
థియేటర్‌లోని ప్రేక్షకులు సీటు కిందకు తల ఒంచి అటూ ఇటూ వెతికారు... కాయిన్ ఇక్కడెక్కడైనా పడిందా అని. ‘షోలే’ క్లయిమాక్స్‌లో అమితాబ్ మరణించాక అతని చేతిలోని కాయిన్ చూసి ధర్మేంద్ర షాక్ అవుతాడు. ఆ కాయిన్ కు రెండు వైపులా ‘హెడ్స్’ ఉంటుంది. ఇంతకాలం తన ప్రాణమిత్రుడు దొంగటాస్ వేసి మోసం చేశాడని, ఇవాళ అదే టాస్‌తో తనను కాపాడితాను మరణించాడని గ్రహించి, ఆగ్రహంతో కాయిన్ ని విసిరి కొడతాడు.
అది గల్‌గల్‌మంటూ థియేటర్‌లోనే ఎక్కడో పడుతుంది. ఒక క్షణం ప్రేక్షకులు దాని కోసం అటూఇటూ వెతుకుతారు. ఎందుకంటే అందాక వారికలాంటి అనుభూతి తెలియదు. స్టీరియోఫోనిక్ వల్ల వచ్చింది. షోలేను షోలే అభిమానులు స్టీరియోఫోనిక్ థియేటర్ వెతుక్కుంటూ నగరాలకు వెళ్లి చూశారు. 70 ఎం.ఎంలో చూశారు.
స్కోప్‌లో చూశారు. 35 ఎం.ఎం.లో చూశారు. చిన్న ఊళ్లలో నిడివి కుదించి జయభాదురి ఫ్లాష్‌బ్యాక్ లేని వెర్షన్ రిలీజ్ చేస్తే అదీ చూశారు. దూరదర్శన్ లో చూశారు. కేబుల్ టీవీలో చూశారు. యూ ట్యూబ్‌లో చూశారు. ఓటిటిలో చూశారు. యాభై ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు. షోలే అభిమానులది వేరే లెవల్.
ఆడే సినిమాలు ఆడదగ్గ రీతిలో తీస్తే ఆడతాయి. సెట్స్ వల్ల, విఎఫ్‌ఎక్స్ వల్ల, భారీ బడ్జట్ వల్ల, ముహూర్తబలం వల్ల ఆడవు. ఆడదగ్గ రీతిలో కథ అనుకుని ఇవన్నీ కలిపితే ఆడొచ్చు. షోలే సినిమా తొలిషాట్ తీయడం కుదరలేదు. వాన. ముహూర్తం అప్‌సెట్ అయ్యింది. రెండోరోజు తెల్లచీర కట్టుకుని వితంతువు పాత్రలో ఉన్న జయభాదురి అమితాబ్‌కు ఇనప్పెట్టె తాళాలు ఇవ్వడం ఫస్ట్‌షాట్‌గా తీశారు.
దక్షిణాది సినీచరిత్రలో నేటి వరకు వితంతువు పాత్రపై ముహూర్తం షాటు తీసిన దాఖలా లేదు. అలా తీస్తే ఫ్లాప్ అవుతుందా? అలా తీయకపోతే హిట్ ఏమైనా అయ్యిందా? తాము చేసే దుర్మార్గాలకు, దోపిడీలకు దైవబలాన్ని తోడు అడగడం కూడా షోలే తీసేసింది. గబ్బర్ సింగ్ ఒక్కనాడు కూడా కాళీమాత విగ్రహం ఎదుట ప్రమాణం చేసి దోపిడీకి బయలుదేరడు. అప్పటి వరకూ హిందీ సినిమాలలోని బందిపోట్లు అందరూ కాళీమాత బలాన్ని తోడు అడిగేవారే.
సమాజం చెడ్డను భరించగలదుగానీ మరీ దారుణమైన చెడ్డను సహించలేదు. ఆ చెడ్డను పరిహరించడానికి మెరుగైన చెడ్డనైనా శరణుజొచ్చడానికి వెనుకాడదు. గబ్బర్ సింగ్ అఘాయిత్యాలు పట్టనలవి కానప్పుడు అంత చెడ్డవాణ్ణి నిర్మూలించడానికి కొంచెం చెడ్డవాళ్లను నియమిస్తారు.
వీరు, జయ్ చిల్లర దొంగలే గాని వారిలో బహాదూరి ఉంది. మానవత్వం కూడా ఉంది. ఊరు వారిని ఆదరిస్తుంది. వర్తమానంలో కరడుగట్టిన నేరస్తుల శిక్షకు పోలీసులు ఎన్ కౌంటర్ అనే చెడ్డమార్గం ఎంచుకుంటే ప్రజలు ఆదరించడం ఇలాంటిదే కావచ్చు. వ్యక్తిగత ఆగ్రహాన్ని సామాజికస్థాయికి తీసుకెళ్లమని షోలే చెబుతుంది. గబ్బర్ సింగ్ వల్ల ఠాకూర్ తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయాడు. గబ్బర్‌ని శిక్షించడం వ్యక్తిగతమైన కక్షే... కాని అందులో సామాజిక న్యాయం ఉంది.
ఇవాళ సగటు మనిషి తన నెత్తిన పన్నులు పడుతున్నా, తన ప్రమేయం లేకుండా కుల, మత, పార్టీల జంజాటంలో పడుతున్నా, తన సంపాదనను స్కూళ్లు, హాస్పిటళ్లు బట్టలిప్పించి దోచుకుంటున్నా, చిల్లర జీతాలతో సంస్థలు గాడిద చాకిరీ చేయిస్తున్నా, న్యాయం కోసం ఏళ్లకేళ్లు అంగలార్చాల్సి వస్తున్నా కిమ్మనడం లేదు... శాపనార్థాలు పెట్టుకోవడం తప్ప. ఎలుక శాపం పిల్లికి తగలదు. ఠాకూర్‌లా కార్యాచరణకు దిగితే, ఒకరొకరుగా కదిలి ఊరు మొత్తం గబ్బర్ అంతు చూసినట్టు సమస్య అంతు చూడొచ్చు. దురదష్టవశాత్తు జనంలో అది పూర్తిగా పోయింది.
షోలేలోని మహిళలు ధీర వనితలు. గబ్బర్‌ను ధిక్కరించే బసంతి గాని, పరిస్థితులకు చలించక స్థైర్యం చూపే ఠాకూర్ కోడలుగాని ‘ఊ అంటావా మావా... ఉఊ అంటావా’ తరహా కాదు. షోలే కథ ‘రేప్’ సీన్ కు చోటివ్వలేదు. నేడులా బడ్జెట్‌లో సగాన్ని బకెట్ల బకెట్ల బ్లడ్‌కు కేటాయించే పని లేకుండా రక్తమే చూపలేదు.
కొండలు, గుట్టలు, పచ్చదనం ఉన్న బెంగళూరు సమీపంలోని రామ్‌నగర్ అనే చోట షూటింగ్ చేయడం తప్ప షోలే చేసిన సర్కస్ ఏదీ లేదు. షోలే మానవ ఉద్వేగాల మేజిక్. కెమెరా, సంగీతం, మాట, పాత్ర, దర్శకత్వం... వీటిని ఎంత మేలిమి నైపుణ్యంతో వాడి ఈ మేజిక్ చేయవచ్చో చరిత్ర చెప్పుకునేలా చూపింది.
1975 ఆగస్టు 15న షోలే విడుదలైంది. ఈ ఆగస్టు 15కు యాభై ఏళ్లు. ఇప్పటికే దేశంలో చర్చలు, కార్యక్రమాలు, జ్ఞాపకాల రీవిజిట్‌లు సాగుతున్నాయి. తెలుగు అభిమానులు ఎలాగూ ఉత్సవాలు జరుపుతారు. మన పరిశ్రమ... ముఖ్యంగా సినీ రచయితలు, దర్శకులు షోలేకు ఎటువంటి స్మరణ, సత్కారం చేస్తారో చూడాలి.