
జనతంత్రం
‘‘ప్రతి బాల్యంలోనూ ఓ నందనోద్యానం ఉంటుంది. అది మెరిసిపోయే రంగులతో అల్లుకున్న మంత్రముగ్ధ నగరి. పిల్ల తెమ్మెరలక్కడ మృదువుగా హత్తుకుంటాయి. ప్రతి ఉదయమూ అక్కడ పరిమళ భరితమే’’ – బాల్యం గురించి ఓ రచయిత్రి అలా వర్ణించారు. బాల్యం ఇలాగే ఉండాలి. ఈ విధంగానే ఎదగాలని చాలామంది కోరుకుంటారు. అందుకే ప్రతి నాగరిక దేశం బాలల హక్కులకు ప్రత్యేక రక్షణను ఏర్పాటు చేసింది.
భారత రాజ్యాంగం కూడా అటువంటి ఏర్పాట్లు చేసింది. స్వయంగా తల్లిదండ్రులే తమ పిల్లల్ని స్వల్పంగా దండించినా సహించకుండా జైల్లో పెడతారు స్కాండినేవియన్ దేశాల్లో! ఏ జాతికైనా అమూల్య సంపద బాలలే కనుక మానవత్వం సున్నితత్వమున్న వ్యవస్థలన్నీ బాలల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాయి. ‘మనం చూడలేని కాలానికి మనం పంపించే సజీవ సందేశాలు పిల్లలే’! కనుక వారికా ప్రత్యేక హక్కులుంటాయి.
ఆచరణలో ప్రతి బాల్యం నందనోద్యానంలా ఉంటున్నదా? ఏలుతున్నవారు అలా ఉండటానికి అనుమతిస్తున్నారా? అందమైన బాల్యాన్ని అంగడి సరుకుగా మార్చడానికి దోహద పడుతున్న ప్రభుత్వాలనిప్పుడు చూస్తున్నాము. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే పేద పిల్లలకు కూడా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరగాలని ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసినప్పుడు మోకాలడ్డే ప్రయత్నం చేసిందెవరు? ఆ ప్రయత్నం చేసిన చంద్రబాబు కూటమే ఇప్పుడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఎత్తివేసింది. విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యతలు కావనేది ఆయన ఫిలాసఫీ. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకున్నారు. కనుకనే ఆయన మళ్లీ గద్దెనెక్కగానే కొనగలిగినవారికి నాణ్యమైన విద్య... లేనివారికి నాసిరకం విద్యావిధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానపు దుర్మార్గానికి పుట్టిన విషపు పుండే మొన్నటి కురుపాం ఘటన.
పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థుల్లో కామెర్ల వ్యాధి ప్రబలిన నేపథ్యాన్ని గమనిస్తే ఒళ్లు జలదరిస్తుంది. లక్షలాదిమంది పేద తల్లిదండ్రులు వారి బిడ్డల భవిష్యత్తుపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏపీ సర్కార్ వమ్ము చేస్తున్న వైనం దిగ్భ్రాంతికరమైనది. కురుపాం ఆశ్రమ పాఠశాలలో ఉంటున్నది ఆరొందల పైచిలుకు బాలికలే కావచ్చు. అన్ని రకాల సంక్షేమ హాస్టళ్ళు, అన్ని రకాల ఆశ్రమ పాఠశాలలూ కలిపి ఏపీలో 3,800కు పైగా ఉన్నాయి.
వీటిల్లో లక్షలాది మంది పేదవర్గాల పిల్లలు ప్రభుత్వం మీద భరోసాతో తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటు న్నారు. ప్రస్తుత ప్రభుత్వపు విధానపరమైన వైఖరి ఫలితంగా కొద్దిపాటి తేడాలు తప్ప కురుపాం ఆశ్రమ పాఠశాలకు పూర్తి భిన్నమైన పరిస్థితులు ఎక్కడా లేవు. కురుపాం దారుణానికి సంబంధించిన ప్రకంపనలు తగ్గకముందే గుంటూరు జిల్లాలో బీసీ హాస్టల్ విద్యార్థులు సామూహికంగా అస్వస్థులు కావడం నివ్వెరపరిచింది. గత ఏడాది కాలంగా ఈ తరహా వార్తలు అడపాదడపా వెలుగు చూస్తున్నా ఎటువంటి చర్యలూ తీసుకోక పోవడంతో పరిస్థితులిప్పుడు దారుణంగా దిగజారాయి.
అసలేం జరిగింది కురుపాంలో? మరొకసారి పునరా లోకనం చేసుకోవాలి. కురుపాం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరొందల పైచిలుకు విద్యార్థినులుంటున్నారు. సగటున ఇరవై మందికో మరుగుదొడ్డి. వాటి నిర్వహణ కూడా అంతంత మాత్రమే. డ్రైనేజీ ఏర్పాట్లు సరిగా లేక మురుగు నీరంతా ఒక పక్కకు చేరి అక్కడినుంచి బోర్ నీళ్లలో కలిసిపోతున్నదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.
దసరా సెలవులు ప్రకటించిన తర్వాత సొంత ఊరికి వెళ్లిన అంజలి అనే బాలిక కామెర్ల లక్షణాలతో సెప్టెంబర్ 25న చనిపోయింది. తోయక కల్పన అనే టెన్త్ క్లాస్ చదువుతున్న బాలిక పది రోజులపాటు స్థానిక జిల్లా ఆస్పత్రుల్లో చికిత్స తీసుకొని నయం కాకపోవడంతో వైజాగ్ కేజీహెచ్‌లో చేరింది. సెప్టెంబర్ 29న ఆ బాలిక కూడా కామెర్ల వ్యాధి (హెపటైటిస్ ఏ)తో ప్రాణాలు కోల్పోయింది. అంటే ఆశ్రమ పాఠశాలకు సెలవులు ఇవ్వకముందే కామెర్ల లక్షణాలు బయటపడినట్టు స్పష్టమవుతున్నది.
కురుపాంలోనే మరో హాస్టల్‌లో చదువుతున్న ఇంకో ఇద్దరు బాలురు అక్టోబర్ 5, 6 తేదీల్లో ఇవే లక్షణాలతో చనిపోయారు. గిరిజన బాలికల గురుకులం నుంచి మొత్తం 170 మంది బాలికలకు కామెర్లు సోకి ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో యాభై మంది విశాఖ కేజీహెచ్ దాకా రావలసి వచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో బాలికలకు సురక్షిత మంచినీటి కోసం ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం దానికి రిపేర్ రావడంతో పక్కన పడేశారు.
విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్న సమాచారం ప్రకారం డ్రైనేజీ వ్యవస్థ లేక మరుగుదొడ్ల మురుగు నీరు కలుస్తున్న బోర్ నీటినే బాలికల చేత తాగిస్తున్నారు. వంటకూ వాటినే వినియోగిస్తున్నారు. విద్యార్థుల మెడికల్ రిపోర్టులు కూడా దాన్నే నిర్ధారిస్తున్నాయి. మురుగుతో నీటి కాలుష్యం వల్లనే విద్యార్థులు ‘హెపటైటిస్–ఏ’ వ్యాధికి గురయ్యారని చెబుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే నిర్వాహకులు ఏం చేస్తున్నట్టు? పిల్లల చేత మురుగునీళ్లు తాగిస్తూ ఉపాధ్యాయులు మాత్రం మినరల్ వాటర్ తెచ్చుకుని తాగేవారని గిరిజన పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
పిల్లలు తరచూ అస్వస్థతకు గురవుతుంటే నిర్వాహకులు వారిని ఇళ్ళకు పంపించి చేతులు దులిపేసుకోవడమేమిటి? పై అధికారులకు వీళ్లు రిపోర్టు చేయలేదా? చేసినా వారు పట్టించు కోవడం లేదా అన్నది తేలాల్సి ఉన్నది. యథా రాజా తథా ప్రజా అంటారు కదా! పేద పిల్లల ఆరోగ్యం సంగతి ప్రభుత్వానికే పట్టనప్పుడు తమకెందుకని అధికారులు అలక్ష్యంతో ఉంటు న్నారేమో తెలియదు. విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, ఐటీడీఏ, జిల్లా యంత్రాంగాలు, వాటి అధికార శ్రేణులు ఉన్నప్పటికీ ఇన్ని దుర్ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి?
సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం కోసం అనుసరించ వలసిన ప్రోటోకాల్‌ను కూడా పాటించకపోవడం విస్మయం కలిగించే విషయం. ఆర్వో ప్లాంట్ చెడిపోతే వెంటనే ఎందుకు బాగు చేయించలేదు? నిర్ణీత కాలానికోసారి తాగునీటికి నాణ్యతా పరీక్షలు చేయడం లేదా? ఒకరిద్దరు పిల్లలు జబ్బుపడిన తర్వాత మిగిలిన పిల్లల విషయంలో వ్యాధి నిరోధక చర్యలు చేపట్టారా, లేదా? కనీసం తాగునీటిని క్లోరినేషన్ చేసినా ఇటువంటి ఘటనలు జరిగేవి కావు కదా!
సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల విద్యార్థుల ఆరోగ్య, వసతి సమస్యలపై ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శ
నంగా వరసగా అనేక దుర్ఘటనలు ఈ ఏడాది కాలంలో రికార్డయ్యాయి. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన సంక్షేమ హాస్టళ్ల గురుకులాల్లోనే ఈ కాలంలో 11 మంది విద్యార్థులు అనారోగ్య కారణాలతో చనిపోయారు. తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేడ్కర్ సంక్షేమ గురుకులంలో పాచిపోయిన ఆహారం పెట్టడం వల్ల వందమంది విద్యార్థులు అస్వస్థులయ్యారు. ఇటువంటి ఘటనే అదే జిలాల్లోని జ్యోతిబా ఫూలే బీసీ హాస్టల్‌లో జరిగింది.
కాకినాడ జిల్లా ఏలేశ్వరం, అనకాపల్లి జిల్లా రాజగోపాలపురం, నూజివీడు ట్రిపుల్ ఐటీల్లో కూడా కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు జబ్బుపడిన ఘటనలు జరిగాయి. ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని బీసీ హాస్టల్‌లో కలుషితాహారం తిని 50 మంది విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారు. శనివారం నాడు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగి తమ పిల్లల్ని హాస్టల్ నుంచి ఖాళీ చేయించారు. సంపన్నుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లలో మిగిలిపోయిన ఆహారాన్ని మర్నాడు తీసుకొచ్చి హాస్టల్ విద్యార్థులకు పెట్టడం ఏపీలో ఇప్పుడో ట్రెండ్‌గా మారింది. పాచిపోయిన ఆహారం తిని పిల్లలు అస్వస్థతకు గురైన ఘటనలు పలుచోట్ల జరిగాయి.
తాజాగా కురుపాంలో జరిగిన ఘటన మానవత్వానికే సవాల్ విసురుతున్నది. ఆరొందల మందికి పైగా బాలికలు రోజుల తరబడి మురుగునీళ్లు తాగవలసిన పరిస్థితి ఎవరి పాపం? పక్కనే ఉన్న విశాఖ నగరంలో అతి ఖరీదైన భూముల్ని కారుచౌకగా లుల్లూ భయ్యాలకూ, లల్లూ భయ్యాలకూ కట్టబెడు తున్న సర్కార్, ఏజెన్సీ గిరిజన బిడ్డలకు శుభ్రమైన మంచినీటిని కూడా ఎందుకు నిరాకరిస్తున్నట్టు? చంద్రబాబును పెత్తందారీ వర్గాల ప్రతినిధిగా పిలవడం ఇటువంటి కారణాల వల్లనే! పేదల సంక్షేమాన్ని ‘పీ–4’కు అప్పగించాలని ఆయన నిర్ణయించారు.
సంపన్నుల ఫంక్షన్లలో మిగిలిపోయిన, పాచిపోయిన ఆహారాన్ని పేదలకు పంచడం లాంటిదే ‘పీ–4’ ఫిలాసఫీ. ఇదేనా మన రాజ్యాంగం చాటిచెప్పిన సమానత్వం? ఎటువంటి వివక్షా లేకుండా అన్ని వర్గాల పిల్లలందరూ ఉచితంగా విద్యను అభ్యసించడమే కాదు, వారి ఆరోగ్య సంరక్షణ కూడా ప్రాథమిక హక్కుల్లో భాగమే. కూటమి సర్కార్ హయాంలో సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న ఉదంతాలు కచ్చి తంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలే. జీవించే హక్కును కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తున్నట్టే!
కామెర్ల వ్యాధి ప్రబలుతున్నదని తెలిసిన తర్వాత కూడా పాఠశాల నిర్వాహకులు, అధికారులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగానే ఉన్నది. వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం వల్లనే విద్యార్థులకు కామెర్ల వ్యాధి సోకిందని సాక్షాత్తూ ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించడం గిరిజన ప్రజానీకాన్ని అవమానించడమే! నలతగా ఉంటున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా వారిని ఇళ్లకు పంపించి పాఠశాల నిర్వాహకులు చేతులు దులుపుకొన్నారు. సరైన వైద్యం అందించకుండా కాలయాపన చేసి, రోజుల తరబడి స్థానిక ఆస్పత్రుల్లో తిప్పి చివరకు మాత్రమే కేజీహెచ్‌కు తరలించినందువల్లనే కల్పన అనే బాలిక చనిపోయింది.
బాలిక మరణానికి కారణం సెరెబ్రల్ మలేరియా అని రాశారట! వైద్యులు చికిత్స చేసింది కూడా దానికేనా? అధికారుల ఒత్తిడికి లొంగి వైద్యులు అలా రాయ వచ్చునా? చనిపోయిన పిల్లలకు పోస్ట్‌మార్టమ్ ఎందుకు నిర్వహించలేదు? కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పిల్లల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారనే వార్తలు రాగానే వారిని బలవంతంగా డిశ్చార్జి చేయించడానికి అధికారులు ఎందుకు ప్రయాస పడినట్టు? దాచేస్తే సత్యం దాగుతుందా? విద్య, వైద్యం ఉచితంగా అందజేయడం ప్రభుత్వం విధానం కాదనేది కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు వైఖరి.
అందువలన పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ఆయనకు ప్రాధాన్య రంగం కాదు. వారికి పోషకాహారం, వసతి సౌకర్యాలు వారి ఎజెండాలో ఉండవు. ఈ విధానానికి వ్యతిరేకంగా పోరాడటమా? లేక మౌనంగా అవమానాలు దిగమింగి అన్యాయాలను సహించ డమా? ఏ మార్గం అనుసరించాలో పేద–మధ్యతరగతి వర్గాల ప్రజలు, ప్రజాస్వామ్య – రాజ్యాంగవాదులు నిర్ణయించుకోవ లసి ఉంటుంది.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com