
చిన్నపాటి ప్రాంతాన్ని ఏలిన రాజును సైతం భూమండలమేలినవాడిగా పేర్కొని ఆకాశానికెత్తడం మన ఇతిహాస, పురాణాల్లో కనిపిస్తుంది. మహాభారతంలో దుష్యంతుని గురించి నన్నయ రాస్తూ, అతడు మహాబలవంతుడనీ, దిక్కుల చివర ఏనుగులతో అలంకృతమైన భూమండలమంతా తన అధీనంలో ఉండగా; సూర్య కిరణాలు, గాలీ కూడా చొరలేని మహారణ్యాలను, దేశాలను అజేయ పరాక్రమంతో ఏలాడనీ అంటాడు. అన్ని రకాల బలాలూ, బలగాలూ కలిసొస్తే భూమి మొత్తాన్ని శాసించాలనే పాలకుల ఆకాంక్ష అలాంటి అభివర్ణనలలో తొంగిచూస్తుంది. యుద్ధాలనేవి భూమినింకా దాటని దశ అది. నేటి సాంకేతిక అభివృద్ధి పుణ్యమా అని యుద్ధాలు ఆకాశ మార్గం పట్టేశాయి. భూయుద్ధాలు గతస్మృతులై, యుద్ధం ఈ రోజున అక్షరాలా నేల విడిచిన సమరమైంది.
పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మనం జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’ దానిని అత్యాశ్చర్య కరంగా కళ్ళకు కట్టింది. ‘అర్థశాస్త్రం’తో సహా ప్రాచీన గ్రంథాలు యుద్ధతంత్రంలో చెప్పిన అన్ని ఉపాయాలను, మాయోపాయాలను, పూర్తిగా సైనిక సాయంతో కాకుండా శాస్త్ర సాంకేతిక సాయంతో అందులో ప్రయోగించినట్టు చెబుతున్నారు. అంతర్జాల కేంద్రితంగా, కృత్రిమ మేధ సృష్టించిన సమాచారంతో, ద్రోణులపైనా, గ్రౌండ్ పొజిషనింగ్ సిస్టమ్స్(జీపీఎస్)పైనా, ఉపగ్రహాలపైనా ఆధారపడి చేసిన ఎలక్ట్రానిక్ యుద్ధంగా అభివర్ణిస్తున్నారు. రష్యా సాయంతో మనం అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను, రఫేల్ వంటి యుద్ధ విమానాలను బరిలోకి దింపి విజయవంతంగా వాడుకున్న తీరు, నేటి యుద్ధాలు భూమ్యాకాశాల మధ్య పోరుగా మారడాన్ని ప్రత్యక్షంగా చాటాయి.
సాంప్రదాయిక యుద్ధాలతో పోల్చితే, ఈ గగనతల యుద్ధాలు దేశాలకూ, జనాలకూ తెచ్చిపెట్టే కష్టాలూ అనేక రెట్లు ఎక్కువనీ; ఏ దేశానికాదేశం ఎప్పటికప్పుడు సాంకేతికంగా పై చేయిని సాధించడమే దీనికి పరిష్కారమన్న హెచ్చరికా వినిపిస్తోంది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో వెలుగు చూసిన వివరాలు ఇలాంటి యుద్ధాలతో ముడి పడిన ప్రమాదాలను భయభ్రాంతంగా చూపిస్తున్నాయి. ఉక్రెయిన్ జనానికి టెలివిజన్ సేవలందించే ఒక ఉపగ్రహాన్ని రష్యా నిపుణులు హ్యాక్ చేసి వాటిలో యుద్ధ శకటాల తోనూ, ఆయుధ సంపత్తితోనూ తమ సైనికులు జరిపే విన్యాసాల దృశ్యాలను ప్రసారం చేశారు.
ఒక్క గుండు కూడా పేల్చకుండా, ఉపగ్రహాలను నిర్వీర్యం చేయడం ద్వారా, సమాచార అంధకారాన్ని సృష్టించి ఒక దేశ భద్రతనూ, దాని ఆర్థిక వ్యవస్థనూ దెబ్బతీసే ప్రమాదాన్ని రూపుగడుతున్నారు. సాంకేతికతను మెరుగుపరచుకుంటూ అన్ని విధాలా పోటీకి సన్నద్ధమైతే తప్ప ఈ సవాలును ఎదుర్కోవడం కష్టమనీ, సాంకేతిక సంపత్తి దేశాల మనుగడకు గీటురాయి అయిందనీ అంటున్నారు. అంతేకాదు, యుద్ధాలు గగన సీమను దాటి గ్రహాంతరాలకు చేరుకోవడమూ పొడగడుతోంది. చంద్ర మండలం మీది ఖనిజాలను, ముఖ్యంగా అణు విచ్ఛేదానికి తోడ్పడే హీలియం–3ను కొల్లగొట్టే పోటీకి అగ్రదేశాలు సిద్ధమవుతూ, అక్కడ అణు రియాక్టర్లను నెలకొల్పే యత్నంలో ఉన్నాయట!
మబ్బు చాటు మాయా యుద్ధాలను మన పూర్వులు ఊహించకపోలేదు. రాక్షసులు వాటిలో ప్రవీణులని మన ఇతిహాస, పురాణాలంటాయి. రామాయణంలో మారీచ సుబా హులు అలాంటివారే. రావణుని కొడుకు ఇంద్రజిత్తయితే, నింగి నుంచే కానీ, నేల మీద యుద్ధం చేయడు. మాయసీతను చూపించి నిజసీతగా భ్రమింపజేసి హత మార్చడం లాంటి మాయావి చేష్టలలో రావణుడు కూడా అతనికి చాలడు. సూర్యాస్తమ యంలోగా సైంధవుని చంపుతానన్న అర్జునుని ప్రతిజ్ఞను నిజం చేయడానికి కృష్ణుడు సూర్యుడికి చక్రాన్ని అడ్డేసి సూర్యాస్తమయాన్ని సృష్టించడం నేటి కృత్రిమ సాంకేతిక విన్యాసాల్లాంటిదే. అప్పటివన్నీ ఊహలనుకుంటే, ఇప్పటి శాస్త్ర సాంకేతికత సృష్టించేవి నిండునిజాలు.
యుద్ధాలు నేలనూ, నింగినీ దాటి గ్రహాంతరాలకు చేరుకునే పరిస్థితిలో శాంతి గతే మిటి; ఇది పురోగమనమా, తిరోగమనమా అన్న ప్రశ్నా వేసుకోక తప్పదు; యుద్ధమూ, శాంతి అనే జంటలో ఒకటి కాపురం కూల్చేసి గగనమార్గం పట్టిపోతే రెండవది నేల మీద కుమిలిపోతూ ఉండవలసిందేనా అన్న బాధకూ లోనవక తప్పదు. బాహ్యయుద్ధాల ఎండమావుల వేట నుంచి మనిషి వెనుదిరిగి అంతరంగ యుద్ధం వైపు ఎప్పుడు దృష్టి సారి స్తాడు?! లోకాలన్నీ జయించావు కానీ, అరిషడ్వర్గాలనే నీ లోపలి శత్రువులను ఎప్పుడు జయిస్తావని హిరణ్యకశిపుని ప్రహ్లాదుడు అడిగిన ప్రశ్న ఇప్పటికీ ఎంత ప్రాసంగికం!!