
మన చట్టసభల వల్ల ప్రజలకూ, ప్రజాస్వామ్యానికీ ఏ మేరకు ప్రయోజనం కలుగుతోందన్న అంశంలో ఎవరి అభిప్రాయాలు వారికున్నా... అక్కడి చర్చల సరళి ఇంకా మెరుగుపడాలని, ప్రభుత్వ జవాబుదారీతనం మరింత పెరగాలన్న విషయంలో అందరూ ఏకీభవిస్తారు. గత నెలాఖరున మూడు రోజులపాటు ‘ఆపరేషన్ సిందూర్’పై విస్తృత చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలోనూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలోనూ సమాధానమిచ్చారు.
కానీ భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ శనివారం చేసిన ప్రసంగంలోనూ, అంతక్రితం ఈ నెల 4న సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది మద్రాస్ ఐఐటీలో చేసిన ఉపన్యాసంలోనూ కనబడిన స్పష్టత, వివరాలు చర్చ సందర్భంగా ప్రధాని, కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటనల్లో లేవు.
ఇరు దేశాల మధ్యా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం వెనక ఏ ప్రపంచ నాయకుల ఒత్తిళ్లూ లేవని ఇద్దరూ నిర్ద్వంద్వంగా చెప్పటం హర్షించదగ్గదే అయినా, ఆ ఆపరేషన్‌లో మనం సాధించిన విజయాలనూ, ఆ క్రమంలో ఎదురైన సవాళ్లనూ వివరించకపోవటం, అసలు పెహల్గాం భద్రతా లోపాలూ, వాటిపై చర్యలూ వెల్లడించకపోవటం లోటే అనిపిస్తుంది.
అనర్గళంగా మాట్లాడగలిగే శక్తివున్నవారెవరో, అవతలి పక్షాన్ని వ్యంగ్యంతో, వెటకారంతో గేలిచేసి చిన్నబుచ్చగలవారెవరో తెలుసుకోవటానికి ప్రజలు చట్టసభల ప్రత్యక్ష ప్రసారాలు చూడరు. వాస్తవాలు తెలుసుకోవా లనుకుంటారు. విపక్షాల సందేహాలకు ప్రభుత్వం సూటిగా, స్పష్టంగా జవాబిచ్చిందా లేదా అనేది గమనిస్తారు. కానీ పార్లమెంటులో జరిగింది వేరు. ఎప్పటిలా పరస్పరం నిందారోపణలు చేసుకోవటంతోనే చాలా సమయం గడిచింది.
‘సిందూర్’లో జరిగిందేమిటో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ చెప్పారు. పాకిస్తాన్‌కు చెందిన అయిదు యుద్ధ విమానాలను కూల్చటంతోపాటు మరో భారీ విమానాన్ని సైతం పడగొట్టామని, దాదాపు 90 గంటల వ్యవధిలో అనుకున్న లక్ష్యాలను సాధించామని ఆయన వివరించారు.
మన గగనతల రక్షణ వ్యవస్థ, డ్రోన్ వ్యవస్థ సక్రమంగా పనిచేయటంతో పాక్ సైన్యం పాచికలేమీ పారలేదని, వారి ఎఫ్–16లూ, డ్రోన్లూ, క్షిపణులనూ కూల్చేయటంతోపాటు రెండు కమాండ్ కంట్రోల్ కేంద్రాలనూ, ఒక వైమానిక స్థావరాన్నీ ధ్వంసం చేశామని ప్రకటించారు. జనరల్ ద్వివేది అయితే ప్రభుత్వం రాజకీయ స్పష్టతతో దిశానిర్దేశం చేయటం, విశ్వాసాన్నీయటం, నిర్ణయాన్ని తమకే వదిలేయటం తొలిసారి చూశామని చెప్పారు.
ఇటువంటి ప్రకటనలు పార్లమెంటు వేదికపై ప్రభుత్వం వైపుగా వస్తే, వాటిపై విపక్షం ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు వెల్లడయ్యేవి. ముఖ్యంగా జనరల్ ద్వివేది ప్రసంగం వాస్తవ స్థితేమిటో చెప్పింది. శత్రువుతో ఇప్పుడు నాలుగు రోజుల్లోనే ఘర్షణలు సమసినా... త్వరలోనే మరో యుద్ధం జరిగినా ఆశ్చర్యం లేదని, ఈసారి ఒంటరిగా వస్తారా, వేరే దేశాలతో కలిసి వస్తారా అన్నది కూడా చెప్పలేమని ఆయన అనటం గమనించదగ్గది.
ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌జీత్, జనరల్ ఉపేంద్ర ద్వివేది కూడా ‘ఆపరేషన్ సిందూర్’ దేశాన్ని ఏకం చేయటం గురించి ప్రస్తావించారు. దేశ ప్రజానీకమంతా ఒక్కటై నిలబడటం సాధారణ విషయం కాదు. ఇందులో విపక్షాల పాత్రను కొట్టిపారేయలేం. పెహల్గాంలో భద్రతా లోపాలపై తీసుకున్న చర్యలేమిటో చెప్పకపోవటం, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్–పాక్ ఘర్షణలు ఆగటం తన ఘనతేనని ప్రకటించటం విపక్షాలకు అభ్యంతరకరం అయింది.
ట్రంప్ మధ్యలో స్వరం మార్చినా తిరిగి దాన్నే పదే పదే చెబుతున్నారు. అందువల్ల పార్లమెంటు వేదికగా దేశానికి మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి జరిగిందేమిటో చెప్పాల్సిన బాధ్యత పాలకులపై పడింది. ప్రశ్నిస్తున్న విపక్షాలు పాకిస్తాన్‌తో కుమ్మక్కయ్యాయని ప్రత్యారోపణ చేయటం ఇందుకు ప్రత్యామ్నాయం కాదు.
యుద్ధ రంగంలో వ్యూహాలూ, ఎత్తుగడలూ ఎలావుండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికి వదిలిపెట్టినా, ఆ క్రమంలో ఏర్పడ్డ సమస్యలను తెలుసుకుని అవసరమైన సూచనలీయటం, జరిగిందేమిటో ప్రజలకు తేటతెల్లం చేయటం దేశ రాజకీయ నాయకత్వం బాధ్యత. మన రక్షణ దళాల చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్‌లో జూన్ నెలాఖరున మాట్లాడుతూ మన దళాలు చేసిన కొన్ని ‘వ్యూహాత్మక తప్పిదాల’ కారణంగా జెట్ విమానాలు కోల్పోయామని చెప్పటం వివాదాస్పదమైంది.
పార్లమెంటులో దానిపై ప్రభుత్వం వైపునుంచి ఎలాంటి వివరణా లేదు. ఇప్పుడు దళాధిపతుల ప్రసంగాల్లోనూ ఆ వివరాల్లేవు. ఈ విషయమై సందేహాలు పోగొట్టడానికి పార్లమెంటే సరైన వేదిక. దాన్నుంచి వెలువడే సందేశం దేశ ప్రజానీకాన్ని ఒక్కటి చేస్తుంది. ఆ సంగతిని అధికార పక్షంతోపాటు విపక్షం కూడా మరువరాదు.