
ఈసారి ఎలాగైనా నోబెల్ శాంతి బహుమతి చేజిక్కించుకోవాలన్న ఆత్రపడుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఆగ్రహించి ఉక్రెయిన్‌కు తిరిగి ఆయుధాలు సరఫరా చేయబోతున్నట్టు మంగళవారం ప్రకటించారు.
ట్రంప్ వచ్చే నాటికే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగా దాన్ని ఆపాలంటూ పిలుపునిచ్చి పలు దఫాలు రెండు దేశాలతోనూ మాట్లాడారు. దూతల్ని పంపారు. కానీ పుతిన్ ముందు అవేమీ పనిచేయలేదు. మారణాయుధాల డ్రోన్‌లతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు పలు నగరాలపై దాడులు సాగిస్తూనే ఉన్నారు. అమెరికా నుంచి ఆయుధ సరఫరా నిలిచి పోవటం, దాడులకు అనువైన వేసవి కాలం కావటం రష్యాకు కలిసొచ్చింది.
తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెస్క్ ప్రాంతాన్ని కైవసం చేసుకోవటం ఆయన లక్ష్యంగా కనబడుతోంది. 2022 తర్వాత ఈ ప్రాంతంలో రష్యాది పైచేయి కావటం ఇదే తొలిసారి. ఇప్పటికే డొనెస్క్ ప్రాంతంలో మూడింట రెండొంతుల ప్రాంతం రష్యా దళాల అధీనమైంది. అక్కడి కాస్టన్‌టేనుకా నగరం తమ వశమైతే డొనెస్క్ ప్రాంతంలో వరసగా ఉన్న నగరాలన్నీ కుప్పకూలుతాయని ఆ దళాలు భావిస్తున్నాయి.
దౌత్యం నెరపదల్చుకున్నప్పుడు నిర్దిష్టమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలి. మధ్యవర్తిగా రెండు పక్షాలతో మాట్లాడి వారి డిమాండ్లేమిటో ముందు తెలుసుకోవాలి. అటు ఉభయ పక్షాలూ కొంత తగ్గటానికి సిద్ధపడాలి. తగ్గటం మాట అటుంచి రష్యా–ఉక్రెయిన్‌లు రెండూ యుద్ధం కొన సాగింపులోని నిరర్థకతను గుర్తించటం లేదు.
ఎప్పటిలా అమెరికా ఆయుధాలు అందజేస్తే తన వంతుగా రష్యాపై దాడులు సాగిస్తాననీ, పర్యవసానంగా ఎప్పటికైనా ఆధిక్యత సాధించగలననీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెబుతున్నారు. ఈ మాటలు మాట్లాడేది ఆయనే అయినా, పలికి స్తున్నది పాశ్చాత్య దేశాలు. ట్రంప్ ఊగిసలాట ధోరణి, దేనికీ కట్టుబడి ఉండని ఆయన వైఖరి వగైరాలు ఏదో దశలో ఉక్రెయిన్‌కు అక్కరకొస్తాయని అవి భావిస్తున్నాయి.
నిజానికి ఉక్రెయిన్ ఈ యుద్ధంలో ఎప్పుడో ఓటమిపాలైంది. దాన్ని కప్పిపుచ్చటానికి బైడెన్ ఏలుబడిలోని అమెరికా, పాశ్చాత్య దేశాలూ ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌కు అధునాతన ఆయుధాలందిస్తూ రష్యా నగరాలపై, దాని యుద్ధ నౌకలపై, ఇతరేతర కీలక ప్రాంతాలపై దాడులు కొనసాగేలా చూశాయి. కానీ ట్రంప్ వచ్చాక ఆయుధ సాయం ఆగిపోయింది. ఆర్థిక సాయమూ నిలిచిపోయింది. పాశ్చాత్య దేశాలు అతి కష్టమ్మీద తమ వంతుగా ఆ బరువును భుజాలకెత్తుకున్నా అది ఏ మూలకూ చాలటం లేదు.
అందుకే గత పక్షం రోజులుగా రష్యా సాగిస్తున్న వరస దాడులతో ఉక్రెయిన్‌కు ఊపిరాడటం లేదు. డొనెస్క్ నగరాన్ని రక్షించటంలో నిమగ్నమైన తన దళాలకు ఆహారమూ, ఆయుధాలూ పంపటం మాట అటుంచి కనీసం గాయపడినవారిని వెనక్కి తీసుకొచ్చే వెసులుబాటు కూడా దొరకటం లేదు. ఆ నగరం చుట్టూవున్న ప్రాంతాలన్నీ రష్యా చేజిక్కించుకుంది. నిజానికి ఈ యుద్ధం ఉక్రెయిన్ స్వయంకృతం. అమెరికా, పాశ్చాత్య దేశాల మాట విని రష్యాపై గిల్లికజ్జాలకు పోయింది.
పక్షంరోజుల్లో రష్యాను దారికి తీసుకురాగలమని పాశ్చాత్య దేశాలు విశ్వసించాయి. రష్యా తమపైకి దండెత్తి వస్తే ‘నాటో’ సైన్యాలతో దాన్ని సులభంగా మట్టికరిపించగలమను కున్నాయి. ఇందుకోసం ఉక్రెయిన్‌లో తమకు అనుకూలుడైన జెలెన్‌స్కీకి పట్టంగట్టాయి. రష్యాతో సమవుజ్జీ కాకపోవటంతో ఇప్పటికే ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. పాశ్చాత్య దేశాల బాసటతో రష్యాకు నష్టం కలిగించిన మాట నిజమే అయినా, అదే ఇప్పుడు రష్యా పట్టుదలకు కారణమైంది.
యుద్ధం ఆపాలని ట్రంప్ నేరుగా పుతిన్‌తో ఫోన్ సంభాషణలు సాగించినప్పుడు ఆయన ‘మూల కారణాల’ను ప్రస్తావించారని, అవి పరిష్కారం అయితే తప్ప యుద్ధం ఆపేది లేదన్నారని కథనాలు వెలువడ్డాయి. ఆ మూల కారణాల్లో నాటో దూకుడు ఒకటైతే, ఉక్రెయిన్‌ను ఉసిగొల్పటం రెండోది. యూరప్ భద్రతకు సంబంధించి కొత్త అమరిక ఉండాలని, యుద్ధం ఆగాక ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వమీయరాదని పుతిన్ కోరుతున్నారు.
నాటో కూటమి ఏర్పడినప్పుడు సోవియెట్ యూనియన్ నుంచి పశ్చిమ యూరప్‌ను పరిరక్షించటమే ధ్యేయమని అది ప్రకటించింది. అదే నిజమైతే 1989లో సోవియెట్ కుప్పకూలి అనేక దేశాలుగా విడివడినాక నాటో అవసరం ఏముంది? సోవియెట్ చివరి అధినేత గోర్బచెవ్ అప్పట్లో ఒక ప్రతిపాదన చేశారు.
‘నాటోను రద్దయినా చేయండి... లేక ఆ కూటమిలో మాకు చోటైనా ఇవ్వండి’ అన్నదే దాని సారాంశం. అందువల్ల యూరప్ బలపడుతుందనీ, సౌభాగ్యవంతమవుతుందనీ ఆయన చెప్పారు. కానీ అమెరికా ఇందులో కీడు శంకించింది. యూరప్ తనను మించి ఎదుగుతుందని భయపడింది.
తూర్పు యూరప్ దేశాలను నాటోలో చేర్చుకోబోమని అప్పట్లో గోర్బచెవ్‌కి హామీ ఇచ్చారు. కానీ అర డజను దేశాలకు సభ్యత్వమిచ్చారు. వేరే దేశాలతో సరిహద్దు తగాదాలు లేని దేశాలను మాత్రమే చేర్చుకోవాలన్న నిబంధనకు మంగళం పాడారు. చివరకు ఉక్రెయిన్‌ను చేర్చుకోవటానికీ సిద్ధపడ్డారు. రష్యాపైకి ఉసిగొల్పారు.
వీటిని చర్చించకుండా, ఎలాంటి పరిష్కారం అవసరమో యోచించకుండా ట్రంప్ తన ట్రూత్ సామాజిక మాధ్యమం ద్వారా ‘యుద్ధం ఆపండం’టూ సందేశాలు పెడుతూ, నోబెల్ శాంతి బహుమతి కోసం ఎదురుచూస్తూ కాలం గడిపితే ఫలితం ఉండదు. ట్రంప్ నిజంగా యుద్ధం ఆపదల్చుకుంటే తటస్థ ఉక్రెయిన్‌కు పూచీపడాలి. నాటో విస్తరణ ఉండబోదని తెలపాలి. ట్రంప్ ఆ పని చేయగలరా?