ్గరకావటం పొరుగు దేశ గూఢచార సంస్థలకు సులభం. జ్యోతి మల్హోత్రా విషయంలో జరిగింది అదే. ఆమె తగిన పత్రాలను సమర్పించి ప్రభుత్వానికి తెలిసే విధంగానే పాకిస్తాన్ వెళ్లింది. అక్కడ వేర్వేరు వ్యక్తుల్ని కలిసింది. పాకిస్తాన్ జాతీయ దినోత్సవంలో పాల్గొన్నది. అక్కడున్నవారిని పరిచయం చేసింది. వారితో మాట్లాడించింది. విదేశాలకు పోవటం, అక్కడి ప్రాంతాలను సందర్శించటం, వారితో సంభాషించటం వగైరాలు సహజంగానే సాధారణ వీక్షకులకు ఎంతో ఆసక్తి అనిపిస్తాయి. జ్యోతి నిర్వహించే యూట్యూబ్ చానెల్‌కు దాదాపు 4 లక్షలమంది చందాదార్లుండటం, ఫేస్బుక్లో 3 లక్షలమందిపైగా ఆమె ఎప్పటికప్పుడు పెట్టే వీడియోలను వీక్షించటం, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు లక్షన్నరమంది చూడటం ఇందువల్లే. తమ అరకొర పరిజ్ఞానంతో గంటల తరబడి దేనిపైన అయినా అనర్గళంగా మాట్లాడటం నచ్చటంవల్లే ఇన్నేసి లక్షలమంది వారిని అనుసరిస్తుంటారు. శత్రు దేశాల మధ్య యుద్ధాలు సరిహద్దుల్లోనే జరగవు. అవి కేవలం సైనికుల మధ్యే సాగవు. అనేక రూపాల్లో నిరంతరం కొనసాగుతుంటాయి. కనీసం జ్యోతి ప్రభుత్వానికి తెలిసేవిధంగా పాకిస్తాన్ వెళ్లింది. కానీ చడీచప్పుడూ లేకుండానే శత్రుదేశానికి అత్యంత కీలకమైన సమాచారాన్ని చేరేసేవారుంటారు. పాకిస్తాన్ హైకమిషన్‌లో ఇటీవల వరకూ పనిచేసి బహిష్కరణకు గురైన డానిష్ అనే ఉద్యోగి అడిగిన సమాచారమంతా ఆమె అందించిందని నిఘా వర్గాలంటున్నాయి. ఆ పని చేయటం పర్యవసానంగా తోటి పౌరులే ప్రమాదాల్లో చిక్కుకుంటారని, అది దేశద్రోహమని వారికి అనిపించదు. డబ్బుకు ఆశపడటం ఒక్కటే ఇలాంటి కార్యకలాపాలకు కారణం అనుకోవటానికి లేదు. వేరే దేశానికి చెందినవారు వీడియోలను చూడటం, పొగడ్తలు గుప్పించటం, తమ ప్రాంతాలకొచ్చి అక్కడి విశేషాలను కూడా చూపాలని అడగటం వగైరాలు వారిని ఆకర్షిస్తాయి. తమ ఘనత అంతర్జాతీయ స్థాయికి చేరుకుందన్న భ్రమ వారిని నిలకడగా ఆలోచించనీయదు. గూఢచర్యం కేవలం అవతలి దేశాన్ని నష్టపరచటానికో, చికాకుపరచటానికో పరిమితం కాదు. వారి ఆయుధాగారాల్లో వచ్చి చేరుతున్న రక్షణ సామగ్రి సామర్థ్యం ఏమిటో, ఎక్కడెక్కడ వారి సైనిక స్థావరాలు పనిచేస్తున్నాయో తెలుసుకోవటంతోపాటు పారిశ్రామిక, ఆర్థిక, పరిశోధనారంగాల్లో ఆ దేశం ఏం చేస్తున్నదో సమాచారాన్ని సేకరిస్తుండటం గూఢచారుల పని. పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత ఎక్కడ మన వైఫల్యం వున్నదో, అందుకు కారణమేమిటో తెలుసుకునే పనిలో ప్రభుత్వం తలమునకలై వుండగా దేశభక్తి పేరిట కొందరు మత విద్వేషాలను రెచ్చగొట్ట జూశారు. ఇప్పుడు పట్టుబడినవారి నేపథ్యం గమనిస్తే ఫలానా మతంవారే దేశద్రోహానికి పాల్పడతారన్నది ఎంత బూటకమో తెలుస్తుంది. శత్రువు కీలకమైన సమాచారాన్ని ఒడుపుగా తస్కరించగలుగుతున్నాడంటే నిస్సందేహంగా అది మన వైఫల్యం. దాన్ని కప్పిపుచ్చి అసత్యాలు ప్రచారం చేయటానికి బదులు, లోపాలను సరిదిద్దుకుని పటిష్టమైన వ్యవస్థలు రూపొందించటం వర్తమాన అవసరం. -
కీలెరిగి వాతపెట్టిన ‘సుప్రీం’
యుద్ధంలో ఆయుధాలు మాత్రమే నిర్ణయాత్మక శక్తి కాదు... కోట్లాది పౌరులు ఒక్కటై వినిపించే స్వరం కూడా. కానీ పాకిస్తాన్‌తో తీవ్ర ఘర్షణలు తలెత్తిన వేళ ఆ సమష్టి స్వరానికి అవరోధం కల్పించేలా, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడి మన నేతల్లో కొందరు దేశాన్ని దిగ్భ్రమ పరిచారు. బహుశా అందుకే కావొచ్చు, కల్నల్ సోఫియా ఖురేషిపై నోరు పారేసుకున్న మధ్యప్రదేశ్ మంత్రి కన్వర్ విజయ్ షా క్షమాపణను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. ఈ విషయంలో ఆయనపై దాఖలైన ఎఫ్ఐఆర్పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి ఈ నెల 28కల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.ఐపీఎస్ అధికారులతో ఏర్పాటయ్యే ఈ బృందంలో ఒక మహిళా అధికారి ఉండాలనీ, దానికి ఐజీ ర్యాంకుకు తక్కువకాని అధికారి సారథ్యం వహించాలనీ ఉత్తర్వులిచ్చింది. ఈ తరహా విద్వేష ప్రసంగాలు బీజేపీ నేతల నుంచి మాత్రమే కాదు, కొందరు విపక్ష నేతల నుంచీ వినిపించాయి. చిత్రమేమంటే ఎక్కడా, ఎవరిపైనా పోలీసులు కేసులు పెట్ట లేదు, చర్యలకు సిద్ధపడలేదు. కానీ సాధారణ పౌరులు చిన్నపాటి భిన్నస్వరం వినిపించినా విరు చుకుపడ్డారు. ఇందుకు అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ ఉదంతమే నిదర్శనం. కల్నల్ సోఫియాను కీర్తిస్తున్న బీజేపీ శ్రేణులు విద్వేష ప్రచారానికి బలవుతున్నవారిని ఎందుకు పట్టించుకో రని ఆయన ప్రశ్నించారు. సైన్యాన్నిగానీ, ఆ మహిళా అధికారుల్నిగానీ కించపరచలేదని, బాహాటంగా కనిపిస్తున్న ద్వంద్వ నీతిని ఎత్తిచూపటమే తన ఉద్దేశమని చెప్పినా ఆయన్ను అరెస్టు చేశారు.విజయ్ షాపై మధ్యప్రదేశ్ పోలీసులు సొంతంగా కేసు నమోదు చేయలేదు. అక్కడి హైకోర్టు సుమోటోగా తీసుకుని తక్షణం ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. ఆ తర్వాతైనా పోలీసులు సక్రమంగా చర్యలు తీసుకున్నది లేదు. ఎఫ్ఐఆర్ వాలకం గమనించిన హైకోర్టు చీవాట్లు పెట్టాకే వారికి జ్ఞానోదయమైంది. విజయ్ షా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. రాష్ట్రంలోని ఎస్టీ నియోజకవర్గం హర్సూద్ నుంచి ఇప్పటికి 8 దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. మంత్రిగా పని చేస్తున్నారు.సంక్షోభ సమయాల్లో సంయమనం పాటించటం చాలా అవసరం. బాధ్యతాయుత స్థానాల్లో వున్నవారు ఆ సంగతి మరిచిపోతున్నారు. విజయ్ షా వ్యాఖ్యల సంగతే తీసుకుంటే ఆయన అన్నది కేవలం కల్నల్ సోఫియా ఖురేషిని మాత్రమే కాదు... ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావన చేసి ఆయనపై సంశయాలు రేకెత్తించే విధంగా మాట్లాడారు. యుద్ధానికి సంబంధించిన వివరాలను వెల్లడించటానికి నియమించిన ఇద్దరు మహిళా ప్రతినిధుల్లో ఒకరైన కల్నల్ సోఫియాను ‘ఉగ్ర వాదుల సోదరి’గా అభివర్ణించారు. ఉగ్రవాదులను ఆ వర్గం చేతే దెబ్బకొట్టించటానికి ప్రధాని ఆమెను తెలివిగా ఎంపిక చేశారన్నట్టు మాట్లాడారు.కల్నల్ సోఫియా నిర్వహించిన మీడియా సమావేశాలను గమనిస్తేనే ఆమె ఎంత సమర్థంగా, చతురతతో ఆ బాధ్యతను నెరవేర్చారో తెలు స్తుంది. గర్వించదగిన నేపథ్యం ఆమెది. దేశంలోని ప్రతి మహిళా స్ఫూర్తిదాయకంగా తీసుకోదగిన చరిత్ర ఆమెది. సైనిక కుటుంబం నుంచి వచ్చి, సైన్యంలో చేరి అందులోని వ్యక్తినే వివాహమాడి ప్రతి స్థాయిలోనూ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ కల్నల్ హోదా వరకూ ఎదిగారు. అటువంటామెను కేవలం ముస్లిం మహిళగా చూశారంటేనే... విజయ్ షా ఎంత ఉన్మాదపూరితంగా ఆలోచి స్తున్నారో అర్థమవుతోంది. అందుకే ఆయన ప్రసంగం తీరు చూసి దేశం యావత్తూ సిగ్గుపడుతోందని సుప్రీంకోర్టు అనక తప్పలేదు.ఉగ్రస్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ దేశమంతా ఒక్కటై ఈ కష్టకాలాన్ని అధిగమించటానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. దాని అర్థం, పర మార్థం విజయ్ షాకు కాస్తయినా అర్థం కాలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు, అటు తర్వాత క్షమా పణ చెబుతూ చేసిన ప్రకటన గమనిస్తే తెలుస్తుంది. నోరుజారి తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నానంటే బహుశా కోర్టు చీవాట్లతో సరిపెట్టేదేమో! కానీ అందరి నేతల మాదిరే ‘ఎవరి మనోభావాలైనా దెబ్బతినివుంటే...’ అంటూ రాగం తీయడంతో వివాదంలో మరింత కూరుకుపోయారు.మంత్రి చెప్పిన క్షమాపణలో చిత్తశుద్ధి లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చేస్తున్నది క్షమించరాని తప్పని ఎటూ తెలియలేదు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు పార్టీ అధిష్ఠానం సైతం మందలించినా పునరాలోచన కలగలేదు, పరివర్తన రాలేదు. ఇలాంటివారిని నాలుగ్గోడల మధ్య మందలించటం కాదు... పదవి నుంచి సాగనంపివుంటే అలాంటివారికి అదొక హెచ్చరికగా ఉండేది. దేశ ప్రజలు కొనియాడేవారు. కానీ బీజేపీ ఆ పని చేయలేకపోయింది.సమాజ్‌వాదీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ సైతం ఈ మాదిరి వ్యాఖ్యలే చేశారు. వైమానిక దళ అధికారులైన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతిల కులాల ప్రస్తావన చేశారు. బీజేపీకి కల్నల్ సోఫియా మతం తెలిసిందిగానీ ఈ అధికారులిద్దరూ పీడిత కులాలవారని తెలియదని, లేకుంటే వారిపైనా తప్పుడు వ్యాఖ్యనాలు చేసేవారని అన్నారు. ఈ బాపతు నాయకు లంతా మనుషుల్ని ఎంతసేపూ కులమతాల చట్రాల్లో చూస్తూ వారి సేవలనూ, అంకిత భావాన్నీ, సంకల్ప దీక్షనూ మరుగుపరుస్తారు. దేశభక్తి పేరుతో ఉన్మాదాన్నీ, విద్వేషాన్నీ పెంచి పోషిస్తారు. సుప్రీంకోర్టు స్పందించిన తీరు నేతలందరికీ గుణపాఠం కావాలి. సంక్షోభ కాలాల్లో మాత్రమే కాదు... సాధారణ సమయాల్లోనూ జాగ్రత్తగా మాట్లాడాలని తెలుసుకోవాలి. -
చీకటి వెలుగులు
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఎన్నో మతాలు ఉన్నాయి. ఎన్నో ఆరాధనా పద్ధతులు ఉన్నాయి. ఆలయాల తొలి ఆనవాళ్లు క్రీస్తుపూర్వం పన్నెండువేల ఏళ్లనాటివి. దాదాపు అన్ని మతాలూ దైవభక్తిని ప్రబోధించేవే! జ్ఞానమార్గాన్ని బోధించిన మతాలు లేకపోలేదు గాని, జనాలను భక్తిపారవశ్యం ఆకట్టుకున్నంతగా జ్ఞానం ఆకట్టుకున్న దాఖలాలు తక్కువ. భాషలు పుట్టి, లిపులు ఏర్పడి, సమాచారాన్ని శిలల మీద, మట్టి పలకల మీద, లోహపు రేకుల మీద, ఆకుల మీద నిక్షిప్తం చేయడం మొదలుపెట్టిన తర్వాత గాని ప్రపంచంలో జ్ఞానవ్యాప్తి మొదలు కాలేదు. మనుషులకు అక్షరజ్ఞానం అబ్బిన తర్వాత తమకు తెలిసిన సమాచారాన్ని తమకు దొరికిన సాధనాలను ఉపయోగించుకుంటూ లిఖితపూర్వకంగా నిక్షిప్తం చేయడం మొదలుపెట్టారు. చరిత్రలో తొలినాటి రచనల ఆనవాళ్లు క్రీస్తుపూర్వం నాలుగో సహస్రాబ్ది నాటివి.మానవాళి జ్ఞానయానానికి అవి తొలి మైలురాళ్లు. భక్తిపారవశ్యం ఒకవైపు, జ్ఞానయానం మరోవైపు మానవాళి మనుగడను ఆది నుంచి నిర్దేశిస్తూనే ఉన్నాయి. సామాజిక, తాత్త్విక, శాస్త్ర, సాంకేతిక పురోగతికి ఎందరో జ్ఞానులు బాటలు వేశారు. లోకమంతటా తమ జ్ఞానకాంతులను ప్రసరించారు. వినువీథిలో ఒకవైపు సూర్యుడు సహా అసంఖ్యాక నక్షత్రాలు నిరంతరం వెలుగులను వెదజల్లుతున్నా, మరోవైపు చీకటి నిండిన కృష్ణబిలాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ లోకంలో ఒకవైపు జ్ఞానులు ప్రసరించిన జ్ఞానకాంతులు ఉన్నా, మరోవైపు మౌఢ్యాంధకారం కూడా అంతే గాఢంగా ఉంది. మానవాళిలో మౌఢ్య నిర్మూలనమనేది ఇప్పటికీ నెరవేరని కలగానే మిగిలింది. ‘మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అని గురజాడ ఆకాంక్షించారు. ఇప్పటి పరిస్థితులను గమనిస్తే, ఆయన ఆకాంక్ష నెరవేరడానికి ఇంకెన్ని యుగాలు పడుతుందో చెప్పడం కష్టం. ఆరాధించే వాటికి ఆలయాలను నిర్మించుకోవడం అనాది సంస్కృతి. దేవాలయాలను, ప్రార్థనాలయాలను నిర్మించుకున్న మనుషులు అక్కడితో ఆగిపోలేదు. ఆరాధ్య నటీనటులకు, నాయకులకు సైతం ఆలయాలను నిర్మించే స్థాయికి పరిణామం చెందారు. ప్రపంచంలో మౌఢ్యం శ్రుతిమించి మితిమీరిన కాలాల్లో సమాజాన్ని సంస్కరించడానికి ఎందరో సంస్కర్తలు ప్రయత్నించారు. జ్ఞానకాంతులతోనే మౌఢ్యాంధకారం పటాపంచలవుతుందని గ్రహించి, జ్ఞానవ్యాప్తికి కృషి చేశారు. ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞానసంపదను అందించడానికి గ్రంథాలయాలను నెలకొల్పారు. ప్రపంచంలోని తొలి గ్రంథాలయం క్రీస్తుపూర్వం మూడో సహస్రాబ్దిలో ఏర్పడింది. ఇప్పటి సిరియాలోని టెల్ మార్దిక్ గ్రామంలో ఉందది. ‘ది రాయల్ లైబ్రరీ ఆఫ్ ఎబ్లా’ అనే ఈ గ్రంథాలయం తొలి జ్ఞాననిధి. ఇందులో ఇరవైవేల మట్టిపలకలపై ఉన్న రాతలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇది ద్విభాషా గ్రంథాలయం కావడం ఇంకో విశేషం. సుమేరియన్, ఎబ్లాౖయెట్ భాషలలో చిత్రలిపిలో రాసిన రాతలు ఆనాటి సామాజిక, వాణిజ్య, విద్యాపరమైన పరిస్థితులకు సాక్షీభూతంగా నిలిచి ఉన్నాయి. ఈ మట్టిపలకల్లో కొన్ని ఇప్పుడు సిరియాలోని డెమాస్కస్, అలెప్పో తదితర నగరాల్లోని మ్యూజియంలలో ఉన్నాయి. ప్రాచీనకాలంలో మన ఉపఖండ భూభాగంలోనూ నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో గ్రంథాలయాలు ఉండేవి. ఇప్పుడు వాటి శిథిలావశేషాలు తప్ప ఆనాటి జ్ఞానసంపద ఏదీ మిగిలి లేదు. పురాతన గ్రంథాలయాలు ఏర్పడిన కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా మూఢాచారాలు కూడా విస్తృతంగా ఉండేవి. ఆ తర్వాత కాలంలో చాలా మార్పులు జరిగాయి. జాన్ గూటెన్‌బర్గ్ రూపొందించిన ముద్రణ యంత్రం పుస్తకాల రూపురేఖలను మార్చేసింది. ఆధునిక పుస్తకాలకు అంకురారోపణ చేసింది. పారిశ్రామిక విప్లవ కాలంలో పుస్తకాల ముద్రణ పెరగడం మొదలైంది. వలస పాలనలు మొదలవడంతో ప్రజలకు బహుభాషా పరిచయం ఏర్పడి, సమాచార ఆదాన ప్రదానాలు ఊపందుకున్నాయి. బ్రిటిష్ హయాంలో మన దేశంలో నాటి కలకత్తా నగరంలో ‘ఏషియాటిక్ సొసైటీ లైబ్రరీ’ పేరుతో తొలి ఆధునిక గ్రంథాలయం 1781లో ఏర్పడింది. అప్పటికి సతీసహగమన దురాచారంపై ఇంకా నిషేధం విధించలేదు. మన తెలుగునేల మీద 1886లో తొలి ఆధునిక గ్రంథా లయాన్ని విశాఖపట్నంలో మంతిన సూర్యనారాయణమూర్తి నెలకొల్పారు. అప్పటికి కన్యాశుల్కం దురాచారం తీవ్రంగా ఉండేది. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే అయ్యంకి వెంకటరమణయ్య నేతృత్వంలో గ్రంథాలయోద్యమం కూడా మొదలైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అనేక మార్పులు జరిగాయి. ఎంతో అభివృద్ధి జరిగింది. ప్రజల్లో అక్షరాస్యత పెరిగింది. పత్రికలు, అధునాతన ప్రసార మాధ్యమాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. అయినా, జనాల్లో మౌఢ్యం పూర్తిగా అంతరించలేదు. ఇప్పటికీ మన దేశంలో గ్రంథాలయాల కంటే దేవాలయాలు, ప్రార్థనాలయాలే ఎక్కువ. వైజ్ఞానికాభివృద్ధి ఫలితంగా అందివచ్చిన సాంకేతికత సాధనాలను కూడా వ్యర్థవినోదానికి వినియోగించుకోవడంలో మన జనాలు అపార ప్రజ్ఞాధురీణులు. మౌఢ్య ప్రాబల్యం ఎంతగా పెరుగుతున్నా, జ్ఞానారాధకులు అంతరించిపోలేదు. అందుకు నిదర్శనమే కేరళలోని కాసర్గోడ్ జిల్లా కంబళూరులో వెలసిన పుస్తకాలయం. పుస్తకమే ఇందులోని దేవత. పుస్తకాలే ప్రసాదం. ‘జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అనే ఆకాంక్షను వెలిగించడానికి ఇదొక ఆశాదీపం. -
‘శాంతిదూత’ ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంత సులభంగా అర్థం కారని ఆయన గల్ఫ్ దేశాల పర్యటన తీరుతెన్నులు చూస్తే తెలుస్తుంది. తాను అధికారంలోకొస్తే పశ్చిమాసియాలో సాగుతున్న ‘అంతూ దరీ లేని యుద్ధాలకు’ ముగింపు పలుకుతానని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన తరచు అనే వారు. ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగు రోజుల గల్ఫ్ పర్యటనలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు గమనిస్తే ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చదల్చుకున్నట్టు కనబడుతోంది. తన రెండో దశ పాలనలో ట్రంప్ మొదలెట్టిన తొలి విస్తృత విదేశీ పర్యటన ఇది. ఈ ప్రాంతంలోనే ఉన్న ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లకపోవటం ఆయన తాజా వైఖరికి సంకేతం. ఇది ఎన్నాళ్లుంటుందన్నది తెలియక పోయినా చేస్తున్న ప్రకటనలైతే భిన్నంగా ఉన్నాయి. ఇరాన్‌తో అమెరికా 46 ఏళ్లుగా సాగిస్తున్న ‘అప్రకటిత యుద్ధం’ ఇక కొనసాగనీయరాదన్న అభిప్రాయం ఉందని మంగళవారం సౌదీ అరే బియాలోని రియాద్‌లో ఆయన ప్రకటించారు. బుధవారం సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్– షారాతో భేటీ అయ్యారు. ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలు నెలకొల్పుకొనాలని సలహా ఇచ్చారు. అల్–షారాకు గతంలో అల్ కాయిదాతో, ఐఎస్‌తో సంబంధాలుండేవి. ఈ భేటీకి ముందే గల్ఫ్ సహకార మండలి(జీసీసీ) సదస్సులో సిరియాపై ఆంక్షలు ఎత్తేస్తున్నట్టు తెలియజేశారు. ఈ నిర్ణయాలపై ఇజ్రాయెల్ అలిగినా, మరొకరు అభ్యంతర పెట్టినా ఆయన ఖాతరు చేయదల్చుకున్నట్టు లేరు. గత నెలలో ట్రంప్‌ను కలిసి సిరియాపై ఆంక్షలు కొనసాగించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ వేడుకున్నారు. ఇరాన్ విషయంలో అయితే చాలా చెప్పివుంటారు. సిరియాపై ఆంక్షలు ఎత్తేయటం, ఇరాన్‌తో చెలిమికి సిద్ధపడటం నెతన్యాహూకు ససేమిరా ఇష్టం లేదు. కానీ లీకుల ద్వారా తప్ప నేరుగా తన అసమ్మతిని ఇంతవరకూ తెలియజేయలేదు. ఆ మధ్య ట్రంప్ ఇందుకు భిన్నంగా మాట్లాడారు. అణు ఒప్పందాన్ని అంగీకరించి, శాంతికి సిద్ధపడకపోతే ఇరాన్ భారీ స్థాయి ఒత్తిడులు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. కానీ ట్రంప్ తాజా ధోరణి అందుకు భిన్నంగా ఉంది. ఇరాన్‌తో చెలిమి గురించి ఆయన ఏదో మాటవరసకు అనలేదు. ‘ప్రస్తుతం అమెరికాకు అత్యంత సన్నిహిత దేశాలు కొన్ని తరాల కిందట మాపై శత్రుత్వంతో చెలరేగినవే’ అని గుర్తుచేశారు. సిరియా, ఇరాన్‌ల విషయంలో తన వైఖరి మారటానికి సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కారణమని ఆయన జీసీసీ వేదికపైనే ప్రకటించారు కూడా. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్లు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతూనే ఉన్నా ఈనెల 5న వారితో అవగాహనకొచ్చారు. స్నేహంలోనైనా, శత్రుత్వంలోనైనా ట్రంప్ తీరే వేరని ఆయన నిర్ణయాలు తెలియజేస్తున్నాయి. మూడేళ్లనాడు అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సౌదీ వచ్చినప్పుడు దేశంలో మానవహక్కులు అడుగంటుతున్న వైనంపై సౌదీ యువరాజును నేరుగా ప్రశ్నించారు. 2018లో జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి ప్రాణం తీయించడాన్ని ప్రస్తావించారు. ఈ మాదిరి హత్యలు తమకు సమ్మతంకావని చెప్పారు. అందుకే కావొచ్చు... ఇప్పుడు ట్రంప్‌కు ఎదురైన స్వాగతసత్కారాల వంటివి బైడెన్‌కు లభించలేదు. సౌదీ గడ్డపై గతకాలపు అమెరికా అధ్యక్షుల్ని నిశితంగా విమర్శించటానికి ట్రంప్ వెన కాడలేదు. అమెరికన్ సమాజం గురించి కాస్తయినా తెలియనివారు ఎంతో జటిలమైన గల్ఫ్ సమా జాల్లో జోక్యం చేసుకోవటానికి ఎగబడ్డారని వ్యాఖ్యానించటం చిన్న విషయం కాదు. పశ్చిమాసియా దేశాలతో ఎన్ని వేల కోట్ల డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకోగలమన్నదే ఆయన ఆరాటంగా కనబడు తోంది. దానికి తగ్గట్టే మంగళవారం సౌదీతో 14,200 కోట్ల డాలర్ల మేర ఆయుధ ఒప్పందంపై సంతకాలయ్యాయి. ఇదిగాక అమెరికాలో 60,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు యువరాజు ప్రకటించారు. ట్రంప్ దీంతో సంతృప్తిపడలేదు. దీన్ని లక్ష కోట్ల డాలర్లకు పెంచాలని ఆ వేదికపైనుంచే కోరారు. సౌదీతో అమెరికాకు ఎప్పుడూ మంచి స్నేహసంబంధాలేవున్నా ఈ స్థాయి ఒప్పందాలెప్పుడూ లేవు. ఒక పరిశోధక సంస్థ నివేదిక ప్రకారం 2010–20 మధ్య అమెరికాకు సౌదీతో 10,000 కోట్ల డాలర్ల విలువైన ఆయుధ ఒప్పందాలు మాత్రమే కుదిరాయి.స్నేహం పేరుతో అమెరికాను దోచుకుంటున్నారని నాటో భాగస్వామ్య దేశాలైన పాశ్చాత్య మిత్రులపై తరచూ విరుచుకుపడే ట్రంప్...పశ్చిమాసియా దేశాలకు ఏ కష్టమొచ్చినా అమెరికా దృఢంగా నిలబడుతుందని హామీ ఇవ్వటం గమనార్హం. ఇంధన అవసరాల్లోనూ, రక్షణరంగంలోనూ పనికొచ్చే అత్యంత విలువైన లిథియం, కోబాల్ట్‌లతోపాటు థోరియం వంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్వేషించి అమెరికా చేర్చటానికి సౌదీ–అమెరికా ఖనిజ సంస్థల మధ్య ఈ పర్యటనలో 900 కోట్ల డాలర్ల ఒప్పందం కుదరటంతో ట్రంప్ సంతోషానికి పట్టపగ్గాల్లేవు. అందువల్లే పశ్చిమాసియాకు శక్తి మంతమైన సెమీ కండక్టర్ చిప్స్, ఏఐ డేటా సెంటర్లకు పనికొచ్చే కీలక విడిభాగాల ఎగుమతులకు ఆయన పచ్చజెండా ఊపారు. ఇది సంప్రదాయ అమెరికా విదేశాంగ విధానానికి భిన్నం.ఈ పర్యటనలో ట్రంప్ స్వకార్యమూ నెరవేర్చుకుంటున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దేశ ప్రయోజనాలకూ, అధ్యక్షుడిగా ఆయన నిర్ణయాలకూ చుక్కెదురన్నది విమర్శకుల వాదన. ట్రంప్ సొంత సంస్థకు సారథ్యం వహిస్తున్న ఆయన కుమారులు గత కొన్నివారాలుగా గల్ఫ్‌లో తిష్ఠ వేసి తమ సంస్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనీ, కుదిరిన ఒప్పందాలన్నీ వారికి మేలు కలిగించేవేననీ అంటున్నారు. ఏది ఏమైనా ట్రంప్ వైఖరి మళ్లీ మారేలోగా పశ్చిమాసియా చక్కబడితే ప్రపంచానికి అంతకన్నా కావాల్సిందేమీ లేదు.


