
ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, ఎంతగా ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నా బేఖాతరు చేస్తున్న మనిషిపై ప్రకృతి మరోసారి తన విశ్వరూపాన్ని చూపింది. దేవభూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్‌లోని ధరాలీ గ్రామంపై మంగళవారం ఉవ్వెత్తున విరుచుకుపడిన వరద అక్కడి ఇళ్లూ, హోటళ్లూ, రెస్టారెంట్లూ, దుకాణాలూ వగైరాలను ఊడ్చిపెట్టేయగా దాదాపు వందమంది ఆచూకీ తెలియటం లేదని వార్తలొస్తున్నాయి. హార్సిల్ ప్రాంతంలో ఉన్న సైనిక శిబిరం కొట్టుకుపోగా అందులోని పదిమంది జవాన్ల ఆచూకీ తెలియటం లేదు.
కుంభవృష్టితో ఖీర్‌గంగా నది పోటెత్తి ఇంత విలయానికి దారితీసింది. ఆకస్మిక వరదకు అరగంట ముందే ధరాలీ మార్కెట్ ప్రాంతానికి విరిగిపడ్డ కొండచరియలు, బురద కొట్టుకొచ్చాయనీ, అంతలోనే భారీయెత్తున వరదనీరు విరుచుకుపడిందనీ స్థానికుల కథనం. ఆత్మరక్షణ కోసం సమీపంలోని కొండపైకి ఎక్కినవారికి ఖీర్‌గంగ పెనుగర్జన వినబడిందంటే ఉద్ధృతి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. కేవలం 15 సెకన్ల వ్యవధిలోనే ఈ జలప్రళయం విరుచుకుపడింది.
ప్రకృతి విలయం సంభవించినప్పుడల్లా ఎన్నో విషాద ఘట్టాలు ఆవిష్కృతమవుతాయి. ఇకపై అత్యంత జాగ్రత్తగా మెలగాలన్న సంకల్పమూ వినబడుతుంది. నెలలు కాదు... రోజులు గడిచేసరికే అదంతా మరుగునపడుతుంది. పర్యావరణాన్ని బేఖాతరు చేస్తూ నిర్మాణాలు మొదలవుతాయి. నదుల్ని దేవతలుగా కొలిచే సంప్రదాయం మనది. అయినా వాటికి అవరోధం కలిగించే నిర్మాణాలైనా, వాటిని కాలుష్యంలో ముంచే కర్మాగారాలనైనా అనుమతించరాదన్న గ్రహింపు పాలకులకు లేదు.
గంగానదిని మాఫియాల బారి నుంచి కాపాడాలంటూ 2011లో ఉపవాసదీక్షకు పూనుకున్న స్వామి నిగమానంద ప్రాణత్యాగం చేసినా పాలకుల వైఖరిలో మార్పు లేదు. ఉత్తరాఖండ్‌కు విపత్తులు కొత్తగాదు. దశాబ్దాలుగా ఇంచుమించు ఏటా రివాజుగా వరదలొస్తాయి. గ్రామాలకు గ్రామాలు వరదనీటిలో చిక్కుకుంటాయి. కొన్నిసార్లు పెద్దగా సమస్యలేమీ లేకుండా ముగుస్తుంది. 2013లో సంభవించిన విలయం ఏకంగా 6,000 మందిని బలి తీసుకుంది.
అంతకు ముందూ తర్వాతా కూడా పదుల నుంచి వందలమంది వరకూ మృత్యువాత పడిన సందర్భాలున్నాయి. అభివృద్ధి ముసుగులో ప్రకృతినీ, పచ్చటి ప్రాంతాలనూ ధ్వంసం చేయటం... వేర్వేరు ప్రాజెక్టులకు ఎడాపెడా అనుమతులీయటం మన దేశంలో పాలకులకు అలవాటైన జాడ్యం. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో వరదలొచ్చిన ప్రాంతం భాగీరథి పర్యావరణ జోన్ పరిధిలో ఉంది. దాన్ని అత్యంత జాగ్రత్తగా పరిరక్షించాల్సిన ప్రాంతంగా గుర్తించారు.
4,157 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఆ జోన్‌ను 2012లో నోటిఫైడ్ ప్రాంతంగా పరిగణించారు. అక్కడ జరిగే విచక్షణారహిత అభివృద్ధిని నియంత్రించటానికి ఉద్దేశించిన ఈ చర్య ఆచరణలో ఎందుకూ కొరగాకుండా పోయింది. నదులూ, ఉపనదుల సమీపంలో నిర్మాణాలు ఉండరాదన్న ఇంగితజ్ఞానం ఎవరికీ లేదు.
ప్రతిష్ఠాత్మకమైన చార్‌ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టు సైతం ఆ ప్రాంతంలోనే ఉంది. పర్యావరణ ఉద్యమకారులు న్యాయ స్థానాల్లోనూ, వెలుపలా పోరాడినా... చివరకు ప్రభుత్వానిదే పైచేయి అయింది. ఏడాదిక్రితం 34వ జాతీయరహదారిపై హినా–టెక్లాల మధ్య నిర్మించతలపెట్టిన బైపాస్ రోడ్డు గురించి కూడా ఆందోళనలు జరిగాయి. ఆ ప్రాంతం ధరాలీకి దక్షిణంగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అమరికలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ధ్రువ ప్రాంతాల్లో, హిమపర్వతశ్రేణిలో మాత్రమే కుంభవృష్టి, ఆకస్మిక వరదలు ఉండేవి. అలాంటి రాతినేలలకు వరద నీటిని పట్టివుంచే గుణం తక్కువ. నిమిషాల వ్యవధిలో వరదలు పోటెత్తుతాయి. కొండచరియలు విరిగిపడి ముప్పును మరిన్నిరెట్లు పెంచుతాయి. పర్యావరణంలో వచ్చిన మార్పుల పర్యవసానంగా ప్రకృతి వైపరీత్యాలకు ఏ ప్రాంతమూ అతీతం కాని స్థితి వచ్చేసింది.
వాతావరణాన్ని కొలవటానికి ఉపయోగించే నమూనాలు, ఉపకరణాలు ఒక్కోసారి విఫలం కావటానికి మారిన స్థితిగతులే కారణం. వేడిగాలులు ఎక్కువ తేమను పట్టి ఉంచుతాయి. ఒక డిగ్రీ ఉష్ణోగ్రత హెచ్చితే తేమ ఏడు శాతం పెరుగుతుందనీ, దీనికి అధికశక్తి ఉంటుందనీ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. వాతావరణంలో తేమ పెరిగినకొద్దీ వేడిగాలుల వల్ల ఆకస్మిక కుంభవృష్టికి అనువైన పరిస్థితులేర్పడతాయి.
అందుకే ఉత్తరాఖండ్ వంటిచోట్ల మాత్రమే కాదు... అన్నిచోట్లా పర్యావరణాన్ని ప్రాణప్రదంగా చూసుకుంటూ దానికి విఘాతం కలగనీయని రీతిలో ఆచరణ ఉండాలి. కానీ పట్టించుకునేదెవరు? అందుకే ప్రభుత్వాల అభివృద్ధి నమూనాలు మారాలి. పర్యావరణానికి విఘాతం కలిగించే అవకాశమున్నదని భావించే ఎలాంటి ప్రాజెక్టునైనా నిస్సంకోచంగా తిరస్కరించాలి. ఇప్పుడొచ్చిన ఉత్పాతం ఆఖరిది కావాలి.