ఏదీ 'సునాయాసం' కాదు! | Sakshi Editorial On Roger Federer, Rafael Nadal Doctorate Degree | Sakshi
Sakshi News home page

ఏదీ 'సునాయాసం' కాదు!

Jul 20 2025 12:24 AM | Updated on Jul 20 2025 12:24 AM

Sakshi Editorial On Roger Federer, Rafael Nadal Doctorate Degree

విశ్వ గురు 

థాంక్యూ! హలో క్లాస్‌ ఆఫ్‌ 2024! నేనెంత ఉత్సాహంగా ఉన్నానో మీకెవరికీ తెలియదు. నేనొక కాలేజీ క్యాంపస్‌లో అడుగుపెట్టడం నా జీవితంలో ఇది రెండోసారి. కానీ, మీరు దేన్నో దృష్టిలో పెట్టుకుని నాకు డాక్టరేట్‌ డిగ్రీ ప్రదానం చేస్తున్నారు. నేనిక్కడ ప్రసంగించడానికి వచ్చాను. కానీ, ‘డాక్టర్‌ రోజర్‌’గా ఇంటికి తిరిగి వెళతాను. అది నాకు గొప్ప బోనస్‌ లాంటిది. ‘డాక్టర్‌ రోజర్‌’. ఇది నేను ఏమాత్రం ఊహించని విజయం! 

ఇది నాకు కొద్దిగా పరిచయం లేని వాతావరణం. ఇది నేను ఎప్పుడూ చూసే దృశ్యం కాదు... ఈ దుస్తులు కూడా నేను సాధారణంగా వేసుకునేవి కావు. ఈ పొడవాటి గౌను బరువుగా ఉంది. గత 35 ఏళ్ళుగా ఇంచుమించుగా ప్రతి రోజు నేను పొట్టి నిక్కర్లు, టీ షర్టులతోనే గడిపాను. 

నాలుగు పదాలే చెప్పగలిగాను!
నేను ఇలాంటి ప్రసంగాలు చేసే వ్యక్తిని కూడా కాను. నేను స్విట్జర్లాండ్‌ జాతీయ జట్టులో చేరేనాటికి నాకు 17 ఏళ్ళు. అప్పట్లో నేను ఎంతగా కలవరపడ్డానంటే నాలుగు పదాలకు మించి మాట్లాడలేకపోయాను. ‘‘ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది’’ అన్నానంతే. ఇప్పుడు ఇక్కడ 25 ఏళ్ళ తర్వాత, నాకు ఇప్పటికీ కొద్ది కలవరంగానే ఉంది. కాకపోతే ఇపుడు మీకు చెప్ప డానికి నా దగ్గర నాలుగు మాటలకు మించి చాలా ఉన్నాయి. 

ఈ స్థాయికి వచ్చేందుకు మీరెంతో కష్టపడి ఉంటారు. మీరంతా సాధించిన దానిపట్ల నాకెంతో గౌరవం ఉంది. ఎందుకంటే, పూర్తి స్థాయి టెన్నిస్‌ ఆటగాడిగా మారేందుకు నేను 16వ ఏటనే స్కూలు చదువుకు స్వస్తి చెప్పేశాను. కనుక, నేను కాలేజీలో అడుగు పెట్టింది లేదు. కానీ, నేను ఇటీవలే టెన్నిస్‌లో గ్రాడ్యుయేట్‌నయ్యా. ‘రిటైర్‌’ అనే మాట ఉపయోగించాలని నాకు తెలుసు. ‘‘రోజర్‌ ఫెదరర్‌ టెన్నిస్‌ నుంచి రిటైర్‌ అయ్యాడు.’’ రిటైర్‌ అవడమా? ఆ మాట వినడానికే బాగా లేదు. కాలేజీ నుంచి రిటైర్‌ అవుతున్నామని మీరు చెప్పలేరు. ఔనా? 

మీలాగే నేను కూడా ఒక పెద్ద పని పూర్తి చేసి మరో దానికి మరలుతున్నా. మీలాగే నేను కూడా తదుపరి ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నా. మీ బాధ నాకు అర్థమవుతోంది. చదువు పూర్తయిందిగా, ఏం చేయబోతున్నావు? అని అందరూ అడ గడం మొదలెడతారు. ఆ మాటకొస్తే, ‘‘ఇంక ఇపుడు నువ్వు వృత్తిపరమైన టెన్నిస్‌ ఆటగాడివి కాదు కదా! ఏం చేయ బోతున్నావు?’’ అని నన్నూ అడుగుతారు. ఏం చేయాలో నాకూ తెలియదు. తెలియకపోవడమూ మంచిదే. 

మరి నేను కాలాన్ని ఎలా వెళ్ళబుచ్చుతా? తండ్రిగా పిల్లల్ని స్కూల్లో దింపి రావచ్చు. ఎవరో అపరిచితులతో ఆన్‌లైన్‌లో చదరంగం ఆడవచ్చు. వాక్యూమ్‌ క్లీనర్‌తో ఇంటిని శుభ్రం చేయ వచ్చు. వాస్తవానికి, టెన్నిస్‌ పట్టభద్రునిగా జీవితాన్ని నేను ఇష్టపడతున్నా. నేను 2022లో టెన్నిస్‌లో గ్రాడ్యుయేట్‌నయ్యా. మీరు 2024లో పట్టభద్రులవుతున్నారు. ఈ పరిణామ క్రమంలో నేను ఆకళింపు చేసుకున్న కొద్ది పాఠాలను మీతో పంచుకోవా లనుకుంటున్నా. వాటిని మనం టెన్నిస్‌ పాఠాలు అనుకోవచ్చు.

స్నేహపూరిత ప్రత్యర్థులు: రఫేల్‌ నదాల్‌తో రోజర్‌ ఫెదరర్‌ 

టెన్నిస్‌ పాఠాలు
మొదటిది. ‘సునాయాసంగా’ అనే మాట ఒక భ్రమ! నేను సునాయాసంగా ఆడతానని అంటూంటారు. చాలా సందర్భాల్లో దాన్ని ఒక పొగడ్తగానే చెబుతారు. కానీ, ‘‘అతని దేహంపై ఒక్క స్వేద బిందువు కూడా లేదు చూడండి’’ లాంటి మాటలు వారి నుంచి విన్నప్పుడు నాకు అసహనంగా ఉండేది. సత్యం ఏమంటే, తేలిగ్గా ఆడినట్లు కనిపించడం వెనుక నేను చేసిన కఠోర శ్రమ ఉంది. నన్ను నేను తమాయించుకోవడం నేర్చుకోవడానికి ముందు చాలా ఏళ్ళు కోర్ట్‌లో విసుగు ప్రదర్శించేవాడిని, అనుచితమైన మాటలనేవాడిని, చేతిలో రాకెట్‌ను విసిరేసేవాడిని. 

కానీ, క్రీడా జీవితం ఆరంభంలోనే, వాటిని సరిదిద్దుకునే అవకాశం లభించింది. ఒకసారి ఇటాలియన్‌ ఓపెన్‌లో నా ప్రత్యర్థి ఒకరు నా మానసిక క్రమశిక్షణను బాహాటంగానే ప్రశ్నించాడు. ‘‘మొదటి రెండు గంటలు రోజర్‌ గెలుస్తాడనుకుంటారు. ఆ తర్వాత, నేను ఫేవరెట్‌గా మారతాను’’ అని వ్యాఖ్యానించాడు. మొదట, నాకు ఆ మాటలు అర్థం కాలేదు. తర్వాత, అతని మాటలలోని ఆంతర్యాన్ని గ్రహించాను. మొదటి రెండు గంటలపాటు ప్రతి ఆటగాడు బాగానే ఆడతాడు. శారీరకంగా శక్తితో ఉంటారు. 

వేగంగా కదులుతారు. రెండు గంటల తర్వాత, కాళ్ళు పీకడం మొదలెడతాయి. మనసు ఏకాగ్రతను కోల్పోతుంది. నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆ మాటలతో అర్థం చేసుకున్నా. ఆ దిశగా ప్రయాణం ప్రారంభించి, కోరుకున్న స్థితికి చేరుకున్నా. ఆ క్రమంలో నా తల్లితండ్రులు, కోచ్‌లు, ఫిట్‌ నెస్‌ కోచ్‌ నా ప్రవర్తనను సరిదిద్దుతూ వచ్చారు. నా ప్రత్యర్థి ఆటగాళ్ళు కూడా ఆ పని చేస్తున్నారు. ఈ విషయంలో, నాతోటి ఆటగాళ్ళకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.

డార్ట్‌మౌత్‌లో మీరు దీన్ని మరో విధంగా గమనించి ఉంటారు. తోటి విద్యార్థులు ర్యాంకుల మీద ర్యాంకులు సాధించడాన్ని చూసి శాన్‌బర్న్‌ లైబ్రరీలో మీరు ఓ మూలన మౌనంగా రోదించి ఉంటారు. నా లాగానే మీరు కూడా ‘అప్రయత్నంగా’ అనే మాట ఒక భ్రమేనని తెలుసుకుని ఉంటారని భావిస్తున్నా. కేవలం ప్రతిభతోనే నేను ఈ స్థితికి చేరుకోలేదు. ప్రత్యర్థులకన్నా ఎక్కువసేపు, ప్రభావశీలంగా, కఠిన శ్రమకోర్చి ప్రాక్టీసు చేయ బట్టే ఈ స్థితికి చేరా. 

నిజంగా గర్వపడే విజయాలు అవే!
మనం నిరాశతో చతికిలపడే సందర్భాలూ ఎదురవుతా యని గుర్తుంచుకోవాలి. వెన్ను, మోకాళ్ళు నొప్పి పుట్టవచ్చు. స్వల్పంగా అనారోగ్యం పాలుకావచ్చు లేదా ముందున్న లక్ష్యం భయపెట్టనూవచ్చు. అయినా, గెలుపొందడానికి మీరొక మార్గాన్ని కనుగొని తీరాలి. అలా సాధించిన విజయాల గురించి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, మీరు ఉత్తమమైన స్థితిలో ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా విజయాలు సాధించగలరని అవి నిరూపిస్తాయి. 

ఔను. ప్రతిభ కూడా ఉండి తీరాలి. దానితో పని లేదని చెప్పడానికి నేను ఇక్కడ నుంచో లేదు. కానీ, ప్రతిభ అనే మాటకు విస్తృతమైన నిర్వచనం ఉంది. చాలా సందర్భాలలో, దాన్ని వరంగా చూడకూడదని, వజ్ర సమాన సంకల్పంగా భావించాలని చెప్పదలచుకున్నాను. కానీ, జీవితంలో మాదిరి గానే... టెన్నిస్‌లో కూడా క్రమశిక్షణే ప్రతిభగా పరిణమిస్తుంది. 

ఓర్పు కూడా అంతే అవసరం. మీపై మీకు నమ్మకం ఉండటం కూడా ప్రతిభే. ఏ ప్రక్రియనైనా సరే స్వాగతించడం, ప్రేమించడం ప్రతిభ కిందకే వస్తుంది. మీ జీవితాన్ని, మిమ్మల్ని నడుపుకోవడం కూడా ప్రతిభ కోవలోకే వస్తుందేమో. కొందరికి పుట్టుకతోనే ఆ లక్షణాలు ఉంటాయి. మిగిలిన అందరూ వాటిని సంతరించుకునే కృషి చేయాలి.
అదొక పాయింట్‌ అంతే!

రెండవ పాఠం. అదొక పాయింట్‌ మాత్రమే! మీరు సాధ్యం అనుకున్నదానికన్నా ఎక్కువగానే శ్రమించి ఉంటారు... అయినా పరాజయం పాలయ్యారు. ఈ రోజు మీలో ఒక్కరే డిగ్రీ పొందా రని ఊహించుకుందాం. విజేతకు అభినందనలు తెలుపుదాం. మిగిలిన వెయ్యి మంది మాటేమిటి? తదుపరి విడతలో ఉత్తీర్ణులు కావచ్చు... 

నేనెప్పుడూ గెలుపొందడానికే ప్రయత్నించానని మీకు తెలుసు. కానీ, నేను ఓడిన సందర్భాలున్నాయి. కొన్నిసార్లు పెద్ద టోర్నమెంట్లలోనే ఓటమి చెందా. వింబుల్డన్‌ 2008 ఫైనల్స్‌ వాటిలో ఒకటి. నేను, రఫేల్‌ నదాల్‌ తలపడ్డాం. కొందరు దాన్ని చరిత్రలోనే మరపురాని మ్యాచ్‌గా అభివర్ణిస్తారు. రఫా మీద నాకు పూర్తి గౌరవం ఉంది. కానీ, ఆ మ్యాచ్‌లో నేను గెలుపొంది ఉంటే ఇంకా బాగుండేది. 

వింబుల్డన్‌లో ఓటమిని తేలిగ్గా తీసు కోలేం... ఏ టెన్నిస్‌ ఆటగాడికైనా వింబుల్డన్‌లో విజయమే సర్వస్వం. నేను 2008లో వరుసగా ఆరవసారి టైటిల్‌ సాధించేందుకు బరిలోకి దిగా. చరిత్రలో సుస్థిర స్థానం కోసం ఆడుతున్నా. ఆ మ్యాచ్‌లో ఒక్కో పాయింట్‌ మా ఇద్దరిలో  ఎవరెవరికి ఎలా వచ్చిందీ నేను ఇపుడు వివరించబోవడం లేదు. అదంతా చెప్పా లంటే కొన్ని గంటలు పడుతుంది. సరిగ్గా చెప్పాలంటే, ఆ మ్యాచ్‌ దాదాపు ఐదు గంటలు సాగింది. 

రఫా రెండు సెట్లు గెలి చాడు. టై–బ్రేక్స్‌లో తదుపరి రెండు సెట్లు నేను గెలిచా. ఐదవ సెట్లో ఏడు పాయింట్లతో ఇద్దరం సమ స్థితిలో ఉన్నాం. ఆట చివరి భాగంపై అందరూ ఎందుకు అంత దృష్టి కేంద్రీ కరిస్తారో నాకు అపుడు అర్థమైంది... చివరి నిమిషాల్లో నాకు కళ్ళు బైర్లు కమ్మాయి. గ్రాస్‌ కోర్టుపై తెల్లని చారలు కూడా మసకగా కనిపించడం మొదలెట్టాయి. 

అన్నిసార్లూ గెలవలేము!
ఇపుడు వెనుతిరిగి చూసుకుంటే... ఆ మ్యాచ్‌లో మొదటి పాయింట్‌ అప్పుడే నేను ఓటమి పాలయ్యాననిపిస్తుంది. ‘ఏయ్, నువ్వు ఐదు విడతలుగా గెలుస్తూ వస్తున్న డిఫెండింగ్‌ చాంపియన్‌వి! పైగా, ఆడుతున్నది గ్రాస్‌ కోర్ట్‌లో. ఇక్కడ ఎలా ఆడాలో నీకు బాగా తెలుసు’ అని నా అంతరంగంలో నేను గుర్తు తెచ్చుకోవడానికి మూడవ సెట్‌ దాకా సమయం పట్టింది. కానీ, ఆ ధైర్యం చాలా ఆలస్యంగా వచ్చింది. రఫా గెలుపొందాడు. దానికతను అన్ని విధాలా యోగ్యుడే!

కొన్ని ఓటములు మిగిలినవాటికన్నా ఎక్కువ బాధిస్తాయి. వరుసగా ఆరవసారి టైటిల్‌ కోసం పోటీ పడే అవకాశం జీవితంలో మళ్ళీ లభించదని నాకు తెలుసు. వింబుల్డన్‌లో ఓడాను.

నంబర్‌ వన్‌ ర్యాంకింగ్‌ కోల్పోయాను. టెన్నిస్‌లో పరిపూర్ణత అనేది అసాధ్యం. నా వృత్తి జీవితంలో నేను ఆడిన 1,526 సింగిల్స్‌ మ్యాచ్‌లలో దాదాపు 80% గెలుపొందా. కానీ, ఇక్కడ నేను మీకో ప్రశ్న వేయదలచుకున్నా. ఆ మ్యాచ్‌లలో, నేను గెలి చిన పాయింట్ల శాతం ఎంతనుకుంటున్నారు? కేవలం 54%. మరో విధంగా చెప్పాలంటే, అగ్రశ్రేణి టెన్నిస్‌ ఆటగాళ్ళు కూడా వారు అడిన మ్యాచ్‌ల పాయింట్లలో కేవలం సగంపైన మాత్రమే గెలిచి ఉంటారు. కొంపేం మునిగిపోయింది. అది ఒక పాయింట్‌ మాత్రమే అని మీకు మీరే నేర్చుకోవాలి. 

జీవితంలో మీరు ఏ ఆట ఆడినా... కొన్నిసార్లు ఓటమి తప్పదు. అది ఒక పాయింట్, ఒక మ్యాచ్, ఒక సీజన్, ఒక ఉద్యోగం కోల్పోవడం ఏదైనా కావచ్చు. జీవితం అనేక ఎత్తు పల్లాలున్న రోలర్‌ కోస్టర్‌. కుంగిపోయినపుడు మీ సామర్థ్యంపై మీకు సందేహాలు ఏర్పడటం సహజం. కానీ, మీ ప్రత్యర్థులకు కూడా వారి సామర్థ్యాలపై వారికి సందేహాలుంటాయని మరచి పోకండి. 

కానీ, నెగెటివ్‌ ఎనర్జీ వృథా ఎనర్జీ! ప్రపంచంలో ఉత్తములుగా పరిగణన పొందుతున్నవారు అన్నింటిలోనూ గెలవడం వల్ల అలాంటి హోదా ఏమీ పొందడం లేదు. ఓటమి పాలవుతామనీ, పరాజయాలు పదే పదే వెక్కిరి స్తాయనీ వారికి తెలుసు. వాటిని తట్టుకుని ఎలా నిలబడాలో వారు నేర్చుకుంటారు కాబట్టి గొప్పవారు అనిపించుకుంటారు. 

చేస్తున్న పనిని ఆనందించండి!
మూడవ పాఠం. జీవితం కోర్ట్‌ కన్నా పెద్దది. టెన్నిస్‌ కోర్ట్‌ చిన్న ప్రదేశం. నిక్కచ్చిగా చెప్పాలంటే, 2,106 చదరపు టడుగులు. అది సింగిల్స్‌ మ్యాచ్‌లు ఆడే కోర్ట్‌ వైశాల్యం. ఒక సత్రం గదికన్నా మరీ పెద్దదిగా ఏమీ ఉండదు. ఆ చిన్న ప్రదేశంలోనే నేను ఎంతో శ్రమించాను. నేర్చుకున్నాను. ఎన్నో మైళ్ళు పరుగెత్తాను. కానీ, ప్రపంచం దానికన్నా చాలా చాలా పెద్దది. 

టెన్నిస్‌ లోకి అడుగు పెట్టినప్పుడే, టెన్నిస్‌ నాకు ప్రపంచాన్ని చూపిస్తుంది కానీ, టెన్నిస్సే ప్రపంచం కాదన్న సంగతి నాకు తెలుసు. టెన్నిస్‌ నుంచి నిష్క్రమించగానే నేను మాజీ టెన్నిస్‌ క్రీడాకారుడిని అయి పోయా. కానీ, మీరు దేనికీ మాజీలు కాదు. మీరు భవిష్యత్‌ రికార్డు బ్రేకర్లు. ప్రపంచ యాత్రికులు. భవిష్యత్‌ కార్యకర్తలు. దాతలు. విజేతలు, నాయకులు.

ఈ గౌరవ డిగ్రీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ విజయో త్సవంలో నాకూ భాగం కల్పించినందుకు కృతజ్ఞతలు. మీలో ప్రతి ఒక్కరి తదుపరి భవిష్యత్‌ కార్యాచరణ ఏమిటో చూడాలని నాకు ఉత్సాహంగా ఉంది. మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా, మీ శక్తి మేరకు ప్రతిభను ప్రదర్శించండి. 

మీకు నచ్చిన రీతిలో ఆడండి. స్వేచ్ఛగా ఆడండి. అన్నింటిని ప్రయత్నించి చూడండి. అన్నింటికన్నా ముఖ్యంగా, పరస్పరం దయ కలిగి ఉండండి. చేస్తున్న పనిని ఆనందించండి. క్లాస్‌ ఆఫ్‌ 2024కి మరోసారి అభినందనలు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement